భర్తకి_దేవుడిచ్చిన_వరం:::::
(చివరివరకు చదివితే తప్ప ఈ కథలోని
దిమ్మతిరిగే ట్విస్ట్ మీకు అర్దంకాదు)
.
అరవింద్ తన భార్యతో ఇబ్బంది పడుతున్నాడని, ఎంతో ఏకాగ్రతతో తపస్సు చేసాడు.
అతడి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై దేవుడు వరం కోరుకొమ్మన్నాడు.
.
''పరమేశా! మా ఆవిడ పరమ బద్ధకస్తురాలు.
నేను పగలల్లా ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తాను. ఆవిడేమో టీవీలో సీరియళ్ళు చూస్తూ ఎంచక్కా కాలక్షేపం చేస్తుంటుంది. ప్రతి చిన్నదానికి నన్ను అర్దంచేసుకోకుండా గొడవపడుతుంటుంది,
ఒక్కరోజు ఒకరి ఒంట్లోకి ఒకరు మేమిద్దరం పరకాయ ప్రవేశం చేసేలా అనుగ్రహించు స్వామి. నేను పడే కష్టం ఏమిటో ఆవిడకు తెలిసిరావాలి'' అన్నాడు ఆత్రంగా.
.
"ఓస్ ఇంతేనా..తదాస్తూ" అంటూ వరం ఇచ్చేసి పరమేశ్వరుడు మాయమైపోయాడు.
.
ఆ రాత్రి కలలు కంటూ నిద్రపోయిన అరవింద్,తెల్లారి లేచేసరికి,ఒక ఆడదానిగా కళ్ళు తెరిచాడు,చూస్తే తన భార్యలా మారిపోయాడు.
మొహం కూడా కడుక్కోకుండానే వంటింట్లోకి వెళ్ళి మొగుడికి బ్రేకఫాస్ట్ తయారు చేసాడు. పిల్లల్నిలేపి మొహాలు కడిగించాడు. స్నానాలు చేయించి స్కూలు యూనిఫారాలు వేయించి టిఫిన్ తినిపించి,మధ్యాహ్న భోజనం బాక్సుల్లో సర్ది,వాళ్లని స్కూల్లో దింపి, తిరిగివస్తూ పచారీ సామాను దుకాణంలో ఇంటికి కావలసినవి కొనుక్కుని తిరిగి వచ్చేసరికి ఇంట్లో తీరికలేని పని సిద్దంగా వుంది.
ఉతకాల్సిన దుస్తులు వాషింగు మెషిన్ లో వేసి,
అంట్ల గిన్నెలు కడిగి, ఇల్లంతా తుడిచి అన్నం పళ్ళెం ముందు పెట్టుకునేసరికి పిల్లలు ఇంటికి వచ్చే సమయం అయింది.
ఆదరాబాదరాగా నాలుగు ముద్దలు నోట్లో కుక్కుకుని, స్కూలుకి వెళ్ళి పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చి బట్టలు మార్పించి నాలుగు తినుబండారాలు వాళ్ల ముందు పెట్టి,
ఉతికిన బట్టలు ఇస్త్రీ చేసి టైం చూసుకుంటే సాయంత్రం ఆరుగంటలు.
ఆయన ఆఫీసునుంచి ఇంటికి వచ్చే సమయం. లేచివెళ్ళి వేడిగా పకోడీలు చేసి,కాఫీ డికాషన్ సిద్దం చేసేసరికి ఉస్సురుస్సురంటూ పతి దేవులు తయారు. మళ్ళీ వొంటిట్లో దూరితే రాత్రి భోజనాలు తయారుచేసే పని.
కుక్కర్ స్టవ్ మీదకు ఎక్కించి చూస్తే పెరుగు తోడుకోలేదు. అదిలేకపోతే పిల్లలకు ముద్ద దిగదు. పరుగు పరుగున బజారుకు వెళ్ళి డబ్బా పెరుగు కొనుక్కువచ్చి పిల్లలకు తినిపించి పడుకోబెట్టేసరికి రెండో మూడో పెగ్గులు బిగించిన భర్తగారు ఆవురావురుమంటూ అన్నానికి సిద్ధం.
ఆయనకు పెట్టి, నాలుగు మెతుకులు తాను కొరికి,
అంట్ల పళ్ళేలు సింకులోవేసి,
వంటిల్లు తుడిచి చీర మార్చుకుని,
తలలో పూలు తురుముకుని పడక గది చేరేసరికి పదిగంటలు.
నడుం వాలుద్దామంటే మొగుడు వూరుకునే మొగుడు కాదాయె.అలా రోజంతా అందర్నీ కనుక్కుంటూ, అందరికీ అన్నీ చేసిపెట్టి, చూసిపెట్టి కునుకుతీసి లేచేసరికి మళ్ళీ బండెడు పని, ఇంటెడు చాకిరీ చెప్పాపెట్టకుండా తయారు.
.
"అమ్మో యేమో అనుకున్నాను.
భార్యలు కాలు మీద కాలు వేసుకుని టీవీలు చూడడమే వాళ్ల పని అనుకున్నా కాని,
వాళ్లకు వొళ్ళు విరిగే ఇంత పని వుంటుందని కలలో కూడా అనుకోలేదు"
.
అరవింద్ ఆలోచనలు ఇలా సాగుతుండగానే అతగాడికి పరమేశ్వరుడు ఇచ్చిన ఒక్క రోజు వరం జ్ఞాపకం వచ్చి ఓకే! ఒక్కరోజే కదా! ఇవ్వాల్టితో ఆ వరం అయిపోతుందని సంతోషించాడు.
కాని అది ఎంతో సేపు నిలవలేదు.
తూరుపు తెల్లారుతున్నా చీరే జాకెట్ తో తన ఆకారం ఏమీ మారకపోవడం గమనించి,
కంగారు పడిపోయి మళ్ళీ పరమేశ్వర ప్రార్ధన మొదలు పెట్టాడు. కాకపోతే ఈసారి అట్టే ఆలస్యం చేయకుండా దేవుడు ప్రత్యక్షం అయ్యాడు.
రోజు గడిచిపోయిందనీ, ముందు చెప్పిన విధంగా తిరిగి తనకు పాత మగ రోజులు ప్రసాదించమనీ కోరాడు. అందుకు ఆయన నోరారా నవ్వుతూ ఇలా అన్నాడు.
.
"నీ కోరిక తీరాలంటే మరో తొమ్మిది నెలలు ఆగాలి.
రాత్రి నీకు సరిగ్గా తెలియదుగానీ నువ్వు "నెలతప్పి" గర్భవతివయ్యావు.
అందుచేత ఆడవాళ్ళు పడే ప్రసవ వేదన యెంత భయంకరంగా వుంటుందో అదీ తెలుసుకునే మహత్తర వరం నీకు అదనంగా ఇస్తున్నాను"
అంటూ అదృశ్యం అయిపోయాడు.
.
అరవింద్ కొయ్యబారిపోయాడు, దిమ్మతిరిగింది,
ఏం అనుకుంటే ఏం జరిగిందని షాక్ లో ఉన్నాడు..
మనమేం చేస్తున్నామో అది ఆలోచించాలిగానీ,
మనవాళ్లు ఏదో చేస్తున్నారని అసూయ పడితే ఏం
జరుగుతుందో బాగా తెలిసొచ్చింది.
.
నీతి: దేవుడు తేరగా దొరికాడని లేనిపోని వరాలు కోరరాదు...ముఖ్యంగా భార్య, అమ్మ విషయంలో..
ఈ కథ అబద్దం కావచ్చేమో, భార్య పడే కష్టం అబద్దం కాదని తెలియజేస్తూ...🙏🙏🙏
🕉️🕉️🕉️🕉️