22, సెప్టెంబర్ 2020, మంగళవారం

సౌభాగ్యభాస్కరం

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 5 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


శ్రీ భాస్కర రాయలవారు – సౌభాగ్యభాస్కరం


అమ్మవారు వశిన్యాదిదేవతలతో స్తోత్రము చెప్పించి, అందులో ఉన్నరహస్యములను భాస్కరరాయలవారి చేత ప్రకాశింపచేసింది. ‘సౌభాగ్యభాస్కరము’ అన్న పేరుతో వ్యాఖ్యానము రచించి భాస్కరరాయలవారు పూర్తి చేసారు.  


ఆయన కాశీ పట్టణము చేరుకొని గంగానది ఒడ్డున అమ్మవారిని ఉపాసన చేస్తుంటే అక్కడ ఉన్న అనేకమంది బ్రాహ్మణులకు అనుమానము వచ్చింది. అమ్మవారి అనుగ్రహముతో వశిన్యాదిదేవతలు చెప్పిన లలితా సహస్రనామమునకు వ్యాఖ్యానము చెప్పడము అంటే మాటలు కాదు. భాస్కరరాయలవారు అంత అనుగ్రహము ఉన్నవాడా? అని ఒకనాడు వారు ఆయన దగ్గరకు వచ్చి అమ్మవారికి ‘మహాచతుషష్టికోటి యోగినీగణసేవితా’ అన్న నామము ఉన్నది కదా! అనగా 64 కోట్ల యోగినుల చేత సేవింప బడుతున్నదని అంటారు. మీరు లలితా సహస్రనామమునకు వ్యాఖ్యానము చేసారు కదా! ఆ యోగినుల కధలు, వృత్తాంతములు, పేర్లు మాకు చెపుతారా? అని అడిగారు. నేను చెపుతున్నాను అనేవాడికి బెంగ కానీ అమ్మవారు చెప్పిస్తున్నది అనే ఆయనకి బెంగేమున్నది? అలాగే తప్పకుండా – మీరు సాయంత్రం అగ్నికార్యము పూర్తి చేసుకుని గంగ ఒడ్డుకి వచ్చి కూర్చోండి చెపుతాను అన్నారు. సరే అని ఆ సాయంత్రం వీరందరూ వెళ్ళి చెప్పండని కూర్చున్నారు. ఆయన కళ్ళు మూసుకుని వినండి చెప్పడము ప్రారంభము చేస్తున్నాను అన్నారు. అందరూ కళ్ళు మూసుకుని వినడము మొదలు పెడితే ఒకేసారి కొన్ని కోట్ల మంది గొంతుకలతో యోగినుల చరిత్రలు వినబడుతుంటే వాళ్ళు తెల్లపోయి కంగారుపడి తమ గురువుగారైన కుంకుమానంద స్వామి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళి – ‘గురువుగారు ఒకేసారి కొన్ని కోట్లమంది యోగినులు ఆకాశములో నిలబడి వాళ్ళ చరిత్రలు చెపుతున్నారు. ఇది ఎలా సంభవము అయింది? అంటే భాస్కరరాయలవారు సాక్షాత్తుగా అమ్మవారి అనుగ్రహము పొందిన వ్యక్తి ఆయన సాక్షాత్తుగా అమ్మవారే. ఆయన జోలికి వెళ్ళి పొరపాటు చేసారు. ఇప్పుడు మీ కళ్ళు తుడుస్తాను చూడండని తన చేతులతో శిష్యుల కళ్ళు తుడిచి ఇప్పుడు సరిగ్గా చూడమన్నారు. వాళ్ళు భాస్కరరాయలవారి వంక చూస్తే ఆయన కుడి భుజము మీద లలితాదేవి, ఎడమ భుజము మీద శ్యామలాదేవి కూర్చుని ఉండగా 64 కోట్లమంది యోగినులు పైనుంచి నమస్కారము చేస్తూ చరిత్ర చెప్పుకుంటున్న సన్నివేశమును ఆరోజు కాశీపట్టణములో ఆకాశవీధిలో కొన్నివేలమంది దర్శనము చేసారు.


వారణాసిలో విశ్వేశ్వర దేవాలయమునుంచి బయటకు రాగానే ఎదురుగా అన్నపూర్ణమ్మ దేవస్థానము ఉంటుంది. ఆ దేవాలయములో కుడిచేతి వైపు పెద్ద అరుగు ఉంటుంది. ఆ అరుగు చివరకు వెళ్ళి చూస్తే కొద్ది లోతుగా మెట్లు కనపడతాయి. అవి దిగి కిందకి వెళితే శ్రీ చక్రేశ్వరుడు అని ఒక శివ లింగము కనిపిస్తూ ఉంటుంది. అది లలితాసహస్రనామ వ్యాఖ్యానము వ్రాయడము పూర్తి అయినప్పుడు భాస్కరరాయలవారు ప్రతిష్ఠ చేసిన లింగము. 


ఇంతటి మహానుభావుడి జీవితములో ఒకసారి విచిత్రమైన సంఘటన జరిగింది. శివాజీ మనుమడి పేరు షాహురాజు. ఆ షాహురాజు గారి దగ్గర సైన్యాధిపతిగా ఉన్న చంద్రసేన జాదవుడికి బిడ్డలు లేరు. గురువుగారైన భాస్కర రాయల వారి కాళ్ళ మీద పడి ప్రార్థిస్తే అనుగ్రహించి నీకు తొందరలో కొడుకు పుడతాడని దీవించి దక్షిణ దేశము వెళ్ళిపోయారు. చంద్రసేన జాదవుని భార్య గర్భవతి అయింది. భాస్కర రాయల వారి శిష్యుడైన నారాయణ దేవుడు ఈ చంద్రసేన జాదవుడు ఉన్న ప్రదేశమునకు వచ్చినప్పుడు తన భార్యకు ఆడపిల్ల పుడుతుందా? మగ పిల్లవాడు పుడతాడా? అని చంద్రసేన జాదవుడు అడిగాడు. నీకు పుత్రికా సంతానము కలుగుతుందని చెప్పాడు. మా గురువుగారు భాస్కరరాయలవారు పుత్ర సంతానము అని దీవించారు ఏది నిజం అని అడిగాడు. ఎంత పని చేసావు? మా గురవు గారు వరము ఇచ్చారని నాకు తెలియదు. ఆయన అంతటి ప్రజ్ఞాశాలి వరము ఇస్తే కొడుకు పుట్టవలసిందే కానీ నేను వాక్సుద్ధి పొందిన వాడిని. ఆ గురువులకు శిష్యునిని. తెంపరితనం తో నా గురువు చెప్పిన మాట మీద విశ్వాసంతో బతకకుండా, నా చేత ఈ మాట చెప్పించావు కనుక నీకు నపుంసక సంతానము జన్మించుగాక అని వెళ్ళిపోయాడు. కొంత కాలమునకు భాస్కరరాయల వారు మళ్ళీ వస్తే ఆయన కాళ్ళమీద పడి జరిగింది చెప్పాడు. బెంగ పెట్టుకోవద్దు నేను నీ కుమారుడికి పుంసత్వము వచ్చేలా నేను అనుగ్రహిస్తాను. అని దక్షిణ భారత దేశము వెళ్ళి సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేసి ఆ పిల్లవాడైన రామచంద్రునికి పుంసత్వము కలిగేట్లుగా చేసారు. అది భాస్కరరాయలవారంటే!


కడుపున పుట్టిన బిడ్డ కీర్తికి అమ్మ సంతోషించినట్టు కారణజన్ముడైన మహాత్ముడు భాస్కరరాయలవారి గురించి చెప్పుకున్న ప్రాంతములో అమ్మ ఆనందతాండవము చేస్తుంది.



కామెంట్‌లు లేవు: