సన్యాసి - సమాధి
1986లో తిరుచిరాపల్లిలోని ఆంగరై నుండి కొంతమంది భక్తులు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. స్వామివారు వారితో చాలా విషయాలు మాట్లాడిన తరువాత కావేరీ తీరంలో ఉన్న సంధ్యావందన ఘాట్ గురించి వారిని అడిగారు.
అక్కడే దగ్గర్లో నిలబడి మహాస్వామివారి భిక్షా కైంకర్యం పర్యవేక్షిస్తున్న ఆంగరై శ్రీకంఠన్ ను చూపిస్తూ, “నేను ఎప్పుడు ఆంగరై గురించి అడిగినా, ఇతను తనకు ఏమి తెలియదని సమాధానం చెబుతాడు” అని అన్నారు.
అందుకు శ్రీకంఠన్ స్వామివారితో, “నేను ఆంగరై వదిలి నలభై సంవత్సరాలు అయ్యింది. కాబట్టి నాకు అక్కడి విషయాలు ఏమి తెలియవు” అని సమాధానం చెప్పాడు.
“ఎవరో కొంతమంది ఆ సంధ్యావందన ఘాట్ ని ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నారు. ఇప్పుడు అక్కడ కేవలం కొంత స్థలం మాత్రమే మిగిలిఉంది” అని దర్శనానికి వచ్చిన భక్తులు చెప్పారు.
“వారంతా పేదవారు. వారిని మీరు అక్కడినుండి పంపించాల్సిన పని లేదు. ఆ మిగిలిన స్థలానికి ఒక ప్రహరీ కట్టి, రెండు మారేడు చెట్లు తులసి చెట్టు నాటి వాటిని పోషించండి” అని స్వామివారు ఆదేశించారు.
పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం చేస్తామని వారు స్వామివారితో విన్నవించుకున్నారు.
2003వ సంవత్సరంలో శ్రీకంఠన్ సన్యాసం స్వీకరించారు. వారు తిరువానైకోవిల్(జంబుకేశ్వరం) లోని శ్రీమఠం శాఖలో ఉంటూ అక్కడే సిద్ధి పొందారు. అక్కడి శ్రీమఠం తోటలోనే వారిని శరీరాన్ని ఉంచాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే తిరువానైకోవిల్ శ్రీమఠం దేవాలయ పంచ ప్రాకారాలలోనే ఉండటం వల్ల ఇక్కడ ఖననం చెయ్యడం సరికాదని కొంతమంది ఈ నిర్ణయాన్ని ఆక్షేపించారు.
వారికి ఏమి చెయ్యాలో అర్థం కాక ఆంగరైలో ప్రహరీ నిర్మిచిన వ్యక్తీ సూచన మేరకు, పెద్దస్వామి ఆదేశానుసారం వారి పార్థివ దేహాన్ని అక్కడకు తీసుకుని వెళ్లి సన్యాస సంపరదాయం ప్రకారం సమాధి చేశారు.
2003లో దేహత్యాగం చేసే తన సన్యాస శిష్యుని కోసం 1986లోనే స్థలాన్ని సిద్ధం చేసి ఉంచారు పరమాచార్య స్వామివారు. ఇది కేవలం కాకతాళీయమా? లేక పరమాచార్య స్వామివారి దిర్ఘదృష్టికి నిదర్శనమా?
--- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 3
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం