*ధన్యజీవి..*
"దిగంబరిగా ఉంటూ..కఠోర తపస్సు ఆచరిస్తూ..తనను మనస్ఫూర్తిగా విశ్వసించిన వాళ్లకు జ్ఞాన బోధ చేస్తూ..తన మరణాన్ని ముందుగానే తెలుసుకొని..మోక్షప్రాప్తికి కపాలమోక్షమే మార్గమని తలచి..వైశాఖ శుద్ధ సప్తమి నాటి రాత్రి ఆ పరమాత్మలో ఐక్యం చెందిన అవధూత మందిరం వద్ద ఉన్నాము..మరి కొద్దిసేపటిలో ఆ దిగంబర అవధూత సమాధిని దర్శించబోతున్నాము..మీయొక్క మనసులోని కోరికలను స్వామివారి సమాధి వద్ద కోరుకోండి..పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో ఈ స్వామిని నమ్మిన వారి కోర్కెలు నెరవేరుతాయని తెలుసుకోండి.." అంటూ తనతో పాటు వచ్చిన భక్తులకు చెపుతున్నారు ఆవిడ..ఆవిడను ఇంతకుముందు నేనెప్పుడూ చూడలేదు..మొగిలిచెర్ల లాంటి మారుమూల పల్లెటూరులో ఉన్న ఈ క్షేత్రం గురించి..ఇక్కడ సిద్ధిపొందిన అవధూత దత్తాత్రేయుడి గురించి అన్ని విషయాలు వర్ణించి మరీ తన తోటి వచ్చిన వారికి చెపుతోంది..ఆమె గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా నాలో కలిగింది..
ఆ వచ్చిన యాత్రీకులు సుమారు యాభై మంది దాకా వున్నారు..కృష్ణాజిల్లా నుంచి ఒక ప్రత్యేక బస్సు మాట్లాడుకుని..ఒంగోలు, నెల్లూరు పరిసర ప్రాంతాలలో ఉన్న ఆలయాలు అవధూతల మందిరాలు దర్శిస్తూ..మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..ఆ యాభై మందితో కలిసి వచ్చిన ఆవిడ..మిగిలిన వారికి ఈ క్షేత్రం గురించి విడమరిచి చెపుతున్నది..ఆవిడ వయసు దాదాపు డెబ్భై ఏళ్ళు వుంటాయేమో..ఏమాత్రం తడబాటు లేకుండా..స్వామివారి గురించి చక్కగా చెపుతున్నది..
అందరూ స్వామివారి సమాధిని దర్శించుకున్న తరువాత..మంటపం లో ఒక ప్రక్కగా కూర్చున్నారు..అప్పటికి సమయం ఉదయం పది గంటలు..అంతవరకూ స్వామివారి గురించి మాట్లాడుతున్న ఆవిడ వద్దకు వెళ్లి..నన్ను నేను పరిచయం చేసుకొని.."అమ్మా..మీరు ఈ స్వామివారి గురించి మీతోటి వాళ్ళతో చెప్పడం నేను విన్నాను..మీరెప్పుడైనా ఈ క్షేత్రానికి వచ్చారా?..మీకు ఇంత వివరంగా ఎలా తెలుసు?..మీరు ఈ ప్రాంతం వారేనా?..మిమ్మల్ని నేను ఎప్పుడూ చూసి ఉండలేదు..మీరేమీ అనుకోకుండా నా సందేహాలు తీరుస్తారా?.." అని అడిగాను..
"మీరు శ్రీధరరావు, ప్రభావతి గార్ల కుమారుడా?..చాలా సంతోషంగా ఉంది నాయనా..నా పేరు సుభద్ర..మీ తల్లిదండ్రులు నాకు పరిచయం..శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి అనుయాయులం..మాస్టారు గారు 1980 లోనో..82 లోనో ఈ మందిరాన్ని దర్శించుకున్నారు..వారు మాకు ఈ స్వామివారి గురించి ఎంతో గొప్పగా చెప్పేవారు..అప్పట్లో నేను మా తల్లిదండ్రులతో కలిసి ఇక్కడకు రెండు మూడు సార్లు వచ్చాను..మీ అమ్మా నాన్న గార్లతో కూడా అప్పుడే పరిచయం కలిగింది..మేము ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ..మీ అమ్మగారు మాకు భోజనం వండి వడ్డించే వారు..మీ అమ్మా నాన్న గార్ల ద్వారా ఈ స్వామివారి గురించి పూర్తిగా తెలుసుకున్నాను..నన్ను నోరారా సుభద్రా అని పిలిచేవారు..నాకు వివాహం జరిగి ఐదేళ్ల కు కూడా సంతానం కలుగక పోతే..అమ్మా నువ్వొక్కసారి నీ భర్త తో కలిసి మొగిలిచెర్ల లోని స్వామివారి మందిరం వద్ద నిద్ర చేయమ్మా..ఫలితం ఉంటుంది..అని మీ అమ్మగారు ఒంగోలు వచ్చినప్పుడు చెప్పారు..ఆమె మాట విని..మా ఆయనను ఒప్పించి ఇక్కడికి వచ్చి మూడు రాత్రులు నిద్ర చేసాము..సంవత్సరం కల్లా అమ్మాయి పుట్టింది..మరో రెండేళ్లకు అబ్బాయి పుట్టాడు..నన్ను సాక్షాత్తూ ఈ స్వామివారు ఆశీర్వదించారు..అప్పుడప్పుడూ వస్తున్నాను గానీ..ఏదో నా పాటికి నేను వచ్చి దర్శనం చేసుకొని వెళుతూ ఉండేదాన్ని..మీ అమ్మా నాన్న అనారోగ్యం తో వున్నప్పుడు కూడా నేను వచ్చి వెళ్ళాను..వాళ్ళను చూసి వెళ్ళాను..ఎటొచ్చీ..నీతో నాకు పరిచయం కలుగలేదు..ఇన్నాళ్లకు నువ్వే పలకరించుకున్నావు..అదే చాలు నాయనా.." అన్నారు..
మా సిబ్బందికి చెప్పి..అందరికీ భోజన ఏర్పాటు చేయమని చెప్పాను..(అప్పటికి మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద అన్నదానం మొదలు కాలేదు..ఇలా ఎవరన్నా వస్తే..అప్పటికప్పుడు వండించే వాళ్ళం..) సుభద్ర గారూ..మిగిలిన యాత్రీకులు అందరూ భోజనాలు చేసి మళ్లీ వచ్చి మంటపం లో కూర్చున్నారు.."స్వామివారి జీవిత చరిత్రను మీ అమ్మగారు వ్రాసారు నాయనా..మాస్టారు గారి ఆధ్వర్యంలో సాయిబాబా అనే పత్రిక ఉండేది..అందులో మొదటిసారి ప్రచురించారు..మాస్టారు గారే దానిని పుస్తకరూపం లో కూడా తీసుకొచ్చారు..ఆ పుస్తకం తాలూకు రెండు కాపీలు నా వద్ద భద్రంగా ఉన్నాయి..ఇప్పటికీ పారాయణం చేస్తూ వున్నాను..నా ఊపిరి ఉన్నంత వరకూ ఓపిక చేసుకొని అప్పుడప్పుడూ వస్తుంటాను నాయనా..ఈరోజు నేనెవరో తెలియక పోయినా..ఆప్యాయంగా పలకరించావు..చాలా సంతోషం గా ఉంది.." అని చెప్పారు..ఆరోజు మధ్యాహ్నం అందరితో పాటు బస్సెక్కి వెళ్లిపోయారు..ఆ తరువాత కూడా మూడు సార్లు సుభద్ర గారు స్వామివారి మందిరానికి వచ్చారు..అత్యంత భక్తితో స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని వెళ్లారు..మూడేళ్ల క్రితం సుభద్ర గారు పరమపదించారని వాళ్ళ కుమారుడు తెలిపారు..ఆఖరి రోజు కూడా ఆవిడ స్వామివారి చరిత్రను పారాయణం చేశారని అతను చెప్పాడు..
పరిపూర్ణ జీవితాన్ని పొందిన సుభద్ర గారు ధన్యజీవి!!
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి