🙏నవ వ్యాకరణాలు🙏
సంస్కృత భాషకు ఉన్న తొమ్మిది వ్యాకరణములు వరుసగా:
ఐంద్రము, చంద్రము, కాశకృత్స్నము, కౌమారము, శాకటా యనము, సారస్వతము, ఆపిశలము, శాకలము, పాణినీయము.
అప్పటికే లభ్యమౌతున్న అసమగ్రంగా వున్న వ్యాకరణాలను సమీక్షించి మొట్టమొదటిసారిగా పాణిని సమగ్రమైన వ్యాకరణాన్ని తయారుచేశాడు. పాణిని రచించిన ఆ అష్టాధ్యాయి అనే వ్యాకరణానికి వరరుచిముని అనుబంధ సూ(త్రములను (వార్తికములను), పతంజలిముని మహాభాష్యమును రచించి పుష్టిని చేకూర్చారు. పాణిని అష్టాధ్యాయినిని తోసి రాజని అనగల స్థాయిలో మరొక వ్యాకరణమేదీ ఇంతవరకూ రాలేదు. 'సిద్ధాంత కౌముది' మంచి ఆదరణ పొందినప్పటికీ అది ఒక రకంగా పాణిని వ్యాకరణాన్ని మరో విధంగా చెప్పడం మాత్రమే. (బిందెలో ఉన్న నీటిని కూజాలో పోసినట్లు. ఆకారం వేరుగా ఉన్నట్లు కనిపిస్తున్నా ద్రవ్యం మాత్రం అదే! అని వ్యాఖ్యానించారు కొంతమంది.)
నవవ్యాకరణముల సూచీని కొన్నిచోట్ల ఈ క్రిందివిదాలుగా కూడా చెప్పడం జరిగింది.
1 పాణినీయము, 2 కలాపము, 3 సుపద్మము, 4 సారస్వతము, 5 ప్రాతిశాఖ్య (కుమారవ్యాకరణము), 6 ఐంద్రము 7 వ్యాఘ్రభాతికము, 8 శాకటాయనము, 9 శాకల్యము.
1. శాక్త వ్యాకరణము, 2. శంభు వ్యాకరణము, 3. కుమార వ్యాకరణము, 4. ఇంద్ర వ్యాకరణము, 5. సూర్య వ్యాకరణము, 6. చంద్ర వ్యాకరణము, 7. స్మర వ్యాకరణము, 8. వాత్స్యాయన వ్యాకరణము, 9. అగస్త్య వ్యాకరణము.
హనుమంతుడు సూర్యుని నుండి నవవ్యాకరణములు నేర్చుకున్నాడని హనుమత్చరిత్రలో కనిపిస్తుంది. అయితే ఆ నవ వ్యాకరణములు ఏవి అనేదానిలో స్పష్టత లేదు.
ఈ వ్యాకరణాలలో కనిపించే ఇంద్ర, శంభు, కుమార, సూర్య, చంద్ర వంటి దేవతల పేర్లులా కనిపించేవి పాణిని కంటే ముందు తరాలలోను మరియు సమకాలికులుగాను జీవించిన వ్యాకరణ కర్తల పేర్లు మాత్రమే. కాబట్టి హనుమంతుడు వీటిని చదివాడు అని చెప్పడానికి వీలు లేదు.
నూనం వ్యాకరణం కృత్స్నమనేన బహుధా శ్రుతమ్
బహు వ్యాహరతానేన న కిఞ్చిదపశబ్దితమ్ ৷৷
అంజనేయునికి వ్యాకరణంలోని సర్వ విషయాలు తెలుసునని వాల్మీకి రామాయణంలో సాక్షాత్తు రాముడే చెప్పివున్నాడు కాబట్టి, రచయితలు తమ తమ ఎరుకకు వచ్చిన తొమ్మది వ్యాకరణాల పేర్లను చేర్చి హనుమంతుడు 'నవ వ్యాకరణ పండితుడు' అని వ్రాయడం జరిగింది.
అతిప్రాచీనకాలములోనే ఐంద్రవ్యాకరణము, ఇతర వ్యాకరణములు లోపించిపోగా మనకు పాణిని, ఆ తరువాత వ్యాయబడిన వ్యాకరణములు మాత్రమే లబిస్తున్నాయి. అందుచేత ఆధునిక కాలంలో ఆ నవ వ్యాకరణములు చదివినవారు ఉండే అవకాశం లేదు.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ