🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-38🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*గోదాదేవి:*
తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు, మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే.
విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది.
ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు.
అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. తనకు వటపత్రశాయే ఆ శిశువును ప్రసాదించాడని భావించాడు. ఆ శిశువుకు మంగళస్నానం చేయించి భార్యచేతికిచ్చాడు. ఆమెకు ఆమెకు ‘కోదై’ అంటే - పూలమాల ‘‘’’ అని నామకరణం చేశారు. మహాలక్ష్మిలా వెలుగొందుతున్న ఆ ‘‘గో’’ అనే పదానికి గల ఉన్నత లోకం, వాక్కు, వజ్రము, నేత్రము, కిరణము వంటి అర్థాలకు గల లక్షణాలన్నీ విష్ణుచిత్తులు ఆ శిశువులో చూశారు. అల్లారు ముద్దుగా పెంచారు.
ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.
గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా, తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు.
తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది.
ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.
ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది.
ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ, అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై!
ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు, ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి, గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు.
శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ, విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు.
పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి, అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి, విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.
భక్తి, కళా, సామ్రాజ్యాలను ప్రకాశింపజేసిన విజయనగర సార్వభౌములు, శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువు ఆదేశానికి అనుగుణంగా తమ కవితాశక్తిని ధారపోసి ‘లెస్స అయిన తెలుగు’ భాషలో అద్భుతమైన విష్ణుభక్తి కావ్యం రచించాడు. అదే ‘అమూక్త్తమాల్యద’’ ప్రబంధం. గోదాదేవి వైభవ చరిత్ర
‘శూడికొడుత ్త నాచియార్’ అంటే ‘ఆమూక్తమాల్యద’ అని అర్థం. ఆ పేరుతోనే రాయలవారు ప్రబంధం తెలుగులో రచించారు.
శ్రీకృష్ణుని అదేశానుసారం మార్గ్గశిర మాసంలో ఆచరించిన కాత్యాయనీ వ్రతం గురించి, విధి విధానాలన్నిటి గురించి సవివరంగా గోదాకు విష్ణుచిత్తుడు తెలియజేశాడు.
తండ్రిచెప్పినవన్నీ విన్న గోదా శ్రీవిల్లిపుత్తూరును నందవనంగా, వటపత్రశాయిని నందగోపునిగా, చెలులను గోపికలుగా, తనను వారిలో ఒకతెగా ఊహించుకుని కాత్యాయనీ వ్రతానికి సమాన ప్రతిపత్తిగల ‘మార్గళి’ వ్రతాన్ని మార్గశిర మాసంలో ఆచరించింది. ఈ వ్రతాన్ని ‘శ్రీవ్రతం’గా కూడా వ్యవహరిస్తారు.
30 రోజులపాటు సాగే ఈ వ్రతంలో, గోపికల చిత్తప్రవృత్తులను, వారి హస, హాస్య, లాసాలను, ప్రకృతి సౌందర్యాన్ని, చివరగా శ్రీకృష్ణుని ఇంటికి వెళ్లి తమ హృదయాల కవాటాలు తెరచి తమ ప్రేమను విన్నవించుకోవడం వంటి చిత్రవిచిత్ర దృశ్యాలను హృదయాలు పులకించేటట్లు గోదాదేవి రోజుకొక పాటగా (పాశురం) పాడింది. ఈ ముప్పది పాశురాలు ‘‘తిరుప్పావై’’గా తమిళవాజ్ఞయంలో ప్రసిద్ధి పొందాయి.
తిరుప్పావై శరణాగతికి ప్రతీక, రామాయణాన్ని ‘వాల్మీకిగిరి సంభూతా, రామసాగర గామినీ’ అన్నట్టు, దీనిని ‘గోదా రసనాగ్ర సంభూతా శ్రీరంగనాయక సాగర గామినీ’’ అని పండితులు పోలిక చేశారు.
పాశురాలన్నీ దివ్యప్రబోధాలు, బ్రహ్మానంద సాగర తరంగాలు, మోక్షసౌధాన్ని చేరటానికి సోపానాలు. ఎక్కడా ఉపయోగించని అద్భుతమైన, అపూర్వమైన ఉపమానాలు ‘తిరుప్పావై’ సొంతం. తాను స్ర్తీ కనుక తన అనుభూతిని గోదాదేవి పాశురాల్లో పొందుపరచగలిగింది. శ్రీహరి పాదాలనే నమ్ముకున్న గోదా పాశురాల్లో ప్రత్యక్షరంలో పర, వ్యూహ, విభవ, అర్చావతార వైభవం ఆవిష్కృతమవుతుంది.
గోదాదేవి విశేష భక్తికి, ప్రేమానురాగాలకు సంతసించిన శ్రీరంగనాఽథుడు విష్ణుచిత్తుడు పాండ్యరాజు మత్స్యధ్వజునికి కలలో కనిపించి ఆమెను తన సన్నిధికి రప్పించి కల్యాణం జరిపించమని ఆజ్ఞాపించాడు.
శ్రీరంగనాథుని ఆజ్ఞమేరకు సమస్త రాజ లాంఛనాలతో గోదా - రంగనాథుల కల్యాణం జరిగింది. గోదాదేవి శ్రీరంగనాథునిలో ఐక్యమైంది. వైష్ణాలయాల్లో ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు ‘తిరుప్పావై’ పాడటం అందరికీ తెలిసిందే! మహత్వపూర్ణమైన ‘తిరుప్పావై’ దివ్య ప్రబంధాన్ని పఠించినా, విన్నా శ్రీలక్ష్మీ నారాయణులు అనుగ్రహిస్తారని ఫలశృతిగా చెప్పడం జరిగింది.
పన్నిద్దరాళ్వారులలో తండ్రితో సమానంగా తాను కూడా ఒక ఆళ్వార్‌గా గణుతికెక్కిన గోదాదేవి కొలువుతీరిన పుణ్యక్షేత్రమే శ్రీవిల్లిపుత్తూరు. తమిళనాడులోని రాష్ట్రం విరుద్ నగర్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం, పురపాలక సంఘం. మదురైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్యక్షేత్రం. ఆండాళ్, కోదై అనే పేర్లతో ప్రసిద్ధమైన ఆ తల్లి ఆవిర్భవించింది ఇక్కడే. వేటగాడైన విల్లి పేరు మీద విల్లిపుత్తూరు అని, ఆండాళ్ అవతరించిన పుణ్యస్థలి, పెరియాళ్వార్ నివసించిన ప్రదేశం కాబట్టి శుభప్రదమైన శ్రీవిల్లిపుత్తూరు అని ప్రసిద్ధి పొందింది. శ్రీవిల్లిపుత్తూరు పట్టణ చిహ్నం 12 అంతస్తుల ఆలయ గోపురం. సుప్రసిద్ధమైన శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి దివ్యాలయ ప్రాంగణం నిత్యం గోదా, వటపత్రశాయి నామస్మరణలతో మారుమోగుతుంటుంది. సుమారు 192 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దివ్యాలయం ఆధ్యాత్మికంగా మేరు పర్వతానికి సమానమైనదిగా భావించబడుతుంది. ఈ అతి ప్రశస్త దివ్యక్షేత్రం 108 దివ్య దేశాలలో ఆండాళ్ జన్మించిన పుణ్యస్థలం. ఈమె అనితరసాధ్యమైన భక్తితో విష్ణువుని కొలిచి అతనినే భర్తగా పొందిన భక్త శిఖామణి. ఈమె తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి పాశురాలను రచించింది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో వల్లభ దేవ పాండ్యన్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అనంతరకాలంలో ఈ ఆలయాన్ని తిరుమల నాయకర్, చొక్కప్ప నాయకర్ అనే రాజులు అభివృద్ధి చేశారు. కాలాంతరంలో ఈ ఆలయంలో అనేక మార్పులుచేర్పులు జరిగినప్పటికీ, పురాతనత్వాన్ని ఏమాత్రం కోల్పోని ఆలయమిది. గోదాదేవి దొరికిన తులసీవనం ఈ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ వనంలోనే అమ్మవారికి గుర్తుగా చిన్న మందిరాన్ని నిర్మించారు.
ధనుర్మాస కాలంలో రోజుకో పాశురాన్ని స్వామి సన్నిధిలో గానం చేయడం జరుగుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అంశతో తులసివనంలో విష్ణుచిత్తుడికి లభించిన గోదాదేవి, ఆ స్వామిని వివాహం చేసుకున్నది ఈ మాసంలోనే.
అలాంటి ఈ మాసంలో స్వామివారితో పాటు అమ్మవారు కూడా ప్రత్యేకపూజలు అందుకుంటూ ఉంటుంది. వివిధ రకాల పూలమాలికలతోను ... ఆభరణాలతోను అలంకరించబడిన అమ్మవారు ప్రసన్న వదనంతో దర్శనమిస్తూ ఉంటుంది. ఆ తల్లి భుజంపైగానీ ... చేతిలో గాని ఒక రామచిలుక కనిపిస్తూ ఉంటుంది.
శ్రీవిల్లిపుత్తూరులోని అమ్మవారి ఆలయాన్ని దర్శించినట్టయితే ఈ రామచిలుక తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారట. సగ్గుబియ్యం ఆకులతో చిలుకను తయారుచేసి దానిమ్మ మొగ్గను దాని ముక్కుగా అమర్చుతారు. నిజంగా రామచిలుకే అమ్మవారి భుజంపై వాలిందా ? అన్నంత సహజంగా అది కనిపిస్తూ ఉంటుంది.
ప్రతినిత్యం ఇలా చిలుకను తయారు చేసి అమ్మవారి ఉత్సవమూర్తి భుజంపై అలంకరిస్తూ ఉంటారు. ఇలా కొలువుదీరిన అమ్మవారిని పూజించడం వలన ధర్మబద్ధమైన కోరికలు తప్పనిసరిగా నెరవేరతాయని విశ్వాసం.
కృపాసాగర గోవిందా, శరణ సుందర గోవిందా, పుణ్య స్వరూప గోవిందా, శ్రీ పురుషోత్తమ గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||38||
*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹