8, డిసెంబర్ 2022, గురువారం

ధర్మజుని రాజసూయ యాగము

 Srimadhandhra Bhagavatham -- 95 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

ధర్మజుని రాజసూయ యాగము


రాజసూయ యాగం జరుగుతుంటే భూమండలం మీద ఉన్న రాజులందరూ వచ్చారు. రాజసూయ యాగం అంటే మాటలు కాదు. బంగారు నాగలితో భూమిని దున్నారు. వచ్చిన వారందరికీ సక్రమమయిన మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏ పనులు చేయాలో ధర్మరాజు గారు నిర్ణయించారు. కర్ణుడికి ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ సంతోషం. ఒకరికి శ్రద్ధా భక్తులతో దానం యివ్వడానికి కర్ణుడే తగినవాడు. కర్ణుడికి, పాండవులకి పడదు. ఒక మంచిపని జరుగుతున్నప్పుడు ఆ మంచిపని సక్రమంగా జరగడం కోసం, రాజసూయ యాగంలో దానములు చేయడానికి ధర్మరాజు గారంతటి వాడు కర్ణుని నియమించాడు. పదవులు ఎంతో నిష్పక్షపాతంగా ఇచ్చాడు. వంటశాలలో ఉండి రుచికరమయిన పదార్థములను తయారుచేయించమని పురమాయించి భీమసేనుడిని వంటశాలలో పెట్టాడు. వచ్చిన వాళ్ళలో పరమ పూజనీయులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్షతలు వేయడానికి వస్తే ఇంటి యజమాని వారు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయే వరకు వారి పక్కన ఉండి వారికి సపర్య చేసి వారికి ఏమి కావాలో చూడడానికి బాధ్యతా కలిగిన ఒక వ్యక్తిని పెట్టాలి. ఈ పనికి కృష్ణపరమాత్మ దగ్గర అర్జునుని పెట్టారు. యాగమునందు వైదిక క్రతువులో వాడబడే సమస్త పదార్థములను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే సిద్ధంగా అందించడానికి వీలుగా ఆ బాధ్యతను నకులుడికి అప్పగించాడు. వచ్చిన వాళ్ళలో నారదమహర్షి, అత్రిమహర్షి వంటి దేవగురువులు ఉంటారు. వారిని పూజించడానికి తమ్ముడయిన సహదేవుడిని వినియోగించాడు. పదార్థములనుతెప్పించి రాజసూయ యాగ క్రతువు జరిగింది. అంత గొప్ప యాగం పూర్తయిన తర్వాత చివర అక్కడ ఉన్నవారిలో జ్ఞానము చేత వృద్దుడయిన వారిని ఎంచి ఆయనకు అగ్రపూజను చేస్తారు. సభలో అగ్రపూజను ఎవరికి చెయ్యాలన్న ప్రశ్న వచ్చింది. అక్కడ ఎందరో ఋషులు, మహర్షులు, దేవగురువులు ఎందరో రాజులు ఉన్నారు. అంతమంది గొప్పవారు ఉన్న సభలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి? అని ధర్మరాజు గారు ఆలోచన చేస్తున్నారు. వయస్సులో చిన్నవాడయినా బుద్ధిలో బృహస్పతి అయిన సహదేవుడు లేచి ‘అన్నయ్యా! అగ్రపూజ చేయడానికి ఎవరు తగినవాడని ఆలోచిస్తున్నావా? కృష్ణుడు అర్హుడు అని సూటిగా అనలేదు. సహదేవుడు కృష్ణుని ఉద్దేశించి ఈయన ఈశ్వరుడు. ఇక్కడ నిలబడిన ఈయనే బయట వెళ్ళిపోతున్న కాలరూపము. ఒక ప్రదేశములా ఎక్కడికక్కడ కనపడుతున్న ఈ సమస్త భూమండలము ఆయనే. నీవు చేసిన యాగము ఆయనే. ఆ యజ్ఞము ఆయనే. చేసినవాడు ఆయనే. ఇన్నిగా వెలుగుతున్న ఈశ్వరుడు ఇవాళ మన కళ్ళెదుట మన మాంస నేత్రముతో చూడడానికి ఎదురుగుండా వీలయిన రీతిలో రక్షకుడై, సర్వ కాలముల యందు పాండవులు బాగుపడాలని కోరుకున్న వాడయి యాగమునకు వచ్చి నిర్వహించి జరాసంధుని వధ చేయించిన మహాపురుషుడు ఇక్కడ కూర్చుని అండగా ఉండగా ఇంకా ఎవరెవరని వెతుకుతారు. ఆయనకు అగ్రపూజ చెయ్యండి’ అన్నాడు.

ఈమాట చెప్పేసరికి ధర్మరాజుగారు పొంగిపోయారు. మాట చెప్పడం కాదు. చెప్పేమాట ఎదిరించలేనిదై ఉండాలి. అదీ ఆవిష్కరణ అంటే. కృష్ణుడు ఎవరో చెప్పాడు. కృష్ణుని సరిగా అర్థం చేసుకున్నాడు. ఎంతో జ్ఞాని సహదేవుడు. అలా చెప్పగానే ధర్మరాజుగారు ద్రౌపదీ దేవిని తీసుకొని బంగారు జలపాత్రను చేతిలో పట్టుకొని కృష్ణుని వద్దకు వెళ్ళారు. అయిదుగురు అన్నదమ్ములు ద్రౌపదీదేవి కుంతీదేవి అందరూ వెళ్లి కృష్ణ పరమాత్మ పాదముల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్ళెమును తీసుకువచ్చి ఆయన కాళ్ళకింద పెట్టారు. ద్రౌపదీదేవి బంగారుపాత్ర లోంచి నీరు పోస్తుంటే కృష్ణ పరమాత్మ కాళ్ళను కడిగారు. ధర్మరాజు గారు కాళ్ళు కడుగుతుంటే నలుగురు అన్నదమ్ములు పుష్పములు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్ళు పోస్తుంటే ఆ కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగి పళ్ళెం లోకి వచ్చినటువంటి ఆ పాద ప్రక్షాళన జలమును తీసుకుని ధర్మరాజుగారు తన శిరస్సు మీద చల్లుకుని, తదుపరి కుంతీదేవి శిరస్సు మీద ద్రౌపదీ దేవి శిరస్సు మీద తమ్ముళ్ళ శిరస్సుల మీద చల్లారు. బంగారువన్నె గల వస్త్రద్వయమును తీసుకు వచ్చి కృష్ణ పరమాత్మకు బహూకరించి, అపర సూర్య భగవానుడా అన్నట్లుగా వెలిగిపోతున్న హారములు తెచ్చి ఆయన మెడలో వేసి కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఆయనకు తాంబూలం ఇచ్చి తమతమ శిరస్సులు ఆయన పాదములకు తగిలేటట్లుగా పరమ వినయంతో అయిదుగురు అన్నదమ్ములు నమస్కరించి అగ్రపూజ చేసి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారు. సభలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు. మూడిన వాడు ఒకడు ఉంటాడు. వాడికి ఈశ్వర ధిక్కారం ప్రారంభం అవుతుంది. శిశుపాలుడు లేచి

'ఈయన గోపాలుర కుటుంబంలో పుట్టాడు. యథార్థమునకు ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరికీ తెలియదు. కొంతమంది ఇతడు దేవకీ వసుదేవులకు పుట్టాడని అంటారు. చాలామంది ఇతడు కళ్ళు తెరిచేసరికి యశోదానందుల దగ్గర ఉన్నాడని అంటారు. ఈయన కులం తెలియదు. ఈయన గోత్రం తెలియదు. వావి వరుసలు లేవు. ఎంతమంది గోపకాంతలతో రమించాడో. ఎంతమందితో తిరిగాడో ఇది నడువడని చెప్పడం కుదరదు. అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మానమర్యాదలు ఎరుగని వాడు. ఇటువంటి వానికి అగ్రపూజ చేయడమా! సభలో వీనికన్నా తగినవారు లేరా! కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి? కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు గాను ఇప్పుడే కృష్ణుడిని శిక్షిస్తాను’ అని తన గదాదండము తీసుకుని కృష్ణుని మీదకు వెళుతున్నాడు.

కృష్ణ పరమాత్మ వీనిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రమును స్మరించి ఆ చక్రమును శిశుపాలుని మీదికి ప్రయోగించారు. అప్పటికి శిశుపాలుడు చేసిన నూరు తప్పులు పూర్తయిపోయాయి. నూరు తప్పుల వరకు కాపాడతానని మేనత్తకు మాట ఇచ్చాడు. శిశిపాలుడు చేసిన అధిక్షేపణతో నూరు తప్పులు పూర్తయిపోయాయి. సుదర్శన చక్రమును ప్రయోగించగానే అది శిశుపాలుని కుత్తుకను కత్తిరించి కింద పడేసింది. అతని తల కింద పడిపోగానే సభలో హాహాకారములు మిన్ను ముట్టాయి. అందరూ కూడా దుర్మార్గుడైన శిశుపాలుడు కృష్ణ పరమాత్మ జోలికి వెళ్ళి మరణించాడు అన్నారు. తదనంతరం పాండవులందరూ అవబృథ స్నానమును చేశారు. యాగము అంతా పూర్తయిపోయిన తర్వాత యాగకర్తలు అందరూ వెళ్లి స్నానం చేస్తారు. అలా చక్కగా వారంతా అవబృథ స్నానం చేసి తిరిగి వచ్చారు. ధర్మరాజుగారు పరమసంతోషంగా రాజ్యం ఏలుతున్నారు. కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరమునకు చేరుకుంటున్నారు.

శ్రీకృష్ణుడు సాళ్వుని, దంతవక్త్రుని చంపుట

ఈలోగా సాళ్వుడు అనబడే రాజు కృష్ణ పరమాత్మ మీద పెంచుకున్న ఆగ్రహం చేత పరమశివుని గురించి ఘోరమయిన తపస్సు చేశాడు. రోజుకు గుప్పెడు మట్టి మాత్రమే తినేవాడు. కడుపులో కార్పణ్యం పెంచుకున్నవాడు ఎంత తపస్సు చేస్తే మాత్రం ప్రయోజనం ఉంటుంది. పరమశివుడు ప్రత్యక్షమై వరమును కోరుకోమన్నాడు. సాళ్వుడు తన యిష్టం వచ్చినట్లుగా తిరిగే విమానం కావాలని పరశివుని కోరాడు. పరమశివుడు మయుడిని పిలిచి ఒక విమానమును నిర్మింపజేసి సాళ్వునికి ఇచ్చాడు. ఆ విమానమునకు సౌభకము అని పేరు. ఆ విమానమును ఎక్కి ద్వారకా నగరం మీదకి వచ్చి ద్వారకా నగరంలో ఉండే అంతఃపుర కుడ్యములను, గోపురములను తన గదా దండంతో తొలగదోస్తూ నానా అల్లరి ప్రారంభించాడు. వెంటనే అక్కడ ఉండే ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వారు యుద్దమును ప్రారంభం చేశారు. గొప్ప యుద్ధం జరుగుతోంది. ఈలోగా కృష్ణ పరమాత్మ చేరుకున్నారు. దుర్నిమిత్తములు కనపడ్డాయి. రావణాసురుడు మాయాసీతను సృష్టించినట్లు సాళ్వుడు కూడా మాయా వసుదేవుడిని సృష్టించి కృష్ణ పరమాత్మ కళ్ళ ఎదుటే ఆ మాయా వసుదేవుడిని సంహరించాడు. కృష్ణ పరమాత్మ అంతటివారు తండ్రి మరణిస్తే ఎలా ఖిన్నుడవుతారో అలా ఖిన్నులయారు. మిగలిన వాళ్ళు ‘ఇది జరగలేదు వసుదేవుడు లోపలే ఉన్నాడు’ అని చెప్పారు. ఆయన సుదర్శన చక్రమును ప్రయోగిస్తే సాళ్వుడు కూడా మరణించాడు. అతని విమానం తుత్తునియలు అయిపోయింది.

తదనంతరం దంతవక్త్రుడు వచ్చాడు. వీడిని కూడా కృష్ణ పరమాత్మ సంహరించాడు. శిశుపాల దంతవక్త్రులిద్దరూ మరణించిన తరువాత వారిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. గతంలో శ్రీమహావిష్ణువు ద్వారపాలకులయిన జయవిజయులకు ఇవ్వబడిన శాపం చేత మూడు జన్మలలో రాక్షసులుగా జన్మించాలి. ఈ జన్మలో వారు శిశిపాల దంతవక్త్రులుగా జన్మించి వారిరువురూ శ్రీకృష్ణ పరమాత్మచే సంహరింపబడి ఆయనలో లీనమయిపోయారు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

కామెంట్‌లు లేవు: