🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
*నేటి కధ:*
*ఆత్మహత్య నుంచి ఆత్మ విశ్వాసం వరకు*
🌷🌷🌷
ఒక స్త్రీ కొండపైనుంచి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని చాల ఎత్తయిన కొండ పైకి ఎక్కింది. మరో పది అడుగులు వేస్తే దూకుతుందనగా కాలికి ఏదో తగిలింది. క్రిందికి చూస్తే ఏదో మెరుస్తూ కనిపించింది. ఆమె ఒక కొయ్య సహాయంతో ఆ మెరిసే వస్తువును భూమిలోంచి బయటకు తీసింది.
అది ఒక దీపం. దానికి అంటుకున్న దుమ్ము దులుపుతున్నపుడు ఒక చిన్న మెరుపు వచ్చి అందులోంచి ఒక భూతం బయటకు వచ్చింది.
ఆమె ఆ భూతాన్ని చూసి మొదట భయపడింది. కానీ, ఆ భూతం కొంచెం మనిషిలాగే ఉండడం అదీగాక చావాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ దయ్యాలకూ, భూతలకూ భయపడడమేమిటని ధైర్యంగా ఆ భూతాన్ని "ఎవరు నువ్వు?" అని అడిగింది.
"నేనొక భూతాన్ని! బహుశా నీకు కాబోయే స్నేహితురాలిని కూడా కావచ్చు! నా వివరాలు తర్వాత చెబుతాను. ముందు నీ విషయం చెప్పు! నువ్వు ఎందుకు చావాలని నిర్ణయించుకున్నావు? నీ సమస్య ఏమిటో చెబితే నాకు వీలైతే పరిష్కారం చెబుతాను" అన్నదా భూతం.
"చెబితే నష్టమేమిటి? దొరికితే పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే 'చావు' పరిష్కారం ఉండనే ఉంది" అని ఆలోచించి తన కష్టాలు చెప్పసాగింది.
"నా మనస్సు కు సుఖమనేదే లేదు. నా తల్లిదండ్రులు నన్నర్థం చేసుకోలేదు. ఇష్టం లేనివాడికిచ్చి పెళ్లి చేశారు. సరే పోనీలే! అని అడ్జెస్ట్ అయ్యాను. కానీ, చేసుకున్న మొగుడు కూడా నన్నర్థం చేసుకోవట్లేదు. నా మాట లెక్క చేయడు. నేను కన్న పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాకు విలువ ఇవ్వడం లేదు. ఆఫీస్ లో నేనెంత కష్టపడి పనిచేసినా మా బాస్ నన్ను గుర్తించట్లేదు. చివరకు పొరుగింటివారు, కొలీగ్స్ ఎవరి వద్ద నాకు విలువ లేదు. దీంతో నా మనస్సులో భరించలేని ఒంటరితనం ఏర్పడి విలువ లేని ఈ బ్రతుకు వద్దనుకుని చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. నిజానికి ఇది ఆవేశంతోనో, దుఃఖంతోనో తీసుకున్న నిర్ణయం కాదు. నిరాశా, నిర్లిప్తితతో తీసుకున్న నిర్ణయం .
ఆమె మాటలు విన్న భూతం ఇలా అంది.
"నిజమే! మీరంతా సామాజిక జీవులు. మీరు ఏం చెయ్యాలన్నా చుట్టూ ఉన్న వారి ప్రమేయం ఉండాలి. ఆమోదం ఉండాలి. సహకారం ఉండాలి. ఎంత ధీమాగా ఒంటరి పయనానికి తెగించినా కొన్ని అడుగుల తర్వాత మరి కొన్ని అడుగులు జత కలవాల్సిందే. అందుకే ఇతరులు అర్థం చేసుకోవాలని కోరుకోవడం చాలా సహజం.
*మరి అలా జరగనప్పుడు ఏం చెయ్యాలి?*
ముందు ఒక ప్రశ్న వేసుకుందాం.
అసలు నిన్ను అర్థం చేసుకోవలసిన అవసరం అవతలి వాళ్ళకేముంది?
నిజమే! నువ్వు నీ వైపు నుండి ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుండి ఆలోచించడం సహజం కదా! నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరైనా చేయాలంటే, నీ అవసరం వాళ్లకు ఉందా? అని ఆలోచించు! వాళ్లకు కావలసిన అర్హతలు నీ దగ్గర ఏమున్నాయో చెక్ చేసుకో!
ఎందుకంటే అవసరం లేనిదే ఎవరూ ఏ పనీ చేయరు! ఎంత సొంత వారైనా నిన్ను అర్థం చేసుకోవాలనే నిబంధన ఏదీ లేదు.
సరే! వాళ్ళకు నీ అవసరం లేదని తేలిపోయింది.
మరిప్పుడు ఎలా? నీ కర్మ ఇంతే అనుకుందామా? కానేకాదు. ఇప్పుడిలా ప్రశ్నించుకో!
నీకు వాళ్ళ అవసరం నిజంగా ఉందా?
ఇది కూడా నిజమే!
ఒక్కోసారి మనం అనవసరమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. 'అవతలి వారికి వారి అర్హతలకు మించిన స్థానాన్ని ఇచ్చి బాధపడిపోతుంటాం'.
ఉదాహరణకు ఒక సంస్థలో నీకు గుర్తింపు లేకపోతే మరో సంస్థను వెదుక్కోవచ్చు. ఒకరు నిన్ను తిరస్కరిస్తే మరొకరు నిన్ను ఆదరించవచ్చు. అయితే అన్ని సందర్భాలలోనూ అందరినీ ఒదులుకోలేము కదా! కూతురినో, భర్తనో అలా వదిలేసుకుంటామా? ఒక్కోసారి ప్రేమించిన వాళ్ళను కూడా ఒదులుకో లేకపోవచ్చు! అప్పుడేం చేద్దాం?
ఇంకేం చేస్తాం? మన ఫిర్యాదును వెనక్కి తీసుకుందాం! వెనక్కి అంటే వ్యాకరణం మార్చి చదువుదాము.
"నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు"
దీన్నే మరోలా చదువుదాం
"నేను ఎవరికీ అర్థం కావట్లేదు "
ఎలా ఉంది? రెండింటి లో తేడా ఉంది కదా!
మొదటి దాంట్లో నిన్ను అర్థం చేసుకోలేక పోవడం ఎదుటివారి తప్పు అన్నట్టుగా ఉంది. రెండో దాంట్లో తప్పు నీలోనే ఉంది. అవును! మనకు సంబంధించిన ప్రతి సమస్యకూ చాలావరకు మన దగ్గరే పరిష్కారాలు ఉంటాయి. ఇదీ అంతే!
నిన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అంటే దానర్థం నువ్వు ఎవరికీ అర్థం కానట్టు ప్రవర్తిస్తున్నావని.
ఇప్పుడు రెండే దారులు.
ఒకటి నువ్వు మారాలి. అంటే ... నీ వైపు నుంచి కాకుండా అవతలి వైపు నుంచి ఆలోచించాలి. నీలో లోపాలున్నాయి అనిపిస్తే సరిదిద్దుకోవాలి.
*ఇక రెండోది.*
నిన్ను నువ్వు సరిగా చూపించుకోవాలి. నువ్వేంటన్నది కొత్తగా నిరూపించుకోవాలి. నీ అభిప్రాయాన్ని సరిగా కమ్యూనికేట్ చేయాలి. సరిగా అంటే ఎలా అనేది సందర్భాన్ని బట్టి నువ్వే ఆలోచించుకోవాలి. వీటినే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఈ నైపుణ్యాలు ఉంటేనే లోకానికి కనబడతావు. సమాజం నిన్ను గుర్తిస్తుంది.
నీ ఆత్మహత్య నిర్ణయాన్ని ఒక ఆరు నెలలు వాయిదావేసుకో!
ఇన్ని రోజులు అనుభవించిన కష్టాలను మరో ఆరు నెలలు అనుభవించడానికి సిద్ధపడు. అంతేకాదు వీలైతే మరింత ఎక్కువగా అనుభవించు!
నేను చెప్పిన విషయాలను ఈ ఆరు నెలలు సాధన చెయ్యి! తర్వాత వచ్చి నీ అనుభవాలు చెప్పు! ఫలితమేమీ లేకుంటే చచ్చి పోయే నిర్ణయం నీ చేతిలోనే ఉంది.
*చివరగా మరొక్క మాట!*
ఇతరుల విలువనూ, గౌరవాన్ని కోరుతున్న నువ్వు, స్వయంగా నీకు నువ్వు ఇచ్చుకునే విలువా, గౌరవం ఎంతో ఒక పెన్ను పేపర్ పెట్టుకుని విశ్లేషించుకో!
అంటూ సుదీర్ఘమైన పరిష్కారాన్ని సూచించింది ఆ భూతం.
భూతమిచ్చిన ఈ సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని విన్న ఆ స్త్రీ " ఇదేదో చచ్చేవరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఇచ్చిన భూతములాగుంది.
అయినా మనుషుల కన్న ఈ భూతమే నయం. నా గోడు విని పరిష్కారాన్ని సూచించిన మనిషి ఒక్కడూ లేడు. ఒకసారి దీని మాట కూడా విని చూద్దాం !అనుకుని, "సరే! ఆరు నెలల తర్వాత వచ్చి కలుస్తాను." అంటూ ఆ దీపాన్ని యథా స్థానం లో వుంచి వెళ్ళిపోయింది ఆ స్త్రీ.
ఆరు నెలలు గడిచిపోయాయి.
ఆ స్త్రీ వచ్చింది. భూమి లోంచి ఆ దీపాన్ని తవ్వి తీసి రాచింది. అందులోంచి భూతం బయటకు వచ్చి ఆనందం తో వెలిగిపోతున్న ఆ స్త్రీ ముఖం చూసి, "ఏం జరిగింది?" అని అడిగింది.
"ఏం చెప్పాలి? ఒకటా? రెండా? అన్నీ మార్పులే!" అంది నవ్వుతూ.
ఆత్మవిశ్వాసం తో కూడిన స్వచ్ఛమైన ఆమె నవ్వును భూతం విస్మయంగా చూస్తూవుంటే ఆ స్త్రీ చెప్పసాగింది.
ఇన్నిరోజులు నా అశాంతినీ, ఒంటరితనాన్నీ మరిచిపోవడానికి 'టీ.వి' కి బాగా అలవాటు పడ్డాను. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత నన్ను ఆలోచించకుండా చేస్తూ, నా సమయాన్నంతా తినేస్తున్న టీ.వీ అలవాటు ను అరగంట కు కుదించాను.
అంతకు ముందు టి.వి చూస్తూ, పాటలు వింటూ, ముచ్చట్లు పెడుతూ, మధ్యమధ్య ఫేస్బుక్ - వాట్సప్ లు చెక్ చేస్తూ నేను చేసే ఏకాగ్రత లేని పనుల వల్ల రోజంతా బిజీగా ఉన్నాగానీ, నా పనులు తెమిలేవి కావు.
ఇప్పుడు చేసే పనిలో లీనమై ఏకాగ్రతగా చేయడం వల్ల పనులు తొందరగా పూర్తి కావడమే కాకుండా చాలా సమయం మిగులుతుంది కూడా!
డైరీ రాయడం ప్రారంభించాను. నా బలాలూ, బలహీనతలు అర్థమవ్వసాగాయి.
మనస్సులో అశాంతిగా ఉండడం వల్ల రాత్రిల్లు అనవసర కాలక్షేపం చేస్తూ ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే దానిని.
ఆలస్యంగా నిద్ర లేచిన నేను పిల్లలకు స్కూల్ బస్ వచ్చే టైం అవుతుందని నేను టెన్షన్ పడుతూ పిల్లలను కూడా టెన్షన్ పెడుతూ గట్టిగా అరుస్తూ నిద్ర లేపే దానిని. అలాగే అరుస్తూనే వాళ్లను రడీ చేయించేదాన్నీ.
నాకు తెలియకుండానే పిల్లలకు కూడా "టెన్షన్ పడడాన్నీ, అసంపూర్తిగా పనులు చేసే విధానాన్నీ అభ్యాసం చేయిస్తున్నాను." అన్న విషయాన్ని గమనించలేకపోయాను.
"నీకు తెలుసా! గతంలో నీ దగ్గరకు వచ్చే వరకూ నా పిల్లల నుదిటిపై ముద్దు పెట్టుకుని ప్రేమగా పిలుస్తూ నిద్రలేపి కావలించుకున్న సందర్భం ఒక్కటీ లేదు."
ఇప్పుడు నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను.
ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను. రాత్రి తొందరగా పడుకొని తెల్లవారుజామునే నిద్ర లేస్తున్నాను. వెంటనే స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఒక పదినిమిషాలు హృదయ పూర్వకంగా నా ఆత్మస్వరూపంగా ఉన్న భగవంతుని ప్రార్థించి నా భర్తా, పిల్లలను నిద్ర లేపుతున్నాను.
నాలో ఆత్మ విశ్వాసమూ, జ్ఞానం పెరుగుతున్నా కొద్ది అనవసర అనుమానాలూ, మూఢ నమ్మకాలు తొలగిపోసాగాయి.
అంతకుముందు స్నానం తర్వాత ప్రక్క బట్టలు ముట్టుకోకూడదని దూరంగా ఉండి అరుస్తూ నిద్ర లేపే దాన్ని.
రాతి విగ్రహంలోనే దేవున్ని దర్శించే నేను, నా భర్తా, పిల్లలలో దర్శించలేనా?
కృష్ణ జయంతి రోజు కృష్ణవిగ్రహాన్ని పడుకోబెట్టి ఊపే ఉయ్యాల ఎంత పవిత్రమైనదో, నా భర్తాపిల్లలు పడుకునే మంచం - బట్టలు అంత పవిత్రమైనవి కావా?
అందుకే నా పిల్లలకు "యశోద"నయ్యాను.
నా భర్త కు "రాధ"నయ్యాను.
అలా ప్రేమగా నా భర్తాపిల్లలను నిద్ర లేపి వాకింగ్ తీసుకెళ్ళడం ప్రారంభించాను. అంతకు ముందు ప్రతిదానికి ఎదురు చెప్పే నా భర్తాపిల్లలు, మారు మాట్లాడకుండా నాతో ఉత్సాహంగా వాకింగ్ కు రాసాగారు.
ఆ ప్రభాతసమయంలో చల్లని పిల్లగాలులు వీస్తూ ఉండగా నా కుటుంబంతో కలిసి నేను ఆత్మ విశ్వాసంతో అడుగులు వేస్తూ నడుస్తూవున్నప్పుడు భరించలేని నా ఒంటరితనమంతా ఒక్క క్షణంలో ఎగిరిపోయింది.
నాకు ఇంగ్లీషు లో బాగా మాట్లాడాలని కోరిక. కానీ, చాలా భయపడేదాన్ని. ఒక రెండు నెలలు తీవ్రంగా శ్రమించి, ఇంగ్లీషు లో అనర్గళంగా మాట్లాడడాన్ని అభ్యాసం చేశాను. మా ఆఫీసుమీటింగ్ లో నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూసి తర్వాత చప్పట్లతో నన్ను అభినందించారు.
నా భర్తాపిల్లలను కారులో కూర్చోబెట్టుకుని నేను డ్రైవ్ చేస్తూ కారులో ప్రయాణించాలని కోరికగా ఉండేది. కారు డ్రైవింగ్ నేర్చుకుని ఆ కోరికా తీర్చుకున్నాను.
చెబితే నమ్మవు కానీ, ఈ వయస్సులో స్విమ్మింగ్ నేర్చుకుని నా భర్తతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరిక తీర్చుకున్నాను. ఈ సెలవులలో నా పిల్లలకూ స్విమ్మింగ్ నేర్పించి నా కుటుంబంతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరికను కూడా తీర్చుకుంటాను. ఇది విని ఒక చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నానని అనిపించవచ్చు! కానీ, ఒక స్త్రీకి తన కుటుంబం తో కలిసి ఇలాంటి చిన్న చిన్న ఆనందాల వల్ల పొందే తృప్తి వెలకట్టలేనిది.
నాలో ప్రశాంతత పెరిగిన కొద్దీ నా భర్త కూడా నాకు అర్థమవ్వసాగాడు. అతనొక జర్నలిస్టు. తన వృత్తిని బాగా ప్రేమిస్తాడతడు. ఒక విషయాన్ని చూసి అందులోని మంచి - చెడులను విశ్లేషించే తత్వం అతని నుండి వేరు చేయలేంతగా అతనిలో జీర్ణమైపోయింది. అతనిలో అభ్యాసమైన ఈ గుణం వల్ల గతంలో నాలోని మంచి - చెడులను కూడా విశ్లేషించేవాడు. నాలోని పొరపాట్లు గూర్చి ఆతను చెబుతున్నపుడు నేను ఆవేశంతో రగిలిపోయేదాన్ని.
గతంలో "నేను తలదువ్వుకుని చాలా సార్లు దువ్వెనకు అలాగే వెంట్రుకలుంచే విషయం గొడవగా మారి ఒక పదిరోజులు మాట్లాడుకోని సంగతి " గుర్తుకువస్తుంది.
ఇంత చిన్నవిషయం గూర్చి ఇతనికెందుకు పట్టుదల? అని ఆలోచించేదాన్ని. కానీ అది చిన్న విషయం కాదనీ, నాలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికీ - నిర్లిప్తితకు గుర్తని ఇప్పుడు నాకర్థమౌతుంది. ఇలా అతన్ని వృత్తితో సహా అర్థం చేసుకున్న తర్వాత అతను నాకు అర్థమవ్వసాగాడు. క్రమంగా అతడు అర్థమౌతున్నాకొద్దీ, అతని అద్భుతమైన వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోయాను.
అతను నాపట్ల ఆసక్తి చూపాలంటే, అతనికిష్టమైన విషయాల్లో నేనూ ఆసక్తి చూపాలన్న ప్రాథమిక సూత్రాన్ని నేను గ్రహించాను. పేపర్ లో వచ్చిన అతడు రాసిన వార్తలనూ, వ్యాసాలనూ శ్రద్ధగా చదివి విశ్లేషించి అతన్ని ప్రోత్సహించడం ప్రారంభించాను.
నాలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పును చూసి నా భర్త మొదట్లో నా మీద విపరీతమైన గౌరవంతో కొన్ని రోజులు దగ్గరకు రావడానికే ధైర్యం చాలక తటపటాయించాడు. నేనూ కొన్ని రోజులు బింకాన్ని నటించి, అతని ఇబ్బందిని చూసి ఫక్కున నవ్వేసి వెళ్లి కావలించుకున్నాను.
ఇప్పుడు నాకు కుటుంబ సభ్యులతో పట్టుదలలు లేవు. అన్నీ పట్టు విడుపులే!
నీకో విషయం చెప్పనా? మా వివాహమైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా భర్తను నిజంగా ప్రేమించడం మొదలు పెట్టాను.
ఇక చుట్టుప్రక్కల జరిగే చెత్త విషయాలన్నీ తీసుకుని ఉసుపోని కబుర్లకోసం మా ఇంటికి కొంతమంది వచ్చేవారు. మొహమాటంతో నా పని మానుకుని ముచ్చట్లు పెట్టేదాన్ని. వాళ్ళవల్ల నా సమయమూ, మనస్సూ రెండూ చెడిపోయేవి. అలా వచ్చేవారికి "కొంచం కూరగాయలు తరిగి పెట్టవా? బోళ్ళు కడగడంలో హెల్ప్ చెయ్యవా?" అంటూ పనులు చెప్పడం మొదలు పెట్టాను. చాలామంది రావడం మానుకున్నారు. నా స్నేహాన్ని నిజంగా కోరుకునే స్నేహితులు మాత్రం వస్తూనే ఉన్నారు.
ఇప్పుడు నన్నెవరూ అర్థం చేసుకోవలసిన అవసరం లేదనిపిస్తుంది. నేనే అందరిని అర్థం చేసుకోగలను.
మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా?
ప్రధానమంత్రి స్త్రీ సమస్యలపై మాట్లాడడానికి దేశం లోని కొంత మంది మహిళలతో ఒకమీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్ కు నేనూ ఎంపికయ్యాను. ఆ రోజు నేను మాట్లాడిన విషయాలను మీడియా హైలెట్ చేసింది. ప్రధానమంత్రిగారు నన్ను ప్రత్యేకంగా అభినందించారు.
ఇప్పుడు నేను చాలా మందికి తెలుసు. నన్ను చూసి మా బాస్ నిలుచుండి విష్ చేయడం మొదలు పెట్టాడు.
ఇప్పుడు నేను వృథాగా సమయాన్నీ , డబ్బునూ, ఆహారాన్నీ , మాటలనూ, కన్నీళ్ళనూ, భావావేశాలనూ ఖర్చు చేయడాన్ని మానుకున్నాను. నాకు తెలియకుండానే నా ముఖం పై చిరునవ్వు కదలాడుతుంది.
"ఉద్ధరేదాత్మనాత్మానం" అని గీతా, ఉపనిషత్తులు చెప్పిన మాటలు మరచి ....ఎవరో టీ.వి లో 'గురువారం మఱ్ఱిచెట్టు కు పాలుపోయ్యు !' అంటే వెళ్లి పోశాను. ' శుక్రవారం రాగిచెట్టు క్రింది మట్టిని బొట్టు పెట్టుకో! " అంటే వెళ్లి పెట్టుకున్నాను.
నా భర్తాపిల్లలూ, పరిస్థితులు మారుతాయని ఆశపడ్డాను.మార్పు బయటనుంచి వస్తుందని ఎదిరిచూశాను.
మార్పు లోపలినుంచే వస్తుందని ..మారాల్సింది నేనేనని నాకిప్పుడర్థమైంది.
ఇదంతా నీవల్లే!
నా ఆత్మహత్య ను తప్పించావు.
నాకో కొత్తజీవితాన్ని ప్రసాదించావు.
నన్నో వ్యక్తిగా నిలబెట్టి విలువా,గౌరవం రావడానికి కారణమయ్యావు.
ముఖ్యంగా "నేనంటే నాకు బాగా ఇష్టం కలిగేటట్లు చేశావు."
ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేనిది.
నిజంగా నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కృతజ్ఞతతో కూడా కళ్ల వెంబడి నీళ్లొస్తాయన్న సంగతి నాకు మొదటిసారిగా తెలుస్తుంది.
సరే! "నా సంగతి అలా ఉండనీ! నీ వివరాలు చెప్పు" అన్నదా స్త్రీ కృతజ్ఞతాభాష్పాలను తుడుచుకుంటూ.
ఆ స్త్రీ మాటలు విన్న భూతం ఆనందంతో ఇలా చెప్పసాగింది.
" నేను గతంలో నువ్వు ఉన్న స్థితిలోనే ఉండి , ఇదే కొండ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుని ఇలా భూతన్నయ్యాను. చచ్చి భూతాన్ని అయ్యాక నేను చేసిన తప్పు తెలిసొచ్చి జ్ఞానం వచ్చింది.
నేనున్న స్థితి ఎలాంటిదంటే,
ఆకలౌతుంది కానీ, తినలేను.
నిద్రొస్తుంది కానీ, విశ్రాంతి తీసుకోలేను. అన్ని రకాల కోరికలు కలుగుతాయి కానీ, తీర్చుకోలేను. దుర్భరంగా, పరమ యాతనగా ఉంటుంది.
ఈ ప్రేతశరీరంలో వుండడం ఇష్టం లేక ఈ కొండకు వచ్చిన ఒక నిజమైన మహాత్ముని కాళ్లావేెళ్ళా పడి విముక్తి కలిగించుమని పార్థించాను.
నా ప్రార్థన విన్న అతడు ...
" ఆత్మహత్య మహా పాపం."
నీ జీవితాన్నీ - ఆయుష్షును వ్యర్థం చేశావు. నీ పాపం తొలిగిపోవాలంటే నీవల్ల మూడు విషయాలు జరగాలి.
1. ఒకరిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలి.( ప్రాణదానం )
2. నీ మాటలు ఒక వ్యక్తి క్రొత్త జీవితం పొందడానికి కారణం కావాలి. ( జ్ఞానదానం)
3. ఆ వ్యక్తి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ( పై రెండింటి దాన సిద్ధి )
అంత వరకు ప్రేతయాతనలు పొందకుండా ఈ దీపం లో ఉంచుతాను అంటూ దీపంలో ఉంచి ఇక్కడ పాతిపెట్టాడు.
ఎవరైనా నీతులు చెప్పగలరు.కానీ ఆచరించడం లోనే ఉంది గొప్పంతా!
నీ శక్తిసామార్థ్యాలవల్లనే ఇదంతా నువ్వు సాధించావు. నేను చేసిందేమీ లేదు.
నీ వల్ల నా మూడు విషయాలు ఒకేసారి నెరవేరి నాకు ప్రేతరూపం నుండి విముక్తి లభించింది.నీకే నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆ భూతం "సూర్య నటించిన రాక్షసుడు సినిమాలోని ఆత్మలా" బంగారు రేణువులుగా విడిపోతూ శూన్యంలో కలిసి పోయింది.
"ఒకరికి సహాయం చేయడం లోనే మన మేలు కూడా ఉందన్న" క్రొత్త సత్యాన్ని తెలుసుకున్న ఆ స్త్రీ కొంగ్రొత్త ఉత్సాహంతో తెలుసుకున్న ఆ సత్యాన్ని ఆచరణ లో పెట్టడానికి బయలుదేరింది.
** స్వస్తి **
(ఓపికగా చదివిన వారికి ధన్యవాదములతో)
*సమస్త లోకా సుఖినోభవంతు!*
(రసజ్ఙభారతి సౌజన్యంతో-
శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి పోస్టు.)