*స్వామివారి చేయూత..*
ఒక గురువారం నాటి ఉదయం ఏడున్నర గంటలకు వచ్చే మొదటి బస్సు లో ఒక భార్యాభర్త మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..కాళ్ళూ చేతులు కడుక్కొని..తమతో తెచ్చుకున్న తమ సామాన్లను స్వామివారి మంటపం లో పెట్టి..మందిరం చుట్టూరా ప్రదక్షిణాలు చేయసాగారు..అలా పదకొండు ప్రదక్షిణాలు చేసి..మా సిబ్బంది వద్దకు వచ్చి..స్వామివారి వద్ద అర్చన కొఱకు టికెట్ కొనుకున్నారు..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..ఆ సమాధి వద్ద ఉన్న స్వామివారి పాదుకులను ముట్టుకొని..కళ్లకద్దుకొని..ఇవతలికి వచ్చారు..తమ గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారు.. ఆ తరువాత ఇద్దరూ మంటపం లోకి వెళ్లి కూర్చున్నారు..మేము ఎవ్వరమూ ఆ దంపతుల గురించి పెద్దగా ఆలోచించలేదు..రోజూ వచ్చే అనేకమంది భక్తుల లాగానే భావించాము..
ఆరోజు మధ్యాహ్నం శ్రీ స్వామివారి కి అర్చకస్వాములు హారతి ఇచ్చిన తరువాత..అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసే సమయంలో.."అయ్యా..ఇక్కడ కొన్నాళ్ళు ఉండాలని అనుకుంటున్నాము..ఎవరిని సంప్రదించాలి?.." అని మా సిబ్బందిని అడిగారు..భోజనాల తరువాత మా సిబ్బంది ఆ దంపతులను నా వద్దకు తీసుకొని వచ్చారు..ఆ ఇద్దరిని కూర్చోమని చెప్పి వివరాలు అడిగాను.."నా పేరు మహేశ్వర రావు..ఈమె నా భార్య దుర్గారాణి...కొన్ని సమస్యల్లో కూరుకుపోయి ఉన్నాము..వాటిల్లోంచి బయటపడటానికి మా ప్రయత్నాలు మేము చేసాము..చేస్తున్నాము కూడా..కానీ..దైవబలం కూడా తోడు కావాలి..మా ఇలవేలుపు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు..అలాగే మేము దత్తాత్రేయుడి ని కూడా కొలుస్తాము..ఆ ఇద్దరూ దగ్గరగా ఉన్న స్థలం ఇది..ఇక్కడికి కొద్దిదూరం లో ఉన్న మాల్యాద్రి పై లక్ష్మీనారసింహుడు కొలువై వున్నాడు..ఆ క్షేత్రం లో తపస్సు చేసి..ఇక్కడి కి వచ్చి ఆశ్రమం నిర్మించుకొని తన సాధన పూర్తి చేసుకొని కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దిగంబర అవధూత..దత్త ఉపాసకుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారు సమాధి లో ఉన్నాడు..అందుకోసం కొన్నాళ్ళు ఇక్కడ వుండి..వాళ్లకు మా బాధ విన్నవించుకొని..ఊరట చెందాలని వచ్చాము..మీకు వీలుంటే మాకు వసతి చూపించండి..లేదా ఇలా మంటపం లోనే ఉంటాము.." అన్నారు..వాళ్ళుద్దరినీ ఏ సమస్యలు పీడిస్తున్నాయో నేను అడగలేదు..వాళ్ళు ఉండటానికి వసతి చూపించమని మా సిబ్బందికి చెప్పాను..
ఆ ప్రక్కరోజు శుక్రవారం నాడు శ్రీ స్వామివారి మందిరం శుభ్రం చేసే కార్యక్రమంలో ఆ దంపతులు పాల్గొన్నారు..మహేశ్వరరావు అర్చకస్వాములతో కలిసి స్వామివారి సమాధి ఉన్న గర్భాలయం శుద్ధి చేసే పనిలో పాలుపంచుకున్నాడు..అతని భార్య స్వామివారి పూజ కొఱకు వినియోగించే సమాన్లను కడిగి..తుడిచి పెట్టింది..అలా ఇద్దరూ తమ శక్తి మేరకు స్వామివారి మందిరం లో సేవ చేసుకోసాగారు..శనివారం ఉదయాన్నే ఆ దంపతులు మాలకొండ క్షేత్రానికి వెళ్లి..అక్కడ మాల్యాద్రి లక్ష్మీనారసింహుడిని దర్శించుకొని..అక్కడే అన్నప్రసాద స్వీకరించి..తిరిగి సాయంత్రానికి మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి చేరారు..ఆరోజు సాయంత్రం జరిగే పల్లకీసేవ లో అత్యంత భక్తిగా పాల్గొన్నారు..ఆరోజు రాత్రి అన్నదాన సత్రం వద్దకు వెళ్లి..భక్తులకు అన్నప్రసాద వడ్డన చేశారు..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం కూడా మా సిబ్బంది తో కలిసి స్వామివారి మందిరాన్ని శుభ్రం చేసి..ఆ తరువాత మందిరం చుట్టూరా ప్రదక్షిణాలు చేశారు..ఇలా ప్రతిరోజూ స్వామివారి సేవ చేస్తూ..సుమారు మూడు వారాల సమయం స్వామివారి మందిరం వద్దే వున్నారు..
ఆ దంపతులు వచ్చి ఐదోవారం వారం గడుస్తున్నది..ఒకరోజు ఉదయం నా వద్దకు వచ్చి.."అయ్యా..మేము ఇక్కడికి వచ్చి ఇది ఐదవ వారం..రోజుల్లో చెప్పాలంటే ఇప్పటికి ముప్పై మూడు రోజులు అవుతున్నది..ఇన్నాళ్లకు స్వామివారు మమ్మల్ని కరుణించారు..మాకున్న సమస్యల్లో అతి ముఖ్యమైన ఒకదానికి పరిష్కారం లభించే సూచనలు కనబడుతున్నాయి..మా వాళ్ళ వద్దనుంచి ఫోన్ వచ్చింది..రేపు మమ్మల్ని రమ్మన్నారు..నేనొక్కడినే వెళుతున్నాను..నా భార్య ఇక్కడే స్వామివారి సేవలో వుంటుంది..ఆ పని చూసుకొని మళ్లీ నేను వస్తాను..మేము పూర్తిగా నలభై ఒక్క రోజు ఈ స్వామివారి సన్నిధి లోనే ఉంటాము..మేము ఇక్కడికి వచ్చిన మూడోరోజే అలా నిర్ణయం తీసుకున్నాము..ఒక మండలం రోజులు స్వామివారికి సేవ చేసుకుంటూ..ఆ మండలం రోజుల్లో వచ్చే శనివారాల్లో ఆ లక్ష్మీనారసింహుడి దర్శనం చేసుకోవాలని అనుకున్నాము.." అన్నాడు..ఆరోజు మధ్యాహ్నం మహేశ్వరరావు తన ఊరెళ్లిపోయాడు..మరో రెండు రోజుల తరువాత మహేశ్వర రావు తిరిగి వచ్చాడు..ఆరోజు ఆదివారం..ఆ దంపతుల ముఖాల్లో ఆనందం కనబడుతోంది..ఇద్దరూ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..మరో నాలుగురోజుల్లో మేమనుకున్న మండలం పూర్తి అవుతుంది..కానీ మాకున్న అతిపెద్ద సమస్య తీరిపోయింది..మా అన్నదమ్ములు నా మీద కక్ష గట్టి..నాకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తి రాకుండా అడ్డుపడ్డారు..సుమారు పదికోట్ల విలువ చేసే ఆస్తి..నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు..మొత్తం మీద రాజీకి వచ్చారు..నా ఆస్తి నాకు దక్కింది..మీతో ముందే చెప్పాను కదా..దైవం యొక్క చేయూత లేకుండా మనం ఏమి చేసినా ప్రయోజనం ఉండదు..మండలం పూర్తిగా ఇక్కడే ఉంటాము..మా ఆస్తి కాగితాలు ఇప్పుడే స్వామివారి సమాధికి తాకించి వచ్చాను.."మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి..మీరు రోజూ సోషల్ మీడియా లో పెట్టే పోస్టుల వల్ల మాలాటివారికి ఈ క్షేత్రం గురించి తెలుస్తున్నది..మేము అలానే వచ్చాము..ఇన్నాళ్ళూ ప్రతిరోజూ స్వామివారి ప్రసాదం గా భావించి ఇక్కడ భోజనం చేసాము..ఏదో మా వంతుగా ఇక్కడ ఒక వారం పాటు అన్నదానానికి అయ్యే ఖర్చు మేము భరిస్తాము.." అని చెపుతూ ఉద్వేగం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు..
మహేశ్వరరావు చెప్పిన ఒక మాట నా మనసులో నాటుకుపోయింది.."దైవం తోడు లేకుండా..ఏ ప్రయోజనం ఉండదు..మనం ప్రయత్నం చేయాలి..కానీ దైవాన్ని నమ్ముకోవాలి.." ఆ దంపతుల విషయం లో అదే జరిగింది..వాళ్ళు స్వామివారిని పరిపూర్ణంగా నమ్మారు..స్వామివారు వారికి చేయూత నిచ్చి కాపాడారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి