మాటామంతీ - 4
నేనూ... రక్తదానం
---------------
నా పేరు శ్రీధర్ చౌడారపు. వయసు యాభై మూడు సంవత్సరాలు. ప్రభుత్వ ఉద్యోగిగా (సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకునిగా) పనిచేస్తున్నాను.
నేనిప్పటికి నలభై రెండు (42) సార్లు రక్తదానం చేశాను. రక్తదాన ఉద్యమంతో ముడిపెట్టుకుని, కార్యకర్తలుగా పని చేస్తున్నవారు వందలసార్లు ఇచ్చిన దానితో పోల్చుకుంటే నాదేమీ పెద్దసంఖ్య కాకపోవచ్చును. కానీ నా మట్టుకు ఒక సాధారణ వ్యక్తిగా ఆ సంఖ్య పెద్దదే, మీలో చాలా మందితో పోల్చుకుంటే. ఎందుకంటే మనలో చాలా మంది రక్తదానం చేయరు. కొంతమంది రక్తదానం అనే మాట అంటేనే భయపడుతుంటారు. అసలు ఒక్కసారి కూడా రక్తదానం చేయని వాళ్ళు కూడా నా పరిచయస్తులైన మీలో / మనలో ఎందరో ఉన్నారు.... అర్థరహితం అయిన భయంతో.
నేను ఇంతగా రక్తదానం చేయటానికి ఒక కారణం ఉంది. 1986 వ సంవత్సరంలో నేను నిజామాబాదులో టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ప్రమాదం జరిగి ఎడమకాలు మోకాలి వద్ద ఫ్రాక్చర్ అయ్యింది. నాందేడ్ (మహారాష్ట్ర) లోని శివాజీ పుత్లా వద్దకల 'వాడేకర్ హాస్పిటల్' లో సర్జరీ జరిగింది. అప్పట్లో అందరు స్పెషలిస్టులు ఉండే కార్పోరేట్ హాస్పిటల్‌లు లేవు. ఒక నర్సింగ్‌హోమ్ ఒక ఫిజీషియన్ లేదా సర్జన్ ఆధ్వర్యంలో నడిచేది. ఒకరిద్దరు స్పెషలిస్టులు (గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్లు ఉండేవారు. మిగతావాళ్ళను అనస్థటిస్ట్ (మత్తు డాక్టర్) తో సహా అవసరం పడినప్పుడు కన్సల్టెంట్ గా పిలిచేవారు. అలా పిలవబడిన 'రవీంద్ర ఝావర్' అనే ఔరంగాబాద్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది.
ఇక ఆ పుండు నయం కావాల్సి ఉంది. దానికై యాంటీబయాటిక్స్ ఇచ్చారు. అందులో ఒక మెడిసిన్ నాకు సరిపడక, రియాక్షన్ అయి మెత్తం శరీరం అంతా విషపూరితం అయ్యింది. అరికాళ్ళలో, అరచేతులలో నీళ్ళు నిండిపోయాయి. ఆ చర్మాన్ని తొలగించి ఆ నీళ్ళు తీసేసారు. నోట్లోని, నాలుకపైని, పెదాలపైని చర్మం మురిగినట్లుగా మారితే తొలగించారు. కళ్ళల్లో, చెవుల్లో, ముక్కులో ఇన్ఫెక్షన్లు. రియాక్షన్ తగ్గించే మందులు ఎన్ని వేర్వేరువి ఇచ్చి, డాక్టర్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోగా... రోజురోజుకూ పరిస్థితి విషమించి పోయింది. ఓ రోజంతా నేను స్పృహలో లేకుండా (కోమా కావచ్చు) పోయానని మా వాళ్ళు చెప్పారు. అదే రోజున 'డాక్టర్ వాడేకర్'.... "మీరు మీ అబ్బాయి 'బాడీ'ని ఇంటికి తీసుకెళ్ళే ఏర్పాటు చేసుకోండి" అని చెప్పారట. అంటే నేను బతికే ఛాన్సులు పెద్దగా ఏమీ లేవు అని డాక్టరుగారు నిర్ధారణకు వచ్చేశారన్న మాట.
ఆ మాటతో బెదిరిపోయిన మా కాక (చిన్నాన్న) డాక్టర్‌తో పెద్ద గొడవపడి "ఏమైనా చేయండి, ఎంత ఖర్చయినా ఫర్వాలేదు....కానీ మా వాడిని బతికించే ప్రయత్నం చేయండి"... అని అంటే ఆఖరి ప్రయత్నంగా 'అశోక్ కుమార్ జాదవ్' అనే మరో డాక్టర్‌ను కన్సల్టెంట్ ఫిజీషియన్ గా పిలిపించారు. ఆ డాక్టర్ గారు నన్ను పరిశీలించి, నాకు వాడిన మందులను గమనించి.... తన / ఆఖరి ప్రయత్నంగా 'ఎఫ్కార్లిన్' అనే మందును వాడి రియాక్షన్ తో విషపూరితం అయిన నా శరీరాన్ని సాధారణ స్థితికి తెచ్చే ప్రయత్నం చేశారు.
అయితే ఆ మందులు పనిచేస్తున్నా కూడా, నా శరీరంలోని రక్తంలో దాని ప్రభావంతో మెరుగయ్యే లక్షణాలు అంతగా కనబడక పోవడంతో నాకు ఆరోగ్యవంతుని రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని అన్నారు. నా రక్తం 'బీ పాజిటివ్' గ్రూపుది కావడం, నాన్నది కూడా 'బీ పాజిటివ్' కావడంతో... ఒక యూనిట్ రక్తం నాన్న ఇచ్చాడు. ఇంకా మరో రెండు యూనిట్లు అవసరం అవడంతో బయట నుంచి కొనుక్కోవాల్సి వచ్చింది.
అప్పుడు స్వచ్ఛంద రక్తదానం పట్ల అవగాహన అంతగా లేకపోవడంతో, రక్తం కావాలి అంటే... తమ రోజూవారీ ఖర్చుల నిమిత్తం రక్తాన్ని అమ్ముకునే బీదవాళ్ళను (ముఖ్యంగా రిక్షావాలాలు) సంప్రదించాల్సి వచ్చింది (వాళ్ళ వివరాలు, అడ్రసులూ హాస్పిటల్ వాళ్ళ దగ్గర ఉండేవి లెండి). అలా పిలిపిస్తే వచ్చిన ఇద్దరు రిక్షావాలాలు ఇచ్చిన రెండుయూనిట్ల రక్తం ఎక్కించిన పిదప... మందులు సమర్థవంతంగా పనిచేసి నా శరీరం బాగయింది. మరో ఇరవై, ఇరవైఐదు రోజుల్లో క్రమక్రమంగా నా శరీరం సాధారణ పరిస్థితికి వచ్చింది.
ఈ రోజున నేను బతికి ఉన్నాను అంటే, అప్పుడు ఇతరులనుంచి / ఆరోగ్యవంతులనుంచి నాకు ఎక్కించిన రక్తమే అనే స్పృహ నాకు కలిగి, నేను కూడా అడపాదడపా రక్తదాన శిబిరాలలో పాల్గొంటూ, బ్లడ్ బ్యాంకుకు వెళుతూ... రక్తదానం చేయడం మొదలెట్టాను. కొన్నిసార్లు సంవత్సరానికి ( మూడునెలల వ్యవధితో) నాలుగు సార్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఇప్పటివరకు నలభై రెండు (42) సార్లు ఇవ్వడం జరిగింది.
మనదేశంలో ఆరోగ్యవంతులు, రక్తదానానికి అనువైన శారీరక పరిస్థితులు ఉన్నవారు ఎందరో ఉన్నప్పటికీ సరియైన అవగాహన లేకపోవడం వలన, అనవసరమైన భయంతో, రక్తదానానికి జనం ముందుకు రావటం లేదు. ఒక్కసారి కూడా రక్తదానం చేయని వాళ్ళు మనలో / ఈ సమాజంలో 95% పైగా ఉన్నారని పక్కాగా చెప్పవచ్చు.
రక్తదానం చేసేందుకు ఈ క్రింది అర్హతలు ఉంటే చాలు.
ఆ) పద్దెనిమిది నుంచి అరవైఐదు సంవత్సరాల మధ్య వయసులోని వాళ్ళు
ఆ) రక్తంలో హిమోగ్లోబిన్....
*12.5 (గ్రాములు/ డెసీలీటర్) ఉన్న ఆడవాళ్ళు,
*12 (గ్రాములు/ డెసీలీటర్) ఉన్న మగవాళ్ళు
ఇ) బరువు .....
*మగవారికి కనీసం 45 కేజీలు,
*ఆడవారికి యాభై కేజీలు ఉన్నవాళ్ళు
ఈ) పల్స్ రేటు 50-100 (ఇర్రెగ్యులారిటీ లేకుండా) ఉన్నవాళ్ళు
ఉ) బ్లడ్‌ప్రెజర్ 50-100 (డయోస్టలిక్), 100-180 (సిస్టోలిక్ ) ఉన్నవాళ్ళు
ఊ) అంతకుముందు మూడు నెలలుగా మలేరియా, టైఫాయిడ్, జాండిస్ లాంటి ఇన్ఫెక్షన్ లేనివాళ్ళు ఎవరైనా రక్తదానం చేయవచ్చు.
అత్యధికంగా సంవత్సరానికి నాలుగుసార్లు (అంటే తడవతడవకీ మూడునెలల వ్యవధిలో) రక్తదానం చేయవచ్చు.
రక్తదానానికి ముందుకొచ్చే వాళ్ళు ఎక్కువగా విద్యార్థులే. వివిధ కళాశాలల్లోని ఎన్. సి.సి లేదా ఎన్.ఎస్.ఎస్. కో-ఆర్డినేటర్ లు వివిధ బ్లడ్ బ్యాంకులతో సంబంధాలు కలిగి ఉండి సామాజిక సేవలో భాగంగా వారి విద్యార్థులతో సంవత్సరానికి రెండు మూడుసార్లు, యాభై నుంచి వంద యూనిట్లు రక్తదానం చేయిస్తారు. అలాగే కొంతమంది సినిమా హీరోల/ రాజకీయనాయకుల అభిమానులు ఆ హీరో / నాయకుని పుట్టినరోజున రక్తదానం చేస్తారు. అలాగే ప్రభుత్వంలోని కొన్ని శాఖలు ఆయా శాఖల దినోత్సవాల సందర్భంగా తమ ఉద్యోగుల చేత కూడా రక్తదానం చేయిస్తాయి. ఇక లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు సమాజంలోని వివిధ వర్గాల యందలి రక్తదాన అర్హులను గుర్తించి, వాళ్ళను సమీకరించి ప్రతినెలా కొన్ని కొన్ని పట్టణాల్లో ఈ శిబిరాలు నిర్వహించటం గమనించగలం.
అయితే రక్తదాతల సంఖ్యలో సింహభాగం విద్యార్థులదే కావడం వలన... ఆ విద్యార్థులు సెలవుల్లో అందుబాటులో ఉండకపోవడం వల్ల వేసవిలో రక్తదానం శిబిరాలు అంతగా ఉండవు. అందుకే ఈ కాలంలో రక్తం కొరత అధికంగా ఉంటుంది. హాస్పిటల్స్ అవసరానికి తగినంత రక్తం అందుబాటులో ఉండదు.
అందుకే ప్రతి బ్లడ్‌బ్యాంకు వారు వేసవిలో రక్తదాన శిబిరాలకై విశ్వప్రయత్నాలు / విఫలప్రయత్నాలు చేస్తుంటారు. ఈ మధ్య వచ్చిన కొత్త టెక్నాలజీ వలన రక్తంలోని ప్లాస్మా, ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్లు మొదలగు వివిధ కణాలను వేరుచేస్తున్నారు. అందువలన ఇప్పుడు ఒక యూనిట్ రక్తం నుంచి నలుగురు రోగుల అవసరాలు తీరుతున్నాయి. అయినా ఇంకా రక్తం కొరత ఎంతో ఉంది.
మన శరీరంలో దాదాపు ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. అది శరీరపు కనీసం అవసరం కంటే అధికమే. దానిని అలాగే దాచుకుంటే మనకేమీ లాభం లేదు. మనం మూడు నెలలకు ఒకసారి ఒక యూనిట్ అంటే మూడువందల మిల్లీ లీటర్ల రక్తం ఇవ్వడం వలన మన శరీరానికేమీ ఢోకా లేదు. మనం ఇచ్చే రక్తం ప్రమాదాలు పాలైన వారికీ, అనారోగ్యంరీత్యా సర్జరీలు చేసుకుంటున్నవారికి రక్తం ఎక్కించబడి వారికి ప్రాణదానం చేస్తుంది.
రక్తం అనేది కర్మగారాల్లో తయారయ్యేదికాదు. అందుకే సాటి మనుషులు / సమాజంలోని మనలాంటివాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేస్తే మంచిది. అన్ని దానాలలోకెల్లా గొప్పది విద్యాదానం అంటారు. దాని సరసన కూచోబెట్టాల్సిన దానాలలో ఒకటి రక్తదానం. అందుకే అర్హులైన అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయాల్సింది. రండి... రక్తదానం చేయండి.
.... శ్రీధర్ చౌడారపు (05.11.2020) /(02.05.2022)