ఇతను చిన్నపిల్లవాడు
1949వ సంవత్సరంలో శ్రీ పరమాచార్య స్వామివారు ఆనందతాండవపురం విజయం చేసి నలభై రోజులపాటు మకాం చేశారు. అప్పుడు నేను పదమూడు సంవత్సరాల పిల్లవాడిని. అక్కడున్న శివాలయ కొలను జీర్ణోద్ధరణ కోసం స్వామివారిని ప్రార్థించగా; స్వామివారు అంగీకరించి విజయం చెయ్యడానికి ఒప్పుకున్నారు.
ఊరెరిగింపులో భాగంగా స్వామివారు మా ఇంటి వద్దకు వచ్చినప్పుడు, సామవేదంలోని ‘అభి త్వా . . .’ అని మొదలయ్యే మంత్రం పఠిస్తూ స్వామివారికి పూర్ణకుంభం సమర్పించాము. శివస్తోత్ర రూపంలో వచ్చే మంత్రం ఇది. ఈ మంత్రాన్ని పఠిస్తూ పూర్ణకుంభం సమర్పించడం సామవేదీయుల సాంప్రదాయం.
వెంటనే స్వామివారు, “నీకు ‘న కర్మణా . . .’ అన్న మంత్రం తెలుసా?” అని అడిగారు. మా నాన్నగారు ఆ మంత్రాన్ని పూర్తిగా చెప్పారు, వారితో పాటుగా నేను కూడా చెప్పాను.
తరువాత పక్క ఇంటి వారి పూర్ణకుంభం. ‘అభి త్వా . . .’ అన్న మంత్రాన్ని పఠించమన్నారు. నా మంత్రపఠనం పూర్తైన తరువాత, “కొబ్బరికాయను తాకు. నువ్వు పఠించిన మంత్రశక్తి అందులోకి వెళ్ళాలి కదా” అన్నారు స్వామివారు. నేను తాకిన తరువాతనే స్వామివారు కొబ్బరికాయను తాకి ఆ ఇంటివారికి అనుగ్రహాన్ని ఇచ్చారు. ఆ వీధిలో ఉన్న ప్రతి ఇంటిలో కూడా ఇలాగే జరిగింది.
ఒకరోజు భిక్షావందనం అయిపోయిన తరువాత అక్కడున్న పెద్ద ఇత్తడి పాత్రలో ఉన్న ఎండుద్రాక్షను పిడికెడు తీసుకుని గుంపులో ఉన్న వ్యక్తికొకరికి ఇచ్చారు స్వామివారు. అతను వాటిని భుజంపైన ఉన్న తువ్వాలులో గట్టిగా మూటకట్టి భద్రం చేశాడు. స్వామివారి ఎదురుగా వాటిని నోటిలో వేసుకుని నమలడం ఉచితం కాదని నాకు తెలియకపోవడంతో వాటిని అక్కడే ఉన్న కొందరు పాఠశాల విద్యార్థులకు ఇచ్చి, వారితోపాటుగా తిన్నాను. కొద్దిసేపు అక్కడంతా మౌనం.
తరువాత పరమాచార్య స్వామివారు మాట్లాడారు, “ఇతను చిన్నపిల్లాడు; ప్రపంచం పోకడ తెలియదు. కనుక తనకి లభించిన దానిని ఇతరులతో పంచుకుని తిన్నాడు. నేను మరొక్కరికి కూడా ఇచ్చాను కదా? అతనికి లోకవ్యవహారం తెలుసు. అందుకే తన కుటుంబం కోసమని భద్రంగా దాచుకున్నాడు”.
“లోకవ్యవహారం తెలియకపోవడం వల్ల స్వార్థం కూడా తెలియదు. కానీ మరొకతనికి లోకవ్యవహారం తెలుసు కాబట్టి, స్వార్థం కూడా తెలుసు. మూటకట్టి భద్రంగా దాచుకున్నాడు”.
తత్వం ఎంత సులభం అయిపోయింది కదా!
--- ఎన్. వేంకట్రామన్, మైలదుతురై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి