ఓం శ్రీ మాత్రేనమః
ఓం శ్రీ గురుభ్యోనమః
7-01-25
విద్యార్థినులూ - వేదనలూ (42)
(హితోక్తి)
డా.రఘుపతి శాస్త్రుల
కం.బాలిక లుండు నివాసము
లాలయముల వోలె సేవలలరుచునుండన్
పాలకులు చూడగా వలె
పాలసులను చేరదీయ వర్ధిల్లుదురే?
(పాలసులు=దుర్మార్గులు)
చ.చదువుల నొందు కోసమనిశమ్మును వేదనలన్ భరింప నె
మ్మది దృఢ నిశ్చయమ్మున ప్రమాదములన్ గనలేక నమ్మక
మ్మొదవెడు మాటలన్ వినియు నుల్లములందున సంతసించు వా
రెదను సహింప గల్గుదురె హీనులు చేయు దురాగతమ్ములన్
(ఎద=మనస్సులో-దురాగతము=దుర్మార్గపు పనులను)
కం.మోసములను జేసి తమ వి
లాసములను గనగనెంచు రాబందులకున్
దోసములవి కనిపించునె
గాసిల జేయుటలె వారి కర్తవ్యములౌ!
(గాసిల జేయు=బాధపెట్టడం)
క.దుష్టుల కండగ నిలుచుచు
ఇష్టారాజ్యముగ మసలు హీనులకట నా
భ్రష్టులకు శిక్షలుండవొ
శిష్టులకే యిడుదురేమొ శీల పరీక్షల్!
క.మానినులకు బ్రతుకున నభి
మానము, మానములె, సిరులు మాన్యములగునౌ
ప్రాణము కన్నను మిన్నగ
మానమునే ఎంచు చుంద్రు మనుగడ కొరకై
(మానిని=స్త్రీ-మానము=గౌరవము-
మాన్యము=గౌరవ సంపద)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి