7, జనవరి 2025, మంగళవారం

విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (12)*


*వసుర్వసుమనాః సత్యః*

*సమాత్మాసమ్మితః సమః ।*


*అమోఘః పుణ్డరీకాక్షో*

*వృషకర్మా వృషాకృతిః ॥* 


*ప్రతి పదార్థం:~*


*105) వసుః - సర్వ భూతములయందు వశించువాడు; సమస్త భూతములు తనయందు గలవాడు;*


*106) వసుమనాః - పరిశుద్ధమైన మనస్సు గలవాడు.*


*107) సత్యః - సత్య స్వరూపుడు, నిజమైనది, మూడు కాలములలో నుండునది, నాశనము లేనిది;*


*108) సమాత్మా - సర్వప్రాణుల యందు సమముగా వర్తించువాడు.*


*109) సమ్మితః - భక్తులకు చేరువై భక్తాధీనుడైనవాడు.*


(అసమ్మితః ---

పరిచ్చేదింపబడజాలనివాడు;

అంత్యము, హద్దు లేనివాడు)


*110) సమః - అన్నింటియందును సమభావముగలవాడు;*


*111) అమోఘః - భక్తుల స్తుతులను ఆలకించి ఫలముల నొసగువాడు.*


*112) పుణ్డరీకాక్షః - పద్మనయునుడు, తామరపూవు వంటి కన్నులు గలవాడు;*


*113) వృషకర్మా - ధర్మకార్యములు నిర్వర్తించువాడు.*


*114) వృషాకృతిః -ధర్మమే తన స్వరూపముగా గలవాడు, మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు*


*తాత్పర్యం :~*

 

*సమస్త భూతములును తనయందే గలవాడును. శ్రేష్ఠమైన మనసు కలవాడును, సర్వ కాలములందు వుండువాడును. నాశ రహితుడును, వికార రహితుడై అన్నిటి యందును సముడై యున్నవాడును, తామరపువ్వు వంటి నేత్రములు కలవాడును, ధర్మమే ఆకారముగా కలవాడును. మూర్తీభవించిన ధర్మస్వరూపుడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*(ఏరోజుకా రోజు ఇచ్చిన శ్లోకం  కంఠస్థం వచ్చేదాకా మననం చేద్దాం)*


*సూచన: కృత్తిక నక్షత్రం 4వ పాదం జాతకులు పై 12వ శ్లోకమును నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు సకల శుభాలను పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

తిరుప్పావై 23 వ పాశురము

 తిరుప్పావై  23 వ పాశురము

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🍃🌷పాశురము:


మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం 

శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు

వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి

మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు 

పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా  ఉన్ 

కోయిల్ నిన్ఱు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ

శీరియ శింగాశనత్తిరుందు యాం వంద

కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్


⚜️🌷⚜️🌷⚜️🌷⚜️🌷⚜️🌷⚜️


ఈ రోజు ఆండాళ్ ఒక సింహం తన గుహలోంచి బయలుదేరి ఎట్లా వస్తుంది అనే అద్భుత వర్ణన ఈ నాటి పాటలో చేస్తుంది, అందుకే ప్రకృతి గురించి అధ్యయనం చేయాలన్నా తిరుప్పావై చదవాలి, సాహిత్యం తెలియాలంటే తిరుప్పావై లోకి రావాలి, ఉపమానోపమేయాల గురించి తెలియాలంటే తిరుప్పావై చదవాలి, ఇక ఇదీ అదీ అని నియమం లేదు అన్నట్లుగా సవాలు విసురుతుంది తిరుప్పావై. అన్నింటికి ఇది మూలం ఇక్కడి నుండే బయటకు వచ్చినవి మాత్రం మనకు సాక్షాత్కరిస్తుంది అని చెప్పవచ్చు.  


ఈ రోజు అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పే పాశురం. భగవంతుణ్ణి చేరే వరకే శాస్త్రం, ఇక చేరిన తర్వాత ఇక శాస్త్రానికి ప్రాదాన్యం లేదు. లోకంలో మనకు తెలుసు ఎలగైతే వివాహం జరిగే వరకే శాస్త్రం ఇకపై శాస్త్రాలు వర్తించవు ఇరువురి ప్రేమ విషయంలో అట్లానే భగవంతుణ్ణి  చేరే వరకు ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో రకాల పరిక్షలు ఉంటాయి. ఇక భగవంతుణ్ణి సన్నిధానానికి చేరాక ఇక  భగవంతుడు భక్తుల పట్ల సర్వాత్మనా చెందే ఉంటూ తను వాళ్ళు ఆదేశించినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు.


ఈ విషయాన్ని మనం రామాయణంలో గమనించవచ్చు. రాముడు విభీషనుణ్ణి అనుగ్రహించాల్సి వచ్చింది. మొడట తన అభిప్రాయం చెప్పడం లక్ష్మణ, సుగ్రీవాదులను ఒప్పించటం, తరువాత సుగ్రీవుణ్ణి పంపి విభీషనుణ్ణి రప్పించటం ఒక పెద్ద ప్రక్రియ సాగింది. “లొచనాభ్యాం పిభన్నివ” అంటూ ఒక కంటి చూపుతో తను విభీషనునికి రక్షణ ఇవ్వటంలో జరిగిన కాల విలంబనని తెలుపుతూ దగ్గరకు తీసుకున్నాడు. అలాగే మనవాళ్ళంతా స్వామి సన్నిధానానికి చేరగానే స్వామి తన స్వతంత్రాన్ని పక్కకు పెట్టాడు. శరణు అంటూ వచ్చిన విభీషనుడికి రాముడే దాసుడై విభీషనుడు చెప్పినట్లూ చేసాడు. విభీషనుడు రాముడిని చేరటానికి శరణాగతే మార్గం అయ్యినందున, అదే మార్గం రాముడికీ చెప్పాడు. సముద్రుడికి శరణాగతి చేయ్యటం ఆ సముద్రుడు అర్హుడా కాడా కూడా చూడలేదు రాముడు. ఇదీ స్వామి తత్వం భక్తుల విషయంలో. తన స్వతంత్రాన్ని పక్కన పెట్టేస్తాడు. 


అందుకే మన వాళ్ళు నిన్న స్వామిని ఎట్లా కళ్ళు తెరియాలో ఆదేశించారు. ఈ రోజు పాటలో గోదాదేవి స్వామిని లేచి, క్రమంగా నడచి వచ్చి సింహాసనం పై కూర్చోని తమ మొరలని ఆలకించమని ప్రార్థిస్తుంది. “క్కోప్పుడైయ శీరియ శింగాశనత్తిరుందు” నీకు తగిన అద్భుతమైన సింహాసనం ఉంది, దానిపై కూర్చుని ఉంటే మేం అడిగినవి తప్పక ప్రసాదిస్తావు,  దానిపై నీవు కూర్చొంటే “యాం వంద కారియం ఆరాయ్-అందరుళ్” మెం ఒక కార్యార్తులమై వచ్చాం, మేం ఎం చేయదల్చుకున్నామో తెలుసుకొని మేం ఎట్లా చెయ్యలో మాకు తెలుపు. 


ఈ ప్రక్రియలో భాగంగా గోదాదేవి స్వామిని ఎట్లా లేచిరమ్మని చెబుతుంది అనేది ఒక అద్భుతమైన వర్ణన. గోదాదేవి యొక్క తిరుప్పావై కొన్నింటిని తనతో పాటు సమానంగా తీసుకొని వస్తుంది. అందులో ఒకటి పై పై కి కనిపించే కృష్ణ-గోపికల కథ. రెండవది తిరుప్పావై సారాంశమే వేదం కనుక తత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి జరిగే ప్రక్రియ ఏమిటి అనేది చెబుతుంది. ఇక మూడవది మనం భగవంతుణ్ణి చూసే స్థానానికి వెళ్ళేప్పుడు మనల్ని మనం ఎట్లా సిద్దం చేసుకొని వెళ్ళవలె అనేది తెలుపుతుంది. భగవంతుణ్ణి ఈ ప్రకృతి మండలాల్లో చూడగలిగే స్థానం విగ్రహా రూపకంలోనే కదా, అది మన ఇంట్లో ఆరాధన చేసుకొనే విగ్రహం ఐనా కావచ్చు లేక ఆలయాల్లో ఉన్న అర్చా మూర్తి ఐనా కావచ్చు. అప్పుడప్పుడు మన ఆలయాల్లో భగవంతుడు బయటికి వస్తూ ఉండే ఆ పద్దతి ఏంటి, ఇక నాలుగవది శ్రీకృష్ణుడు తన భవనంలోంచి ఎట్లా రావాలి ఇవన్నీ తెలుపుతు వస్తుంది ఆండాల్ తల్లి.


ఇక స్వామి ఎలా రావాలో చెబుతూ వానా కాలంలో కొండ గుహల్లో నిదురించే సింహం తనంతట తాను మేలుకాంచి బయటికి వచ్చే ప్రక్రియ ఎట్లా ఉంటుంది అనేది వర్ణిస్తుంది. “మారి” వానాకాలం అనగానే విడిగా ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తుంది, కలిసిన వారికి ఆనందాన్ని ఇస్తుంది, వైరాలని మరిపిస్తుంది. యుద్దాలు చేసేవారు కూడా వానా కాలంలో ఆపేస్తారుకదా. సుగ్రీవుడు రాజ్య సుఖాలతో హాయిగా ఉంటే, రాముడు మాల్యాద్రి పర్వతం పై ఉండి తనకు జరిగిన సీతా విరహాన్నీ లక్ష్మణ స్వామికి విన్నపించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం కూడా ఒక వానాకాలంలోనే ఉన్నాం మరొక వానా కాలం కోసం ప్రతిక్షిస్తున్నాం.  ఏ వానా కాలంలో ఉన్నాం అంటే రక రకాల దుఃఖాలను సంతతమూ వర్షించే ఈ భూమి పై ఉన్నాం కదా “బహుదా సంతత దుఖ:వర్శిని  బవ దుర్దినే అద:స్కలితం” అంటారు మన యామునాచార్యులవారు.  


ఈ సంసారం అనే అరణ్యంలో దారి తప్పి సంచరిస్తున్నాం, “అవివేక ఘన అంద ద్విగ్ముఖే”అవివేకం అనే కారు మబ్బులు జ్ఞానమనే సూర్యున్ని కప్పుకొని దారి తప్పి పోయాం. వివేకం అంటే విడదీసి బ్రతకటం, దేన్ని విడదీసి అంటే ఆత్మను మరియూ శరీరాన్ని వేరుగా చూసి బ్రతకడం, ఇలా బ్రతకక పోవడమే అవివేకం, దీనివల్ల నిరంతరం దుఃఖం వర్షింస్తుంది, సూర్యుడు కనిపించడం లేదు. మనలోని అజ్ఞానం మనల్ని ఎప్పటికి వదిలి ఉండని అచ్యుత భానున్ని కనిపించకుండా చేస్తుంది. మరి ఆ మబ్బుల్ని మన అంతట మనం తొలగించుకోగలమా, లేదు కదా, మరి ఆ సూర్యుడే తనంతట తాను మనకు కనిపించే ప్రయత్నం చేయాలే తప్ప మనం ఆయనను చూడలేం. అందుకే “మాం అవలోకయా అచ్యుత” అని ప్రార్థిస్తారు. నేను నిన్ను చూడలేను, నీవే ఆటంకాలు తొలగించు. అలా  ప్రార్థిస్తూ మరొక వాన కావాలని మన పూర్వులు కోరుతున్నారు, అదేంటంటే ....


“త్వదీక్షణ సుదా సింధు విక్షేప పసీకరైహి|

కారుణ్య మారుతా నీతైహి శీతలైహి అభిషించమాం||”


"హే భగవన్! నీ చూపులే సాగరాలు, అందులో కారుణ్యం అనే గాలులు వీస్తుంటాయి, ఆ గాలుల వల్ల సముద్ర జలాలు గాలిలో  తేలుతూ ఒడ్డున ఉండే వారికి సోకి ఎంతటి ఆహ్లాదాన్ని ఇస్తాయో అలాగే నీ చల్లని నేత్రాల ద్వారా నీదయని కురిపించి ముంచెత్తు".   ఈ వానను కోరుకుంటున్నారు. 


అలాంటి వానాకాలంలో “మలై మురైంజిల్” పర్వతపు గుహల్లో “మన్ని క్కిడందుఱంగుం” మన్నికగా కాల్లు ముడుచుకొని పడుకొని నిదురించే “శీరియ శింగం” నిద్రలో కూడా పరాక్రమాన్నీ వీడక ఉండే సింహం. శక్తి తేజస్సు ఎప్పటికి కల్గిన సింహం. సింహం తనంతట  తానూ లేచి రావాల్సిందే కాలం లేపినప్పుడు, కానీ ఎవ్వరు దానిని లేప తగరు.  ఆండాళ్ తల్లి ఈ సింహం ఎలాగైతే మృగరాజైనట్లుగా సాక్షాత్తు జీవులకు రారాజైన ఆ భగంతుడిని భావిస్తుంది. సింహం ఎలాగైతే గుహల్లోంచి బయటకు రావడం అనేది మన ఆలయాల్లోంచి ఉత్సవమూర్తి బయటకు రావడమా అన్నట్లుగా చెబుతుంది. “శీరియ శింగం” శ్రీతో కూడుకున్న స్వామి. అయితే స్వామి సంకల్ప విశిష్టుడై ఉంటాడు కదా, సృష్టికి పూర్వదశ కూడా నిర్గుణ దశ కాదు అని ఉపనిషత్తులు చెప్పినట్లుగానే ఆండాల్ అది “శీరియ శింగం” అని చెబుతుంది.


“అరివుత్తు” ఆ సింహం తనంతట తాను లేచి “త్తీవిరిత్తు” ఒక్క సారి తన తేజస్సును బయటకు నేత్రాల నుండి కనిపించేట్లుగా తెరిచింది.  “వేరి మయర్ పొంగ” తన జూలును గగుర్పాటు వల్ల ఒక్క సారి దులుపు కొని “ఎప్పాడుం పేరుందుదఱి” ఇటూ అటూ దొర్లుతూ,  “మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు” ఒక పెద్దగా గర్జిస్తూ  “పోదరుమా పోలే” అప్పుడది బయలుడేరినట్లే  నీవూ అట్లా రావాలి. 


సృష్టి పూర్వ దశ నుండి సృష్టి  తరువాత దశ వరకు ఆండాళ్ స్వామిని సింహం తో పోలుస్తుంది. ఆది ఎట్లా అని చాందోగ్య ఉపనిషత్ వర్ణిస్తుంది. సృష్టి కి ముందు భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడట. ఆసంకల్పం “తడైక్షత భహుష్యాం ప్రజా యేయేతి” నెనే నానుండి అనేకమందిని తీద్దును గాక అనుకుంటాడట. ఇక సృష్టి చేయడం ఎలా అంటే త్రివుత్కరణం అని చెబుతారు.


మొదట తనలోంచి తేజస్సుని తీస్తాడు, తేజస్సులోంచి జలాన్ని తీస్తాడు,  జలంలోంచి పృథ్విని తీస్తాడు. ఇక వీటిని సగం సగం సగం భాగాలుగా చేస్తాడు. ప్రతి రెండో భాగాన్ని మల్లీ సగం సగం చేస్తాడు. ఇప్పుడు ప్రతీదీ ఒక పెద్ద భాగం గా రెండు చిన్న భాగాలుగా ఉంటాయి. ఇక అన్ని భాగాలు ఒక్కో దానిలో వచ్చేట్లుగా పంచి మూడింటిని సిద్దం చేస్తాడు. అయితే ప్రతీదాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతావి రెండు తక్కువగా కల్గి ఉంటాయి. 


ఇవన్నీ కల్పి ఒక అండం క్రింద తయారు చేస్తాడు. దీన్నే బిగ్ బ్యాంక్ అని ఇప్పటి వాళ్ళు చెబుతున్నారే అది. “యుగప్పత్ సృష్టికార్యం”  ఒక చిటికెలో సృష్టికార్యం జరిగి పోయింది, అనేక కోట్ల అండాలు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన ఒక అండంలో ఒక గోళంలో మనం ఉన్నాం. ఈ బయటకు వచ్చిన ప్రతి అండంలో ఒక బ్రహ్మ ను పెడుతాడు. ఆ బ్రహ్మ శరీరంలోంచి పదకోండు ప్రజాపతులను బయటికి తీస్తాడు. ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు. దీన్నే అద్వారక సృష్టి అంటారు. బ్రహ్మకు వేద ఉపదేశం చేసి, ఇక పై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు. ఇది సద్వారక సృష్టి. ఇక బ్రహ్మ సృష్టించాక అన్నీ వస్తువులలో అంతర్యామి అయ్యి తానుంటాడు.


ఈ కార్యాన్నంతా ఆండాళ్ తల్లి ఇక్కడ చెబుతుంది. ఒక శీరియ సింహం అంటే సంకల్ప విశిష్టుడైన స్వామి, సింహం ఎలాగైతే తనంతట తాను లేచిందో, సృష్టి ఎవరో ప్రేరేపిస్తే చేసేది కాదు, తనంతటా తానూ ఐచ్చికంగా చేసేది. ఇక సింహం ఎలాగైతే తన తీక్షణమైన కళ్ళు తెరిచీందో పరమాత్మ తనలోంచి తేజస్సును బయటికి తీస్తాడు. సింహం తన జూలును విప్పార్చి తన పరిమళాన్ని అన్నివైపులా వెదజల్లినట్లే, అయితే శాస్త్రం “గందవతీ పృథ్వీ” అని చెబుతుందికదా, పరమాత్మ పరిమలం కల భూమిని దానిలోంచి నీటిని బయటికి తీస్తాడు. ఇక సింహం పడి అన్నివైపులా పొర్లుతున్నట్లుగా పరమాత్మ త్రివుత్కరణం చేసాడు. ఇక సింహం ఎలాగైతే సాగిందో పరమాత్మ తన సృష్టికార్యాన్ని సాగించాడు. ఏర్పడ్డ ఒక్కో అండంలో ఒక్కో బ్రహ్మను ఉంచాడు. సింహం ఎలాగైతే గర్జించిందో తాను బ్రహ్మకు వేదాలని ఉపదేశం చేసాడు. ఇక సింహం తన యాత్రను ముందుకు సాగించినట్లే, పరమాత్మ అన్నింటిలో అంతర్యామియై ఉన్నాడు. ఈక్కడ గోదాదేవి నాభిస్తానంలో పవళించి ఉన్న ఆ అంతర్యామిని తన హృదయ సింహాసనంలో కి నిలిచి ఉండేలా రమ్మని భావిస్తుంది. 


ఆలయాల్లో ఉత్సవ విగ్రహం పురపాడు కి బయలుదేరినట్లు గా కూడా భావిస్తుంది. గర్భాలయాల్లో ఉండే మూర్తి కదలడు కనుక కదిలే రూపంలో ఉత్సవ విగ్రహంగా మనకు దర్శనం ఇస్తాడు. “నీ పూవైప్పూ వణ్ణా” అదసీ పుష్పం వంటి సౌందర్యం కల వాడా,  “ఉన్ కోయిల్ నిన్ఱు” నీ కోవల నుండి, అంటే ఓంకారమనేదే స్వామి ఇల్లు కదా ఆ వేద తత్వమనేది బయటికి రావాలి తన స్థానాన్ని ప్రదర్శించాలి. ఇక ఆలయాల్లోంచి ఉత్సవ మూర్తి బయటికి రావాలి, ఒక శ్రీకృష్ణుడు తన మందిరంలోంచి బయటికి రావాలి ఇన్నింటిని ఆండాళ్ భావిస్తోంది. “ఇంగనే పోందరిళి” ఇలానే రావాలి అని చెబుతుంది, మన ఆండాల్ “అన్నవయల్ పుదువై ఆండాళ్” పరమహంసలే నడక నేర్ప గలిగేది కద, తాను శ్రీకృష్ణుడి కూడా నేర్పుతుంది.  


“క్కోప్పుడైయ శీరియ శింగాశనత్తిరుందు” అలంకృత సింహాసనంపై కూర్చొనమని ప్రార్థిస్తుంది ఆండాళ్. ఇక్కడ సింహాసనం అంటే మన హృదయ సింహాసనం, జ్ఞాన, అజ్ఞాన, ఐశ్వర్య, అనైశ్వర్య, ధర్మ, అధర్మ, వైరాగ్య ఇహ్యాదులు అన్నీ కలిసి ఉండే ఈ ఆసనంలోంచి సృష్టికి కావల్సిన సృజ్య వస్తువులు వస్తూ ఉంటాయి, ఇక ఆలయాల్లో అయితే దర్మ పీఠాసనం అంటారు, ఇక శ్రీకృష్ణ భవనంలో సింహాసనం ఇన్నింటినీ భావిస్తూ ఆండాళ్ శ్రీకృష్ణున్ని దానిపై కుర్చొమ్మని చెబుతుంది.


🌷ఆండాళ్ తిరువడిగలే శరణం..శరణం..🙏🙏

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*


*ఆత్మ త్యాగం..కపాలమోక్షం..*


*(అరవై మూడవ రోజు)*


ఒక వారం రోజుల పాటు ఎవ్వరినీ ఆశ్రమానికి రావొద్దన్న శ్రీ స్వామివారు కఠోర సాధన లో పూర్తిగా లీనమై పోయారు..ప్రధాన గది లో గల నేలమాళిగ లోనే తపస్సు కొనసాగించారు..


1976, మే నెల 6వతేదీ నాటి ఉదయం 9గంటల వేళ.. గొర్రెలు కాచుకునే ఎరుకలయ్య అనే మొగలిచెర్ల గ్రామానికి చెందిన వ్యక్తి..కుతూహలం కొద్దీ..ప్రహరీ గోడ మీదుగా ఆశ్రమం లోకి తొంగి చూసాడు..ఆశ్రమ వరండా ముందు వున్న పందిరి క్రింద..శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని నిటారుగా కూర్చుని ధ్యానం లో వున్నారు..అలా ధ్యాన ముద్రలో ఆరుబైట శ్రీ స్వామివారు ఎన్నడూ కూర్చోలేదు..


ఎరుకలయ్య కొద్దిసేపు అక్కడే తచ్చాడి..మళ్లీ చూసాడు..శ్రీ స్వామివారు అదే స్థితి లో అలానే కూర్చుని వున్నారు..ఈరోజు స్వామి బైట తపస్సు చేసుకుంటున్నాడేమో..అనుకోని ఎరుకలయ్య తన పని లో తానుండి పోయాడు..కానీ మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు ఎరుకలయ్య..మళ్లీ చూసాడు..ఈసారి శ్రీ స్వామివారి దేహం ప్రక్కకు ఒరిగి ఉన్నది..ఎరుకలయ్య కు ఎందుకో అనుమానం వచ్చింది..ఒక్క నిమిషం లోనే అతని మనసు కీడు శంకించి..వెంటనే🥰 ఆలస్యం చేయకుండా పరుగు పరుగునా.. మొగలిచెర్ల చేరి..శ్రీధరరావు గారి ఇంటికి వెళ్లి..శ్రీధరరావు గారితో..తాను చూసిన విషయాన్ని మొత్తం చెప్పేసాడు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఒక్కసారిగా అనిపించింది..శ్రీ స్వామివారు తాను అనుకున్న విధంగా ప్రాణత్యాగం చేసారేమో..అని..వెంటనే బండి సిద్ధం చేయమని చెప్పారు..ఈలోపల..శ్రీధరరావు గారి కుమారుడు ప్రసాద్, మరికొంతమంది గ్రామస్థులు సుమారు 30 మంది గబ గబా ఆశ్రమానికి నడచి వెళ్లారు..


ఆశ్రమం పైన..నిండుగా రామ చిలుకలు వాలి ఉన్నాయి..ప్రధాన ద్వారం తీసుకొని లోపలికి వెళ్లి చూసేసరికి..శ్రీ స్వామివారు పద్మాసనం లోనే వున్నారు కానీ..దేహం ఎడమ ప్రక్కకు ఒరిగి ఉన్నది..శ్వాస లేదు..


శ్రీ స్వామివారి శరీరం ప్రక్కనే..కమండలం నీటితో నిండి ఉన్నది..కమండలం ప్రక్కన..ఒక చిన్న రాయి క్రింద..ఒక చీటీ..పెట్టి ఉన్నది..అందులో.."నేను శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారంగా మారిపోయాను.. ఇక నుంచీ నన్ను అందరూ దత్తాత్రేయ స్వామి అని వ్యవహరించండి..శనివారాల్లో తప్ప మిగిలిన అన్నిరోజుల్లో నా మందిర ద్వారాలు తెరచి ఉంచండి.." అని వ్రాసి వున్నది.. 


ప్రసాద్ తో సహా చూసిన వారందరూ శ్రీ స్వామివారు మరణించారని భావించారు..శ్రీ స్వామివారి దేహాన్ని ముట్టుకోవడానికి అందరూ జంకారు..


శ్రీధరరావు గారి ఇంటి ప్రక్కనే కాపురం వుండే గోపిశెట్టి బలరామయ్య అనే వ్యక్తి "స్వామి వారి శరీరాన్ని ..మనం  సరిగ్గా ఉంచాలి కదా.." అంటూ..తన రెండు చేతులతో శ్రీ స్వామివారి దేహాన్ని ఎత్తుకొని..వరండాలో గోడకు ఆనించి..శ్రీ స్వామివారు కూర్చున్న పద్మాసనం స్థితి లోనే ఉంచాడు..అప్పటికి కూడా శ్రీ స్వామివారి శరీరం బిగుసుకుపోలేదు..మామూలు గానే ఉన్నది..


మరి కొద్ది సేపటికే.. శ్రీధరరావు ప్రభావతి గార్లు వచ్చారు..శ్రీ స్వామివారిని చూసి వారికి దుఃఖం ఆగలేదు..శ్రీధరరావు గారు త్వరగా తేరుకొని..ఒక మనిషిని పిలచి..శ్రీ స్వామివారి సోదరులకు కబురు అందించి..వారిని వెంటబెట్టుకు రమ్మనమని చెప్పి పంపారు..ఈలోపల మొగలిచెర్ల గ్రామస్థులు అందరూ అక్కడ గుమిగూడారు..అప్పటికి సమయం మధ్యాహ్నం 4 గంటలు కావొస్తోంది..


ఆరోజు ఉదయం తిథి..వైశాఖ శుద్ధ సప్తమి..శ్రీ స్వామివారు చెప్పిన వారం రోజుల గడువు ఆరోజుతో ముగిసింది..శ్రీ స్వామివారు తనను సజీవ సమాధి చేయమని పదే పదే  చెప్పిన మాటల్లోని అంతరార్ధం అప్పటికి ఆ దంపతులకు అర్ధమైంది..


క్రమంగా సాయంత్రం కావొచ్చి..చీకట్లు వ్యాపిస్తున్నాయి..శ్రీధరరావు గారు ఇక చేయవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచించసాగారు..రెండు మూడు పెద్ద పెట్రోమాక్స్ లైట్ల ను తెప్పించారు..శ్రీ స్వామివారి కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురు చూడసాగారు..రాత్రి 9.30 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారి సోదరులు తల్లి వచ్చారు..పద్మయ్య నాయుడు తనకు శ్రీ స్వామివారు తనతో  చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని..శ్రీధరరావు గారితో ఆ సారాంశమంతా వివరించి చెప్పారు.. 


రాత్రి 11 గంటల సమయం..అప్పుడు..ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది..


శ్రీ స్వామివారి కపాలమోక్షం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*


*అంతుపట్టని అంతరంగం..*


*(అరవై ఒకటవ రోజు)*


శ్రీ స్వామివారు ప్రాణత్యాగం చేయడానికే నిశ్చయించుకున్నారని శ్రీధరరావు దంపతులు నిర్ణయించుకున్నారు..శ్రీ స్వామివారి ఆశ్రమం నుంచి తిరిగివచ్చిన తరువాత..ప్రభావతి గారు దుఃఖం ఆపుకోలేక పోయారు.."అమ్మా..నన్ను నీ పెద్ద కుమారుడిగా భావించుకో.." అని శ్రీ స్వామివారు చెప్పిన మాటలు ఆవిడ చెవుల్లో మారుమ్రోగుతున్నాయి..ఆమాటే శ్రీధరరావు గారితో చెప్పుకొని కళ్లనీళ్లు పెట్టుకున్నారు..


"ప్రభావతీ..సాధకులు.. సన్యాసులు.. అవధూతలు..భవబంధాలకు దూరంగా ఉంటారు..వారు తాము ఈ జన్మలో తమకు నిర్దేశించిన కార్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు..మనబోటి గృహస్థులం మాత్రం ఈ లంపటం లోంచి బైటపడలేము..మనసు స్థిర పరచుకో..మనమూ ఏ వార్త వినడానికైనా సిద్ధపడి ఉండాలి..ఆ మహనీయుడి సాంగత్యం మనకు ఇంతకాలం ప్రాప్తి!..అదే ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం అనుకుందాము.." అని ఊరడించారు.. ప్రక్కరోజు నుంచి ఆ దంపతులు తమ పనుల్లో తాము మునిగిపోయారు..


ఆ మరుసటి రోజు సాయంత్రం..శ్రీ స్వామివారు ఏప్రిల్ 30 వతేదీనాడు తనను కలువమని శ్రీధరరావు గారికి చెప్పి పంపారు..సరిగ్గా నాలుగు రోజుల గడువుంది 30 వ తేదీకి..ఇన్నాళ్ల తమ పరిచయం లో శ్రీ స్వామివారు ప్రత్యేకంగా ఇలా తేదీ చెప్పి ఆరోజే కలువమని చెప్పలేదు..ఏ వార్త వినాల్సి వస్తుందో అని కొద్దిగా అయోమయానికి గురయ్యారు ప్రభావతి శ్రీధరరావు గార్లు ..సరే!..అంతా భగవదేచ్ఛ!..జరగాల్సింది జరుగుతుంది..అనుకోని ఊరుకున్నారు..


ఈలోపల శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారు ఒక ఉత్తరం వ్రాసారు  తాను వ్రాసిన "సాయి లీలామృతం" గ్రంధాన్ని పంపుతున్నాననీ..ఆ గ్రంధాన్ని

పారాయణం చేసి అభిప్రాయం తెలుపమని..ఆధ్యాత్మిక గ్రంథ రచనలో తమకు సహకరించమని.. ప్రభావతి గారికి ఆ ఉత్తరం ద్వారా కోరారు..ప్రభావతి గారు తమ జవాబులో..శ్రీ స్వామివారి గురించి వివరంగా తెలియచేసి..తానిప్పుడు రచనలు చెయ్యడం దాదాపుగా మానుకొన్నాననీ..సాయిలీలామృతాన్ని పారాయణ చేసి అభిప్రాయం త్వరలోనే తెలుపుతాననీ..వీలైతే భరద్వాజ మాస్టారు గారిని ఒకసారి మొగలిచెర్ల కు వచ్చి, శ్రీ స్వామివారిని దర్శించమని సవినయంగా వ్రాసారు..మాస్టారు గారు కూడా త్వరలోనే వస్తానని జవాబు వ్రాసారు..


ఆరోజుకు ప్రభావతి గారికి తెలియదు..శ్రీ భరద్వాజ మాస్టారు గారు వెలిగించిన శ్రీ శిరిడీ సాయిబాబా జ్యోతి ఆంధ్రరాష్ట్రం నలుచెరుగులా దేదీప్యమానంగా వెలుగును విరజిమ్మబోతోందనీ..శ్రీ భరద్వాజ మాస్టారు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన "శ్రీ సాయిబాబా మిషన్ " ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందనీ.. వారి "సాయిబాబా" పక్షపత్రిక లోనే మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్రను ధారావాహికంగా తాను వ్రాయబోతాననీనూ..


"అమ్మా!..నీవు నా చరిత్ర వ్రాస్తావు కదూ..నువ్వే వ్రాస్తావులే!.." అని శ్రీ స్వామివారు పలికిన పలుకులు ఆ తరువాతి కాలంలో..శ్రీ భరద్వాజ మాస్టారు గారి స్పూర్తితో నిజమయ్యాయి..తెలుగు ప్రజలకు అవధూతల చరిత్రలను పరిచయం చేసిన శ్రీ భరద్వాజ మాస్టారు గారికి మనం ఎంతగా ఋణపడి ఉన్నామో కదా!..


ఏప్రిల్ 30వతేదీ నాడు శ్రీ స్వామివారు తమను కలువమని చెప్పిన ప్రక్కరోజు..ఒంగోలు నుంచి కొంతమంది అధ్యాపకులు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఒక బస్సు వేసుకొని శ్రీ స్వామివారిని దర్శించాలని మొగలిచెర్ల కు వచ్చారు..ముందుగా తెలుపకుండా ఉన్నఫళాన వచ్చేస్తే ఎలా అని శ్రీధరరావు గారు వాళ్ళను సున్నితంగా అడిగి..శ్రీ స్వామివారు ఎవ్వరినీ కలవొద్దని చెప్పిన వైనం వాళ్లకు తెలియచేసారు..వాళ్ళందరూ ముక్తకంఠంతో.."ఇంతదూరం వచ్చాము..అక్కడిదాకా వెళదాము..మా ప్రాప్తం ఎలా వుంటే..అలా జరుగుతుంది.." అన్నారు..శ్రీధరరావు గారూ సరే నని చెప్పి..అదే బస్సులో వాళ్ళతో పాటు ఆశ్రమానికి వెళ్లారు..


ఆశ్రమం బైట..ప్రధాన ద్వారానికి కూడా కొద్దిదూరంలో..శ్రీ స్వామివారు నిలబడి వున్నారు..పాదుకలు ధరించి..దండ కమండలాలు చేతబూని..అచ్చం మహర్షి లా గోచరించారు..వచ్చిన వారందరూ బస్సు దిగి..శ్రీ స్వామి వారిని చూసి చేతులు జోడించి..దగ్గరకు వచ్చి పాదాలకు నమస్కారం చేయబోయారు..పాద నమస్కారాలు వద్దని సైగ ద్వారా వారించి..కొద్ది నిముషాల పాటు నిలబడి..కళ్ళతోనే తాను వెళుతున్నట్లుగా సంకేతం ఇచ్చి..ఆశ్రమం లోపలికి వెళ్లిపోయారు..మళ్లీ అందరూ బస్సు ఎక్కి..శ్రీధరరావు గారిని వారింటివద్ద దింపుతూ.."మాకింతే ప్రాప్తం!..మహనీయుడి దర్శనానికి నోచుకున్నాము..వాక్కు వినలేకపోయాము.." అన్నారు..శ్రీధరరావు గారు చిరునవ్వు నవ్వి వారికి వీడ్కోలు చెప్పి పంపారు..


శ్రీధరరావుగారికి ఎంత ఆలోచించినా అర్ధం కాని విషయమేమిటంటే..శ్రీ స్వామివారు సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి ఆశ్రమం బైటకు వచ్చి నిలుచుని వున్నారే!..ఆయనకు ముందుగా వీరందరూ వస్తున్న సంగతి తెలీదు కదా?


అదే సాధకుడికి..సంసారికి ఉన్న తేడా!..అవధూతల అంతరంగాన్ని అంచనా వేయడం కష్టతరం..


ఏప్రిల్ 30 వ తేదీ భేటీ గురించి..రేపటి భాగం లో..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం... లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..సెల్ : 94402 66380 & 99089 73699).

విద్యయా అమృతమశ్నుతే*

 *విద్యయా అమృతమశ్నుతే* 



విద్యద్వారా అమృతత్వం లభిస్తుంది(వేదవాక్యం)


విద్యవల్ల ఏం సంపాదించాలి? వెంటనే 'ధనం సంపాదించాలి' అని

తడుముకోకుండా సమాధానమిస్తారు. విద్యకు ధనమే పరమ ప్రయోజనం అని భావించడం చేత విద్య కూడా వ్యాపార రంగమైపోయింది. దానితో రాజకీయ వాదుల హస్తాలు సోకి ఆ రంగం కూడా కలుషితమయింది. అలాంటి వ్యవస్థలో నుంచి ఎటువంటి సంస్కారాలు లభిస్తాయి!.


( ధనం ద్వారా వచ్చే సుఖం కన్నా, ధర్మం ద్వారా లభించే సుఖంలో

సంతృప్తి, శాంతి ఉంటాయి. జీవితంలో లభించే సుఖాలకు దూరంగా ఉండమని, వ్యర్థమైన విరక్తిని బోధించలేదు మన ధర్మం. హాయిగా బ్రతకమంది. ఆనందంగా బ్రతకమంది. అయితే ఆ ఆనందం అర్థవంతం కావాలి. ఏ వ్యక్తికీ హాని కలిగించనిదై ఉండాలి. అలాంటి అర్థవంతమైన అవగాహన కలిగించేదే విద్య. ఆ అవగాహనతో ఆర్జించేదే ధనం. ఆ లక్ష్యం కోసం వినియోగం కావడమే దాని ఉద్దేశం. ఆ వినియోగం వల్ల లభించే ఆనందమే జీవిత సార్థకం.)


చివరకు తల్లిదండ్రులు కూడా విద్య ద్వారా డబ్బును సంపాదించే యంత్రాలుగా పిల్లలను తీర్చిదిద్దే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు.


కానీ మన ఆర్షధర్మం (ఋషులు ఏర్పరచిన మార్గం) విద్యకు లక్ష్యాలను చాలా చక్కగా నిబంధించింది.


విద్యా దదాతి వినయం

వినాయత్ యాతి పాత్రతా |

పాత్రత్వాత్ ధనమాప్నోతి

ధనాత్ ధర్మం తతస్సుఖమ్ ||


విద్యవల్ల 'వినయం' రావాలి. వినయం అనే మాటకు అణకువ,విధేయత-అనే

అర్థాలే కాక 'జ్ఞానం' అనే అర్థముంది. విజ్ఞానిని వినీతుడు అని అంటారు.


విద్య వల్ల ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఆ ప్రవర్తనకు కూడా

వినయమనే పేరు. ఇక్కడ 'వినయ' శబ్దానికి ఈ అర్థాలన్నింటినీ తీసుకోవచ్చు. విద్య వల్ల విధేయత, విజ్ఞానం, ప్రవర్తనాసరళి లభిస్తాయి. దాని ద్వారా అర్హత, ఆ అర్హత

వల్ల ధనం, ఆ ధనం వల్ల ధర్మం, ధర్మం ద్వారా సుఖం. ఈ వరుసలో ఉన్న ఔచిత్యం ఎంత గొప్పది!


విద్యకీ, ధనానికీ మధ్య వినయమా, పాత్రతా ఉన్నాయి. ధనానికీ, సుఖానికీ మధ్య ధర్మం ఉంది.


ఈ మధ్యలోని ముఖ్య విషయాలను గమనించక విద్య నుంచి ధనం, ధనం నుంచి సుఖం అనే 'జంపింగ్' వ్యవహారం వల్ల వ్యక్తిత్వానికి అవసరమైన వినయం, పాత్రత,

ధర్మం అనే విలువలకు నీళ్ళొదులుతున్నాం. ఈ పద్ధతి వ్యక్తినీ, సమాజాన్నీ కూడా

క్రమంగా బలహీనపరుస్తుంది.


ఇక్కడ విద్యకీ లక్ష్యం, ధనానికి లక్ష్యం రెండూ చెప్పారు. ధనం వల్ల

సంపాదించవలసినది ధర్మం. ధర్మం ద్వారా సుఖాన్ని సంపాదించాలి. ఎంత నిశితమైన అవగాహన ఇందులో ఉందో గమనించారా?


ఈ ఒక్క శ్లోకాన్ని విద్యార్థులూ, విద్యాలయాలూ గమనిస్తే విలువలుగల విద్యావ్యవస్థను సాధించవచ్చు. ధనానికి ముందూ వెనకా ఉత్తమ లక్షణాలుంచారు.

ఆ లక్షణాల వల్ల వ్యక్తి నియంత్రణ సాధ్యపడుతుంది. సమాజానికి భద్రత ఉంటుంది.


ధర్మాన్ని ఆచరించడానికి తగిన వనరులు లేక చాలామంది అసహాయులైపోతారు.

కానీ ధర్మాచరణకు తగిన సంపాదన కలిగి ఉండడం భాగ్యం. ఆ భాగ్యాన్ని

వినియోగించుకోవడమే ధనాన్ని ధర్మం కోసం ఖర్చుచేయడం.


ధనం ద్వారా వచ్చే సుఖం కన్నా, ధర్మం ద్వారా లభించే సుఖంలో సంతృప్తి, శాంతి ఉంటాయి. జీవితంలో లభించే సుఖాలకు దూరంగా ఉండమని, వ్యర్థమైన విరక్తిని బోధించలేదు మన ధర్మం. హాయిగా బ్రతకమంది. ఆనందంగా బ్రతకమంది. అయితే ఆ ఆనందం అర్థవంతం కావాలి. ఏ వ్యక్తికీ హాని కలిగించనిదై ఉండాలి. అలాంటి

అర్థవంతమైన అవగాహన కలిగించేదే విద్య. ఆ అవగాహనతో ఆర్జించేదే ధనం. ఆ లక్ష్యం కోసం వినియోగం కావడమే దాని ఉద్దేశం. ఆ వినియోగం వల్ల లభించే ఆనందమే జీవిత సార్థకం.


సమాజపు శాశ్వత సౌఖ్యం కోసం పరితపించే బుద్ధి ఉన్నవారు ఈ విధంగా ఆలోచిస్తారు.


ఒక్క శ్లోకంలో వ్యక్తి జీవిత మార్గనిర్దేశాన్ని ఇంత సమగ్రంగా బోధించిన మన సనాతనధర్మానికి మోకరిల్లవలసిందే.


విద్యకు ప్రాధాన్యమిచ్చిన గురుపీఠం మనదేశం. భౌతిక సుఖాలను కూడా

లక్ష్యపెట్టకుండా అరణ్యాలలో వాసం చేస్తూ జీవితమంతా జ్ఞాన సముపార్జన కోసం వెచ్చించి మహాతపస్వులు-"విద్యయా అమృతమశ్నుతే" విద్య ద్వారా అమృతత్వం లభిస్తుందని బోధించారు. సౌఖ్యాలనూ, సౌకర్యాలనూ పరిగణించకుండా తపస్సులా విద్యాభ్యాసం చేయాలని మన సంప్రదాయం. విద్యను వ్యాపారం చేసే దుష్ట సంస్కృతిలోనే ఈ సుఖసౌకర్యాల ఆలోచనలు పుడతాయి.


నిరంతర అధ్యయనం వల్లనే నిరంతర ధర్మం, తద్వారా సుఖం వర్థిల్లుతాయి.

సత్యస్పృహతో అసలైన ఆనందాన్ని పొందాలంటే విద్య ధనాల ముందు వెనుకనున్న సులక్షణాలను సాధించవలసిందే.

మకరి- మహాయోగి యైనదా?

 శు భో ద యం🙏


మకరి- మహాయోగి యైనదా?


" పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియో

న్మాదంబున్పరిమార్చి బుధ్ధిలతకున్ మారాకుహత్తించి ని

ష్కేద బ్రహ్మ పదావలంబనగతిన్ క్రీడించు యోగీంద్రు మ

ర్యాదన్ నక్రము విక్రమించె కరిపాదాక్రాంత నిర్వక్రమై; 


భాగ-గజేంద్రమోక్షణము-బమ్మెఱపోతన! 


    భాగవతంలో గజేంద్రమోక్షణమొక అద్భుత ఘట్టము. పోతన తనకవితా చాతుర్యమును వెలయించి దీనిని మిగుల నపురూపముగాతీర్చిదిద్దినాడు."కరి-మకరుల పోరుసందర్భములోనిది" ప్రస్తుత పద్యరత్నము. 


            కరిని గెలువగోరి మకరి యోగీంద్రునివలె సాధనచేయుచున్నదట!


       యోగసాధనచేయునప్పుడు యోగి పాదములను నేలపై సమముగానుంచి ప్రాణాయామమునకుపక్రమించి వాయుబంధనమొనరించి,బుధ్ధిని భగవంతుని యందు లగ్నమొనరించి భగవత్పాదారవిందములపైననే దృష్టిని కేంద్రీకరించి యేమరుపాటునువీడి సాధనగావించుచుండును. అదిగో ఆమాదిరిగా నున్నదట మొసలి సాధన! తనరెండు కాళ్ళను నేలపైనూదిపట్టి.గాలినిబిగబట్టి.యేమరుపాటులేక తాబట్టినగజేంద్రునిపాదములపైననే 

దృష్టినంతయుకేంద్రీకరించి, ఏమాత్రముపట్టువిడువక,,బ్రహ్మపదమునందగోరు యోగీంద్రునిసాధననుపమించుసాధనతో కరిని గెలువ మకరి యత్నించు చున్నదట! 


       ఆహా! పోతన కవీంద్రా! పశుయోనియగు కరియేడ? మహాయోగియేడ? దానిసాధన యోగిసాధనతో నుపమించి యద్భుతమును సృజియించినావుగదా! నీకు వేరెవరుసాటి? ఇదో స్వీకరింపుము మాప్ర ణామాంజలులు!


              స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

వల్లీవల్లభమాగ్నేయం

 🙏🙏🌹🙏🙏

వల్లీవల్లభమాగ్నేయం దేవసేనాధవం గుహంl

భౌమవారే భజే భక్త్యా

కుజదోష నివృత్తయేll

~మల్లిభాగవతః...!


#కం#


మంగళవారంబున వర

గాంగేయుని భక్తి మీరఁగారాధింపన్l

అంగారకదోషంబుల

నంగజమథనుని కుమారుడంతముఁ జేయున్ll


~మల్లిభాగవతః...!

నన్నయ రచనా వైశిష్ట్యం

 🙏    నన్నయ రచనా వైశిష్ట్యం: 🙏


ఆది కవి నన్నయ. రాజమహేంద్రపుర నివాసి. పద్య విద్యకు ఆద్యుడు వంటివాడు. ఎంతో ప్రసాద గుణ మాధుర్యంతో, చెవికి ఇంపైన పదాలతో ప్రశాంత గంభీరంగా సాగిపోయే ధారతో - తెలుగు పద్య సౌందర్యం వెలార్చింది ఆయన చేతిలోనే. అంత ప్రసన్నంగా, అంత సుభగంగా, అంత మార్ధవంతో నన్నయ తర్వాత పద్యం రాయలేదంటే అతిశయోక్తి లేదు. "విశ్వశ్రేయహ కావ్యం.."- కావ్యం విశ్వ శ్రేయము. రసాత్మకమైనదే వాక్యము. కవులు ఏవిధంగానైనా రసాన్ని సాధించవలసివుంది. నన్నయ ప్రారంభించిన మహాకావ్యం - పంచమవేదం. మహాభారతం - మనః ప్రీతం.

నన్నయ శైలి:

కథాగమన క్లిష్టత గాని, వక్రత గాని, అతి సంకుచిత తత్వము, అతి విస్తృతి గాని లేకుండా ప్రసన్నముగా, నిర్విఘ్నముగా నడుపగలిగాడు. ఈ ప్రజ్ఞ నన్నయకే సొంతం. ఒక్క శైలిలోనే కాదు. కథ నడుపుట లో కూడా నన్నయ శైలి భిన్నం. ఆది పర్వము నందలి శకుంతలోపాఖ్యానము, అరణ్య పర్వము నందలి లోపాఖ్యానమును పోల్చిన ఆ తారతమ్యము మనకర్ధమవగలదు.

 నన్నయ భాష - ఆత్మీయత:

"ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని …." మొదలుపెట్టిన నన్నయ తన మహాభారతాన్ని ఎలా రాయాలనుకున్నాడో మనకి అక్కడే వివరించాడు. శబ్ద సంగ్రహమునే కాక, వాక్య రచనలో కూడా నన్నయ చాలావరకు సంస్కృత సాంప్రదాయమునే అనుసరిం చెను. 

 పద్య విశేషాలు:

ఆది, సభా, అరణ్య పర్వాల లో 3906 గద్య, పద్యాలు దాదాపు అన్నీ వృత్తాలు ఒకే ప్రసన్నతను వెలువరిస్తాయి. తిక్కన మాటల్లో నన్నయ" విద్యా దయితుండు…". నన్నయ పద్యాల్లోని ఆ ప్రసాద మాధుర్యాలకు కారణం ఎక్కువగా సంస్కృత పదాలు వాడటం అంటే కొంతవరకు నిజం. సంస్కృత పదాలు దట్టించి తెలుగు పద్యాలు వ్రాసిన వారు చాలామంది ఉన్నారు. కానీ నన్నయ ఏరుకున్న సంస్కృత పదాలు చాలా మృదువైనవి. ఒక్క పూలమాలలోని పూలన్నీ దారాన్ని లాగితే ఎలా విడి పోతాయో అలా ఉంటాయి నన్నయ పద్యాలు. ఉదా: జలధి, విలోల,వీచి, విలసిత, కల, కంచి, సమంచిత,అవనీ……

 నన్నయ మాటల్లో అతని గురించి విశేషణాలు:

చాళుక్య రాజ్య వంశమునకు కుల బ్రాహ్మణుడు.

అవిరళ జప,హోమ తత్పరుడు.

 నానా పురాణ విజ్ఞాన నిరతుడు.

ధర్మే తరము లైన వాక్యములు ముట్టని వాడు.కాలము: క్రీ. శ.1060 ప్రాంతం.కావ్య రచనలో సహాయమందించింది - నారాయణభట్టు - వీరిద్దరిదీ కృష్ణార్జున మైత్రి.

ఇతర కృతులుగా చెప్పబడేవి 1. చాముండికా విలాసం 2. ఇంద్ర విజయము.

సమకాలికులుగా చెప్పబడే వారు - 1. అధర్వణుడు 2. భీమకవి.


నన్నయ కవితా రీతులు:

నన్నయ్య ఆంధ్ర మహాభారతం ప్రారంభంలో అవతారికని రచించాడు. దాని నుంచి కృతి భర్త, కృతి కర్త ఇత్యాది విషయాలే కాకుండా తన భారత రచన ఏ యే విశేషాలతో సాగిందో ఈ క్రింది పద్యం ద్వారా వివరించాడు. (కుమా రాస్త్ర విద్యా ప్రదర్శన - షష్టా శ్వాసము - ఆదిపర్వము)


ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తి లో     

నారసిమేలునా, నితరు లక్షరరమ్యత నాదరింప నా   నా రుచిరార్ధ సూక్తి నిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా     

భారత్ సంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్. (ఆది. 1-26)


పై పద్యంలో నన్నయ మూడు కవిత గుణాలను వ్యక్తీకరించాడు.


1. ప్రసన్న కథా కలితార్థ యుక్తి, 2. అక్షర రమ్యత 3. నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం



1. ప్రసన్న కథా కలితార్థ యుక్తి (ప్రసన్నత+అర్థ యుక్తి):

ప్రసన్నమైన కథలతో కూడిన అర్థ యుక్తి ప్రసన్న కథాకలితార్థయుక్తి. ప్రసన్నత అంటే నిర్మలత్వం. కథలో సువ్యక్త స్థితి కల్పించటం. కుమార్రాస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం ఆంధ్ర మహాభారతంలో మూలానుసారంగానే జరిగింది. ప్రదర్శన ప్రారంభంలో.."సుతుల విద్య ప్రవీణత జూచు వేడ్క నెంతయును సంతసంబున గుంతిదేవిరాజా సన్నిధి గాంధార రాజుపుత్రికెలననుండె ను న్మీలిత నలిన నేత్ర" ప్రదర్శన సందర్భంలో కుంతీదేవి రాజకాంత ప్రేక్షక సమూహంలో గాంధారి పక్కన కూర్చుంది. ఆమెకి 'నలిని నేత్ర ' అనే ఒక విశేషణం వేసాడు నన్నయ. ఇది చాలా ప్రత్యేకంగా గమనించదగినది. నలిననేత్ర అంటే పద్మనయ అని అర్థం. నలిన నేత్రకి, నలినాప్తుడికి గల బంధుత్వం కుమార్రాస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం సమాప్తమైనా అనిశ్చితంగా ఉండిపోయింది.

శా. సాలప్రాంశు నిజోజ్వలత్కవచు, శస్వత్కుండ లోద్భాసితు

న్బాలార్క ప్రతిమున్, శరాసనధరున్, బద్ధో గ్రనిస్త్రింశ్ర శౌ

ర్యా లంకారు, సువర్ణ వర్ణఘను, గర్ణాఖ్యున్, జగత్కర్ణ పూర్ణా లో లద్గణు జూచి చూపరు ప్రభూతాశ్చర్యులైరచ్చటన్. 


అస్త్ర విద్యా ప్రదర్శనశాల ప్రధాన ద్వారం దగ్గర జబ్బ చరిచి నిలుచున్నప్పటి కర్ణుని మూర్తి వర్ణనం ఇది. ఈ పద్యంలో- - సాలప్రాంశు, బాలార్క, ప్రతిమ, సువర్ణ వర్ణు, జగత్కర్ణ పూర్ణాలో లద్గుణు అనే నాలుగు విశేషణాలు నన్నయ స్వతంత్రంగా ఉపయోగించినవే. కర్ణుడు కనిపించేసరికి ప్రేక్షకులంతా ఆశ్చర్యచకితులై పోయారు. ఎత్తయిన రూపం, మెరిసిపోతున్న కవచకుండలాలు, బంగారు మేనిచాయ, ధనస్సు ఖడ్గాలు పూని ఉండడం. తమ లాగా ప్రేక్షకుడులా కాక కురు వీరుడు అర్జునుడికి ప్రతి స్ఫర్థిగా జబ్బ చరచటం ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించేవే.

నన్నయ ఉపయోగించిన విశేషణాలతో- బాలార్క ప్రతిమ- అనేది కర్ణుడు జన్మవృత్తాంతం స్ఫురింప చేస్తుంది. సాల ప్రాంశువు అనే విశేషణం ముందు చెప్పి తర్వాత కవచ, కుండలాల ప్రసక్తి తేవడంతో కర్ణుడు కవచకుండలాలు కోల్పోయి వట్టి శరీరంతో సాలప్రాంశువు గా మిగులుతాడనే ఒక అర్థం స్ఫురిస్తుంది. 'శౌర్యలంకారు ' అనే విశేషణం తో కూడా గొప్పతనం కనిపించదు. శౌర్యమే అలంకారంగా కలిగినవాడని అర్థం. అలంకారం పైపై మెరుగులకు చెందినది. ఇతడి శౌర్యం కూడా అలాంటిదే అనే అంశం ద్యోతకమవుతుంది. అర్జునున్ని పరిచయం చేసే సందర్భంలో అన్ని విశేషణాలు చెప్పి 'పాండవ మద్యముండొప్పె' అనే మాట కూడా చెప్పి బద్ధ తూణీరుడు అనే మాట ఉపయోగించాడు. భవిష్యత్తులో అర్జునుడు అక్షయ తూణీరాలతో నిలుస్తాడనే సూచన గోచరిస్తుంది. ఈ విధంగా కథాంశం చెదిరిపోకుండా, అందచందాలతో చెక్కుచెదరకుండా కథ నడపడంలో ప్రసన్నత, అర్థయుక్తి అనే రెండు అంశాలను సమర్థవంతంగా నిర్వహించాడు.

2. అక్షర రమ్యత:

నన్నయ్య అక్షర రమ్యత పై పరిశోధన చేసిన పండితులు డా. వి. వి. ఎల్. నరసింహారావు. ఆయా సన్నివేశాలందు రసోచితములైన ఆయా శబ్దములు, ఆయా అక్షరములు వానంతట అవే కుదురుకొని ఆ మహా కవి జీవ లక్షణములైన యొకానొక రచనా మార్గమును స్పష్టము చేయును. నన్నయ గారి రచనలో ఈ అక్షర సంయోజనీయము హృదయాహ్లాదజనకముగా శ్రవణేంద్రియం తర్పణముగా సాగినది. ఈ లక్షణము తన కవితలో నిండారియున్నదని గుర్తించిన జ్ఞాని నన్నయ. నా కవిత యందు అక్షర రమ్యత పరమాదరనీయమని ఆయన విశ్వసించెను. అక్షర రమ్యత శబ్ద ప్రధానమైనది. శైలి రామణీయకత సంబంధమైనది. దీనినే అక్షర చంధో రమ్యతగా, కవిత గుణాల వల్ల ఏర్పడే రమ్యతగా, సంగీతము, పూర్వమీమాంశ తత్వ అక్షర సౌందర్యంగా పరిశోధకులు వివేచన చేసారు.



1. నిర్వచనము- అక్షరములు ధ్వనులకు సంకేతికములు. వివిధ ధ్వనులు గల అక్షరములచే శబ్దములు ఏర్పడుచున్నవి. ధ్వని మాట్లాడిన పిమ్మట నశించిపోవును. అక్షరమట్లు గాదు ఎన్నడూ నశించని పరమేశ్వరుడక్షర పద వాచ్యుడు. అక్షరమగు కవిత లోకోత్తరమైనది.


2. అక్షర ప్రయోగ రమ్యత


3. నాదము, రాగ రసములు - సంగీతము


4. అక్షర చంధో రమ్యత చంధస్సు


5. కావ్య గుణములు - అక్షర రమ్యత - గుణాదులు


6. పూర్వ మీమాంస తత్వము


7. మంత్రశాస్త్ర ప్రసస్తి


8. రసౌచితాక్షర బంధము - నౌ చిత్తము



కం. నీవ కడు నేర్పు కాడవు


గావలవదు, వీని గొన్ని గరచితి మేము


న్నీ విద్యలెల్ల జూపుదు


మే వీరుల సూచి మేలు మేలని పొగడన్.


నాటకీయమైన సంభాషణ ఇది. కర్ణుడి స్వభావాన్ని నిరూపించేది. కర్ణుడి స్వాతిశయం, అర్జునుడిపై స్పర్ధని వ్యక్తం చేస్తుంది.


చం. కురు కులజుండు పాండునకు గుంతికి బుత్రుండు ;రాజధర్మ బం


ధుర చరితుండు; నీ వితని తోడ రణంబొనరించెదేని వి


స్తరముగ నీదు వంశమును దల్లిని దండ్రిని జెప్పు; చెప్పిన


న్దొరయగుదేని నీకెదిరి దోర్బల శక్తి నితండు సూపెడిన్


ఆచార్య. సుబ్రహ్మణ్యం గారు ఈ పద్యాన్ని శబ్ధ శక్తి మూల ధ్వనికి అమూల్యమైన ఉదాహరణగా భావించారు. ఈ పద్యంలో కుల, రాజు, దొర శబ్ధాలు సాభిప్రాయ విశేషాలు. దొర శబ్ధం క్షత్రియుడు, రాజు అనే అర్థంలో ఉపయోగించబడింది. దీనిలో ధ్వని అంతా శబ్ధం మీదే ఆధారపడింది. 



ప్రభువు అనే అర్థం వాచ్యంలో, సమానుడు అనే అర్థం వ్యంగం లోనూ స్ఫురిస్తుంది. భావి కథకు మూలమౌతుంది. కాబట్టి ఇది శబ్ద శక్తి మూల ధ్వని. చమత్కారమేమంటే పఠితకు కర్ణుడి తల్లి,దండ్రుల సంగతి తెలుసు. సన్నివేశంలో ఉన్న వారికి తెలియదు. కర్ణుని స్థితి పఠితలో సానుభూతిని రేకెత్తిస్తుంది. ఇది రస విషయకమైన రహస్యం అని వివరించారు. ( ఆంధ్ర మహాభారతం వ్యాఖ్యానం - తి.తి.దే.ప్రచురణ)



"వినుత ధనుర్విద్యా విదుఘను గర్ణు సహాయబడిసి కౌరవ విభుడర్జుని వలని భయము సెడి రొమ్ము న జేయుడి నిద్రవోయె ముదితాత్ముండై…"



దుర్యోధనుడు కర్ణున్ని సహాయంగా పొందాడు. తత్కారణంగా భయం చెడిన వాడయ్యాడు. ఇంక అదుపులో ఉండడనే భావం స్ఫురిస్తోంది. దుర్యోధనుడికి శత్రు భయం లేదు . గుండెపై చేయి వేసుకొని నిద్రపోయాడు. కానీ అర్జునుడున్నాడు. ఈ అర్జునుడితో వైరం దుర్యోధనుడికి బదులు కర్ణుడికి సంక్రమించింది. ఇంక కర్ణుడికి నిద్ర పడుతుందా అని వ్యంగమే. 



ఈ విధంగా నన్నయ అక్షర రమ్యత లో భాగమైన భావ చిత్రణ, తదనుకూలమైన పదాల వినియోగం, సంభాషణాత్మక శైలి, వ్యంగ వైభవాలు అక్షర రమ్యత కి అర్థం పడుతున్నాయి.



3. నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం:

ఈ సూక్తి అనే పదం విషయంలో పండితులలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సూక్తి అంటే మంచి మాట అనే అర్థంలో గ్రహించారు. వృత్తాంతము, సమాచారము అనేవి నిఘంటుకార్థాలు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పదలచినప్పుడు హృదయంగమంగా, సంక్షిప్తంగా చెప్పే విధానాన్ని సూక్తి అనాలి.



'సూక్తి ' అనేది విశేషణం. ఈకారాంత స్త్రీలింగ శబ్దం. 'శోభనాచ సా ఉక్తి శ్చ'- సూక్తి అని దీని వ్యుత్పత్తి. శోభన తత్వం అంటే సౌందర్యం. అది ఉక్తికి చెందినది. ఉక్తికి సంబంధించిన సౌందర్యం రెండు విధాలు. ఒకటి అంతరము, రెండు బాహిరము. 'కావ్య గ్రాహ్యమలంకారాత్ సౌందర్య మలంకారాహ" అని లాక్షణికోక్తి. కాబట్టి సూక్తి అనేది అలంకారానికి పర్యాయపదం అవు తోంది. శబ్ద సౌందర్యాన్ని అక్షర రమ్యతగా స్పష్టం చేసాడు. కాబట్టి ఇక్కడ కేవల అర్థాలంకార సౌందర్యాన్నే గ్రహించాలి. ఇతిహాసానికి కావ్యత్వాన్ని కల్పించిన నన్నయ నానా రుచిరార్ధసూక్తి నిధి అనే దళాన్ని కేవలం శిరోధార్యమయ్యే మంచి మాటలకే గాక అర్థాలంకార సౌందర్యాన్ని కూడా ఆపేక్షించి వాడాడు.


ఉ. హారి విచిత్ర హేమ కవచావృతుడున్నత చాపచారు దీ


ర్ఘోరు భుజండు, భాస్వదసితోత్పల వర్ణుడు, సేంద్ర చాప శం


పా రుచి మేఘమో యనగ, బాండవ మధ్యముడొప్పె బద్ధతూ


ణీరుడు రంగ మధ్యమున నిల్చె జనంబులు దన్ను జూడగన్.


అందమైన, విచిత్రమైన బంగారపు కవచం ధరించాడు ఆజానుబాహుడు. ఒక చేతిలో ఉన్నతమైన ధనస్సు ఉంది. మనిషి నల్ల కలువల రంగుతో కాంతులీను తున్నాడు. పసిడి రంగుతో కలిసిన మొత్తం రూపం హరివిల్లు తో మెరుపుతీగతో కూడిన నీలి మేఘంలా ఉన్నాడు అర్జునుడు. అర్జునున్ని ఇంద్రచాపంతో కలిసి ఉన్న మెఱుపు మేఘంలా ఉత్ప్రేక్షించాడు. ఈ ఉత్ప్రేక్ష కూడా ఇంద్ర తనయుడనే విషయాన్ని స్ఫురణకు తెచ్చేలా సార్థకంగా ఉంది.


కం. అనిన నిన తనయు పలుకులు


జనులకు విస్మయము, సవ్యసాచికి గోపం


బును సిగ్గును మరి దుర్యో


ధనునకు బ్రీతియును జేసెదత్ క్షణన మాత్త్రన్.



నువ్వు నేర్పరివి కాదు. మాకు ఆ విద్యలు తెలుసు. మేము నేర్చుకున్నాం. నువ్వు ప్రదర్శించిన విద్యలు వీరుల మెచ్చుకొనేలా మేమూ ప్రదర్శించగలం అని కర్ణుడు అన్నాడు.ఆ మాటలు అక్కడ ఉన్న ప్రేక్షకులకి ఆశ్చర్యాన్ని, అర్జునుడికి కోపాన్ని, సిగ్గుని దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించాయి. ఇదే ఉల్లేఖాలంకారం "బహుభిర్భుహుధోల్లే ఖాదేక స్యాల్లేఖ ఇష్యతే…" అని ఉల్లేఖం లో ఒక లక్షణం. అయితే ఈ అలంకార వైచిత్రి లో కూడా నన్నయ మూలానుసారమైంది కూడా గ్రహించే అలంకారిక రచన చేశాడు.



నన్నయ యతి విశేషణాలు:

1. పృథ్వీ వృత్తము - సంస్కృతమున 8వ అక్షరము తర్వాత యతి చెప్పబడినది. కన్నడమున నాగవర్మ కూడా అట్లే చెప్పినాడు. కానీ నన్నయ తెలుగులో వడి 11వ అక్షరము తర్వాత వుంచినాడు.


2. శిఖరిణి - సంస్కృతమునందు, కన్నడమునందు 6వ అక్షరము తర్వాత యతి ఉన్నది. కాని నన్నయ 12 వ అక్షరము తర్వాత వడి నిల్పినాడు.


3. పంచచామరమునకు - సంస్కృతమున 8 తర్వాత యతి, తెలుగున 9 తర్వాత పాటించారు.


4. తరళ వృత్తమునకు - కన్నడమున 8 వ అక్షరము తర్వాత, తెలుగు లో 11 వ అక్షరం తర్వాత వాడబడినది.



విశేషాంశాలు:


1. రచనా బంధురత: 


నన్నయ విపుల శబ్దశాసనుడు. ఆనాడు దేశీయములైన శబ్దములను, సంస్కృత శబ్దములను ఏర్చి, కూర్చి నుడికారపు సొంపులు తీర్చిదిద్దిన శబ్ధశాసనుడు.


2. విశ్వ సాహిత్య ప్రపంచంలో శబ్ధా ర్థములకు, చంధస్సుకు భిన్నమైన నాదముచే కవితా శిల్పమును నిర్మించిన మహా కవులను వేళ్లపై లెక్కించవచ్చు. ఈ మహా కవులలో నన్నయ మేరుపూస.


3. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం చదువుతుంటే కర్ణుడు రంగమాధ్యమాన్ని ప్రవేశించినట్టు కనబడదు. నాటకీయ శిల్పం ఆంధ్ర వాజ్మయంలో అడుగు పెట్టినట్టు తోస్తుంది.


4. నన్నయ మహాభారతాన్ని రచించే నాటికి సంస్కృత సాహిత్యంలో 'రీతి' సంప్రదాయం ప్రముఖంగా వ్యాప్తిలో ఉంది. అందువలన ఆయన తన భారత రచనలో దీనినే అనుసరించారు.


5. నన్నయ నాటికి కన్నడంలో మాత్రమే భారత రచన జరిగింది. అయితే పంపకవి రచించిన కన్నడ భారతం ఇతిహాసం కన్నా జైన పురాణ సాంప్రదాయానికి దగ్గరగా ఉంది. ఇది రాజ, రాజ నరేంద్రుని వంటి భారత కథాభిమానులకు నచ్చలేదు. అందువలననే భారతములోని మౌళిక తాత్వికతకు లోపం లేకుండా ఆ రచన చేయాలని నన్నయను కోరాడు.


6. నన్నయ సంస్కృత చంధో రీతులను ఎక్కువగా ఇష్టపడినట్టు భారతం చెబుతోంది.


7. తెలుగులో చంపూ రచనలకు మార్గదర్శనం చేసింది నన్నయ భారతమే.


8. విశ్వనాథ సత్యనారాయణ తన రామాయణ కల్పవృక్ష అవతారిక లో "ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి" అని కొనియాడారు. ఇది అక్షర సత్యం.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

భోజనం చేస్తే....*

  *ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే....*


*బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్*

*బ్రహ్మైవ తేన గన్తవ్యం  బ్రహ్మకర్మ సమాధినా*


*అహం వైశ్వానరో భూత్వా* *ప్రాణినామ్ దేహమాశ్రితః*

*ప్రాణాపాన సమాయుక్తః* *పచామ్యన్నం చతుర్విధమ్*


ఈ శ్లోకాలు రెండూ చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది. ఆహారానికి పాత్రశుద్ది, పాకశుద్ది, పదార్థశుద్ది ఉండాలని స్వామి చెప్పారు. పాత్రశుద్ది మనంచేయగలం. పాకశుద్ది అంటే ఎలాంటి తలపులతో వంట చేస్తున్నారో....? పదార్థశుద్ది అనగా మనం తెచ్చుకున్న పదార్ధములు మోసము చేసి తెచ్చినవో, దొంగిలించినవో మనకు తెలియదు. అన్యాయార్జన పదార్ధము అనారోగ్యాన్ని, దుర్భుద్ధులను పెంచుతాయి. అందువలన ఆహారం భుజించేముందు ఆహారాన్ని దైవానికి సమర్పించి  భుజిస్తే అది ప్రసాదంగా మారి దోషరహితం అయిపోతుంది. ఎట్టి తిండియో అట్టి త్రేపు. ఆహారాన్ని బట్టి ఆలోచనలు వుంటాయి. అందువలన రజోగుణ, తమోగుణ సంబంధమైన ఆహారాన్ని త్యజించి సాత్వికాహారము దైవానికి అర్పించి భుజిస్తే సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాలోచనలు కలుగుతాయి. అన్ని యింద్రియాలకు సాత్వికాహారం యివ్వాలని స్వామి చెప్పారు.