🙏తెలుగు భాషానిర్వచనం -చరిత్ర🙏
మొదటి భాగం
స్పష్టమైన ఉచ్చారణ గల భాష తెలుగు. కారణం అజంత భాష కాబట్టి.తేనెలొలుకు తీయని భాష తెలుగు.అందువలననే పాశ్చాత్యులు కూడా కొనియాడారు. సంగీతానికి అనువైన భాష తెలుగు మాత్రమే అన్నా ఆశ్చర్యం లేదు.అంత గొప్ప భాష పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుందాం. భాష అంటే ఏమిటి? ఆవిర్భావం ఎల్లా జరిగింది స్థూలంగా పరిశీలిద్దాం.
ఇండో-యూరోపియన్ భాషలకు పూర్తి భిన్నంగా ఉన్న దక్షిణాది ప్రాంత భాషలు వేరే కుటుంబానికి చెందినవని మొదట గుర్తించి.. ఆ భాషా కుటుంబానికి 'ద్రవిడియన్' అని పేరు పెట్టిన భాషాశాస్త్రవేత్త రాబర్ట్ కాల్డ్‌వెల్.
ఆ తర్వాత.. రాబర్ట్ కాల్డ్‌వెల్ 12 ద్రవిడ భాషలను పోల్చుతూ ద్రవిడ భాషల మీద మొట్టమొదటి విప్లవాత్మక పరిశోధనను 1856లో ప్రచురించారు. దక్షిణాది వారిని, వారి భాషలను - ముఖ్యంగా తమిళులను - సంస్కృత భాషా పరిశోధకులు 'ద్రవిడ' అనే పదంతో ఉటంకించేవారని.. ఆ పదాన్నే దక్షిణ ప్రాంత భాషా కుటుంబానికి పేరు పెట్టటానికి ఉపయోగించానని ఆయన వివరించారు.
ద్రవిడ భాషల మీద శాస్త్రీయ పరిశోధన చేసిన వారిలో తెలుగువాడైన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ప్రముఖులు. ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. ద్రవిడ భాషాశాస్త్ర పరిశోధనలో ఆయన రాసిన ‘ద ద్రవిడియన్ లాంగ్వేజెస్’ను ఉద్గ్రంధంగా పరిగణిస్తారు. భారతీయ భాషలను ఈ భాషాపరిశోధనల ఆధారంగా వివిధ కుటుంబాలుగా వర్గీకరించారు.ఇది ద్రావిడ శబ్ద పరిచయం.
మనసులోని భావనను బహిర్గతపరచే సాధనం భాష. స్పష్టమైన ఉఛ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేట్లు చెప్పగలగడమే భాషకు నిర్వచనం.( కొన్నిధ్వనుల సముదాయం భాష అని కూడా నిర్వచనం ఉంది )భాషకు మాటలతో అవసరం లేదు. సైగల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా భాషే అవుతుంది. ఐతే మానవ జాతి ఆవిర్భావం నాటికీ, ఆధునిక మానవుని ఆవిర్భావం నాటికీ మనిషి అవసరాలలో పెరిగిన మార్పులు, అభిప్రాయ వ్యక్తీకరణలో చోటుచేసుకున్న ఉత్సాహం, ఉత్సుకత, భావోద్వేగాల సమ్మేళనం మాటల ఆవిర్భావానికి కారణభూతమయింది. విశ్వావిర్భావ క్రమంలో ఇదో అద్భుతం. భాష పుట్టకముందున్న మనిషి మనుగడకీ,భాషల ఏర్పాటు తర్వాత మనిషి మనుగడకీ చేతల్లో కొలవలేనంత వ్యత్యాసముంది. అది ఆధునిక మానవునిచే అత్యద్భుత విన్యాసాలు చేయించింది. సరికొత్త ప్రపంచం ఏర్పాటుకు కారణమయ్యింది.మనిషి రూపంలో కూడా అంతే కనబడుతుంది. ఆదిమ మానవ రూపం ఆధునిక మానవుని రూపం ఎంత వ్యత్యాసం ఉంది,?
నియాండర్తల్ మానవుడు, క్రొమాన్యూన్ గుహల్లో ఉన్న మానవుడు ఎలావున్నాడు? ఇది అద్భుతమైన పరిణామం ఆదిమ మానవుని భుజముల మధ్య తల కూరుకుపోయి ఉండేది మెడ భాగం దాదాపు లేనట్లే తలను ప్రక్కకు త్రిప్పలేడు మనిషి పూర్తిగా ప్రక్కకు తిరగాలి చేతి వ్రేళ్ళ మధ్య వ్యవధానం కూడా బాగా తక్కువ ( ఆ చరిత్ర ఇక్కడ వ్రాయలేను చాలా విస్తార విషయం.సమయం చూసుకొని ప్రత్యేకంగా వ్యాసం వ్రాస్తాను ఇది చరిత్ర + సైన్స్ )
భాష ఎలా పుట్టిందనడానికి సరియైన నిర్వచనం లేదు. సమగ్రమైన సిద్ధాంతం కూడా లేదు. కాని ప్రపంచంలో ఇప్పటివరకు దాదాపు 2900 భాషల వరకు ఉన్నాయి. ఒక్క భారతదేశంలోనే 200 వరకు భాషలున్నాయి. వాటిలో ఉత్తర భారత దేశంలోని భాషలను ఆర్య భాషలనీ, దక్షిణ భారతదేశంలోని భాషలను ద్రావిడ భాషలనీ అంటారు.
తెలుగు భాష ఆవిర్భావము
సంస్కృత త్రిలింగ శబ్దభవమైన ప్రాకృత తిరిలింగ నుండి లేదా సంస్కృత త్రికళింగ శబ్దభవమైన తి అలింగ (ప్రాకృతం) పదం నుండిగానీ లేదా రెండు విధాలుగానూ వచ్చి ఏకరూపతనొందడంవలన కాని “తెలుగు” శబ్దం ఏర్పడి ఉండవచ్చని గంటి జోగి సొమయాజి గారు తెలిపారు. “తెలుగు” దిగ్వాచి అని వీరు నిరూపించారు. తెలుగు శబ్దమునుండి తెనుగు శబ్దంగాని, తెనుగు శబ్దం నుంది తెలుగు శబ్దం గానీ ఏర్పడి ఉండవచ్చని భాషా వికాసకర్తలు తెలిపారు.ఇందులో తెనుగు ప్రాచీనం తరువాత తెలుగు వచ్చింది మునుగు --- ములుగు అయినట్లు తెనుగు -- తెలుగు అయింది ఇలాగని కొంత మంది భాషా శాస్త్రవేత్తలు సిద్ధాంతీకారించారు.
“తలైంగు” జాతి వారి భాష కాబట్టి తెలుంగు అని కొందరి అభిప్రాయం. “తలైంగు” అంటే తల స్థానాన్ని ఆక్రమించినవారు అనగా నాయకులు అని అర్థం.
“తెలుంగు” అంటే తెల్లగా, స్పష్టంగా ఉండే భాష అని మరో భావన ఉంది. “తెన్ను” అంటే దారి కాబట్టి తెనుంగు అంటే దారిలో ఉండే వారి భాష; దారి అంటే ఆర్యులు దక్షిణాపథం అని వ్యవహరించే ప్రాంతం.
“తెన్” నుంచి తెనుగు వచ్చిందని కొందరి అభిప్రాయం. “తెన్” అంటే దక్షిణ దిక్కు. దక్షిణ ప్రాంతానికి చెందిన భాష కాబట్టి “తెనుగు” అయ్యిందని ఎక్కువమంది అంగీకరిస్తున్నారు.
ఐతే “త్రినగ” నుంచి తెనుగు ఏర్పడిందని మరికొందరంటారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, మహేంద్రగిరి అనే మూదు కొండలు గల ప్రదేశంగా “త్రినగ” శబ్దం ఏర్పడిందంటారు.
మరికొందరు మన ప్రాంతనికి పూర్వం త్రిలింగ దేశం అనే పేరుండేదనీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, దక్షారామం అనే మూడు పుణ్య క్షేత్రాల్లో గల మూడు శివ లింగాల ఆధారంగా త్రిలింగ-తి అలింగ-తెలింగ, తెలుగు అయ్యిందని చెబుతారు.
విద్యానాధుడు అను సంస్కృత కవి మొట్టమొదటిసారిగా “త్రిలింగ” పదాన్ని వాడారు. త్రికళింగ నుంచి తెలుగు పదం వచ్చిందని చిలుకూరి నారాయణరావు గారు అనగా తేనె + అగు = తెనుగు అని గ్రియర్సన్, తలైంగ్ జాతినుంచి తెలుగు ఏర్పడిందని ఖండవల్లి లక్ష్మీరంజనం, తెలుగు శబ్దమే త్రిలింగగా సంస్కృతీకరణకు లోనైందని కొమర్రాజు లక్ష్మణరావు పేర్కొన్నారు. తెళ్+గు = తెలుగు అనే అభిప్రాయం కూడా ఉంది. నన్నెచోడుడు, పాల్కురికి సోమనలు తెనుగును భాషాపరంగా వాడారు.
ఐతే తెలుగు శబ్దం తెనుగు శబ్దానికి రూపాంతరమే అనీ ఈ తెలుగు శబ్దం త్రిలింగ లేదా త్రికళింగ శబ్ద భాగం కాదనీ జి.ఎన్. రెడ్డి నిరూపించారు.
పొర్చుగీసు వాళ్ళు 16, 17 శతాబ్దాలలో హిందువును జెంతూ అని పిలిచేవారు. జెంతూ అంటే అన్య మతస్థుడు. అంటే క్రైస్తవేతరుడు అని అర్ధం. మొట్టమొదట్లో వీళ్ళ వ్యాపారాలు ఎక్కువగా తెలుగువాళ్ళతోనే జరిగేవి కాబట్టి జెంతూలంటే తెలుగు వారు అని స్థిరపడిపోయింది. తెలుగుభాషను వాళ్ళు జెంతూ భాష అని పిలిచేవారు. తమిళ, కన్నడ పుస్తకాల్లోనూ, శాశనాల్లోనూ “వడుగ”, “వడగ”, “తెలింగ”, తెలుంగు” అనే విధంగా పేర్లు కనిపిస్తాయి. ఐతే ఎక్కువగా వాడే పేర్లు మాత్రం ఆంధ్ర, తెలుగు, తెనుగు.
క్రీ.శ. 1వ శతాబ్దం నాటి శాతవాహన రాజైన హాలుని “గాధా సప్తశతిలో తెలుగు పదాలున్నాయి. కాబట్టి 1వ శతాబ్దం నాటికే తెలుగు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తెలుగు భాషకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. నన్నయకు ముందు వెయ్యి సంవత్సరాలనాటికే తెలుగు ఒక స్వతంత్ర భాషగా విరాజిల్లిందనడానికి శాసనాధారాలున్నాయి. ఐతే నన్నయ ఆ వ్యవహార భాషను సంస్కరించి తెలుగు భాషకు ఓ రూపాన్ని ఇవ్వగలిగాడు.
భారతదేశంలోని అతిప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి. భారత ప్రభుత్వం తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడం భాషలకు 2008లో “ప్రాచీన భాష” హోదానిచ్చి గౌరవించింది.
ఆంధ్రప్రదేశ్ తరవాత తెలుగువాళ్లు ఎక్కువగా యానాం (పుదుచ్చేరి), తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిసా, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లోనూ కనిపిస్తారు. తెలుగు మాతృభాషగా కలిగున్నవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. తెలుగువాళ్లు ప్రపంచంలోని ఏ దేశానికెళ్లినా కనిపిస్తారనడం అతిశయోక్తి కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఎనిమిదన్నర కోట్ల జనాభాతో తెలుగు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో (హిందీ, బెంగాలీల తరవాత) మూడో స్థానంలోనూ, ప్రపంచవ్యాప్తంగా పదిహేనో స్థానంలోనూ నిలిచింది.
తెలుగు ద్రావిడ భాష. ద్రావిడ భాషావర్గంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, గోండీ మొదలైన 85 భాషలుండగా, అత్యధికంగా మాట్లాడుతున్న ద్రావిడభాష తెలుగే. తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టిందనీ, తెలుగుకు మాతృక సంస్కృతమేననీ జనబాహుళ్యంలో బలమైన అపోహ ఉన్నది. కానీ సంస్కృతం, హిందీ, బెంగాలీ మొదలైన ఉత్తర భారతదేశ భాషలు “ఇండో-ఆర్యన్” భాషావర్గానికి చెందినవి కాగా, దక్షిణ భారతదేశ భాషలు ద్రావిడ భాషలనీ భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం. తెలుగుతో పాటు ప్రస్తుతం ఉనికిలో ఉన్న ద్రావిడభాషలన్నీ ఒకే మూలద్రావిడ మాతృక నుంచి క్రమంగా విడివడి, వేరువేరుగా స్థిరపడ్డాయని పరిశోధకుల అంచనా.
తెలుగు అనే పదం ఎలా ఏర్పడిందనే విషయంపై మనకు విభిన్న వాదనలు తెలుకున్నాము . ప్రసిద్ధ శైవక్షేత్రాలైన కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం క్షేత్రాల మధ్యనున్న ప్రాంతాన్ని “త్రిలింగ” ప్రాంతమని పిలిచేవారనీ, త్రిలింగ పదం నుంచే తెలింగ, తెలుంగు, తెలుగు అనే పదాలు క్రమంగా వచ్చాయని ఒక వాదన ఉన్నది. కాబట్టి తెలుగువారు కృష్ణా, గోదావరి నదుల మధ్యనున్న ప్రాంతంలో నివసించేవారని చెప్పవచ్చు.
తమిళం, గోండీ భాషల్లో తెలు, తెలి అంటే తెలుపు లేదా చక్కదనం, “ంగ” అనేది బహువచన సూచకం. ఆవిధంగా చక్కనివారు, తెల్లనివారు అనే అర్ధంలో తెలింగ, తెలుంగ అనే పదాలు ఉద్భవించాయని మరో వాదన. తమిళనాడులోనూ, కేరళంలోనూ ఇప్పటికీ తెలుగును “తెలుంగు” అనే పిలవడం మనం గమనించవచ్చు.
భాషాశాస్త్రవేత్తల అంచనా మేరకు తెలుగు భాష కనీసం 2,400 సంవత్సరాల పూర్వం మూలద్రావిడ భాష నుంచి వేరుపడి ప్రత్యేకభాషగా స్థిరపడింది. క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజుల పాలనలో రచించిన “గాధాసప్తశతి” అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్యసంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. తెలుగు పదాలు లిఖితరూపంలో దొరికిన ఆనవాళ్లలో ఇదే ప్రాచీనమైనది. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి శిలాశాసనం క్రీ.శ. ఏడవ శతాబ్దానికి చెందినది. తెలుగు భాష చరిత్ర క్రీ.శ. పదకొండో శతాబ్దం నుండి గ్రంధస్థం చెయ్యబడింది
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ