3, జులై 2020, శుక్రవారం

హిందూ ధర్మం.

ప్రపంచంలో ఒకే ఒక ధర్మం భగవంతుడిని తెలుసుకునే విధానాన్ని తెలిపింది.  అదే మన హిందూ ధర్మం. మనం హిందువులుగా జన్మించటం మన పూర్వ జన్మ పుణ్య ఫలం. ఇప్పుడు హిందూ మతం మీద ఇతర మతస్తుల దాడి చేస్తూవుంటే మన హిందువులు హిందుత్వం మీద అవగాహనా రాహిత్యం వల్ల వారు ఇతర మతస్తులు చెప్పేది నిజమని నమ్ముతున్నారు. అందునా కొందరు బ్రాహ్మలు హిందుత్వం మీద కావలసిన జ్ఞానం లేక హిందూ వైదిక్ విజ్ఞానం మీద సరైన అవగాహన లేకపోవటంతో మన హిందుత్వాన్ని ప్రశ్నించే విధంగా తయారవుతున్నారు. అదే  బ్రాహ్మలు వారి విధి విహిత నిత్య నియమిష్టిక కర్మలను సకాలంలో చేస్తూ ఉంటే వారు ఈ విధంగా విమర్సించరు.    మనం మన పూర్వికులు మనకు సూచించిన మార్గాన్ని తూచా తప్పకుండ ఆచరించటమే మనం చేయవలసిన విధి.  మన సంస్కృతి సాంప్రదాయాల ప్రాముఖ్యత,  వాటి విశిష్టత సాటివారికి వివరించి ఈ సమాజాన్ని ధర్మ బద్దంగా గడపేటట్లు చేయటం బ్రాహ్మణుల విధి. కానీ కొంతమంది మన సంప్రదాయాల జ్ఞానాన్ని తెలుసుకొనే దానికి ఎక్కువ శ్రర్ధ చూపక ఇతరుల మాయ మాటలకు లోనయి మన సంస్కృతిని మన ధర్మాన్ని చివరికి మన దేముళ్ళని మన వారే విమర్శిస్తున్నారంటే మనం ఇప్పుడు యెంత ప్రమాదకార  స్థితిలో ఉన్నామో తెలుస్తున్నది. .  
రాముడు, క్షత్రియుడు, శ్రీకృష్టుడు యాదవుడు, హనుమంతుడు మర్కటం అని అంటమే కాక యితర మత సన్యాసులను దేముడిగా అభివర్ణిస్తూ వారు మన ధర్మానికి గ్లాని చేయటమే కాక యితరులను కూడా ధర్మము నుండి వైదొలిగేటట్లు చేస్తూ వారి మతమే మంచిదని ప్రచారం చేస్తున్నారు. సహస్రనామాలు, శతనామాలు కల్పించి మన సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారు. ఈ ప్రమాదాన్నుంచి మన సనాతన ధర్మాన్ని కాపాడవలసిన భాద్యత మన అందరిమీద వున్నది.
మనం ఏమి చేయాలి.
1) ప్రతి హిందువు మన సనాతన హిందూ ధర్మాన్ని గౌరవించాలి. ఇతరులు గౌరవించేట్లు ప్రయత్నించాలి.
2) మనం యితర మతాల వారిని చులకనగా చూడవద్దు.  కానీ మన ధర్మాన్ని కానీ మన హిందుత్వాన్ని కానీ ఏ మతస్తుడైన చులకన చేసి మాట్లాడిన కువిమర్శ చేసిన ఊరుకోకూడదు.  వారికి ధీటైన సమాధానం చెప్పాలి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ప్రతి హిందూ తన నిత్యా దైనందిత కార్యక్రమాలలో భాగంగా శ్రీ కృష్ణ భాగవానుడు మానవాళి మనుగడకు అర్జనునికి ఉపదేశించిన " భగవత్ గీతను" పారాయణ చేయటం అలవాటుగా చేసుకోవాలి. భగవత్ గీత ఎవరైతే చదివి ఆకళింపు చేసుకుంటారో వారు హిందుత్వం మీద పట్టు కలిగి వుంటారు.  భగవానుడు మానవుడు ఎలా ఉండాలి, ఏమి చేయాలి యెట్లా చేయాలి అనే అన్ని విషయాలను ప్రతి మానవుడు అర్ధం చేసుకునేట్లు బోధించారు.  భగవత్ గీత హిందువులందరికి పారాయణీయ గ్రంధము మరియు గీతా సారం అమృత తుల్యం.  ప్రతి వాడు ఆచరించాలి. కృష్ణ భగవానుడు యాదవుడు అనే భావం మానుకోవాలి స్వామి సాక్షాత్ విష్ణు దేముడి అవతార పురుషుడిగా మాత్రమే భావించాలి.

3) రాముడిని క్షత్రియుడిగా చూడటం మానుకోవాలి. రాముడు ఒక ఆదర్శ పురుషుడు. రామాయణం కూలంకుషంగా చదవాలి రామాయణమును విమర్శించకుండా అందులో వున్న జ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవాలి.

4) శ్రీమత్ మహా భారతం ఈ ఇతిహాసం మనం సమాజంలో ఎటువంటి మనస్తత్వాలు కలిగిం మనుషులను నిత్యం ఎదుర్కొంటున్నామో అవి అన్ని ఇందులో వున్నాయ్. ఏ మానవుడు  శ్రీమత్ మహా భారతంను క్షుణ్ణంగా పఠించి అవగాహన చేసుకుంటాడో అతడు తన జీవితాన్ని ఎటువంటి వడిదుడుకులు లేకుండా సాఫీగా నడుపుకోగలడు.

5) వేదాలు అవి మాములు మనుషులు పాటించేటటువంటి సామాన్యుమైన విషయాలు కావు. కాబట్టి సాధ్యమైనంత వరకు వేదపండితుల ద్వారా మాత్రమే మనం వేదాల మహోన్నతిని తెలుసుకోగలం. ఒక పండితుడు కేవలం ఒక వేదం మాత్రమే చదవగలరు అంటే అవి యెంత ఉత్కృష్టమైనగో గమనించండి.

6) మనకు అష్టా దశ పురాణాలూ అంటే 18 పురాణాలు వున్నాయ్ అవి చదవ వచ్చు కానీ చాలా సమయం కావాలి. పౌరాణికుల ద్వారా మనం పురాణాలగూర్చి తెలుసుకోవాలి.

7) స్వర్గం, నరకం, పాపం, పుణ్యం ఇవి అన్ని సామాన్యు మానవుల సాధారణ జ్ఞ్యానం.  అన్నిటికి మించిన బ్రహ్మ జ్ఞానం మన హిందూ ధర్మంలో వుంది. అది మనకు ఉపనిషత్తుల వల్ల లభ్యమవుతుంది. ప్రతి మానవుడు, ఏ కులజుడైన, స్త్రీ, పురుష తారతమ్యం లేకుండా పొందవలసిన జ్ఞానం.  ఎవరైతే బ్రహ్మ జ్ఞానం పొందుతారో వారు జీవన్ముక్తులు. కోటికి ఒక్కరికి మాత్రమే బ్రహ్మ జ్ఞానం పొందాలనే ఉద్దేశం కలుగుతుంది అటువంటి వారిలో కోటికి ఒక్కరు మాత్రమే ఆ అనంత జ్ఞానం పొందగలుగుతారు అని మనకు శ్రీ కృష్ణ భగవానుడు గీతలో తెలిపారు.

హిందువులు విగ్రహారాధకులు అనే భావాన్ని ఇతర మతస్తులు చేస్తున్నారు.  దయచేసి తెలుసుకోండి హిందువులు విగ్రహారాధకులు కారు, కానీ విగ్రహారాధకులు అదేమిటని మీరు అడగ వచ్చు.  విగ్రహ ఆరాధన మనకు ఆరాధన పరంపరలో ఒక ప్రాధమిక స్థాయి. దీనిని వివరించా ప్రయత్నిస్తా. మనం చిన్నప్పుడు లెక్కలు నేర్చుకోవటానికి మన గురువులు మన వేళ్ళ మీద గణించటం నేర్పుతారు.  ఆలా నేర్చుకొని తరువాత మనం వేళ్ళు లెక్కించకుండా లెక్కలు చేయ గలుగుతాము.  ఇప్పుడు చెప్పండి లెక్కలు చేయటానికి చేతి వేళ్ళు అవసరమా.  కాదు కానీ లెక్కలు నేర్చుకోటానికి మాత్రమే చేతి వేళ్ళు ఆసరాగా ఉపయోగ పడుతాయి.  అదే మాదిరిగా అంటకారణ శుద్ధి కోసం మాత్రమే మనం విగ్రహారాధన చేయాలి.  కానీ విగ్రహారాధనే పరమావధిగా భావించకూడదు.  ఆలా భావిస్తే మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించలేము.
ఒక సాధకునికి విగ్రహారాధనతో అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుందో అప్పుడు తనంతట తానె విగ్రహారాధన మాని జ్ఞ్యాన మార్గాన్ని అనుసరిస్తారు.  ఈ విధంగా మనం సాధన చేయాలి.
బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి మనకు అనేక వేదాంత గ్రంధాలు వున్నాయ్. అందులో ప్రముఖమైనవి ఉపనిషత్తులు.

హిందూ ధర్మ ఆపరమైన జ్ఞాన సంపద కలిగిన ఏకైక ధర్మం ఈ ప్రపంచంలో వున్నది.  హిందువులకు వున్న జ్ఞాన సంపద మరే మతస్తులకు లేదు. హిందుత్వం గూర్చి తెలియని అమాయకులను చూసి యితర మతస్తులు మాయ మాటలు చెప్పి మత మార్పులు చేస్తున్నారు.  కాబట్టి హిందూవులమైన మనమందరము ముందుగా హిందువా మహోన్నత జ్ఞానాన్ని గూర్చి తెలుసుకొని యితరులకు భోదించాలి. మనం వేరే మతస్తులం మన మతంలోకి రమ్మని పిలవము.  అదే విధంగా మనం వేరే మతాల్లోకి వెళ్ళకూడదు.
హిందూ ధర్మం సమాధులను పూజించే విధానాన్ని కండిస్తుంది.  అదే మన విధానం ఐతే మనం శ్రీరాముడి, శ్రీ కృష్ణుని ఇంకా అనేక సాధువుల, సత్పురుషుల సమాదులని ఆలయాలుగా చేసి పూజించేవారము.  దయచేసి ఎవరైనా సమాధి పూజ, సమాధి మందిరం అని మిమ్మలిని ప్రలోభ పెడితే ప్రలోభపడొద్దు.
జై హిందు
ఓం శాంతి శాంతి శాంతిః
సర్వే జన సుఖినోభవంతు, 

పురాణాలు ఎందుకు వినాలి ?

ఈ సందేహానికి సమాధానంగా వ్యాస భగవానుడు పురాణాల గురించి ఈ విధంగా తెలియజేసాడు. సంసార బంధాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి సులువైన మార్గంలో ముక్తిని ప్రసాదించ గలిగేవే ఈ పురాణములు.

వేదాధ్యయనం చేయలేని వారికి సులువైన సాధనా మార్గాన్ని ఉపదేశించేవి ఈ పురాణాలు. అజ్ఞానమనే అంధకారంలో అలమటిస్తున్న వారికి జ్ఞాన దీపాలు. భవరోగులకు మంచి ఔషధాలు , సకల సంపదలను కలుగజేసేవి ఈ పురాణాలు. నిత్య పురాణ శ్రవణం చేసేవారు సాక్షాత్తూ దేవతా స్వరుపులే. పురాణాలలోని కధలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో అలంటి వారు " కర్మ " అనుబడే సముద్రం నుండి బయటపడి భగవంతుని సన్నిధిని పొందగలరు. నిత్యం పురాణ శ్రవణం చేయలేని బలహీనులు కనీసం ఆయా పుణ్య తిధులలో నైనా ఆ ప్రయత్నం చేయాలి. సర్వ యజ్ఞ ఫలము , సర్వ దాన ఫలము పురాణ శ్రవణం ద్వారా కలుగుతుంది. ఈ కలియుగంలో పురాణ శ్రవణం కంటే పవిత్రమైన ధర్మం మరొకటి లేదు . ఈ పురాణాలు సకల పాపాలను నివారిస్తాయి . పురాణాలను చెప్పగలిగిన వారెవరైనా సరే వారు తప్పనిసరిగా పూజనీయులు . పురాణ పాఠకులు పవిత్రాత్ములై ఉండాలి . దానము , శాంతము , దయ , అసూయా లేకుండుట మొదలైన గుణాలు వారిలో పుష్కలంగా ఉండాలి . మంచి మనుషులున్న చోట , నదీ తీరం , దేవాలయం మొదలైన పవిత్ర ప్రదేశాలలో మాత్రమే పురాణ పఠనం చేయాలి . పురాణ శ్రవణం సమయంలో మధ్యలో వెళ్ళిపోవటం , తలపాగా ధరించడం , తాంబూలం సేవిస్తూ ఉండటం మొదలైనవి చేయరాదు . పాపాలను హరించగలిగిన కధలను అపహాస్యంగా చూసేవారు నీచమైన జన్మలను పొందగలరు . ఎంతో వినయంతో పూజ్య భావంతో శ్రవణం చేయాలని , ఈ విధంగా పురాణ శ్రవణ మహిమను స్కాంద పురాణంలో తెలియజేసారు .

నా అనుభవాలు

పీఠం జయేంద్రసరస్వతీ స్వామి వారికి ఇచ్చివేసి, తాము ఒంటరిగా పాదచారియై ఎఱ్ఱనిఎగాని లేకుండా యాత్ర ఆరంభించారు. ఎనభై ఎళ్ళ వయస్సులో, దాంట్లో ఎన్ని నియమాలు. ఎవరివద్దా డబ్బుగా పుచ్చుకో రాదు. బియ్యం, పప్పు, కూరలు వంటివి పరివారనికై పుచ్చుకోవచ్చు. స్వామివారికి కావలసిన పేలపిండో, అరటిపళ్ల పొడో నిత్యం సమర్పించే భక్తులే ఇస్తారు. ఒక ఊరినుండి బయలుదేరితే మిగిలిన సామన్లు అన్నీ అక్కడే వదిలివేయాలి. స్వామివారు ఏ పాడుపడిన గుడిలోనో, మోటారు షెడ్డులోనో చెట్టుకిందో కూర్చుంటారు. ఈ రకంగా సాగిపోతూ ఎన్ని మహత్కార్యాలు చేయించారో.

సతారాలో ఉత్తర చిదంబరం అనే పేరుతో నటరాజస్వామిదో పెద్ద గుడి ఉంది. మదరాసులో కామక్షికో గుడి, వేద పరిపాలనా సంస్థ.... ఒకటేమిటి పెద్ద పెద్ద కర్యక్రమాలెన్నో చేయించారు. మరి దీనికంతటికీ డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? తాతాచార్యులవారితో స్వామివారన్నారట - "డబ్బుకోసం మన పని కాదు. కార్యక్రమం ఎలా నడపాల అన్నదే ఇప్పటి ప్రశ్న. దానిని మనం నిర్ణయిస్తే కావలసిన ద్రవ్యం గురించి చంద్రమౌళీశ్వరుడే చూసుకుంటాడు."

ఆర్ధికంగా అతి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న కాలంలో కూడా ద్రవ్యం విషయంలో శుద్ధి, నైతికత, పారదర్శకత వారొక్కరి విషయంలోనే కాదు వారిని ఆశ్రయించిన వారందరి విషయములోనూ ఇటువంటి పట్టుదలని చూపేవారు. నాకు శ్రీవారు అనేక మంది భక్తుల విషయంలో చూపిన నిర్దుష్టత నేరుగానూ, ఖచ్చితమైన సాక్ష్యాలతోనూ తెలిసినప్పటికీ అటువంటి భక్తుల అనుమతి లేకుండా వ్రాయడం న్యాయం కాదు కాబట్టి నా విషయంలో నేరుగా జరిగిన అనుభవాలను మాత్రం ఒకటి రెండింటిని మనవి చేస్తాను. 

ఉద్యోగం చేసేకాలంలో... ఆ కాలంలో మలేషియా నుండి దిగుమతి చేసుకున్న రబ్బర్ వేల టన్నులు చెన్నై నుండి మా ఫ్యాక్టరీ ఉన్న స్థలానికి రవాణా చేయించే బాధ్యత కుడా నామీద ఉండేది. రోజుకు పది పదిహేను లారీలు వెళుతూ ఉండేవి. నాపై అధికారులే ధరలు, ఇంచుమించు ఏ శాతంలో సరుకు ఎవరెవరి ద్వారా పంపించాలో నిర్ణయించి నాకు తెలియజేసేవారు. నా పని కేవలం అది సజావుగా జరుగుతున్నదా అని పైఎత్తుగా చుడడమే!

ప్రతీ శనివారం సాయంకాలం మిత్రులతో కలిసి కంచికి వెళ్ళి ఆదివారం కూడా స్వామివారి దర్శనం చేసుకుని తిరిగివచ్చే వారము. ఒకరోజు అలా బయలుదేరడానికి సిద్దమైనాను. మా కంపెనీ వలన లబ్ధి పొందే ఔత్సాహికుడైన ఒక లారీ కంపెనీ యజమాని చూడడానికి వచ్చాడు. మర్యాదలయిన తరువాత ఒక వందరూపాయల కట్ట నా చేతికిచ్చారు. "మీరు అనేక ధర్మ కార్యాలు నిర్వహిస్తారు. ఉపయోగించండి" అన్నారు. నేను ఆలోచించాను. నేనేమీ అడగలేదు, ఆయన ఇచ్చినందు వలన నేనాయనకు చేయగలిగిన ఉపకారమో, కంపెనీకి ద్రోహమో ఏదీ లేదు. సరే కానిమ్మని పుచ్చుకున్నాను. డబ్బు ఆఫీసు లాకరులోనే పెట్టి స్వామివారి దగ్గరకు వెళ్ళాను. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే స్వామివారు ఆ రోజు నా ముఖము వైపు చుడడం లేదు సరికదా నేను దృష్టిపథానికి నేరుగా నిలుచుంటే ముఖం తిప్పుకుంటున్నారు. డబ్బు పుచ్చుకుని వచ్చానుకదా. నాకు గుండెలో గుబులుగా ఉన్నది. రాత్రి ఎనిమిది అయిఉంటుంది. ఇంతలో సేల్స్ టాక్స్ లో పని చేసే ఒక అధికారి సాంప్రదాయకమైన వేషంతో స్వామివారి వద్దకు వచ్చారు. నమస్కారం చేసి "స్వామి, నన్ను చెక్ పోస్ట్ లో వేసారు. వచ్చిపొయే లారీల వారి వద్ద వసూలు చేసి క్రింది నుంచి పైదాకా పంచవలసి ఉంటుంది. దానిలో నా భాగం నాకు వస్తుంది. ఇది ఒప్పుకోకపోతే ఎదో ఒక ఇబ్బందిలో నన్ను ఇరికించవచ్చు ఎం చేయాలి?" అని ప్రశ్నిచారు.

స్వామివారిప్పుడు ఆయనను చూడటం లేదు. నన్ను చూస్తూ ఆయనను ప్రశ్నిస్తున్నారు.. "నీవేమీ అడగక్కర్లేదా? లారీలవారే స్వయంగా ఇస్తారా"
"పూర్వమే నిర్ణయించినందువలన నేను అడగవలసినదేమి ఉండదు. వారే స్వచ్చందంగా ఇస్తారు" అని అధికారి సమాధానమిచ్చారు.

ఇక స్వామివారు నావంక తిరిగి తీర్పు చెప్తున్నారు. "వారే స్వచ్చందంగా ఇస్తున్నా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించక ఊరికే ఈయరుకదా! వారి దగ్గర చెయ్యిజాచి డబ్బు పుచ్చుకున్నాయన ఎదో ఒక సందర్భంలో నిబంధనలకి వ్యతిరేకంగా వారికి మేలు చెయవలసి వస్తొంది. దానిమూలంగా నీవు ఎందుకు నియమించబడి, ఎందువలన ప్రభుత్వం నుండి జీతం పుచ్చుకుంటున్నావో ఆ ప్రయోజనానికి విఘాతం ఏర్పడుతుంది" ఇప్పుడు ఆయన వంక తిరిగి అంటున్నారు. "మీ కమిషనర్ ని కలువు. నేను కూడా బదిలీ కోసం సిఫారసు చేసాను అని చెప్పి బయటవారితో లావాదేవీలు లేని ఆడిట్ వంటి విభాగాలకు బదిలీ చేయించుకో” అని అన్నారు. 

ఆ అధికారికి ఇంకో సంశయం కలిగింది, "ఇప్పటికే పుచ్చుకున్న ద్రవ్యమేమి చేయాలి?" మళ్ళీ నా వంకకు తిరిగి నేరుగా నా కంట్లోకి చుస్తూ చెబుతున్నారు స్వామివారు. "వీలైతే ఎవరిచ్చారో వారికి తిరిగి ఇచ్చెయ్" అతని వంక చుస్తూ "లేకుంటే ఈ కామేశ్వరుని గుడి హుండీలో వెయ్యి” అన్నారు. 

అంటే మఠ యాజమన్యంలో నడుస్తున్న కామక్షీ దేవాలయానికి కూడా ఆ ద్రవ్యం వద్దన్నమాట. ఆదివారం ఆఫీసు తలుపులు తీయించి డబ్బు తీయించి నేరుగా లారీల యజమాని దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పి అతనిని తీసుకోమని చెప్పి ప్రాధేయపడాను. అతను ఆశ్చర్యపోయాడు. మళ్ళీ కాంచీపురం చేరి స్వామివారికి సాస్టాంగంగా నమస్కరించాను. అప్పుడు స్వామివారు నన్ను చిరునవ్వుతో అనుగ్రహిస్తూ చూసారే! ఆ చిరునవ్వు..... అది ప్రసాదించిన తృప్తి వలన ప్రపంచంలోని డబ్బంతా పోగుచేసినా తూగుతుందా!

కుండలి కుమారి కుటిలే చండీ చరాచర సవిత్రి చాముండే
గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!

--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

*మహాశివుని రూపం, చేష్టల వెనుక మర్మం*

*శివుడు భిక్షాటన ఎందుకు చేస్తారు?* 
భిక్షాటన సన్యాసి లక్షణం. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. *ఏమీ లేకపోవడం లేమికి నిదర్శనం కానేకాదు.* లోకంలో ఉన్న బంధాలు, అనుబంధాలు, మోహాలు, వ్యామోహాలు అన్నీ కూడా మిధ్య. *నాది, నేను అనే అహంకారం మనిషిని ఎదగనీయదు*. ఈ భవబంధాల్లో పడితే, కుడితిలో పడ్డ ఎలుక చందమే అవుతుంది. బంధాలు, వ్యామోహాలలో చిక్కుకుంటే ఇక పారమార్థిక చింతన ఉండదు. ఈ సత్యాన్ని చాటిచెప్పడానికే మహాశివుడు బిక్షాటన చేశాడు .
మహాశివునికి లేమి అనుకుంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదు. కుబేరునికి అష్ట సిద్ధులు, నవ నిధులు ఇచ్చింది శంకరుడే. ఆదిశంకరునికి వస్తువులమీద, సంపదల మీద ఎలాంటి భ్రాంతి, వ్యామోహం లేదు .

*శివునికి ఇల్లు లేకపోవడం ఏమిటి?* విశ్వమంతా ఆయన ఇల్లే. ఇంకా చెప్పాలంటే, భక్తుల హృదయాల్లో ఆయన నివాసం ఉంటాడు .
మహాశివుడు అనామకుడు అనుకునేవాళ్ళు అజ్ఞానులు. లయకారుడు అయిన శివుడు లేకపోతే సృష్టి అనేది లేదు. శివునికి ఆద్యంతాలు లేవు. శివుడు నిర్గుణుడు, నిరాకారుడు. మహాశివుని అఖండ శక్తిని అర్ధం చేసుకోవడం దేవతలకే సాధ్యం కాదు, ఇక తక్కినవారికి ఏం సాధ్యమౌతుంది .
*ముల్లోకాలను కనిపెట్టుకుని ఉండాల్సిన మహాశివునికి ఒకచోట స్థిరంగా కూర్చోడానికి ఎలా వీలవుతుంది?* నిరంతరం సంచరిస్తూనే ఉండాలి. ఒక మహా బాధ్యతను పనిలేనితనంగా చిత్రించుకోవడం అవివేకం.
మహాశివుడు భక్త సులభుడు. పిలిస్తే చాలు పలుకుతాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడు. మహాశివుడు ఏకంగా హాలాహలాన్ని గరళంలో దాచుకున్నాడు. అదీ ఆయన గొప్పతనం.
మహాశివుడు తలచుకుంటే సర్వ సంపదలూ ప్రసాదించగలడు. ఆగ్రహం వస్తే, అమాంతం అన్నిటికీ భస్మం చేయగలడు. త్రిమూర్తుల్లో ఒకడైన మహాశివుని అపహాస్యం చేయడం అంటే, అంతకంటే అపహాస్యం మరేదీ లేదు...

*అరుణాచల శివ...అరుణాచల శివ...*

శ్రీరామ రామ రామేతి

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్ల్యాం రామ నామ వరాననే!!* ఈ పాదాలకు అర్థం శ్రీరామ అని మూడు సార్లు ఉచ్ఛరిస్తే అది వేయి సార్లు జపించిన దానికి సమానమని అర్థం.

అలాగే జగద్గురువయిన  సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ శబ్దానికి కూడా విశేష ఫలితం ఉంది. తన పిన్నవయసులోనే గోవర్ధనగిరి ఎత్తి తన ప్రజలను కాపాడడం తోపాటు అనేక సందర్భాల్లో ఎన్నో విధాలుగా ప్రజలను ఆదుకున్న పరమాత్ముడు కృష్ణుడు.

ఆ దేవదేవుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం త్రేతాయుగంలో రామావతారంలో సామాన్య మానవుడిగా జన్మించి ఎటువంటి దైవిక శక్తులు ఉపయోగించకుండా మితహిత సత్య వాక్పరిపాలకుడుగా, మర్యాద పురుషోత్తముడు గా ప్రసిద్ధి చెంది రాక్షస సంహారం చేసి, ద్వాపరయుగం నాటికి ప్రజలలో పెరిగిన అధర్మాన్ని అంతమొందిచి, ధర్మసంస్థాపనకై దైవ శక్తులు కలిగిన శ్రీకృష్ణ అవతారం ఎత్తి ఎందరో రాక్షసులు సంహారం చేసి శ్రీకృష్ణ భగవానుడుగా ప్రసిద్ధి చెంది, జగద్గురువుగా కొనియాడబడ్డాడు. అటువంటి ఉత్కృష్టమైన శ్రీకృష్ణ శబ్దం ప్రయోగమే కృష్ణం వందే జగద్గురం. అజ్ణానాంధకరంలో కొట్టిమిట్టాడుతున్నా ఎందరో అభాగ్యుల పాలిటి వెలుగు కిరణం కృష్ణం వందే జగద్గురం.
 *వసుదేవ సుతం దేవం కంసాచారూణ మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం*............... శ్రీ కృష్ణాష్టకంలో ప్రతీ పాదం కృష్ణం వందే జగద్గురంతోనే ముగిస్తుంది. ఈ మంత్రం పారాయణం భాగవత పారాయణం ఫలితంతో సమానమని పురాణ పండితులు ప్రస్తుతించారు ‌. నేటి ప్రాపంచిక పరిస్థితులను గమనించి మానవునకి మరింత దైవ బలం అవసరమని భావించి తొలి ఏకాదశితో ప్రారంభమైన చాతుర్మాస్యం సందర్భంగా అవధాని గారు ఆ ప్రయోగం చేశారని నా అభిప్రాయం.

ఇది నా పరిశీలన మాత్రమే.

భవదీయుడు
*దశక ప్రభాకరశాస్త్రి*
9849795167

తెలంగాణా భాష

తెలంగాణ ప్రజలు ఎంతో అర్దవంతమైన భాష మాట్లాడుతున్నారు. ఉదాహరణకి మేర అన్న పదాన్ని పరిశీలించండి. ఈ పదాన్ని ఇతర ప్రాంతీయులు “దర్జీ” అంటున్నారు. అది ఉర్దూ పదం.

మేరల (హద్దులు) మేరకు గుడ్డల్ని కత్తిరించి కుట్టే వ్యక్తి మేర. ఇదేమో తెలుగు పదం. తెలంగాణలో వ్యవహరించబడే కాపోల్లు, కాపుదనపోల్లు అనే మాటలు అసలు సిసలు తెలుగు పదాలు.

పంట పండించి కాపు (కాపలా)గా వుండేవాళ్ళు కాపోల్లు. దీనికి సమానార్థకంగా ఆంధ్రప్రాంతంలో రైతులు అంటున్నారు. రైతు ఉర్దూ పదం.

మెత్తగా వుండునట్లు తలకింద పెట్టుకునేది ‘మెత్త’ (దిండు), రోట్లో వేసి నూరినప్పుడు, తొక్కితే ఎట్లా మెత్తనవుతుందో అట్లా తయారైనది ‘తొక్కు’ (పచ్చడి), తన్నితే, తంతే పడివుండేది

‘తంతె’ (మెట్టు), చల్లగా వుండేది ‘చల్ల’ (మజ్జిగ), ఎర్రగా వుండేది ‘ఎర్ర’ (వానపాము), వర్షకాలంలో నీటి ప్రవాహంతో ఒర్రేది (అరిచేది) కాబట్టి ‘ఒర్రె’, వాగునది, వాగేది కనుక ‘వాగు’,

నదించేది, శబ్దించేది కనుక ‘నది’. ఇవన్నీ నిఖార్సైన నికాలస్ తెలుగు పదాలు. అంగాన్ని లేదా శరీరాన్ని కప్పి వుంచేది ‘అంగీ’ (చొక్కా), లాగుతూనే వేసుకుని లాగుతూనే తీసి పారేస్తాము

కనుక ‘లాగు’ (పంట్లాము), గుల్లగా అంటే ఖాలీగా వుండేది ‘గుల్ల’ (గంప). లోన బోలుగా వుంటాయి కనుక ‘బోలు ప్యాలాలు’ (మరమరాలు), జిహ్వకు రుచికలిగించేవి ‘జిమ్మలు’

(చేపలు), తినేటపుడు కంచంలో ఒక అంచుకు, పక్కన పెట్టుకున్నందువల్ల మాట్లాడే ‘అంచుకు పెట్టుకునుడు’ (నంజుకునుడు), సున్నపురాయి, కోడిగుడ్లు, జిగురు మొదలైనవి కలిపి

బాగా ‘దంగు’నట్లు ప్రత్యేకంగా తయారు చేయబడిన పాతకాలంనాటి ‘డంగ్ సున్నం’, కంకుతూ తింటాము కనుక ‘కంకి’ (పొత్తు), చిట్టిగా, చిన్నగా వుండే ‘జిట్టపులి’ (చిరుతపులి),

గోళాకారంలో వుండే ‘గోలి’ (మాత్ర), తడి కల్గిన భూమి ‘తరి’ (మాగాణి), శుష్కమైన ఎండ నేల కుష్కి (మెట్ట), గిరుక్కున తిరిగే ‘గిరక’ (గిలక), గిరకమీంచి తాడు జారి సందులో పడగా

వ్యవహరించే ‘సందెన వడుడు’, గుడి ఆవరణలో గుండ్రంగా వుండేది ‘గుండం’ (పుష్కరిణి), కళ్ళు బైర్లు కమ్ముతూ మన కళ్ల ముందు చక్రం తిరిగినట్లు తిరిగే ‘చెక్కరచ్చుడు’ (తల

తిరగడం), ఉన్నట్టుండి వెఱగుపడే ‘బీరిపోవుడు’ (ఆశ్చర్యపోవడం), గుండ్రంగా వుండే ‘గుండీ’ (బొత్తాం), దెబ్బలు, గాయాలు మొ|| వాటితో గజ్జలో దిగిన వాపుతో గగ్గోలు పడే ‘గగ్గోడు’,

ఆకాశమ్మీది నుండి వెళ్ళే ‘మీది మోటర్’, స్టార్టు చేయగానే కుట్ కుట్ అని చప్పుడు చేసే ‘కుట్కుటు మోటరు’… ఇవి సరళమైన, అర్థవంతమైన, నిరాడంబరమైన సాఫ్‌సీదా తెలుగు పదాలు.

ఇంకా చూడండి:

కారడ్డం మాటలు = (వెటకారమ్మాటలు) నిజానికివి కాలడ్డం మాటలు. కాలు అడ్డు పెట్టబడిన మాటలు. ఈ కాలు + అడ్డే మాటలే కాలొడ్డే మాటలయ్యాయి ఉదా|| (సిరి రా

మోకాలొడ్డినట్లు…)
కాపాయం: పొదుపు; కాపు+ఆయం = కాపాయం. ఆయం అంటే ఆదాయం. (ఆయ వ్యయాల్లో ఆయం వుంది కదా!) ఈ ఆయాన్ని కాపు చేసుకోవడం అంటే కాపాడుకుని పొదుపు

చేయడమే కాపాయం.
కమ్మగ కాయి పాయి చేసుకుని తినుడు = ఇష్టమృష్టాన్నాల్లాగా అన్నపానాదులు ఆరగించడం. కాయి (ఖాద్యం) = అన్నం, ఆహారం; పాయి = (పేయం) పానీయం.
అన్నం కచ్చె పెక్క ఉడుకుడు = అన్నం ఉడికీ ఉడక్కపోవడం కచ్చా అంటే పచ్చి. ఉడకనప్పుడు కచ్చాగానే వుంటుంది. పెక్క (పక్క, పక్కా) అంటే పక్వం. ఉడికినప్పుడు పక్వమై పక్క,

పెక్కగా మారుతుంది.
తడలు గొట్టుడు = ఉప్పొంగడం, తటాకాదుల్లోని అలలు గాలితో కడల్కొనడం.
మన్ను దుల్లు దుల్లు అవుడు = బాగా దున్నినందువల్ల నేల ‘వదులొదులు’ కావడం.
కుల్లుల్లు చేసుడు = చక్కగా తేరుకుని తేటగా వున్న ఏటి నీటిని కుదిపి కదిపి అడుగున వున్న మట్టీ బురదలకు చెందిన కుళ్ళూ, మకిలలతో మురికి చేయడం.
పూస పేర్లోల్లు = పూసలు, పేరులు (దండలు), అద్దాలు, దువ్వెండ్లు మొ||నవి అమ్ముకునే వాళ్ళు.
పేర్నాల వెట్టుడు = పేరులు, నామాలు పెట్టి నిందించడం
మాట తొందురుతొందురు పోవుడు = తొందర తొందరగా మాట్లాడితే వచ్చినట్లు పక్షవాతాదుల వల్ల మాటలు తడబడడం.
బూమి దామార నానుడు = వర్షాదుల వల్ల భూమితన దాహం ఆరేలా తడిసిపోవడం.
ఏ భాషకైనా జవజీవాలు జాతీయాలూ, సామెతలే! తెలంగాణ వాసుల పలుకులో నుడికారం వుంటుంది. జానపదత్వం తొంగి చూస్తూ వుంటుంది. మట్టివాసన గుబాళిస్తూ ఉంటుంది. వీళ్లకు

ఏది కొందామన్నా “అగ్గిల చెయి పెట్టినట్లుం”టుంది. తమకు యిష్టం కాని వాళ్ళను చూసినప్పుడు “పెయ్యి పొంట ముండ్లు” వస్తయి. “కాల్లు కడుపులు పట్టుకుని” బతిమాలి బామాలే

సందర్భాలు వీళ్ళక్కూడా ఉంటాయి. వీళ్ళు తమ బతుకుల్ని దాదాపు “గుడ్డి కొంగలోలె” ఎల్లదీస్తూ వుంటారు. అయిష్టమైన పనులు చేస్తున్నప్పుడు “ముండ్ల మీదున్నట్లు” భావిస్తారు.

కరువులు, కాటకాల వల్ల యిక్కడి బతుకులు “మంటలు పడ్డట్లు” అవుతాయి. అయితే… తెలంగాణలో కూడా “కాని తూట్ల కెల్లి కర్రెపిట్టను ఈగిం”చగలిగిన అఘటన ఘటనా

దురంధరులున్నారు. “వంగితె పిచ్చలు మాయం చేసెటోల్లు” కూడా వున్నారు. వెనకబాటు తనం వల్ల తెలంగాణ వాసుల బతుకు “పల్లేరు కాయలల్ల బొర్లిచ్చినట్లు” ఉంటుంది. వీళ్ళు
మనస్పూర్తిగా కాక “కడుపునిండ” మాట్లాడుకుంటారు. (ఆ మనస్సు ఎక్కడుందో తెలియని అమాయకులు కదా!) వాన కాలంలో ఎప్పుడు “మొగులు మెత్తవడు”తుందా అని ఎదురుచూస్తూ

వుంటారు. “దొంగ చీకటి ఒక్కటయినట్లు” (పులి మీద పుట్రలా) ఉన్న పరిస్థితుల పట్ల కలత చెందుతారు. అన్యాయంగా “బట్టగాల్చి మీద పారేస్తే” (నీలాపనిందల పాలు చేస్తే) కంట తడి

పెడతారు. “పానం కొలికిలకు వచ్చినా” (తలప్రాణం తోకకు వచ్చినా) పని చేయాలనుకుంటారు. “గుట్కిల్లు మింగరు” (నీళ్ళు నమలరు). “గట్టుకు కుక్క మొరిగినట్లు”

(అరణ్యరోదనంలా) బతుకు ఆగమైపోయినా వణ్కరు జెన్కరు. తెలంగాణలో సైతం కొన్ని “ముడ్డి లేని ముంతలుం”టయి (వ్యక్తిత్వం లేనివాళ్ళు). “ఎన్నపెడితే నాకని, ఏలు పెడితే చీకని”

కొరకరాని కొయ్యలుంటయి. “తల్లి కడుపుల పొద్దు పడుతుండంగ” అలసి సొలసిన దేహాలతో యిళ్ళకు తిరిగొస్తారు. పిల్లలు తమ తల్లిదండ్రుల పోలికలన్నింటినీ పుణికి పుచ్చుకున్నప్పుడు ఈ

పొరగాండ్లు వాళ్ల “నోట్లకెల్లి ఊశిపడ్డట్లు” ఉన్నారంటారు. “నోట్లో బంగారు చెంచాతో పుట్టాడు” అనడానికి బదులు “బొడ్లె వరాలు పోసుకుని పుట్టిండు” అంటున్నారు. మోసం చేయడంలోగాని,

మొత్తానికి మొత్తంగా ప్రవర్తనలోగాని ఒకరికి మరొకరితో సారూప్యం ఉన్న సందర్భంలో “వీడు వాని జుట్లకెల్లి ఎల్లిండు” అంటున్నారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు బొచ్చెడు ఉదాహరణలు

చూపవచ్చు. ఇంత సొగసుతో వున్న భాషని సినిమాలో గూండాలు మొ||న పాత్రలకు పెట్టి సొమ్ము చేసుకుంటూ పరిహసించడం తెలుగు సాహిత్యంలో పెద్ద విషాదం.

తెలుగు ద్రావిడ భాషల్లో ఒకటి. తెలంగాణ తెలుగు ద్రావిడానికి చాలా దగ్గర. అయిపోవడం, నిండుకోవడం అనే అర్థంలో తెలంగాణలో “ఒడిశిపోవుడు” అన్న మాట వుంది. మలయాళంలో

“ఒడువిల” అంటే చివరికి, ఆఖరుకు అని అర్థం. ఒడిశిపోవుడు అంటే చివరికొచ్చి అయిపోవడమే మరి. తెలుగు పిల్లనగ్రోవిని తమిళంలో పుళ్ళాంగుళల్ అంటున్నారు. తెలంగాణలో దీన్నే

పుల్లంగొయ్య (కొన్ని ప్రాంతాల్లో పిల్లంగొయ్య) గా వ్యవహరిస్తున్నారు. తమిళ పుల్లాంగుళల్ కు తెలంగాణ పుల్లంగొయ్య దగ్గరగా వున్నది. తద్ధార్మార్థక భావార్థం తెలంగాణలో చేసుడు,

చూసుడు, వచ్చుడు మొ|| మాటలతో పేర్కొంటున్నాం. అయితే యితర ద్రావిడ భాషల్లో ఈ త. భావార్థం ఎలా వుందో చూడండి. చెయ్‌వుదు (చేసుడు), పార్‌ప్పదు (చూసుడు),

వరువుదు (రావడం)… ఇలా… ఇవి తమిళంలోనివి. ఇక కన్నడంలో యివే మాడువుదు, నోడువుదు, బరువుదు మొ|| ఈ రీతిలో వ్యవహృతాలు. తమిళ, కన్నడాలు రెండింటిలోనూ

ఉన్న పదాంత ‘దు’ వర్ణం తెలంగాణ ‘డు’ వర్ణం ఒక్కటే! మలయాళంలో వీటినే చెయ్యుక, నోక్కుక, వరుక అంటున్నారు. నల్లగొండలో వ్యవహరించే చేస్కం, చూస్కం, వచ్చుకం లాంటి ‘కం’

అంతాలకు మలయాళం దగ్గరగా లేదూ! తెలంగాణలో పొలానికి ఆఖరు తడి పెడుతున్నప్పుడు “తన్నీరు కట్టుడు” అంటారు. ఈ తన్నీరు తమిళ తన్నీర్ ఒకటే! వచ్చిన చుట్టాల బాగోగులు

బాగా తెలుసుకోవడం, కనుక్కోవడం, వాళ్ళను గౌరవించడం అనే అర్థంలో అర్సుకునుడు అంటున్నాం. ఇది మలయాళంలో “అఱయుక” కు సమీపం. పురుగూ పుట్రా అనే పదానికి

తెలంగాణలో పురుగుబూచి వ్యవహారంలో వుంది. ఈ “బూచి” “పూచ్చి” లోంచి వచ్చింది. పూచ్చి అంటే పురుగు (తమిళం). “తీసుకుని వెళ్ళు” అనే మాటలకు బదులుగా తెలంగాణలో

కొంటవో (కొంట పో) అంటున్నారు. ఇది తమిళంలోని “కొండు పో” కు దగ్గర. “కొండు” అంటే కొని, (గై)కొని, (తీసు)కొని అని అర్థం. పో అంటే పొమ్మని చెప్పడం. అడకత్తెర అన్న

మాటను తీసుకోండి. మలయాళంలో అడయ్‌క్క అంటే వక్క. (పోకలకు సంబంధించినది) దాన్ని కత్తిరించే సాధనం అడకత్తెర.

తెలంగాణలో లయబద్ధమైన భాష వున్నది. నాదాత్మకమైన మాట వున్నది. మాట మాట్లాడితే చాలు ఏదో ఒక సంగీతం జాలువారుతున్నది. మాట్లాడ్డమే కాదు తిట్టినా వీళ్లకు నాదమే ఆత్మ.

అందుకే “తల్లాలిని తిట్టినా తాళం తప్పొద్దురా” అన్న సామెత పుట్టుకొచ్చింది. “కోతి అయినా కొమ్మ తప్పి దుంకదు” అన్న రహస్యం వీళ్లకు బాగా తెలుసు. పాట ఎంత ముఖ్యమో తెలంగాణ

వాసులకి మాట కూడా అంతే ముఖ్యం. లయబద్ధంగా మాట్లాడుకునే మాట తీరే తెలంగాణ పాటకు ఎక్కడలేని బలాన్ని యిచ్చింది. తెలంగాణ మాట ఎంత నాదమయమో చూద్దాం.

తెట్టన తెల్లారుడు, పట్టన గుండె వల్గుడు, బెక్కన బెంగటిల్లుడు, చెటాన చెంపదెబ్బ ఏసుడు, పిటాన పిరం, మూట ముగ్గురు… యిలాంటివి ఎన్నింటినో చూపవచ్చు. మధ్య మాండలికంలో

“తెట్టన తెల్లారుడు” కు బదులు భళ్ళున తెల్లవారడం వుంది. “తెట్టన తెల్లారుడు” లోని యతిమైత్రికీ, “భళ్ళున తెల్లవారడం” లోని ప్రాసయతికీ తేడా లేదూ!

తెలంగాణలో వ్యవహరించబడే అతులం కుతులం, కల్గం పుల్గం, తల్లడం మల్లడం, ఇచ్చుకం పుచ్చుకం మొదలైన మాటల్లోని శ్రుతి సుభగత్వం అతలా కుతలం, కలగా పులగం, తల్లడిల్లడం,

ఇచ్చి పుచ్చుకోవడాల్లో వుందా? అతలా కుతలంలోని అతలాను అతులంగా మార్చుకోవడానికి వీళ్లకు ఏ వ్యాకరణ వేత్తల, పండితుల అనుమతి అవసరం లేదు. వీళ్లకు కావలసింది “కుతుల”

అనే మాటకు అనుకూలంగా “అతలా”ను “అతులం”గా మార్చుకోవడమే! తల్లడిల్లడంలోని 3+5 మాత్రల ఏర్పాటు నచ్చలేదు. వెంటనే 5+5 మాత్రల తల్లడం మల్లడంగా మార్చారు.
అట్లాగే యితర మాటలు. ఇట్లా ఉచ్చారణా విధేయంగా పదాలు, పదబంధాలు, జాతీయాలు, సామెతల్ని మార్చుకోవడంలో వెనుకంజ అన్న ప్రశ్నే లేదు వీళ్లకు. ప్రజల భాషకు పండితుల

పట్టింపులు ఉండవు. వీళ్లా పదాలను అనుకుంటె ఒక్క దగ్గరికి ముద్ద చేయగలరు. అనుకూలంగా లేకుంటే తీగలుగా సాగదీయడమే గాక రేకులుగా పర్యాప్తం చేయగలరు. మాటను

“నాదమయం” చేసే ఈ “పనితనం” సోమన, పోతన, నారన, కొరవి గోపన, కంచర్ల గోపన్న, దాశరథి, సినారె, కాళోజి, అలిశెట్టి, గద్దర్, వెంకన్న, అందెశ్రీ, దేశపతి… యిట్లా

ఎందరిలోనో కనిపిస్తుంది. తెలంగాణలో శ్వాసాలు నాదాలుగా మారడానిక్కూడా యిదే కారణం. కత్తి గట్టుడు, కన్నుగొట్టుడు, కన్ను వెట్టుడు, పనిజేసుడు, వాన్ని గొట్టుడు, వీన్ని దిట్టుడు,

ఇర్గ జూసుడు, ఇర్గవడుడు, కయ్యగోసుడు, గడ్డిదొక్కిచ్చుడు… ఇత్యాదులు.

తెలంగాణ భాషను నాదమయం చేయడంలో “పూర్ణానుసారం” పాత్ర కూడా చాలా గొప్పది చూడండి:

ఇచ్చంత్రం (విచిత్రం), నాగుంబాము (నాగు పాము), తాంబేలు (తాబేలు), లచ్చిందేవి (లక్ష్మీదేవి), చిమ్మంజీకటి (చిమ్మచీకటి), తెల్లందాక (తెల్లవారుదాకా, తెల్లవార్లూ), పుంటికూర

(పుల్లటి కూర), పొద్దుందాక (పొద్దుగూకేదాక), పొద్దుంజాముల (పొద్దుగూకేవేళ), చాంతాడు (చేదత్రాడు), వరంగల్ (ఒరుకల్), తెలంగాణ (తెలుగుస్థానం), డ్రంబు (డ్రమ్ము),

గాంచునూనె (గ్యాస్‌నూనె), సరింగ (సరిగా), ఎదురుంగ (ఎదురుగా), రాంగ (రాగ), పోంగ (పోగా), అనంగ అనంగ (అనగా అనగా), యాసంగి (వేసవి) మొ||నవి. ఇట్లాగే

తెలంగాణ మాటను లయబద్దం చేయడానికి కొన్ని అక్షరాలను ద్విత్వం చేస్తున్నారు. చిత్తగించండి.

మస్సి (మసి), మస్సాల (మసాల), గస్సాలు (గసగసాలు), అనగల్ల మాట (అనగల మాట), దయగల్ల తల్లి (దయగల తల్లి), ఆత్మగల్ల చెయ్యి (ఆత్మగల చేయి), గాలి బొయ్య బొయ్య

ఇసురుడు (గాలి బొయ్యిమని వీచడం), కాల్లు తట్ట తట్ట కొట్టుడు (కాళ్ళు తట తట కొట్టడం), గొర్ర గొర్ర గుంజుకపోవుడు (గొర గొరా లాక్కుపోవడం), పొల్ల కిస్స కిస్స నవ్వింది (కిస్సున

నవ్వడం), లప్ప లప్ప తినుడు, గుట్ట గుట్ట తాగుడు, పల్ల పల్ల ఏడ్సుడు, మిట్ట మిట్ట చూసుడు, బర్ర బర్ర గోకుడు, లట్ట లట్ట తాగుడు, పస్స పస్స తినుడు, పిస్స పిస్స మాట్లాడుడు,

తుప్ప తుప్ప ఊంచుడు మొ||నవి. ఇంతే కాదు పదంలో అసంయుక్తాక్షరాలను సంయుక్తాలుగా మార్చి నాదమయం చేస్తారు. దీన్నీ గమనించండి.

సూత్కం (సూతకం), జాత్కం (జాతకం), పాత్కం (పాతకం), నీట్కం (నీటుకం), కైలాట్కం (కైలాటకం) మొ||నవి. జంజాట్కం, పూట్కం, దోష్కం, కమస్కం (కమ్‌సేకమ్),

తీర్పాటం, తెగారం, జాగారం లాంటివన్నీ యిలా మారి ఊపిరి పోసుకున్న పదాలే! మాటలో సరిసమానమైన ‘తూగు’ను పాటించడంలో కూడా ఈ నాదాన్ని విడిచి పెట్టకూడదన్న రహస్యం

దాగివుంది. “కాండ్రించి ఉమ్మాడు” అన్న వాక్యంలోని “కాండ్రించి”ని తెలుగులో “కాండ్రకిచ్చ” అంటున్నారు. కాండ్రించి లో ఐదు మాత్రలుంటే “కాండ్రకిచ్చ”లో 3+3=6 మాత్రలు ఏర్పడి

“తూగు” సమానమైంది. “ఎండి పోవుడు” అనే మాట తెలంగాణలో “ఎండుకపోవుడు”గా వుంది. 3+4 మాత్రలుగా వున్న మాట తెలంగాణకొచ్చేసరికి 4+4గా మారింది. తెలంగాణ

పదాలకూ, పదబంధాలకూ, సామెతలకూ, పొడుపులకూ ఈ “లయ” ప్రాణం. పిల్ల పుట్టక ముందే కుల్ల గుట్టినట్టు ; తీరు తీరు చీరెలు గట్టుకొని తీర్తానికి పోతె, ఊరుకొక్క చీరె

ఊశిపోయిందట ; పంట గంజి పాసు పాసు, కైకిలి గంజి కమ్మకమ్మ ; నాబికాడ సల్లవడితె నవాబ్ తోని జవాబ్ చెప్పొచ్చు… యివన్నీ నాదమయమైన సామెతలు. ఏతావాతా చెప్పేదేమంటే

తెలంగాణ మాటకు వాదం అద్దితే పాట – సంగీతం రుద్దితే పాట – లయను దిద్దితే పాట – అసలు తెలంగాణమే తెలుగు గానం.

తెలంగాణ భాష అందమైన భాష. చిన్న పిల్లల ముక్కులోంచి చీమిడి కారుతున్నప్పుడు “ముక్కు వచ్చింది, తియ్యండి” అంటారు. “కళ్ళ కలక” ను “కండ్లు వచ్చినయనీ”, గవదబిళ్లల

వ్యాధిని “కుత్కెలు వచ్చినయనీ” లేదా “చెంపలొచ్చినయనీ” వ్యవహరిస్తారు. చేతి, కాలి వేళ్లకు అరుదుగా వచ్చే “జెట్టరోగం” పేరు ఉచ్చరించడానికే భయపడుతారు. మల విసర్జనకు వెళ్లిన

వ్యక్తిని వాడు “సుట్టాల మార్గం బోయిండు” అంటారు. అందమైన నవ్వును “శిల్క నవ్వు”గా పేర్కొంటున్నారు. సౌందర్యాన్ని “సక్కదనం, రామసక్కదనం”, పదాలతో మాట్లాడుతారు. అలికి

పూతలు పెట్టే ఎర్రమన్నును “పుట్ట బంగారం” అంటారు. తెలంగాణ భాష ఆత్మీయమైన భాష. “అన్నా ఎటు వోతున్నవే?” “ఓ అవ్వా! మంచిగున్నవా?”, “తమ్మీ! జెర పైలం”,

“తాతా! ఏం పరాశికాలే?”, “మర్దలు పిల్లా! ఈ నడ్మల జెర్ర నిగనిగ అయినవ్”, “నాయనా ! నా మొర ఏ దేవునికి ముడుతదో!”, “చెల్లే! బావ బతుకమ్మ పండుక్కు పంపలేదానే?”…

ఇట్లాంటి ఆప్యాయమైన వాక్యాలు, వావివరసలు, సహజాతి సహజాలు. తెలంగాణ భాష గ్రాంధికానికీ, కావ్యభాషకీ చాలా దగ్గరైన భాష. భాషావేత్తలకూ, వ్యాసకర్తలకూ, నిఘంటుకారులకూ

వలసినంత సమాచారాన్ని యివ్వగల్గిన అక్షయపాత్ర తెలంగాణ ప్రాంతం. ఏది ఏమయినా ఒక్కటి మాత్రం నిజం. ఇవాళ తెలంగాణ భాష లేని తెలుగు సరస్వతిని ఊహించడమే కష్టం. అట్లాంటి

చదువుల తల్లి చిత్రపటం వుంటే గింటే అది అసమగ్రమే !

*(నలిమేల భాస్కర్ గారి వ్యాసం నుండి....)*

స్త్రీ

"మన అమ్మ పలురకాల చీరలు కట్టినా మనం అమ్మను ఒకేవిధంగా చూస్తాము . అమ్మకూడా తన బాధ్యతలరీత్యా ఒకరికి కూతురుగా ఒకరికి భార్యగా ,మనకు అమ్మగా, బాబాయిలకు వదినగా నానమ్మకు కోడలుగా బహురూపాలుగా విధులునిర్వర్తిస్తున్నా అమ్మమాత్రం ఒకటే." (మన బ్లాగు మిత్రులొకరు తమకు స్త్రీ మీదున్న గౌరవాన్ని ఇలా ప్రకటించారు..)

ఈ జాతిలో పుట్టిన ఏ వ్యక్తికైనా ప్రతి స్త్రీ అమ్మయే. అలా ఎలా అండీ, అందరినీ తల్లి అనుక్కున్నా భార్య భార్యే కదా తల్లి ఎలా అవుతుందీ అని అంటారా... శాస్త్రం అలానే చెప్పింది. పెళ్ళినాటి మంత్రాలలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని అడిగే కోరిక అదే. నీకు గంపెడు మంది పిల్లలు పుట్టినా నీకు చివరి కొడుకును నేనే అవ్వాలి అని. కారణం బయట ఉద్యోగం ,వ్యవసాయం చేసి పిల్లల్ని సాకి పెద్ద చేయడం వల్లనూ, అలసట వల్లనో, అహంకారం వల్లనో, ముసలివాడినయ్యాక అలిగినా, బుంగ మూతి పెట్టుకున్నా, ఓపిక లేకున్నా, నీకు గంపెడు మంది సంతానాన్ని పెంచి పెద్ద చేసిన అనుభవమున్న కారణాన ఆ వయసులో ఏమిటీ చాదస్తం వెర్రి వేషాలు అనుక్కోక అప్పటికి ముసలివాణ్ణయిన నన్నూ నీ చిన్న కొడుకులాగా ప్రేమగా చూసుకో అని ప్రమాణ పూర్తిగా, పెద్దలముందు అడుగుతాడు. అదీ నాజాతి ’స్త్రీ మూర్తి’ కిచ్చిన గౌరవం. ఊరికే పక్క దేశాలనుంచి అరువు తెచ్చుకున్న ఎరుపుదనం, నల్లతనం, అవతలి వేపు నుంచి తెచ్చుకున్న విచ్చలవిడి స్వాతంత్ర్యంతో నోటికొచ్చినట్లు పొల్లు మాట్లాడిన జాతి కాదు నా జాతి.

’మాతృదేవోభవ’ అని చెప్పి స్త్రీ మూర్తికి మొట్టమొదటి పెద్ద పీటవేసిన వాజ్ఞ్మయం మా సొత్తు. యత్రనార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని నొక్కి వక్కాణించే ధర్మం మాది. విచ్చలవిడితనం, విశృంఖలత్వం హెచ్చు మీరిపోయి, ఇండివిడ్యుయాలిటీ పేర పెద్దలమాట వినకపోవడం, ఎదురుతిరగడం, తప్పు చేయడం గొప్ప అని చెప్పుకోవడం వంటివి ప్రచారం జరిగి నేటి యువతని వక్రమార్గాలలో నడిపిస్తున్నవి ఆవైదిక విధానాలే. మానుండి, మా పిల్లలనుండి మా సంస్కృతిని దూరం చేసి మా ధర్మం మీద కత్తిగట్టిన వారు చేస్తున్న దురాగతం.

అందరూ కలిసిమెలసి జీవించడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, కలిసి ఆడడం, కలిసి పని చేయడం, కలిసి భోజనం చేయడం, ప్రసాద బుద్ధితో జీవించడం, ఒకరికొకరు తోడు నిలవడం, బండికి ఒక చక్రం తండ్రైతే ఇంకో చక్రం తల్లిగా మెలిగే కుటుంబ నేపథ్యం మా సొత్తు. అందరిలోనూ దేవుడున్నాడు, దేవుడు లేడు, ధర్మం లేదు అనేవాళ్ళలో కూడా మూర్ఖనారాయణుడున్నాడు అని చాటి చెప్పిన 'శ్రీ రామకృష్ణ పరమహంసాదులు' మా ధర్మ వనంలో పూసిన పూలు. వారు మాకు ఆదర్శం. క్షమ, ఓపిక, ఔదార్యం మా ఆస్థులు. మాలో ధీరులెందరో ఉన్నారు, అవసరార్థం ధర్మంపై జరుగుతున్న కుయుద్ధంలో అవైదిక వాదనలనీ, కుట్రలనీ, కుతంత్రాలనీ .... ధర్మ పరంగానూ, చట్ట పరంగానూ ఎద్రుర్కొనే వీరులుగా మారగలరు.

సనాతన ధర్మంలో స్త్రీ మూర్తి వైభవాలు..

కాఫీ పెట్టవూ - కధ



"కొంచెం కాఫీ పెట్టిస్తావా అమ్మా" మామయ్య ఆశగా అడుగుతుంటే, ఏం చెప్పాలో తెలియక అలా నిల్చుంది మాలతి.

"ఏమ్మా పాలు అయిపోయాయా"మళ్లీ ఆయనే అడిగారు.

భర్త కోసం  ఫ్రిడ్జ్ లో దాచి ఉంచిన కప్పుడు పాలు చూసారా ఏంటీయనా అని మనసులో అనుకుంటూ, "ఆ.. అ..వు..ను మామయ్య" తలదించుకుని సన్నని గొంతుకతో చెప్పింది మాలతి.

"పర్లేదు లేమ్మా" అంటూ మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ గోడ వారగా నడుచుకుంటూ వెళ్ళి తన వాలు కుర్చీలో కూర్చుండి పోయారు మామయ్య.

సుమారు యనభై ఏండ్లు ఉంటాయేమో. వయసులో ఉన్నప్పుడు దర్జాగా, తీరైన అవయవ సౌష్టవంతో, కండపట్టి నిండుగా ఉండేవాడు కాస్తా వయసు మీద పడేసరికి ఎముకల గూడులా సన్నగా అయిపోయాడు. వయసులో ఉన్నప్పుడు ఏ దురలవాట్లు లేకపోవడం చేతనేమో పళ్ళన్నీ ఊడిపోయినా, తన పనులు తాను చేసుకోడానికి శరీరం కొంతైనా సహకరిస్తోంది.

అయినా ఎముకలు తప్పా పిసరంత కండ కూడా కనిపించని ఆ దేహం ఒకప్పుడు కొండలా ఉండేదంటే బహుశా ఎవరూ నమ్మక పోవచ్చు నేమో! వయసు చేసే గాయంతో కండలన్ని కరిగిపోయాయి. 

అరవై వసంతాలు కొండంత ప్రేమను పంచిన అతని భార్య పోయిన దగ్గర నుండి మరీ చిక్కి శల్యం అయిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు దగ్గర కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. ఇప్పుడిలా గుక్కేడు కాఫీ చుక్కల కోసం అలమటిస్తూ ఉన్నాడు.

అతని భార్య బతికుండి ఉంటే అతనికోసం ఆమె కూడా కప్పుడు పాలు దాచి ఉంచేదేమో! అతడి ఆవేదనను అర్థం చేసుకునేదేమో! నోరు పిడచకట్టుకు పోతుంటే, నాలుకతో తడిచేసుకుంటూ, భారంగా నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు. ఏ ఒక్క దురలవా టూ లేని పెద్దాయనకు ఈ కాఫీ తాగే అలవాటు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 

లాక్ డౌన్ కారణం చేత, ఎక్కడా షాపులు తియ్యట్లేదు. పాల వాడు కూడా రాలేనని చెప్పేశాడు. ఎక్కడో పది కిలోమీటర్ల అవతల ఉన్న ఓ షాపు నుండి కొన్ని లీటర్ల పాలు సంపాదించి, తెచ్చాడు కొడుకు. అవన్నీ అయిపోయాయి అంటోంది కోడలు. ఓ గుక్కెడు కూడా మిగాల్లేదా అనుకుంటూ భారంగా చూసాడు. 

ఇప్పుడు కొడుకింట్లో అతడో అతిథి మాత్రమే. ప్రశ్నించి, శాసించే అధికారం కానీ, శక్తి కానీ లేదిప్పుడు. మాటలు పలకడానికే ఓపిక ఉండదు. కోడలు మంచిపిల్ల కాబట్టి తను మాట్లాడే ముక్కలు ముక్కల్లాంటి భాషను అర్థం చేసుకుంటూ, అన్నీ సమయానికి అందిస్తూ ఉంటుంది. ఏదైతే ఏం వీళ్లకు భారం కాకుండా హాయిగా వెళ్లిపోతే చాలు అని రోజూ అనుకుంటూ ఉంటాడు. 

శక్తి మేరకు రెక్కలు ముక్కలు చేసుకుని, కొడుకును ప్రయోజకుడిని చేశాడు. ఒక్కడే నలుసు కావడంతో , వాడి మీదే ఆశలన్నీ పెట్టుకుని ప్రేమగా పెంచాడు. వాడికి ఏదైనా చిన్న బాధ కలిగితే తట్టుకోలేక పోయేవాడు. కొడుకు నోరు తెరిచి అడిగితే చాలు.. అప్పొ సప్పొ చేసైనా తెచ్చి పెట్టేవాడు. 

"ఆ రోజులు ఎంత హాయిగా ఉండేవో కదా!" గతాన్ని గుర్తు తెచ్చుకుని వెనక్కి వాలి ఆలోచనల్లో పడ్డాడు. జీవిత చరమాంకంలో ఉన్న అతడిప్పుడు చెయ్యగలిగింది అదొక్కటే. గతాన్ని, అది మిగిల్చిన తీపి గురుతులనూ నెమరవెస్తూ ఉండడం మాత్రమే అతను చెయ్యగలడిప్పుడు.

కొడుకుతో గడిపిన ఆ అమృత క్షణాలే అతడి స్మృతి పథంలో చిక్కగా నిండుకున్నాయి.

"వాడింకా లేవలేదా అమ్మా?" తన కొడుకును తలుచుకుంటూ మాలతిని ప్రశ్నించాడు. 

"లేదు మావయ్య గారు. అలసి పోయినట్టు ఉన్నారు. తిన్నా వెంటనే నడుం వాల్చేసారు. లేప మంటారా?" మాలతి అడిగింది.

"వద్దులే తల్లీ.. పడుకోని. మళ్లీ ఎన్ని రోజులకు దొరుకుతుందో ఈ నిద్ర." తనలో తను గొణుక్కుంటూ మెల్లగా చెప్పాడు. మాలతి వినిందో లేదో కానీ రాత్రి భోజనాలు సిద్దం చేయడానికి వంటింట్లోకి వెళ్ళి పోయింది.

" పాపం. ఎంత కష్ట పడతాడో నా కొడుకు" మనసులో భారంగా అనుకున్నాడు. వయసులో ఉన్నప్పుడు అతడు పడిన కష్టమేదో చిన్నది అయినట్టు. 

ఒక ప్రైవేటు స్కూల్ టీచర్ గా పని చేసి, చాలి చాలని జీతంతో నెట్టుకు వచ్చి, రాత్రి పదకొండు వరకూ ట్యూషన్లు చెప్పి, మళ్లీ పొద్దున్న పెందళాడే బస్సెక్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు రెండు బస్సులు మారి, రక్తాన్ని చెమటగా ధార పోసి, కొడుకును ఓ గవర్నమెంట్ అధికారిని చేశాడు. ఆ కష్టమంతా మరచి, ఇప్పుడు కొడుకు కష్టం చూసి దుఃఖిస్తున్నాడు. 
ఎంతైనా కన్న ప్రేగు కదా..మమకారం వదలలేక పోతున్నాడు. కుర్చీలో కూర్చుని అసహనంగా కదులుతూ ఆలోచనల్లో పడ్డాడు. ఆలోచనలు..ఇప్పుడు తనతో మిగిలి ఉన్నవి ఇవే కదా. వయసు మీద పడడం వల్ల చూపు మందగించింది. పుస్తకాలు చదవలేడు. వాలు కుర్చీలో కూర్చుని, పాత పాటలు అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉంటాడు. 

కాఫీ నోట్లో పడకపోయే సరికి, తల లాగేస్తోంది. ధ్యాస మరాల్చడానికి పక్కనే ఉన్న రేడియో అందుకుని, తనకిష్టమైన దేవానంద్ పాటలు పెట్టుకుని వింటూ కూర్చున్నాడు.

ఇక రాత్రి కూరకు కూరగాయలు తీద్దామని, ఫ్రిడ్జ్ డోర్ తీసిన ప్రతీసారీ, భర్త కోసం దాచి ఉంచిన ఆ కప్పుడు పాలు తనతో ఏదో చెబుతున్నట్టు అని అనిపించింది మాలతికి. ఈ కరోనా కాలంలో పాలు దొరకడమే కష్టంగా ఉంది. భర్తకు సాయంత్రం పూట కాఫీ లేకపోతే, తలతిరుగుతుందని, ఎలాగోలా పాలు సంపాదించి , కొద్ది కొద్దిగా దాస్తూ నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ కప్పుడు పాలే మిగిలాయి. అవి మామయ్యకి ఇచ్చేస్తే , భర్త ఏం అనడు గానీ అతడు పడే అవస్థ తాను చూడగలదా! తల నొప్పితో విలవిలలాడుతాడు. 

పక్కింట్లో అడిగి చూసింది. వాళ్లకూ పాలు దొరక్క డికాక్షన్ పెట్టుకుని తాగుతున్నారట. బయట షాపులూ లేవు. హోటల్స్ అసలే లేవు. 

మామయ్య వాలు కుర్చీలో కూర్చుని, పాటలు వింటూ ఉన్నారు. పోనీలే కొంచెం అడ్జస్ట్ అయినట్టు ఉన్నారు అని అనుకుంది మాలతి.

"ఆయనకు కాఫీ ఇచ్చేటప్పుడు ఒకవేళ మామయ్య చూస్తే!" అని మనసులో ఒక నిమిషం పాటు అనుకున్నా, "ఆయన కష్టపడి వచ్చే మనిషి. పాపం కాఫీ కూడా లేకపోతే, అలసిపొడూ! మామయ్య అర్థం చేసుకుంటారులే" అని మళ్లీ సర్ది చెప్పుకుంది. 

"పోనీ ఆ కప్పుడు పాలలో ఓ కప్పుడు నీళ్లు కలిపితే? లేదు లేదు.. ఆయనకు చిక్కని కాఫీ ఉండాలి.లేదంటే అస్సలు తాగరు."
"పాపం మామయ్యకు కూడా తలతిప్పుతూ ఉందేమో! పాల పొడి ఉన్నా బాగుండు."
"కప్పుడు కాఫీ చెరి సగం చేసి ఇస్తే!? హ్మ్మ్.. ఉన్న కప్పుడు లో చెరిసగం అంటే ఓ చెంచాడు. అదేం సరిపోతుంది ఇద్దరికీ?!"
"ఆయనకీ విషయం చెప్పి చూస్తే! నాకొద్దు మొత్తం నాన్నకి ఇచ్చే మని, తను అవస్థలు పడతారు. మళ్లీ రాత్రి డ్యూటీకి వెళ్ళాలి. వద్దొద్దు..."
"నిన్ననే గుర్తు పెట్టుకోవలసింది. ఆయన మటుకు ఉన్నాయని ఊరుకున్నా. ఈ రెడ్ జోన్ ఏరియాలో రానని పాలవాడు హ్యాండ్ ఇచ్చాడు. రేపాయన్ని పంపి కనీసం ఒక ఐదు లీటర్లైనా తెచ్చి పెట్టేసుకోవాలి. " 
ఇలా సాగిపోయాయి మాలతి ఆలోచనలు.

భర్త మధ్యాహ్నం తిన్నాక  కునుకు తీసాడు. 
"ఈ లాక్ డౌన్ పుణ్యమా అని కొంత తీరిక దొరికింది ఈయనకి. రోజూ ఎంత ఒత్తిడో! ఎంత శ్రమ పడతాడో!" నిద్రపోతున్న భర్తను చూస్తూ అనుకుంది మాలతి. 

వాలు కుర్చీలో కూర్చున్న మామయ్యనూ చూసింది. ఆయనా కునుకు తీస్తూ ఉన్నాడు. వాలు కుర్చీలోనే ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. ఆయన పెట్టుకున్న పాత హిందీ పాటలు లయ బద్దంగా మంద్రంగా వినిపిస్తూ ఉన్నాయి. 

"మామయ్య మేలుకునే లోపు ఈయన లేస్తే బాగుండు. కాఫీ ఇచ్చేస్తాను." అని అనుకుంటూ భర్తను చిన్నగా కదిలించింది. 

ఇంకా మత్తు దిగని అరమొడ్పు కళ్ళతో ఏంటని ప్రశ్నించాడు భర్త. "లేవండి..సంధ్య వేళ కావొస్తోంది. ఇంకా పడుకుంటే ఎలా?!" అంటూ మెల్లగా తట్టి లేపింది

"ఆప్పుడే సాయంత్రం అయిపోయిందా!" అనుకుంటూ నిద్ర లేచాడు భర్త. "మొహం కడుక్కుని రండి కాఫీ పెడతా"నంటూ వంట గదిలోకి వెళ్లిపోయింది మాలతి.

చప్పుడు లేకుండా మెల్లగా ఫ్రిడ్జ్ డోర్ తీసి, పాలు బయటకు తీసింది. వేడి చేసిన ఆ పాలలో కాఫీ కలుపుతుంటే, కమ్మటి కాఫీ వాసన ముక్కుపుటాలు తాకుతోంది. 

కూర్గ్ నుండి తెచ్చుకున్న స్వచ్ఛమైన, పరిమళ భరితమైన కాఫీ గింజలతో చేసిన కాఫీ అది. దాని సువాసనకే సగం అలసట పోతుంది. ఉత్తేజితం చేస్తుంది. గదంతా కాఫీ సువాసనలు నిడుకుంటుంటే, మాలతి కాఫీ ఫిల్టర్ చేసి, ఒక గ్లాసు నుండి మరో గ్లాసులో పోస్తూ నురగలు తెప్పిస్తూ, భర్త కోసం చిక్కటి కాఫీ కలుపుతోంది.

"మాలతీ....మాలతీ....." భర్త పెద్ద పెద్ద అరుపులు విని, కాఫీ కప్పు కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టీ గబగబా అడుగులు వేస్తూ వెళ్ళింది. 

"ఏంటండి..టవల్ అక్కడే పెట్టాగా.." అంటూ వెళ్ళిన మాలతి, అక్కడి దృశ్యం చూస్తూ కొయ్యబారి నిల్చుండి పోయింది. 

ఒళ్ళో రేడియో పెట్టుకుని, చేతులూ నేలను తాకుతూ కుర్చీలోంచి పక్కకు వాలిపోయి, నిర్జీవంగా పడి ఉన్న మామయ్యను చూసి, బిక్క చచ్చిపోయింది. భయం భయంగా ఆయన శరీరాన్ని పట్టుకొని తిన్నగా కూర్చోబెట్టబోయింది. జీవుడు వదిలిన ఆ దేహం కళా విహీనంగా, శీతలంగా మారి పోయినా, ఆ ముఖంలో మాత్రం ఏదో తెలియని ప్రశాంతత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తన బాగోగులు చూసే మనిషిని , తన కన్నా ముందే వెళ్ళిన తన నెచ్చెలి చెంతకు చేరుకున్నాడనేమో!  మూసి ఉన్న ఆ కళ్ళు నిద్రపోయినట్లు ఉన్నాయి. ఇక చెప్పడానికి, అడగడానికి ఏం లేదన్నట్టు ఆ బోసి నోరు బిగువుగా మూసి ఉంది. ఇక ఆ దేహంతో పని లేదన్నట్టు ఉచ్ఛ్వాస నిచ్వాసలు తమ ఉనికిని కోల్పోయాయి. 

"మాలతీ....నాన్న...నాన్న...కదలటం లేదు మాలతీ" తండ్రి దేహం పట్టుకుని, వెర్రివాడిలా చెబుతున్న భర్త కళ్ళల్లో నీళ్ళు చూసి ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిండుకున్నాయు. కళ్ళతోనే ఆయనిక మనకి లేరు అని బదులిచ్చింది. 

"ఇంతటి దుఖాన్ని తీర్చేవారు ఎవరు మాలతి? అనాథను అయిపోయాను..నేను అనాథను అయిపోయాను..మాలతి. నాన్న కూడా నన్నొదిలి వెళ్ళిపోయారా...ఇక నాకు అమ్మా నాన్న లేరా.. ఈ పాడు లోకంలో నా ప్రేగు బంధమే లేదా.. నాన్న వచ్చే నాన్నా...నా దగ్గరకు మళ్లీ వచ్చే నాన్నా..ఇదంతా ఒక డ్రామా అని చెప్పు నాన్నా..నన్ను ఆటపట్టించడానికి నువ్వు చేస్తున్న నాటకం అని చెప్పు నాన్న...ప్లీస్ నాన్నా వచ్చేవూ.. నువ్వు లేకుంటే నన్ను ఎవరు చూస్తారు.. నేనొచ్చే వరకూ వీధి గుమ్మంలో ఎవరు కాపు కాస్తారు. నా కష్టం చూసి ఎవరు కన్నీళ్లు పెట్టుకుంటారు... నా ఆనందం చూసి ఎవరు సంబరాలు చేసుకుంటారు.. నాకో చిన్న రోగమొస్తే ఎవరు నాన్న నన్నింకా  చిన్నపిల్లాడిలా చూసుకుంటారు!.. సాయంత్రం పూట నాతో ఎవరు నాన్న జీవిత అనుభవాలు , జ్ఞాపకాలు పంచుకుంటారు? నా పిచ్చి కబుర్లు ఆసక్తిగా ఎవరు వింటారు నాన్న. నా దెబ్బలు చూసి ఇకపై ఎవరు కన్నీళ్లు పెడతారు నాన్న.  నా వేలు పట్టుకుని అన్నీ నేర్పించిన నువ్వు,  నువ్వు లేకుంటే ఎలా బతకాలో నేర్పించలేదు కదా నాన్న.  నన్ను మోసం చేసి వెళ్లకు నాన్న.. తిరిగొచ్చే నాన్న.. తిరిగొచ్చెయ్ " తండ్రి దేహన్ని పట్టుకుని ఏడుస్తున్న భర్త ఏడుపులో మాలతి కూడా జత కట్టింది. వెక్కి వెక్కి ఏడ్చింది. కొద్ది సేపటికే వాళ్ళ ఇల్లు స్మశాన రోదనలతో నిండిపోయింది.

సూర్యుడు అస్తమించాడు. గట్టు మీద పెట్టిన కప్పుడు కాఫీ చల్లారి పోయింది. మామయ్య చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు. మాలతి కిచెన్లోని కాఫీ కప్పు వైపు నిర్వేదంగా చూస్తూ ఉండిపోయింది. ఇకపై కాఫీ తాగగలదో లేదో ఆమే చెప్పాలి..