11, ఫిబ్రవరి 2021, గురువారం

కౌశిక మహర్షి

 మన మహర్షులు- 16


కౌశిక మహర్షి 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


కౌశిక మహర్షి 

 వేద వేదాంగ విదుడు, ధర్మ శాస్త్రజ్ఞుడు, మహాజ్ఞాని అని పేరు పొందాడు.


 చిన్నతనంలోనే ఉపనయనం చేసుకుని ఎప్పుడూ జపం చేసుకుంటూ వుండేవాడు.


కౌశికుడు హిమవతపర్వతానికి ఒక వైపు జపం చేసుకుంటూ వుండేవాడు. ఎండ చలి అనుకోకుండా లాభనష్టాలు చూసుకోకుండా ఎప్పుడూ తపస్సులోనే గడుపుతూ ఉండేవాడు. అలా వేయి సంవత్సరాలు గడిచిపోయాయి.


విసుగు విరామం లేకుండా చేస్తున్న అతడి తపస్సుకి సావిత్రీదేవి ప్రత్యక్షమై ఏంకావాలని అడిగింది కౌశికుణ్ణి, కౌశికుడు మాట్లాడలేదు. ఎన్నిసార్లడిగా అతడు మాట్లాడలేదు. సావిత్రీదేవి కూడా కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఉండిపోయింది.


తన జపం పూర్తయ్యాక గాయత్రీమాతకి నమస్కారం చేసి స్తోత్రం చేశాడు కౌశికుడు అమ్మా! ఆదరించి నన్ను ఆశీర్వదించు అన్నాడు. నా జపనిష్ఠ పెరిగేటట్లు, నేను చేసే జపం నీకిష్టమయేటట్లు అనుగ్రహించమన్నాడు.


నాయనా! శాశ్వత బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. ధర్మదేవత యమ కాల మృత్యువులు నీ దగ్గరకి వస్తారు. నీకు శుభం జరుగుతుంది అని కౌశికుడికి చెప్పి సావిత్రీదేవి అంతర్జానమయింది


జపంలోనే నూరు దివ్య సంవత్సరాలు గడిపాడు కౌశికుడు. 


జ్ఞానసిద్ధిని పొంది

జ్ఞాన స్వరూపుడయ్యాడు.


ధర్మదేవత కౌశికుడి దగ్గరకి వచ్చి నీ జపానికి నాకెంతో సంతోషంగా వుంది. నీకు ఏ పుణ్య లోకం కావాలో కోరుకో అక్కడికి పంపిస్తానన్నాడు.


జపకర్మకు అనువుగానున్న ఈ శరీరం విడిచి నేను ఎక్కడికీ వెళ్ళనన్నాడు కౌశికుడు


ఈ శరీరం శాశ్వతం కాదు. దీని మీద మోహం విడిచిపెట్టు. పుణ్యలోకాలకి వెళ్ళు అన్నాడు ధర్మదేవత. ఇంకా ఇలా అన్నాడు. అంతా నీ యిష్టంకాదు. సమయం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోవాల్సిందే! అదిగో యమ కాల మృత్యువులు వచ్చారు చూడమన్నాడు ధర్మదేవత.


యమ కాల మృత్యువులకి ధర్మదేవతకి నమస్కారం చేసి ఎవరికి కలగని భాగ్యం

నాకు కలిగింది. మీ నలుగురి దర్శన భాగ్యం కలగడం నా అదృష్టం అన్నాడు కౌశికుడు


 అదే సమయానికి ఇక్ష్వాకు మహారాజు కౌశికుడి దగ్గరకు వచ్చి ధనధాన్యాలేమైన కావాలా? అని అడిగాడు. 


నేను నీకిచ్చే వాడ్నే కాని నీ నుంచి తీసుకునే వాడిని కాదన్నాడు కౌశికుడు.


మహారాజు మునీంద్రా! నేను క్షత్రియుణ్ణి కాబట్టి యుద్ధం తప్ప ఇంకేది ఆశించను అడగకూడదు కూడా, నువ్వు బ్రాహ్మణుడివి కనుక నీకు ఏమన్నా కావాలంటే అడగవచ్చు ఇది ధర్మం. నువ్వే అడుగు ఏంకావాలో అన్నాడు


ఇద్దరూ ఇలా వాదించుకుంటూ చివరికి కౌశికుడు తనకు జపం వల్ల వచ్చిన ఫలాన్ని రాజుకిచ్చి, రాజు యాగపుణ్యఫలాన్ని తను తీసుకున్నాడు.


యమ కాల మృత్యువులు ధర్మదేవత ఇక్ష్వాకు రాజుని, కౌశికుణ్ణి అభినందించారు


 వాళ్ళిద్దరు ఆ నలుగురికి సాష్టాంగ నమస్కారం చేశారు. దేవతలు, ఇంద్రుడు లోకపాలకులు అందరు వాళ్ళని అభినందించడానికి వచ్చారు పర్వతాలు, సముద్రాలు దేవర్షులు కూడా వచ్చారు. ఇదంతా విని విష్ణుమూర్తి

కూడా వచ్చేశాడు. దేవతలు వీళ్ళందరి మీద పుష్పవర్షం కురిపించారు. 


అప్సరసలు నాట్యం

చేస్తుండగా, తుంబుర నారదులు వీణ వాయిస్తుండగ, గంధర్వులు గానం చేస్తుండగ,

జయ జయధ్వానాలు ఆకాశమంతటా వినిపించాయి


కౌశికుడు ఇక్ష్వాకురాజు ఒకేసారి ఇంద్రియాల్ని అరికట్టి అయిదు వాయువులు మనసులో నిలిపి, అక్కడ నుంచి భ్రూమధ్యానికి చేర్చి యోగబలంతో మొదట కౌశిక మహర్షిలోంచి తేజస్సు బ్రహ్మరంధ్రం నుంచి బయటకి వచ్చి, తనలాగే వచ్చిన ఇక్ష్వాకురాజు యొక్క తేజస్సుకి స్వాగతం చెప్పి రెండు తేజస్సులు కలిసి బ్రహ్మదేవుడి ముఖంలో ప్రవేశించాయి. అక్కడ ఉండి ఇదంతా చూస్తున్న దేవతలు, దేవర్షులు దిక్పాలకులు ఉత్తమగతులంటే ఏమిటో తెలుసుకున్నామని ఆనందించారు.


బ్రహ్మ అక్కడున్న వాళ్ళందరితో కౌశిక ఇక్ష్వాకు రాజులు బ్రహ్మసాయుజ్యం పొందడాన్ని చూసిన మీరు కూడ ధన్యులయ్యారు. మీకు శుభవవుతుందని చెప్పాడు.


 చూశారా! కౌశిక మహర్షి సావిత్రీదేవి ఉపాసన చేసి గొప్ప బ్రహ్మర్షి అవడమే

కాకుండా బ్రహ్మసాయుజ్యాన్ని పొందాడు.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: