🌹🌹🌹🌷🌷🌹🌹🌹
నాకు నచ్చిన సమస్యలు ఎదురైనపుడు ఏ విధంగా ప్రవర్తించాలో, మాట్లాడాలో వివరించిన కథ.
🌷🌷🌷
*సమయానికి తగు*
*మాటలాడెనే-2*
*(చిట్టి కథే! నమ్మాలి)*
🌷🌷🌷
"సత్యవతి దొడ్డ! నువ్వు అర్జెంట్ గా రావాలి! సుమ, వాళ్ళ అత్తగారు, వాదించుకుంటున్నారు! మాకు భయం వేస్తోంది! ఆంటీ, అంకుల్ వాళ్ళ ఎం డి గారిని పిలవడానికి వెళ్లారట! వాళ్ళు ఈరోజే యు ఎస్ నుండి వచ్చారట! ఏమయినా కావాలంటే నిన్ను అడగమన్నారు! రావాలి దొడ్డా! ఆనంద్ సినిమాలోలా పెద్ద గొడవే అయ్యేటట్లు ఉంది!" పరుగులు పరుగుల్న వచ్చిన ఆ ఇద్దరు అమ్మాయిలు కలగాపులగంగా చెప్పిన మాటల సారాంశం బుర్రకెక్కి, గాభరాగా లేచింది సత్యవతమ్మ, ఆ ఇంటి పెద్ద తోడికోడలు!
"మరో రెండు గంటల్లో స్నాతకం భోజనాలు పెట్టుకుని ఇప్పుడు గొడవేంటి బాబోయ్", అనుకుంటూ, మొరాయిస్తున్న మోకాళ్లను సవరించుకుని, పెళ్లి కూతురు గదివైపు పరిగెట్టింది సత్యవతమ్మ!
గులాబీ రంగు అంచు ఉన్న పసుపురంగు కంచిపట్టు చీర కట్టుకుని, సాంప్రదాయకమైన నగలన్నీ వేసుకుని, కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది సుమ! అసలే అందాలరాశి !దానిపై ఈ ఆభరణాల జిలుగులు!
పసుపు మీగడల తో పెట్టిన నలుగుల వలన మోములోకి వచ్చి చేరిన గులాబీ, చామంతి రంగులు, సహజమైన ఆ ఎర్రని పెదవుల పూసిన దానిమ్మ పువ్వులు, సంపెంగ పువ్వు వంటి ముక్కు, చంచరీకముల గుంపును బ్రోలిన...నల్లని తలకట్టు, వెరసి, నడుస్తున్న నందనవనంలా ఉంది, సుమలత సౌందర్య శోభ!
పెళ్లి కూతురి గదిలో వాతావరణం, కాస్త వేడిగానే అనిపించింది సత్యవతమ్మకు! పెళ్లి కూతురి మొహంలో, ఆమె చుట్టూ, పరివేష్టించిన పదిమంది ఆమె స్నేహితురాళ్ల మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఆందోళన, అసహనం! సుమకు ఇంచుక దూరంలో, నడుము మీద చేయి వేసుకుని, కాస్త ఠీవీ, దర్పం కనబరుస్తూ, ఆమెకు కాబోయే అత్తగారు, ఆడపడుచు!
దొడ్డమ్మ ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది సుమకు, ఆమె మిత్రురాళ్లకు!
"అమ్మయ్య! గట్టిగా కడిగేసి, మొహం వాచేలా చీవాట్లు పెట్టడానికి, ఒక పెద్ద మొహం కనిపించింది ఇప్పటికి", అన్న భావం వియ్యపురాలిలో!
సత్యవతమ్మ, తన జీవితంలో ఇలాంటి దృశ్యాలు, కనీసం ఒక వంద పెళ్లిళ్లలో చూసి ఉంది! ఇలాంటి సమయాల్లో సమస్యను చిటికలో పరిష్కరించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య! చూద్దాం, ఈ సమస్యను ఆమె ఎలా పరిష్కరిస్తుందో!
"అయ్యో అయ్యో ఏమిటర్రా మా వదిన గారిని, ఇంటి ఆడపడుచుని, ఇలా నిలబెట్టేసి మాట్లాడటమేనా! ఒసేవ్ రమ్య, నువ్వు వెళ్లి వెంటనే రెండు మంచికుర్చీలు పట్టుకుని రా!", అంటూ ఒక పిల్లకు పురమాయించింది సత్యవతమ్మ! ఆ గదిలో అప్పటికే పది కుర్చీలు ఉండగా మళ్లీ కుర్చీలు తేవడం ఏమిటా? అనుకుంటూ అయోమయంగా బయటకు పరిగెట్టింది రమ్య!
అప్పటికే కాబోయే కోడలి మొండిపట్టు, తలబిరుసుతనానికి మొహం ఎర్రగా కందగడ్డలా చేసుకుని ఉన్న వియ్యపురాలు హైమావతిని, తల్లి బుర్ర లో సమస్యను చాకచక్యంగా ఎక్కించి, వినోదం చూస్తున్న ఆడపడుచు కౌసల్యను, సాదరంగా భుజాలు పట్టి కుర్చీలో కూర్చో పెట్టింది సత్యవతమ్మ! ఏసీలు తిరుగుతున్నా, ఉక్కపోత గా ఉన్న ఆ గదిలో ముందు మనుషుల్ని చల్లపరచవలసిన అవసరాన్ని గమనించి, ఆమె "సీతా! నువ్వెళ్ళి, క్యాటరింగ్ వారికి చెప్పి, డజను లస్సీలు, కొబ్బరి నీరు, వెంటనే పట్టించుకునీ....ఇక్కడున్నట్టు రావాలి!" అంటూ తరిమింది మరో పిల్లను!"
అప్పటికే సత్యవతమ్మ చేస్తున్న హడావిడికి, కాస్త ప్రసన్నత వచ్చిచేరింది వియ్యపురాలి మొహంలో!" చూడండి పెద్ద వదిన గారు! అసలా మోటు నగలు, పాత కాలపు డిజైన్ పట్టుచీర, సరయిన మేకప్ లేకుండా, ఎవరయినా సుమను చూసి ఈ కాలపు పెళ్లి కూతురు అనుకోగలరా? మా వాళ్లంతా తనను చూడడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు! సరయిన ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా చేసుకోలేదు మనం!", కాస్త నిష్టూరంగా దెప్పిపొడుస్తున్నట్టు మాట్లాడింది వియ్యపురాలు!
"ఏం చెప్పమంటావు హైమావతి! దీనంతటికీ కారణం, దాని బామ్మగారు, దాని అమ్మమ్మ! మా సుమలత ఉందే, దీనికి చిన్నప్పటినుండి పెద్దవాళ్ళు అంటే విపరీతమైన గౌరవం, ప్రేమ! దీని ఆత్మీయతకు మురిసి ముక్కలై ముసలమ్మ లిద్దరూ, వారి నగల్లో సింహభాగం దీనికే కట్టబెట్టారు! మిగిలిన మనవరాళ్లు మూతులు ముడిచినా, వాళ్లు లెక్కచేయకుండా ఈ పాత కాలపు నగలన్నీ దీనికే ఇచ్చారు! అప్పటికి వీళ్ళమ్మ, 'అవన్నీ మార్చి, వేరే కొత్తవి చేయించుకో' అని కూడా అంది! మా సుమమ్మ వింటే కదా!"
"అదంతా బాగానే ఉంది గాని వదినా, ఈ కాలం ఈ మోటు నగలు ఎవరు పెట్టుకుంటున్నారు?"
"నువ్వు అన్నది నూటికి నూరు పాళ్ళు నిజం హైమా! కానీ ఈ కాలంలో మా సుమ లాగా, పాత తరం వారికి కూడా మన్నన, మర్యాద ఇచ్చే పిల్లల్ని ఎంత మందిని చూస్తున్నాం! బామ్మ ను గౌరవించే పిల్ల, తల్లిని గౌరవిస్తుంది! తల్లిని గౌరవించే పిల్ల, అత్తగారిని గౌరవిస్తుంది! అవునా కాదా!"
ఇంకేమనగలదు హైమవతి !నీళ్లునానుస్తూ" అవుననుకోండి!" అంటుంటే, ఆమె కూతురు అందుకుంది" మా తమ్ముడు తన కాబోయే భార్య ను కాస్త మోడర్న్ గా చూడాలని అనుకుంటాడు కదా! ఈరోజుల్లో మామూలు ఫంక్షన్లకే బ్యూటీషియన్ లను తెప్పించుకుని చక్కగా తయారవుతున్నారు, సుమ ఇలాగ ఎలాంటి మేకప్ లేకుండా ఉండటం ఏం బాగుంటుంది?" అంటూ డాంబికంగా పలికింది కౌసల్య!
అప్పటికే, ఇక్కడ ఏదో గొడవ అవుతోందని పసిగట్టి, సత్యవతమ్మ ఆడపడుచు, మరొక తోటి కోడలు కూడా వచ్చి చేరారు! వాళ్లకు ఆ ఇంటి పెద్ద కోడలి #లౌక్యం మీద విపరీతమైన నమ్మకం, భరోసా!
"అమ్మలు కౌసల్యా! మంచి ప్రశ్న వేశావు నువ్వు! ఒక్క మాట చెప్పు నాకు! నీ మెడలో ఈ నాలుగుపేటల పలకసర్లు పాతకాలంవి కాదా! ఖచ్చితంగా మీ అమ్మమ్మో , అత్తగారో ఇచ్చినవా కాదా!? ఇష్టమో.. గౌరవమో.. వేసుకున్నావా లేదా! ఇకపోతే మేకప్ అంటావా, నీ లాగా, మీ అమ్మ లాగా, మా సుమది కూడా సహజమైన సౌందర్యం! పెళ్లి కూతురు అంటే పచ్చని గౌరీదేవి లా ఉండాలి కానీ, రంగులేసిన బొమ్మలా కాదు కదమ్మా! అలా అని మా సుమ పాత కాలపు, పాత చింతకాయ పచ్చడి కానేకాదు! అవసరమైతే భువనైక సుందరిలా తయారవ్వగలదు! నువ్వే చూస్తావుగా ముందు ముందు!"
"హైమావతి! నీ నట్టింట్లో తిరిగే పిల్లను రేప్పొద్దున్న మీ వాళ్లంతా గుర్తుపట్టాలి కదా! సుమను ఇలా చూస్తేనే వాళ్ళ మనసులో ఆమె రూపం ముద్ర పడి ఉంటుంది! మేకప్పుదేం భాగ్యం తల్లి, బ్రహ్మాండంగా చేయిద్దాం! సాయంత్రం ఎదురు సన్నాహాలకల్లా, కొత్త నగలతో, కొత్త రూపంతో మా సుమను మీరు చూస్తారు కదా! సుమ వద్దన్నా, ఇదిగో దాని చుట్టూ ఉన్న ఈ కోతిమూక ఊరుకుంటారా? సలక్షణంగా తమ స్నేహితురాలిని తయారు చేసి మరీ కూర్చోబెడతారు! సరేనా బంగారం!" అంటూ కౌసల్య కేసి ఆప్యాయంగా నవ్వుతూ చూసింది సత్యవతమ్మ!
అప్పటికే ఆమె మాటల మాయాజాలం లో తడిసి ముద్దయిపోయారు తల్లీ, కూతురు!
"మీరెంత సవ్యంగా, సౌమ్యంగా చెప్పారు వదినా! మీ మాటలు వింటుంటే మనసుకు ఎంత హాయిగా ఉన్నాయో! మమ్మల్ని అపార్థం చేసుకోకుండా, మీరు చెప్పిన రీతి చాలా నచ్చింది నాకు! సుమలత కూడా ఇలాగే చెప్పి ఉంటే ఎంత బాగుండేది! "నాకు ఇవే ఇష్టం, ఇవే వేసుకుంటాను" అని అంత విసురుగా చెప్పక్కర్లేదు కదా!" హైమావతి మాటల్లో ఇదివరకటి నిష్ఠూరత లేదు!
"ఏరా సుమా! అత్తగారితో, ఆడపడుచు తో మాట్లాడే విధానం అలాగేనా? మీ అమ్మ నీకు ఎన్ని మంచి బుద్ధులు నేర్పించింది! మన ఇంట్లోనే ఎంతో బుద్ధిమంతురాలవు! మీ అమ్మ ఉమ్మడి కుటుంబంలో తలలో నాలుకలా, అందరి మెప్పు పొందిన కోడలు! మన ఇంట్లో నుంచి ఆడపిల్ల బయటకు వెళ్తోందంటే, మన కుటుంబ గౌరవాన్ని, సంస్కారాన్ని కూడా పట్టుకు వెళ్తోంది, అని అర్థం! నీ అత్త గారికి, నీ వదినకు వెంటనే క్షమాపణ అడుగు!" అంటూ కాస్త శాసిస్తున్నట్టు, కాస్త లాలిస్తున్నట్టు, బోధించింది సుమలతకు, సత్యవతమ్మ!
ఇప్పటికే జరుగుతున్న గొడవకు బెదిరి పోయి ఉంది సుమలత! స్వతంత్ర భావాలున్న అమ్మాయి అయినప్పటికీ, ఉమ్మడి కుటుంబ విలువలు మెండుగా ఉన్నాయి ఆమెలో! దొడ్డమ్మ అందించిన సంకేతాన్ని వెంటనే అందుకుంది ఆమె మేధస్సు!
క్షణం ఆలస్యం చేయకుండా, అత్తగారిని కౌగిలించుకుని,
"క్షమించండి అత్తయ్యా, క్షమించు వదినా! ఈ కాసుల పేరు మా అమ్మమ్మ పొదుపు చేసి, ఏడాదికి ఒక కాసు సంపాదించుకుని, చేయించుకున్న హారం! అలాగే ఈ దండ వంకి, ఈ ఎర్రపొళ్ళ కంటె, పాపిడి బొట్టు, సూర్యచంద్రులు, చామంతి పువ్వు, మా బామ్మ నాకు ఇచ్చినవి! ఈ వడ్డాణం మా పెద్ద మేనత్తది! పెళ్లికూతురిని చెయ్యగానే, మా ఇంటి ఆడపిల్లలకు ఇది అలంకరించడం ఆనవాయితీ! ఈరోజు వారు ముగ్గురూ మా మధ్య లేరు! వారి గౌరవార్థం, నేను ఈ నగలు వేసుకున్నాను!" అంటూ తెలుగు, ఇంగ్లీషు కలగలిపి, ఆమె కాటుక కన్నులలో చిన్నతడితో, తన మాటలను సమర్థించుకుంటూ, తన అంతరంగాన్ని వారి ముందు పరిచింది సుమలత!
"అంతే అమ్మాయి హైమావతి! అంతకన్నా మరి ఇంకేమీ లేదు! పెళ్లికి వాళ్ళ అమ్మ ఇచ్చే బాల తొడుగు ఎలాగూ ఉంటుంది! మన కుటుంబాలు, సాంప్రదాయాలకు, ఆప్యాయతలకు పెద్దపీట వేసే కుటుంబాలు! ఇంటి కోడలి సంస్కారం మీదే ఆ ఇంటి ప్రశాంతత ఆధారపడి ఉంటుంది! మా అమ్మాయి చేసిన దాంట్లో తప్పు లేదు అనుకుంటే, ఇదిగో ఈ పన్నీరు బుడ్డి తీసుకుని, ఇద్దరూ దానిమీద పన్నీరు చిలకరించండి!" అంటూ, సర్వం హాస్యంగా తేల్చిపారేస్తూ, సత్యవతమ్మ కౌసల్య చేతిలో పన్నీరు బుడ్డి పెట్టింది!
" మా మరదలు బంగారం !మా తమ్ముడు చాలా అదృష్టవంతుడు, అత్తయ్యగారు!" అనుకుంటూ కౌసల్య, చక్కని స్నేహస్ఫూర్తితో, సుమలత మీద, ఆమె స్నేహితురాళ్ళు మీద పన్నీరుజల్లు కురిపించింది!
సత్యవతమ్మను ఆప్యాయంగా కావలించుకుని" వదినగారూ! 'మా అక్కయ్య లేనిదే, మా ఉమ్మడి కుటుంబమే లేదు' అని మా వియ్యపురాలు ఎందుకు అందో నాకు ఇప్పుడు బాగా అర్థం అవుతోంది. ఈ క్షణం నుండి, పెళ్లి,మనుగుడుపులు, మళ్ళీ మా కోడలు, అమెరికా విమానం ఎక్కే వరకు, మీరు సుమలతకు, మాకు తోడుగా ఉండవలసిందే! మీ మాటల వలన, ఎంత పెద్ద అపార్థం తప్పింది! ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు, కుటుంబాలలో ముందు ముందు చిచ్చులు రేపుతాయి! ఈరోజు మీరు లౌక్యంతో ఈ సమస్యను, చేతిలోకి తీసుకుని ఉండకపోతే, నేను చాలా ఇబ్బందిలో పడేదాన్ని!" మనస్ఫూర్తిగా అంటూ సుమలత తల మీద సున్నితంగా రాసి" శుభమస్తు తల్లి!" అని మనసారా దీవించి, నిష్క్రమించింది, హైమావతి కూతురితో పాటు!
ఆ మాటల మిటారిని నోరు తెరుచుకుని చూస్తున్న సుమలత, ఆమె స్నేహిత బృందాన్ని చూస్తూ "ఒసేవ్ అమ్మాయిలూ! ఒక్కటి నేర్చుకోండి! చదువులు కొలువులు చూసుకుని, తలబిరుసు తనంతో బంధాలను, తెగతెంపులు చేసుకోవడం కాదు జీవితం అంటే, నాలుగు మెట్లు దిగయినా సరే, తెలివిగా, లౌక్యం తో సమస్యను పరిష్కారం చేసుకోండి! పెళ్లి తర్వాత జీవితంలో ఒక కొత్త ఇంట్లో మనకు నచ్చని ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది! అది మన వ్యక్తిత్వానికి భంగం అనుకోకూడదు! జీవితంలో నూతన అధ్యాయం అనుకోవాలి! సర్దుకోవాలి! సరిపెట్టుకోవాలి! ముందు చూపించిన లౌక్యమే, ముందు ముందు మీ ఆనందమయ జీవితానికి పునాది వేస్తుంది! అదే మంగళప్రద జీవితానికి సూత్రము!" అంటూ ముగిసిందో లేదో, " దొడ్డా! యు ఆర్ ఆసం! యు ఆర్ ఎ వండర్! యు ఆర్ మేజిక్!".... అంటూ చుట్టేశారు ఆమెను అమ్మాయిలంతా!
🌷🌷🌷
ధన్యవాదాలతో
ఓలేటి శశికళ