"పరోపకారార్థం ఇదం శరీరం" అనే సూక్తి మీద ఒక అద్భుతమైన కథ ఒక పుస్తకములో చదవటం జరిగింది. మన సంస్థ సభ్యుల కోసం ఆ కథ. మనము చేసే సహాయం ఎంత చిన్నదైనా ఆ ఫలితం మనకు ఒకనాటికి తప్పక లభిస్తుంది అనే చెప్పే కథ ఇది.
పాండవులు ఏకచక్రపురంలో బిక్షాటన చేసి జీవిస్తునప్పుడు ఒకరోజు వాళ్లకు ఏమి దొరకలేదు. ఆనాడు ఊళ్ళో ఒక పెళ్లి జరుగుతుందని ఊళ్ళో అందరికి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసారని తెలిసి పాండవులు కూడా అక్కడకు వెళ్లి భోజనం చేశారు. వాళ్ళు భోజనం చేసి వచ్చి ఎదురుగా ఉన్న ఒక తిన్నె మీద విశ్రమించి ఉండగా ఒక ముసలమ్మ వాళ్ళ దగ్గిరకు వచ్చి తనకు చాలా ఆకలిగా ఉన్నదని చెప్పింది. అప్పుడు అర్జనుడు ఆమెకు ఇవ్వడానికి తమ వద్ద ఆహారం లేదని తానే ఒక పెళ్లి ఇంట భోజనం చేసి వచ్చామని చెప్పి, ఆమెకు తన చూపుడు వేలితో ఆ ఇల్లు చూపించాడు. ఆమె అక్కడికి వెళ్లి భోజనం చేసి వచ్చి, పెట్టకపోయినా పెట్టె ఇల్లు చూపినందుకు కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయింది.
కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకనాడు అర్జనుడికి చాలా దాహం వేసింది. తనకు చాలా దాహంగా ఉందని అర్జనుడు శ్రీకృష్ణుడికి చెప్పాడట. తాను వెంటనే నీళ్లు తాగగాపోతే కష్టమని, తనకు చాలా నీరసంగా ఉందని, అస్త్రాలకు సంభందించిన మంత్రాలు కూడా జ్ఞాపకం రావడం లేదని అర్జనుడు - రథాన్ని మళ్ళించమని శ్రీకృష్ణుడిని కోరాడట. అందుకు శ్రీకృష్ణుడు రథాన్ని మళ్లించడం సాధ్యం కాదని, అర్జనుడు తన చూపుడువేలును తన పెదవులకు ఆనించి నోరు తెరవాలని చెప్పాడట. అర్జనుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టే చేసాడు. అంతే - ఆ చూపుడు వేలి నుంచి గంగ ఉప్పొంగి అర్జనుడి దాహాన్ని తీర్చిందట. "నా చూపుడు వేలికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేసావు మహానుభావా!" అని అర్జనుడు శ్రీకృష్ణుడిని అడిగాడు. అయిన నవ్వి - "చాలా ఏళ్ల క్రితం ఒక ముసలమ్మ ఆకలిని నీ చూపుడు వేలితో తీర్చావు కదా దాని మహిమ ఇది!" అన్నాడట.
చిన్నదా, పెద్దదా అన్న దాంతో నిమిత్తం లేకుండా ఇతరులకు మనకు తోచిన సహాయం చేద్దాం, మన గురువుగారు చూపిన బాటలో మనము నడుద్దాం. జై గాయత్రి మాత.