7, ఏప్రిల్ 2022, గురువారం

రామాయణానుభవం_ 10


 రామాయణానుభవం_ 10


దశరథునితో తన యాగ రక్షణకు రాముణ్ణి పంపమని తెలుపుతూ విశ్వామిత్రుడు...


 *అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ |* 

 *వసిష్ఠోఽపిమహాతేజా యే చేమే తపసి స్థితాః* 


 *ధశరథుడు* : ఏమయ్యా మహర్షి ! నా కొడుకు గురించి నాకే క్రొత్తగా చెప్పుచున్నావే ! నాకు తెలియదా ఆయన గురించి !


 *విశ్వామిత్రుడు* : మహారాజా!! నీకు రాముని గురించి పూర్తిగా తెలియదు నీవు కేవలము సాధారణ బాహ్యనేత్రములతో చూడగల్గుతావు. కేవలము వందిమాగధులతో పరివేష్టింపబడే నీకు శ్రీరామతత్వము తెలియదు. నిరంతర శస్త్రాస్తధారిపైన నీకు రాముని గురించి ఎలా తెలుస్తుంది ! భోగపరాయణుడవు. రజోగుణయుక్తుడవు, సింహాసనోపవిష్ణుడవు. పుత్రవ్యామోహితుడవు అర్థకామపరుడవు, నీకు రామతత్వము అర్థమౌతుందా !


నేనోజ్ఞాననేత్రుడను. వృద్దోపసేవిని, జితేంద్రియుడను సాత్విక ప్రకృతి కలవాడను, ధర్మకార్యపరాయణుడను, యోగక్రమవేత్తను, మోక్షగామిని, నాకు అందువలననే రామతత్వము పూర్తిగా అర్థమైంది.


 *ధశరథుడు* : మహామునీ ! నీకు సుకుమారుడైన నారాముని గురించి ఏమి తెలియునయ్యా ? వివరంగా తెవుపవయ్యా !


 *విశ్వామిత్రుడు* : మహారాజా ! నీ కుమారుడు బాలుడే కావచ్చు. తేజస్వంతులకు వయస్సుతో నిమిత్తం లేదయ్యా ! నీ కొడుకు మహాత్ముడు ధైర్యశాలి. శతృదుర్నిరీక్ష్యుడు. సకల ప్రాణులకు అభయదాత ! ఆయనతో సమానులే లోకంలో లేరంటే అధికుల మాట ఎక్కడిదయ్యా ! ఆయన  ధర్మసంస్థాపన కొరకే ప్రయత్నిస్తాడయ్యా ! ఆయనకు ఆగ్రహము వస్తే ఆయన అగ్ని కల్పుడు, సూర్యతేజుడు. ఉపాయశాలి, మహావాయువువలె ఆయన  శతృవులను ఎగురగొట్టుతాడు. ఆశ్రియుతులకాయన మృతసంజీవనము.


 *ధశరథుడు* : "మీరు తెలిపే విశేషణాలన్ని భగవంతునికి వర్తిస్తాయి. అంతేగాని నా రామునికి వర్తిస్తాయా"?


 *విశ్వామిత్రుడు* : చక్రవర్తి ! రాముడంటే ఎవ్వరనుకొంటున్నావు ? సాధారణ మానవ బాలుడు అనుకొంటున్నావా ? నిన్ను స్వయంగా తండ్రిగా వరించి, నీకు అవతరించిన పరమాత్మే ఆయన


" *స,ఉ,శ్రేయాన్ భవతి జాయమానః* " అని వేదము తెలిపినట్లు ప్రతి జన్మలో కూడ వివర్ధమాన తేజస్వి ఆయన


 *ధశరథుడు*:   మహానుభావా ! ఆయన పరమాత్మ అవునో కాదో నాకు తెలియదు. కాని నా రాముడింకా బాలుడే. యవ్వన మింకా అంకురించలేదు. సౌకుమార్యము తగ్గలేదు. ఈయన పరాక్రమంతో శత్రువులతో పోరాడగలడా,…?


 *విశ్వామిత్రుడు* : భూజానీ ! రాముడు సహజ పరాక్రముడు, ఆయన విక్రమము అమోఘము. ఆయన ముందుగా శత్రువులున్న చోటికే వెళ్లి వారిని నిర్జింపగలుగుతాడు హఠాత్తుగా మీద బడ్డ ఎంతటి ప్రబల శత్రువునైనా మట్టి గరిపింపగల్గుతాడు (ప్రహర్త). సకల దేవతా సంరక్షకుడు శ్రీరాముడు. భయంకర శతృవులనైనా క్షమింపగల ఉదారుడు. శతృవులనాయన ఎదిరించడానికి ఆయుధధారణము కూడ అవసరములేదు. సింహమువలెనిద్రాగతుడైనా అరిభయంకరుడే.


*ధశరథుడు* : మహర్షిపుంగవా ! మీరు మాట్లాడే ఈ మాటలు కేవలము మీ పనిని నెరవేర్చుకోవడానికి చెప్పేవి కావు కదా ! మీరే కాక నారాముని మీ వలె తెలిసిన వారింకెవ్వరైనా ఉన్నారా ? లేక మీరొక్కరేనా ?


 *విశ్వామిత్రుడు* : మహిపాలా!నేనొక్కడినే ఎందుకయ్యా!మహాతేజుడు అయిన వశిష్ఠుడు కూడ రామతత్వము పూర్తిగా తెలిసినవాడే. ఆయన నీ కులగురువే కదా? ఆయనను అడిగి చూడు నాకు విరుద్ధంగా మాట్లాడక ఆయన నామాటే అవునని అంటాడు.


వశిష్టుడు అబద్దం చెప్పుతాడా?ఆయన స్వయంగా బ్రహ్మపుత్రుడు. శ్రీరామునికి ఆచార్యులు, నావిషయంలో బ్రహ్మవరాన్ని బల పరుచగలిగిన మహాతేజశ్శాలి. సత్యధర్మ పరాయణుడు. ఆయన అబద్దం చెప్పుతాడా? 


 *దశరథుడు* : ఋషి శ్రేష్ఠా! నీవు, వసిష్ట మహాముని, ఇద్దరే కాక నా రాముని గురించి మీవలే తెలిసిన వారెవ్వరైనా అనేకులున్నారా?


 *విశ్వామిత్రుడు* : ఇదుగో నీ ఎదుట మహర్షులు ఇందరు ఉన్నారు. కదా !  వారిని అడిగిచూడు ఒకరిద్దరయితే అనృతమాడవచ్చు కాని వీరందరు అసత్యము  పలుకుతారా?

వీరందరు అతి నిరాడంబరులు. పరమభాగవత శిఖామణులు. వీరందరు నీ ఎదుటే ఉన్నారే వీరిని నీవే అడిగి చూడు.....


ఇంకా ఈ శ్లోక పరం గా పెద్దలు అనేక విధములైన వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు.....

**

విశ్వామిత్రుడు దశరథునితో సంభాషిస్తూ....


రాజేంద్రా ! ధర్మమూ నీ పేరూ నీప్రతిష్ఠ ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటున్నట్లయితే మరి ఆలోచించక రాముణ్ని నాకు అప్పగించు. నీ మంత్రులూ వసిష్ఠప్రముఖులైన నీ పురోహితులూ హితులూ అంగీకరిస్తేనే నాతో పంపు. అయితే ఒక్కమాట .


ఈ యజ్ఞం దశరాత్రం. సమయం మించిపోకముందే ఒక నిర్ణయం తీసుకో. పుత్ర ప్రేమపట్ల, వియోగదుఃఖంపట్ల

మనస్సు పెట్టకు, నీకు శుభమగుగాక.


ఈ మాటలు వింటూనే దశరథునికి భయం ఆవరించింది. దు:ఖం ముంచుకు వచ్చింది. క్షణం నిశ్చేష్టుడయ్యాడు. సింహాసనంలో ఇబ్బందిగా కదిలాడు. లేచి అటూ ఇటూ తిరిగాడు. ఎట్టకేలకు నోరువిప్పి మెల్లగా పలికాడు 


నిండా పదహారు సంవత్సరాలు లేవు నా రామునికి. రాజీవలోచనుడైన అతడు రాక్షసులతో యుద్ధానికి తగినవాడని నేను అనుకోవడం లేదు....


*ఊనషోడశవర్షోమే రామో రాజీవలోచనః*

*నయుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః*


పుత్ర స్నేహంతో తడబడుతున్న మాటలతో దశరథుడు ఇలా పలికేసరికి కౌశికునికి కోపం వచ్చింది. అగ్నిలో ఆజ్యం పోసినట్టయ్యింది.


రాజా ! ముందేమో ఏది అడిగితే అది చేస్తానన్నావు. తీరా అడిగాక ఇప్పుడేమో నావల్ల కాదంటున్నావు. ప్రతిజ్ఞాభంగానికి పాల్పడుతున్నావు. ఇది రఘువంశంలో పుట్టిన వ్యక్తికి తగిన పనికాదు. సరే - ఇంతకూ ఇదే నీ తుది నిర్ణయమైతే - పోనీ - వచ్చిన దారినే వెళ్ళిపోతాను. కాకుత్స్థ ! మాట తప్పినవాడవై బంధుగణంతో హాయిగా సుఖంగా జీవించు


మహామునీ! ఇదిగో అక్షౌహిణీ సైన్యం. దీనికి నేను సర్వాధిపతిని. దీనితో నేనే కదలివస్తాను. నా సైనికులు అస్త్ర విశారదులు. రాక్షసులతో యుద్ధం చెయ్యగలవారు. నేను స్వయంగా ధనుష్పాణినై వచ్చి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతాను. నీ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. రాముడు మాత్రం వద్దు. వీడు బాలుడు. ఇంకా విద్య పూర్తి కానివాడు. బలాబలాలు ఎరగని వాడు. అస్త్ర బలం లేనివాడు. యుద్దకౌశలం తెలియనివాడు. అవతల రాక్షసులేమో కూట యుద్ధంలో నేర్పరులు. వద్దు - రాముడు మాత్రం వద్దు.


పైగా నలుగురు బిడ్డలలోనూ నాకు రాముడంటేనే ప్రేమ ఎక్కువ. జ్యేష్ఠుడూ, ధర్మప్రధానుడూను మహర్షీ ! దయచేసి రాముణ్ని మాత్రం అడగవద్దు....


పైగా- నీయజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్న మారీచ సుబాహులు సుందోపసుందుల కొడుకులు.  వారితో యుద్ధం చెయ్యడానికి నా బిడ్డను పంపలేను....


పుత్ర స్నేహంతో తడబడుతున్న మాటలతో దశరథుడు ఇలా పలికేసరికి కౌశికునికి కోపం వచ్చింది. అగ్నిలో

ఆజ్యం పోసినట్టయ్యింది.


రాజా ! ముందేమో ఏది అడిగితే అది చేస్తానన్నావు. తీరా అడిగాక ఇప్పుడేమో నావల్ల కాదంటున్నావు. ప్రతిజ్ఞాభంగానికి పాల్పడుతున్నావు. ఇది రఘువంశంలో పుట్టిన వ్యక్తికి తగిన పనికాదు. సరే - ఇంతకూ ఇదే నీ తుది నిర్ణయమైతే - పోనీ - వచ్చిన దారినే వెళ్ళిపోతాను. కాకుత్స్థ ! మాట తప్పినవాడవై బంధుగణంతో హాయిగా సుఖంగా జీవించు.......

[25/03, 8:52 am] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 11


విశ్వామిత్రుడికి కోపం వస్తోందన్న విషయాన్ని విశిష్టుల వారు గ్రహించి దశరథుని తో.....


మహారాజా! దశరథా ! ఇక్ష్వాకు వంశలో జన్మించావు. సాక్షాత్తు ధర్మస్వరూపుడుగా జీవిస్తున్నావు. స్థిరచిత్తం

కలవాడవు. నీవు ధర్మాన్ని విడిచిపెట్టడం తగని పని సుమా ! ముల్లోకాలలోనూ ధర్మాత్ముడుగా నీవు ప్రసిద్ధుడవు. ఆ పేరు నిలబెట్టుకో. అధర్మాన్ని అప్రతిష్ఠనూ నీవు భరించలేవు. యజ్ఞయాగాలు చేసి సప్త సంతానాలు స్థాపించినా ఆడినమాట తప్పితే అంత పుణ్యమూ నిష్ఫలమైపోతుంది. అందుచేత రాముణ్ని పంపించు.


కృతాస్తుడో అకృతాస్త్రుడో రామునికి ఏ కీడూ ఏ ఆపదా కలగదు. అగ్నిసంరక్షితమైన అమృతంలాగా విశ్వామిత్రుని సంరక్షణలో ఉన్న రాముణ్ని రాక్షసులు ఏమీ చెయ్యలేరు. ఈ విశ్వామిత్రుడెవ రనుకుంటున్నావు? రూపు దాల్చిన ధర్మం. బలవంతులలోకెల్లా బలవంతుడు. బుద్ధిమంతులలో కెల్లా బుద్ధిమంతుడు. తపస్సుకు పరాకాష్ఠ.ముల్లోకాలలోనూ సచరాచర సర్వ ప్రకృతిలోనూ విశ్వామిత్రునికి తెలియనిది లేదు. ఇతడు ఎరుగని అస్త్రం లేదు ఇతడిని తెలుసుకొన్నవాడుగానీ ఇతనికి తెలిసినన్ని తెలిసినవాడుగానీ మరొకడు లేడు, ఉండబోడు.


ఇక్ష్వాకువంశవర్ధనా ! మరొక విశేషం ఆలకించు. ఈ కుశికనందనుడు రాజ్యం ఏలుతున్న సమయంలో భృశాశ్వుడు తన సంతానమైన వంద దివ్యాస్త్రాలనూ ఇతనికి సమర్పించాడు. దక్షప్రజాపతికి దౌహిత్రులైన ఆ దివ్యాస్త్రాల శక్తి వర్ణనాతీతం. జయ-సుప్రభ అనే దక్ష ప్రజాపతి పుత్రికలు ఈ అస్త్రాలకు మాతృమూర్తులు. అసురసైన్య వినాశనం కోరి ఏబదేసి అస్త్రాలను వీరు ప్రసవించారు. అవన్నీ ఈ విశ్వామిత్రునికి వశంవదమై ఉంటాయి. వాటి ప్రయోగోప సంహారాలు నేర్చినవాడూ నేర్పగలవాడూ ఇతడొక్కడే. ఇటువంటి మహాతేజస్సంపన్నుడైన విశ్వామిత్రుని వెంట రాముణ్ని పంపడానికి సంశయించకు.


ఇలా వసిష్ఠుడు చెప్పగా దశరథుని మనస్సు కలత దేరింది. సంతోషంగా రామలక్ష్మణులకు కబురు పంపించాడు కౌసల్య ఆశీర్వదించి పంపింది. సుమిత్రా కైకా ఆశీర్వదించారు. వసిష్ఠుడు మంత్రరూపంలో శుభం పలికాడు. ఒక్కసారి గట్టిగా కౌగిలించుకొని శిరస్సు ఆఘ్రాణించి దశరథుడు రాముణ్ని విశ్వామిత్రునికి సంతుష్టాంతరంగుడై అప్పగించాడు.


రాజీవలోచనుడైన రాముడు ఇప్పుడు విశ్వామిత్రుని పక్షాన నిలబడ్డాడు. శుభసూచకంగా దుమ్మూ ధూళీ లేని చల్లనిగాలి వీచింది. పుష్పవృష్టి కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. శంఖారావాలు వినిపించాయి. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు బయలుదేరారు.....


ముందు విశ్వామిత్రుడు అతివేగంగా - వెనక్కు తిరిగి చూడకుండా నడుస్తున్నాడు. కాకపక్ష ధరుడై ధనుర్బాణాలు ధరించి రాముడు అనుసరిస్తున్నాడు. అతని వెంట లక్ష్మణుడు నడుస్తున్నాడు. బ్రహ్మదేవుని వెంట అశ్వినీ దేవతల్లాగా, శివునివెంట అగ్నిశిఖల్లాగా నడుస్తున్నారు. మూడుతలల పాములాగా నడక చరచరా సాగుతోంది యోజనమూ మరో అర్ధయోజనమూ నడిచి సరయూ దక్షిణతీరం చేరారు.....

**

విశ్వామిత్రుని వెంట రామ లక్ష్మణులు సరయూ నదిదక్షిణాతీరం చేరారు.

రామా..! అని విశ్వామిత్రుడు మధురం గా పిలిచాడు...


వత్సా! త్వరగా నదిలో ఆచమించి రా! ముహూర్తవేళ మించిపోకుండా బల ల అతిబలలు ఉపదేశిస్తాను. స్వీకరించు. ఇవి దివ్య మంత్రాలు, వీటిని ఉపాసిస్తే నీకు శ్రమ ఉండదు. జ్వరం ఉండదు. రూపంలో మార్పురాదు నిద్రలో కూడా రాక్షసులు నిన్ను ఏమీ చెయ్యలేరు. బాహుపరాక్రమంలో బుద్ధి నిశ్చయంలో కీర్తిలో నీకు సాటివచ్చే వీరుడు ముల్లోకాలలోనూ ఉండడు. ఈ బల అతిబలలు సర్వజ్ఞానానికీ తల్లులు. వీటిని పఠిస్తే మార్గాయాసమూ క్షుత్పిపాసలూ ఉండవు. ఇవి బ్రహ్మపుత్రికలు. నీకు ఉపదేశిస్తాను. నీవు అర్హుడవు. సమస్త సద్గుణాలూ నీకు ఉన్నాయి నిన్ను ఆశ్రయించి ఈ విద్యలు రాణిస్తాయి. త్వరపడు. సూర్యాస్తమయం కాకముందే శుచిపై వీటిని స్వీకరించు


రాముడు త్వరత్వరగా సరయూనదిలో దిగి ఆచమించి శుచిగా వచ్చి ఆ విద్యలు స్వీకరించాడు. రామునిలో ఒక కొత్త కాంతి వెల్లివిరిసింది. శరత్కాల సూర్యునిలాగా ప్రకాశించాడు. మంత్రోపదేశం ఇచ్చిన గురువుకు చెయ్యవలసిన ఉపచారాలన్నీ యథావిధిగా రామలక్ష్మణులు నిర్వహించారు. గడ్డి పరుచుకొని ముగ్గురూ ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు.


తెల్లవారింది. తృణశయనం మీద నిద్రిస్తున్న రాకుమారులను చూసాడు విశ్వామిత్రుడు.


*కౌసల్యాసుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |*

*ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్||*


కౌసల్యానందనా ! రామా! ప్రాతస్సంధ్య నడుస్తోంది, నిద్రలే! నరోత్తమా ! దైవ సంబంధమైన ఆహ్నిక క్రియలు సంధ్యావందనాదులు, నిర్వర్తించాలి గదా!

మేలుకొల్పుతో రామలక్ష్మణులు నిద్రలేచారు. 

స్నాన సంధ్యాదులు ముగించారు. ప్రయాణానికి సిద్ధమై మునికి నమస్కరించి నిలిచారు. మార్గదర్శకుడుగా మహర్షి నడిచాడు. రామలక్ష్మణులు యథావిధిగా అనుసరించారు


అల్లంత దూరాన సరయూ సంగమస్థలంలో గంగానది కనిపించింది. ఆ సమీపంలో ఒక ఆశ్రమం కనిపించింది దానిని చూడగానే రామలక్ష్మణులకు అది ఎవరి ఆశ్రమమో ఏమిటో తెలుసుకోవా లనిపించింది. మహర్షిని అడిగారు

ముని చిరునవ్వులో వివరించాడు.


కందర్పుడూ కాముడూ అని ఒకడున్నాడు. అతడు ఒకనాడు - ఇక్కడ తపస్సు చేసుకుంటున్న శివునిమీద

దుర్బుద్దితో విజృంభించాడు. శివుడు హుంకరించాడు. నేత్రాగ్నిని వెదజల్లాడు. మన్మథుని శరీరాంగాలు ప్రశిథిలమై పోయాయి. అప్పటినుంచీ అనంగుడయ్యాడు. ఆ కారణంగా ఈ ప్రదేశాన్ని అంగదేశం అంటారు. ఇది అప్పటి ఆ పరమశివుని ఆశ్రమం. ఇప్పుడో ఎవరో శిష్యులు ఉంటున్నారు. వీరు ధర్మపరులూ, పాపరహితులూను.

శుభదర్శనా ! రామా! ఇరువైపులా పవిత్రనదులు. ఈ రాత్రికి ఈ నడుమభాగాన విశ్రమిద్దాం. రేపు నదిని దాటుదాం


ఆ ఆశ్రమ మునీశ్వరుల సాయం తో గంగా తీరం దాటుతున్నారు నది మధ్య లో పెద్ద ఘోష వినపడింది....ఈ శబ్దం ఏమని రాముడు ప్రశ్నించాడు...


రామా! కైలాస శిఖరంమీద మానస సరస్సు ఉంది. దానిని బ్రహ్మదేవుడు మనస్సుతో నిర్మించాడు. అందుకని అది మానస సరస్సు అయ్యింది. దానినుంచి జారిన నది మీ అయోధ్యకు చుట్టూ ప్రవహిస్తోంది. సరస్సునుంచి జారినది కాబట్టి దానికి సరయువు అని పేరు ఏర్పడింది. ఆ సరయూనది ఇక్కడ గంగానదిలో కలుస్తోంది. అదే ఆ హోరు. ఈ నదీ సంగమ స్థలానికి నియతితో నమస్కరించు .....ఇరువురు నమస్కరించారు


నది దక్షిణ తీరానికి చేరారు...

ఓ దట్టమైన అడవి అందులోకి ప్రవేశించారు. రాముడు ఆశ్చర్యం తో ప్రశ్నించాడు ఏమి ఈ దట్టమైన అడవి? అనేకరకాల పక్షులు,కీచురాళ్లు,సింహ శార్దూల కౄరమృగాల అరుపులు...?


విశ్వామిత్ర మహర్షి సమాధానం చెబుతున్నాడు.......

[25/03, 8:52 am] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 12


రామ లక్ష్మణ విశ్వామిత్రులు గంగా నది దాటి దక్షిణ తీరానికి చేరారు....రామచంద్రుడు దట్టమైన అడవి గురించి ప్రస్తావించాడు....విశ్వామిత్రుడు సమాధానం గా....


ఒకప్పుడు ఇక్కడ మలద అనీ కరూశమనీ రెండు జనపదాలు ఉండేవి. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో కూడా చెబుతాను. వృత్రాసురుణ్ని సంహరించినందువల్ల దేవేంద్రునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొంది. ఆ మలంతోపాటు తీరని దాహం కూడా కలిగింది

అప్పుడు తపోధనులైన మహర్షులు కలశాలతో మంగళోదకాలను తెచ్చి ఇక్కడ దేవేంద్రునికి స్నానం చేయించారు మలమూ దాహమూ (కరూశము) వదిలించారు. సంతుష్టుడైన శచీపతి ఆ జనపదాలకు మలదము కరూశము అని నామకరణం చేసాడు. ఇవి ధనధాన్య సమృద్ధితో చాలాకాలం విరాజిల్లాయి.


కొంతకాలానికి వెయ్యి ఏనుగుల బలం కలిగి కామరూప సంచారిణి అయిన ఒక యక్షిణి వచ్చింది. తాటక దానిపేరు. రామా! భద్రమగుగాక. అది సుందుని భార్య. ఇంద్రపరాక్రముడైన మారీచుడు దాని కుమారుడు.ఇద్దరూ కలిసి మలద కరూశ జనపదాలను పూర్తిగా నాశనం చేసారు. ఇదే దారిని ఆక్రమించుకొని సుమారు ఒక క్రోసెడు దూరంలో తాటక నివసిస్తోంది. ఈ దారినే వెళ్ళాలి మనం.


ఈ తాటకికి బ్రహ్మ వల్ల వర బలం ఆగస్త్యుని వలన శాపబలం రెండూ ఉన్నాయి.

స్త్రీ వధ కదా మహాపాతకం అని శంకించకు. సర్వజీవకోటికీ హితం కోరిన రాకుమారునికి ఇది కర్తవ్యం. ప్రజారక్షణకోసం క్రూరమూ పాతకమూ దుష్టమూ అయిన పనులనుకూడా

రాజు చెయ్యవలసి ఉంటుంది. తప్పులేదు. రాజధర్మం. అటువంటిది.


అపుడు రాముడు విశ్వామిత్రునకు నమస్కరిస్తూ...


మహార్షీ ! అయోధ్యలో గురువుల సాక్షిగా మా తండ్రి నన్ను నీకు అప్పగించినపుడు “విశ్వామిత్రుని మాట జవ దాటవద్దు" అని ఆజ్ఞాపించాడు. ప్రస్తుతం తాటకను సంహరించమని నీ శాసనం. చాలు. తాటకను సంహరిస్తాను సందేహం లేదు. 

గో బ్రాహ్మణహితం కోరి దేశసౌఖ్యం కోరి అప్రమేయ ప్రభావుడవైన నీ ఆజ్ఞను శిరసా వహిస్తున్నాను. తాటకను సంహరిస్తున్నాను.


ఆ యక్షిణి కామరూపధారణ శక్తితో అనేక రూపాలు ధరిస్తూ అంతలోనే అంతర్ధానం అవుతూ, శిలావర్షం ఎడతెరిపి లేకుండా కురిపిస్తూ, భయంకరంగా అరుస్తూ, రామలక్ష్మణులను దారుణంగా చీకాకు పరిచింది.ఇద్దరూ రాళ్ళవానలో మునిగిపోతున్నారు. గాధినందనుడు విశ్వామిత్రుడు గమనించాడు. రామా! ఇంక చాలయ్యా నీ దయ. ఇది పాపిని. యజ్ఞ విఘ్నకారిణి. మాయతో ఇలా ఇంకా పెరిగిపోతుంది సాయంకాలం కాబోతోంది. సంధ్యా సమయంలో రాక్షసుల మాయలు మరీ విజృంభిస్తాయి. అందుకని వెంటనే సంహరించు.....


వెంటనే రాఘవుడు శబ్ద వేధిని సంధించి విడిచిపెట్టాడు. అది శిలావర్షాన్ని ఛిన్నభిన్నంచేస్తూ వెళ్ళి అదృశ్యరూపంలో ఉన్న తాటకకు తగిలింది. అది రూపం ధరించి భూనభోంతరాళాలు మారు మ్రోగేటట్టు అరుస్తూ రాఘవులను తరుముకుంటూ వచ్చింది. పిడుగులా వచ్చి పడుతున్న తాటకను తీక్షంగా చూసాడు రాముడు. దృఢ బాణం సంధించి గుండెలలో కొట్టాడు. అది కుప్పకూలిపోయింది. విలవిల లాడిపోయింది. బీభత్సంగా రోదిస్తూ గిలగిలా తన్నుకుని తన్నుకుని చచ్చిపోయింది.


ఆకాశంలో దేవేంద్రుడూ దేవతలూ సాధునాదాలు చేసారు. విశ్వామిత్రా ! నీకు జయమగుగాక ! మేమంతా ఆనందపరవశులమవుతున్నాం. రాఘవులపట్ల స్నేహం ఇలాగే కొనసాగించు.  నీ దివ్యాస్త్రాలను రాఘవునికి ఉపదేశించు. నీకు శుశ్రూష చేస్తున్నాడు. , పైగా ఇతనితో దేవతలకు చాలా పెద్ద అవసరం (పని) ఉంది. ఇలా పలికి ఇంద్రాదులు వెళ్లిపోయారు.....


విశ్వామిత్రుడు అభినందన పూర్వకంగా రాముణ్ని అక్కున జేర్చుకున్నాడు. శిరస్సు మూర్కొన్నాడు. రామా!  ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం. రేపు నా ఆశ్రమానికి వెళదాం అన్నాడు. ముగ్గురూ ఆ రాత్రి ఆ తాటకావనంలోనే సుఖంగా విశ్రమించారు. శాప విముక్తమైన ఆ వనం చైత్రరథంలా ప్రకాశించింది......


 *ఋతవస్సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చ తే | మంగళాని మహాబాహో! దిశంతు తవ సర్వదా |*

(గొప్ప బాహువులు కల ఓ రామా...! ఋతువులు, సముద్రములు, ద్వీపములు,  వేదములు, లోకములు, దిక్కులును మంగళద్రవ్యములకు గూడ శ్రేష్ఠతను చేకూర్చునవై నీకు మంగళ మొసంగుగాక!)

**

రామ లక్ష్మణులు విశ్వామిత్రుడు ముగ్గురు తాటకా వనం లో రాత్రి నిద్రించారు....ఉదయం విశ్వామిత్రుడు రామునితో స్నానమాచరించి రమ్మని...

అనేక రకాల దివ్యాస్త్రాలను ఉపదేశం చేసాడు....వాటి ఉపసంహరాలను సైతం ఉపదేశం చేసాడు.

రాముడు వాటిని తదేక దృష్టి తో  ధ్యానం చేసాడు అవి అన్ని ప్రత్యక్షమయ్యాయి.


ఓ దివ్యాస్త్రములారా న మనసులో వశించండి తగిన సమయం లో సహకరించండి.అని ఆదేశించాడు  అవి రాముని ఆజ్ఞను శిరశావహిస్తాము అని చెప్పి మారలినాయి.....


విశ్వామిత్రిని వెంట రాముడు లక్ష్మణుడు నడక సాగిస్తున్నారు.....


మేఘ మండల సదృశం గా ఓ పెద్ద వృక్ష సమూహం కనపడింది....

రాముడు ప్రశ్నించాడు....

విశ్వామిత్రుడు సమాధానం గా....


హే మహాబాహో ! రఘురామా ! విష్ణుమూర్తి కొన్ని వందల యుగాలపాటు ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకున్నాడు. వామనునికి ఇదే పూర్వాశ్రమం. దీనిని సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడ మహా తపస్సులు సిద్ధిస్తాయి.


విష్ణుమూర్తి ఇక్కడ తపస్సు చేస్తున్న కాలంలోనే విరోచనుని కొడుకు బలి- ఇంద్రునితో సహా సర్వదేవతలనూ జయించి ముల్లోకాలనూ తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. ఆ సందర్భంగా ఒక మహాయజ్ఞం తలపెట్టాడు.


ఆ సమయంలో సర్వదేవతలూ ఈ ఆశ్రమానికి వచ్చి, బలి చేస్తున్న యజ్ఞ వార్తను విష్ణుర్తికి విన్నవించి


ఆ యజ్ఞం పూర్తి అయ్యేలోగానే దేవకార్యం చక్కబెట్టమని అభ్యర్థించారు. ఎవరు ఎక్కడ ఏది ఎంత అడిగితే అదల్లా ఇచ్చేస్తాడట బలి. హే విష్ణు ! దేవహితం కోసం నీవు వామనుడవై మాయాయోగంతో మాకు మేలు చేకూర్చు - అని ప్రార్ధించారు సరిగ్గా అదే సమయానికి అదితి సహితుడైన కాశ్యపుడు, విష్ణు ప్రీతికోసం వేయి సంవత్సరాల మహావ్రతం

పూర్తిచేసుకొని, అక్కడకు వచ్చాడు. తపోమయుడు, తపోమూర్తి తపోరాశి అయిన కాశ్యపునికి సంతోషించి విష్ణుమూర్తి వరం అడగమన్నాడు.


మహానుభావా ! నీ శరీరంలో సమస్త జగత్తునూ చూస్తున్నాను. నీవు అనాదివి. అనిర్దేశ్యుడవు. శరణు మహాప్రభూ! శరణు శరణు ఈ యాచిస్తున్న దేవతలకూ మా దంపతులకూ సంతోషకరంగా ఒకే వరం అడుగుతున్నాను అనుగ్రహించు. నీవు మాకు పుత్రుడవుగా అవతరించు. మా పెద్దకుమారుడు ఇంద్రునికి సోదరుడవై శోకార్తులైన ఈ

దేవతలకు సహాయం చెయ్యి. ఉత్తిష్ఠ భగవన్! ఇకనుంచి ఇది సిద్ధాశ్రమ నామంతో ప్రసిద్ధికెక్కుతుంది.


కాశ్యపుని ప్రార్ధనను విష్ణుమూర్తి మన్నించాడు. అదితి గర్భంలో వామనుడుగా జన్మించాడు. బలిని సమీపించాడు. మూడడుగులు యాచించాడు. ముల్లోకాలనూ ఆక్రమించాడు. బలిని అదుపుచేసి దేవేంద్రునికి దేవరాజ్యం తిరిగి అప్పగించాడు.


రామా ! ఇది ఆ మహామహుడు వామనుడు నివసించిన ఆశ్రమం. భక్తి ప్రపత్తులతో నేనుకూడా ఇక్కడే ఉంటున్నాను


యజ్ఞ విఘ్నకారులైన రాక్షసులు ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడే నీవు వారిని సంహరించాలి


నాయనా ! రామా ! రా ! ఉత్తమోత్తమమైన సిద్ధాశ్రమంలో కిప్పుడే ప్రవేశిద్దాం.

[25/03, 8:52 am] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 13


విశ్వామిత్రునితో కలసి  రామలక్ష్మణులు సిద్ధాశ్రమం చేరారు...

విశ్వామిత్రుడు వెంటనే యజ్ఞ దీక్ష స్వీకరించాడు. రామ లక్ష్మణులు ఆ రాత్రికి విశ్రమించారు. ఉదయం లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని విశ్వామిత్రుని నమస్కరించి.....

మహర్షి!కాక్షసులు ఏ సమయం లో వస్తారు?మేము ఎప్పుడు యాగ రక్షణ పూనుకోవాలి అని ప్రశ్నించగా.....


సమీపం లో ఉన్న ఇతర మునులు సమాధానం గా

రాఘవులారా ! నేటినుంచి ఆరురోజులు రేయింబవళ్ళు మీరు రక్షణ బాధ్యతను వహించాలి. మహర్షి యాగదీక్షలో భాగంగా మౌనవ్రతం స్వీకరించారు. పలకరు.


ఈ మునుల వాక్యాలు విని రామలక్ష్మణులు ఆరురోజులపాటూ రేయీపగలూ తేడా లేకుండా రెప్పవాల్చకుండా రక్షణలో నిమగ్నులయ్యారు. ధనుర్ధారులై యాగశాలనూ విశ్వామిత్రుణ్నీ సంరక్షిస్తున్నారు. అయిదు రోజులు గడచిపోయాయి. ఆరవరోజు వచ్చింది. సౌమిత్రీ ! సావధానం. సిద్ధంగా ఉండు అని రాముడు హెచ్చరించాడు.


అంటుండగానే భీకరమైన మారీచ సుబాహులు అనుచరులతో ఆకాశం లో 

ఆవరించి రక్తం కుమ్మరించారు...


లక్ష్మణా అదిగో చూడు రాక్షసులు వీళ్ళని మానావాస్త్రం తో ఎగరగిడుతాను అంటూ అంభిమంత్రించి అస్త్రాన్ని ప్రయోగం చేసాడు...మారీచుడు మూర్ఛపోయి శతయోజనమ్ దూరం లో దాటి సముద్రం ఒడ్డు న పడెను. ఈ అస్త్రం తో తెలివి తప్పి నాడు కానీ చనిపోలేదు. మిగిలిన రాక్షసులైన  సుబాహువు గుండెలపై ఆగ్నేయాస్త్రం సంధించాడు, వాడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు...


వాయవ్యాస్త్రం తో మిగిలిన రాక్షసులు అంతమొందారు.

ఈ విధముగ రాక్షసులనందరిని అంత మొందించిన రాముని చూచి అచట మునులందరు సంతోషముతో పూజించిరి. యజ్ఞము సమాప్తమైనది. దిక్కులన్నియు ప్రకాశించుచుండెను. విశ్వామిత్రుడు సంత సించెను. రామునితో మహాబాహూ! రామా! నేను కృతార్థుడనేతివి. గురువు వాక్యమును నీవు నెరవేర్చితివి.సిద్దాశ్రమము అనెడి పేరు ఈనాడు సార్ధకమైనది" అని అనెను.


మునిసింహమా ! ఇదిగో కింకరులం ఇద్దరము, నీ సన్నిధిని నిలబడ్డాం. ఆజ్ఞాపించు. నీ ఇష్టం. ఏమి ఆనతి ఇస్తే అది ఆచరిస్తాం.


ఇమౌ స్మ మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ౹

 ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావ కిమ్ ||


ఇలా సవినయంగా పలుకుతున్న రామునివైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ మునులంతా ముక్తకంఠంగా బదులు పలికారు.


మిథిలాధిపతియైన జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అది చూడడానికి మేమంతా వెడుతున్నాం. మీరు మాతో రండి అని ఆహ్వానం పలికారు.

**

విశ్వామిత్ర యాగ సంరక్షణ తరువాత సిద్ధాశ్రమ ఋషులు రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు  మిధిలేశుని శివధనుస్సు గురించి ముచ్చటించారు


తెల్లవారి విశ్వామిత్రుడక్కడి ఋషుల నక్కడే నిలిపి వారి సెలవు తీసికొని - ఆ ఆశ్రమమును విడిచి రామలక్ష్మణులతో కూడి ఉత్తర దిశకు బయలుదేరాడు


వారు ఆసాయంత్రము శోణా నదీతీరము చేరుకొని స్నానసంధ్యాదులు ముగించుకొన్నారు. రామలక్ష్మణుల కోరిక పై విశ్వామిత్రుడు కుశనాభుని చరిత్రము వినిపించాడు


బ్రహ్మ తనూజుడైన కుశమహర్షి వైధర్భియందు కుశాంబుడు, కుశనాభుడు అధూర్త రజసుడు, వసువు అను కుమారులను కల్గి ఉండెను. వారు వరుసగా కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యము, గిరవ్రజము అనే నాలుగు నగరాలను నిర్మించి పాలించారు


కుశనాభునికి సర్వాంగ సుందరులైన నూరుగురు కుమార్తెలు కలిగారు వారు యౌవనాభరణ భూషితలై ఒకనాడు ఉద్యానవనములో విహరిస్తుండగా వాయుదేవుడు వారిని మోహించి గాంధర్వ వివాహము చేసికోదలిచాడు.  ఆయువతులందుకు నిరాకరింపగా, ఆగ్రహముతో వాయువు వారినందరిని కుబ్జలుగా మార్చాడు. 


కుశనాభుడు వారి వికృత రూపములగాంచి దుఃఖించి పెద్దలను సంప్రదించి, మహానుభావుడు, ఊర్మిళా చూళీ తనయుడైన బ్రహ్మదత్తునికి వారిని కన్యాదానముగావించాడు. బ్రహ్మదత్త కరగ్రహణముతో వారందరికీ అపురూప లావణ్యశోభలు యథా పూర్వము సంప్రాప్తించాయి.


కుశనాభుడు తన శతసుతలను బ్రహ్మదత్తునికిచ్చి వివాహము చేసి పంపాక, తనకు సంతానము లభించాలని, పుత్రకామేష్టిగావించాడు. బ్రహ్మతనయుడైన కుశమహర్షి ఆశీర్వాద ఫలితంగా ఆయనకు "గాధి' అనే తనూజుడు కల్గాడు.


ఆ గాధి నా తండ్రి అని విశ్వామిత్రుడు చెప్పాడు, మరియు గాధికి సత్యవతి అనే తనయకలిగారు. సత్యవతికి ఋచీకుడనే మహర్షితో పరిణయము జరిగింది. ఋచీక నిర్గమనముతో సత్యవతి "కౌశికీ" అనే పుణ్యనదీరూపము ధరించి లోకాన్ని పావనం చేస్తుంది.


ఆ నదీతరంలోనే నేను ఆశ్రమము నిర్మించుకొని తపస్సు జేశాడు. అక్కడి నుండి దక్షిణము దిశలో నున్న సిద్ధాశ్రమమునకు వెళ్లి -యాగములు చేస్తూ -వాటికి నిరంతర విఘ్నములు కలుగగా వాటిని స్వప్రయత్నముతో నివారింప జాలనని నిర్ణయించుకొని -దశరథ తనయుడైన నిన్ను శరణు వేడి -నీ పై రక్షణ భారము సంపూర్ణంగా ఉంచి యజ్ఞం పూర్తి చేశాను.


కుశుని వంశములో పుట్టుటచే నాకు కౌశికుడు అని పేరు వచ్చినది. విశ్వమునకు హితము కలిగించు మిత్రుడనగుటచే నన్ను విశ్వామిత్రుడు అని కూడ వ్యవహరింతురు.


ఆ శోణా నది తీరం లో రామ లక్ష్మణులు మాహర్షులతో కలసి ఆ రాత్రి నిద్రించారు....ఉదయం చేయవలసిన కృత్యాలు పూర్తి చేసి తిరిగి ప్రయాణం సాగించారు....మధ్యాహ్నా సమయానికి గంగా నది చేరారు......

[25/03, 8:53 am] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 14


రామలక్ష్మణులు విశ్వామిత్ర బృందం తో గంగా నదీ తీరం చేరారు...గంగా నది గాధ ను విశ్వామిత్రుడు వివరింప సాగాడు....


 హిమవంతునికి మేరు తనయ అయిన మనోరమ యందు గంగా,పార్వతులనే తనూజలు కలిగారు.


హిమవంతుని యాచించి దేవతలు గంగామతల్లిని తమ లోకానికి తీనికవెళ్లారు. అక్కడ సురనదీ రూపంలో గంగాదేవి స్వర్లోక వాసులను సంతృప్తి గావించింది.


పార్వతి మహోగ్ర తపము ద్వారా పరమశివుని సంప్రీతునిగావించి ,ఆ పరమేశ్వరునే పరిణయము చేసికొంది...


శివ పార్వతులు బహుకాలము భోగింప సాగారు. శివుని అమోఘ వీర్యమును కాలము గడిచిన కొలది భరించుట దుష్కరమని, దానివలన ప్రళయమే సంభవించునని భీతులై దేవతలు వారి ఏకాంతమునకు భంగము కలిగించారు


సురుల కోరిక పై శివుడు తన తేజాన్నిసర్వక్షమాశీలయైన భూమిలో విడిచాడు. ఆమహాతేజము భూమియావత్తునిండి పర్వతాలను, వనాలను వ్యాపిస్తూ వసుంధరకు దుర్భరం కాసాగింది


ఆదితేయులు  అగ్ని దేవుని అవనితో పాటు శివ వీర్యమును ధరింపుమని ప్రార్థించారు. అగ్నిదేవుడు అందుకు అనుమతించాడు. శ్వేత పర్వతము , దివ్యశరవణము మొదలైనవి శివ వీర్యప్రభవములయ్యాయి.


దేవతలు సంప్రీతులై ఉమామహేశ్వరుల నారాధించారు. అయితే శర్వాణి వారి పరిచర్యలకు సంతుష్టురాలు కాలేదు. తనకు మహేశ్వరతేజము దక్కలేదనే కనుకతో స్వర్గ వాసులందరు సంతాన హీనులుగా మిగిలిపోతారని శపించింది.


తనకు దక్కని శివ వీర్యాన్ని ధరించిన భూమి నిరంతరము మార్పులను చెందుతూ స్థిరత్వము లేక అనేకులకు భార్యగా నుంటుందని కఠినోక్తి గావించింది


దేవతలకు రాక్షసులతో జరిగే యుద్ధాలలో సరియైన సేనాధిపతి లేక ఘోరబాధలు సంభవించాయి. వారి మొరను వినిన పరమేశ్వరుడు అగ్నిదేవునితో తన తేజాన్ని గంగానదిలో విడువుమని ఆదేశించాడు. గంగా,హుతవాహనుల సంగమం వలన కుమార సంభవము జరుగుతుందని ఆ బాలుడు పార్వతి సంప్రీతికి కూడ పాత్రుడౌతాడని-ఆయన దేవ సేనాని యై అనురులనణచుతాడని అభయ మొసగాడు మహేశ్వరుడు


సురల ప్రార్థనతో స్వర్గంగ స్త్రీరూప ధారిణియై అగ్నిదేవుని నుండి ఆ శివతేజాన్ని గ్రహించింది. కాని అఖిలలోకములకు ఆహ్లాదాన్ని కలిగించే అనదీమతల్లికి కూడ ఆతేజము దుస్సహమయింది. ఆతల్లి ఆ వీర్యాన్ని తన జలాలలో వదిలింది. ఫలితంగా, బంగారము, సీసము, మొదలైన అతి మూల్యమైన లోహము లేర్పడ్డాయి. 


చివరకు ఆతేజము నుండి హిమాలయ పాదస్తానములో గంగానది తీరములోని రెల్లు గడ్డిలో శివకుమారుడావిర్భవించాడు. ఆ కుమారునికి పాలివ్వడానికి ఆరుగురు కృత్తికలు ముందుకొచ్చారు. ఆరుగురు తల్లుల పాలు ద్రావినందుకా కుమారుడు షాణ్మాతురుడయ్యాడు. కృత్తికల చేపెంచబడినందు వలన కార్తికేయుడని ఖ్యాతి వహించాడు - ఆరు ముఖములలో ఏక కాలంలో ఆరుగురు తల్లుల స్తన్యము గ్రోలినందువలన "షణ్ముఖుడు"అని ప్రసిద్ధినందాడు. శివతేజము స్కన్నమగుట ద్వారా సంభవించినందుల కాయన "స్కంధుడనే పేరును పొందాడు.


శివ వీర్యానికి కారణమైన పార్వతీదేవి ,దేవతలందరిలో శ్రేష్టత్వమును పొందింది, శివతేజము ధరించినందు వలన గంగానది నదులన్నిటిలో శ్రేష్ఠ వాహిని అయింది


శివ వీర్యాన్ని దేవతలు ఎంత భగ్నము చేయాలనుకొన్నా అది ఎన్ని స్థానాలలో పతనమైనా ,చివరకు ఆతేజము కుమారస్వామి సంభవానికి కారణమైంది.


  కుమార సంభావాన్ని తెలిపిన విశ్వామిత్రుడు కొంత విరామము తరువాత ఇక్ష్వాకు వంశం లో శ్రేష్ఠుడైన సగర చక్రవర్తి గురించి చెప్ప సాగెను......

**

విశ్వామిత్ర ముని ఇక్షవాకు వంశ రాజైన సగర చక్రవర్తి గురించి చెబుతున్నాడు......


ఒకా నొక కాలమున సగర చక్రవర్తి  అశ్వమేధ యాగము నిర్వహిస్తున్నాడు. అతని యజ్ఞాశ్వము దేశాటనకై విడువబడింది. అంశుమంతుడా అశ్వరక్షకుడుగా వెళ్లాడు. సంవత్సర కాలము సంపూర్ణమైంది. అశ్వము రాజధానికి తిరిగి వచ్చింది


యజ్ఞ సన్నాహాలు పూర్తి అయ్యాయి. క్రతువు ఆరంభము మరుసటి రోజే. రాక్షస' శరీరంతో ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. రక్షింపబడని అశ్వము యజ్ఞ కర్తకు అనర్ధాన్ని కల్గిస్తుంది. సగరుడు దీక్షాబద్ధుడు -కనుక యజ్ఞ శ్వమును తీసికొని వచ్చుటకు తన అరవై వేల మంది పుత్రులను పంపాడు


వారందరు మహాసంరంభముతో హుటాహుటి బయలుదేరారు. భూమిని తమ వజ్రముష్టులతో బద్దలు కొడుతూ వెళ్లసాగారు. దారిలో నాగులు అనుర రాక్షసులు మర్ధింపబడ్డారు. భూమి అంతా గుంటలు గుంటలుగా తవ్వబడసాగింది


ఈ హఠాత్ప్రళయానికి దేవదానవ, గంధర్వ, యక్ష రాక్షపాదులు బ్రహ్మకు మొరలిడగా భగవంతుడు "కపిల రూపధారియై, భూమి పైననే ఉన్నాడని ఆయనయే ఈ ఉపద్రవాన్నుండి రక్షిస్తాడని బ్రహ్మవచించాడు


ఆవిధంగా భూమంతా త్రవ్వి, దానిచుట్టూ పరిక్రమించి, ఎక్కడ కూడ యజ్ఞాశ్వం కాన రాక తిరిగి రిక్త హస్తులై సగరుని చేరారు ఆయన పుత్రులు సగరుడు రోషసాగరుడై మళ్లీ భూమినంతటిని త్రవ్వి, అంతటా వెదికి అశ్వంతోనే తిరిగి రావాలని, కాని ఊరక రాకూడదని గద్దించాడు. .


సాగరులు మార్గ మధ్యములో పూర్వదిశలో "విరూపాక్ష దిగ్గజాన్ని, దక్షిణ దిశలో 'మహాపద్మ' మత్తేభాన్ని, ఉత్తర దిశలో "భద్ర'గజాన్ని, పశ్చిమ దిశలో 'సౌమనస్య "ద్విరదాన్ని దర్శించారు. మళ్ళీ భూఖననం చేస్తూ వెళ్లి "కపిల మహర్షిని గాంచారు. ఆ మహానుభావుని "అశ్వాపహర్త'గా భావించి, ఆయన పైకి ఉరికారు వారి దుర్వత్తిని గమనించి కపిలుడు హుంకారము గావించాడు. సాగరులందరు భస్మమయ్యారు.


సగరుడు తన షష్టి సహస్ర సుతులు తిరిగి రానందున, అశ్వమును (తిరిగి) తేవడానికై తన మనుమని అంశుమతుని ఆజ్ఞాపించాడు. ఆయన ఖడ్గధారియై బయలుదేరి, తమ పితరులు త్రవ్విన త్రోవలోనే పయనిస్తూ మార్గస్థుల మర్యాదలను స్వీకరిస్తూ, దిగ్గజాలను దర్శించాడు. వాటి ఆశీర్వాదంతో చివరదాకా వెళ్లి అక్కడ భస్మీ భూతులైన పితరులను దర్శించి, దుఃఖ పరవశుడయ్యాడు


అక్కడికి సుపర్ణుడు గరుడుడేతించి, " అంశుమంతుని ఓదార్చి వారికి ఉత్తమ లోకావాప్తిని కల్గించడానికి, లోకపావనియైన గంగామతల్లిని అవతరింపజేయుమని ఆనతిచ్చి వెళ్లాడు.


ధైర్యమును చేజిక్కించుకొని, యజ్ఞాశ్వాన్ని తీసికొని సగరుని సమిపించాడంశుమంతుడు. సగరుడు తన కొడుకుల దుర్మరణాన్ని గురించివిని కూడ యాథావిధిగా యజ్ఞము పూర్తి గావించు కొని ముప్పైవేల సంవ్సరాలు పాలన గావించి, గంగావతరణ విధిని నిర్ణయించకుండానే స్వర్గతుడయ్యాడు.


తరువాతి ఇక్ష్వాకు వంశ చక్రవర్తులు చరిత్రలను విశ్వామిత్రుడు చెప్ప సాగెను........

[25/03, 8:53 am] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 15

సగర నిర్యాణము తరువాత అయోధ్యాధి పతిగా కోసలదేశ ప్రజలు అంశుమంతుని (మహారాజుగా)వరించారు. కొంతకాలము రాజ్యపాలన గావించి, అంశుమంతుడు తన తనయుని దిలీవుని పట్టాభిషిక్తుని చేసి గంగావతరణోద్యోగము కొరకు తీవ్రముగా తపమొనర్చుతూనే స్వర్గ ప్రాప్తి పొందాడు.


దిలీపునికి కూడ గంగావతరణ మార్గము గోచరింపలేదు. ఆయన ముప్పైవేల సంవత్సారాలు యజ్ఞములను, ఇష్టులను కావిస్తూ అసంపూర్ణ మనోరథుడుగానే మరణించాడు


దిలీప తనయుడు భగీరథుడు, తన పూర్వులయిన అంశుమంత, దిలీప మహారాజుల ప్రగాఢ వాంఛ బాల్యమునుండే భగరథునిలో పట్టుదలను కల్గించింది. ఆయన తరువాత అయోధ్యాధిపతిగా సింహాసనమలంకరింప దగిన వారసుడాయనకు జన్మింపలేదు. అయినప్పటికి ఆయన అసంతృప్తితో ఆగిపోలేదు. మహామాత్యుల పై మహిభారాన్నుంచి -కఠోరతపోదిక్షతో ఆయన అడవులను ఆశ్రయించాడు.


సహస్ర వరములు గోకర్ణంలో భగీరథుడు ఘోరతప మాచరించాడు. భగీరథుని తపో దీక్షకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షము కాక తప్పలేదు గంగావతరణమున కంగీకరించాడు. 


అయితే గంగార్భటిని భరించుటకు పరమశివుని ప్రసన్నం చేసికొమ్మని ఆదేశించాడు. స్వయంగా క్షమాశీల అయి సర్వంభర అయిన భూమి కూడత్రిపథగా వేగాన్ని భరింపజాలదని తెలిపాడు.


అంగుష్ఠమాత్ర స్థిరుడై భగీరథుడు మరొక వత్సరం తీవ్ర తపమాచరించారు. భక్త వశంకరుడైన శంకరుడు సంప్రీతుడై గంగాధారణకు తన సంసిద్ధతను తెలిపాడు.


ఆకసము నుండి మహావేగంతో గంగాదేవి క్రిందికి ఒక్కసారి దుమికింది క్రింద నిలిచి ఉన్న మహాదేవుని, మహీధరాన్ని భూతలంతోపాటు, పాతాళానికి కొట్టుక పోతానని అహంకరించింది హుంకరించింది.


రుద్రుడు గంగాదేవి ఉద్దతినిగాంచి, తనజటా మండల గహ్వరంలో మహావేగవతి అయిన స్వర్గంగను బంధించి స్తబ్దనుగావించాడు.


భగీరథుడు హతాశుడై తిరిగి పరమేశ్వరుని ప్రసన్నం చేసికొన్నాడు. ఒక్కొక్క గంగా బిందువును శివుడు క్రిందికి వదిలారు. ఆ బిందువు హిమాచలము పై పడి "బిందు సరోవరమైంది". అక్కడి నుండి ఏడుపాయలై హలాదిని, పావని, నళిని అని మూడు నదులుగా తూర్పువైపు ప్రవహించింది. సూచక్షువు, సీత, సింధూ నదముల రూపములతో పడమటి వైపు ప్రవహించింది. ఎడవ పాయగా భగీరథుని వెంట ఏతెంచసాగింది.


గగనము నుండి (గం)భూమిపైకి దిగి వచ్చే ఆగంగామతల్లిని దేవదానవ యక్ష మహర్షి సంఘములు మహాభక్తితో సేవింపసాగాయి. వారు ఆ పవిత్ర జలాల్లో స్నాన. పానాదులు చేశారు


భగీరథుని అనుసరిస్తూ గంగామతల్లి కన్న కుమారుని లీలగా అనుసరించే మాతృమూర్తి వలె ముందుకు అనుగమింప సాగింది.


మార్గమధ్యములో బహ్న మహర్షి తన ఆశ్రమంలో ప్రశాంతంగా తపస్సు చేసి కొంటున్నాడు. ఆయనను -ఆశ్రమాన్ని చూడగానే గంగా గమనంలో మళ్లీ మహోద్భృతి ప్రవేశించింది.


మహర్షి యజ్ఞవాటిక, ఆశ్రమము -పరిసర ప్రాంతమంతా ప్రవాహమయమైంది


జహ్ను మహర్షి కనులు దెరిచాడు, ఆనదీ వేగాన్ని గమనించాడు. ప్రశాంతంగా గంగా జలాన్నంతటిని పానంజేశాడు. భగీరథునికి తన వెను వెనుక సుడులు తిరుగుతూ ప్రవహించే గంగానది యొక్క సవ్వడి వినిపించలేదు ఆశ్చర్యంతో వెనుదిరిగి చూచాడు. అతనికంతా అయోమయము కలిగింది ప్రవహిస్తూ వచ్చే పావన గంగానదికి బదులు (ప్రశాంత)తపోనిష్ఠా గరిష్ఠుడైన జహ్న మహాముని దర్శనమిచ్చాడు. ఆయన ఆ మహాత్ముని మనసారా ప్రార్థించాడు. కరుణామయుడైన -ఆమహాను భావుడు తన దక్షిణ కర్ణం నుండి గంగా ప్రవాహాన్ని వినిర్గతం చేశాడు.


జప తపోనిష్ఠా గరిష్టుడైన జహ్న మహాముని మహా ప్రభావానికి స్వర్వాహిని సంభ్రమాశ్చర్య చకిత అయింది. ఆయన మహిమకు లొంగి వినయంతో తనయ భావాన్ని వహించింది అందుకే "జాహ్నవి" అనే పేరు కలిగింది గంగానదికి.


మళ్ళీ భగీరథుని వెంట నడకసాగింది - సగర పుత్రులు త్రవ్విన సొరంగంలోకి - అదే సాగరం - ప్రవేశించింది


అక్కడ భస్మరాశులను ముంచెత్తింది. అరువదివేలమంది సగరపుత్రులూ గతకల్మషులై స్వర్గానికి వెళ్ళారు. అప్పుడు


చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యాడు


రాజర్షీ ! భగీరథా ! సగరపుత్రులను తరింపజేశావు. సాగరంలో ఈ జలం ఉన్నంతకాలమూ సగరపుత్రులు స్వర్ణోకంలో శాశ్వతంగా ఉంటారు


గంగానది నీకు పెద్దకూతురు. నీపేర భాగీరథి అని పిలవబడుతుంది. ఇటునుంచి పాతాళంలోకి ప్రవేశిస్తుంది ఈ ఆకాశము - భూమి - పాతాళము ఇలా ముల్లోకాలలోనూ ప్రవహించడంవల్ల" త్రిపథగ" అనే విఖ్యాతి పొందుతుంది.


బ్రహ్మదేవునికి నమస్కరించి భగీరథుడు స్నాతుడై తర్పణాదికాలు ముగించి అయోధ్యకు చేరుకున్నాడు.


ప్రజలంతా ఆనందించారు. ధనధాన్య సమృద్ధులతో సుఖించారు


రామా ! ఇదీ గంగావతరణ కథ. నీవు కోరినట్టే సవిస్తరంగా తెలియజేశాను. సమయం దాటిపోతోంది - అంటూ లేచాడు....

[25/03, 8:53 am] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 16


గంగావతరణ గాధను విశ్వామిత్రుని ద్వారా విన్న రామలక్ష్మణులు రాత్రి సుఖంగా గంగాతీరంలో నిద్రించి, ఉదయం కావడంతోనే విశ్వామిత్ర సమేతంగా నౌకా సహాయంతో గంగోత్తర తీరం చేరి, అక్కడ విశాల పురాన్ని చేరారు. రామ లక్ష్మణుల కోరిక పై మహర్షి విశాల పురి పూర్వవృత్తాంతాన్ని సముద్ర మథనగాధను వివరించాడు.


దేవతలు, దైత్యులు -తాము అజరులు, అమరులు కాదలచి క్షీరసాగరంలో నిక్షిప్తములయిన అమూల్య ఔషధాల సారాన్ని సేవింపదలచారు


క్షీరసాగరంలో మంధరాద్రిని కవ్వంగా జేసికొని, దానికి అనేక శిరస్సులు గల వాసుకి మహాసర్పమును త్రాడుగా చుట్టి, మధథనానికి సిద్ధమయ్యారు


సహస్ర సంవత్సరాలు అలా చిలుకగా, వాసుకి సహస్రశిరముల నుండి విషాగ్ని జ్వాలలు ఎగసి హాలాహలము ఉద్భవించింది. దానిని పానం చేయడానికి భక్తవశంకరుడైన శంకరుడు ముందు కొచ్చాడు. ఆగరళాన్ని తనగరమందే నిలిపాడు


అనంతరము మళ్లీ మథనం మొదలైంది. మంధర మంధానము పాతాళము దాకా దిగిపోయింది. సురాసురుల ర్థనపై జగద్భర్త తాబేలుగా మారి తన వీపుపై మంధరాన్ని భరించాడు. అంతేకాదు తానుకూడ ఉపేంద్రుడుగా ఆకవ్వాన్ని త్రిప్పసాగాడు


మరొక వేయి వర్గాలు గడిచాయి. దండ కమండల ధారియై ధన్వంతరి దివ్యవైద్యుడు ప్రభవించాడు. అ సంఖ్యాకులైన అప్సరసలు ఆవిర్భవించారు ఆ అద్భుత సుందర సురభామినులను ఎవ్వరు స్వంతం చేసి కోవాలనుకోలేదు. అందువలన వారు సర్వదేవతా సాధారణులుగా మిగిలిపోయారు


ఆతరువాత వరుణ పుత్రి వారుణి సురభాండంతో ఉదయించింది పరను సేవించిన దేవతలు సురలయ్యారు. దానిని ఆదరింపని దైత్యులు

అసురులయ్యారు


అనంతరము ఉచ్చైశ్రవము, ఐరావతము, కౌస్తుభమణి, కల్పవృక్షాలు కలిగాయి. వచ్చిన ప్రతివస్తువును అదేలాభంగా ఆదితేయులు సొంతం చేసుకొన్నారు. అమృతమునే అంతిమ లక్ష్యంగా భావించిన అసుకులు మిగిలిన వస్తువులపై తమకము చూపక వాటిని దేవతలు తీసికొంటుంటే ఊరకున్నారు.


అంభోధి మథనాంతములో అమృతము ఆవిర్భవించింది. శ్రీమహావిష్ణువు స్వయంగా 'మోహిని" రూపము ధరించి అమృతాన్ని ఆదితేయులందరికి అందించాడు.  అసురులకు అమృతము అందలేదు.


అమృత వినిమయాంతంలో -మోహిని మాయమయింది. మోసాన్ని గ్రహించి రాక్షసులు దేవతల పై యుద్ధాన్ని ప్రకటించారు. అయితే భగవత్సహాయంతో దేవతలు రాక్షసులపై విజయాన్ని సంపూర్ణంగా సాధించారు. ఇది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వినిపించిన క్షీరసాగర మధన వృత్తాంతము.


**

సముద్రమధనం లో దైత్యులందరిని సంహరించిన దేవేంద్రుడు దేవ రాజ్యానికి తిరుగు లేని అధిపతి అయ్యాడు..


దితికి భరింపరాని పుత్రశోకం ఏర్పడింది. భర్తయైన కాశ్యపుని దగ్గరకు వెళ్ళి - నాథా! నీ పుత్రులు నా పుత్రులను

సంహరించారు. నేను అపుత్రనయ్యాను. ఈ దుఃఖం భరించలేను. శక్రుని సంహరించగల పుత్రుడు - శక్రహంత నాకు కావాలి. ఎంతైనా తపస్సు చేస్తాను. అనుగ్రహించు - అని ప్రాధేయపడింది.


దితీ ! నీ దుఃఖం అర్ధం చేసుకోగలను. నీకు శుభమగుగాక ! వెయ్యి సంవత్సరాలు తపస్సు చెయ్యి. గడువు పూర్తయ్యే నాటికి నీవు శుచిగా ఉంటే నీ కోరిక తీరుతుంది - అంటూ కాశ్యపుడు చేతితో దితిని మెల్లగా నిమిరి - స్వస్తి అని తపస్సుకు వెళ్ళిపోయాడు. దితి కూడా కుశప్లవంచేరి దారుణ తపస్సుకు పూనుకొంది.


దితి గర్భవతి అయింది. సహస్రాక్షునికీ సంగతి తెలిసింది. కుశప్తవానికి వచ్చి దితికి పరిచర్యలు చేస్తూ అమాయకురాలైన ఆమెను సేవలతో సంతోషింపజేశాడు. వేయి సంవత్సరాలు పూర్తిగా వచ్చాయి. పది సంవత్సరాలే మిగిలాయి


ఆయాసము అధికమై దితి ఒకనాడు అనుకోకుండా శయ్యానాసములో తలక్రిందులుగా శయనించింది. సహస్రలోచనునికి ఆ దృశ్యము కనబడింది. సమయము చిక్కింది. శరీర లోకి సూక్ష్మ రూపం లి ప్రవేశించి, వజ్రి తన వజ్రాయుధముతో ఆమె గర్భమును తరుగసాగాడు. లోపలి పిండము రోదింపసాగింది. "మారుదః" "మారుదః" "ఏడువ వద్దు, ఏడువ వద్దు'అని ఇంద్రుడు దితిభీతితో పలుక సాగాడు. లోపలి శిశువు రోదనము దితికి హఠాత్తుగా మెలుకువను కలిగించింది. "చంపవద్దు", "చంపవద్దు అని దితి వారించింది శతక్రతువు శిశు సంహారాన్ని ఆపాడు. అప్పటికే దితి గర్భము లోని పిండము ఏడు ముక్కలయింది. దితి తలక్రిందులుగా అశుచిగా పడుకోవడమే పిండచ్చేదానికి కారణమని పురువూతుడు వినీతుడై ఆమెకు విజ్ఞాపనం చేశాడు


ఇంద్రుని కాపట్యమును దితి గ్రహించింది. అయితే తాను తప్పుజేసింది. కనుక ఇంద్రుని ఏమనరాదు. తెలివిగా తన పిండములను రక్షించు కోవాలను కుంది. తన గర్భములోని సప్త భాగములు "మారుదః" అనే ఇంద్ర వచనాన్ని బట్టి సప్త మరుత్తులై -అతనికి మిత్రులై సకలలోకాలలో సంచరిస్తారని తెలిపింది. శతక్రతువు అందుకు సమ్మతించాడు."


రామభద్రా! దితి తపస్సు చేసిన ఆ కుశప్లవ వనస్థలమిదే అని విశ్వామిత్రుడు వివరించాడు. ఇదే స్థలములో ఇక్ష్వాకునుకు "అలంబుస"అనే అతివయందు "విశాలుకు" ఆనే పుత్రుడు జన్మించాడు ఆయన పేరుతోనే ఈ "విశాల పురము" వెలిసింది. విశాలుని వంశములోని వాడైన సుమతి ప్రస్తుత భూపతి అని తెలిపి విశ్వామిత్రుడు విరమించాడు.

[25/03, 8:54 am] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 17


మిథిలా నగర సమీపాన జనశూన్యమైన ఆశ్రమం కనిపంచడం తో విశ్వామిత్రుడు ఆ ఆశ్రమం గురించి చెప్ప సాగాడు....


ఇది మహాత్ముడగు గౌతముని ఆశ్రమము. ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఉండినది. దీనిని దేవతలు సైతము పూజించెడివారు. ఇచ్చట గౌతముడు తన భార్యయగు అహల్యతో కూడినవాడై అనేక సంవత్సరములు తపస్సు చేసినాడు. ఇంద్రుడు గౌతముని తపస్సును భగ్నము చేయబూని గౌతముడు ఆశ్రమమున లేని సమయము కనిపెట్టి మునివేషధారియై అహల్యను సమీపించి "నీతో క్రీడింపగోరుచున్నాను. నన్ను అనుగ్రహింపుము” అన్నాడు. మునివేషమున వచ్చినవాడు ఇంద్రుడని తెలిసికొనియు అతని మీద ఆమెకు మనసు మరలినందున అహల్య సమ్మతించినది.


అహల్య : ప్రభూ! కృతార్థురాలనైతిని. నీవు త్వరగా వెడలిపొమ్ము. నిన్నును నన్నును రక్షించుకొను మార్గమును చూడుము. నా మర్యాదను కాపాడుము.


గౌతముడు వచ్చునేమో యని శంకించి ఇంద్రుడు వేగముగా వెడలుచుండినాడు. కాని గౌతముడు స్నానము చేసి ఆశ్రమమునకు వచ్చుచుండినాడు. ఇంద్రుడు గౌతముని చూచి భయపడి వివర్ణుడైనాడు.


[చేయగూడని పని చేసినచో ఇంద్రుడైన నేమి మరెవ్వడైన నేమి! ఇదే గతి! ]


గౌతముడుకూడ ఇంద్రునిచూచి కోపించి శపించినాడు.


దుర్మార్గుడా! నీవు విఫలుడ వగుదువుగాక” అని శపించినాడు. ఇంద్రుడు వెంటనే విఫలుడైనాడు (వృషణాలు కోల్పోవడం).


గౌతముడు అహల్యను సైతము శపించినాడు.


“నీవు ఈ ఆశ్రమమునందే అనేక వేల సంవత్సరములు వాయు భక్షణము మాత్రము చేయుచు బూడిదలో శయనించి తపస్సు చేయుచు ఏ ప్రాణికిగాని కనబడక యుందువు గాక .”


మునివర్జితమై భయంకరముగానుండు ఈ ఆశ్రమమునకు దశరథపుత్రుడగు శ్రీరాముడు ఏనాడు వచ్చునో ఆనాడు నీవు శుచివి కాగలవు. శ్రీరామునికి అతిథి సత్కారము చేసి దాని వలన లోభ మోహములను వీడి నీవు నీ నిజరూపమును దాల్చి నా ఎదుట సంతోషమున నుండగలవు అని చెప్పినాడు.


ఇంద్రుడు తన తప్పును దేవతలవద్ద మొరపెట్టుకొనగా వారు మేష వృషణాలతో అతన్ని సఫలుడ్ని చేసినారు.


రామా..!ఇప్పుడు గౌతముని ఆశ్రమమునందు ప్రవేశించి అహల్యకు శాపవిముక్తి కలిగించు.


శ్రీరాముడు అడుగు పెట్టుట తోడనే తపస్సుచే ఇనుమడించిన కాంతితో తేజరిల్లుచుండిన అహల్య కానవచ్చినది. శాపము అంతమైనందున వారికి కనబడినది.

రామలక్ష్మణులు అహల్య పాదములకు నమస్కరించినారు. శాపకాలమున గౌతముడు పలికిన మాటలను స్మరించి అహల్య రామలక్ష్మణులకు అతిథి సత్కారము చేసి పూజించినది. ఈ శుభసమయమున పుష్పవృష్టి కురిసినది. అప్సరసలు ఆడినారు. గంధర్వులు పాడినారు. 


గౌతమ మహామునీశ్వరులు సైతము అచ్చటికి వచ్చినారు. చిరకాలము విడివడియుండిన అహల్యా గౌతములు కలుసుకొన్నారు. గౌతముడు కూడ శ్రీరాముని యథావిధిగా పూజించినాడు.


విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట బెట్టుకొని మిథిలకు ప్రయాణమైనాడు.


   (అహల్య శిలాగా మారడం,దేవేంద్రుడు కోడిగా రావడం ఇవన్నీ కల్పితాలు.వాల్మీకం కావు.)


**


విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిలా పురం చేరినారు....

జనకుడు విశ్వామిత్రుణ్ణి పూజించి రామలక్ష్మణుల గురించి ప్రశ్నించగా వారి వివరములను తెలియజేశాడు.


గౌతమ మహర్షి యొక్క కుమారుడు శతానందుడు రాముని చరిత్ర తెలుసుకొని తన తల్లి అయిన అహల్య శాపవిమోచనం గురించి అడుగగా జరిగిన విషయం మొత్తం విశ్వామిత్రుడు తెలియ జేసినాడు.....


అపుడు శతానందుడు విశ్వామిత్రుని యొక్క చరిత్ర సుదీర్ఘము గా క్షత్రియుడి నుండి బ్రహ్మర్షిత్వం పొందు వరకు గా గాధ ను మొత్తం రామలక్ష్మణులు తెలియ జేశాడు.....


జనక మహారాజు రామలక్ష్మణులను తగురీతిగా గౌరవించి వారికి శివధనుస్సు గురించి తెలియ జేశాడు.


నిమిచక్రవర్తికి ఆరవ పురుషుడు దేవరాతుడను రాజు. ఈ ధనుస్సును శివుడు దేవరాతుని యొద్ద న్యాసముగా ఉంచినాడు. దక్షుని యజ్ఞమున శివుడు కోపించి దేవతల నందరిని ఈ ధనుస్సుతో కూలునని చెప్పినాడు. అందరు భయపడి శివుని వేడుకొనగా శివుడు శాంతుడై ధనుస్సును దేవతల కిచ్చినాడు. దేవతలు దానిని మా పూర్వుడగు దేవరాతుని కిచ్చినారు


నేను యాగభూమిని దున్నుచుండగా నాకు సీత దొరికినది. సీత అయోనిజ కావున వీర్యశుల్కమీయగల వానికే సీత నిచ్చి పెండ్లి చేయుటకు నిశ్చయించితిని. రాజు లెందరో వచ్చి సీత నిమ్మని కోరినారు. అందరికి నా నిశ్చయమును చెప్పినాను. రాజు లందరు మిథిలకు వచ్చి “మా పరాక్రమమును ఎలా ప్రకటింపవలెను?" అని ప్రశ్నించినారు. నేను వారికి శివధనుస్సును చూపించి దానిని ఎక్కుపెట్టుడని కోరితిని. ఆ రాజులు దానిని ఎత్తజాలకపోయిరి సరిగదా దానిని కదలించుటకు కూడ వారికి సాధ్యము కాలేదు. మరి ఎక్కు పెట్టుట ఏమున్నది.?


ఆ ధనుస్సును రామలక్ష్మణులు చూడగోరినయెడల తప్పక చూడవచ్చును. రాముడు ఆ ధనుస్సును ఎక్కు పెట్టగలిగినయెడల సీతను రాముని కిచ్చి నేను తప్పక వివాహము జరిపింతును.

[28/03, 8:20 am] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 18

జనకుని ఆజ్ఞ ననుసరించి మంత్రులు పట్టణము లోని  శివధనుస్సును తెప్పించి నారు. మంచి బలశాలురు అయిదు వేల మంది ఎనిమిది చక్రములు గల మంజూష మీద అతిప్రయాసతో తెచ్చినారు.


జనకుడు : మహర్షీ! ధనుస్సు వచ్చినది. దేవతలుగాని, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు కిన్నరులు, ఉరగులుగాని ఎవ్వరును దీనిని పూరింప జాలరు. మానవులకు సాధ్యమగునా! అయినను మీ మాట కాదన జాలను. దీనిని రామలక్ష్మణులకు చూపింపుడు


విశ్వామిత్రుడు : రామా! ఈ ధనుస్సును చూడుము.


 *వత్సరామః ధనుః పశ్య ఇతి రాఘవమబ్రవీత్* 


శ్రీరాముడు పెట్టె తెరచి ధనుస్సును చూచి విశ్వామిత్రునితో


రాముడు : స్వామీ! ఈ ధనుస్సును స్పృశించి దానిని కదలించుటకును, మో పెట్టుటకును ప్రయత్నించెదను.


(ఎంత వినయము! గమనింపదగిన విషయము)


 *ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణే పి వా* 


విశ్వామిత్రుడు, జనకుడు 'మంచిది' అన్నారు.


 *లీలయా సధను ర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః* 


పశ్యతాం నృసహస్రాణాం బహూనాం *రఘునందనః* *ఆరోపయ త్స ధర్మాత్మా సలీలమివ తద్దనుః* 


 *ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్దనుః* *తద్భభంజ ధను ర్మధ్యే నరశ్రేష్టో మహాయశాః* 


 ధర్మాత్ముడైన రాముడు ఎట్టి ప్రయాసము లేక లీలగా ధనుస్సును పట్టుకొని అల్లెతాడుతో పూరించి ఆకర్షించగా ధనుస్సు రెండు ముక్కలులైంది.......


ధనుర్భంగము వలన కల్గిన పిడుగువంటి శబ్దమునకు జనకుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తప్ప తక్కిన వారందరు మూర్ఛనొంది పడిపోయినారు...........


నిర్ఘాతనాద మగుచు ధనుర్ఘయటితమహాస్వనం బంనూనం బగుడున్ దీర్ఘముగ వణఁకె ధరణి స,నిర్ఘోషంబుగను గిరులు,నెఱుపాఱగతిన్........

(వాసుదాస స్వామి వారి పద్యం)

**

శ్రీరామ చంద్రుడు ధనుర్భంగం కావించడంవలన పెద్ద శబ్దాలు,పర్వతం పగిలిపోతున్నట్టు,భూమి కంపించింది.విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప తక్కినవారంతా మూర్ఛపోయారు. అప్పుడు జనకుడు ఆశ్చర్యచకితుడవుతూ విశ్వామిత్రునితో ఇలా అన్నాడు


హే భగవన్! రాముని శక్తి తెలిసింది. ఇది అత్యద్భుతం. అచింత్యం. అతర్క్యం. ఈతనిని భర్తగా పొంది మా సీత జనకవంశకీర్తిని సొంతం చేసుకుంటుంది.


కౌశికా ! నా ప్రతిజ్ఞకూడా నెరవేరింది. వీర్యశుల్క అన్నానుగదా ! నాకు ప్రాణాలకు ప్రాణం మా అమ్మాయి

సీతను రామునికి ఇస్తాను. 

మీ అనుమతితో మా మంత్రులు త్వరగా అయోధ్యకు వెడతారు. దశరథ మహారాజును తీసుకువస్తారు. ప్రదానం విషయమంతా చెబుతారు. ఈ రామలక్ష్మణులుకూడా తమ సంతోషాన్ని తండ్రికి కబురుపంపాలి. దశరథుణ్ని రప్పించాలి - అంటూ అది ఆజ్ఞయో అభ్యర్ధనయో తెలియనీకుండా పలికారు.


విశ్వామిత్రుడు సరే అన్నాడు.


విశ్వామిత్రుని ఆజ్ఞను పురస్కరించుకొని జనక చక్రవర్తి శివధనుర్భంగ వృత్తాంతాన్ని దశరథ చక్రవర్తి కి తెలుపుతూ, ఆయనను కుటుంబ పరివార సమేతంగా సీతారామకల్యాణం కొరకు రమ్మని ఆహ్వానించాడు


దూతలు అయోధ్యకు వెళ్లి దశరథుడికి జనకుని ఆహ్వానాన్ని అందించారు. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులను పంపినప్పటి నుండి ఏవార్త తెలియక ఆందోళన చెందుతున్న దశరథ మహారాజుకు జనకుని ఆహ్వానము- ఆకలి గొన్నవానికి అమృతము లభించినట్లు మహానందాన్ని కల్గించింది


దశరథుడు, కౌసల్యాది రాజపత్నులు వశిష్ఠాది మహర్షులు సుమంత్రాది మంత్రులు, చతురంగ సేనావాహినితో, ఇతర పరివారంతో వాయువేగముతో  ప్రయాణించి మిధిలకు చేరారు. తెల్లవారి జనక మహారాజు తన తమ్ముడు కుశధ్వజుని కుటుంబసమేతంగా

సాంకాశ్యనగరాన్నుండి రప్పించాడు. వశిష్ఠ మహర్షి దశరథ, చక్రవర్తి యొక్క (వంశ పూర్వానుక్రమణికను) ప్రవరను వినిపించగా, శతానందుడు జనక చక్రవర్తి యొక్క పూర్వ రాజుల క్రమాన్ని వివరించాడు.


విశ్వామిత్ర మహర్షి, దశరథ, జనకుల వంశముల వైభవాన్ని కొనియాడి ఆ రెండు గొప్పవంశముల మధ్య సంబంధము ఎంతో శ్రేయస్కరమని, అపూర్వమని అభిప్రాయపడ్డాడు


జనక చక్రవర్తి సంతోషభరితుడై తనకూతురులైన సీతాదేవిని ఊర్మిళను శ్రీరామునికి, లక్ష్మణునికి, తన తమ్ముని కూతురులైన మాండవి, శృతకీర్తులను భరత శతృఘ్నులకివ్వడానికి అంగీకరించాడు.......

[28/03, 8:21 am] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 19


రామ లక్ష్మణ భరత  శత్రుజ్ఞ ల వివాహానికి ముందురోజు చేయవలసిన వైదిక కార్యక్రమాలు అన్నీ వారి వారి పురోహితులు యధావిధి గా చేయించారు...


తెల్లవారి వివాహ మంటపములో వేదికను ఏర్పరచి, వశిష్ఠుడు దానిని అలంకరింపజేశాడు. నవధాన్యాంకురములతో కూడిన గురుగులను, ధూప పాత్రలను, శంఖపాత్రలను, స్కుక్సువాదులను అర్హ్యపాద్యాది పాత్రలను సమకూర్చాడు. అక్షతలను తెప్పించాడు.

దర్భలను యధావిధిగా పరచి, వేదిపై అగ్నిని కల్పించి, మంత్రముల ననుసంధిస్తూ విధి విధానంగా హవనం చేశాడు.


ఆ తరువాత సర్వాభరణ భూషిత అయిన సీతాదేవిని శ్రీరామచంద్రున కెదురుగా అగ్ని సమక్షంలో నిలిపారు కౌసల్యానందవర్ధనుడు, దశరథ తనయుడైన శ్రీరామచంద్రునికి సీతాదేవిని అప్పగిస్తూ జనకమహారాజు ఈ విధంగా అన్నాడు......


 *ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణింగృహ్ణీష్వ పాణినా.* 

 *పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా.....* 


ఇదిగో సీత....

నా పుత్రిక.....

నీకు సహధర్మ చారిణి....

ఈమె ను స్వీకరించు....

నీకు మంగళం కలుగును....

చేతిని చేతితో పట్టుకో ....

పాణిగ్రహణం చెయ్యి.....


ఈ సీత పతివ్రత అయి నిన్ను నీడలా వెంట ఉంటుంది......


అంటూ మంత్రపూతం గా రాముని చేతిలో జలమును విడిచిపెట్టారు....


వెంటనే లక్ష్మణుణ్ని పిలిచి హర్షపులకితగాత్రుడై లక్ష్మణా! రా! నీకు భద్రమగుగాక! ఊర్మిళను స్వీకరించు


పాణిగ్రహణం చెయ్యి. ముహూర్తం దాటిపోకూడదు.


రఘునందనా! భరతా ! మాండవి పాణిని గ్రహించు. మహాబాహూ ! శత్రుఘ్నా ! శ్రుతకీర్తి చేతిని నీ చేతితో పట్టుకో! పాణిగ్రహణం చెయ్యి.


మీరంతా సౌమ్యులు. సుచరిత వ్రతులు. భార్యలను స్వీకరించండి. ముహూర్తం దాటిపోకూడదు.


జనకుని మాట ప్రకారం నలుగురు అన్నదమ్ములూ నలుగురు పాణిగ్రహణం చేసారు. 


వసిష్ఠుని అనుమతి పొందారు. జంటలుగా అగ్నికి ప్రదక్షిణం చేసారు. వేదికకూ, రాజుకూ, ఋషులకూ ప్రదక్షిణలు చేసారు విధిపూర్వకంగా వివాహం జరిగింది.అంతరిక్షం నుంచి పుష్పవృష్టి కురిసింది. దివ్యదుందుభులు మ్రోగాయి. 


వాద్యఘోషలూ వినిపించాయి. అప్సరసలు నాట్యంచేసారు. గంధర్వులు గానంచేసారు.


విశ్వామిత్రుడు నూతన దంపతులను ఆశీర్వదించి తపస్సుకై ఉత్తర దిక్కు కు ప్రయణమయ్యాడు. 

( సీతా రామ కళ్యాణము ప్రధాన కార్యం కాబట్టి ఇక విశ్వామిత్రుడు నిష్క్రమించాడు)

ఆ రాత్రి విడిది చేసి దశరథుడు నూతన దంపతులు మరుసటి రోజు అయోధ్య కు ప్రయాణమయ్యారు

**

దశరథుడు అయోధ్యకు కొడుకులు,కోడళ్లు,మంత్రులు తో అయోధ్యా కు ప్రయాణం సాగిస్తున్నాడు.....


ఉన్నట్టుండి చీకటి కమ్ముకొంది....

 సైన్యము మూర్ఛపోయింది.

వశిష్టాది ఋషులు దశరథుడు రాముడు కొద్దిమంది మాత్రం స్పృహ కలిగి ఉన్నారు...


అప్పుడు పరశురాముడు ఓ విల్లు చేత బట్టుకొని కనిపించాడు....


రామ శివ ధనుస్సును విరిచావట ...నేను మరొక ధనుస్సును తెచ్చాను.మాతండ్రి గారు నాకు ప్రసాదించారు దీనిని పురించి నీ బలమును ప్రదర్శించు...లేనిచో నీ తో ద్వంద యుద్ధము చేస్తాను అని పలికాడు.....


రామా! నీవు విరిచినది శివధనుస్సు గదా! నేను తెచ్చినది విష్ణుదేవుని ధనుస్సు.


పూర్వకాలమున శివునికి విష్ణుదేవునికి విరోధము కలిగినప్పుడు విశ్వకర్మ రెండు ధనుస్సులను నిర్మించి చెరియొకటి ఇచ్చినాడు. ఇద్దరు వారివారి ధనుస్సులను ప్రయోగించినారు. శివుని విల్లు జడమైపోగా అతడు కోపించి ఆ ధనుస్సును దేవరాతుని కిచ్చినాడు. నీవు విరిచిన

ధనుస్సు అదియే. విష్ణుదేవుని ధనుస్సును ఎక్కు పెట్టగలవేమో చూడుము.


రాముడు : (దశరథుని యందలి ప్రీతిచే కొంత వినయముగా) పరశురామా! నీ విదివరలో చేసిన పనులను గురించి విని నిన్ను మెచ్చుకొన్నాను. ఇప్పుడు నీవు నన్ను అవమానింప

గోరుచున్నావు. ఇట్టి అవమానమును 

నే నెంతమాత్రము సహింపజాలను. నా పరాక్రమమును చూడు.


ఈ మాటలు పలికి శ్రీరాముడు పరశురాముడు తెచ్చిన ధనుస్సును  బాణమును సంధించి ఎక్కుపెట్టినాడు.....


"భార్గవా! నీవు బ్రాహ్మణుడవని, విశ్వామిత్ర సమీప బంధువని -ప్రాణములను తీయడం లేదు. అయితే నాబాణము వ్యర్థముగా పోదు. నీపాదగతినైనా, నిరోధిస్తాను -లేక నీతపోలోకాలనైనా భస్మం చేస్తానని' తోక తొక్కిన మహాసర్పం వలె బుసలు గొట్టాడు.


రామభద్రుడు పరశురాముని ధనువుతో పాటు, ఆయన బ్రహ్మతేజాన్ని కూడ లాగుకొన్నాడు. స్తబ్దుడైన భార్గవ రాముడు "దశరథ రామా! నేనింతకు ముందే కాశ్యపునికి ఈ భూమిని దానం చేసి రాత్రులు ఇక్కడ ఉండనని ఒట్టు బెట్టుకున్నాను. నేను గురువుకిచ్చిన మాటను జవదాటజాలను కాబట్టి నాతపోలోకాలను నీ బాణంతో దగ్ధం చేయి" అని పలికాడు. రామభద్రుడలాగే దగ్ధం గావించాడు. పరశురాముడు దశరథ రామునికి ప్రదక్షిణ చేసి - అంజలి ఘటించి - మళ్ళీ తపశ్చర్యకై మహేంద్ర గిరికి వెళ్లాడు.....


మళ్ళీ పరివారం తో దశరథుడు అయోధ్యా ప్రయాణం సాగించాడు.....

[28/03, 8:21 am] K Sudhakar Adv Br: 🌹 రామాయణానుభవం- 20


పరుశురాముని గర్వభంగం తో తపస్సుకై మహేంద్రగిరి కి వెళ్ళాడు....


కొడుకులు, కొడళ్ల ,మంత్రి పురోహితులతో దశరథుడు అయోధ్య చేరాడు...


రాజకుమారులు తమ తమ పనులు చేస్తూ తండ్రిని అనుసరించి కాలం గడుపుతున్నారు.....


కొంతకాలం తరువాత దశరథుడు భరతుని పిలిచి దశరథుడు నాయనా..!నిన్ను పిలుచుకొని పోవడానికి మీ మేనమామ వచ్చి వున్నాడు వారి తో వెళ్లుము అని ఆదేశించాడు.శత్రుఘ్నుడు అనుసరించాడు.


సీతారాముల దాంపత్యం గురించి తెలుపుతూ మహర్షి....


*రామస్తు సీతయా సార్థం విజహార బహూనృతూన్*

*మనస్వీ తద్గత స్తస్య నిత్యం హృది సమర్పితః*


రాముడు సీతయందు మనస్సు నిలిపి  తాను ఆమె మనస్సు యందు ఎల్లప్పుడూ నిలిచియుండి సీతతో అనేక ఋతువులు గడిపినాడు...


*ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి* 

*గుణా ద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయో భ్యవర్థత*


రామునికి సీతయందుండిన ప్రీతికి మూడు కారణములు, మొదటిది తండ్రి కూర్చిన భార్యగనుక ; 

రెండవది సీతాదేవి గుణములు; 

మూడవది సీతాదేవి సౌందర్యము. మొదటి కారణము వలన కలిగిన ప్రీతిని మిగిలినవి వృద్ధిపరచినవి.


*తస్యాశ్ఛ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే*


రామునికి సీతయందుగల అనురాగముకంటె రెండింతలుగా రాముని మీద ప్రేమ సీతాదేవి హృదయమునందు ఉండినది.


*అంతర్జాతమపి వ్యక్త మాఖ్యాతి హృదయం హృదా....*


సీతాదేవి హృదయములోని భావమును రాముడు తన హృదయముచే స్పష్టముగా

తెలిసికొనగలిగినాడు.....


*తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజా దేవతాభి స్సమా రూపే సీతా శ్రీరివ రూపిణీ....*


దేవతాస్త్రీలతో సరిసమానమైన సౌందర్యము , ఆకారము కలిగి లక్ష్మీదేవివలె విరాజిల్లుచున్న సీతాదేవి శ్రీరాముని ప్రేమను శ్రీరామునికంటె మిక్కిలి చక్కగా తెలిసికొన్నది.......


*తయా స రాజర్షిసుతోభిరామయా* *సమేయివా నుత్తమ రాజకన్యయా* *అతీవ* *రామశ్శుశుభే తికామయా*

*విభుత్రియా విష్ణురివా మరేశ్వరః*


రాజర్షిసుతుడైన శ్రీరాముడు సౌందర్యవతి, అనురాగవతి, ఉత్తమ రాజకన్య అయిన సీతాదేవితో, లక్ష్మీదేవిని గూడిన విష్ణుదేవుని వలె మిక్కిలి శోభిల్లినాడు......


బాలకాండ పూర్తి.


[1. సీతారాముల కల్యాణం సర్గ(73) పారాయణ వలన వివాహ యోగ్యం కలుగుతుంది.

2.సీత రామ సుఖ జీవన సర్గ (77) దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుందని పెద్దల మాట.]

**

*అయోధ్యా కాండ*


*గచ్చతా మాతుల కులం భరతేన తదా నఘః* 

*శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీతః ప్రీతి పురస్కృతః.*


భరతుడు శత్రుఘ్నుని కూడి తన మేనమామగారి ఇంటికి వెళ్ళి కేకయ రాజధాని యగు గిరివ్రజమున సుఖముగా కాలక్షేపము చేయుచున్నాడు. రామలక్ష్మణులు అయోధ్యయందే ఉన్నారు దశరథునికి కుమారులందరి మీద ప్రేమ కలదు. కాని వారిలో రాముని మీద ఎక్కువ ప్రీతి రామునిపై ప్రత్యేక ప్రేమ కలిగియుండుటలో వింత యేమియు లేదు. రాముని కల్యాణగుణములుగాని మోహనాకారముగాని అందరిని ఆకర్షింపగలవు. 


*స చ నిత్యం ప్రశాన్తాత్మా మృదుపూర్వం తు భాషతే ఉచ్యమానోఽపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే.*


రాముడు ఎల్లప్పుడు ప్రశాంతముగ ఉండువాడు ఎప్పుడు గాని కఠినముగా మాటలాడడు. ఎవ్వరిని చూచినను మృదువుగా పలకరిస్తాడు. ఇతరులు పరుషముగా పలికినను రామునికి కోపము రాదు.


*బుద్ధిమా న్మధురా భాషీ పూర్వభాషీ ప్రియంవదః* 


రాముడు బుద్ధిమంతుడు - మధురముగా మాట్లాడుతాడు. అప్రియములు పలుకడు. ఎవ్వరినైనను తానే ముందు పలకరిస్తాడు....


*తథా సర్వప్రజాకాంతైః ప్రీతిసంజననైః పితుః" 

*గుణై ర్విరురుచే రామో దీప్తః సూర్య ఇవాంశుభిః*


కిరణములచే సూర్యుడు వెలుగునట్లు కల్యాణ గుణములచే శ్రీరాముడు ప్రకాశించెను.


ఇంతటి సుగుణ సంపన్నుడైన రాముడిని చూచి దశరథుని మనస్సులో రాముణ్ణి యూవరాజ్య పట్టాభిషేకం చేయాలని తలచెను.


వెంటనే మంత్రి పురోహిత సమన్తరాజ జనపద సహితం గా సభఏర్పాటు చేయాలని అందరికి ఆహ్వానాలు పంపారు...కేకయ రాజు జనక మహారాజు మినహాయించి .పట్టాభిషేకానంతరం ఈ శుభ వార్తను వారు విన గలరు అని సరిపెట్టుకొన్నాడు....


సభ ఏర్పాటు చేశారు దశరథుడు ఇలా చెప్పసాగాడు


మా పూర్వికులు ఈ మహాసామ్రాజ్యాన్ని ఎంత ప్రేమగా పుత్ర సమానంగా పరిపాలించారో మీ కందరికీ తెలుసు. నేనుకూడా యథాశక్తి అందరి సుఖాలకూ అందరి శ్రేయస్సులకూ పాటుపడ్డాను. పూర్వుల మార్గంలో ప్రయాణిస్తూ చేతనైన రీతిలో ప్రజారక్షణ సాగించాను.


ఇప్పటికి ఈ శరీరం క్షీణించింది.    శరీరం విశ్రాంతిని కోరుతోంది. మరింక రాజ్యభారం వహించలేను. మీరంతా అంగీకరిస్తే కుమారునికి ఈ ప్రజాహితభారం అప్పగిద్దామనుకుంటున్నాను.


రాముడు మీకందరికీ తెలుసు. నాకు జ్యేష్ఠుడు. గుణవంతుడు. బుద్ధిమంతుడు. ధర్మజ్ఞుడు. పరాక్రమశాలి అని ప్రజలంతా కీర్తిస్తున్నారు. అతనికి యౌవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని నా సంకల్పం. ఇది మంచిదని మీకు అనిపిస్తే అంగీకరించండి. ఏదిఎలా చెయ్యాలో చెప్పండి.


సభమొత్తం ఏక కంఠం తో ఇలా చెప్పారు...


*ఇచ్చామో హి మహాబాహుం రఘువీరం మహాబలమ్* |

*గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననమ్* ||


గొప్ప బాహువులు గలవాడూ, రఘువంశసంజాతులలో మహావీరుడూ, మహాబలశాలి అయిన రాముడు పట్టాభిషిక్తుడై, శ్వేతచ్ఛత్రధారియై, మహాగజము నధిష్ఠించి వెళ్లుచుండగా చూడవలె నని మే మందరము కోరుచున్నాము.......


రాముణ్ణి ఎందుకు కోరుకుంటున్నారు అన్న దశరథుని ప్రశ్నకు సమాధానం గా ప్రజలు ఇలా చెబుతున్నారు.....

[28/03, 8:21 am] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 21


రాముణ్ణి యువరాజుగా ఎందుకు కోరుకుంటున్నారో ప్రజలు అందరు ముక్త కంఠం తో ఇలా తెలుపుతున్నారు.....


మహారాజా! శ్రీరాముడు సత్యపరాక్రముడు, ఇక్ష్వాకువంశస్థులందరిలో మేటియనదగినవాడు,

అందరియందు దయగలవాడు, ప్రజలను స్వజనులవలె ఆదరించువాడు. ఎవ్వనికైనను దుఃఖము కలిగినప్పుడు తానుకూడ వానితో సమానముగ దుఃఖపడువాడు. ఎవ్వరైనను ఉత్సవములు చేసికొనునప్పుడు వారిని చూచి కన్నతండ్రివలె సంతోషించువాడు. సర్వదా నవ్వుముఖమువాడు. ఎదురుపడిన వారిని ముందు పలుకరించువాడు. ధర్మమును విడనాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, ప్రజాపరిపాలన రీతి చక్కగా తెలిసినవాడు, ముల్లోకములను పాలింప సమర్థుడు. అట్టి శ్రీరామునికి ఈ భూమండలమును పాలించుట పెద్దపని కాదు. లోకాభిరాముడైన శ్రీరాముడు మాకు ప్రభువుగా నుండుట మాకు ఆనందదాయకము. 


పిన్న, పెద్ద,స్త్రీలు, పురుషులు అను భేదములేక రాష్ట్రములోని ప్రజలందరు శ్రీరాముని క్షేమము నుద్దేశించి ప్రతి ఉదయమునను సాయంకాలమునను తమ ఇష్టదేవతలను ప్రార్థించుచున్నారు. శ్రీరాముడు మాకు ప్రభువైనచో అంతకంటె మాకు కావలసిన దేమియులేదు. కావున మేమందరము ఏకగ్రీవముగా మనవి చేయుచున్నాము శ్రీరామునికి పట్టాభిషేకము జరిపింపవలసిన దని ప్రార్థించుచున్నాము.


ఈమాటలు విని దశరథుడు మిక్కిలి సంతోషించాడు.తన అభిప్రాయం ప్రజలందరూ

అంగీకరించుటయేగాక మెచ్చుకున్నారు. ఇక ఆలస్య మెందుకు?అని

దశరథుడు తన పురోహితులైన వసిష్ఠ వామదేవులతో అనుచున్నాడు.


*చైత్ర శ్శ్రీమా నయం మాసః పుణ్యః పుష్పిత కాననః* 

*యౌవరాజ్యాయ రామస్య సర్వమే వోపకల్ప్యతామ్*


ఈ చైత్రమాసము మిక్కిలి శుభకరమైన మాసము. రాముని యౌవరాజ్య పట్టాభిషేకమునకు కావలసినవానినన్నిటిని సిద్ధము చేయించండి.....


ఈ మాటలు విని ప్రజలు జయ జయ ద్వానాలు చేసినారు ఇక జరుగ వలసిన ఏర్పాట్లను చేయవలెనని మంత్రి వర్గ పురోహితులతో చర్చ చేసాడు.


నానాదేశాధిపతులతో  శోభిస్తున్న కొలువులో  దశరథుడు సుమంత్రిని తో రాముణ్ణి తీసుని రండి అని తెలిపాడు.....


అలా నడుచు కొంటూ వస్తున్న రాముణ్ణి చూస్తూ.....


*గంధర్వరాజ ప్రతిమం లోకే విఖ్యాత పౌరుషమ్* 

*దీర్ఘ బాహుం మహాసత్త్వం మత్తమాతంగ గామినమ్*


*చంద్రకాంతాననం రామ మతీవ ప్రియదర్శనమ్*

*రూ పౌదార్య గుణైః పుంసాం దృష్టి చిత్తాపహారిణమ్* 


*ఘర్మాభితప్తాః పర్జన్యం హ్లాదయన్తమివ ప్రజా*

*న తతర్ప సమాయాంతం పశ్యమానో నరాధిపః*


శ్రీరాముడు గంధర్వ రాజువలె శోభిల్లుచున్నాడు....... 


ఆజానుబాహుడు. చూచుటకు ఎంతో ముచ్చటగా ఉన్నాడు.....


 పురుషులను కూడా ఆకర్షింపగల మోహనాకారుడు......


 తన రూపము చేత వారి చూపులను, గుణములచేత మనస్సులను అపహరించువాడు...... 


ప్రజలకు సుఖము చేకూర్చి వారి హృదయములను రంజింప జేయువాడు.....


ఇలాంటి శ్రీరామున్ని ఎంతచూచినను దశరథుడు తృప్తి జెందలేదు. ....


మళ్ళీ మళ్ళీ చూడాలనే అనిపిస్తోంది......


[అయోధ్యా కాండ మొదటి సర్గ,రెండవ సర్గ లలో రాముని కల్యాణ గుణాలు విస్తృతం గా వర్ణించాడు వాల్మీకి.

ఈ రెండు సర్గలు పారాయణ చేయడం వలన పిల్లల్లో కూడా మంచి గుణాలు అలవడుతాయి అని *శ్రీభాష్యం* *అప్పలా చార్యుల వారి* మాట.]

**

శ్రీరాముడు రధాన్ని దిగి మహారాజాను సమీపించి అంజలి ఘటించి తన పేరును చెప్పుకొన్నాడు. మహారాజు ఆయనను తన బాహువులలోకి తీసి కొని ఒక ఉన్న తా సనంలో కూచోబెట్టాడు. సూర్య ప్రభలతో ప్రకాశించే మేరుపర్వతమువలె శ్రీరాముని రాకతో ఆ రాజ సభ మరింత శోభాయమానమైనది. శ్రీరాముని చూస్తుంటే మహారాజుకు అద్దములో అలంకృతమైన తన రూపాన్ని చూచుకొన్నట్లే ఉంది.


దశరధుడు సభలోని నిశ్శబ్దాన్ని చీలుస్తూ, “రామా! నీవు నా పెద్ద భార్యకు పెద్ద కుమారుడిపై జన్మించావు. నీ రూపగుణాలతో ప్రజలందరిని ఆకర్షించావు. అందువలన నిన్ను రేపు 'పుష్య చంద్ర యోగం' లో పట్టాభిషిక్తుని చేస్తాను. నీవు సహజంగా సుగుణ శాలివే. ఆయినా వాత్సల్యం వలన నీకు కొన్ని విషయాలు తెలుపుతున్నాను


రామా ! నీవు ఎల్లప్పుడు వినయవంతుడివిగా ఉండాలి. జితేంద్రియుడివి కావాలి. కామ, క్రోధ వ్యసనాలను పరిత్యజించాలి. అమాత్య ప్రభృతులైనఉద్యోగులను ప్రజలను అలరింపజేయాలి. ధనాగారాన్ని ఆయుధాగారాన్ని ఎప్పుడు నిండుగా ఉంచాలి.


అనురక్తులైన ప్రజలు అమృతము లభించిన అమరులవలె మహారాజును అభినందిస్తారు. అందువలన నీవు నియమవంతుడివి కావాలి అని చక్రవర్తి శ్రీరామునికి ఉపదేశించాడు.


శ్రీరాముని పట్టాభిషేక వార్త అయోధ్యా నగరంలో సుడిగాలిలా వ్యాపించింది. శ్రీరాముని స్నేహితులు పరుగున వెళ్లి కౌసల్యాదేవికి ఆ వార్త నివేదించారు. ఆ తల్లి ఆక్షణంలోనే ఆవులను బంగారాన్ని, రత్నాలను బ్రాహ్మణులకు దానం చేసింది.


శ్రీరాముడు దశరథునికి ప్రణమిల్లి రధమారోహించి ప్రజల అభివందనాభివాదాలను స్వీకరిస్తూ, తన భవనానికి చేరాడు.


రాముడు అక్కడి నుండి తల్లి మందిరానికి వెళ్ళాడు...

అమ్మా....రేపు పుష్య చంద్రయోగం లో నన్ను పట్టాభిషక్తుడు చేస్తానన్నారు నాన్న గారు అని విషయం తెలిపారు.కౌసల్యా దేవి మిక్కిలి సంతోషించింది.


దశరథుడి అజ్ఞానుసారం సీత రామచంద్రుల చేత వశిష్టుల వారు ఉపవాస వ్రతం జరిపించారు.


*సహపత్న్వయావిశాలాక్ష్యా నారాయణము పాగమత్*


వసిష్ఠుడు వెళ్ళినపిదప సీతారాములు నారాయణుని ఉపాసించినారు. ఆ రాత్రి దర్భలపై శయనించి జామురాత్రి మిగిలియుండగనే లేచి భవనమునకు అలంకారము చేయించినారు.


అయోధ్యలో ఎక్కడ చూచినను రాముని పట్టాభిషేకమును గూర్చిన మాటలే వినబడుచున్నవి. నగరము నంతయు సింగారించినారు. నటనర్తక సంఘములు ఆడుచు పాడుచు ఆనందముగా ఉన్నారు. బాలురుసైతము ఇండ్లముందర గుంపులుగా చేరి రామాభిషేకమునకు సంబంధించిన

ఆటలాడుకొనుచు మాటలను చెప్పుకొనుచు ఆనందించుచున్నారు.


ఇలాంటి ఆనందం లో ఉన్న నగరాన్ని కైకేయి దాసి అయిన మంథర అంతపురం మేడ పైకి ఎక్కి చూడసాగింది.....


[ఇక్కడ రామచంద్రుడు ఉపాసించిన నారాయణుడు అర్చామూర్తి గా ఉన్న రంగనాథుడు,పట్టాభిషేకానంతరం ఇక్ష్వాకు కులధనం (రంగనాథుడు) గా విభీషణునికి అందజేస్తారు.

అదే నేటి శ్రీరంగ అర్చామూర్తి అని గోవిందరాజీయాది వ్యాఖ్యాన కారులు నిర్ణయించారు.]

[06/04, 8:08 pm] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 23


 రామపట్టాభిషేక వార్త ను తెలపాలని  కైకేయి భవనానికి వెళ్ళాడు.అక్కడ లేదని కోపగృహం లో ఉందని పరిచారికాల ద్వారా తెలుసుకొన్న  దశరథుడు అక్కడికే వెళ్ళాడు....


దేవి! నీ ఆగ్రహానికి కారణము తెలుపు. నిన్నెవ్వరైనా నిందించారా ? అవమానించారా? కళ్యాణి! నాకు అమంగళకరంగా కటిక నేలపై దుమ్ములో పడి ఉన్నావు. భూత మావేశించిన దానివలె నాకు చిత్త భ్రమను కలిగిస్తున్నావు నీకు ఏదైనా వ్యాధి వచ్చిందా? నా అస్థానంలో ఘన వైద్యులున్నారు. చిటకెలో నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తారు


నీ వెవ్వరికైనా ఉపకారం చేయాలనుకొన్నావా ? లేక అపకారం చేయాలనుకొన్నావా? నిర్జనుని ధనికునిగా చేద్దామనుకొన్నావా ? ధనికుని నిర్దనుని చేయాలనుకొన్నావా? క్షణములో నీ ఏ కోరికనైనా తీర్చడానికి, నేను, నా వాళ్లందరు లేమా ? అందరము నీ వారమే కదా ! నా శక్తిని తెలిసికొని కూడ నీ విట్లా బేలతనాన్ని కల్గి ఉండడము నీకు తగునా ? నా పట్ల నీకు సందేహమా ?


సమస్త సామంత రాజన్యుల సకల సంపదలను నీ పాదాల ముందుకుమ్మరిస్తాను. దేవి! నీ దైన్యానికి కారణం తెలుపు ఇప్పుడే తొలిగిస్తాను' అని దశరథుడు అడిగాడు


మన్మధ బాణ పీడితుడైన మహారాజుకు స్వార్ధథ పూరిత దుష్ట చిత్త అయిన కైకేయి ఈ విధంగా సమాధానమిచ్చింది


దేవా ! నాకెవ్వరు అపకారము చేయలేదు. నన్నెవ్వరు నిందించలేదు. అవమాన పరుచలేదు. అయినా నా కొక కోరిక ఉంది. దానిని నీవు నెరవేరుస్తానంటే

ప్రమాణం చేయి. అప్పుడు నా మనోరధాన్ని తెలుపుతాను'.అంది.


దశరథునికి తన గుండె బరువంతా ఒక్కసారి దిగినట్లు అనిపించి, తేలికగా

ఊపిరి పీల్చి చిరునవ్వుతో 'కైకా! నీకంటే ప్రియమైన వారు మరెవ్వరున్నారు చెప్పు? పురుషులలో నాకు ప్రాణ ప్రియుడు నా రాముడు. ఎవ్వరిని విడిచి క్షణమైనా జీవించి ఉండజాలనో, అట్టి నా రాముని మీద ప్రమాణం చేసి తెలుపుతున్నాను. నీ కిష్టమేదైనా తప్పక నెరవేరుస్తాను. నన్ను సందేహింపకు' మని ఒట్టు పెట్టుకొని గట్టిగా చెప్పాడు.


మహారాజా! పూర్వము దండకాధిపతియైన ‘తిమిధ్వజుడని’ పేరుగల శంబరాసురునితో దేవతలకు యుద్దమేర్పడింది. అప్పుడు మీరు దేవతలకు సహాయంగా వెంట నన్ను తీసికొని వెళ్లారు. అసురుల అస్త్రాలతో మూర్ఛితులైన మిమ్మల్ని వారికంట బడకుండా తప్పించి కాపాడినందులకు నాకు మీరు రెండు వరాలను అనుగ్రహించారు కదా! వాటిని ఇప్పుడు అడుగుతున్నాను. ఒకవేళ నాకా వరాలను ఇవ్వకుండా మీ మాటను జవదాటితే నా ప్రాణాలనే తీసికొంటాను” అని కైక తన వాక్పాశములతో ఆ కామమోహితుని ముందుకాళ్లకు బంధము వేసింది.


రామునికి పట్టాభిషేకం సంకల్పించావు కదా ! అదే ముహూర్తానికి భరతుడి పట్టాభిషేకం జరగాలి. ఇది ఒకటి. ఇక రెండవది- రాముడు చీరాజినజటాధారియై పధ్నాలుగు సంవత్సరాలపాటు తాపసవృత్తితో దండకారణ్యంలో నివసించాలి. ఇవి ఈరోజే జరగాలి.


ఈ దారుణం విని సివంగిని చూసిన లేడికూనలా మహారాజు గజగజలాడిపోయాడు. నేలమీద కూలబడ్డాడు


అహో! ధిక్ అంటూ స్పృహ కోల్పోయాడు. కొంతసేపటికి కోలుకున్న వృద్ధ మహారాజు ఆ తరుణీమణి మీద నిప్పులు కురిపించాడు......

**

రాముని వనవాస కోరిన కైకేయి పై నిప్పులు  కురిపిస్తూ దశరథుడు....


ఓనీ దుష్టురాలా! నా వంశాన్ని సర్వనాశనం చెయ్యడానికి అవతరించావు. రాముడు గానీ నేను గానీ నీకు ఏమి అపకారం చేసాం. నిన్ను తల్లిలాగా చూసుకుంటున్నాడే. అలాంటి రామునికి అనర్ధం తలపెడుతున్నావా ! నువ్వు విషసర్పానివి. తెలియక అంతఃపురంలోకి తెచ్చి పెట్టుకున్నాను. ప్రజలంతా రాముని గుణగణాలను స్తుతిస్తూంటే ఏ అపరాధం చూపించి అతడిని శిక్షించమంటావ్?


 కౌసల్యను వదిలెయ్యమంటే వదిలేస్తాను. సుమిత్రను వదిలెయ్యమంటే వదిలేస్తాను. రాజ్యం వదిలెయ్యమంటే వదిలేస్తాను. చివరికి నా ప్రాణాలు వదిలెయ్యమనూ వదిలేస్తాను. అంతేకానీ రాముణ్ణి మాత్రం వదలలేను. వదలి నేను జీవించలేను క్షణకాలం సుఖంగా ఉండలేను. సూర్యుడు లేకుండా లోకం ఉండవచ్చు. నీరు లేకుండా సస్యాలు పండవచ్చు. కానీ రాముడు లేకుండా ఈ దేహంలో ప్రాణం నిలవదు. పాపాత్మురాలా ! నీ నిశ్చయం మార్చుకో. పాదాలు పట్టుకుంటాను. తలవంచి మొక్కుతాను.


మహారాజా! నువ్వు సత్యసంధుడివి. ధైర్యశాలివి. వరం చెల్లిస్తానన్నావు. తీరా అడిగాకమాటతప్పించాలని చూస్తున్నావు ఎందుకని?


దశరథుడు తీవ్ర దుఃఖం తో మూర్ఛ పోయి అప్పుడప్పుడు తెలివి తెచ్చుకొని మాట్లాడుతున్నాడు....


అడవులకు పొమ్మని నేను చెప్పాలే గానీ రాముడు వెంటనే అంగీకరిస్తాడు. మారుమాట్లాడకుండా వెళ్ళిపోతాడు వెంటనే నేను మరణిస్తాను. కౌసల్య మరణిస్తుంది. సుమిత్ర మరణిస్తుంది. ముగ్గురు పుత్రులు మరణిస్తారు. మమ్మల్ని అందరినీ నరకంలో తోసేసి నువ్వూ నీ కొడుకూ సుఖపడండి.


దశరథుడు ఎంత బ్రతిమాలినా కైక పట్టు విడవలేదు....


రాత్రిగడిచింది.తెల్లవారింది. వసిష్ఠుడు అభిషేకపు సంభారాలతో నదీసము ద్రోదకాలతో, శిష్యగణంతో, ఋత్విక్కులతో తరలి వచ్చాడు రాజద్వారంలో సుమంత్రుడు ఎదురయ్యాడు


'సుమంత్రా! త్వరగా వెళ్ళి రాజుగారికి నేను వచ్చానని చెప్పు. రామపట్టాభిషేకానికి అవసరమైన సంభారాలు అన్నీ సుమంత్రుడు సంబరపడుతూ త్వరత్వరగా వెళ్ళాడు. రాజుగారికి మేలుకొలుపు పలికాడు. స్తోత్రాలు చేసాడు. 


ఏడ్చి ఎరుపెక్కిన కళ్ళతో దశరథుడు సుమంత్రుణ్ని ఒకసారి చూసి- ఎందుకు వచ్చిన వృథాస్తోత్రాలయ్యా ఇవ్వి, గుండెల్లో గునపాలు దించుతున్నాయి- అని దీనంగా ఒక్కమాట పలికి ఊరుకున్నాడు.


సుమంత్రా! రామునికి పట్టాభిషేకం జరుగుతుందనే ఆనందంతో మహారాజు రాత్రంతా జాగారం చేసారు. ఇప్పటికి అలసిపోయారు. నిద్రావశులవుతున్నారు. నువ్వు త్వరగా వెళ్ళి రాముణ్ని ఇక్కడికి తీసుకురా- ఆలోచించకు వెళ్ళు అంది కైకేయి.....


నిజమనుకొని సుమంత్రుడు రాముని అంతఃపురం వైపు అడుగులు వేసాడు.....


 *యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి |* 

 *నిందిత స్స వసేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతే* 


రాముణ్ణి చూడని వాడు,రాముడు చూడని వాడు ఈ లోకం లో ఉంటే వాడు నిందితుడు.వాడిని వాడే అస్యహించుకొంటాడు......


ఇలా నగరం లో ప్రజలు ఆనందం తో మాట్లాడుకొంటున్నారు....వీధులు గృహాలు సముదాయాలు అన్ని విశేషం గా అలంకరణలు చుస్తూ వారి మాటలు వింటూ సుమంత్రుడు రాముని అంతఃపురం చేరాడు.....

[06/04, 8:08 pm] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 24


సుమంత్రునితో కలసి రామచంద్రుడు కైకేయి భవనానికి చేరాడు.విషణ్ణ వదనుడైన దశరథుని చూసాడు,పక్కనే ఉన్న కైకను చూసాడు. తండ్రికి అభివాదం చేసాడు.


దశరథుని స్థితి చూసి అమ్మా నేనేమైనా తప్పుచేశానా?

తండ్రిగారి శారీరకంగా మనసికం గా ఆరోగ్యం బావుందా?

భరతుని గాని శత్రుఘ్నుని కి కానీ ఏమీ అశుభం జరగలేదు కదా?


సమాధానం గా కైకేయి:

రామా..తండ్రి గారి ఆరోగ్యం బావుంది...పూర్వం దేవాసుర సంగ్రామం లో నాకు దశరథుడు రెండు వారాలు ఇచ్చాడు.

వాటిని ఇప్పుడు నెరవేర్చమన్నాను.

అవి ఒకటి.నీవు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి.

రెండు భరతుడికి ఇప్పుడే పట్టాభిషేకం జరగాలి.


తల్లీ నీకు అనుమానం వద్దు తండ్రిమాటను తప్పక పాటిస్తాను.కృష్ణా జినములు ధరించి ఇప్పుడే అడవులకు ప్రయాణమవుతాను.

 *రామో ద్విర్నాభి భాషతే* 

రాముడు రెండు రకాలు గా మాట్లాడడు,

భరతుని కి కబురుచేయండి నీవు కోరినట్టు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేస్తాను.


దశరథుడు ఆ మాటలు విని ఛీ ఎంత కష్టం వచ్చినది అని నిట్టూరుస్తూ మళ్ళీ మూర్ఛపోయినాడు. అతనిని లెవనెత్తుతూ రాముడు మళ్ళీ కైక తో....

 *నాహ మర్థపరో దేవి! లోక మావస్తు* *ముత్సహే* 

 *విద్ధి మా మృషిభిస్తుల్యం కేవలం* *ధర్మమాస్థితమ్* 


తల్లీ! నాకు ధనము మీదగాని రాజ్యము మీద గాని ఆసక్తి లేదు. నేను ఋషి వంటి వాడను. కేవల ధర్మమునే ఆశ్రయించి యుండువాడనని తెలిసికొనుము.


మా తండ్రి గారు చెప్పక పోయినా నీ మాటను తండ్రి ఆజ్ఞ భావిస్తాను.నేను సీతతో కౌసల్యతో చెప్పి వెంటనే బయల్దేరుతాను....


దశరథునికి కైకేయి కి ప్రదక్షిణం చేసి అక్కడి నుండి నిష్క్రమించాడు.....


*వాచా మధురయ రామస్సర్వం సమ్మానయన్ జనమ్ |*

*మాతుస్సమీపం ధీరాత్మా ప్రవివేశ మహాయశాః ||*


రాముని ముఖంలో శోభ తరగలేదు. 

మనస్సులో ఏ వికారాలూ కలగలేదు. 

రాజచిహ్నాలైన ఛత్రచామరాలనూ అలంకారాలనూ పరిత్యజించాడు. 

రథంకూడా వద్దన్నాడు. పాదచారియై బయలుదేరాడు. మధుర వాక్కులలో జనాన్ని పలకరించాడు. కౌసల్యామందిరం చేరుకున్నాడు.


**


రాముడు కౌసల్యా మందిరం చేరాడు ...


కౌసల్య ఎదో వ్రతం ఆచరిస్తోంది.

రాముడు కౌసల్యాదేవి తో అమ్మా..!ఓ పెద్ద భయం ఏర్పడింది.


నీకూ సీతకూ లక్ష్మణుడికీ దుఃఖకరమైన విషయం. నేను దండకారణ్యాలకు వెడుతున్నాను.  కందమూలఫలాలు తింటూ మునిలాగా పద్నాలుగేళ్ళు వనవాసం చేస్తాను. మహారాజు భరతుడికి యౌవరాజ్యం అప్పగిస్తున్నాడు. నన్ను అడవులకు పంపుతున్నాడు


మాటలు వింటూనే మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది కౌసల్య. రాముడు గట్టిగా పట్టుకుని కూర్చోబెట్టాడు 


నువ్వు అసలు పుట్టకుండా ఉంటే ఈ శోకం నాకు ఉండేది కాదు. గొడ్రాలికి ఒకటే దు:ఖం-పిల్లలు లేరే అని. కానీ ఈ దు:ఖం నేను భరించలేనురా తండ్రీ ! మీ తండ్రిగారి ఏలుబడిలో ఒక సుఖంకానీ ఒక శుభంకానీ నేను పొంది ఎరుగను

కనీసం నీ పరిపాలనలోనైనా అవి రుచి చూద్దాం అనుకున్నాను. అలాగే బతికున్నాను.....


తండ్రీ! చంద్రబింబంలాంటి నీ ముఖం చూడకుండా నేనెలా ఉండగలనురా! ఇంతకాలమూ చేసిన తపస్సులూ వ్రతాలూ

ఉపవాసాలూ ఇలా ఫలించాయా ! నీకు దుర్గతినీ నాకు దుఃఖాన్ని పెంపొందించాయా ! అయ్యా ! నా గుండె నిజంగా బండరాయిరా! లేకపోతే ఈ పాటికి ముక్కలు ముక్కలుగా పగిలిపోదా! నాకు మరణం లేదనుకుంటా! యమలోకంలో నాకు చోటు లేదనుకుంటా


నిన్ను నేను అడవులకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వను.

నన్ను విడిచి వెళితే నేను ప్రయోపవేశం చేస్తాను.


ఇలా మాట్లాడుతున్న కౌసల్యను ఓదారుస్తూ రామచంద్రుడు....


అమ్మా! క్షమించు. పితృవాక్యాన్ని అతిక్రమించే శక్తి నాకు లేదు. శిరసు వంచి మొక్కుతున్నాను. ప్రార్ధిస్తున్నాను. ఆశీర్వదించి నన్ను అడవులకు పంపు.


పితృవాక్య పరిపాలన మన వంశానికి గొప్ప భూషణం, సగరులు తండ్రిమాట మీద సాగరం త్రవ్వి మహర్షి కోపాగ్నికి మసి అయిపోయారు. పరశురాముడు తండ్రిమాటమీద తల్లి శిరసునే ఖండించాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవి నాకు ఆదర్శం. తండ్రిమాటను ఆచరించి తీరతాను. తండ్రిమాట విన్నవాడు ఎవడూ చెడిపోలేదు.


అక్కడే ఉన్న లక్ష్మణుడు సైతం తండ్రి నిర్ణయం పై కోపావేశాలతో.....


కైకేయీ ప్రోత్సాహంతో అన్యాయం అప్రియం చేసిన దశరథుడు తండ్రి అయినా

సరే మనకు శత్రువు. అతడిని వధిద్దాం లేదా బంధిద్దాం. ధర్మాధర్మాలూ కార్యాకార్యాలూ వదిలేసి అహంకరిస్తే చెడుదారిపడితే గురువునైనాసరే శిక్షించవచ్చు ఈ దశరథుడు ఏ బలంచూసుకుని నీ రాజ్యాన్ని కైకేయి కి ధారపోద్దామనుకుంటున్నాడు? నీతో నాతో శత్రుత్వం పెట్టుకుని

భరతుడికి ఈ రాజ్యాన్ని కట్టబెట్టే శక్తి దశరథుడికి ఎక్కడినుంచి వచ్చింది


అమ్మా! నేను రాముని మనిషిని. నా ధనుస్సుమీద ఒట్టు. ఈ రాముడు అగ్నిలో దూకినా అడవులకు వెళ్లినా నేను సూర్యుడు చీకట్లను తొలగించినట్టు నా బాహుబలంతో నీ దుఃఖాన్ని తొలగిస్తాను. నా శక్తి ఏమిటో చూద్దురుగాని -ముందుంటాను. అవును అంటూ ఆవేశపడ్డాడు. 


లక్ష్మణుడు ఇలా ఆవేశపడిపోతూంటే రాముడు శాంతంగా అంతా విని తమ్ముణ్ని దగ్గరకు తీసుకొని శాంతించమని గట్టిగా వారించాడు. తన నిర్ణయంలో మార్పు లేదన్నాడు.

[06/04, 8:09 pm] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 25


కౌసల్య రామునితో ఇలా అంటోంది....


నాయనా! నీ నిశ్చయాన్ని మార్చలేను. నిన్ను ఆపలేను. సమయం దాటిపోయింది. వెళ్ళిరా! భద్రమస్తు. జాగ్రత్త సుమా ! నువ్వు క్షేమంగా తిరిగివచ్చాకనే నా దుఃఖం ఉపశమించేది - అంటూనే కౌసల్య జలం స్పృశించి శుచిగా రాముణ్ని ఆశీర్వదించింది


తండ్రీ! నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఇంతకాలం ఏ దేవతలకు నమస్కరించావో వారంతా రక్షిస్తారు. చరాచరజీవజాలమూ పంచభూతాలూ అష్టదిక్పాలకులూ సమస్తదేవతలూ నిన్ను కాపాడతారు. పిశాచ రాక్షస క్రూర మృగాది బాధలు నీకు లేకుండుగాక నవగ్రహాలూ నిన్ను రక్షించుగాక.


*యన్మంగళం సహస్రాక్షే సర్వదేవనమస్కృతే* | *వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళమ్.*


*యన్మంగళం సుపర్ణస్య వినతాకల్పయ త్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళమ్.*


*అమృతోత్పాదనే దైత్యాన్

 ఘ్నతో వజ్రధరస్య యత్ అదితి ర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళమ్ ||*


*త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్నో రమితతేజసః |* 

*యదాసీ న్మంగళం రామ తత్తే భవతు మంగళమ్*


*ఋతవ స్సగరా ద్వీపా వేదా లోకా దిశ్చ తే |* 

*మంగళాని మహాబాహో దిశస్తుతవ సర్వదా ||*


ఓ మహావీరుడా ! వృత్రాసుర సంహారవేళ దేవేంద్రునికి కలిగిన జయం నీకు లభించుగాక! 


అమృతం కోసం వెడుతున్న గరుత్మంతునికి వినతాదేవి ఇచ్చిన ఆశీస్సులు నీకు ఫలించుగాక!


 అమృతోత్సాదన సమయంలోనూ రాక్షస సంహారవేళలోనూ దేవేంద్రునికి అదితి ఇచ్చిన శుభమంగళం నీకు ఫలించుగాక! 


ముల్లోకాలనూ ఆక్రమించబోతున్నవేళ వామనమూర్తికి లభించిన శుభం నీకు జరుగుగాక! 


ఆరు ఋతువులూ, సప్తసా గరాలూ, నవద్వీపాలూ, చతుర్వేదాలూ, చతుర్దశలో కాలూ, దశదిశలూ నీకు శుభమంగళాలను సర్వదా సర్వధా అనుగ్రహించుగాక.


రాముడు కౌసల్యకు ప్రదక్షిణం చేసాడు. పాదాభివందనం చేసాడు. ఎట్టకేలకు బయలుదేరి సీతా మందిరం చేరుకున్నాడు.


[1.కౌసల్యకుమారుడు అరణ్యమునకు వెళ్ళునప్పుడు చేసిన ఈ మంగళా శాసనమును ప్రయాణములలో పిల్లలకు తల్లులు చేయుచుండుట ఆచారము .దేవాలయములలో దేవుడు ఊరేగింపు బయలు దేరునప్పుడు, బయలు దేరుముందు ఈ శ్లోకములను చదువుట ఆచారము.


2.ఇటీవల రాముని విషయం గా అపచారం జరిగితే పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామి వారు కౌసల్య భావనను పొంది ఈ శ్లోకాలు ఆ స్థానం లోనే ఉండి కొన్ని రోజుల పాటు పారాయణం చేయడం జరిగింది.]


**


రాముడు సీతా భవనం చేరాడు.


శ్రీరాముడు సీతాదేవి అంతఃపురంలో తనకు స్వాగతం కొరకు ఏర్పడ్డ ఆడంబరాలు చూచి - అవనత శిరస్సుతో వెళ్లసాగాడు.


సీతాదేవి ఇంగిత జ్ఞారాలు. ఎవ్వరు చెప్పకుండానే ఇతరుల మనస్సులను చదువగలిగేది. తన మనస్సులోని దుఃఖావేశాన్ని అదిమి పట్టడానికి శ్రీరాముడు చేసిన ప్రయత్నాన్ని ఆయన ముఖంపై స్వేదాన్ని (చెమటను) పసిగట్టింది.


ఆమె ఆందోళనతో రాముని వెంట రాజలక్షణాలు లేక పోవటం గురించి ప్రశ్నించింది. శ్రీరాముడు తన వన ప్రస్థానాన్ని గురించి తెలిపాడు. సీతాదేవిని అయోధ్యలోనే వుండుమని, కాబోయే మహారాజైన భరతునికి అప్రియమును ఆచరింపవద్దని తెలిపాడు.


శ్రీరామునికి - రాజ్యాధికారము తొలగి వనవాసము కలిగిందనే మాటకంటే - తనను రాముడు వదిలి వెళ్తున్నాడనే మాట విని ఉలికి పడింది సీత. ఆమె తన భర్తతో 'ఆర్యపుత్రా! తల్లి తండ్రులు, సోదరులు, పుత్రులు, కోడలు, మిగిలిన బంధువులందరు తమతమ పుణ్యపాపముల మూలంగా భాగ్యాన్ని అనుభవిస్తారు. కాని భార్య ఒక్కతే భర్త యొక్క భాగ్యంలో (సుఖదుఃఖాలలో) పాలుపంచుకుంటుంది.

*భర్తుర్భాగ్యంతుభార్యైకా - ప్రాప్నోతి పురుషర్షభ*


స్త్రీలకు పతి ఒక్కడే కదా గతి 'నారీణాంపతిరేకో గతిస్సదా' అందువలననే నేనుకూడా మీతో పాటు వనవాసంలో పాలుపంచుకుంటాను. అంతేకాదు కఠినమైన కాంతారములో మీకంటే ముందుగా నడిచి -సుకుమారములైన మీపాదరవిందములకు శ్రమకలుగకుండా వుండటానికి క్రూరములైన దర్భలను ముళ్లను ఏరిపారేస్తాను.

*అగ్రతస్తే గమిష్యామి-మృద్నంతీ కుశకంటకాన్.*


 'ఆర్యపుత్రా ! అందరివలె మీరు సామాన్యులుకారు. మీ సామర్థ్యము నాకు పూర్తిగా తెలుసు. మీ అద్భుత, అపురూప స్వరూపాన్ని చూడగానే క్రూర మృగాలు కూడా భయంతో పారిపోతాయి.సురాసురులు కూడా మీ ముందు నిలువ జాలరు. నా బాల్యంలో బ్రాహ్మణోత్తములు, నా జాతకాన్ని పరిశీలించి నాకు వనవాసయోగమున్నదని సూచించారు. 


మీ వెంట ఆ అరణ్యాలలో తిరుగడం ఎంతో హాయినిస్తుంది

అంతేకాదు భర్తకు ధారాదత్తము చేయబడిన భార్య జీవించినా మరణించినా - ఆయనకే భార్యగా ఉంటుందని శాస్త్రములు ఉదోషిస్తున్నాయి. ఇంతకు ముందు కూడ గంగా తీర వన భూములలో విహరించాలనే నా మనోభీష్టాన్ని మీకు తెలిపాను. మీరు తోడులేని నాడు నాకు మరణమే శరణ్యము' అని తన పట్టుదలను మరొక సారి తెలియజేస్తూ దుఃఖింప సాగింది.


[1.అగ్రతస్తే గమిష్యామి- మృద్నంతీ కుశకంటకాన్.

ఇక్కడ పెద్దలు మరొక విశేషార్థాన్ని సెలవిస్తారు.

 'కుశకంటకము' లంటే సామాన్యంగా దర్బలు ముళ్ళని అర్ధము. కాని విశేషార్థములో 'కుశకంటకా!' అంటే భూజనుల సుఖాలకు ఆటంకాలను కలిగించే రాక్షసులని అర్థము. 'శ్రీరామభద్రా! నీకంటే ముందే నేను లంకలో ప్రవేశించి రావణ కుంభకర్ణాదులను నీబాణములకు లక్ష్యమయ్యేట్టు రంగాన్ని సిద్ధము చేస్తాను' అని సూచిస్తుంది ఆలోక జనని.


2. 'అహంగమిష్యామి- వనంసుదుర్గమమ్ మృగాయుతం' - 'వానరవారణైర్యుతం

వనే నివత్స్యామి - యదాపితుర్భ హే

తవైవ పాదావుప గృహ్యసంయతావనం'


 'మృగాయుతం- వానరవారణైర్యుతం' ఈ వాక్యానికి సామాన్యంగా 'అనేక మృగాలతో, కోతులలో, ఏనుగులతో కూడకొన్న అడవి అని అర్థము

కాని వాల్మీకి కవీంద్రుడు 'అయుతం' 'యుతం' అనే పదాలు చిత్రంగా ప్రయోగించాడు. ' మృగాయుతం' ఒకలేడిచే వేరుచేయబడి తిరిగి మహాగజముల వంటి వానరులతో కలుప బడుతావను. 'వానరవారణైర్యుతం' అని భవిష్యత్తును సూచిస్తుంది సీతాదేవి వాక్కు. ధ్వని ప్రధానమైనది కదా ఉత్తమ కావ్యము.]

[06/04, 8:09 pm] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 26


రాముని వెంట అరణ్యాలకు నేను వస్తాను అని తన నిర్ణయాన్ని సీత తెలిపినా రాముడు అంగీకరించక పోవడం తో ఇంకా ఇలా సంభాషిస్తోంది.......


 ' అయ్యో! రామా! నిన్ను ధనుర్భంగము సమయంలో చూచి మా తండ్రి మిధిలా ధిపతి ఏమని (ఎంత వీరుడవని) అనుకొన్నాడో - కాని పురుష వేషంతో ఉన్న స్త్రీ  అని గుర్తించాడో లేదో' అని పరిహసించింది.


ప్రణయాచ్ఛాభిమానాచ్చ - పరిచిక్షేప రాఘవం

“ *కింత్వామన్యత వైదేహః - పితామే* *మిధిలాధిపః రామ! జామాతరం ప్రాప్య* - *స్త్రీయం పురుష విగ్రహం* .


అంతే కాదు 'ఆర్యపుత్రా! ఎన్ని తప్పులు చేసి అయినా తన భార్యను పోషించడం భర్త భాధ్యత' అని మనువు కూడా ఉపదేశించాడు కదా


సత్యవంతుని సావిత్రి అనుసరించినట్లు నేను మిమ్మల్ని అనుసరిస్తాను. నాటకంలో కూడా తన భార్యను మరొక నటునికి భార్యగా నటించడానికి సాధారణ పురుషుడు అంగీకరించినట్లు మీరు నన్ను మరొకరికి సేవ చేయడానికి నియమింపవద్దు. రామచంద్రా మీ సహవాసమే నాకు స్వర్గము - అది అయోధ్యలోనైనా అరణ్యంలోనైనా ఒకటే - మీరు తోడుగా లేకుంటే నాకు స్వర్గమైనా నరకమే.


*య'స్వయా సహ సస్స్వర్గో*

*నిరయో య స్వయా వినా.....*


సీతాదేవి ధృఢ భక్తి శ్రీరాముని హృదయాన్ని కదిలించింది. ఆమె దుఃఖము ఆయన మనస్సును ద్రవింపజేసింది. అప్పుడు ఆమెకు తన హృదయాన్ని

ఆవిష్కరింపక తప్పలేదు .


ఆయనకు

సీతా! నీవు దుఃఖిస్తే నాకు స్వర్గమైనా అక్కర లేదు. నీ సంతోషమే నా స్వర్గము' అని ఆమెను ఓదార్చాడు.


*న దేవి! తవదుఃఖేన - స్వర్గమప్య భిరోచతే* .


శ్రీరాముడు సీతాదేవిని అనునయిస్తూ - గాఢాలింగనం చేసికొని 'సీతా సువర్చల సూర్యుని అనుసరించినట్లు నీవు నన్ను అనుసరించి రావచ్చును. సర్వ జగత్కర్త అయిన స్వామికి ఏ సత్వము వలన భయములేనట్లే నాకు కూడ ఎవ్వరివలన ఎన్నడు భయము లేదు.' అని ఓదార్చి ఆమెకు ఇష్టము వచ్చినట్లు - కావలసినన్ని వస్తువులను దానము చేసి తనతో బయలు దేరుమని' తెలిపాడు.


శ్రీరాముని ధర్మపాలనాన్ని - సీతాదేవి అనురాగంతో అనుసరించింది.


[నిజంగా సీతారాముల దాంపత్యమే దాంపత్యము. నరులలోనే కాదు సురులలో కూడ అటువంటి అనన్య దాంపత్యము లేదు. వారిద్దరిది ఒకే మాట - తనువులు కలిసి ఉన్నా - వేరుగా ఉన్నా వారి మనస్సులొకటే - వారి మాట ఒక్కటే.


రామునితో కలిసి ఉండడమే సీతాదేవికి స్వర్గము వేరుగా ఉండడమే నరకము

సీతాదేవి శోకిస్తే రామునికి స్వర్గమైనా రుచించదు'

వారిమాటలు వేరైనా వారి భావమొక్కటే ఎంతటి ఆదర్శ దంపతులు సీతారామచంద్రులు! లోకంలో ఏ దంపతులైనా కోరుకొనేది అటువంటి సాన్నిహిత్యమే కదా.]

**


లక్ష్మణుడు కూడ శ్రీరాముని వెంటనే సీతా భవనానికి చేరి - భవనము బయటే ఉండి సీతారామ సంభాషణము అంతా విని, అదే తనకు కూడ మంచి అదను అని భావించాడు. ' రాముడు తనసతి అయిన సీతను తన వెంట రావడానికి సమ్మతించాడు కదా! నీడవలె అన్ని వేళలలో తోడయిన తనను రానివ్వడా?” అని ఆశ పడ్డాడు. తాను ఒంటరిగా అడిగితే రావద్దంటాడేమో? అందువలన సీతాదేవి సన్నిధిలో ఉన్నప్పుడే శరణు వేడడం మంచిదనుకొన్నాడు.


తన అన్న శ్రీ పాదముల నాశ్రయించాడు లక్ష్మణుడు. ఆశ్రయించడమంటే మామూలుగా ఆశ్రయించడము కాదు. గాఢంగా ఆశ్రయించాడు. సీతాదేవి వైపు చూస్తూ ఆశ్రిత రక్షాదీక్షుడైన శ్రీరాముని శరణువేడాడు. అలా సీతా సమక్షంలో శ్రీరాముని ఆశ్రయించి లక్ష్మణుడు మహాకీర్తి మంతుడయ్యాడు ఆశ్రయించే వారందరికి ఆదర్శమయ్యాడు.


*సభ్రాతుశ్చరణౌగాఢం నిపీడ్యరఘునందనః*

*సీతామువాచాతియశాః రాఘవంచ మహా వ్రతం'*


*కురుష్వ  మామనుచరం! వైధర్మ్యం* *నేహవిద్యతే కృతార్థోఽ హంభవిష్యామి!* *తవచార్ధః ప్రకల్ప్యతే*


శ్రీరాముని శ్రీపాదములను ఆశ్రయించి - తన ప్రార్థనను లక్ష్మణుడు వినిపిస్తున్నాడు


అన్నా! నీవు నన్ను నీతో వెంట తీసుకవెళ్తే నేను కృతార్థుడనవుతాను. 

నీ ప్రయోజనము కూడ నెరవేరుతుంది.


ఇక లక్ష్మణుడు తాను చేయబోయే సేవలను మనవి చేసికోంటున్నాడు.


*భవాంస్తు సహవైదేహ్యా! గిరిసానుషు రంస్యతే*

*అహం సర్వం కరిష్యామి! జాగ్రతః స్వపతశ్చతే*


అన్నా! నీవు సీతాదేవితో కూడ పర్వత లోయలలో ఆనందంగా విహరించు నేను మీరు పడుకొన్నా - తెలివితో ఉన్నా అన్ని విధాల కైంకర్యములు చేస్తాను అయోధ్యలో లభించని సేవలన్ని అడవిలో చేస్తాను.


శ్రీరాముడు మొదట లక్ష్మణుని అయోధ్యలోనే ఉండీ మాతాపితరులకు జాగ్రత్తగా శుశ్రూష చేస్తుండుమని ఆదేశించాడు. అయితే మళ్లీ మళ్లీ ప్రార్థించినందు వలన తమ వెంట ఆయన రావడానికి అనుమతించాడు.


[లక్ష్మణుడు కైంకర్య లక్ష్మీ సంపన్నుడు. ఎన్నికైంకర్యములు చేసినా తృప్తి పొందే వాడు కాదు.


లక్ష్మణుడు ఆదిశేషాంశ సంభవుడు. ఆదిశేషుడు శేషులు (జీవాత్మలు) అందరిలో మొదటి వాడు - శ్రీమన్నారాయణునికి సకల విధ సేవలను చేసేవాడు. ఉండడానికి ఇల్లుగా, పడుకోడానికి పడుక గా, కూచోవడానికి ఆసనంగా, నడిచేప్పుడు పాదుకలుగా ధరించడానికి పై కండువా గా, దిండుగా, వర్షాతపాల నుండి కాపాడే గొడుగుగా తన శరీరాన్ని మలిచి - పరమాత్మకు సకల విధ సేవలను చేసేవాడు.


లక్ష్మణుని ప్రార్ధన - మనందరికి వర్తిస్తుంది. మనము అందరము కూడ అన్ని వేళలలో అన్ని విధాలుగా పరమాత్మకు సేవ చేయాల్సిన వాళ్లమే.]


*శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలతో*🍂🥀

[06/04, 8:10 pm] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 27


రాముడు లక్ష్మణుడు సీత కలసి వస్తు  వాహన భూషణాది దానాలతో సంతృప్తి పరచి దశరథుణ్ణి దర్శించడానికి వెళ్లారు.....


రాజలాంఛనాలు అన్నీ విడిచిపెట్టి కాలినడకన వెడుతున్న రాకుమారులనూ కోడలినీ చూసి ప్రజలు మౌనంగా రోదించారు. రామయ్య పట్టుదలనూ ధర్మగౌరవాన్నీ పితృవాక్యపరిపాలననూ ప్రశంసించారు. పంచభూతాలుగానీ ఆకాశ సంచారులుగానీ చూడటానికి ఇంతకాలమూ వీలుకాని సీతాదేవిని ఇప్పుడు ప్రజలంతా చూస్తున్నారు. ఈమెకూడా బయలుదేరుతోంది కనుక దశరథుడు రాముణ్ని అడవులకు వెళ్ళనివ్వడులే అనుకుంటున్నారు.


 నిర్గుణుడైనప్పటికీ కన్నకొడుకును ఏ తండ్రీ వదులుకోడు అటువంటిది సద్గుణ సంపన్నుడైన రాముణ్ని దశరథుడు అడవులపాలు చేస్తాడా ! చెయ్యడు అని ఆశిస్తున్నారు. అలా కానిపక్షంలో మనమంతా లక్ష్మణుడిలాగా వెంట బయలుదేరదాం అని ఒక నిశ్చయానికి వచ్చేసారు. మన సుఖదుఃఖాలు రామునితోటివే అనుకున్నారు. నిర్మానుష్యమైన నగరాన్నీ, ఎలకలకూ పందికొక్కులకూ నిలయమైన పంటపొలాలనూ కైకేయి ఏలుకుంటుందిలే అన్నారు. రాముడు ఏ వనంలో ఉంటే అదే మన నగరం. అక్కడే సుఖంగా నివసిద్దాం ఇటువంటి మాటలు దారిపొడుగునా రాముని చెవికి సోకుతున్నాయి. కానీ అతడి మనస్సు చలించలేదు. తండ్రి మందిరానికి చేరారు.


చల్లారి బూడిదకప్పిన నిప్పులాగా, ఎండిపోయిన చెరువులాగా ఉన్న దశరథుడికి సుమంత్రుడు విషయమంతా విన్నవించాడు. ప్రయాణానికి సన్నద్ధుడైవచ్చి నీ దర్శనం కోరుతున్నాడని మెల్లగా మనవిచేసాడు.


అంజలి బంధంతో ప్రవేశిస్తున్న రాముణ్ని అల్లంతదూరంలో చూసి దశరథుడు దు:ఖం పట్టలేక మూర్ఛపోయాడు. క్రిందపడ్డాడు. అంతఃపురకాంతలంతా విలపించారు. గబగబా వెళ్ళి రామలక్ష్మణులు దశరథుణ్ని గుచ్చి ఎత్తి సీతాదేవి సహాయంతో మళ్ళీ

పీఠం మీద కూర్చోబెట్టారు. దశరథుడు తేరుకున్నాడు. తెలివి వచ్చింది మహారాజా! అనుమతించు. దండకారణ్యానికి బయలుదేరుతున్నాం. ఆశీర్వదించు. లక్ష్మణుడు నాతో వస్తున్నాడు సీతకూడా వస్తోంది. ఎంతగా వారించినా వీరు వినడం లేదు. దయచేసి అంగీకరించు.


నాయనా! నీకు శ్రేయస్సు కలుగుగాక. వృద్ధి కలుగుగాక. నీ మార్గాలు శుభప్రదమగుగాక! భయ రహితాలు అగుగాక పునరాగమనం కోసం క్షేమంగా వెళ్ళిరా. సత్యం కోసం ధర్మంకోసం పట్టుదలతో వెడుతున్న నిన్ను వారించలేకపోతున్నాను. అయితే

ఇప్పుడే వెళ్ళకు. ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉండు. కనీసం మరొక్కపూట అయినా నీతో గడిపిన ఆనందం నాకు మిగుల్చు. ఈరాత్రి ఇక్కడే గడిపి నన్నూ కౌసల్యనూ ఆనందింపజెయ్యి. రేపు తప్పకుండా వెడుదువుగాని. నీ కోరికలు అన్నీ తీర్చి పంపుతాను తండ్రీ! నాకు తీరవలసిన కోరికలు ఏమున్నాయి? ఉంటే, రేపు తీర్చేదెవరు? అన్నింటికీ మించి నాకున్నది ఒకే ఒక్క

కోరిక ఇక్కడినుంచి వెళ్ళిపోవడమే.


ఈ మాటలు వింటూనే దశరథుడు మూర్చపోయాడు. అంతఃపుర కాంతలందరూ దారుణంగా విలపించారు.

**

దశరథ మందిరం లో రాముడు సీత లక్ష్మణుడు కైకేయి సుమంత్రుడు మధ్య ఉద్విగ్న వాతావరణం లో .....


సుమంత్రుడు మాట్లాడున్నాడు,

దేవీ ! కైకేయీ ! ఇంతకంటే అకార్యం ఏదీ ఉండదు. నువ్వు పతిఘ్నవి ( భర్తను చంపిన స్త్రీవి). చిట్టచివరికి కులఘ్నివికూడా అవుతున్నావు. సరే నీ కొడుకే రాజు అవుతాడులే. ఈ భూమిని పరిపాలిస్తాడులే. మేమంతా రామునితో వెళ్ళిపోతాం. నీ రాజ్యంలో

బుద్ధిమంతుడు ఎవడూ ఉండడు. 


అటువంటి అమర్యాదను నువ్వు చేస్తున్నావు. అయినా భూమి ఇప్పటికీ మామిడిచెట్టును నరికేసి, వేపచెట్టును నాటి పాలుపోసి పెంచితేమాత్రం అది తీపి ఎక్కుతుందా? 


అయితే సుమంత్రా! చతుర్విధ సైన్యాలతో మన మహాబలాన్నీ అనంతరత్నరాశులతో మన కోశాగారాన్నీ రామునివెంట పంపించు. ఇంకా ఎవరెవరు రామునితో వెళ్ళాలి అనుకుంటారో వారినందరినీ పుష్కలంగా సత్కరించి పంపించు ఆయుధాగారాలను శకటాలపై తరలించు. నా రాముడు నిర్జనవనంలో ఎలా గడుపుతాడు. అంచేత ధనకోశాలూ ధాన్యకోశాలూ పూర్తిగా ఇచ్చి పంపించు. యజ్ఞయాగాలు చేస్తూ బషులతో కాలం గడుపుతాడు. మహావీరుడు భరతుడు వచ్చి అయోధ్యను పాలిస్తాడు.


దశరథుడు ఇలా ఆజ్ఞాపిస్తూంటే కైకేయికి భయం వేసింది. నోరు ఎండిపోయింది. స్వరం మూగపోయింది. తెముల్చుకుని ఖండితంగా పలికింది


సజ్జనుడా ! (సాధో) ప్రజలు లేని రాజ్యం ఖాళీ అయిన కల్లుకుండలాంటిది. నిస్సారమయిన మద్యంలాంటిది ఓ భోగాలులేని శూన్యరాజ్యాన్ని భరతుడు స్వీకరించడు.


కైకేయి మౌనం వహించింది. దశరథుడు మళ్ళీ అభ్యర్థించాడు. 


రాముడు కల్పించుకొని,

మహారాజా! భోగాలు విడిచిపెట్టి, నిస్సంగుణ్ని అయ్యి, వనాల్లో జీవించాలి అనుకుంటున్న నాకు సైన్యాలెందుకు కోశాలెందుకు? ఏనుగునే వదులుకున్నవాడికి గొలుసుమీద (రజ్జువు) వ్యామోహమా ! వద్దు. 


నారచీరలు ఇప్పించండి. ఒక తవ్వుగోల ఒక పాఱ అనుమతించండి చాలు. కందమూలాలు తవ్వుకోడానికి ఉపకరిస్తాయి


కైకేయి స్వయంగా నారచీరలు తెచ్చి ఇచ్చింది. ధరించండి అంటూ రామునికి అందించింది. ఏమాత్రమూ ఆమె సిగ్గుపడలేదు. సన్నచీరలు విడిచిపెట్టి రామలక్ష్మణులు ఆ నారచీరలు కట్టుకున్నారు


తనకు ఇచ్చిన నారచీరలను చూసి సీతాదేవి భయపడింది. వలను చూసిన లేడిపిల్లలా భయపడింది. ఎలా ధరించాలో తెలియక సిగ్గుపడింది. కళ్ళల్లో నీళ్ళు నింపుకుంది. రామునివైపుచూస్తూ మునులూ మునిపత్నులూ నారచీరలు ఎలా కట్టుకుంటారో అంది. ఒకచీరను మెడమీద వేసుకుని మరోచీరను చేత్తో పట్టుకుని అలా సిగ్గుపడుతూ నిలబడింది. రాముడే దగ్గరికి వచ్చి స్వయంగా నారచీర కట్టాడు. 


దృశ్యాన్ని చూసి అంతఃపురస్త్రీ లంతా వలవలా విలపించారు. నాయనా ! సీతకూడా అరణ్యాలకు వెళ్ళాలని కైకేయి ఆ ఆజ్ఞాపించలేదు కదా ! మీ అన్నదమ్ములిద్దరూ వెళ్ళిరండి. ఈ సీత అడవుల్లో నివసించలేనిదయ్యా ! మా అభ్యర్ధన మన్నించు. 


సీత ఇక్కడే ఉంటుంది. నువ్వు ధర్మస్వరూపుడవు. కాబట్టి ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే నువ్వు ఒక్కడివీ వెళ్ళు.


ఈ అభ్యర్ధనలువింటూ ఏమీ మాట్లాడకుండా రాముడు సీతకు చీర కట్టాడు. అప్పుడు వసిష్ఠుడు కల్పించుకునికైకేయితో ఇలా అన్నాడు.

[06/04, 8:10 pm] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 28


రాముడు లక్ష్మణుడు సీతా దేవి నారచీరలు ధరించారు.

అప్పుడు అక్కడే ఉన్న వశిష్ఠుడు కల్పించుకొని...


కులపాంసనీ! ఓ దుశ్శీలా! 

ఓ దుర్బుద్దీ! రాజును వంచించావు. నీకొక హద్దూపద్దూ లేకుండా పోయింది. సీతాదేవి ఓ అడవులకు వెళ్ళవలసిన అవసరం లేదు. వెళ్ళదు. రామునికి బదులుగా సింహాసనం అధిష్ఠిస్తుంది. గృహస్థులకెవరికైనా భార్యయే ఆత్మ. ఈ రాముని ఆత్మ అయోధ్యా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది.


అలాకాక సీతా దేవి రామునితో అడవులకు వెళ్ళిపోతే మేమూ వెళ్ళిపోతాం. ఈ పట్టణమంతా వెళ్ళిపోతుంది. దండనాయకులూ దాసదాసీజనం అందరూ వెళ్ళిపోతారు.


మరొక్కమాట - భరతుడూ శత్రుఘ్నుడూ కూడా నారచీరలు ధరించి అడవిలో అన్నను వెతుక్కుంటూ వెళ్లిపోతారు నువ్వు ఏకాకిగా ఒక్కదానివీ ఈ శూన్యసామ్రాజ్యాన్ని ఏలుకుందువుగాని. రాముడు ఏలనిది రాజ్యంకాదు. అది అడవి. రాముడు ఉన్నది అడవికాదు అదే రాజ్యం. ఆ భరతుడు నీకూ ఈ రాజుకే పుట్టి ఉంటే తండ్రి ఇవ్వని సామ్రాజ్యాన్ని అతడు స్వీకరించడు ఏలుకోడు. అర్హుణ్ణి అనడు. నువ్వు ఈ నేలమీదనుంచి ఆకాశానికి ఎగిరినా సరే. పితృవంశచరిత్ర తెలిసిన ఆ భరతుడు మరోలా చెయ్యడు. పుత్రస్నేహంతో భరతుడికి అప్రియం చేస్తున్నావు. రాముణ్ని అనుసరించి వెళ్ళని మనిషే ఉండడు ఈ లోకంలో, 


ఈరోజే చూస్తావు. పశుపక్ష్యాదులేకాదు చెట్లూ చేమలూ కూడా రామునితోపాటు కదిలి వెళ్ళిపోతాయి అంచేత ఓ దేవీ! నామాట విను. ఉత్తమాభరణాలు ఇచ్చి కోడలిని గౌరవించు. నీ కోరికల్లో ఇది లేదు కదా ! వారించు


నారచీరలు తీసేసుకో. వాటికి ఈ తల్లి అర్హురాలు కాదు

వసిషుడు ఎంతగాచెప్పినా వినిపించుకోలేదు.


దశరథుడు నాకు చావైనా రలేదే అంటూ ఒక్క సారి రామా అని మూర్ఛపోయాడు.కొంతసేపటికి సుమంత్రుణ్ణి పిలిపించాడు.సీత దేవికి పదునాలుగేళ్ళు కూ సరిపడ సీతాదేవికి వస్త్రాలు ఆభరణాలు తెమ్మన్నాడు.


అడవులకు ప్రయాణానికి సిద్ధమైన సీతను చూసి కౌసల్య ఎన్నో మంచి మాటలు చెబుతుంది.


భార్యలు తమ భర్తలను సుఖాలలో అనుసరిస్తారు. దుఃఖాలలో వదిలేస్తారు అనే లోకప్రవాదాన్ని నువ్వు అసత్యం చేస్తున్నావు. 


కానీ కొందరు స్త్రీల స్వభావం ఎలా ఉంటుందంటే సుఖాలు ఎన్నయినా హాయిగా అనుభవిస్తారు. చిన్న ఆపద వచ్చిందంటే చాలు భర్తను తిట్టిపోస్తారు. వదిలేస్తారు కూడా. 


అసత్యశీలలు, వికృతస్వభావలు, ఆంతర్యం అంతుపట్టదు పాపసంకల్పలు, క్షణంలో విరాగిణులు అయిపోతారు. కులంకానీ, విద్యకానీ, ఇచ్చిందికానీ, చేసిందికానీ ఏదీ జ్ఞాపకం ఉండదు నిమిషంలో అన్నీ మర్చిపోతారు. అనిత్యహృదయలు. కానీ నువ్వుమాత్రం పతివ్రతవు. పతివ్రతలకు భర్త ఒక్కడే దైవం అడవులపాలయ్యాడు కదా అని నా పుత్రుణ్ని ఎప్పుడూ అవమానించకేం. నిర్దనుడో సధనుడో నీకు రాముడే దేవుడు

స్త్రీణాం పవిత్రం పరమం పతి రేకో విశిష్యతే......


సీత కూడా ఉత్తమ పతివ్రతం వలే  సమాధానం గా.....


*నాతంత్రీ వాద్యతే వీణా నాచక్రో వర్తతే రథః*

 *నాపతి స్సుఖమేధేత యా స్యాదపి శతాత్మజా*


*మితం దదాతి హి పితా మితం మాతా* *మితం సుతః అమితస్య హి దాతారం* *భర్తారం కా న పూజయేత్*


*సాఽహమేవం గతాశ్రేష్ఠా శ్రుతధర్మ పరావరా* 

*ఆర్యే కివమన్యేఽహం స్త్రీణాం భర్తా హి* *దైవతమ్.*


భర్తపట్ల ఎలా ఉండాలో నాకు తెలుసు.. వెన్నెల చంద్రుణ్ణి ఎలా విడిచిపెట్టదో నేను ధర్మాన్ని అలా అనుసరిస్తాను. తీగలు లేనిదే వీణ మ్రోగదు. చక్రాలు లేనిదే రథం నడవదు. పుత్రులు ఎంతమంది ఉన్నా భర్తలేకపోతే స్త్రీకి సుఖం లేదు. గౌరవం లేదు. కన్నతల్లిదండ్రులు ఏది ఇచ్చినా

మితంగా ఇస్తారు. పుత్రులూ అంతే. భర్త ఒక్కడే అమితంగా ఇస్తాడు. అటువంటి భర్తను పూజించని భార్య అంటూ ఆసలు ఉంటుందా!?

 ఇన్ని తెలిసీ నేను నా భర్తను - నా దైవాన్ని అవమానిస్తానా ? ! నాకు రాముడే దేవుడు .


సీతాదేవి మాటలు విని కౌసల్యాదేవి కళ్ళ వెంట కన్నీళ్ళు ప్రవహించింది. అది దుఃఖమో ! 

అనందమో తెలియని స్థితి.

**

అంతఃపురం లోని రాణులకు అందరికి నమస్కరించాడు రాముడు.ఎప్పుడూ మృదంగనాదస్వరమంగళవాద్యాలతో మారుపమ్రోగే దశరథాంతపురం ఇప్పుడు అంతపురకాంతల రోదనద్వనులతో పిక్కటిల్లింది. దుఃఖితమయ్యింది. ఆపద పాలయ్యింది.సీతారామలక్ష్మణులు దశరథుడికి ప్రదక్షిణం చేసారు. కౌసల్యకు నమస్కరించారు. లక్ష్మణుడు సుమిత్రకు పాదాభివందనం చేసాడు.ఆమె దుఃఖిస్తూనే కొడుకును లెవనెత్తి


*రామం దశరథం విద్ది మాం విద్ది* *జనకాత్మజామ్| అయోధ్యామటవీం విద్ది* *గచ్చ తాత యథాసుఖమ్* ||


నాయనా ! నువ్వు వనవాసంకోసమే జన్మించావు. రాముని రక్షణపట్ల ఏమారకు సుమా ! అతడే నీకు ఆధారం. అన్నగారికి తమ్ముడు వశంవదుడై మెలగడం ఉత్తమోత్తమ ధర్మం. వెళ్ళు తండ్రీ! వెళ్ళు, రాముణ్ని దశరథుడనుకో. సీతను నన్ననుకో. అడవిని అయోధ్య అనుకో. వెళ్ళిరా. నీకు సుఖమగుగాక! శుభమగుగాక.


సుమంత్రుడు సిద్ధంచేసి తెచ్చిన రథాన్ని సీతాదేవి ముందుగా అధిరోహించింది. పధ్నాలుగేళ్ళూ లెక్క పెట్టి ఆభరణాలూ వస్త్రాలు అందించాడు మామగారు దశరథుడు,. సీత తరవాత రామలక్ష్మణులు అధిరోహించారు. అయోధ్యాపట్టణం దారుణంగా

విలపించింది. బాలురూ వృద్ధులూ అందరూ రథాన్ని చుట్టుముట్టారు.


 పద్నాలుగేళ్ళ దాకా మళ్ళీ చూడలేం. సుమంత్రా! పగ్గాలు పట్టుకో. రథాన్ని నెమ్మదిగా పోనీ. తనివితీరా రాముడి ముఖాన్ని చూడనీ. సాధ్వి అంటే సీతాదేవియే. మహానుభావుడంటే లక్ష్మణుడే. రాముణ్ని అనుసరించి వెడుతున్నాడంటే పరంలో

ఉత్తమలోకాలకు దారులు వేసుకుంటున్నాడన్న మాట- విలవిస్తూనే ప్రశంసిస్తున్నారు ప్రజానీకం.


రాముణ్ని చూస్తాను అని దశరథుడుకూడా అంతఃపురంనుంచి బయలుదేరాడు. స్త్రీల ఆర్తనాదాలు మిన్నుముట్టాయి మగ ఏనుగు బంధింపబడితే ఆడ ఏనుగు విలపించిన నాదం వినిపించింది


సుమంత్రా ! రథాన్ని పోనీ అని రాముడంటున్నాడు. సూతా! ఆపు అని ప్రజలు అరుస్తున్నారు. రెండూ చెయ్యలేక .సుమంత్రుడు మదనపడిపోతున్నాడు.


ఏకకంఠంగా అందరూ కైకేయిని నిందిస్తున్నారు. ఆవిడది హృదయం కాదు. ఇనుప ముద్ద లేకపోతే ఈ పాటికి వగిలిపోదా! అంటున్నారు. హారామా! రామరామా! అనే పిలుపులు కోలాహలంగా వినిపిస్తున్నాయి


రాముడు వెనక్కి తిరిగి చూసాడు. కౌసల్యాదశరథులు కాలినడకన రథం వెంటపడి వస్తున్నారు. రాముడి మనస్సు విషణ్ణమయ్యింది. హృదయం కలతపడింది. ఎటువంటి మహారాజుకు ఏ గతి వచ్చింది ! అయ్యో- అనుకున్నాడు


ఆగు - ఆగు అని రాజుగారు అరుస్తున్నారు. పద-పద అని రాముడు అంటున్నాడు. సుమంత్రుడి హృదయం చక్రాల మధ్య నలిగిపోయింది.


సుమంత్రా! నువ్వు తిరిగి వచ్చాక రాజుగారు నిలదీస్తే, మీ మాట వినిపించలేదని చెబుదువుగాని. ఎవరినిగానీ చిరకాలం దు:ఖింప జెయ్యడం మహాపాపం- అన్నాడు రాముడు


సుమంత్రుడు వేగం పెంచాడు. అంతఃపురజనం కానీ దశరథ మహారాజు కానీ ప్రజానీకం కానీ ఎవ్వరూ వెనుదిరగలేదు అలాగే రథం వెంట పరుగులు తీస్తున్నారు


మహారాజా ! _తిరిగి రావాలని కోరుకుంటే వెడుతున్న వ్యక్తిని సుదూరం అనుసరించకూడదు_ - అని మంత్రులు నచ్చజెబుతున్నారు. అప్పుడు దశరథుడు ఆగిపోయాడు. రథంవైపే చూస్తూ, రాముణ్నే తిలకిస్తూ దీనుడై నిలబడిపోయాడు. కౌసల్యకూడా నిలబడిపోయింది. అంతఃపురకాంతలంతా ఆగిపోయారు.

[06/04, 8:10 pm] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 29


రామచంద్రుడు లక్ష్మణుడు సీత ముగ్గురు సుమంత్రుని రథం అధిరోహించి అరణ్యవాసం బయలుదేరారు.....


అయోధ్యలో అగ్నిహోత్రాలు చల్లారిపోయాయి. ఎవరి ఇంటిలోనూ పొయ్యి రాజుకోలేదు.  అంతలోకీ సూర్యుడు ఆస్తమించాడు. ఏనుగులు కబళం ముట్టలేదు. ఆవులు దూడల్ని కుడపలేదు. తొలికానుపుగా మగబిడ్డను

ప్రసవించిన తల్లికూడా ఆనందించలేకపోయింది.


నక్షత్రాలు కాంతిని కోల్పోయాయి. గ్రహాలు తేజస్సు పోగొట్టుకున్నాయి. . కాంతి విహీనమయ్యింది. దశదిశలా చీకట్లు కమ్ముకున్నాయి.

నగరమంతటా దిగులు వ్యాపించింది. ఆహారవిహారాలపట్ల ఎవరికీ ఏ ఉత్సాహమూ లేకపోయింది. అందరూ దీనమూర్తులై నిచ్చేష్టంగా ఉండిపోయారు. గుండెల్లో శోకం. ఉండుండి నిట్టూర్పులు. కన్నుల్లో శోకసముద్రాలు. అందరూ శోకపరాయణులే. గాలి కదలడం లేదు. చంద్రుడు వికృతంగా ఉన్నాడు. సృష్టి అంతా స్తబ్ధమైపోయింది. 


పసిపిల్లలు సైతం తల్లులను పాలు అడగడం లేదు. భర్తలు భార్యలను అడగడం లేదు. తమ్ముళ్ళు అన్నయ్యలను

అడగడం లేదు. అందరూ అన్నీ వదిలేసారు. రాముణ్నే స్మరిస్తున్నారు. కూచున్నవాళ్ళు కూచున్నట్టే పడుకున్నవాళ్ళు పడుకున్నట్టే అలా ఉండిపోయారు.


రథం లేపిన దుమ్ములో రామునిరూపం కనిపించినంతసేపూ రెప్ప వెయ్యకుండా అలాచూస్తూ నిలబడ్డాడు దశరథుడు

అదీ అదృశ్యమైపోయే సరికి హా రామా ! అని అరుస్తూ నడివీథిలో నేలమీద కుప్పకూలిపోయాడు.


ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయిన మహారాజును కౌసల్య ఒక్కతే లేవనెత్తింది. మెల్లగా వెనక్కి నడిపించుకుంటూ వెడుతోంది


నా కుమారుణ్ని తీసుకువెళ్ళిన రథచక్రాల జాడలు కనపడుతున్నాయే తప్ప నా కుమారుడు మహాత్ముడు కనపడటం లేదుకదా ! మహాసుఖాలు అనుభవించిన నా చిట్టితండ్రి ఈ రాత్రి ఏ చెట్టు క్రిందో కటికనేలమీద పడుకుంటాడు కాబోలు. కర్రో రాయో దిండుగా పెట్టుకుంటాడు కాబోలు. అనాథుడుగా తిరుగుతూన్న నా రాముణ్ని ఆటవికులంతా తిలకిస్తారు కాబోలు అడవులంటే ఏమిటో తెలియని జానకి పులులూ సింహాలూ గర్జిస్తుంటే ఎంతగా భయపడుతుందో కదా ! ఓకైకేయీ ! నీ కోరిక

తీరిందా ! నీ కళ్ళు చల్లబడ్డాయా ! రాముడు లేకుండా నేను జీవించను. విధవవై రాజ్యం ఏలుకో.


ఇలా విలపిస్తూ దశరథుడు అంతఃపురంలోకి ప్రవేశించాడు. మబ్బుల్లోకి సూర్యుడిలా ప్రవేశించాడు. గరుత్మంతుడు సర్పాలను తన్నుకుపోయాక శూన్యమై చిన్నవోయిన చెరువులా ఉంది ఆ అంతఃపురం. దశరథుడు గద్గదస్వరంతో మెల్లగా పలికాడు


శ్రీరామజనని కౌసల్యాదేవి గృహానికి వెంటనే నన్ను తీసుకువెళ్ళండి. నాకు అక్కడ తప్ప మరొకచోట మనశ్శాంతి లేదు .


*కౌసల్యాయాః గృహం శీఘ్రం రామమాతు ర్నయంతు మాం* |

*న హ్యాన్యత్రమమాశ్వాసో హృదయస్య భవిష్యతి|*

**

దశరథుడు కౌసల్య భవనం చేరినాడు...


మంచము మీద కూర్చుండినాడే గాని మతి మతిలో లేదు. 'రామా! నన్ను వీడి పోతున్నావా!” అని బిగ్గరగా విలపించినాడు. "రాముడు వనవాస ప్రతమును పూర్తిచేసి మరల అయోధ్యకు వచ్చు వరకు జీవించియుండి రాముని చూచి ఆనందింప గలిగినవారే ధన్యులు" అని తలపోసినాడు. 

 కౌసల్యా! నా చూపు రామునినే అనుసరించుచున్నది. దానిని ఇప్పటికిని మరలింప లేకున్నాను


సగము రాత్రి గడచినది. అప్పుడు దశరథుడు కౌసల్యతో 

నాకు నీవు కూడ సరిగా కనిపించుటలేదు. నన్ను నీ చేతితో స్పృశింపుము.


ఇట్టి స్థితిలోఉన్న దశరథుని చూచి కౌసల్యకు మరింత దుఃఖము వచ్చినది కౌసల్య : (దశరథునితో) ఎంతపని చేసినది కైకేయి ! రాముని అడవులపాలు చేయక భరతునికి దాస్యము చేయుమని కోరినను మేలుగా నుండియుండును. ఊరిలో బిచ్చ మెత్తుకొని భరతునికి సేవ చేయుచు నా కన్నుల యెదుట నైనను ఉండును గదా, నా రాముడు!


అయోధ్యాపురవాసులు చాలామంది రాముని రథం వెంట అలాగే పరుగులు తీస్తున్నారు. ఎవరు ఎంతగా వారించినా ఒకరూ వెనక్కి మరలడం లేదు. సస్నేహంగా చూస్తూ చివరి ప్రయత్నంగా రాముడే ఇలా అన్నాడు


అయోధ్యాపురవాసులారా! మిత్రులారా! నా పట్ల ఏ గౌరవమూ ఏ ఆదరమూ మీకు ఉన్నాయో వాటిని భరతునిపట్ల ఇంకా విశేషంగా చూపించండి. అది నన్ను మరింత ఆనందింప జేస్తుంది. భరతుడు సద్గుణ సంపన్నుడు. మీ కందరికీ ప్రియమూ పాతమూ కలిగిస్తాడు. అతడు మహావీరుడు. జ్ఞానవృద్ధుడు. మృదు స్వభావుడు. మీకు తగిన ప్రభువు. ప్రభు శాసనం నాకు తప్పదు కనక వనవాసానికి వెడుతున్నాను. దీనికి దశరథ మహారాజు బాధపడకుండా ఉండేట్టు మీరు ప్రవర్తించండి. నిజంగా నాకు ప్రియంచెయ్యాలని మీకు కోరికే ఉంటే నామాట వినండి. అలా చెయ్యండి


రాముడు ఎంత చెప్పినా ఎంతగా చెప్పినా ఆ బ్రాహ్మణులు వెనక్కి మరలలేదు. వారిలో వయస్సుచేతా జ్ఞానంచేతా ఎందరో వృద్ధులు ఉన్నారు. వణుకుతున్న శిరస్సులతో దూరంనుంచే బదులు పలికారు


రామరథాశ్వములారా! మీరు ఉత్తమజాతి హయాలు. వెనక్కి మరలండి. మాకూ మా స్వామికీ హితంచెయ్యండి ఓ అశ్వాలకు వినికిడిశక్తి ఎక్కువ అంటారు. మా యాచన వినిపించుకుని మరలండి. ధర్మాత్ముడైన రాముణ్ని మహారాజుగా మీరు

ఊరేగించాలి తప్ప అడవులకు తీసుకుపోకూడదు.


ఇలా మాట్లాడుతున్న బ్రాహ్మణులను కోసం  శ్రీరాముడు రథము దిగి కాలినడకన మెల్లగా ప్రయాణము చేసినాడు.....

వారితో మాట్లాడుతూ తమసా నదీ తీరంచేరినారు.


తమ్ముడూ ! నువ్వు నన్ను అనుసరించి వచ్చావు. సీతాదేవిని రక్షించడంలో నాకు సహాయపడాలి సుమా


తమసానదిలో నీరు త్రాగి ఈ పూటకు పొట్టనింపుకుందాం. అడవిలో ఏవేవో చాలానే దొరుకుతాయి. కానీ ఇదే నా అభిమతం.


అని లక్ష్మణుడికి చెప్పి, సుమంత్రా! గుర్రాలు భద్రం అని సారథిని హెచ్చరించాడు. లక్ష్మణ సుమంత్రులు ఒకచెట్టుమొదట ఆకులతో రామునికి పడక ఏర్పాటుచేసారు. సీతారాములు విశ్రమించారు. వెంట వచ్చిన జనమంతా తలో చెట్టూ చూసుకున్నారు బడలికతో విప్రమించారు


అల్లంతదూరాన మరొకచెట్టు మొదట కూర్చుని రాముడి గుణ గణాలను తెల్లవార్లూ లక్ష్మణుడు సుమంత్రుడికి వర్ణించి చెబుతూనే ఉన్నాడు. రాత్రి గడిచిపోయింది.

[06/04, 8:11 pm] K Sudhakar Adv Br: 🌹రామాయణానుభవం_ 30


రాముడు లక్ష్మణుడు సీత సుమంత్రుడు మరియు అయోధ్యా నగర పౌరులు తో అరణ్య వాసం మొదటి రోజు రాత్రి తమసానది తీరాన గడిచింది.


చెట్టు మొదట కూర్చుని రాముడి గుణ గణాలను తెల్లవార్లూ లక్ష్మణుడు సుమంత్రుడికి వర్ణించి చెబుతూనే ఉన్నాడు. రాత్రి గడిచిపోయింది. రాముడు మేల్కొని లక్ష్మణుణ్ని దగ్గరికి పిలిచాడు


తమ్ముడూ ! చూసావా ఈ ప్రజల్ని. మనపట్ల ఎంత అభిమానమో. ఇళ్ళూ వాకిళ్ళూ విడిచిపెట్టి ఈ అడవికి వచ్చి ఇలా కటికి నేలమీద చెట్ల కింద పడుకున్నారు. ప్రాణాలైనా విడిచిపెడతారేకానీ - మనల్ని వెనక్కి తీసుకువెళ్ళాలి అనే తమ నిశ్చయాన్ని మాత్రం వీళ్ళు విడిచిపెట్టరు. అంచేత వీళ్ళు నిద్రలేవకముందే మనం దాటుకోవాలి. ప్రజల దుఃఖాలను రాకుమారులుగా మనం తొలగించాలేతప్ప మనవల్ల ప్రజలకు దుఃఖాలు కలగనివ్వకూడదు

ఈ అభిప్రాయంతో సౌమిత్రి ఏకీభవించాడు. సుమంత్రుడు ఏకీభవించాడు. సుమంత్రుడు రథం సిద్ధంచెయ్యడం. ముగ్గురూ అధిరోహించి నిశ్శబ్దంగా తమసానదిని దాటడం త్వర త్వరగా జరిగిపోయాయి. అవతలి ఒడ్డున దిగారు.


తెల్లవారింది. పౌరులకు మెలకువ వచ్చింది. రాముడి జాడ  కనిపించలేదు. ఎంతగానో దుఃఖించారు. ( *ఆలోకమపి రామస్య న పశ్యంతి స్మ దుఃఖితాః* ). ఛీ! పాడు నిద్ర అని ఎవరికివారు నిందించుకున్నారు. భక్తుల్ని విడిచిపెట్టి రాముడసలు ఎలా వెళ్ళగలిగాడు అనుకున్నారు. రాముడు లేకపోయాక మనం బ్రతికి ఏం లాభం, అందరం ఇక్కడే మరణిద్దాం అని కూడా అనుకున్నారు. ఎండుకట్టెలు అందుబాటులో పుష్కలంగా ఉన్నాయి. చితులు పేర్చుకుందామని భావించారు. రాముడు లేని అయోధ్యలోకి అడుగుపెట్టగలమా, చూసి తట్టుకోగలమా అని బాధపడ్డారు. దూడల్ని పోగొట్టుకున్న ఆవుల్లా విలపించారు.

చేతులు సాచి గుండెలు బాదుకుంటూ బావురుమన్నారు.


ఉసూరుమంటు అయోధ్యకు చేరుకొన్నారు.నిస్తేజంగా ఉన్న పట్టణాన్ని చూడగానే దు:ఖం మరీ ఉబికి ఉబికి వచ్చింది. చంద్రుడు లేని ఆకాశంలా నీళ్ళు లేని సముద్రంలా రాముడు లేని అయోధ్య కళావిహీనంగా ఉంది. బోసిగా ఉంది. ప్రాణాలులేని శరీరాలతో ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళారు. పిల్లలూ భార్యలూ చుట్టుముడితే కళ్ళల్లో నీళ్ళు కుక్కుకుంటూ మౌనంగా నిలబడ్డారు. ఇళ్ళల్లో వంటలులేవు. అంగడుల్లో వ్యాపారాలు లేవు. తొలికానుపుగా కొడుకుపుట్టినా ఏ తల్లీ ఆనందించడంలేదు.


రాముణ్ని తీసుకురాకండా ఇంటికి తిరిగివచ్చిన తమ భర్తలను ఇల్లాళ్ళు అసహ్యించుకుంటున్నారు. రాముడు లేకపోయాక ఇళ్ళెందుకు, భర్తలెందుకు, పుత్రులెందుకు, భోగాలెందుకు, భాగ్యాలెందుకు ! ప్రపంచంలో ఒక్కడంటే ఒక్కడే సత్పురుషుడు లక్ష్మణుడు, అన్నగారితో వదినగారితో అడవులకు వెళ్ళాడు. అడవుల్లో వారు నడిచే దారులూ స్నానాలుచేసే నదులూ సంచరించే పర్వతాలూ - అవీ భాగ్యవంతాలు. అది కొండకానీ అడవి కానీ, ప్రియాతిథిలా తమను సమీపించిన రాముణ్ని అర్చించకుండా ఉండగలదా! వికసించిన పువ్వులతో నిస్వనించే భ్రమరాలతో తరువులు రాముణ్ని దర్శించి ఆనందిస్తాయి. కాలంకాని కాలంలో కూడా పుష్పించి ఫలించి ఆతిథ్యం ఇస్తాయి. చిత్రవిచిత్రమైన సెలయేరులతో కొండలు స్వాగతం పలుకుతాయి. 


 *యత్ర రామో భయం నాత్ర నాస్తి తత్ర పరాభవః* 

రాముడు ఉన్నచోట భయంలేదు. పరాభవం లేదు. ఆ మహాత్ముడి పాదాలనీడ సుఖాలకు నిలయం. నడవండి వెడదాం. మీరు రాముణ్ని సేవిద్దురుగాని, మేము సీతమ్మను సేవించుకుంటాం. అందం చందం లేని ఈ ఊళ్ళో, మనస్సులేని ఈ నగరంలో ఎవరు ఉంటారు ఎలా ఉంటారు! ఈ రాజ్యం కైకేయిదయితే ఇక అంతా అధర్మమే, అంతా అనాథమే. ఐశ్వర్యం కోసం పెద్దకొడుకును వదులుకొంది. భర్తను వదులుకొంది. ఆ కులపాంసని ఇంక ఎవరికి ఉపకారం చేస్తుంది. ఎవరిని కాపాడుతుంది! కైకేయి రాజ్యంలో సేవకుల్లా మేము జీవించదలుచుకోలేదు. పిల్లల మీద ఒట్టు. ఈ వినాశమంతా ఆవిడవల్లనే కదా వచ్చింది.


నగరంలో ఇల్లాళ్ళందరిదీ ఇదే మాట. ఇదే ధోరణి. కొడుకో సోదరుడో దూరమైనట్టు విలపించారు. రోజు గడిచింది

సూర్యుడు అస్తమించాడు. చీకటులు నగరాన్ని ముంచెత్తాయి.....


[ *యత్ర రామో భయం నాత్ర నాస్తి తత్ర పరాభవః* 

 *రాముడున్న చోట భయం ఉండదు, పరాభవం ఉండదు.* 

ఇది రామాయణం యొక్క శాసన పూర్వకమైన వాల్మీకి వాక్కు.]

**

కోసలగ్రామాలను దాటి రాముడు ప్రయాణం సాగిస్తున్నాడు. పల్లె ప్రజల సంభాషణలు వినిపిస్తున్నాయి. దశరథుణ్నీ

కైకేయినీ నిందిస్తున్నారు. సీతనూ లక్ష్మణుణ్ణీ ప్రశంసిస్తున్నారు. అన్నీ వింటూ సాగిపోతున్నాడు. వేదశ్రుతి అనే నదినిదాటి దక్షిణదిశగా (అగస్త్యుడు నివసిస్తున్న దిక్కు) ప్రయాణించారు. పవిత్రజలాలతో నిండుగా ప్రవహిస్తూ సముద్రాన్ని చేరుకుంటున్న గోమతీ నదిని దాటారు. అటుపైని మరికొంత దూరంలో స్యందికా నదిని దాటారు. ఒకప్పుడు మనువు ఇక్ష్వాకునికి బహూకరించిన ఆ ప్రాంతాన్ని రాముడు సీతాదేవికి చూపించాడు. సుమంత్రా! ఈ ప్రాంతంలో మళ్ళీ ఏనాటికి మృగయావిహారం (వేట) చేస్తానో కదా- అన్నాడు


కోసలదేశాలను దాటాక ఒక్కసారి రథం ఆపించి అయోధ్యవైపు తిరిగాడు. ఆ దిశగా నమస్కరిస్తూ నిలబడ్డాడు.రథం వెళుతోంది.

రథంవెంట పరుగుపరుగున ఈ వస్తున్న జానపదుల్ని చూసాడు. తన కుడిచెయ్యి ఎత్తి వారిని ఆగిపామ్మని సంజ్ఞచేసాడు.ఇది ఆజ్ఞగా స్వీకరించారు జానపదులు. రామునికి ప్రదక్షిణంచేసి కళ్ళు ఒత్తుకుంటూ నిలిచిపోయారు. రథం వేగంగా ముందుకు సాగింది.


శ్రీరాముని రథము గంగాతీరమున  శృంగిభేరపురమును సమీపించినది పవిత్రమైన గంగానదిని దర్శించి అందరు రథమునుండి దిగి ఒక గారచెట్టు క్రింద విశ్రమించినారు. వారు

నిలిచిన ప్రదేశము నిషాద రాజ్యము లోనిది. ఆ దేశమునకు రాజు గుహుడు. శ్రీరామునికి ప్రాణస్నేహితుడు రాముడు తన దేశమునకు వచ్చిన వార్త విని గుహుడు తన మంత్రులతోను, పరిజనముతోను, వచ్చి రామునికి స్వాగత మిచ్చినాడు


గుహుడు : (రాముని కౌగిలించుకొని) రామ ప్రభూ! ఈ రాజ్యము నీ సొంతము. నీ విచ్చటికి వచ్చుట నా భాగ్యమేగాని ఇతరము కాదు. నీ వంటి అతిధి అందరకును లభ్యపడదు. ఇవిగో! పిండివంటలు భోజన పదార్ధములు సిద్ధముగా ఉన్నది. వీనిని ఆరగింపుము మీకు మేలైన పాన్పులను తెప్పించి నాను. మీ గుఱ్ఱములకు కావలసిన మేపు కూడ సిద్ధపరచి నాను. నీవు నా ఆతిధ్యమును స్వీకరించి నన్ను కృతార్థున్ని చేయమని ప్రార్థి స్తున్నా


రాముడు : (గుహుని కౌగిలించుకొని) గుహుడా! నీవు శ్రమపడి తెచ్చిన పదార్ధములను మరల నీకే ఇస్తున్నాను గ్రహింపుము. ఇప్పుడు నేను వనవాసము చేస్తున్నాను కావునవానితో నాకు పనిలేదు. ఈ గుఱ్ఱములన్న మా తండ్రికి ప్రాణము. వానికి మాత్రము మేత పంపినచో అదే చాలును. నాకు మరేమీ అక్కరలేదు.


శ్రీరాముడు నారచీరలను ధరించియే సంధ్యను ఉపాసించి లక్ష్మణుడు  తెచ్చిన గంగా జలమును త్రాగి సీతాసమేతుడై ఒక చెట్టు క్రింద శయనించినాడు. సీతారాముల సంరక్షణార్థము గుహుడు ధనుష్పాణియై సుమంత్రునితోను, లక్ష్మణునితోను మాటలాడుచు ఆ రాత్రియంతయు మేలుకొనియున్నాడు.......


గుహుడు : (లక్ష్మణునితో) నాయనా! నీవు రాజపుత్రుడవు. ఇట్లు మేలుకొని యుండుట ఎందుకు ఈ పాన్పుమీద శయనించి సుఖముగా నిద్రింపుము. శ్రీరాముడు నాకు ప్రాణసమానుడు. రాముని అనుగ్రహము వలన నాకు కీర్తి ధర్మము ధనము అన్నియు లభింపగలవని ఆశించుచున్నాను. ఈ అరణ్యమున నాకు తెలియని ప్రదేశము గాని నాకు తెలియని విషయము గాని లేదు. నేను మెలకువ గలిగి సీతారాములను రక్షింపగలను. నీవు సుఖముగా నిద్రపో.....


లక్ష్మణుడు ....గుహుడానీవు రక్షించుచుండగా మా కెవ్వరికిని భయములేదు. కాని, సీతారాములు ఆ విధముగా నేలమీద శయనించియుండగా నాకు నిదురపట్టునా! ఆహా! వారికి ఎట్టి కష్టకాలము వచ్చినది! రాముని అరణ్యమునకు పంపి మా తండ్రి చాలకాలము జీవించి యుండజాలడు. కౌసల్యగాని సుమిత్రగాని దశరథ మహారాజుగాని ఎక్కువ కాలము బ్రతికియుండలేరు. మా తండ్రి తన కోర్కెను తీర్చుకొనలేకయే ప్రాణములు విడువగలడు. తండ్రికి ప్రేతకార్యములు చేయుటకైనను మేము నోచుకొనలేదు.


ఆ రాత్రి ఇలాంటి మాటలతోనే గడచి పోయినది. సూర్యోదయమైనది.......