8, డిసెంబర్ 2022, గురువారం

సమయము లేదు మిత్రమా

 సమయము లేదు మిత్రమా శరణమా, రణమా అని ప్రేక్షకులను ఉత్తేజితుల్ని చేసిన డైలాగు దాదాపు అందరు తెలుగు వారికి జ్ఞ్యాపకము ఉండే  ఉంటుంది. అది ఏ నటుడు, ఏ సందర్భంలో చెప్పారు అనేది కాదు ప్రస్తుత అంశం.  ఆ వాక్యం మాత్రం సాధకులను తేజోవంతుల్ని చేసి జిజ్ఞాసువులుగా మారుస్తుంది అన్నది మాత్రం నిజం. ఇప్పుడు ఆ వాక్యాన్ని కూలంకుషంగా పరిశీలిద్దాము. 

ఈ వాక్యాన్ని మూడు భాగాలుగా విభజిస్తే మొదటిది సమయము లేదు మిత్రమా దీనిని ఒక సాధకుడు ఇంకొక సాధకుని ఉద్దేశించి పలుకుతున్నట్లుగా తీసుకోవచ్చు. మిత్రమా ఇంకా సమయం లేదు ఎందుకంటె ఈ దేహాన్ని కాలుడు ఏ క్షణంలోనయినా కబళించ వచ్చు కాబట్టి జాప్యం చేయవద్దని  ప్రబోధిస్తున్నది. మరి ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే విషయంలో రెండు ఎంపికలను సూచిస్తున్నాడు. ఒకటి శరణము అనగా ఆ దేవదేవుడైన ఈశ్వరుని శరణుచొచ్చటము దానివలన ఉపయోగము ఏమిటి అంటే నిరంతర బ్రహ్మ్మనందంతో కైవల్యపధాన్ని చేరుకోవటం. మానవ జీవిత లక్ష్యం  అదే. దానిని ప్రతి సాధకుడు తెలుసుకొని తన జీవితాన్ని తరిమ్పచేసుకోవాలి.  అది కేవలం నియమ నిష్టలతో, క్రమపద్ధతిలో జీవనాన్ని సాగించి సాధారణ జీవనం చేస్తూ నిత్యం జిగ్న్యాసపరుడై ముముక్షుకత్వం పొందటానికి ప్రయత్నించటం. మనకు ఎన్నో జన్మల తరువాత అనితర సాధ్యమైన మానవ జన్మ లభించింది.  ఈ జన్మలో మనం అరిషడ్వార్గానికి బానిసలం కాకుండా నిరంతర ధ్యానంతో మోక్షపదాన్ని చేరుకోవాలి. 

ఇక రెండవ ఎంపిక రణం.  మానవుని జీవితం నిత్యము ఒక రణమే కామ క్రోధాదులకు లోబడి నిత్యం మనస్సు అది కావాలి, ఇది కావలి అని పరుగులు పెట్టిస్తూవుంటుంది. లేనిది దొరికితే సుఖం కలుగుతుందని మనుషులు లేనిదానిని పొందటానికి వెంపర్లాడుతూ వుంటారు కానీ ఏది లేదని ముందనుకున్నాడో తరువాత అది లభించిన తరువాత కలిగే సుఖం తాత్కాలికం మరియు కేవలము క్షణికం.  తరువాత తాను పొందిన దానికన్నా ఇంకా మెరుగైనది పొందాలనే అపేక్ష మనిషిని క్షణం కూడా నిలువనీయదు. ఉదాహరణకు నీకు ఒక మోటారుసైకిలు ఉంటె బాగుండును అని ఆశ కలిగి శ్రమదమాలకు ఓర్చి ఒక దానిని కొంటె కొంత కాలం దానివల్ల సంతోషం కలిగినా తరువాత కారు కావాలని మనస్సు ప్రాకులాడుతుంది.  అది సమకూర్చుకుంటే ఇంకొకటి ఇంకొకటి అని నిత్యము లేనివానికై పరుగులు తీస్తూ కొంత కాలం తరువాత జీవితం ఒక పాఠం చెపుతుంది అదేమిటంటే నీవు బౌతికంగా కోరుకునేవి ఏవి కూడా శాశ్విత ఆనందాన్ని ఇవ్వవు అంతేకాక అవి తరువాత మున్ముందు నీకు దుఃఖ కారకాలుగా  మారుతాయి. ఏవి కలిగితే సంతోషం కలుగుతుందో అవి విడివడుతే దుఃఖం  కలుగుతుంది. అప్పుడు నీ పయనం శాశ్వితం, నిత్యము అయిన ఆనందం ఏమిటనే వైపుకు  మళ్లుతుంది. కానీ అప్పటికే జీవితంలో చాలా సమయం అయిపోయి ఉంటుంది.  కాబట్టి ఇప్పుడే మేల్కొని ఆ అనంతునివైపు నీ పయనాన్ని కొనసాగించు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిహి 

మీ భార్గవ శర్మ

కుచేలోపాఖ్యానం

 Srimadhandhra Bhagavatham -- 96 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


కుచేలోపాఖ్యానం


శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడితో చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. కానీ సంప్రదాయంలో కుచేలుని గురించి ఒక తప్పు కథ ప్రచారంలో ఉన్నది. అది ఎలా వచ్చిందో తెలియదు. కృష్ణుడికి తెలియకుండా ఒకరోజున అరణ్యంలో కుచేలుడు అటుకులు తిన్నాడని, అందుకే అంత దరిద్రం అనుభవించాడని, ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఐశ్వరం ఇచ్చాడని అంటారు. భాగవతంలో కుచేలుని గురించి అలా చెప్పలేదు. కుచేలుని గురించి వ్యాసులవారు, పోతనగారు చాలా గొప్పగా మాట్లాడారు. వేదవ్యాస కుమారుడయిన శుకుడు అభిమన్యుని కుమారుడయిన పరీక్షిత్తును చూసి ‘ఓరాజా! ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెపుతాను విను’ అని కుచేలుని గురించి చెప్తున్నాడు. కుచేలుడు అపారమయిన మానాభిమానములు కలిగిన వాడు. యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి. కుచేలుడు అలా సిగ్గు విడిచి పెట్టిన వాడు కాదు. మానాభిమానములు ఉన్నవాడు. గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్న వాడు. విజ్ఞాని. ఆయన అనుబంధములకు అతీతంగా ఉంటూ నిరంతరము బ్రహ్మమునందు రమించే మనస్సు ఉన్నవాడు. లోకమునందు ఈశ్వరుని దర్శనము చేయగలిగిన సమర్థుడు. మహానుభావుడికి ధర్మం అంటే మహాయిష్టం. విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమీలేకపోయినా తృప్తిగా ఉన్నవాడు. ఈశ్వరుడు తనకు ఫలానిది ఇవ్వలేదు అని అనడం తెలియనివాడు. అంతటి మహాభక్తుడు, గోవింద సఖుడు. కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్లి చెయ్యి చాపి ‘కృష్ణా! నాకు సహాయం చేస్తావా’ అని అడగలేదు. కుచేలుని భార్య అనురక్త. కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తానుకూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి. గొప్ప భాగవత ధర్మము తెలిసి ఉన్న తల్లి. ఆవిడ ఒకరోజున భర్తతో ‘మహానుభావా! ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు. నేను ఓర్చుకుంటాను. పిల్లలు ఆకులతో చేసిన డొప్పలు చేత పట్టుకుని పదిమాట్లు ఆకలేస్తోంది అమ్మా అంటే అన్నం పెట్టలేక పోయానే అని అమ్మ బాధ పడుతుందేమోనని ఆకలితో నావంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకుంటున్నారు. నీకు ఐశ్వర్యం భ్రాంతి లేదు. బిడ్డలను పోషించాలి కదా! మీరు పాటిస్తానంటే ఒక సలహా చెప్తాను. మీ సఖుడు శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వెళ్లి ఒక్కమాట చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగిన మహానుభావుడు ఆ వాసుదేవుడు మనలను ఆదుకుంటాడు. ఆయనను భక్తితో ఏమి అడిగినా ఇస్తాడు. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి. పిల్లల కోసమయినా ఆయన దగ్గరకు ఒక్కసారి వెళ్ళవలసింది’ అని చెప్పింది. భార్య అలా చెప్పేసరికి ఆయన ‘పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు స్నేహితుని దగ్గరకు వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరకు వెళ్ళేటప్పుడు వృద్ధుల దగ్గరకు వెళ్ళేటప్పుడు గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళలేము కదా! స్నేహితుడికి ఏదయినా కానుక పట్టుకెళ్ళాలి కదా! ఆయనకు పట్టుకు వెళ్ళడానికి మనింట్లో ఏమి కానుక ఉన్నది?' అని అడిగాడు. ఆవిడ 'మనకి ఉన్నదే మనం ఇద్దాము. గుప్పెడు అటుకులు ఉన్నాయి. అవి మూట కట్టి ఇస్తాను తీసుకువెళ్ళండి’ అన్నది. కుచేలుడి జీవితకాలంలో ఆయనను ఆ ఊళ్ళో చిరుగులేని పంచెను కట్టుకోవడం చూసిన వాడు లేదు. అందుకని ఆయనకు కుచేలుడు అని పేరుపెట్టి పరిహాసం ఆడేవారు. చేలము అనగా వస్త్రము. కుచేలము అనగా చిరిగిపోయిన బట్ట. చిరగని బట్ట కట్టడం కుచేలునికి తెలియదు. కుచేలుని బార్య అటుకులను చిరిగిపోయిన ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడి వేసి ఇచ్చింది. దానిని తీసుకుని కుచేలుడు కృష్ణుని వద్దకు బయలుదేరాడు. కుచేలుడు చిరిగిపోయిన బట్టలతో చెమట కంపుతో, రథములనుండి వస్తున్న ధూళి అంతా వంటిమీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో ఆయన నడిచి నడిచి, చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు. ఏమి తిన్నాడో, ఏమి తినలేదో ఈశ్వరునికి ఎరుక. ద్వారకా పట్టణ సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన సఖుడయిన గోవిందుడు ఎక్కడ ఉన్నాడోనని వాకబు చేసి కృష్ణ భగవానుడు ఉన్న ఇంటిని తెలుసుకున్నాడు. ఇంటిముందర పెద్ద పెద్ద శూలములు పట్టుకొని భటులు కాపలా కాస్తున్నారు. తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో, కృష్ణ పరమాత్మ తనని గుర్తు పడతాడో పట్టడో అనుకున్నాడు. రాజభటులకు ఏదైనా కానుక ఇచ్చి లోపలికి వెళదాము అంటే తన దగ్గర కృష్ణునికి ఇవ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప వేరొకటి లేదు. వాసుదేవుడిని చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారం అని అనుకుని సౌధం దగ్గరికి వెళ్లి తెరతీసి భటులను చూశాడు. భటులు ‘ఎవరు కావాలి అని అడిగారు. నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడిని అని చెప్పాడు. వాళ్ళు ఆయనను ఎగాదిగా చూశారు. ఆయన చాలా దయనీయమయిన స్థితిలో కనపడ్డాడు. ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ వున్న ద్వారపాలకులకు తెలుసు. అందుకని వారు వెళ్లి కృష్ణ పరమాత్మతో ‘ మీకొరకని చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడనని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నాడు’ అని చెప్పారు. కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉన్నాడు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలుడు కనిపించాడు. కుచేలుని అంతదూరంలో చూసి ‘కుచేలా ఎప్పుడు వచ్చావు?’ అని పలకరిస్తూ ఒక్కసారి మంచం మీద నుంచి క్రిందకు దూకి పరుగెత్తుకుంటూ వెళ్లి కుచేలుడిని గట్టిగా కౌగలించుకున్నాడు. కుచేలా ఎన్నాళ్ళకు నిన్ను చూశాను. లోపలికి రావలసింది’ అని కుచేలుని చేయి పట్టుకుని గబగబా లోపలికి తిన్నగా తన శయన మందిరంలోకి తీసుకువచ్చాడు. అక్కడ ఒక పాన్పు ఉన్నది. రుక్మిణీ దేవి, తాను తప్ప అన్యులు ఆ పాన్పును ముట్టరు. అటువంటి హంస తూలికా తల్పం మీద కుచేలుని కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవిని పిలిచి బంగారుచెంబుతో నీళ్ళు తెప్పించి ఆయన కాళ్ళకింద పళ్ళెం ఉంచి ఆదిలక్ష్మియైన రుక్మిణీదేవి నీళ్ళు పోస్తుండగా కృష్ణపరమాత్మ కుచేలుని కాళ్ళుకడిగాడు. ఏ తల్లి కనుచివరి చూపు తగిలితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో ఆ లక్ష్మీదేవి నీళ్ళు పోస్తుండగా, సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతమయిన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు. శిరస్సు వంచి ఆ నీళ్ళు తన శిరస్సు మీద కిరీటం మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తలమీద చల్లాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చల్లాడు. ఆయన ఎంతో దూరం నుంచి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన ఒంటినిండా గంధం రాశాడు. ఒక విసనకర్ర పట్టుకొని విసురుతున్నాడు. కృష్ణ పరమాత్మ చేసిన హడావుడికి రుక్మిణీ దేవి తెల్లబోయింది. ఆమె కూడా తామరపువ్వులతో చేసిన విసనకర్రను తెచ్చి కుచేలునికి విసురుతున్నది. ఆ గాలి ఒంటికి తగిలి ఆయన సేదతీరాడు. మంచి ధూపమును ఆయనకు చూపించాడు. మణులతో కూడిన దీపములతో ఆయనకు నీరాజనం ఇచ్చాడు. తరువాత ఎంతో సంతోషంగా కుచేలునికి దగ్గరగా కూర్చున్నాడు. పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు తన చేతులలో పెట్టుకుని స్నేహితుని వంక చూసి యోగక్షేమములు అడిగాడు. కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవరూ చూడలేదు.

ఏమి తపంబు సేసెనొకొ! యీ ధరణీదివిజోత్తముండు తొల్

బామున! యోగివిస్ఫుర దుపాస్యకుడై తనరారు నీ జగ

త్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్న; వా

డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్?

ఏమి ఆశ్చర్యము! ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూశాము, ఎందరో మహర్షులు వచ్చినప్పుడు చూసాము. అందరినీ దర్బారు హాలులో కూర్చోబెట్టి మాట్లాడేవాడు. అంతేకానీ ఈ బ్రాహ్మణుడు చూస్తే దరిద్రుడిలా ఉన్నాడు. ఏమి తపస్సు చేశాడో! మహాయోగులైన వారు తపస్సు చేస్తే తప్ప దొరకని పరమాత్మ ఈవేళ ఈ బ్రాహ్మణునకు ఎంత సేవ చేశాడు. ఆ తల్పం మీద రుక్మిణీ కృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం ఇంతవరకు చూడలేదు. ఈ బ్రాహ్మణుడు దానిమీద కూర్చోవడమా! అసలు ఈయన ఎవరు? అని వాళ్ళు ఆశ్చర్య పోతున్నారు. కృష్ణ పరమాత్మ కుచేలునితో ఓ బ్రాహ్మణోత్తమా! నీవు వివాహం చేసుకున్న స్త్రీ చాలాకాలం వేదం నమ్ముకును వేదపాఠం చెప్పుకున్న బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. అట్టి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తను అనుసరించి సుశీలయై ఉంటుంది. నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్యయందు బిడ్డలయందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా భార్యాబిడ్డలను చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్న వాడిలా నాకు కనపడుతున్నావు. అవునా?' అని అడిగాడు. పిమ్మట ఇద్దరూ కలిసి భోజనం చేశారు. భోజనానంతరం మరల ఇద్దరూ వచ్చి కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలమును తానే స్వయంగా చేసి తెచ్చి వేసుకోమని కుచేలునికి ఇచ్చాడు. ఆరోజున కృష్ణుడు పూర్తిగా కుచేలునితోనే గడిపాడు. కృష్ణ పరమాత్మ తాను కుచేలునితో గడిపిన చిన్ననాటి ముచ్చట్లను తలుచుకున్నాడు. కృష్ణ పరమాత్మ చూపిస్తున్న ఈ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేక పోతున్నాడు. కుచేలా ఎవరి దగ్గరికయినా వెడితే ఏమయినా పట్టుకు వెళ్ళాలని మన గురువుగారు సాందీపని అంటూ ఉండేవారు కదా! మరి నువ్వు నాకు ఏమిటి తెచ్చావు?' అని గబగబా కుచేలుడిని తడిమేస్తున్నాడు. కుచేలుడు సిగ్గు పడిపోయాడు. ఆయన లక్ష్మీనాథుడు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకు తాను ఏమి ఇస్తాడు? చిరిగిపోయిన ఉత్తరీయం మూట కట్టి ఉన్న అటుకులను చూశాడు. కుచేలా! చాలా ఐశ్వర్య వంతుడనని నాకు చాలామంది కానుకలు పట్టుకువచ్చి ఇస్తుంటారు. అవి వాళ్ళందరూ నాయందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు. తమకు ఉన్నాయని ఆడంబరమునకు తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాటిని నేను ముట్టుకోను. ఒక ఆకు కాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, కొబ్బరి నీళ్ళను గాని ఎవరయినా భక్తితో తెచ్చి ఇస్తే వాటిని నేను పుచ్చుకుంటాను. భక్తితో తెచ్చిన వాటికి పెద్ద పీట వేస్తాను. ఆడంబరమునకు తెచ్చిన వాటిని పక్కన పెట్టేస్తాను. అని కుచేలుని వద్ద ఉన్న అటుకుల మూటను తీసుకొని విప్పి పిడికెడు అటుకులు తీసుకుని నోట్లో పోసుకున్నాడు. అలా పోసుకునే సరికి పదునాలుగు భువనభాండములలో ఉన్న సమస్త జీవరాశుల కడుపునిండి బ్రేవుమని త్రేన్చాయి. కృష్ణుడికి ఇంకా ప్రీతి ఆగక మరియొక పిడికెడు తీసి పోసుకుంటున్నాడు. దీనిని రుక్మిణీదేవి చూసింది. వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చేయి పట్టుకుని, కృష్ణా! మీరు తిన్నది చాలు. ఇహలోకమందు పదితరములు తినడానికి కావలసిన ఐశ్వర్యము భక్తి, జ్ఞానము, మోక్షము అన్నీ కుచేలునికి ఇచ్చారు. ఇంకొక పిడికెడు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్ములను కూడా కుచేలునికి దాసులుగా ఇచ్చేస్తారు. ఇంకచాలు’ అన్నది. ఆ తల్లికి అన్నీ తెలుసు. పరమాత్మ కుచేలుడు ఇచ్చిన అటుకులను ఎందుకు స్వీకరించాడు? గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేసాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనస్సులో ఈ కోరిక నాకు తీరితే బాగుండును అన్న కోరిక మాత్రం ఆయనకు లేదు. ఈశ్వరుని సేవ చేయడమే తన జీవితమునకు ధన్యము అని చేశాడు. దానివలన బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకు మనస్సులో మాత్రం కోరిక లేదు. తాను ఇంత దరిద్రంలో ఉన్నా ఈశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలని భ్రాంతి కుచేలునికి లేదు. ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడిగింది. స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉండలేడు. కుచేలుడు తెల్లవారు ఝామున లేని మరల తనకి ఉన్న మాసిపోయిన దుస్తులనే ధరించి ‘కృష్ణా! నేను వెళ్ళివస్తాను’ అని చెప్తే కృష్ణ పరమాత్మ గడపదాటి బయటకు వచ్చి కుచేలునికి వీడ్కోలు చెప్పాడు. కుచేలుడు తన ఇంటి దారిపట్టి నడిచి వెళ్ళిపోతూ ఏమి నా భాగ్యం. ఏ పరమాత్మ దర్శనం కొన్ని కోట్లమంది అడుగుతారో అటువంటి వానితో కలిసి నేను కూర్చున్నా నేను తెచ్చిన అటుకులు తిన్నాడు. నా సఖుడిది ఏమి సౌజన్యం. నాకు ఇంతకన్నా జీవితంలో ఏమి భాగ్యం కావాలని అనుకున్నాడు. తన భార్య కృష్ణ పరమాత్మను సంపద అడగమని పంపించిందని గుర్తుకు వచ్చింది. కానీ కృష్ణుడు తన బట్టలను చూసి అయినా తాను మిక్కిలి బీదవానిగా ఉన్నాడని గ్రహించి సంపదను ఇవ్వవచ్చు కానీ అలా ఇవ్వలేదు’ అని అనుకున్నాడు. ఇంత దరిద్రంలో ఉన్నాను ఆ కృష్ణుడు నాకెప్పుడూ గుర్తు ఉంటున్నాడు. ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయనను నేను మరిచిపోయి పాడయిపోతానేమోనని దరిద్రమునే ఉంచి ఆయన నా మనస్సులో ఉండి పోయేటట్లు నాకు వరమును ఇచ్చాడని అనుకున్నాడు. తన ఇల్లు ఉన్నచోటికి వెళ్ళి చూశాడు. అక్కడ సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌధం ఒకటి కనపడింది. ఆ సౌధమునకు చుట్టుప్రక్కల పెద్ద ఉద్యానవనములు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎంతోమంది పరిచారికలు అటుఇటూ తిరుగుతున్నారు. ఎక్కడ చూసిన రత్నరాశులు ప్రోగుపడి ఉన్నాయి. ఇటువంటి ఇల్లు ఏ మహాపురుషునిదో తన పూరి ఇంటి స్థానంలో అత పెద్ద సౌధం ఎక్కడి నుంచి వచ్చినదా అనుకుని ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఈయనను చూడగానే పరిచారికలు గబగబా బయటకు వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనను మేళతాళములతో లోపలికి తీసుకువెళ్ళారు. అది తన ఇల్లేనని తెలుసుకున్నాడు. తన భార్య పట్టు వస్త్రములను కట్టుకుని అనేకమైన బంగారు ఆభరణములను ధరించి ఎదురువచ్చి భర్త కాళ్ళకు నమస్కరించి వారి పూరి గుడిసె స్వామి కృప వలన ఇలా అయిందని చెప్పింది. కృష్ణ పరమాత్మ అంత ఐశ్వర్యమును ఇచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు ఇంట్లో ఐశ్వర్యమును అనుభవించినా మనస్సులు మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకుని హాయిగా గోవింద నామము చెప్పుకుంటూ పరవశించి పోతూ ఇహము నందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి, అంత్యమునందు జ్ఞానము చేత మోక్షసిద్ధిని కుచేలుని భార్య బిడ్డలు పొందారు. ఇంత పరమపవిత్రమయిన కుచేలోపాఖ్యానమును ఎవరు వింటున్నారో వారికి గొప్ప ఫలితం చెప్పబడింది. ఎవరు దరిద్రుడయిన కుచేలుని సంపత్తి కలవానిగా కృష్ణ పరమాత్మ చేసినట్టి ఈ ఆఖ్యానమును వింటున్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ పాదములయందు భక్తికలిగి, వారందరికీ కూడా కీర్తి యశస్సు నిలబడి అంత్యమునందు మోక్షమును పొందుతారని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

ధర్మజుని రాజసూయ యాగము

 Srimadhandhra Bhagavatham -- 95 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

ధర్మజుని రాజసూయ యాగము


రాజసూయ యాగం జరుగుతుంటే భూమండలం మీద ఉన్న రాజులందరూ వచ్చారు. రాజసూయ యాగం అంటే మాటలు కాదు. బంగారు నాగలితో భూమిని దున్నారు. వచ్చిన వారందరికీ సక్రమమయిన మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏ పనులు చేయాలో ధర్మరాజు గారు నిర్ణయించారు. కర్ణుడికి ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ సంతోషం. ఒకరికి శ్రద్ధా భక్తులతో దానం యివ్వడానికి కర్ణుడే తగినవాడు. కర్ణుడికి, పాండవులకి పడదు. ఒక మంచిపని జరుగుతున్నప్పుడు ఆ మంచిపని సక్రమంగా జరగడం కోసం, రాజసూయ యాగంలో దానములు చేయడానికి ధర్మరాజు గారంతటి వాడు కర్ణుని నియమించాడు. పదవులు ఎంతో నిష్పక్షపాతంగా ఇచ్చాడు. వంటశాలలో ఉండి రుచికరమయిన పదార్థములను తయారుచేయించమని పురమాయించి భీమసేనుడిని వంటశాలలో పెట్టాడు. వచ్చిన వాళ్ళలో పరమ పూజనీయులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్షతలు వేయడానికి వస్తే ఇంటి యజమాని వారు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయే వరకు వారి పక్కన ఉండి వారికి సపర్య చేసి వారికి ఏమి కావాలో చూడడానికి బాధ్యతా కలిగిన ఒక వ్యక్తిని పెట్టాలి. ఈ పనికి కృష్ణపరమాత్మ దగ్గర అర్జునుని పెట్టారు. యాగమునందు వైదిక క్రతువులో వాడబడే సమస్త పదార్థములను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే సిద్ధంగా అందించడానికి వీలుగా ఆ బాధ్యతను నకులుడికి అప్పగించాడు. వచ్చిన వాళ్ళలో నారదమహర్షి, అత్రిమహర్షి వంటి దేవగురువులు ఉంటారు. వారిని పూజించడానికి తమ్ముడయిన సహదేవుడిని వినియోగించాడు. పదార్థములనుతెప్పించి రాజసూయ యాగ క్రతువు జరిగింది. అంత గొప్ప యాగం పూర్తయిన తర్వాత చివర అక్కడ ఉన్నవారిలో జ్ఞానము చేత వృద్దుడయిన వారిని ఎంచి ఆయనకు అగ్రపూజను చేస్తారు. సభలో అగ్రపూజను ఎవరికి చెయ్యాలన్న ప్రశ్న వచ్చింది. అక్కడ ఎందరో ఋషులు, మహర్షులు, దేవగురువులు ఎందరో రాజులు ఉన్నారు. అంతమంది గొప్పవారు ఉన్న సభలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి? అని ధర్మరాజు గారు ఆలోచన చేస్తున్నారు. వయస్సులో చిన్నవాడయినా బుద్ధిలో బృహస్పతి అయిన సహదేవుడు లేచి ‘అన్నయ్యా! అగ్రపూజ చేయడానికి ఎవరు తగినవాడని ఆలోచిస్తున్నావా? కృష్ణుడు అర్హుడు అని సూటిగా అనలేదు. సహదేవుడు కృష్ణుని ఉద్దేశించి ఈయన ఈశ్వరుడు. ఇక్కడ నిలబడిన ఈయనే బయట వెళ్ళిపోతున్న కాలరూపము. ఒక ప్రదేశములా ఎక్కడికక్కడ కనపడుతున్న ఈ సమస్త భూమండలము ఆయనే. నీవు చేసిన యాగము ఆయనే. ఆ యజ్ఞము ఆయనే. చేసినవాడు ఆయనే. ఇన్నిగా వెలుగుతున్న ఈశ్వరుడు ఇవాళ మన కళ్ళెదుట మన మాంస నేత్రముతో చూడడానికి ఎదురుగుండా వీలయిన రీతిలో రక్షకుడై, సర్వ కాలముల యందు పాండవులు బాగుపడాలని కోరుకున్న వాడయి యాగమునకు వచ్చి నిర్వహించి జరాసంధుని వధ చేయించిన మహాపురుషుడు ఇక్కడ కూర్చుని అండగా ఉండగా ఇంకా ఎవరెవరని వెతుకుతారు. ఆయనకు అగ్రపూజ చెయ్యండి’ అన్నాడు.

ఈమాట చెప్పేసరికి ధర్మరాజుగారు పొంగిపోయారు. మాట చెప్పడం కాదు. చెప్పేమాట ఎదిరించలేనిదై ఉండాలి. అదీ ఆవిష్కరణ అంటే. కృష్ణుడు ఎవరో చెప్పాడు. కృష్ణుని సరిగా అర్థం చేసుకున్నాడు. ఎంతో జ్ఞాని సహదేవుడు. అలా చెప్పగానే ధర్మరాజుగారు ద్రౌపదీ దేవిని తీసుకొని బంగారు జలపాత్రను చేతిలో పట్టుకొని కృష్ణుని వద్దకు వెళ్ళారు. అయిదుగురు అన్నదమ్ములు ద్రౌపదీదేవి కుంతీదేవి అందరూ వెళ్లి కృష్ణ పరమాత్మ పాదముల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్ళెమును తీసుకువచ్చి ఆయన కాళ్ళకింద పెట్టారు. ద్రౌపదీదేవి బంగారుపాత్ర లోంచి నీరు పోస్తుంటే కృష్ణ పరమాత్మ కాళ్ళను కడిగారు. ధర్మరాజు గారు కాళ్ళు కడుగుతుంటే నలుగురు అన్నదమ్ములు పుష్పములు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్ళు పోస్తుంటే ఆ కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగి పళ్ళెం లోకి వచ్చినటువంటి ఆ పాద ప్రక్షాళన జలమును తీసుకుని ధర్మరాజుగారు తన శిరస్సు మీద చల్లుకుని, తదుపరి కుంతీదేవి శిరస్సు మీద ద్రౌపదీ దేవి శిరస్సు మీద తమ్ముళ్ళ శిరస్సుల మీద చల్లారు. బంగారువన్నె గల వస్త్రద్వయమును తీసుకు వచ్చి కృష్ణ పరమాత్మకు బహూకరించి, అపర సూర్య భగవానుడా అన్నట్లుగా వెలిగిపోతున్న హారములు తెచ్చి ఆయన మెడలో వేసి కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఆయనకు తాంబూలం ఇచ్చి తమతమ శిరస్సులు ఆయన పాదములకు తగిలేటట్లుగా పరమ వినయంతో అయిదుగురు అన్నదమ్ములు నమస్కరించి అగ్రపూజ చేసి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారు. సభలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు. మూడిన వాడు ఒకడు ఉంటాడు. వాడికి ఈశ్వర ధిక్కారం ప్రారంభం అవుతుంది. శిశుపాలుడు లేచి

'ఈయన గోపాలుర కుటుంబంలో పుట్టాడు. యథార్థమునకు ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరికీ తెలియదు. కొంతమంది ఇతడు దేవకీ వసుదేవులకు పుట్టాడని అంటారు. చాలామంది ఇతడు కళ్ళు తెరిచేసరికి యశోదానందుల దగ్గర ఉన్నాడని అంటారు. ఈయన కులం తెలియదు. ఈయన గోత్రం తెలియదు. వావి వరుసలు లేవు. ఎంతమంది గోపకాంతలతో రమించాడో. ఎంతమందితో తిరిగాడో ఇది నడువడని చెప్పడం కుదరదు. అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మానమర్యాదలు ఎరుగని వాడు. ఇటువంటి వానికి అగ్రపూజ చేయడమా! సభలో వీనికన్నా తగినవారు లేరా! కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి? కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు గాను ఇప్పుడే కృష్ణుడిని శిక్షిస్తాను’ అని తన గదాదండము తీసుకుని కృష్ణుని మీదకు వెళుతున్నాడు.

కృష్ణ పరమాత్మ వీనిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రమును స్మరించి ఆ చక్రమును శిశుపాలుని మీదికి ప్రయోగించారు. అప్పటికి శిశుపాలుడు చేసిన నూరు తప్పులు పూర్తయిపోయాయి. నూరు తప్పుల వరకు కాపాడతానని మేనత్తకు మాట ఇచ్చాడు. శిశిపాలుడు చేసిన అధిక్షేపణతో నూరు తప్పులు పూర్తయిపోయాయి. సుదర్శన చక్రమును ప్రయోగించగానే అది శిశుపాలుని కుత్తుకను కత్తిరించి కింద పడేసింది. అతని తల కింద పడిపోగానే సభలో హాహాకారములు మిన్ను ముట్టాయి. అందరూ కూడా దుర్మార్గుడైన శిశుపాలుడు కృష్ణ పరమాత్మ జోలికి వెళ్ళి మరణించాడు అన్నారు. తదనంతరం పాండవులందరూ అవబృథ స్నానమును చేశారు. యాగము అంతా పూర్తయిపోయిన తర్వాత యాగకర్తలు అందరూ వెళ్లి స్నానం చేస్తారు. అలా చక్కగా వారంతా అవబృథ స్నానం చేసి తిరిగి వచ్చారు. ధర్మరాజుగారు పరమసంతోషంగా రాజ్యం ఏలుతున్నారు. కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరమునకు చేరుకుంటున్నారు.

శ్రీకృష్ణుడు సాళ్వుని, దంతవక్త్రుని చంపుట

ఈలోగా సాళ్వుడు అనబడే రాజు కృష్ణ పరమాత్మ మీద పెంచుకున్న ఆగ్రహం చేత పరమశివుని గురించి ఘోరమయిన తపస్సు చేశాడు. రోజుకు గుప్పెడు మట్టి మాత్రమే తినేవాడు. కడుపులో కార్పణ్యం పెంచుకున్నవాడు ఎంత తపస్సు చేస్తే మాత్రం ప్రయోజనం ఉంటుంది. పరమశివుడు ప్రత్యక్షమై వరమును కోరుకోమన్నాడు. సాళ్వుడు తన యిష్టం వచ్చినట్లుగా తిరిగే విమానం కావాలని పరశివుని కోరాడు. పరమశివుడు మయుడిని పిలిచి ఒక విమానమును నిర్మింపజేసి సాళ్వునికి ఇచ్చాడు. ఆ విమానమునకు సౌభకము అని పేరు. ఆ విమానమును ఎక్కి ద్వారకా నగరం మీదకి వచ్చి ద్వారకా నగరంలో ఉండే అంతఃపుర కుడ్యములను, గోపురములను తన గదా దండంతో తొలగదోస్తూ నానా అల్లరి ప్రారంభించాడు. వెంటనే అక్కడ ఉండే ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వారు యుద్దమును ప్రారంభం చేశారు. గొప్ప యుద్ధం జరుగుతోంది. ఈలోగా కృష్ణ పరమాత్మ చేరుకున్నారు. దుర్నిమిత్తములు కనపడ్డాయి. రావణాసురుడు మాయాసీతను సృష్టించినట్లు సాళ్వుడు కూడా మాయా వసుదేవుడిని సృష్టించి కృష్ణ పరమాత్మ కళ్ళ ఎదుటే ఆ మాయా వసుదేవుడిని సంహరించాడు. కృష్ణ పరమాత్మ అంతటివారు తండ్రి మరణిస్తే ఎలా ఖిన్నుడవుతారో అలా ఖిన్నులయారు. మిగలిన వాళ్ళు ‘ఇది జరగలేదు వసుదేవుడు లోపలే ఉన్నాడు’ అని చెప్పారు. ఆయన సుదర్శన చక్రమును ప్రయోగిస్తే సాళ్వుడు కూడా మరణించాడు. అతని విమానం తుత్తునియలు అయిపోయింది.

తదనంతరం దంతవక్త్రుడు వచ్చాడు. వీడిని కూడా కృష్ణ పరమాత్మ సంహరించాడు. శిశుపాల దంతవక్త్రులిద్దరూ మరణించిన తరువాత వారిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. గతంలో శ్రీమహావిష్ణువు ద్వారపాలకులయిన జయవిజయులకు ఇవ్వబడిన శాపం చేత మూడు జన్మలలో రాక్షసులుగా జన్మించాలి. ఈ జన్మలో వారు శిశిపాల దంతవక్త్రులుగా జన్మించి వారిరువురూ శ్రీకృష్ణ పరమాత్మచే సంహరింపబడి ఆయనలో లీనమయిపోయారు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

జీవిత లక్ష్యం.

 *🕉🌹నేను అనేది ఈ శరీరం కాదని, ఆత్మ అని తెలుసుకోవడమే 

 జీవిత లక్ష్యం.🌹🕉*


*నేను*


*నేను అనేది ఈ శరీరం కాదని, ఆత్మ అని తెలుసుకోవడమే మానవ జీవిత లక్ష్యం. మనుషులంతా ఆత్మ స్వరూపులని జ్ఞానులంటారు. శరీరంతో ఆత్మ తాదాత్మ్యం చెందినప్పుడు మనిషిలో ‘నేనే అన్నింటికీ కర్తను, అనుభవించే భోక్తను’ అన్న అహంకారం కలుగుతుంది. ఈ భావనలే మానవ జీవిత వినాశనానికి దారితీస్తున్నాయి. పంచకోశాలు- అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అన్నవి ఒకదానికంటే మరొకటి సూక్ష్మమైనవి. ఇవి స్థూలదేహాన్ని, ప్రాణాన్ని, మనసును, బుద్ధిని, అంతరాత్మను ఆవరించిఉండి మసకబారుస్తాయి. ఈ శరీరం అన్నగతమైంది. ఆహారం లభిస్తే ఉంటుంది, లేదంటే నశిస్తుంది. అందువల్ల దీన్ని అన్నమయ కోశం అంటారు. కర్మేంద్రియాలను నడిపించే ప్రాణ శక్తిని ప్రాణమయ కోశం అంటారు. ఇది అన్నమయ కోశం అంతటా వ్యాపించి ఉంటుంది. జ్ఞానేంద్రియ పంచకాన్ని, మనసును కలిపి మనోమయకోశం అంటారు. మనిషిలోని అహానికి ఇదే ప్రధాన కారణం. విజ్ఞానమయ కోశం జీవాత్మకున్న అన్ని అవస్థల్లోనూ ఆత్మను అనుకరిస్తుంటుంది. జ్ఞానం ఉన్నా శరీరంతో, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందుతుంటుంది.* *మనిషి అధోగతికి కారణమవుతుంది. అనాది నుంచి అస్తిత్వం కలిగిఉండి, అహంకార స్వభావంతో, సమస్త వ్యాపారాలు (కర్మలు) జీవాత్మ చేత చేయించేది విజ్ఞానమయ కోశమే. మనకు ప్రీతినిచ్చేది పొందినప్పుడు అనుభవానికొచ్చేది ఆనందమయ కోశం. అనాత్మలైన ఈ అయిదు కోశాలను వివేకంతో అధిగమించినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది.*

*పరబ్రహ్మాన్ని ఆకాశంతో పోలుస్తారు మహాత్ములు. అది నిర్మలంగా, దోషరహితంగా, ఎల్లలు లేనిదిగా, నిశ్చలంగా, నిర్వికారంగా, లోపలా బయటా అనే తేడాలు లేకుండా, ఒకే ఒక్కటిగా కనిపిస్తూ ఉంటుంది. అదే అంతరాత్మ.*

*కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే శత్రువులను ఓడించి, మనసును అధీనంలో ఉంచుకుని తానే పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకొన్నవాడు- బ్రహ్మవేత్త అంటారు వివేక చూడామణిలో ఆది శంకరాచార్యులవారు. ఆకలి, దప్పిక, దుఃఖం, క్షీణించడం, మరణించడం, భ్రాంతి అనేవి షడూర్ములు. వీటికి అతీతంగా ఉంటూ హృదయంలో సదా పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉండాలన్నది పురాణ వచనం.*

*విషయ వాంఛలను విడిచిపెట్టడం అంత సులువు కాదు.* *వేదవేదాంగాల్ని, పురాణాలను వింటూ, పఠిస్తుంటే ముక్తి మార్గం పట్టినట్టు కాదు. ఇవన్నీ పైపై మెరుగులు.*

*తానేమిటో తెలుసుకోలేని వ్యక్తి మరో వ్యక్తికి ఎన్నటికీ దారి చూపించలేడు. డాంబికాలకు తలొగ్గడం చిల్లి పడవలో ప్రయాణం వంటిది!*

*నిత్యానిత్య విచక్షణ చేయగలిగి, వేద వాంగ్మయంపై విశ్వాసం కలిగి, పరమాత్మపై ఏకాగ్ర దృష్టి కలవాడై, మోక్షసాధన చేసేవాణ్ని పండితుడని అంటారు.*

*అనాదిగా ముముక్షువులు తగిన జ్ఞాన సముపార్జనతో, సాధనసంపత్తితో, అజ్ఞానాన్ని దూరం చేసుకొని ఆత్మజ్యోతి దర్శనంతో అఖండంగా ప్రజ్వరిల్లుతూ నిస్వార్థంగా మనకు దారి చూపారు.*

*ఆ దారి పట్టుకోగలగాలి. వాసనా వాంఛల్ని ఉల్లిపొరల్ని వలిచినట్లు వదిలించుకుంటూ శ్రద్ధగా, దీక్షగా ఏ దశలోనూ నమ్మకం సడలకుండా, ఆ దారిలో ప్రయాణించేవారు, ఆత్మ సారథ్యంలో, శరీరాన్ని జాగ్రత్తగా పరమాత్మలో లీనం చేయడానికి ఉపక్రమించారు. వారి జీవితం మార్గదర్శకం, అనుసరణీయం.✍️

శ్రీకృష్ణుని మహిమ

 Srimadhandhra Bhagavatham -- 94 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


శ్రీకృష్ణుని మహిమ నారదుండరయుట


నారదమహర్షి అన్ని లోకములు తిరుగుతున్నప్పుడు ఆయనతో ఎవరో ‘నారదా, కృష్ణుడు పదహారు వేలమందిని పెళ్లి చేసుకున్నప్పుడు నీవు వెళ్ళావా? ఆయన అంతమందిని ఎన్ని రోజులు పెళ్ళి చేసుకున్నాడు? ఆయన నరకాసురుడి మీదికి యుద్ధమునకు వెళ్ళినపుడు నరకాసురుడు తీసుకువచ్చి కారాగారంలో బంధించి దాచిన పదహారు వేలమంది రాజ కుమార్తెలను తన రాజధానికి తీసుకువచ్చి అందరికి సౌధములు నిర్మించి ఒకే ముహూర్తంలో ఒకే కృష్ణుడు పదహారు వేలమంది కృష్ణులై తాళి కట్టారట’ అన్నారు. ఈ మాటలు విని నారదుడు ఆశ్చర్యపోయి ఇది ఎలా జరుగుతుంది? అన్నాడు. అనగా అంతటి జ్ఞాని ఎటువంటి మోహమునకు గురి అయ్యారో గమనించాలి. తాళి అయితే కట్టాడు. మరి సంసారం ఎలా చేస్తూ ఉంటాడు? అనుకుని చూసి వద్దామని కృష్ణుని దగ్గరకు బయలుదేరి భూలోకమునకు వచ్చాడు. ద్వారకానగరంలోకి ప్రవేశించాడు. ద్వారకా నగరం పరమ రమణీయంగా ఉన్నది. ఆ నగరంలోని ఒక ఇంట్లోకి వెళ్ళాడు. అది కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్న స్త్రీలలో ఒకస్త్రీ గృహం. ఆవిడ తామర పూవువంటి తన చేతితో వింజామర చేత పట్టి కృష్ణ భగవానునికి విసురుతోంది. భార్యచేత సేవలు పొందుతున్నాడని వెనక్కి వెళ్ళిపోబోతుండగా అటు తిరిగి కూర్చుని సేవలందుకుంటున్నవాడు వెనక కన్ను లేకుండానే ఇతనిని గమనించి తాను కూర్చున్న ఆసనం దిగి నారదునికి ఎదురు వచ్చి అలా వెళ్ళిపోతున్నారే నారదా! లోపలికి రండి. మీరు నాతో ఏదయినా పని ఉండి వచ్చారా? మీరు ఏ పని చెప్పినా ఆ పనిని ఔదల దాల్చి చేయడానికి ఈ సేవకుడు సిద్ధంగా ఉంటాడు ’ అన్నాడు. నారదుడు ‘కృష్ణా! మహానుభావా! దామోదరా నీవు భక్తులపాలిట సర్వ కాలముల యందు కల్పవృక్షము వంటి వాడివి. దుష్ట జనులను నిగ్రహించడానికి నీవు ఇటువంటి అవతారములను స్వీకరిస్తావు. ఏ నీ పద సేవ చేయాలని బ్రహ్మాది దేవతలు కోరుకుంటారో అటువంటి నీ పాదపద్మముల యందు నిరంతరమూ నా మనస్సు వశించి ఉండే వరమును నాకు ఇవ్వవలసినది’ అని నారదుడు కృష్ణుని అడిగాడు. బయటికి వచ్చి ఈ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పక్క ఇంట్లో ఎలా ఉండగలడు అనుకుని ఆ ఇంట్లోకి తొంగి చూశాడు. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్లి ఇలా తలుపు తీసి చూశాడు. ఎక్కడికి వెళ్ళినా సంసారిలాగే కనపడుతున్నాడు. ఎక్కడా పరబ్రహ్మలా లేడు. ఎక్కడికి వెడితే అక్కడే ఉన్నాడు. అన్నీ చూసి బయటకు వచ్చి అంతఃపురమునందు నిలబడిన నారదుడు – ఏమి ఆశ్చర్యము! ఏమి ఆనందము! ఏమి కృష్ణ పరమాత్మ! మహానుభావుడు ఇంతమందితో రమిస్తున్నాడు. ఎలా? ఏకకాలమునందు అగ్నిహోత్రము ఎన్ని వస్తువులను కాల్చినా వాటి పవిత్రత కాని, అపవిత్రత కాని తనకి అంటనట్లు సూర్యకిరణములు బురద మీద పడినా, సజ్జనుడి మీద పడినా, దుర్జనుడి మీద పడినా సూర్యునికి అపవిత్రత లేనట్లు ఇన్ని ఇళ్ళల్లో సంసారం చేస్తున్నవాడు సంసారాతీతుడై ఉన్నాడు’ అని పొంగిపోయి ఆనందంతో వైకుంఠమునకు వెళ్ళిపోయాడు.


ఇది కృష్ణ పరమాత్మ ఆశ్చర్యకరమయిన సంసార రీతి. దీనివలన మనకు ఏమి తెలుస్తున్నది? కృష్ణ పరమాత్మ అన్ని వేలమంది కన్యలను వారిని ఉద్ధరించాలని చేసుకున్నాడు. ఇది కృష్ణ పరమాత్మ వ్యాపకత్వమును, విష్ణు తత్త్వమును ఆవిష్కరిస్తుంది. కృష్ణుడి చేష్టితములను మీరు వేలెత్తి చూపించే ప్రయత్నం చేయకూడదు. నారదుడంతటి వాడు నమస్కరించి వెనుదిరిగాడు. మనం ఎంతటి వారము! ఈ లీల విన్న తరువాత పొంగిపోయి ఎవరు కృష్ణ పరమాత్మకి నమస్కరించి వ్యాపకత్వము ఉన్న స్వామి అంతటా ఉన్నాడని గ్రహించి ఆనందిస్తారో వారికి స్వామి ఒక వరం ఇచ్చారు. ఎవరయితే పరమభక్తితో కృష్ణ భగవానుని సంసారమును నారదుడు చూసే ప్రయత్నము చేసి తాను ఆనందించిన కథా వృత్తాంతమును విని పరమాత్మకు నమస్కరిస్తున్నారో, వారియందు కృష్ణ భక్తి ద్విగుణీకృతమై వారు భగవంతుడిని తొందరగా చేరుకుంటారు. దానితో పాటు ఇహమునందు అపారమయిన ధనమును పొంది పశు, పుత్ర, మిత్ర, వనితాముఖ సౌఖ్యములన్నిటిని అనుభవించగల స్థితిని కృష్ణ పరమాత్మ వారికి కల్పిస్తాడని ఆ ఆఖ్యానమును పూర్తిచేశారు.


భీముడు జరాసంధుని వధించుట


ఒకనాడు కృష్ణపరమాత్మ నిండు పేరోలగంలో సభ తీర్చి ఉన్నాడు. ఒక బ్రాహ్మణుడు సభలోకి వచ్చి ఒక మాట చెప్పాడు. జరాసంధుడనే రాజు అనేకమంది రాజులను ఓడించి కారాగారంలో బంధించాడు. వారందరూ కూడా అనేకమయిన హింసలు పొందుతున్నారు. మీరు త్వరలో విచ్చేసి జరాసంధుడిని వధించి ఆ రాజులందరికీ స్వేచ్ఛ కలిగేటట్లుగా అనుగ్రహించ వలసినది’ అని కోరాడు. ఆమాటలు విన్న కృష్ణ పరమాత్మ సంతోషించి ‘తప్పకుండా మేము తొందరలో వచ్చి జరాసంధుడిని వధిస్తాము’ అని మాట ఇచ్చి ఈ సందర్భంలో ఏం చేస్తే బాగుంటుందో ఆలోచనను చెప్పమని ఉద్ధవుడిని అడిగారు. పరమాత్మ అన్నీ తెలిసు ఉన్న వాడయి ఉండి ఉద్ధవుడిని అడగడం ఎందుకు? ఈశ్వరుడికి సహకరించిన పుణ్యమును పదిమందికి కట్టబెడతారు. ఉద్ధవుడు 'ఇటువంటి కార్యం చేసేముందు ఒకపని చేస్తే బాగుంటుంది. ధర్మరాజు గారి చేత రాజసూయయాగం చేయించి ఆ యాగం చేసేటప్పుడు నాలుగు దిక్కులా ఉండే రాజుల పీచమణచడానికి నలుగురిని చంపవలెను కనుక ఆ సందర్భంలో జరాసంధుడిని కూడా వధించి రాజసూయ యాగం చేస్తే బాగుంటుంది మీరు అలా ఆలోచించండి’ అన్నాడు. ‘చాలామంచి ఆలోచన చెప్పావు’ అని కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు.


ధర్మరాజు కృష్ణ పరమాత్మకు ఎదురువచ్చి స్వాగతం పలికాడు. రాజసూయ యాగం చేయడానికి సంకల్పం జరిగింది. వెంటనే ధర్మరాజు గారు తన సోదరులను పిలిచి నలుగురినీ నాలుగు దిక్కులకు పంపారు. నాలుగు దిక్కులకు వెళ్ళిన వారు అన్ని దిక్కుల వాళ్ళని ఓడించి తిరిగి వచ్చారు. ధర్మరాజుగారి పేరు చెప్పగానే ఎవరూ వ్యతిరేకించిన వారు లేరు ఒక్క జరాసంధుడు తప్ప. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే కృష్ణ పరమాత్మ ‘ధర్మజా! నీవు బెంగ పెట్టుకోవద్దు. జరాసంధుడిని వధించడం కోసమని నేను అర్జునుడు భీముడు బ్రాహ్మణ రూపంలో వెళతాము. జరాసంధుడి దగ్గర ఒక మంచి అలవాటు ఉన్నది. వాడు బ్రాహ్మణులు ఏదయినా అడిగితే లేదనకుండా ఇచ్చేస్తాడు. బ్రాహ్మణరూపంలో వెళ్లి యుద్ధభిక్షను అడుగుతాము. ఇస్తానన్న తరువాత తప్పుకోవడానికి వీలులేదు. వాడు యుద్ధం చేస్తాడు. యుద్ధంలో జరాసంధుడు మరణిస్తాడు. తరువాత రాజసూయ యాగం చేద్దాము’ అని ముగ్గురూ బ్రాహ్మణ రూపములు ధరించి మగధ దేశమునకు వెళ్ళారు. జరాసంధుడు బయటకు వచ్చి మీకేమి కావాలి?' అని అడిగాడు. వాళ్ళు మాకు యుద్ధభిక్ష కావాలి అన్నారు. బ్రాహ్మణులయిన వారు యుద్ధ భిక్ష కోరడం ఏమిటి అని జరాసంధుడు వారి ముగ్గురిని తేరిపార చూశాడు. వాడేమీ తెలివి తక్కువ వాడు కాదు. వచ్చినవాళ్ళు కృష్ణ భీమార్జునులని గుర్తించాడు. కృష్ణుడిని చూసి ఒక మాట అన్నాడు. జరాసంధుడు కృష్ణుని చేతిలో 17 సార్లు ఓడిపోయాడు. 18 వ సారి జరాసంధుడిని తప్పించుకుని ద్వారకకు పారిపోయి అక్కడ ఉన్నాడు. 18 వ సారి కృష్ణుడు ఓడిపోయినట్లు నటించాడు. ఆయన అలా ఓడిపోయినట్లు నటించడానికి కారణమే జరాసంధుడు చచ్చిపోవడానికి కారణం అవుతుంది. 17 సార్లు తాను ఓడిపోయానన్నది జరాసంధుడు మరచిపోయాడు. 18 వ సారి కృష్ణుడు పారిపోయాడు అన్నది గుర్తు ఉన్నది.


'ఏమి వింతయ్యా! నేను యుద్ధమునకు వస్తే పారిపోయిన వాడివి ఇవాళ వచ్చి యుద్ధభిక్ష అడుగుతున్నావు. అడగడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు. కానీ నీతో యుద్ధం చేయడానికి నేను సిగ్గుపడుతున్నాను. పారిపోయిన వాడితో నాకు యుద్ధం ఏమిటి? నేను నీతో యుద్ధం చేయను” అన్నాడు. ఈశ్వరుని అధిక్షేపించడంలోనే వాని మరణం వచ్చింది.


‘కృష్ణా నాతో యుద్ధ భూమిలో నిలబడడం అంటే అంత తేలికయిన విషయం కాదు. ముందు నువ్వు పక్కకి వెళ్ళు. అర్జునుడు మంచి బలపరాక్రమములు ఉన్నవాడు. గాండీవం పట్టుకుంటే శత్రువులను దునుమాడుతాడు. కానీ అతడు నాకంటే చిన్నవాడు. వీనికన్న పెద్దవాడు భీముడు. అతడు మహా బలవంతుడు. పైగా వాయుపుత్రుడు. నాతో బలమునకు సరిపోతాడు’ అని మిక్కిలి కోపంతో చెయ్యి విసిరి యుద్ధమునకు రమ్మనమని అవతల వాళ్ళని లాగడం మొదలు పెట్టాడు. భీమసేనుడు జరాసందునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు.


వెంటనే మల్లయుద్ధం చేయడానికి వీలుగా ఒకచోట భూమిని సమతలంగా తయారుచేశారు. జరాసంధుడు భీమసేనుడు ఇద్దరూ మల్లయుద్ధం మొదలుపెట్టారు. భయంకరమయిన యుద్ధం సాగుతోంది. ఇద్దరూ కూడా ఒకరికొకరు తీసిపోని రీతిలో కొట్టుకుంటున్నారు. ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి నెత్తురోడి పోయి యిద్దరూ కూడా ఎర్రటిరంగులోకి మారిపోయారు. అలా కొట్టుకుంటున్నారు. బీమునిలో ఉండే తేజస్సు క్షీణించకుండా కృష్ణ పరమాత్మ తనలో ఉన్న తేజస్సును భీమసేనుడియందు ప్రవేశపెట్టారు. కృష్ణుడు తేజస్సు కలియడం వలన భీమసేనుడి తేజస్సు క్షీణించలేదు. జరాసంధుడిది పదివేల ఏనుగుల బలం. యుద్ధంలో వాడేమీ సామాన్యుడు కాదు. యుద్ధం జరగగా జరగగా జరాసంధుడి శక్తి క్షీణించడం మొదలుపెట్టింది. ఎడతెరపి లేని యుద్ధం చేస్తున్న భీమసేనుడి వంక చూసి కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆయన దృష్టిని ఆకర్షించేటట్లుగా పిలిచి చెట్టుకొమ్మ తీసి దానిని రెండుగా చీల్చి చూపించారు. ఆ సంజ్ఞను భీముడు అర్థం చేసుకుని జరాసంధుని ఒకకాలును తన రెండు కాళ్ళతో తొక్కిపట్టి రెండవ కాలును పట్టుకుని ఉత్తరించేస్తే, శరీరంలో సగభాగం తలవరకూ జరాసంధుడి శరీరం రెండు ఖండములుగా విడిపోయింది. ఆ రెండిటిని భీముడు అటూ యిటూ విసిరేశాడు. ఆ రోజున జరాసంధుడు మరణించాడు. అతని మరణానంతరం కృష్ణుడు అక్కడ ఉన్న రాజులందరినీ విడిపించాడు. ‘ధర్మ బద్ధమయిన పాలన చేసే వాడు ఎవడు ఉంటాడో, వానియందు నేను సర్వకాలముల యందు ప్రీతిని కలిగి ఉంటాను. అందుకని మీరు ధర్మ బద్ధంగా పరిపాలించండి’ అని చెప్పి ఆ రాజులకు హితోపదేశం చేసి విడిచి పెట్టేశారు. ఆ రాజులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. జరాసంధుని వద్ద ఉన్న ధనకనకవస్తు వాహనములను పట్టుకుని కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు. రాజసూయ యాగము చేయడానికి ధర్మరాజు సంకల్పం చేశారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

ప్రక్కటెముకలలో ( side ribs ) నొప్పి

 ప్రక్కటెముకలలో ( side ribs ) నొప్పి  - 


        జిల్లేడు ఆకు రసం , గొధుమ పిండితో కలిపి మెత్తగా పిసికి ఆ ముద్దను రొట్టెలాగా వెడల్పు చేసి ప్రక్కటెముకల పైన పట్టు వేయాలి . 


                  ఈ విధంగా చేయడం వలన నిమోనియా వలన కలిగే ప్రక్కటెముకల నొప్పి కాని , వాతం వలన కలిగే నొప్పి కాని బహుత్వరగా తగ్గిపోతుంది . 


   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 

బంధాన్ని నాశనం చేసేవాడు

 శ్లోకం:☝️

*జన్మసంసారబంధఘ్నం*

  *స్వరూపానందదాయకం |*

*నిశ్శ్రేయసపదం వందే*

  *స్మర్తృగామీ సనోఽవతు ||*

-శ్రీ దత్త జయంతి మార్గశిర శుద్ధ పౌర్ణమీ


భావం: పునరావృత జననమరణ చక్రమనే సంసార బంధాన్ని నాశనం చేసేవాడు, స్వ(ఆత్మ) స్వరూపానందాన్ని ప్రసాదించేవాడు, శ్రేయస్సుకు (మోక్షమునకు) మార్గదర్శియైన శ్రీ దత్తాత్రేయ గురుదేవునికి నేను నమస్కరిస్తున్నాను. సాధకుల స్మృతిమార్గంలో పయనించే చైతన్య స్వరూపుడైన గురుదత్తాత్రేయుడు మనలను రక్షించుగాక!🙏