22, జూన్ 2022, బుధవారం

మానవ జన్మ

 మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది


అన్ని జీవరాసులలో

ఆ మాహదేవుని చెంతకు

చేరే అవకాశము కల ఉపాధి


కానీ

ఎందరో కాలం వృధా చేసుకుంటూ

చివరి రోజుల్లో

జీవితం సద్వినియోగం కాలేదని

విచారిస్తున్నారు


మానవ జీవితం ఉద్దారింపబడటానికి

ఉపయోగించే ఇంద్రియాలు

కనులు

చెవులు


ఈశ్వరుని గురించి వినటానికి చెవులు 

ఆయన రచన చూడటానికి కన్నులు


కాలం ఆగదు ఏ ఒక్కరికోసం


మనసు వెనుక పరుగులిడితే

జనన మరణాల చక్రములో చిక్కినట్లే


ఆ కనులు శివయ్య సౌందర్యాన్ని

చూడటానికి

ఆ చెవులు మహాదేవుని లీలలు

తెలుసుకోటానికి

ఉపయోగిస్తే

ఉపాధి ఈశ్వరుని సేవకు సిద్ధం అవుతుంది


అప్పుడు జీవుడే శివుడు


శివయ్యా నీవే దిక్కయ్యా


🤝🐄🙏 జై గౌమాత ఓం నమశీవయ

ఒక పద్యం

 నా భాగ్యవశమున, పోతనామాత్యులవారి "వీరభద్ర విజయము" కావ్యములోని ఒక పద్యం లభించినది. దానిని మిత్రులతో పంచుకోవాలని అనిపించినది. తత్ఫలితమే ఈ టపా!


సందర్భం తెలియదుకాని, పరమశివునితో పార్వతి వదనసౌందర్యమును గురించి వర్ణించి చెప్తున్నారు ఎవరో!


జలజాక్షి నెమ్మోముఁ జందురుఁ బోల్తమా! చందురునందున గందు గలదు!

కన్నియ వదనముఁ గమలంబుఁ బోల్తమా! కమలంబు పుట్టుచోఁ గసటు గలదు!

మోహనాంగి ముఖంబు ముకురంబుఁ బోల్తమా! ముకురంబునందున మృదువు లేదు!

మానిని వదనంబు మణిపంక్తిఁ బోల్తమా! మణులెల్ల ఱాలను మాట గలదు!


యింక నేమి బోల్త మింతి యాననముతో

సృష్టి నేమిపాటి సేయవచ్చు!

మగువ మొగము కాంతి, మలహర! నీయాన!

త్రిభువనంబులందు నభినవంబు!


భావము: "దేవా! ఆ పార్వతి ముఖసౌందర్యమును ఏమని చెప్పగలము!... ఆమె మోమును చంద్రబింబముతో పోలుస్తామంటే, చంద్రునిలోపల కళంకం ఉంది. ఆమె వదనమును పంకజము (పద్మము) తో సరిపోలుస్తామంటే, పంకజము యొక్క జన్మస్థానం పంకము (బురద) కదా! పోనీ, ఆమె ముఖమును దర్పణముతో పోలుస్తామంటే, అద్దమునకు మృదుత్వం అనేది లేదు. ఇక, ఆమె ఆననమును (ముఖమును) ప్రకాశవంతమైన మణిపంక్తితో పోలుస్తామంటే, ఎంత నవరత్నములైనా అవీ ఱాళ్ళే కదా! ఈ సృష్టిలో ఆమె వదనమునకు సాటిరాగల వస్తువేదీ కనిపించడంలేదు! ఓ మలహరా (దోషములను తొలగించువాడా)! నీమీద ఒట్టు! మూడులోకముల్లోనూ అత్యంత నూతనముగా ఉంది సుమా ఆమె ముఖకాంతి!"


ఇక్కడ "మలహరా" సంబోధన సాభిప్రాయం. "నీవు మలినములను (దోషములను) తొలగించు సమర్థుడవు కనుక, పై ఉపమానాల్లోని వైక్లబ్యములను పరిహరించగలిగితే, అప్పుడు ఆమె వదనమును వాటితో సరిపోల్చవచ్చు" అంటున్నాడు కవి.


కేవలం ముఖసౌందర్యవర్ణన కొరకు పద్యాల్లో సుదీర్ఘమైన సీసపద్యమును వాడిన పోతనగారికి నమోనమః.

మాంచి మాట*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*మాంచి మాట* 

ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు.

అతను సామాన్య మానవుల వలె దేవుడిని నమ్మేవాడు...

అంటే పూలు, పళ్ళు, దీపం ధూపం, నైవేద్యం, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మేవాడు..

అతనికి అలా ఏమీ లభించలేదు దానితో కొంచెం అసంతృప్తి మనసులో ఉండేది.

ఒకసారి ఒక గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు.

ఏదైనా మంత్రజపం సద్గురువు ద్వారా దీక్ష తీసుకుని చేయాలని ఎవరో చెప్పగా అతను విన్నాడు..

ఆ జ్ఞాని వచ్చారని తెలియగానే ఎంతో ఆశగా వెళ్ళి , దర్శనం చేసుకుని , తన కోరిక వెల్లడించాడు.....

సాధువు అంతా శాంతంగా విని, " నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను కానీ నీ తపన చూస్తుంటే.........." 

భక్తుడు ఆనందభరితుడై సాష్టాంగ నమస్కారం చేసాడు..

 

" కానీ జప విధానం కొంచెం కష్టం. నీవు చేయగలవో...........లేదో...." 

" ఎంత కష్టమైనా నేను చేయగలను.. మంత్రం ఫలిస్తే చాలు " అన్నాడు భక్తుడు ఆనందంగా....

" అయితే విను ... నేను చెప్పే మంత్రం పఠించ నవసరం లేదు కానీ రోజుకి తొమ్మిది సార్లు ఎవరితోనైనా అనాలి .... అలా తొమ్మిది రోజులు.....

*ఆ పంచాక్షరీ మంత్రం ఏమిటంటే........*"దేవుడున్నాడు"*

 

భక్తుడు అయోమయంగా చూసాడు.. సాధువు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు....ఇన్ని లక్షల,...కోట్ల జపం విన్నాడు కానీ ఇదేమిటి ?????

పైగా పంచాక్షరీ మంత్రంట ఏమిటది !

దేవుడున్నాడనే కదా రోజూ పూజలు చేస్తున్నది ...

మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేమిటి....? అదీ ఇంకొకరితో ....తనను పిచ్చివాడి క్రింద జమ కడ్తారేమో!

సాధువు ఒకటే మాట చెప్పాడు " నన్నేమీ ప్రశ్నించ వద్దు...మంత్రం ఫలించాలంటే తొమ్మిది రోజులు నేను చెప్పినట్లు చేసి ,ఆపై నాకు కనిపించు ..."

 భక్తుడు విచారంగా ఇంటికి వెళ్ళాడు...సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా 

 " దేవుడున్నాడు " అని ఎలా అనటం ?

 ఇంతలో అతని భార్య వచ్చి,

పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్పబోయింది.

ఇతను అప్రయత్నంగా అన్నాడు.... " దేవుడున్నాడు"

అంతే! ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది.

ఇతనికి చాలా ఆనందం వేసింది....వెంటనే అతనికి ఏదో అర్థం అయినట్లు...కానీ ఇంకా సరిగా కానట్లు వింత భావన కలిగింది....

ఆ పై ఇంక ఏ మంచి కనిపించినా " దేవుడున్నాడు " మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతో.....

ఏదైనా చెడు కనిపిస్తే " దేవుడున్నాడు" అన్నీ గమనిస్తున్నాడనే అర్థంతో..

అన్యాయం జరుగుతోందని ఎవరైనా అంటే "దేవుడున్నాడు" శిక్షిస్తాడనే అర్థంతో 

పూజలు అనే విషయం వస్తే " దేవుడున్నాడు" అని భక్తివిశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు.

తొమ్మిది రోజులు గడిచాయి.

అంతా నెమరువేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు...

సాధువు అన్నాడు," నువ్వు ఎప్పుడు ,ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకనవసరం. నువ్వు అలా అంటూ గ్రహించిదేమిటో నాకు చెప్పు ."

భక్తుడు తెల్లబోయాడు..అయినా వెంటనే తేరుకుని అన్నాడు...

" నాకు తెలిసింది ఏమిటంటే...దైవం సర్వాంతర్యామి.....అంతటా వున్నాడు...సర్వజ్ఞుడు...... అతనికి తెలియనిది....మనం దాచగలిగేది ఏమీ లేదు...నిష్పక్షపాతంగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తాడు..

దయాసాగరుడు.......ఆనందస్వరూపుడు.......... అతనిని మధ్యలో ఆపి సాధువు అన్నాడు " ఇప్పుడు చెప్పు... నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నవు? 

భక్తుడు తన్మయత్వం తో కళ్ళు మూసుకుని అన్నాడు "ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులోనుండి ..దేవుడున్నాడు... అనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలా చూస్తే చాలు.


నీతి.....

            కర్మఫలం . స్వర్గం- నరకం , పాపభీతి.. త్యాగం... కరుణ సానుభూతి.. ప్రేమ.. సేవ ..మానవత్వం.. సత్యం.. ధర్మం... మొదలైన ఉదాత్తమైన భావాలకి ఆలంబన , ఆధారం...

" దేవుడున్నాడు " అని మనసారా విశ్వసించటమే.🙏

 *ఓం నమః శివాయ*

మనిషికీ భగవంతుడు

 #మరణం : ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో యమధర్మరాజు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 


యమధర్మరాజు : మానవా.. నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.


మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!


యమధర్మరాజు : తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.


మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను


యమధర్మరాజు : నీకు చెందినవి ఉన్నాయి.


మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?


యమధర్మరాజు : అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి


మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?


యమధర్మరాజు : కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి


మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!


యమధర్మరాజు : అవి పరిస్థితులవి నీవి కావు 


మనిషి: నా స్నేహితులున్నారా అందులో?


యమధర్మరాజు : వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే


మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?


యమధర్మరాజు : వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు


మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!


యమధర్మరాజు : తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.


మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?


యమధర్మరాజు : ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.


మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.


మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.


మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?


యమధర్మరాజు : ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.


 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. పశ్చాతాపులను క్షమించాలి. 


 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.