10, జనవరి 2025, శుక్రవారం

కట్టెదుర వైకుంఠము

 


శ్రీభారత్ వీక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 🌹 వైకుంఠ ఏకాదశి రోజున పరంధాముడైన ఆ విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీనివాసుని స్మరించడం నిజంగా పూర్వజన్మ సుకృతమే. నిరంతరం ఆ వేంకటేశ్వరుని మది నిండా నింపుకొని కొన్ని తరాల పాటు మనమంతా కీర్తించే కీర్తనలను మనకు అందించిన ఆ అన్నమాచార్యుని భాగ్యం ఎంత గొప్పది! ఆయన రచించిన ఓ అద్భుతమైన, మనోహరమైన కీర్తన ' కట్టెదుర వైకుంఠము ' శ్రీమతి రాధాదేవి గళం నుంచి వినండి. అన్నమయ్య కీర్తనలు ఆలపించడం, ఆస్వాదించడం ఒక యోగం. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

ముక్కోటి ఏకాదశి రోజున

 జై శ్రీ రామ్ 

ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి?


అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు.


ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది. జై శ్రీ రామ్ జై జై హనుమాన్ కంచెర్ల వెంకట రమణ

విద్యార్థినులూ - వేదనలూ (42)

 ఓం శ్రీ మాత్రేనమః

ఓం శ్రీ గురుభ్యోనమః

7-01-25

విద్యార్థినులూ - వేదనలూ (42)

(హితోక్తి)

డా.రఘుపతి శాస్త్రుల


కం.బాలిక లుండు నివాసము

లాలయముల వోలె సేవలలరుచునుండన్

పాలకులు చూడగా వలె

పాలసులను చేరదీయ వర్ధిల్లుదురే?

(పాలసులు=దుర్మార్గులు)


చ.చదువుల నొందు కోసమనిశమ్మును వేదనలన్ భరింప నె

మ్మది దృఢ నిశ్చయమ్మున ప్రమాదములన్ గనలేక నమ్మక

మ్మొదవెడు మాటలన్ వినియు నుల్లములందున సంతసించు వా

రెదను సహింప గల్గుదురె హీనులు చేయు దురాగతమ్ములన్

(ఎద=మనస్సులో-దురాగతము=దుర్మార్గపు పనులను)


కం.మోసములను జేసి తమ వి

లాసములను గనగనెంచు రాబందులకున్

దోసములవి కనిపించునె

గాసిల జేయుటలె వారి కర్తవ్యములౌ!

(గాసిల జేయు=బాధపెట్టడం)


క.దుష్టుల కండగ నిలుచుచు

ఇష్టారాజ్యముగ మసలు హీనులకట నా

భ్రష్టులకు శిక్షలుండవొ

శిష్టులకే యిడుదురేమొ శీల పరీక్షల్!


క.మానినులకు బ్రతుకున నభి

మానము, మానములె, సిరులు మాన్యములగునౌ

ప్రాణము కన్నను మిన్నగ

మానమునే ఎంచు చుంద్రు మనుగడ కొరకై

(మానిని=స్త్రీ-మానము=గౌరవము-

మాన్యము=గౌరవ సంపద)

భగవంతుడు ఎక్కడ వున్నాడు

 భగవంతుడు ఎక్కడ వున్నాడు 

ఆస్తిక మహాశయులకు నమస్కారం 

హిందూ సమాజంలో భక్తి రోజు రోజుకు పెరిగిపోతున్నది అని అనిపిస్తున్నది. ఒకరకంగా ఇది మంచి పరిణామమే కానీ అతి సర్వత్రా వర్జతే అన్నట్లు భక్తి పేరుతొ భక్తులుగా చలామణి అవుతూ కొందరు అకృత్యాలకు పాల్పడుతున్నట్లు మనకు అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి. సమాజం వాటిని ఎట్టిపరిస్థితిలో క్షమించకూడదు. అది అట్లావుంచితే కొందరు అమాయక ప్రజలు చెప్పుడు మాటలు నమ్మి అత్యంత శ్రమదమాలకు ఓర్చి ఆ దేముడిని చూడాలి ఈ దేముడిని చూడాలి అక్కడి తీర్థములో స్నానమాచరించాలి ఇక్కడి తీర్థంలో స్నానమాచరించాలి ఆలా చేస్తే పాపలు పరిహారాలు అవుతాయి, ముక్తి లభిస్తుంది అని భావిస్తూ ఎంతో కస్టపడి వెళుతున్నారు. మిత్రులారా నిజానికి ఏ దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నా లేక ఏ తీర్ధంలో స్నానాలు చేసిన మనం చేసిన పాపాలు నాశనం కావు. ఇక ముక్తి ఎన్ని క్షేత్రాలు చుసిన ఎన్ని పూజలు చేసినా, యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించినను లభించదు. ఈ విషయం ప్రతి ఆస్తికుడు తెలుసుకోవాలి. వారి అటువంటప్పుడు ఎందుకు ఇవ్వన్నీ అంటే అవి కేవలం మానసిక ప్రశాంతత అంటే చిత్త శుద్ధి కలగటానికి మాత్రమే. ఈ సత్యం తెలుసుకున్న సాధకుని పరుగు నిత్యమూ సత్యము అయినా ఆ అనంతుని వైపు మళ్లుతుంది. అప్పుడే సాధకుడు "ఏకమేవ అద్వితీయం బ్రహ్మ" అనే మహా వాక్యాన్ని తెలుసుకొని ముక్తివైపు పరుగిడతాడు. భగవంతుడు లేని స్థలమే లేదు ఈ జగత్తు మొత్తం భగవంతుడే అయి వున్నాడు. ఈ సత్యం ప్రతి సాధకుడు తెలుసుకోవాలి.

ఎవరో ఆధార రహితంగా చెప్పిన మాటలను నమ్మి దైవాలయాలను దర్శించుకోవటమే పరమావధిగా తలంచి ప్రాణాలమీదకు తెచ్చుకోకూడదని అందరిని సవినయంతో కోరుతున్నాను. 

(తిరుమలలో త్రొక్కిసలాటలో భక్తులు చనిపోయారనే బాధతో వ్రాసినది)

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం - ఏకాదశి - కృత్తిక -‌‌ భృగు వాసరే* (10.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం

 వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం


పరమ పవిత్రమైన ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి' పర్వదినంగా ప్రతి సంవత్సరం మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశినాడు జరుపుకుంటారు. దీనికే 'ముక్కోటి ఏకాదశి' అని కూడా పేరు. ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి నాడు పాల కడలిలో శయనించి యోగ నిద్రలో గడిపి కార్తీక శుద్ధఏకాదశినాడు యోగనిద్ర నుంచి మేల్కొన్నాడు శ్రీమహావిష్ణువు.


దీని వెనుక ఓ ఆసక్తికరమైన పురాణగాథ వుంది. రావణాసురుని బాధలకు తాళలేని దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. అపుడాయన ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున దేవతలందరితో వైకుంఠం చేరుకున్నాడు. వారంతా కలిసి శ్రీహరిని వేదముల సూక్తములతో పరిపరివిధాల స్తుతించారు. దాంతో శ్రీహరి సంతుష్టుడై వారికి తన దర్శనభాగ్యం కలుగజేశాడు. వైకుంఠ ఏకాదశి వెనుక మరో పురాణగాథ కూడా వుంది. మధుకైటభలను రాక్షసులను విష్ణుభగవానుడు సంహరించినప్పుడు వారు దివ్యరూపధారులై దివ్య జ్ఞానమును పొంది ఆ స్వామిని కొనియాడారు.


'బ్రహ్మాదులెవరైనా నీ లోకం వంటి మందిరం నిర్మించి, ఏకాదశి పండుగ చేసుకొని, నీకు నమస్కరించి ఉత్తర ద్వార మార్గమున నిన్ను చేరుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునట్లు వరమివ్వ' మని కోరారు. ఈ విధంగా ముక్కోటి దేవతల బాధలను నివారించిన దవడంవల్ల 'ముక్కోటి ఏకాదశి' గాను భగవంతుని దర్శించు కొను పవిత్రమైన రోజు కావున 'భగవదవలోకన దినము' గాను ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి కొనియాడబడింది.


 ప్రతి మాసంలోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. శుభకరమైనది. అందుకే 'వైకుంఠ ఏకాదశి' గా, 'ముక్కోటి ఏకాదశి'గా, 'హరివాసరము'గా ఈ రోజు కీర్తించ బడుతుంది. ఈరోజున సకల దేవతారాధ్యుడు అయిన శ్రీమన్నారాయణుని పాద పద్మములను భక్తిశ్రద్దలతో అర్చించిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది.


ఏకాదశినాడు ఏం చేయాలి?


ఏకాదశినాడు ప్రధానంగా ఉపవాస వ్రతం పాటించాలని పురాణాలు వెల్ల డించాయి. ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఆనాడు ఉదయమే నిద్ర లేచి కాల కృత్యాలు, నిత్యకర్మలు పూర్తి చేసుకొని విష్ణుమందిరానికి వెళ్ళి తాను వ్రతమును ఆచరించుటకు నిర్ణయించుకున్నట్లు, ఆ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగునట్లు చూడమని శ్రీహరిని ప్రార్ధించవలెను. ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువుని ధ్యానిస్తూ గడపవలెను. ఆనాటి రాత్రి జాగరణ చేయవలెను.


ఈ సమయంలో శ్రీహరి ధ్యానంగానీ, పురాణ పఠనంగానీ చేయవలెను. మరునాడు ఉదయం ద్వాదశి ఘడియలు ఉండగా నారాయణుడిని పూజించి నైవేద్యం సమర్పించి భోజనం చేయవలెను. అంటే ఉపవాసం ఉండడం ఈ నాటి ప్రధాన నియమం. అయితే సంతానం గలవారు ఏమీ తినకుండా ఉండకూడదు. సంతాన హీనులు, విధవలు, సన్యాసులు మినహా మిగిలిన వారందరూ పండ్లు, పాలు వంటివి స్వీకరించవలెను. భార్యాభర్తలు కలసి ఈ వ్రతం చేయడం ఉత్తమం. ద్వాదశినాడు అన్నదానం చేయడంవలన రెట్టింపు ఫలితాలు ఉంటాయని పద్మపురాణం వివరి స్తోంది. అంతే కాకుండా ఏకాదశినాడు ఉపవాస వ్రతం చేయకుండా భుజించేవారు మహా పాపములు పొందుతారని పురాణాలు వెల్లిడిస్తున్నాయి. అయితే ఉపవాసం చేయలేని వారికి వాయు పురాణం ప్రత్యామ్నాయాలను సూచించింది.


‘నక్తం హవిష్యాన్ని నోదవం వా ఫలం తిలాః క్షీరమథాంబు బాజ్యం యతృంచగవ్యం యదవాపి వాయుః ప్రశస్త మంత్రోత్తర ముత్తరంచ||'


అని వాయు పురాణంలో పేర్కోనబడింది.


ఉపవాసం చేయలేనప్పుడు వాయుభక్షణము, అదీ చేతగాని సమయంలో పంచగవ్యము అంటే పాలు, నీరు, నెయ్యి, నువ్వులు, పండ్లు తినవచ్చును. అది కూడా సాధ్యం కానప్పుడు ఉడకని పదార్ధాములు... అలా కూడా ఉపాసించలేనివారు ఒక పొద్దు అంటే ఒకపూట ఆహారం స్వీకరించవచ్చని దీని అర్థం. ఈ విధంగాఉపవాస వ్రతం పాటించడం వల్ల సూర్యచంద్ర గణములో చేసే దానం, అశ్వమేధ యాగం చేసిన ఫలితాలకంటే అధిక ఫలితం లభిస్తుందని పురాణాలు వివరించాయి.


వైకుంఠ ద్వార దర్శనం.


వైకుంఠ ఏకాదశినాడు ఆచరించాల్సిన పనుల్లో 'వైకుంఠ ద్వార దర్శనం' ప్రధానమైంది. వైకుంఠ ఏకాదశిరోజు వైష్ణవ దేవాలయాల్లో ఉత్తరం వైపున వున్న ద్వారం తెరుస్తారు. ఈ ద్వారానికే వైకుంఠ ద్వారం అని పేరు. వైకుంఠ ఏకాదశినాడు. తెల్లవారుఝామునే 'వైకుంఠ ద్వారం' ద్వారా వెళ్ళి దైవదర్శనం చేసుకుంటే సర్వ పాపాలూ నశిస్తాయని, మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఆళ్వారులలో ఒకరైన నమ్మళ్వారు ఈ దినమే పరమపదించినందు వల్ల వైష్ణువులు దీనిని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.


'బృహత్సామ తథాసామ్నాం గాయత్రీ ఛంద సామాహం మాసానాం మార్గశీర్షిహం ఋతూనాం కుసుమాకరః॥'


అని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొన్నాడు. 'సామవేదంలో బృహత్స మాన్ని, ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశిర మాసాన్ని, ఋతువులలో వసంత ఋతువును నేనే' అని గీతాచార్యుడు పేర్కొన్నాడు. అలాంటి మార్గశిర మాసంలో శుద్ధఏకాదశి గీతా జయంతి కాబట్టి భగద్గీతలోని 18 అధ్యాయాలను భక్తులు పారాయణం చేస్తే మోక్షం లభిస్తుందని చెప్పబడుతూ వుంది. వైకుంఠ ఏకాదశిని పాటించడం ద్వారా అనేక పుణ్యఫలాలను పొందడమే కాదు, ఉపవాస వ్రతం వల్ల మారుతున్న ఆహారపు అలవాట్లవల్ల కొత్తగా వస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా పొందవచ్చు.

శుక్రవారం,జనవరి 10,2025

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ  జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


శుక్రవారం,జనవరి 10,2025

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - శుక్ల పక్షం

తిథి:ఏకాదశి ఉ9.45 వరకు

వారం:శుక్రవారం

నక్షత్రం:కృత్తిక మ1.41 వరకు

యోగం:శుభం మ2.58 

కరణం:భద్ర ఉ9.45 తదుపరి బవ రా8.46 వరకు

వర్జ్యం:తె4.52 - 6.24

దుర్ముహూర్తము:ఉ8.49 - 9.33 మరల మ12.29 - 1.13

అమృతకాలం:ఉ11.26 - 12.56

రాహుకాలం:ఉ10.30 - 12.00

కేతుకాలం:మ3.00 - 4.30

 సూర్యరాశి: ధనుస్సు 

చంద్రరాశి:వృషభం 

సూర్యోదయం:6.38

సూర్యాస్తమయం:5.38

*ముక్కోటి ఏకాదశి/వైకుంఠ ఏకాదశి*


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు* 

 *మిట్టాపల్లి*

శ్రీ దక్షిణ మూకాంబిక ఆలయం

 🕉 మన గుడి : నెం 985


⚜ కేరళ  : పరవూర్ , ఎర్నాకులం


⚜ శ్రీ దక్షిణ మూకాంబిక ఆలయం



💠 శ్రీచక్రాన్ని అమర్చి పూజించే ఆలయాలు నిజానికి చాలా అరుదు,ఈ ప్రత్యేకత కలిగిన దేవాలయం ఉంది- దక్షిణ మూకాంబిక భగవతి ఆలయం.  


💠 మహామాయ ఇక్కడ 3 గౌరవనీయమైన అవతార రూపాలలో నివసిస్తుంది- 

మహాకాళి, మహాలక్ష్మి మరియు మహా సరస్వతి.


💠 దక్షిణ మూకాంబిక దేవాలయం కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఉత్తర పరవూర్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన మూకాంబిక ఆలయం . 

ఈ ఆలయంలో ప్రధాన దైవం పార్వతి దేవి మూకాంబిక రూపంలో మరియు ఉప దేవతలు గణపతి , కార్తికేయ , మహావిష్ణు , యక్షి, హనుమంతుడు మరియు వీరభద్ర.


💠 కేరళలోని కొట్టాయం జిల్లాలోని పనచికాడు గ్రామంలోని సరస్వతి  ఆలయాన్ని దక్షిణ మూకాంబిక అని పిలుస్తారు.  

అనేక  సరస్వతి ఆలయాలు 'నవరాత్రి కాలంలో మాత్రమే పూజలు నిర్వహిస్తున్నప్పటికీ, ఈ ఆలయం భక్తులకు 'దర్శనం' అందిస్తూ పూజా కార్యక్రమాలను అందజేస్తుంది.


🔆 స్థల పురాణం


💠 పురాణాల ప్రకారం, పరవూరులోని తంపురాన్ (పాలకుడు) మూకాంబిక దేవికి గొప్ప భక్తుడు . అమ్మవారి దర్శనం కోసం ఆయన ప్రతి సంవత్సరం మంగళూరులోని కొల్లూరు ఆలయానికి వచ్చేవారు . 

అతను వృద్ధాప్యానికి వచ్చాక, అతని ఆరోగ్యం మరింత దిగజారింది మరియు అతను కొల్లూరుకు సుదీర్ఘ ప్రయాణం చేయలేడు. 

దేవత విచారంగా ఉన్న భక్తుడికి కలలో కనిపించింది మరియు అతను ఆమెను ప్రతిరోజూ దర్శనం చేసుకునేందుకు అతని రాజభవనం దగ్గర తన విగ్రహాన్ని నిర్మించమని ఆదేశించింది. 

తంపురాన్ ఆమె సూచనలను అనుసరించి, పరవూరులో ఆలయాన్ని నిర్మించి, దేవతను ప్రతిష్టించాడు.


💠 ఇక్కడ ప్రత్యేకంగా గమనించవలసిన రెండు విషయాలు లతలు మరియు నిష్కళంకమైన నీరు. విగ్రహాన్ని కప్పి ఉంచే లత ఆకులను సరస్వతి ఆకులుగా పరిగణిస్తారు.  

ఇక్కడి నీటి బుగ్గ నుండి వచ్చే నీరు "దేవి" పాదాలను తాకుతూ ప్రవహిస్తుంది, వేసవిలో కూడా ఎప్పుడూ ఆరిపోదు.  

దేవి అటువంటి "సరస్" (చిన్న వాగు)పై ఉంటుంది కాబట్టి సరస్వతి అనే పేరు అర్థవంతంగా మారుతుంది.  


💠 పూజలు, ఇతర అవసరాలకు కావాల్సిన నీటిని బుగ్గ నుంచి తీసుకుంటారు.  ఇక్కడ బావి లేదా ఇతర నీటి వనరులు అందుబాటులో లేవు. 


💠 ఇక్కడ 'యక్షి' నివసిస్తుంది, ఇక్కడ 'బ్రహ్మరాక్షసు' విగ్రహం కూడా ప్రతిష్టించబడింది.  

ఇతర దేవాలయాలలో యక్షి మందిరాలు ఉన్నప్పటికీ, పనచికాడు వద్ద యక్షి యొక్క శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. 

 అదనంగా ఇక్కడ శివుడు, శాస్తా, గణపతి, నాగయక్షి, నాగరాజు మరియు ఉప దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.


💠 ఆలయ ప్రాంగణానికి చేరుకున్నప్పుడు మనకు మొదట విష్ణు మందిరానికి దక్షిణంగా కొన్ని మీటర్ల దూరంలో “విష్ణు దేవాలయం” కనిపిస్తుంది.  


💠 ఈ ఆలయానికి వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉంది, ఓక బ్రాహ్మణుడు మగబిడ్డను పొందలేదని నిరాశ చెందాడు, పవిత్ర స్నానం చేయడానికి గంగానదికి ప్రయాణం చేసాడు.  

మార్గమధ్యంలో మూకాంబికకు చేరుకుని అక్కడి దేవతను ప్రార్థిస్తూ కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. 


💠 ఒకరోజు దేవి అతని ముందు ప్రత్యక్షమై తన స్వగ్రామానికి వెళ్ళమని సలహా ఇచ్చింది.  కరుణాత్తిల్లంలోని ఒక నంపూతిరి మహిళ ఇప్పుడు గర్భవతి అని, ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుందని ఆమె అతనికి చెప్పింది.  పిల్లల్లో ఒకరిని తన సొంత బిడ్డగా దత్తత తీసుకుని పెంచాలి అని.


💠 దేవి ఆదేశానుసారం మరుసటి రోజు భక్తుడు స్నానం చేసి, దేవికి పూజ చేసి తన ఇంటికి తిరిగి వచ్చాడు. తాటి ఆకుల గొడుగులో దేవి అనుగ్రహం మరియు శక్తి ఉన్నాయి.  

అతను పనాచికాడ్ చేరుకున్నప్పుడు, అరచేతి గొడుగు ఎటువంటి కదలిక లేకుండా గట్టిగా మారింది.  అప్పుడు దేవత అతని ముందు కనిపించింది  మరియు గొడుగులో దేవి యొక్క శక్తి మరియు ఆశీర్వాదం ఉందని చెప్పారు.


💠 బ్రాహ్మణుడికి పూజలు చేయమని మరియు సరస్వతి యొక్క శక్తిని పనచికాడులోని ఆలయంలో ప్రతిష్టించమని సలహా ఇచ్చారు.

 అక్కడ నిర్జనమై పడి ఉన్న ఒక విగ్రహం కనిపించింది.  ఈ పాత విగ్రహంలో దేవి యొక్క శక్తిని అవతారం చేయమని బ్రాహ్మణుడికి చెప్పబడింది. 


💠 అతీంద్రియ శక్తులు ఉన్న అటువంటి దేవతలు ఇప్పుడు అందుబాటులో లేనందున ఇప్పుడు పనాచికాడ్‌లో ప్రత్యామ్నాయ విగ్రహాన్ని ప్రతిష్టించారు.  నేటికీ సంరక్షకుల ఆలయంలో ఆనాటికి సంప్రదాయ ఆచారాలు మరియు పూజలు జరుగుతాయి.  

 

💠 భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి 'దర్శనం' కోసం వస్తారు, మతాలకు అతీతంగా ప్రజలు 'విద్యారంభం' (విద్యను ప్రారంభించే వేడుక) కోసం ఇక్కడికి వస్తారు.

  ‘దుర్గాష్టమి’, ‘మహానవమి’ రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో ఇక్కడ ‘విద్యారంభం’ నిర్వహిస్తారు.  


💠 నెయ్యి సుసంపన్నం;  సరస్వత మంత్రం' ఇక్కడ నుండి భక్తులకు పంపిణీ చేయబడుతుంది. 

 ఈ నెయ్యి తీసుకోవడం వల్ల పిల్లల తెలివితేటలు మరియు విద్య కోసం ఇది చాలా మంచిదని భావిస్తారు. 


Rachana

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం -*114

 *తిరుమల సర్వస్వం -*114

*తాళ్ళపాక అన్నమాచార్యుడు 2* 

*"అడుగడుగు దండాల వాడు గోవిందా!* 

*ఏడుకొండల వాడా! గోవిందా! గోవిందా!"*


 అంటూ శ్రీవారిని కీర్తిస్తూ తిరుమల క్షేత్రానికి వెళుతూన్న ఓ భక్తబృందం కనబడింది. ఇష్టదైవమైన వేంకటేశ్వరుని కీర్తనలు వినబడడంతో తన బాధను మరచిపోయి, తన్మయత్వంతో ఆ భక్తుల్ని చూస్తూ ఉండిపోయిన అన్నమయ్యకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయినట్టు అనిపించి, *'బంధుత్వాలన్ని మిథ్య'* అన్నట్లు తోచింది.

భక్తులందరూ తనను కూడా తిరుమల యాత్రకు ఆహ్వానిస్తున్నట్టు, ఆ క్షేత్రాన్ని చేరుకుని స్వామివారి సమక్షంలో కీర్తనలు ఆలపిస్తున్నట్లు, అలమేలుమంగా సమేతుడైన శ్రీవారు ఆ కీర్తనలను ఆదమరచి ఆలకిస్తున్నట్లు కలలుగన్నాడు. నొప్పి మటుమాయం అయింది.. మనసు తేలికపడి తన ప్రేరణ లేకుండానే అడుగు ముందుకు పడింది. వడివడిగా తిరుమల క్షేత్రం వైపు ప్రయాణం సాగించాడు. భక్తి పారవశ్యంలో మునిగి పోతూ, స్వామివారిని తలచుకుంటూ; అలుపు సొలుపులు, ఆకలిదప్పులు లక్ష్యపెట్టకుండా మైళ్ళకొద్దీ ప్రయాణం చేసి, ముందుగా, ఆ రోజుల్లో *"శ్రీపదపూరి"* గా పిలువబడే నేటి *"దిగువ తిరుపతి"* కి చేరుకున్నాడు. తిరుపతి గ్రామదేవత అయిన *గంగమ్మ* దర్శనం తరువాత, గోవిందరాజస్వామి ఆలయం చేరుకుని వారిని -


*తిరమై శ్రీ వేంకటాద్రి తిరుపతి లోపలనుఁ గొరబాయ నీ బ్రతుకు గోవిందరాజా!*


 అని కీర్తిస్తూ, గోవిందరాజు - శ్రీనివాసుడు అభిన్నులని చాటిచెప్పాడు. తదుపరి, దూరంగా కనబడుతున్న శేషాచల శిఖరాలను చూస్తూ, అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యాడు.


 *అలిపిరి మార్గంలో తిరుమలకు...* 


 స్వామివారి కీర్తనలు పాడుకుంటూ, భజనలు చేసుకుంటూ తిరుమల కొండ ఎక్కడానికి ఉద్యుక్తుడైన అన్నమయ్య, మొట్టమొదటగా అలిపిరిలో ఉన్న *"శ్రీవారి పాదమండపాన్ని"*, ఆ ప్రక్కనే కొలువై ఉన్న *"లక్ష్మీనారశింహుణ్ణి"* దర్శించుకున్నాడు. ఆయా దేవతలను సందర్శించినపుడు అన్నమయ్య ఆశువుగా గానం చేసిన:


 *బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానీ పాదము*


 *కదిరి నృసింహుడు కంభమున వెడల*


 *విదితముగా సేవించరా మునులు*


అనే పాటలు తరువాతి కాలంలో లోకప్రసిద్ధ మయ్యాయి.


 ఇలా గానామృతంలో మునిగిపోతూ, స్వామివారి పైనే మనసును లగ్నం చేసి, అలిపిరి మార్గంలోని - *తలయేరు గుండు,* *చిన్న ఎక్కుడు,* *పెద్ద ఎక్కుడు,* *గాలి గోపురం,* *ముగ్గుబావి* దాటుకుంటూ; కొండలు, కోనలు, సెలయేళ్ళతో నిండిన పచ్చని ప్రకృతికి పరవశించి పోతూ; వన్యమృగాలు, భక్తబృందాలతో సందడిగా ఉన్న మెట్లమార్గాన్ని అధిగమిస్తూ, అల్లంత దూరంలో శేషాద్రి శిఖరాన్ని తొలిసారి చూడగానే -


*కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ*

*తెట్టలాయ మహిమలే తిరుమల కొండ...*


 అన్న గానం అప్రయత్నంగానే అన్నమయ్య నోటినుండి వెలువడింది. లోయలన్నీ తన గానాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి. పక్షులు కిలకిల లాడుతూ ఆతని పాటకు వంత పాడుతున్నట్టున్నాయి. ఇలా మరో లోకంలో పరవశించి పోతున్న అన్నమయ్యను గమనించకుండానే, భక్తబృందం ముందుకు సాగిపోయింది. వారికోసం వెదకుతూ, *అవ్వాచారికోన* దాటి మోకాళ్ళపర్వతం చేరుకున్నాడు అన్నమయ్య. ఒక ప్రక్క ఆకలి, దాహం, మరోప్రక్క అలసట. దానికి తోడు ఎర్రటి ఎండ. ఎదురుగా చూస్తే నిట్టనిలువుగా, గుండెలవిసేలా లెక్కలేనన్ని మెట్లు! దరిదాపుల్లో తెలిసిన వారెవ్వరూ లేరు. నీరసం ఆవహించింది. మరో రెండు-మూడు మెట్లు ఎక్కగానే స్పృహతప్పి కిందపడి పోయాడు..



*("అలిపిరి" మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే టప్పుడు, మార్గమధ్యంలో ఈ ప్రదేశాలన్నింటిని నేడు కూడా చూసి ఆహ్లాదించవచ్చు. కొండమీద తిరుమలేశుని దర్శసం ఒక ఎత్తైతే, అలిపిరి మార్గంలోని శ్రీవారితో ముడిపడిన అనేక చారిత్రాత్మక విశేషాలను, రమణీయ ప్రకృతి దృశ్యాలను దర్శించుకోవడం మరో ఎత్తు. 3550 మెట్లను, ఇద్దరిముగ్గురి సాహచర్యంతో, ఏ వయసువారైనా నాలుగైదు గంటల సమయంలో, శ్రీవారి ముచ్చట్లు చెప్పుకుంటూ అధిరోహించవచ్చు. తప్పనిసరిగా చూసి తీరవలసిన ఈ నడకదారి విశేషాల గురించి మరోసారి వివరంగా తెలుసుకుందాం.)*



*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

గీతా మకరందము

 11-52,53-గీతా మకరందము

          విశ్వరూపసందర్శనయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ|| అర్జునుని యా వాక్యములను విని భగవానుడు తానుచూపిన  రూపముయొక్క మహిమాతిశయమును రెండు శ్లోకములద్వారా వెల్లడించుచున్నారు - 


శ్రీ భగవానువాచ :-

సుదుర్దర్శమిదం రూపం 

దృష్టవానసి యన్మమ | 

దేవా అప్యస్య రూపస్య 

నిత్యం దర్శనకాంక్షిణః || 


తా:-  శ్రీ భగవానుడు చెప్పెను - నా యొక్క ఏ రూపమును నీవిపుడు చూచితివో అది మహాదుర్లభమైనది. దేవతలుకూడ నిత్యమూ నద్దానిని దర్శనము చేయగోరుచుందురు. 


వ్యాఖ్య:- భగవంతుని స్వరూపమును సామాన్యులెవరును దర్శింపజాలరు. ఎంతయో హృదయనిర్మలత (చిత్తశుద్ధి), అనన్యభక్తిగలవారు మాత్రమే దానిని దర్శింపగలరు. కనుకనే ‘దుర్దర్శమ్’ అనకుండ ‘సుదుర్దర్శమ్’ అని చెప్పబడినది. భగవద్దర్శనము మహాదుర్లభమని భావము. 

-------------------------------------

॥ ఓం - గీతా మకరందము  [11-53]॥

నాహం వేదైర్న తపసా 

న దానేన న చేజ్యయా 

శక్య ఏవంవిధో ద్రష్టుం 

దృష్టవానసి మాం యథా || 


తా:- నన్ను ఏ రీతిగ నీవు చూచితివో, అటువంటి రూపముగల నేను వేదములచే (వేదాధ్యయనపరులచే) గాని, తపస్సుచేగాని, దానముచేగాని, యజ్ఞముచేగాని చూచుటకు శక్యుడనుగాను.

  

వ్యాఖ్య:- 48వ శ్లోకమున తెలిపిన భావములనే మఱల తెలియజేయుచున్నాను. వేదాధ్యయన, తపో, దాన,యజ్ఞాదిక్రియలు పవిత్రములైనను నిర్మలభక్తి, అచంచల దైవవిశ్వాసము వానితో జోడింపబడినపుడు

మాత్రమే అవి సత్ఫలముల నొసంగగల్గును. (చూ - వ్యాఖ్య - 48 శ్లో) (ఈ విషయము రాబోవు శ్లోకమున తెలియజేయబడును).

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*


*252 వ రోజు*

*పాండవులతో ద్రోణ, భీష్ముల యుద్ధం*

సాత్యకి ముందుగా ద్రోణుని మీద బాణవర్షం కురిపించాడు. ద్రోణుడు ప్రతిగా సాత్యకి మీద బాణ ప్రయోగం చేసాడు.ఇది చూసిన భీముడు సాత్యకి సాయంగా రథాన్ని నడిపిస్తూ వచ్చి చేరి ద్రోణునిపై అతి క్రూర బాణాలు సంధించాడు. ఇది చూసిన శల్యుడు ద్రోణ, భీష్ములకు బాసటగా నిలిచి భీమునిపై బాణవర్షం కురిపించాడు. ఇంతలో ద్రౌపతీ సుతులు, అభిమన్యుడు భీమునకు సాయంగా వచ్చారు. శిఖండి భీష్మిని ఎదుర్కొన్నాడు. భీష్ముడు పక్కకు తప్పుకున్నాడు. ఇది చూసిన సుయోధనుడు ద్రోణుని శిఖండి మీదకు పురికొల్పాడు. ద్రోణుడు శిఖండిపై బాణాలను గుప్పించాడు. పోరు భీకర రూపం దాల్చింది. రథ, గజ, తురగ, పదాతి దళముల పదఘట్టనల హోరు మిన్నంటింది, ధూళి ఆకాశాన్ని కప్పేసింది. గుర్రముల ప్రేగుల గుట్టలు, ఏనుగుల కళేబరములతో రణభూమి భయానకంగా ఉంది. రక్తం కాలువలు కట్టింది. భీమార్జునుల, భీష్మ ద్రోణులు ఇరువైపులా నిలిచి భీకర పోరు సాగిస్తున్నారు.


*భీమసేనుని పరాక్రమం*


దృతరాష్ట్ర కుమారులంతా చేరి భీమునిపై మూకుమ్మడిగా పడ్డారు. ఎత్తైన కొండను మేఘాలు కప్పినట్లు భీమసేనుని ఎదుర్కొన్న నీ కుమారులను చూసిన అర్జునుడు భీమసేనునికి సాయంగా వచ్చి వారి పై శరములు గుప్పించాడు. అర్జునిని గాండీవతాకిడికి ఆగలేక కౌరవ సేనలు భీష్ముని వెనుక చేరాయి. తన సేనలు పారిపోవడం చూసిన సుయోధనుడు చేయి వూపుతూ అక్కడకు చేరగానే అది గమనించిన కంభోజ, సౌవీర, సింధు, గాంధార, త్రిగర్త, కళింగ రాజులు తమ సేనలతో అక్కడకు చేరి భీమార్జునులను ఎదుర్కొన్నారు. ఇది చూసిన ధర్మరాజు చేది, కాశ, కరూస, విరాట సేనలను ధృష్టద్యమ్నునుని నాయకత్వంలో భీమార్జునులకు సాయంగా తీసుకు వచ్చాడు. విందాను విందులు కాశీరాజుని, జయద్రధుడు భీమసేనుని, సహదేవుని వికర్ణుడు, చిత్రసేనుడు శిఖండిని, సుయోధనుడు విరాటుని, త్రిగర్తలు నకులుని, ద్రోణుడు చేకితాన, సాత్యకులను, కృపాచార్యుడు ధృష్టద్యుమ్నుని, అభిమన్యుడు సాళ్వ కేకయరాజులను, ధృష్టకేతు, ఘటోత్కచులు నీకుమారులను ఎదుర్కొన్నారు. సమరం సంకులమైంది. అస్త్ర, శస్త్రములు ఒకదానితో ఒకటి తాకి మంటలను రేపుతున్నాయి. ఏనుగుల ధాటికి నలిగిన రథములు రథముల ధాటికి దెబ్బతిన్న ఏనుగులు, గుర్రముల ధాటికి నేల కూలిన పదాతి దళములు యుద్ధరంగాన్ని బీభత్సం చేసాయి. భీముని పరాక్రమం చూసి భీష్ముడు వాడి అయిన బాణములు వేసి అతడిని నొప్పించాడు.

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

తిరుప్పావై 26వ పాశురం*

 *తిరుప్పావై 26వ పాశురం*

🕉🌞🌏🌙🌟🔥

🕉🌞🌏🌙🌟


*26.పాశురం*


*ॐॐॐॐॐॐॐॐॐॐ*

 

      *మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్;*

        *మేలైయార్ శేయ్యనగళ్ ; వేణ్ణువన కేట్టియేల్;*

        *ఞా లత్తై యెల్లామ్ నడుజ్ఞ మురల్వన* 

        *పాలన్న శజ్ఞజ్ఞళ్, పోయ్ ప్పాడు డైయనవే,*

        *శాలప్పేరుమ్ పఱైయే, పల్లాణ్ణిశైప్పారే,*

        *కోలవిళక్కై, కోడియే, వితానమే,*

        *ఆలినిలై యామ్! ఆరుళేలో రేమ్బావాయ్!!*


*ॐॐॐॐॐ*


*భావం*


*ॐॐॐॐॐ*


ఆశ్రిత వ్యామోహము కలవాడా ! ఇంద్రనీలమణిని పోలిన కాంతియు, స్వభావము కలవాడా !అఘటితఘటనా సామర్ధ్యముచే చిన్న మఱ్ఱిఆకుపై అమరి పరుండువాడా !


 మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరములు అర్థించి, నీవద్దకు వచ్చితిమి. ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించెదను. 


ఈ భూమండలమంతను వణుకునట్లు శబ్దము చేయు, పాలవలె తెల్లనైన నీ పాంచజన్యమనెడి శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద 'పఱ' అను వాద్యములు కావలెను.


మంగళ గానము చేయు భాగవతులు కావలెను. మంగళ దీపములు కావలెను. ధ్వజములు కావలెను. మేలుకట్లు కావలెను. పై పరికరములను కృప చేయుము. అని గోపికలు శ్రీకృష్ణుని ఈ పాశురమున ప్రార్థించిరి. 


ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరము కలవాడా! ఓ వటపత్రశాయీ! మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము.


మా పూర్వులున్నూ యీ స్నాన వ్రతాన్ని ఆచరించియున్నారు. ఈ వ్రతానికవసరమగు పరికరములను నిన్నర్ధింపగా వచ్చాము. దయచేసి ఆలకింపుము.


భూమండలమంతయు వణుకు కల్గించునట్లు ద్వనించే పాలవంటి తెల్లనైన శంఖములు  సరిగా నీ పాంచజన్యము వంటివి కావలెను. అతిపెద్దవైన *పఱ* వంటి వాద్యములు కావలెను. మృదుమధురమైన కంఠములతో మంగళ గానాలను పాడే భాగవతులను కావాలి. వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళదీపము కావాలి.


వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి. లోకలన్నింటినీ నీ చిరుబొజ్జలో దాచుకుని, ఒక లేత మఱ్ఱి యాకుమీద పరుండిన నీకు చేతకానిదేమున్నది స్వామీ! కరుణించి మా వ్రతము సాంగోపాంగముగ పూర్తియగునట్లు మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదింపుము. 


*ॐॐॐॐॐॐॐ*  


*అవతారిక*


*ॐॐॐॐॐॐॐ*


భగవానుడే ఉపాయము, భగవానుడే ఫలము అని అని విశ్వసించి యుండు ప్రపన్నులు భగవానుని కంటే ఇతరములగు వానిని కాంక్షింపరాదు. మరొక వ్రతములను ఆచరింపరాదు.


మార్గశీర్ష స్నాన వ్రతము, వ్రేపల్లెలోని పెద్దల అభిప్రాయమున వర్షార్థమై చేయు వ్రతము. గోపికల అభిప్రాయమున శ్రీకృష్ణ సంశ్లేషమే ఈ మార్గశీర్ష స్నానము. ఉపాయములలోకెల్ల శ్రేష్ఠమగు భగవానుని అనుభవమున అవగాహించుటయే మార్గశీర్షస్నానము.


ఈ రెండు విధములుగా చేయు ఈ వ్రతమునకు ఆవశ్యకములగు పరికరములను గోపికలు ఈ పాశురములో కోరుచున్నారు. బాహ్యముగా పెద్దలకై చేయు వ్రతమునకు కావలసిన పరికరములను అంతరంగమున తమ భగవదనుభూతికి కావలసిన సామగ్రిని కోరుచున్నారు.        


ఉపాయము, ఫలము _ రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు వానిని సుత్తించి, కీర్తించి ప్రసన్నుణ్ణి చేసుకొన్నారు. వ్రేపల్లెలోని పెద్దల కోరికమేరకు యీ మార్గ శీర్షవ్రతాన్ని వర్షాలు కురియటంకోసమే గోపికలు చేస్తున్నారు. పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురియటం.


 కానీ గోపికల వ్రతఫలం మాత్రం  శ్రీకృష్ణ సమాగమమే! మార్గశీర్ష స్నానమనగా __ నిరంతర శ్రీకృష్ణ సంశ్లేష ఆనందంలో మునకలు వేయటమే అని అర్ధం ఇలా చేసే యీ వ్రతానికి కావలసిన పరికరాలను గోపికలు యీ (ప్రాశురంలో) కోరుతున్నారు.   


*ॐॐॐॐॐॐॐॐॐॐ*  


 *అమృతవర్షిణి _ అదితాళము*


*ॐॐॐॐॐॐॐॐॐॐ*  


    ప....    ఆశ్రితవత్సల ! నీల శరీరా!

        ఆశ్రితులమురా! కృపజేయుమురా!


    అ..ప..    ఆశ్రయించితిమి వటపత్రశాయి!

        ఆశ్రితదాముల నవధరించరా!


1.     చ..    లోకములదరగ ఘోషించేడి నీ 

        శంఖపుసరి వాద్యముల నీయరా!

        మాకొసగిన ఘన వాద్య విశేషము        

        గైకొని మావ్రత మాచరించెదము


2.    చ...    మంగళముల నాలపించువారిని

        మంగళమౌ దీపమ్ము, ద్వజమ్మును

        మంగళకరమౌ వితానమ్మును

        సంగతితో మాకొసగు దేవరా!


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*శ్రీ కృష్ణుడి సామర్థ్యం*

*ఆండాళ్ తిరువడిగళే శరణం*  


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


ఈ రోజు మనవాళ్ళంతా శ్రీ కృష్ణుడి సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటున్నారు. తిరుప్పావైలో ఆండాళ్ తల్లి ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది.


అందులో మొదటగా *"శెయ్యాదన శెయ్యోం"* మన పూర్వులు చేయనివి చెయ్య కూడదు. ఈ మధ్యకాలంలో మనం సౌకర్యాలకని తెచ్చి పెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నాయో అనుభవిస్తున్నవారికి తెలుసు. ఇదివరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బ్రతి కేవారు మన పూర్వులు.


సౌకర్యం కోసం భౌతికమైనవి చెయ్యవచ్చు అవి మన స్వరూపాన్ని పాడు చేయనంత వరకు, ఇది గుర్తుంచుకోవాలి.  ఆత్మోజ్జీవన కోసం మాత్రం మా పూర్వులు ఆచరించనివి మేం ఆచరించం అని చెప్పింది. ఆపై *"మేలైయార్ శేయ్-వనగళ్"*  ఏవి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలి.


 మనం చేసేప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారిని ఎదురు చెప్పకుండా  *"నానే తాన్ ఆయిడుగ"* నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యంవైపు చెదరని స్థితిని ఆర్జించడం.


ఈ మూడు సూత్రాలతో ఆచరించింది ఆండాళ్ తల్లి. ఈ రోజు ఆండాళ్ తల్లి *"మేలైయార్ శేయ్-వనగళ్"* సూత్రాన్ని చెబుతుంది. పెద్దలు అన్నప్పుడు, కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు. అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగ్యం కాక పోవచ్చు. వేదంలో ఇవి తగును, ఇవి తగవు అనే నిర్ణయం చేయబడి ఉంది. వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు. ఇది ఒక నిరూపణ.  


స్వామిలోని ప్రేమను కనిపెట్టి *“మాలే మణివణ్ణా”* ఓ మణి మాణిక్యమా అంటూ పిలుస్తున్నారు. అయితే తన ప్రేమను కనిప్పెట్టేసారు, ఇక ఎక్కడ లోంగాల్సొస్తుందేమోనని స్వామి నాకు ఈ పేరు ఏం కొత్త కాదు, మా అమ్మ యశోదమ్మ  కూడా ఇలాగే పిలిచేది. అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి. *“మార్-గరి నీరాడువాన్”* మార్గశీర్ష స్నానం చేయటానికి మేం వచ్చామయా అని చెప్పారు. 


అయితే ఎవరు చెబితే చేస్తున్నారు అని అడిగాడు స్వామి. *“మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన”* మా పెద్దలు ఆచరించినది కాబట్టి మేం చేస్తున్నాం. దృఢమైన ప్రమాణం పట్టుకున్నారు.  అందులోనూ గోపికలు ఆచరించినది కదా, ఇక ప్రశ్నే లేదు. స్వామికి చాలా సంతోషం వేసింది తన ఆర్తితో వీళ్ళనంతా అట్టే చూస్తూ ఉండిపోయాడు. *“కేట్టియేల్”* వినబడుతుందా మేం అడిగినది అని అడిగారు.  


అయితే మీకు ఏం కావాలో ఒక్కొక్కటి చెప్పండి అని అడిగాడు స్వామి, వీళ్ళు ఒక్కొటి చెప్పడం ప్రారంభించారు. *“ఞాలత్తై యెల్లాం”* భూమినంతా  *“నడుంగ”* వణికించేట్టుగా *“మురల్వన”* ద్వని చేసేట్టి *“పాలన్న వణ్ణత్తు”* పాలవలే తెల్లగా స్వచ్చమైన కాంతి కల్గిన, *“ఉన్-పాంచజన్నియమే పోల్వన”*  నీ పాంచజన్యాన్ని పోలిన  *“శంగంగళ్”* శంఖాలు కావాలి అని అడిగారు. నీ పాంచజన్యాన్ని పోలిన  అని చెబుతున్నారు ఎందుకంటే, భగవంతునికి శంఖం, చక్రం ఈ అసాధారణ ఆయుధాలు ఉంటాయికదా.


ఈ మద్య కాలంలో ఎవరికి పడితే వారికి పెట్టేస్తున్నారు. అది చాలా తప్పు. శ్రీకృష్ణుడి కి సన్నిహితుడుగా ఉండే వాడు శ్రీ మాలికుడు, అయితే శ్రీకృష్ణుడి పేరుచెప్పుకొని కొంచం అల్లరి చిల్లరగా చేసేవాడు. కొంత కాలం అయ్యాక కృష్ణా నీ వద్ద ఉన్న సుదర్శన చక్రం కావాలయ్యా అని అడిగాడట.


ఇది ఇతరులకు లొంగి ఉండదు అని చెప్పి చూసాడు,  ఇక వినక పోయేసరికి ఇచ్చాడు, పాపం తనకు తెలియకుండానే తన తలను నరుక్కున్నాడు శ్రీమాలికుడు. శ్రీవెంకటాచలపతి చరిత్రలో ఒక కథ ఉంది. తిరుమల కొండపై కుమారస్వామి తపస్సుని అనుగ్రహించటానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమ శివుడు కూడా వేంచేసాడు.


అయితే పరమ శివుడికి  శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో, పరమ శివుడు అడిగాడట స్వామీ నేను ఈ కొండపై ఉంటాను అని, అయితే స్వామి ఈ ఆదిశేషుడిపై నీవు ఉండతగవు అని,  ఆదిశేషుడి తోక స్థానం కపిల తీర్థం వద్దకు పంపివేసాడు. అయితే ఆ చక్రాన్ని ఒకసారి అడిగిచూసాడట, ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేదికాదు, ఎవ్వరి మాట వినవు అని చెప్పాడట.  శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే. 


ఆనాడు యుద్దరంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందం వేసింది, కాని ధృతరాష్ట్ర సంతానానికి గుండెలు పగిలి పోయాయి, ఆ పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అని అడుగుతున్నారు. సాయుజ్యాన్ని కాంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిహిత్యం కావాలికదా, అందుకే మొట్ట మొదట ప్రణవార్థం ప్రకాశించవలెనని కోరుతున్నారు. శంఖాన్ని మనవాళ్ళు ఓంకారంతో పోలుస్తుంటారు.


ఆ ఓంకారం ఎలా ఉంటుంది అంటే దాన్ని అనుష్టించినప్పుడు మన దైన ఈ శరీరమనే భూమి ఒక్కసారి వణుకుతుంది,   ఇందులో ఉండే అపార్థములు తొలగుతాయి, జ్ఞానం ప్రకాశిస్తుంది. ఓంకారం ఏంచెబుతుందంటే  అకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందినవాణ్ణిగా అన్ని అవస్థలయందు వాడి సేవ చేయవలె.  ఇదే శేషత్వాన్ని తెలుపుతుంది. తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అడుగుతున్నారు, ఇది ఇవ్వడం కష్టం అని అను కున్నాడు స్వామి, సరేలే ఇంకా ఏమేమి కావాలో ఒకేసారి చెప్పండి అని కృష్ణుడు అడిగాడు. 


మాకు ఇంకా *“పోయ్ ప్పాడుడైయనవే శాలప్పెరుం పఱైయే”* శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి, ఇంకా *“పల్లాండిశైప్పారే”* పల్లాండు పాడేవారు కావాలి, ఇంకా *“కోలవిళక్కే”* ఆరని నిలువు దీపం కావాలి. గోష్టితో వెళ్ళేప్పుడు మంగళకరంగా ఒక దీపం ఉండాలి కదా అందుకు, ఇంకా మేం ఉన్నట్లు తెలిసేలా *“కొడియే”* ద్వజం కావాలి, ఇంకా *“వితానమే”* మంచు పడకుండా గొడుగు కావాలి అని అడిగారు. మీరు అడిగినవి ఒక్కోటి ఇవ్వడం కష్టం అని చెప్పేసాడు శ్రీకృష్ణుడు.


ఎమయ్యా నీవెవరవో మాకు తెలియదని అనుకున్నావా, *“ఆలిన్-ఇలైయాయ్”* అన్నిలోకాలను నీ పొట్టలో పెట్టుకొని అప్పుడప్పుడే వికసించిన వటదళం పై శయనించగలిగావు, తిరిగి ఇన్ని లోకాలను బయటికి తేగలిగావు, మేం అడిగినవి ఇవ్వలేవా నీ సామర్థ్యం ఏంటో మాకు తెలుసు, నీవు అనుకుంటే జరగనిదిలేదు, నీవు వద్దు అనుకుంటే జరిగేది ఏమిలేదు అంతా  *“యరుళ్”* నీ దయ అని స్వామిని కోరారు. 


ఇక వీళ్ళకు ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊర్లో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు, తన దగ్గర ఉన్న కొంబుబూర ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళు ఆనందించారు. ఇక వాయిద్యం తను వెన్న తినేప్పుడు చేసే ఘట నృత్యం అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు. ఇక పల్లాండుకు, రాబోయే కాలంలో రామానుజ సంపర్కంచే ఏర్పడే భక్త గోష్టికి మంగళం పాడిన నమ్మాళ్వార్ ను పంపాడు. ఇక ఆరని దీపం అడిగారు కదా అమ్మను వీళ్ళతో పంపాడు, ఇక ద్వజానికి గుర్తుగా గరుత్మంతుడిని పంపాడు. గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళడు కనక, తాను ధరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళకు అదే చాలు.


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*తిరుప్పావై  26వ పాశురము/ అనువాద పద్యం* 

*రచన* 

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు* *మిట్టాపల్లి* 

*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*సీ. మా మాటను వినుమా మామీద దయలేద*

      *భక్త వత్సలుడని వచ్చినాము*

*మార్గళి స్నానంబు మానోము చేయగా*

         *మాకు కావలసిన మాన్యుడవని*

*మహేంద్ర మణిమూర్తి మహిమలు తెలియక*

      *ఆలకింతు వనుచు యడిగినాము*

*పాల వన్నియ నున్న పాంచజన్యపు ద్వని*

          *ధరణి యందున నిండి దద్దరిల్లె*

*ప్రబలమైన బహుళ పరవాద్య పటహంబ*

          *ను గ్రహింతు వంచును నోము మెచ్చి*

*ఆశ్రయించిన వార్కి యాశ్రయ మిచ్చెడు*

       *ఆశ్రిత వాత్సల్యుడంచు తలచి*

*వ్యామోహవంతులై ధ్యానమంతయు నిల్పి*

         *వచ్చు గోపిక లెల్ల వదల లేక!!*


 *తే.గీ. సర్వ జగములు నీవల్ల సాగుననుచు*

*పార తంత్రపు జ్ఞానులై భక్తితోడ*

*వ్రతము సల్పిరి దాసులై పద్మనాభ*

*యనుచు శేషత్వ జ్ఞానులై యరిగినారు*

*శ్రద్ధ భక్తిని కల్గించి బుద్ధి నిమ్ము* 

*శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!*


🕉🌞🌎🌙🌟