మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*హరిదాసుని అంతరంగం..*
"అయ్యా!..మా అబ్బాయి కి పెళ్లి సంబంధం కుదిరింది..ఈ స్వామివారి సన్నిధిలో చేయాలని మొక్కుకున్నాము..వచ్చేనెల లో ముహూర్తం ఉందని పురోహితుల వారు చెప్పారు..ఆరోజు ఆదివారం అయింది..ఇక్కడ పెళ్లి చేయించడానికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా?..చెప్పండి.." అంటూ నెల్లూరు జిల్లా కొండాపురం మండలం మఱ్ఱిగుంట నివాసి రామదాసు అడిగాడు..రామదాసు వాళ్ళు హరిజనులు..
ఒక్క రామదాసు మాత్రమే కాదు..మొగలిచెర్ల గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్న చాలా గ్రామాల్లోని చాలా మందికి శ్రీ స్వామివారి మీద విపరీతపు భక్తి భావం నెలకొని వున్నది.. వాళ్లకు ఏ కష్టం కలిగినా..ముందుగా గుర్తుకొచ్చేది శ్రీ దత్తాత్రేయ స్వామివారే..తమ బిడ్డల నామకరణం నుంచి..వివాహం దాకా..ప్రతి శుభకార్యమూ శ్రీ స్వామివారి సమక్షంలోనే జరిపించాలని వారి కోరిక..అప్పుడే తమకూ.. తమ పిల్లలకూ క్షేమదాయకమని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం..కులమతాల ప్రసక్తి ఈ క్షేత్రం వద్ద వినపడదు..అందరూ యథేచ్ఛగా శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకోవచ్చు..ఎక్కువ, తక్కువ, బేధ భావం లేదు..వారి వారి భక్తి విశ్వాసాల స్థాయిని బట్టి వారి వారి కోరికలు సఫలం అవుతూ ఉంటాయి..
శ్రీ స్వామివారి మందిరం వద్ద వివాహం చేసుకోవాలంటే పాటించాల్సిన నియమ నిబంధనలు తెలియచేసాము..అన్నీ శ్రద్ధగా విన్నాడు రామదాసు..
"ఆరోజుల్లో ఇన్ని నియమాలు లేవు.." అన్నాడు..
నాకు అతని మాట అర్ధం కాలేదు.."ఎన్నాళ్ల క్రిందటి సంగతి నువ్వు చెప్పేది?..ఈ నియమాలు పెట్టి సుమారు పది,పన్నెండు సంవత్సరాలు అవుతున్నది.." అన్నాను..
"ఇప్పటి సంగతి కాదు..ముప్పై ఐదేళ్ళ క్రిందట.. నా పెళ్లి కూడా ఇక్కడే చేసుకున్నాను..ఆరోజుల్లో మమ్మల్ని ఏ కాగితాలూ..ఏ సర్టిఫికెట్లు అడగలేదు..మేము వారం రోజుల ముందు వచ్చి..ఇక్కడ పూజారి గారితో మాట్లాడుకున్నాము..భజంత్రీలతో మాట్లాడుకున్నాము..మళ్లీ ముహూర్తానికి వచ్చి పెళ్లి చేసుకున్నాము..ఇప్పుడన్నీ కొత్త కొత్త నిబంధనలు పెడుతున్నారు..సరేలే..రోజులు మారాయి..అందుకు తగ్గట్టే మారాలి.." అని ధోరణిగా మాట్లాడసాగాడు..
రామదాసు తల్లిదండ్రుల కాలం నుంచే శ్రీ స్వామివారిని భక్తి ప్రపత్తులతో కొలిచేవారు..రామదాసు పుట్టిన తరువాత..తరచూ మొగలిచెర్ల వచ్చి, శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళుతుండే వారు..రామదాసు వివాహం కూడా శ్రీ స్వామివారి సన్నిధిలోనే జరిగింది..రామదాసు కు పెళ్లి జరిగిన ఆరేడు సంవత్సరాల దాకా సంతానం కలగలేదు..సంతానం కోసం శ్రీ స్వామివారికే మొక్కుకున్నాడు..తనకు సంతానం కలిగితే..ఆ పిల్లల పెళ్లిళ్లు కూడా శ్రీ స్వామివారి సన్నిధిలోనే చేస్తానని ప్రమాణం చేసాడు..ఆ తరువాత సంవత్సరం లోపే రామదాసు కు మొగపిల్లవాడు పుట్టాడు..మరో రెండేళ్లకు ఆడపిల్ల పుట్టింది..తాను శ్రీ స్వామివారి వద్ద అనుకున్న మాట ప్రకారమే..కుమారుడి వివాహాన్ని శ్రీ స్వామివారి సన్నిధి లో చేయడానికి రామదాసు ప్రస్తుతం వచ్చాడు..
ఆ తరువాతి ఆదివారం ఉదయం కుమారుడి వివాహం లక్షణంగా జరిగిన తరువాత.."అయ్యా..నా చిన్నతనం నుంచీ ఇక్కడకు వస్తూ వున్నాము..ఆ దత్తాత్రేయుడు మమ్మల్ని అన్ని విషయాల్లో కాపాడుతున్నాడు..మా ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా ముందుగా స్వామి దగ్గరకి వచ్చి..సమాధి కి మొక్కుకొని వెళతాము..ఈరోజు కూడా ఆ స్వామి దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాడు..ఆ స్వామి దయ వుంటే..వీడికి పుట్టబోయే సంతానం వివాహం కూడా ఇక్కడే జరిపిస్తాము.." అన్నాడు భక్తిగా..ఆ మాట చెపుతున్నప్పుడు అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి..
రామదాసు లో ఉన్న అపరిమితపు భక్తే అతనికి ఎల్లవేళలా రక్ష!..
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి