🙏మహాభారతం - శాంతి పర్వం 🙏
నాల్గవ భాగం
ధర్మం గురించి ఎంత చర్చ జరిగిందో చూడండి దయచేసి అర్ధం చేసుకోండి. శాంతి పర్వం అంతా ధర్మం గురించి చర్చ అందుకే భారతాన్ని పంచమ వేదం అన్నారు. విషయంలోకి వెడదాము
అర్జునుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. ప్రజలను పాలించవలసిన రాజు దండనీతిని వదిలిన, సన్యాసులు కూడా సన్మార్గం వదిలి అక్రమాలకు పాల్పడతారు. ప్రజలు క్రమము తప్పి ఒకరి ఆస్తిని, ధనమును, భార్యను మరొకరు అపహరిస్తారు. అరాచకం చెలరేగుతుంది. అందు వలన వచ్చే పాపం రాజుకు చుట్టుకుంటుంది. కనుక దండనీతిని పాపంగా తలచవద్దు. దుర్మార్గులను దండించిన రుద్రుడు, గోవిందుడు, ఇంద్రుడు, గుహుడు మొదలగు వారు పాపం పొందారా పైగా వారికి గౌరవాదరాలు లభించాయి. కనుక అన్నయ్యా ! దండనీతి వలన ధర్మం స్థాపించ పడుతుంది. అధర్మం నశిస్తుంది. అన్నయ్యా ! సామాన్య మానవులూ తమ దైనందిక జీవితంలో హింసకు పాల్పడక తప్పదు. మనం తినే పండ్లలో, నీటిలో, కాయలలో ఎన్నో కంటికి గోచరం కాని జీవులు ఉన్నాయి. అహారం కొరకు మనం వాటిని చంపుతున్నాము. మనం కందమూలాల కొరకు భూమిని తవ్వే సమయంలో అనేక జీవులు నశిస్తాయి అవి అన్నీ పాపమును కలిగిస్తాయా ! ప్రాణం నిలుపుకోవడానికి ఆహారం కావాలి, అహారం కావాలంటే హింస తప్పనిసరి. భగవంతుడు కూడా ఒక ప్రాణికి మరొక ప్రాణిని ఆహారంగా సమకూర్చ లేదా ! ధర్మమార్గాచరణలో చేసిన హింస పాపం కాదు. రాజుకు దుర్మార్గులైన శత్రువులను చంపడం హింస కాదు. అన్నయ్యా ! మనతండ్రి పాండురాజు సంపాదించిన రాజ్యాన్ని మనం తిరిగి పొందుట అన్యాయం ఎలా ఔతుంది ? మనం చేసింది ధర్మయుద్ధమో అధర్మయుద్ధమో ఆ భగవంతుడికి తెలుసు. కనుక దక్షుడవై ఈ రాజ్యాన్ని పాలించు " అన్నాడు.ఎంత మంది ఏన్ని చెప్పినా ధర్మరాజులో చలనం లేదు. అప్పుడు భీముడు " అన్నయ్యా ! అన్నీ ధర్మములు తెలిసిన నీకు మేము చెప్పగలిగిన వాళ్ళమా ! కాని నా ఓర్పు నశించింది అందుకని తిరిగి తిరిగి చెప్పవలసి వచ్చింది. న్యాయ మార్గములో సంపాదించిన రాజ్యసంపదను విడుచుట పిరికితనం అనిపించుకుంటుంది. జనం మనలను చూసి పిరికివాళ్ళని చీదరించుకుంటారు. కపటజూదం కారణంగా ఎన్నో కష్టాలు పడ్డాము. అవమానాల పాలయ్యాము. కాని నీవు సత్యాన్ని నమ్ముకున్నావు. మేము నిన్ను అనుసరించాము. యుద్ధములో అనేక మంది శత్రువులను చంపాము. నీకు ఎనలేని కీర్తి లభించింది. రాజ్యలక్ష్మి లభించింది. అసలు మనకు యుద్ధం చేయ వలసిన అవసరం ఎందుకు వచ్చింది. కౌరవసభలో పడిన కష్టాలు, అడవులలో అనుభవించిన ఇడుములు, అజ్ఞాతవాసంల్లో అనుభవించిన వ్యధ వలన శ్రీకృష్ణుని నిర్ణయం మేరకు అతడి సహకారంతో యుద్ధం చేసాము. యుద్ధంల్లో కౌరవులో మనమో చావడం తప్పదని యుద్ధానికి ముందే నీకు తెలియదా ! ఇప్పుడు శత్రువులు చచ్చారని బాధపడటం ఎందుకు ? కనుక అన్నయ్యా ! వచ్చి రాజ్యభారం వహించు " అని భీముడు పలికాడు.
భీముడి మాటలు సావధానంగా విన్న ధర్మరాజు " మీరు కోరికలు, మదం, భయంతో సతమతమౌతూ ఈ రాజ్యాన్ని పాలించమని కోరుతున్నారు. కాని రాజ్యపాలన దుఃఖభూయిష్టం అని పెద్దలు అంటారు. రాజుకు నరకం తప్పదని ఆర్యోక్తి. రాజ్య పాలనలో సుఖం శాంతి ఎలా లభిస్తుంది. కామపరమైన భోగములు అనుభవించడంలో ఆనందం ఎక్కడ ఉంది. వాటిని విడిచిన పరమానందం పొందవచ్చు. అరణ్యములలో కందమూలములు తిని జీవిస్తున్న మునులు వెర్రివాళ్ళా ! దుర్మతులు విషయసంబంధ విషయములలో చిక్కుకుని నిరంతర దుఃఖములు పొందుతున్నారు. విజ్ఞులు కోరికలను జయించి ప్రశాంత చిత్తులై జీవిస్తున్నారు. ఈ విషయంలో జనక మహారాజు మాటలు మనకు తెలుసు కదా ! " కోరికలు లేని వాడికి సంపదలతో పని లేదు. మిధిలా నగరం కాలి పోతున్నా నేను ఏ వస్తువూ కాలనట్లే భావిస్తాను " అన్నాడు కదా ! ఆ జనకమహారాజును అందరూ గౌరవించ లేదా ! బాగా ఆలోచించే శక్తి ఉన్న మీరు అజ్ఞానులై శాంతి కాముకుడు నిందార్హుడని అనడం ధర్మమా ! సంసార సుఖాలకు దూరంగా ఉన్న సర్వసంఘ పరిత్యాగికి సంసారంలో పడి కొట్టుకుంటున్న వాళ్ళు పైనున్న వాడికి కొండ క్రింద ఉన్న వాడిలా కనిపిస్తాడు " అని అన్నాడు ధర్మరాజు.
ధర్మరాజు మాటలకు అర్జునుడు ఇలా బదులిచ్చాడు. " నీవు చెప్పిన జనక మహారాజుకు ఆయన భార్యకు జరిగిన సంవాదం విను. నీ వలెనే జనకుడు రాజ్యమును వదిలి బిక్షుక వృత్తి స్వీకరించ నిశ్చయించినపుడు ఆయన భార్య " నాధా ! నీవు రాజ్యపాలన వదిలి భిక్షుక వృత్తి స్వీకరించిన ఇక్కడ అతిథి సత్కారాలు, దేవతర్పణములు, పితృ తర్పణములు ఎవరు చేస్తారు ? శిరోముండనం చేయించుకున్న తరువాత భిక్షకొరకు ఇల్లిల్లు తిరగాలి కదా ! మరి ఆ గృహస్థు మీకు అన్నదానం చేసి పుణ్యం పొందుతాడు కదా ! అన్నదానం వలన అధిక పుణ్యం వస్తుంది కదా ! దానం తీసుకునే వాడి కంటే దానం చేసే వాడు గొప్పని నీకు తెలుసు కదా ! వేదవిదులు రాజుల మీద ఆధారపడతారు. రాజైన మీరే మీ కర్తవ్యం వదిలితే మిగిలిన వారికి దిక్కెవ్వరు ? వారి బ్రతుకులు చెడుపుట మీకు ధర్మమా ! కన్నతల్లినీ కట్టుకున్న దానిని వదిలి, మీ కర్తవ్యం అడవులలో మీరు ఏమిసాధిస్తారు ? ఎండకు చలివేంద్రంగా, చెట్టుకు మధుర ఫలములుగా ఉండి ప్రజల కష్టములు తీర్చవలసిన మీరు ఇలా దీన వృత్తిని స్వీకరించ తగునా ! మీరు చేయదలచిన పని ధర్మవిరుద్ధం. దాని వలన మీకు మోక్షం కలుగుతుందని నేను అనుకోను " అని జనకుని భార్య జనకునితో చెప్పింది.
అర్జునుడి మాటలు విన్న ధర్మరాజు " అర్జునా ! వేదాలు మానవులకు కర్మమార్గాన్ని నిర్ధేశించాయి. అదే వేదములు కర్మసన్యాస మార్గమును కూడా చెప్పి దాని వలన ఉత్తమగతులు కలుగుతాయని చెప్ప లేదా ! మానవుడు తన విజ్ఞతతో తనకు తగిన మార్గాన్ని ఎన్నుకోవాలి. ఉత్తమకార్యములు చేస్తే పరలోకప్రాప్తి కలుగుతుంది. నీవు చెప్పినది లోకథర్మం అది తప్పు కాదు. కాని విజ్ఞులు, వేదవిదులు లోకపూజ్యులు చేసేది తప్పని అనగలమా ! నీవు ఇంద్రుడి పుత్రుడవు, భీముడు వాయుపుత్రుడు మీరిరువురు దైవాంశ సంభూతులు అరివీర భయంకరులు. శ్రీకృష్ణుడు మనతో ఉండటం వలన ఆయన తేజస్సు కూడా మీకు సంక్రమించింది. కాని మీరిరువురు యుద్ధవిద్యా విశారదులు కాని ధర్మవేత్తలు తత్వవేత్తలు కారు కదా ! ఈ సంసారం సారహీనమైనదని తత్వవేత్తలు అంటారు. ఆశాపాశములు వదిలి కర్మలు చేయుట మాని నిర్మలమైన మనసు కలవాడు సుఖి. ఎప్పుడూ ధనం సంపదల కొరకు పాకులాడు వాడు ఎన్నడూ సుఖించలేడు. వేదవేదాంగములు చదివి తత్వజ్ఞానమును రుచి చూసి కూడా జ్ఞానం లేని వారు కర్మమార్గమే మంచిదని ప్రభోదిస్తూ కర్మలలో పడి కొట్టు మిట్టాడు తుంటారు కాని శాశ్వత సుఖమును పొందలేరు. జ్ఞానసముపార్జన చేసిన వారు శమము, దమము, త్యాగము శాశ్వతానందం కొరకు మూలములని చెప్తారు. వాటిని నా వంటి విచక్షణ కలవారు అంగీకరించి ఆచరిస్తారు " అని పలికాడు ధర్మరాజు.
అక్కడే ఉన్న దేవస్థుడు అనే ముని " ఓ ధర్మరాజా ! ఈ లోకములో సుఖంగా జీవించాలంటే అర్జునుడు చెప్పినట్లు సంపదలు, ధనమూ కావాలనడం సత్యం. యోగమార్గముకు చక్కని సోపానములు కలవు నీవు ఆ మార్గమున పయనించిన కాని మోక్షమును పొందలేవు. భోగములు అనుభవించడానికి మాత్రమే ధనార్జన చేయడం తప్పే కాని యజ్ఞ, యాగములు చేయుటకు దాన ధర్మములు చేయుటకు ధనార్జన చేయడం తప్పుకాదు. పైగా దాని వలన మోక్షం కలుగుతుంది. యజ్ఞయాగాదులకు వినియోగించడానికి సంపాదించిన ధనం మనస్తాపాన్ని పోగొడుతుంది. దాని వలన శమము, దమము కలుగుతాయి. కనుక ధనం సముపార్జించి యజ్ఞయాగములు, దానధర్మములు చేయుము. ధర్మరాజా ! శివుడు సర్వమేధము అనే యజ్ఞం చేసాడు. దిక్పాలకులు, బ్రహ్మ ఎన్నో యజ్ఞాలు చేసారు. మరుత్తులు ఎన్నో యజ్ఞములు చేసి ఖ్యాతి పొందారు. ఒక సారి ఇంద్రుని కోరిక పై బృహస్పతి " ఇంద్రా ! కామము క్రోధము మనసున చేర నీయక ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ శోకమును దరి చేరనీయక తాను సుఖుడై ప్రజలను సుఖపెడుతూ రాజ్యపాలన చేసే వాడికి సర్వం వాటంతట అవి వచ్చిచేరతాయి. ధర్మజా ! కర్మలు చెయ్యడం కర్మలు వదలడం రెండూ మేలుకాదు. కర్మలు చేస్తూ దాని ఫలమును ఈశ్వరార్పణం చేయడం ఉత్తమమని పెద్దలు చెప్తారు. మంచి చెడ్డ పనులను సమానంగా చూస్తూ ఎవరికీ ద్రోహం తలపెట్టక క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ రాజ్య పాలన చెయ్యడం ఉత్తమం. నీకు పూర్వులైన రాజులందరూ ఇదే చేసారు. నీకు పూర్వులైన రాజులందరూ ఇదే ఉత్తమమార్గమని ఎంచి దానిని అనుసరించారు. తరువాత వారి కుమారులకు రాజ్యమును అప్ప చెప్పి వానప్రస్థాశ్రం స్వీకరించారు. నీవు కూడా అలాగే చెయ్యి " అని దేవస్థానుడు పలికాడు.
తరువాత అర్జునుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! క్షత్రియ ధర్మం అనుసరించి యుద్ధం చేసావు. యుద్ధంలో చని పోయిన శత్రురాజులు ఉత్తమ గతిని పొందారు. రాజధర్మం రౌద్రమని బాలురకు తెలుసు. రాజ్యపాలనలో పాపాలకు తావు లేదు. రాజనేవాడు రాజ్య పాలన చేస్తూ పదిమందిని పోషించాలి గాని ఒకరు పెడితే తినడం ధర్మమా ! కురువంశ అగ్రగణ్యుడవు ఇది నీకు తగునా ! రాజుల మనసు వజ్రంలా కఠినంగా ఉండాలి కాని ఇలా బేలగా ఉండకూడదు. కనుక శోకం విడిచి రాజ్యభారం వహించు.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ