11, ఫిబ్రవరి 2021, గురువారం

పది నిమిషాలు

 పది నిమిషాలు గృహిణి ముందు కూర్చుంటే

జీవితం చాలా కష్టం అనిపిస్తుంది 


పది నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే

జీవితం చాలా సరళం అనిపిస్తుంది


పది నిమిషాలు సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే

ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది


పది నిమిషాలు నాయకుడి ముందు కూర్చుంటే 

మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది


పది నిమిషాలు జీవిత బీమా చేసే ఏజెంటు ముందు కూర్చుంటే 

చస్తేనే మంచిది అనిపిస్తుంది


పది నిమిషాలు వ్యాపారుల ముందు కూర్చుంటే 

మన సంపాదన చాలా తక్కువ, దేనికీ సరిపోదు అనిపిస్తుంది.


పది నిమిషాలు అధికారుల ముందు ముందు కూర్చుంటే 

ఈ ప్రపంచం మరీ స్లో అనిపిస్తుంది.


పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే 

మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది.


పది నిమిషాలు ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే 

మనం మళ్లీ విద్యార్థులం కావాలని అనిపిస్తుంది.


పది నిమిషాలు రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే 

వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది.


పది నిమిషాలు సైనికుల ముందు కూర్చుంటే 

వారి ముందు మన త్యాగం, సేవల ముందు ఏమీ లేదనిపిస్తుంది.


పది నిమిషాలు స్నేహితుని 

ముందు కూర్చుంటే 

జీవితం స్వర్గంలా ఉంటుంది.

కండు మహర్షి

 మన మహర్షులు- 17


కండు మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


కండుముని చిన్నప్పటి నుంచి గౌతమీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు.


 ఆయన ఆశ్రమం పూల చెట్లతో, మంచి మంచి రుచిగల పండ్లతో చక్కటి లతలతో ఎప్పుడూ వసంతమాసంలా ఉండేది. అక్కడ జంతువులన్నీ ఒకదానితో ఒకటి స్నేహంగా ఉండేవి.


కండు మహర్షి తపస్సు చాలా కఠినంగా ఉండేది. ఆయన వేసవికాలంలో నిప్పుల మధ్య కూర్చుని, శీతాకాలంలో చల్లటి నీళ్ళల్లో కూర్చుని తపస్సు చేశాడు. 


ఆయన తపస్సుకి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన తపస్సు గురించి విని ఇంత ధైర్యం, ఇంత నిష్ఠ, ఇంత నియమం ఎక్కడా, ఎప్పుడూ చూడలేదని మూడు లోకాల్లోనూ చెప్పుకునేవారు.


తన స్థానం ఎవరు తీసేసుకుంటారోనని ఇంద్రుడికి ఎప్పుడూ భయమే కదా! కండు మహర్షి తపస్సుకి భయపడి ప్లమోచన అనే పేరుగల అప్సరస ను వెళ్ళి కండు మహర్షి తపస్సుని భగ్నం చెయ్యమన్నాడు ఇంద్రుడు. ఆయన చెప్పినట్లు చెయ్యకపోతే శపిస్తాడని భయం కదా..! అక్కడికీ ప్లమోచన నాకన్న బాగా ఆడిపాడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్లని పంపించండి అంది. ఇంద్రుడు నువ్వే వెళ్ళు నీకు తోడుగా కామం, వసంతం

 చక్కటి చల్లగాలుల్ని పంపిస్తాను పని పూర్తిచేసుకుని రా! అని చెప్పాడు. ఇంకేం చేస్తుంది ప్లమోచన బయలుదేరి భూలోకానికి వచ్చింది ప్లమోచన ఆశ్రమంలో అడుగుపెట్టగానే వసంతం వచ్చేసింది. చెట్లన్నీ పువ్వులతో

నిండిపోయి కిందపడి నేలంతా పూలు పేర్చినట్లయ్యింది. మన్మథుడు కండు మహర్షి మీద బాణం వేశాడు. 


కండు మహర్షి కళ్ళు తెరిచి చూశాడు.

ఇంకేముంది తపస్సు మానేసి మాయలో పడిపోయాడు. కండు మహర్షి ప్లమోచనతో వందసంవత్సరాలు కలిసి ఉన్నాడు. చాలాసార్లు ప్లమోచన నేను దేవలోకం నుంచి వచ్చాను. .నన్ను పంపించెయ్యండి అని చెప్పింది. కాని కండు మహర్షి వినలేదు. కొంతకాలం పోయాక కండు మహర్షి యోగదృభష్టితో చూసి ఫ్లమోచనని నా తపస్సు నాశనం చేశావు, అయినా, నీ తప్పులేదు, నువ్వు ఇంద్రుడు పంపితే వచ్చావు కాబట్టి శపించకుండా వదిలేస్తున్నాను. వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో..అన్నాడు


కండు మహర్షి ప్రమోచనలకి కలిగిన పుత్రిక పేరు మారిష, ప్రచేతసుడు మారిషని పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి పుట్టినవాడు దక్షప్రజాపతి.


కండు మహర్షి ఇంద్రుడి మోసం తెలుసుకుని అక్కడి నుంచి పురుషోత్తమ క్షేత్రం వెళ్ళి అక్కడ మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు.


 ఇంతకుముందు కంటే కఠినమైన తపస్సు చేశాడు.


శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై కండు మహర్షిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు..


 కండు మహర్షి విష్ణుమూర్తిని అనేక విధాలుగా స్తోత్రం చేసి స్వామీ! ఈ సంసార సాగరం నుంచి తప్పించి పరమపదాన్ని చేరుకునేలా చెయ్యమని అడిగాడు.


 విష్ణుమూర్తి వరమిచ్చి అంతర్జానమయ్యాడు


కండు మహర్షికి 'కంథు మహర్షి' అని పేరు కూడా ఉంది. 


మంచి తపస్సంపన్నుడయినా మధ్యలో మాయలో పడి మళ్ళీ తన తప్పు తెలుసుకుని

 పశ్చాత్తాపంతో మహా ఉగ్రమైన తపస్సు చేసి శ్రీహరి చరణాల దగ్గరికి చేరుకుని దివ్యపదవిని

పొందాడు. 


అంటే ఏమిటన్నమాట... తెలియక తప్పు చేసినా తెలిశాక పశ్చాత్తాపపడి, అయ్యో తప్పుచేశానే అని బాధపడి, ఆ తప్పుని సరిదిద్దుకుని ఇంకెప్పుడూ తప్పులు చెయ్యకుండా అభివృద్ధిలోకి వెళ్ళడం చాలా గొప్పతనం..... 


శ్రీ రాముడు యుద్ధానంతరం అయోధ్యకు వచ్చాక ...

శ్రీ రామ దర్శనము చేసిన ఋషులలో అగస్త్య, వాల్మీకి ఋషులుతో పాటు .. ఈ కండు మహర్షి దక్షిణము నుంచి వచ్చాడని ఉత్తర రామాయణము చెబుతుంది. .


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కౌశిక మహర్షి

 మన మహర్షులు- 16


కౌశిక మహర్షి 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


కౌశిక మహర్షి 

 వేద వేదాంగ విదుడు, ధర్మ శాస్త్రజ్ఞుడు, మహాజ్ఞాని అని పేరు పొందాడు.


 చిన్నతనంలోనే ఉపనయనం చేసుకుని ఎప్పుడూ జపం చేసుకుంటూ వుండేవాడు.


కౌశికుడు హిమవతపర్వతానికి ఒక వైపు జపం చేసుకుంటూ వుండేవాడు. ఎండ చలి అనుకోకుండా లాభనష్టాలు చూసుకోకుండా ఎప్పుడూ తపస్సులోనే గడుపుతూ ఉండేవాడు. అలా వేయి సంవత్సరాలు గడిచిపోయాయి.


విసుగు విరామం లేకుండా చేస్తున్న అతడి తపస్సుకి సావిత్రీదేవి ప్రత్యక్షమై ఏంకావాలని అడిగింది కౌశికుణ్ణి, కౌశికుడు మాట్లాడలేదు. ఎన్నిసార్లడిగా అతడు మాట్లాడలేదు. సావిత్రీదేవి కూడా కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఉండిపోయింది.


తన జపం పూర్తయ్యాక గాయత్రీమాతకి నమస్కారం చేసి స్తోత్రం చేశాడు కౌశికుడు అమ్మా! ఆదరించి నన్ను ఆశీర్వదించు అన్నాడు. నా జపనిష్ఠ పెరిగేటట్లు, నేను చేసే జపం నీకిష్టమయేటట్లు అనుగ్రహించమన్నాడు.


నాయనా! శాశ్వత బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. ధర్మదేవత యమ కాల మృత్యువులు నీ దగ్గరకి వస్తారు. నీకు శుభం జరుగుతుంది అని కౌశికుడికి చెప్పి సావిత్రీదేవి అంతర్జానమయింది


జపంలోనే నూరు దివ్య సంవత్సరాలు గడిపాడు కౌశికుడు. 


జ్ఞానసిద్ధిని పొంది

జ్ఞాన స్వరూపుడయ్యాడు.


ధర్మదేవత కౌశికుడి దగ్గరకి వచ్చి నీ జపానికి నాకెంతో సంతోషంగా వుంది. నీకు ఏ పుణ్య లోకం కావాలో కోరుకో అక్కడికి పంపిస్తానన్నాడు.


జపకర్మకు అనువుగానున్న ఈ శరీరం విడిచి నేను ఎక్కడికీ వెళ్ళనన్నాడు కౌశికుడు


ఈ శరీరం శాశ్వతం కాదు. దీని మీద మోహం విడిచిపెట్టు. పుణ్యలోకాలకి వెళ్ళు అన్నాడు ధర్మదేవత. ఇంకా ఇలా అన్నాడు. అంతా నీ యిష్టంకాదు. సమయం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోవాల్సిందే! అదిగో యమ కాల మృత్యువులు వచ్చారు చూడమన్నాడు ధర్మదేవత.


యమ కాల మృత్యువులకి ధర్మదేవతకి నమస్కారం చేసి ఎవరికి కలగని భాగ్యం

నాకు కలిగింది. మీ నలుగురి దర్శన భాగ్యం కలగడం నా అదృష్టం అన్నాడు కౌశికుడు


 అదే సమయానికి ఇక్ష్వాకు మహారాజు కౌశికుడి దగ్గరకు వచ్చి ధనధాన్యాలేమైన కావాలా? అని అడిగాడు. 


నేను నీకిచ్చే వాడ్నే కాని నీ నుంచి తీసుకునే వాడిని కాదన్నాడు కౌశికుడు.


మహారాజు మునీంద్రా! నేను క్షత్రియుణ్ణి కాబట్టి యుద్ధం తప్ప ఇంకేది ఆశించను అడగకూడదు కూడా, నువ్వు బ్రాహ్మణుడివి కనుక నీకు ఏమన్నా కావాలంటే అడగవచ్చు ఇది ధర్మం. నువ్వే అడుగు ఏంకావాలో అన్నాడు


ఇద్దరూ ఇలా వాదించుకుంటూ చివరికి కౌశికుడు తనకు జపం వల్ల వచ్చిన ఫలాన్ని రాజుకిచ్చి, రాజు యాగపుణ్యఫలాన్ని తను తీసుకున్నాడు.


యమ కాల మృత్యువులు ధర్మదేవత ఇక్ష్వాకు రాజుని, కౌశికుణ్ణి అభినందించారు


 వాళ్ళిద్దరు ఆ నలుగురికి సాష్టాంగ నమస్కారం చేశారు. దేవతలు, ఇంద్రుడు లోకపాలకులు అందరు వాళ్ళని అభినందించడానికి వచ్చారు పర్వతాలు, సముద్రాలు దేవర్షులు కూడా వచ్చారు. ఇదంతా విని విష్ణుమూర్తి

కూడా వచ్చేశాడు. దేవతలు వీళ్ళందరి మీద పుష్పవర్షం కురిపించారు. 


అప్సరసలు నాట్యం

చేస్తుండగా, తుంబుర నారదులు వీణ వాయిస్తుండగ, గంధర్వులు గానం చేస్తుండగ,

జయ జయధ్వానాలు ఆకాశమంతటా వినిపించాయి


కౌశికుడు ఇక్ష్వాకురాజు ఒకేసారి ఇంద్రియాల్ని అరికట్టి అయిదు వాయువులు మనసులో నిలిపి, అక్కడ నుంచి భ్రూమధ్యానికి చేర్చి యోగబలంతో మొదట కౌశిక మహర్షిలోంచి తేజస్సు బ్రహ్మరంధ్రం నుంచి బయటకి వచ్చి, తనలాగే వచ్చిన ఇక్ష్వాకురాజు యొక్క తేజస్సుకి స్వాగతం చెప్పి రెండు తేజస్సులు కలిసి బ్రహ్మదేవుడి ముఖంలో ప్రవేశించాయి. అక్కడ ఉండి ఇదంతా చూస్తున్న దేవతలు, దేవర్షులు దిక్పాలకులు ఉత్తమగతులంటే ఏమిటో తెలుసుకున్నామని ఆనందించారు.


బ్రహ్మ అక్కడున్న వాళ్ళందరితో కౌశిక ఇక్ష్వాకు రాజులు బ్రహ్మసాయుజ్యం పొందడాన్ని చూసిన మీరు కూడ ధన్యులయ్యారు. మీకు శుభవవుతుందని చెప్పాడు.


 చూశారా! కౌశిక మహర్షి సావిత్రీదేవి ఉపాసన చేసి గొప్ప బ్రహ్మర్షి అవడమే

కాకుండా బ్రహ్మసాయుజ్యాన్ని పొందాడు.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

మొగలిచెర్ల

 *కడ దాకా స్వామితోనే...*


"మా మనవరాలికి సంబంధం కుదిరింది..వివాహం వచ్చే నెలలో చేయాలని అనుకుంటున్నాము..ఇక్కడే ..ఈ స్వామివారి సన్నిధిలోనే చేయాలని కూడా అనుకున్నాము..ముహూర్తం బుధవారం నాడు..ఆరోజుకు మాకు రెండు రూములు కేటాయించండి..ఉదయం పది గంటలకు ముహూర్తం సమయం..మధ్యాహ్నం భోజనాలు పెట్టుకొని వెళ్లిపోతాము..ఆరోజు ఇక్కడ వుండే భక్తులకు కూడా మా దగ్గరే భోజనం చేయమని మీరు చెప్పండి.." అని ఆ దంపతులు నాతో చెప్పారు..కొన్ని దశాబ్దాలుగా ఆ దంపతులు మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వస్తూనే వున్నారు..


ఆ దంపతులకు స్వామివారితో నేరుగా పరిచయం ఉంది..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లో..వీళ్లిద్దరి వివాహం మాలకొండలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో జరిగింది..ఆరోజుల్లో మాలకొండలో ప్రత్యేక కళ్యాణ మంటపం లేదు..నరసింహ స్వామివారి మందిరం వద్ద ఉన్న మంటపం లోనే వివాహాలు జరిగేవి..అక్కడ వివాహం చేసుకొని..గర్భాలయం లోకి వెళ్లి శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని..ఆపై కొండమీద  ఉన్న లక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని రావడం కొత్తగా పెళ్ళైన దంపతులకు ఒక ఆనవాయితీగా ఉండేది..వీళ్లిద్దరి వివాహం జరిగిన శనివారం రోజు మాలకొండకు పెద్దగా భక్తులు రాలేదు..వచ్చిన కొద్దిమంది కూడా మధ్యాహ్నమే తిరిగి వెళ్లిపోయారు..ఈ కొత్త దంపతులు లక్ష్మీ అమ్మవారిని చూసి..కొండదిగి వస్తూ..కొండకింద ఉన్న శివాలయం వైపు వెళ్లారు..ఆ సమయానికే శ్రీ దత్తాత్రేయ స్వామివారు శివాలయం లోని శివలింగం ముందువైపు పద్మాసనం వేసుకొని ధ్యానం లో వున్నారు..వీళ్ళిద్దరూ శివాలయం లోకి అడుగుపెట్టేసరికి..స్వామివారు ధ్యానం లోంచి లేచి..వీళ్ళను చూసారు..ఇద్దరూ అప్రయత్నంగా స్వామివారికి నమస్కారం చేశారు..స్వామివారు ఆశీర్వదించారు..అలా మొదటిసారి స్వామివారిని దర్శించుకున్నారు..ఆ తరువాత స్వామివారు మొగిలిచెర్ల చేరి ఆశ్రమం నిర్మించుకున్న తరువాత ఒకటి రెండు సార్లు కలిశారు..స్వామివారి మీద అపరిమిత భక్తి విశ్వాసం కలిగాయి..స్వామివారు సిద్ధిపొందిన తరువాత కూడా తరచూ మొగిలిచెర్ల వచ్చేవారు..తమ కుమారుడి వివాహం కూడా మొగిలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరం వద్దే చేశారు..తమ మనుమరాలి వివాహం జరిపించే క్రమం లో ఇక్కడకు వచ్చారు..


"స్వామివారిని మొదటిసారిగా చూసిన రోజు నుంచీ..మా భార్యాభర్తలకిద్దరికీ ఆయన మీద గురి కుదిరింది..ఆరోజే మా పెళ్లి జరిగింది..అదేమి చిత్రమో గానీ..రెండేళ్ల తరువాత మేమిద్దరమూ మాలకొండకు వెళ్ళాము..ఆరోజు కూడా స్వామివారు శివాలయం లోనే మాకు దర్శనం ఇచ్చాడు..మాతో ఒక్క మాట మాట్లాడలేదు..చెయ్యెత్తి ఆశీర్వదించాడు..మేమూ నమస్కారం చేసుకొని వచ్చేసాము..స్వామివారు మొగిలిచెర్ల వచ్చిన తరువాత..మేమిద్దరం మొగిలిచెర్ల వచ్చాము..మీ అమ్మా నాన్న గార్లను కలిసాము..స్వామివారిని చూద్దామని వచ్చాము అని చెప్పాము..మేము కూడా ఆయన దగ్గరకే వెళుతున్నాము..మాతో రండి..అని మీ తల్లిదండ్రులు చెప్పారు..అందరమూ ఈ స్థలానికి వచ్చాము..అప్పటికి స్వామికి గది కూడా లేదు..పూరిపాకలో వున్నాడు..మమ్మల్ని చూడగానే..నవ్వి.."శ్రీధరరావు గారూ మీతో పాటు వీళ్ళను కూడా తీసుకొచ్చారా..? " అన్నాడు..మేమిద్దరం నమస్కారం చేయగానే..ఆశీర్వదించారు..కొద్దిసేపు కూర్చుని మేము తిరిగి వచ్చేసాము..ఇప్పటిదాకా ఈస్వామినే నమ్ముకొని ఉన్నాము..ఇద్దరు బిడ్డలు పుట్టారు..అబ్బాయి పెళ్లి ఇక్కడే చేసాము..కూతురు పెళ్లి కూడా ఇక్కడే చేసాము..ఆ స్వామిదయవల్ల మా బిడ్డలు కూడా ఈ స్వామినే కొలుస్తారు..ఇంతవరకూ మా జీవితం లో ఏ లోటూ లేదయ్యా..ఆయన చల్లటి చూపు మామీద వున్నదని అనుకుంటున్నాము..ఇట్లా కాలూ చెయ్యీ ఆడుతున్నప్పుడే..మమ్మల్ని తీసుకెళ్లు స్వామీ అని వేడుకున్నాము..అదొక్కటే కోరిక.." అన్నారు..


ఆ దంపతులు ధన్యజీవులు అనిపించింది..అనుకున్న విధంగానే వారి మనుమరాలి వివాహం మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దే జరిగింది..స్వామివారి సమాధి ని దర్శించుకున్న తరువాత.."అయ్యా..ఈసారి మేము మళ్లీ స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు..అన్నదానం జరిపించు..ఆ ఖర్చు మేమే భరిస్తాము.." అని చెప్పాడు..అలాగే అన్నాను..కానీ మరో రెండు నెలల లోపే ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చి..హాస్పిటల్ లో చేర్చే లోపలే కన్నుమూసాడు..ఒక్కరోజు కూడ ఆ మందులు వాడలేదు..మంచాన పడలేదు..ఒక రకంగా సుఖమైన మరణమే అది..ఆయన కోరుకున్నది కూడా అదే..


"ప్రతి సంవత్సరం మా నాన్న గారి జ్ఞాపకార్ధం ఈ స్వామివారి సన్నిధిలో ఒక ఆదివారం మధ్యాహ్నం అన్నదానం జరిపించాలని అనుకుంటున్నాను..ఆ అవకాశం ఇవ్వండి.." అని వాళ్ళ కుమారుడు అడిగాడు..సరే అన్నాను..గత ఆరేళ్లుగా అతను క్రమం తప్పకుండా అన్నదానం చేస్తున్నాడు..తండ్రి మరణించిన సంవత్సరం లోపే తల్లి కూడా మరణించింది.."స్వామివారు మా తల్లిదండ్రులను చల్లంగా చూసాడు..ఏ బాధా పడకుండా ఇద్దరూ కాలం చేశారు.." అని అంటూవుంటాడు వాళ్ళ కుమారుడు..


నిజమే..త్రికరణ శుద్ధిగా స్వామివారిని నమ్మిన వారికి ఏ ఇబ్బందీ రాకుండా ఆయనే వేయి చేతులతో కాపాడుతూ ఉంటాడు.. ప్రతిసారీ మేము ఈ నిజాన్ని పలురకాలుగా గ్రహిస్తూ ఉంటాము..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

మౌని అమావాస్య

 _*రేపు మౌని అమావాస్య*_


*మౌని అమావాస్య అనగానేమి ? మౌని అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి ?*


పుష్యమాసంలో అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్రస్నానాలు ఆచరిస్తారు.  స్నానం యొక్క పవిత్రత రెండు లేదా ఎక్కువ నదులు కలిసేచోట చేస్తే పెరుగుతుంది.  మరో ముఖ్య విషయం మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది.


*మౌని అమావాస్య విశిష్టత*


మౌని అమావాస్య ఫిబ్రవరి 11 వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ప్రారంభమై.. ఫిబ్రవరి 12వ తేదీన అర్థరాత్రి ముగియబోతోంది. 


*మౌని అమావాస్య సమయం ఈ కింది విధంగా ఉంటుంది*


అమావాస్య తిథి మొదలయ్యే సమయం ; 01:08AM, 11 ఫిబ్రవరి 2021

అమావాస్య తిథి ముగిసే సమయం ; 00.55 ఎఎం, 12 జనవరి 2021


*మౌని అమావాస్య ప్రాముఖ్యత*


మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు , సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి , దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు.  ఏమీ చెప్పవలసిన అవసరం కానీ , చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు.


గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆరోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది.


గంగానదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య కూడా మేటి రోజు. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు.  వారు పుష్య పూర్ణిమ నాడు మొదలుపెట్టి , మాఘ పూర్ణిమ నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ రోజు ఎంత ముఖ్యమైనదంటే 2017 సంవత్సరంలో , 5 కోట్ల కన్నా ఎక్కువ మంది భక్తులు అలహాబాద్ సంగమ్ ఘాట్ల దగ్గర చేరి పవిత్రస్నానం ఆచరించారు.


మౌని అమావాస్య రోజును మాఘి అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తరభారతం వారు పాటించే క్యాలెండర్ లో మాఘమాసంలో వస్తుంది


*మౌని అమావాస్య ఆధ్యాత్మిక విశిష్టత*


మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాలను మౌని , అమ మరియు వాస్యగా విడగొట్టవచ్చు.

మౌనికి అనువాదం - మాట్లాడకుండా మౌనంగా ఉండటం , అమ - చీకటి మరియు వస్య - కామం. అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకడం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని , కామాన్ని తొలగించుకోవాలని.

చంద్ర దేవుడు లేదా చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈ రోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు.

భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు - *'మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు , అందుకని దానికి సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీమీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు.'*

శరీరాన్ని , మనస్సును , ఆత్మను శుద్ధిచేసుకునే పవిత్రనదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు.


*మౌని అమావాస్యను ఎలా జరుపుకోవాలి?*


సాంప్రదాయంగా , భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు. మౌనవ్రతం చేస్తారు మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్తపడతారు. గంగానదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు.  మీరు సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే , మీరు అదే ఫలితం కోసం ఈ కింది ఆచారాలను పాటించవచ్చు. 


మీరు గంగానదిలో స్నానం చేయలేకపోతే

మీ ఇంట్లో గంగానది నీళ్ళు కొంచెం ఉన్నట్లయితే , అందులో కొన్ని చుక్కలను స్నానం చేసే నీళ్ళకి జతచేయండి. మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చదవవచ్చు.

*'గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి ,*

*నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు'*

పై మంత్రం భారత ఉపఖంఢంలోని అన్ని పవిత్రనదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశలను మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది.


*పితృపూజ*


పితృపూజ చేయటానికి మౌని అమావాస్య మంచిరోజు. ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని , వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ , వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు.


*ధ్యానం*


ధ్యానం చేయండి మరియు మంత్రాల ఉఛ్చారణలు మరియు సంగీతం కూడా ఉదయం వినండి. ఇది మిమ్మల్ని శాంతపరిచి మనస్సును నియంత్రిస్తుంది.


*రుద్రాక్షలు*


చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ఈరోజు మీరు ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా పదహారు ముఖి అయివుండాలి. ఇవి వేసుకున్నవారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది.


*మూన్ స్టోన్*


మూన్ స్టోన్ ను మనస్సుకు సానుకూలత ఏర్పడటానికి వాడవచ్చు.

జంతువులకి ఆహారం పెట్టడం కుక్కలు , ఆవులు మరియు కాకుల వంటి జంతువులకి ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు.


*శనీశ్వరుడు*


మౌని అమావాస్య నాడు శనేశ్వరుడిని కూడా పూజిస్తారు. ప్రజలు నువ్వులు లేదా తిల్ నూనెతో ఈ రోజు శనేశ్వరుడికి అభిషేకం చేస్తారు.


*దానాలు*


ఈరోజు కొంత డబ్బును మీరు పేదలకు మరియు అవసరమైనవారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం , బట్టలు ఇవ్వవచ్చు