📚ఇంట్లో దేవుని పటాలు ఉండగా గుడికి వెళ్లి పూజచేయడం ఎందుకు?📚
ఇంట్లో దేవతారాధన చేస్తాం. అలాంటప్పుడు ‘గుడికి వెళ్లి పూజచేయడం ఎందుకు?’ అనే సందేహం చాలా మందికి వస్తుంది. దేవాలయంలో మూలవిరాట్టు ఉన్న చోట బీజాక్షర యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. యంత్రాన్ని రాగితో చేస్తారు. దానిమీద బీజాక్షరాలు ఉంటాయి. చక్రాలు వేసి ఉంటాయి. చక్రం బోలెడు కోణాల కలయిక. ఒకసారి ఇందులోకి ప్రవేశించిన ఏ శక్తైనా ప్రతి కోణానికీ తాడనం చెందుతూ పెద్దదిగా మరింత బలమైనదిగా మారుతుంది. రాగి మంచి వాహకం. భూమిలోపల ఉండే విద్యుదయస్కాంత తరంగాల శక్తిని ఒక దగ్గరికి తీసుకురావడంలో యంత్రం గొప్పగా పనిచేస్తుంది. అందువల్ల అక్కడ శక్తిక్షేత్రం ఏర్పడుతుంది.
నిజానికి స్వయంభూ దేవాలయాలన్నింటి దగ్గరా ఇలాంటి శక్తి తరంగాలు అత్యధికంగా ఉంటాయి. అలా దేవుడు వెలసిన చోటును రుషులు గుర్తించి దేవాలయాల్ని నిర్మించేవారు. ఇక, మంత్రబలంతో ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. గుళ్లొ నిరంతరం అర్చన జరుగుతూనే ఉంటుంది. దేవాలయంలో ఎన్ని పూజలు జరిగితే ఆ విగ్రహానికి అంత శక్తి వస్తుంది. ఆ విధంగా ఏళ్లతరబడి ఆ విగ్రహానికి శక్తి ఆపాదన జరుగుతుంది. అందుకే పురాతన ఆలయాలకు వెళ్లడం గొప్పవిషయంగా చెబుతారు....