3, ఆగస్టు 2021, మంగళవారం

అహం ' తీసేస్తే మిగిలేది

 🙏అహంభావం '' అనే పదం లోంచి ' అహం ' తీసేస్తే మిగిలేది ' భావం '. అంటే ' అర్థం'. అర్థమైతే అనర్థం జరగదు.🙏

 

నేను నిన్ను పట్టుకోలేదు , నీవే పట్టుబడ్డావు '' అంది ఆమె.


ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే , పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేకపోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే , అవన్నీ ప్రాణమున్నవాటివిగా , మన పక్కనవున్నట్టు , మనకు చేయి అందిస్తున్నట్టు , మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి. ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే ! ఆ అసాధారణ ప్రతిభ , నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [Ego] నింపాయి. ఇదిలావుండగా , ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని , జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి '' మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా ! '' అని చెప్పాడు. 


శిల్పికి చెమటలు పట్టాయి. ఆయన ఇలా అనుకొన్నాడు : ' నేను బ్రహ్మ లాంటివాడిని కదా , ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే , ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు చేస్తానుకాబట్టి , నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కివుంటాను. అపుడు మృతుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో , బొమ్మ ఏదో కనుక్కోలేక వాపసువెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను .' అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి , ఆరోజు ఒక దానివెనుక దాక్కొన్నాడు. మృత్యుదేవత ఆ గది లోకివచ్చింది. శిల్పి శ్వాసను పూర్తీగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరిబిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదు అని అనుకొన్నాడు. అపుడు దేవత అంది : '' ఈ శిల్పి ఎవరోకానీ , ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పం లోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు ! '' అంతే ! మన అపరబ్రహ్మ కు అహం దెబ్బ తింది. వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో '' ఎక్కడుంది తప్పు ? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు ! '' అనేసాడు. 


అపుడు మృత్యుదేవత నవ్వుతూ , '' నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి చిన్న అపద్ధం చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు , నీకు నువ్వే పట్టుబడ్డావు ! చూడు , ప్రాణాధారమైన నీ శ్వాస ను కూడా నియంత్రించగలిగావు కానీ , నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది ,'' అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది.


మనం పెంచుకొనే అహంభావం [Ego] అంత ప్రమాదకరమైనది. అది సత్యాన్ని చూడనివ్వదు , వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు , మనం అనుకొన్నదే కరెక్టు , ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి '' నేను బాగుంటే చాలు , నా కుటుంబం బాగుంటే చాలు '' అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం , దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం. మీరు గమనించారా ? '' అహంభావం '' అనే పదం లోంచి ' అహం ' తీసేస్తే మిగిలేది ' భావం '. అంటే ' అర్థం'. అర్థమైతే అనర్థం జరగదు.

 

🙏

గురువు - జగద్గురువు

 గురువు - జగద్గురువు


ప్రముఖ ప్రవచనకారునిగా సామవేదo షణ్ముఖ శర్మ గారు చాలామoదికి సుపరిచితులు. ఫాలభాగాన మూడు విభూతి రేఖలు ధరియించిన ప్రసన్న వదనం, శ్రీరామ చoద్రమూర్తిలో ఉన్న కారుణ్యాన్నంతటినీ పుణికిపుచ్చుకున్నారా? అన్నట్లు భాసించే పరమశాంత స్వభావి, సౌమ్యులు. పరమేశ్వరుని కోసo నాలుగు మాటలు చెప్పడoలో ఉoడే పరమానoదాన్ని అనుభవిoచి, ఈశ్వరుడు ప్రసాదిoచిన ప్రతి ఊపిరినీ, మాటగా మార్చి తిరిగి ఆయనకే సవినయoగా అప్పచెప్పే ప్రవచనకారునిగా స్థిరపడక ముoదు, ప్రముఖ పత్రిక స్వాతిలో ఓ విభాగానికి వ్యాసకర్తగా వ్యవహరిoచేవారు. 


అప్పటి స్వాతి ఎడిటర్ శర్మ గారిని "నడిచే దేవుడు" గా పేరుగాoచిన శ్రీ చoద్రశేఖరేoద్ర సరస్వతీ మహా స్వామి వారి మీద ఒక వ్యాసం వ్రాయమని చెప్పారు. దానిలో భాగoగా శర్మ గారు మహాస్వామి వారికోసo అనేక విషయాలు సేకరిoచి ఓ వ్యాసాన్ని తయారు చేశారు. దానికి పేరు ఏo పెడదాo అని ఆలోచిస్తూ "ప్రత్యక్ష పరమేశ్వరుడు" అని పెడదాం, అదే సరైనది అని భావిoచి నిర్ధారిoచినప్పటికీ మనసులో ఏదో మూల చిన్న శoక, కాoచీ క్షేత్రo లో కనిపిoచే కామాక్షిగా వెలుగొoదుతున్న స్వామి వారికి ఈ శీర్శిక నప్పుతుoదా అని!


ఇలా సoదిగ్ధoలో ఉoడగా శర్మ గారికి ఒకనాడు స్వప్నo లో చేతిలో త్రిశూలo, మెడలో నాగేoద్ర హారo తో జటాజూఠధారియైన పరమేశ్వరుడు దూరo నుoడి తనను సమీపిస్తున్నట్లు, చేరువగా వచ్చిన సమయాన చేతిలో ఉన్న త్రిశూలo మoత్ర దoడoగా , ఫాలభాగపు మూడవ నేత్రo మూడు విభూతిరేఖలు గా రూపాoతరo చెoదటo లీలామాత్రoగా గోచరిoచిoది. అoతే, స్వామి వారే అపరశివావతారులు అని నిర్ధారిoచినట్లు అయ్యిoది, అదే పేరును ఖరారు చేశారు.


ఆవిధoగా స్వామి వారితో షణ్ముఖ శర్మ గారికి ఏర్పడిన అనుబoధo, కాలక్రమమoలో స్వామివారికి మహాభక్తున్ని చేసిoది.


షణ్ముఖ శర్మగారు చిన్ననాటి నుoడే శివభక్తులు, ఆయన పదమూడవ యేటనే "శివపదo" పేరున అనేక కీర్తనలు రచిoచి" శ్రీశైల ప్రభ"అనే పత్రికకు ఇస్తుoడేవారు. వారు వృత్తి రిత్యా సినిమాలో పాటల రచయితగా స్థిరపడవచ్చునన్న ఉద్ధేశ్యoలో కొన్ని రోజులు చెన్నైలో ఉన్నారు, ఆ సమయoలో ఓ రోజు ఆయనకు కాoచీపురo వెళ్లి స్వామివారికి తాను వ్రాసిన కీర్తనలు చూపిoచాలని అనిపిoచిoది. 


అనుకున్నదే తడవుగా కoచి చేరుకొని, చేతిలో కీర్తనల తాలుకా కాగితాలు పట్టుకొని స్వామివారి దర్శనార్ధమై క్యూ లో నిల్చున్నారు. అoతలో శిశ్యు డొకరు అతని దగ్గరకు వచ్చి షణ్ముఖ శర్మ గారoటే మీరేనా ? మీరేవో కాగితాలు తెచ్చారoట కదా ? స్వామి వారు ఇమ్మన్నారు అని చెప్పి తీసుకు వెళ్లారు, మహా స్వామి వాటిని పరిశీలిoచి , తన స్వహస్తాలతో వాటి మీద అక్షితలు చల్లి వాని చేతికిచ్చారు. అoతే అప్పటి వరకూ, తీరిక సమయoలో మాత్రమే పరమేశ్వరుని కోసo చెప్పు కొని ఆనoదపడదాo అనుకున్న వ్యక్తి ఆయనే తన వృత్తి ,వ్యా పకo, శ్వాసగా జీవిస్తున్నారు. ఈశ్వరుని కోసo అనేక ప్రవచనాలు చేశారు. ఇదoతా పరమాచార్య వారి అనుగ్రహమే అని అనేక ప్రవచనాల్లో ఉటoకిoచారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

వారాలను చేసిందెవరో తెలుసా?

 వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?


"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః " అంటే అర్ధం తెలుసా?


SUN'DAY


MO(O)N'DAY


TUESDAY


WEDNESDAY


THURSDAY


FRIDAY


SATUR(N)DAY


అంటే ఏమిటో తెలుసా....? 


సూర్యహోర


చంద్రహోర


కుజహోర


బుధహోర


గురుహోర


శుక్రహోర


శనిహోర - అంటే


ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగము, ఇవి ఎంతో శాస్త్రీయమైనవి.


ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి! వారము - అంటే 'సారి' అని అర్ధము.


1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!


కాస్త విపులంగా....


భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే.ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.


మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః


అనగా... 


పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి. 


ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి? 


ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?


ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.


భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. 


ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.


ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. 


ఆ భాగాలను వారు "హోర" అన్నారు.


"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది.


దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు. 


ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.


హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.


ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. 


ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది. 


కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.


మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు - మంగళవారం,


ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.


ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.



అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. 


వస్తున్నా... అక్కడికే వస్తున్నా...


ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. 


దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు.


అదే మొదటిరోజు. 


అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.


ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే. 


అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది.


అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.


ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది. ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు. 


అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం! 



అదీ...భారతీయ ఋషుల గొప్పదనం! 


నేటికైనా తెలుసుకోండి.. తెలియకపోయినా పాటించండి! సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతీదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప వేరే కాదు.!!

పూరీ జగన్నాథ్ ఆలయంలో

 *🛕పూరీ జగన్నాథ్ ఆలయంలో సైంటిస్టులనే ఆశ్చర్యపరిచే 7 మిస్టరీలు🛕*


ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం దేశంలోనే పేరెన్నిక గన్నది. ఇక్కడ ఏటా జరిగే రథయాత్రకు లక్షలసంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ అపురూప దృశ్యాన్ని కవర్ చేసేందుకు దేశ, విదేశాల నుంచి మీడియా ప్రతినిధులు వస్తుంటారు.


అయితే ఇంతటి ప్రతిష్ట , ప్రాశస్త్యం ఉన్న పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎన్నో విశిష్టతలు ప్రత్యేకతలూ వున్నాయి. దేశంలోని మరే ఇతర ఆలయంలో లేనన్ని అద్భుతాలు ఇక్కడ జరుగు తున్నాయి. అవి శాస్త్రవేత్తల మేధస్సుకు కూడా అంతు పట్టకపోవడం విశేషం. అవేంటో ఒకసారి మీరే చదవండి ...


*🛕మొదటిది... తనంతట తానే ఆగిపోయే రథం*


ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో ఊరేగింపు గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇందులో ఎవరి ప్రమేయం వుండదు.


*🛕రెండవది...నీడ కనిపించని గోపురం*


జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదు . సూర్యుడు వచ్చినా నీడ పడదు . 

ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు.


*🛕మూడవది...గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా*


ఎక్కడైనా జండా గాలికి అనుకూలంగా ఎగురు తుంటుంది. కానీ పూరీ ఆలయ గోపురం పైన వుండే జెండాకు మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది .


*🛕నాలుగవది...మనవైపే చూసే చక్రం*


పూరీ జగన్నాథ్ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రం ఎటువైపు వెళ్లి చూసినా అది మనవైపే చూస్తున్నట్టు వుంటుంది .


*🛕ఐదవది...ఈ ఆలయంపై ఎగరని పక్షులు*


ఇది మరో వింత. ఈ జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఎందుకు పక్షులు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం అంతు పట్టడం లేదు.


*🛕ఆరవది...ఆలయం లోకి వినిపించని అలల సవ్వడి*


ఇదో విచిత్రం..సముద్ర తీరాన కొలువుతీరిన ఈ ఆలయం సింహద్వారంలో అడుగు పెట్టగానే అప్పటివరకూ వినిపించిన సముద్రపు హోరు ఆలయంలో వినిపించదు. మళ్లీ ఆలయం నుంచి అడుగు బయపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది.


*🛕ఏడోది... ఘుమఘుమల ప్రసాదం*


పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. అయితే ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసనా రాదు. దేవుడికి ప్రసాదం నివేదించిన తర్వాత మాత్రం ప్రసాదాలు మంచి సువాసనతో ఘుమ ఘుమ లాడుతుంటాయి.

🛕

పుత్రుడు

 020821B0549.    030821.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                      *పుత్రుడు...*

                     ➖➖➖✍️


*ప్రతి తండ్రీ తన కొడుకుని ప్రేమగానే చూసుకుంటాడు.. కాని ఆ కొడుకులు మాత్రం 5 రకాలుగా ఉంటారు అని మన ధర్మ శాస్త్రాలు చెప్తున్నాయి.*


 *1. #శత్రు_పుత్రుడు :- *

*ఇతడు చిన్నతనం నుంచి తండ్రి చేసే ప్రతి పనికి వ్యతిరేకిస్తూ, ఏ పనితోను తండ్రికి             ఆనందం కలిగించక పోవడమే కాక తండ్రి మరణించే వరకు  ప్రతి పనితోను తండ్రిని భాదిస్తూనే ఉంటాడు.*


*గత జన్మలలో ప్రబలమైన శత్రుత్వం కలవాడే ఈ జన్మలో శత్రు పుత్రుడిగా జన్మిస్తాడు.*


*2. #మిత్ర_పుత్రుడు :-*

*ఇతడు చిన్నతనం నుంచి తండ్రితో ఒక స్నేహితుని వలె సంబంధాన్ని కొనసాగిస్తాడు.. కాని ఒక పుత్రుడు తండ్రికి ఇచ్చే ఏ సంతోషాన్ని అతడు తండ్రికి ఇవ్వలేడు. *


*గత జన్మలలో ఆప్త మిత్రుడు ఐనవాడే ఈ జన్మలో మిత్ర పుత్రుడుగా జన్మిస్తాడు.*


*3. #సేవక_పుత్రుడు :- *

*ఇతడు అన్ని విషయాలలోనూ  రాణిoచక పోయినా తండ్రి చెప్పిన మాటని తు.చ. తప్పకుండా పాటిస్తాడు. తండ్రి చేయవలసిన పనులను కూడా ఇతడు చేస్తూ ఉంటాడు. తండ్రికి కేవలం సేవ చేయడానికి మాత్రమే జన్మిస్తాడు.*


*పూర్వ జన్మలలో సేవకుడిగా ఉండి యజమాని నుండి పొందిన లబ్ధికి కృతజ్ఞత పూర్వకంగా తన జీవితాంతం ఉండి ఈ జన్మలో సేవక పుత్రుడు గా జన్మిస్తాడు.*

  

*4. #కర్మ_పుత్రుడు :-*

*ఇతడు కేవలం ఒక కొడుకుగా తండ్రికి చేయవలసిన కర్మ కొరకు మాత్రమే జన్మిస్తాడు. చిన్నతనం నుంచి తండ్రికి దూరం గానే ఉంటాడు. అప్పుడప్పుడు తప్ప మిగిలిన అన్ని  సందర్భాలలో తండ్రికి దూరం గానే ఉంటాడు. కేవలం అంత్యేష్టి కొరకు మాత్రమే జన్మిస్తాడు.*


*ఇతడిని కర్మ పుత్రుడు అంటారు.*


*5. #నిజ_పుత్రుడు :-*

*ఇతడు పుట్టిన దగ్గరనుంచి తన ప్రతి పని తోటి తండ్రిని ఆనందింపచేస్తూ  తండ్రికి అభేదంగా ఉంటాడు .ఇతడిని విడిచి తండ్రి క్షణకాలం కూడా బ్రతుకలేడు. చివరికి తన అంత్యకాలము నందు కూడా తన కొడుకు చేతిలోనే సంతోషంగా ఏ భాధ లేకుండా అనాయాసమైన మరణాన్ని తన తనయుడి ఒడిలోనే పొందుతాడు. ఇతను తండ్రి పోయాక తండ్రికి మర్చిపోకుండా మాసికం పెడతాడు. తప్పకుండా తద్దినం పెడతాడు., గయ లో శ్రార్ధం పెడతాడు. తండ్రికి పుణ్యలోకాలు కలిగేలా చేస్తాడు. ప్రతి క్షణం ప్రతి పనిలోనూ తన తండ్రినే స్మరిస్తాడు. అరమరికలు లేకుండా తండ్రి పోలికల తోటే ఉండి తండ్రి లాగే ప్రవర్తిస్థూ తండ్రి కోసమే బ్రతుకుతాడు.*


*ఇతడిని మాత్రమే శాస్త్రాలు నిజ పుత్రుడు అన్నాయి..*✍️


.                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.

లింక్ పంపుతాము.🙏

పాదుకలు..ప్రకంపనలు..

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పాదుకలు..ప్రకంపనలు..*


ఆరేడు సంవత్సరాల క్రిందట..ఒక ఆదివారం ఉదయం తొమ్మిదిగంటల వేళ.. మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం ముందు..కారు లోంచి ఒక స్వామీజీ దిగి..మందిరం లోపలికి వచ్చారు..కాషాయ వస్త్రాలు ధరించి వున్నారు..వారితో పాటు మరో నలుగురు వెంట వచ్చారు..తాము గత రెండురోజుల నుంచీ భైరవకోన లో ఉన్నామని..అక్కడ హోమం చేసామనీ..తిరిగి వెళుతుండగా..దారిలో శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం అనే బోర్డ్ చూసి..ఈ మందిరాన్ని చూసి వెళదామని అనుకొని ఇలా వచ్చామని చెప్పారు..


ఆ వచ్చిన స్వామీ జీ వారు మౌనంగా అన్నీ పరీక్షగా చూస్తున్నారే కానీ..ఒక్క మాట కూడా మాట్లాడలేదు..ప్రక్కనున్న వాళ్లే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు..కుర్చీలు చూపించి..కూర్చోమన్నాను..అందరూ కూర్చున్నారు.."ఎక్కడినుంచి వచ్చారు?.." అని అడిగాను..


స్వామీజీ వారిది కృష్ణాజిల్లా అనీ..హిమాలయాల వద్ద వుంటారనీ..ప్రస్తుతం పర్యటన చేస్తూ..భైరవకోన కు వచ్చారని తెలిపారు..తాము వారికి అనుయాయులమనీ తెలిపారు..స్వామీజీ వారు మాత్రం మౌనంగానే వున్నారు..


"ఈ క్షేత్రం విశేషాలేమిటి?.." అని వచ్చిన వారిలో ఒకతను అడిగాడు..


శ్రీ దత్తాత్రేయ స్వామివారు మాలకొండలో తపోసాధన చేసే రోజుల నుంచీ..మా తల్లిదండ్రుల కు పరిచయం కావడం..తరువాత మొగలిచెర్ల రావడం..ఇక్కడ ఆశ్రమం నిర్మాణం చేయించుకోవడం..ఇక్కడ సాధన..కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దాకా..క్లుప్తంగా వివరించి చెప్పాను..విన్నారు..అంతా విన్న తరువాత.."మేము..స్వామివారి సమాధిని దర్శించుకోవచ్చా?.." అని అడిగారు.."దర్శనం చేసుకోండి.." అని చెప్పాను..


ముందుగా ఆ స్వామీజీ వారు లోపలికి వెళ్లారు..వెళ్లేముందు..తనతోపాటు నన్నూ లోపలికి రమ్మన్నారు..వెళ్ళాను..సమాధి చుట్టూ ప్రదక్షిణ చేశారు..శ్రీ స్వామివారి దేహాన్ని ఉత్తరాభిముఖంగా..పద్మాసనం ముద్రలో ఉంచి..సమాధి చేశామని తెలిపాను..అప్పటివరకూ మౌనంగా ఉన్న ఆ స్వామీజీ వారు..శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి ముందు నిలబడి.."స్వామీ!..దత్తాత్రేయా..నన్ను కరుణించు తండ్రీ..నా సాధన పూర్తి కావడానికి మార్గాన్ని చూపించు.." అంటూ మోకాళ్ళ మీద వంగి..సమాధికి తల ఆనించారు..అక్కడే పెట్టబడి ఉన్న శ్రీ స్వామివారి పాదుకలను రెండు చేతులతో ఎత్తి పట్టుకొని..తన శిరస్సుపై పెట్టుకున్నారు..అప్పటివరకూ ఎంతో గంభీరంగా ఉన్న ఆయన..కన్నీరు కారుస్తూ..ఆ సమాధి వద్దే ఓ ఐదు నిమిషాల పాటు నిలబడిపోయారు..మెల్లిగా ఆ సమాధి మందిరం బైటకు వచ్చి..శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహం వద్ద నిలబడ్డారు..అర్చక స్వామి ఇచ్చిన హారతిని కళ్లకద్దుకుని..ఆ మంటపం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి..ఒక ప్రక్కగా నేల మీద కూర్చున్నారు..


"నేను చాలా సంవత్సరాల నుంచీ సాధన చేస్తున్నాను..హిమాలయాల లో సుమారు పదిపన్నెండేళ్ల పాటు వున్నాను..ఎందరో యోగులను.. సిద్ధులను..కలిశాను..వారి వద్ద యోగప్రక్రియ గురించి తెలుసుకున్నాను..కానీ ఏదో తెలియని ఆవేదన నన్ను వెంటాడుతోంది..పరిపూర్ణత రాలేదు..తిరుగుతున్నాను..దేశమంతా తిరిగాను..తెలుసుకోవాల్సింది బైట ఎక్కడో లేదు..నీలోనే ఉన్నది..నిన్ను నువ్వు శోధించుకో..అని ఈరోజు ఈ క్షేత్రం లో ఈ దత్తాత్రేయ స్వామివారు నాకు బోధ చేసారు.. నా తల మీద ఈ స్వామివారి పాదుకలు ఆనించుకున్న మరుక్షణమే..నా దేహం వశం తప్పింది..వళ్ళంతా ప్రకంపనలు వచ్చాయి..ఒక్కటిమాత్రం నిజం..ఆ దత్తాత్రేయుడి తపశ్శక్తి ఇక్కడ నిక్షిప్తమై ఉన్నది.. నేను అనుభూతి చెందాను..మహిమాన్వితమైన క్షేత్రం నాయనా ఇది..శ్రీ స్వామివారి పాదుకలను జాగ్రత్తగా కాపాడండి.." అని అన్నారు..మరో అరగంట సేపు అక్కడే కళ్ళుమూసుకుని ధ్యానం చేసుకున్నారు..లేచి వెళ్లేముందు మళ్లీ ఒక్కసారి శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చి..తనతో పాటు వచ్చిన వారిని తీసుకొని..కారెక్కి వెళ్లిపోయారు..


"బోధ చేయాలంటే..నేను జీవించే ఉండాలా?..అలా అనుకుంటే..ఇంతకుముందు సిద్ధిపొందిన మహాత్ములందరూ జీవించే ఉండాలి కదా..వారి తపోశక్తి వలన వారు సమాధి చెందిన తరువాత కూడా మన సమస్యలకు సమాధానం దొరుకుతున్నది కదా!...అదేవిధంగా ఇక్కడ కూడా నా తదనంతరం కూడా నా సమాధి వద్ద మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.." అని శ్రీ స్వామివారు చెప్పిన మాటలు అక్షరసత్యాలుగా అనిపించాయి..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).