58. " మహాదర్శనము "--యాభై ఎనిమిదవ భాగము --ఆందోళన
58. యాభై ఎనిమిదవ భాగము-- ఆందోళన
భగవానులు గురుశిష్య సంబంధమై కట్టె విరచి రెండు ముక్కలు చేసినట్లు కరాఖండిగా మాట్లాడి బయలు దేరి వచ్చిన తరువాత , జనక మహారాజు స్థితి విచిత్రముగా మారిపోయింది. " నేను మహారాజుగా శిష్యత్వమును యాచించిననూ ఈతడు గురువును పరీక్ష చేసి వరించు , అంతవరకూ నువ్వు శిష్యుడవూ కాదు , నేను గురువునూ కాదు " అనేసినారే అని కోపము. మరలా , " వారు చెప్పినదీ న్యాయమే. చూచిన వారినందరినీ గురువంటుంటే బతుకుట కష్టము కాదా ? అని సమాధానము. గురువులను వెదకుట ఎలాగ ? అని ఆందోళన. "
జనకుని అభిమానమునకు ఇది రెండవ చెంపపెట్టు. మొదటి సారికూడా ఇదే భగవానులు , అప్పుడు కుమార యాజ్ఞవల్క్యుడై దేవతా రహస్యమును గురించి దేవతనే అడిగితే చాలు అని తిరస్కారము చేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు శిష్యునిగా అంగీకరించమంటే అన్యాపదేశముగా అది సాధ్యము కాదు అని తిరస్కారము చేసి వెళ్ళిపోయినారు. అయితే , అప్పటికన్నా ఈతూరి తిరస్కారము ఎక్కువ. అప్పుడు జనక యువరాజు, ఇప్పుడు జనక మహారాజు.
" సరే , వారిది తప్పు అందామా అంటే , ఆ దినము ఆశ్రమములో మాకు మాత్రమే కాదు , మావారందరికీ కావలసినట్లు యథేఛ్ఛగా ఉపచారములు చేసినారు. అదీగాక , విద్వన్మణియైన దేవి గార్గి కూడా వారిని , ఈ భరత ఖండములోనే అంతటి విద్వాంసులు ఉన్నారో లేరో అని మెచ్చుకున్నారు. ఇలాగున్నపుడు , విద్వదభిమానమునకు పేరు మోసిన విదేహ రాజవంశపు వాడినైన నేను వారిని ఎలా శిక్షించగలను ? నేను రాజాజ్ఞగా ఆ గురుశిష్య సంబంధమును మాట్లాడలేదు. ఏమున్ననూ అది వ్యక్తిగతం. ఈ ప్రశ్నను రాజావమానము అనుటకు లేదు. అలాగ అనవలెనంటే ధర్మమునే తలకిందలు చేసినట్లవుతుంది. ఏమి చేయుట ? "
జనకునికి ఇదే యోచన అయింది. ఎంత యోచించినా భగవానులే సరి అనిపిస్తుంది. ఎలాగెలాగ చూచిననూ గురు పరీక్ష జరగవలెనని మనసు ఒప్పుకుంటున్నది. అయితే పరీక్ష ఎలాగ జరగ వలెను ? అదే ఒక శిరోభారముగా మారింది. ఎంత ఆలోచించినా విధము తెలియరాలేదు.
ఈ చింతలో జనకునికి ఇంకేమీ కాబట్టలేదు. మంత్రి వచ్చినపుడు రాజు నిశ్చింతగా ఉన్నట్టు కనిపించిననూ మాట్లాడునపుడు తప్పించుకొని వస్తున్న దీర్ఘ నిఃశ్వాసలు మనోక్షోభను చూపించినాయి. దేనికీ బెదరని మంత్రి , రాజు కృశించుటనూ , రాజ కార్యములలో మొదటి వలె ఆసక్తి చూపకుండుటనూ చూచి చకితుడై , రహస్యముగా పరిజనమును విచారించినాడు. " భగవానులు వచ్చి వెళ్ళినప్పటినుండీ రాజుగారికి భోజనము మీద అంత అభిమానము లేదు , ఏదో బలవంతానికి తింటున్నట్లే భోంచేస్తారు. ముఖం గంటు పెట్టుకుని ఉండక పోయినా ఎప్పుడూ ఏకాంతములోనే ఉంటారు. తమ ఆలోచనలు ఇతరులెవ్వరికీ తెలియజేయరు. " మొదలైనవి తెలుసుకొని, దీనికేమి కారణముండవచ్చును ? అని విచారించి చూచినారు. భగవానులు వచ్చిన దినము చామర , వ్యజనములు ధరించిన వారిని పిలిపించి అడిగినారు. వారు , " మేము అంతగా గమనించలేదు. కానీ భగవానులు వెళ్ళునపుడు ఏదో గురుపరీక్ష జరగవలెను , ఆ తరువాత చూద్దాము అనో , ఇంకేదో చెప్పినట్లు జ్ఞాపకము. " అన్నారు. మంత్రి దానిపైన కట్టడమును కట్టుటకు సిద్ధుడైనాడు.
ఒకదినము వారికి తోచింది: " మహారాజుల చింతకు కారణమును వారినుంచే ఎందుకు తెలుసుకోరాదు ? అక్కడా ఇక్కడా విచారించి నేను కట్టు ఊహ నిజమూ కావచ్చు , అబద్ధమూ కావచ్చు. " అని మరుదినము తానే వెళ్ళాలని నిర్ధారించుకున్నాడు.
మరుదినము మంత్రి రాజకారణపు నెపముతో దొరవారి వద్దకు వెళ్ళు వేళకు అక్కడికి భార్గవుడు వచ్చినాడు. రాజు అతడితో మాట్లాడుతున్నాడు. మంత్రి వచ్చినాడని తెలియగనే రాజు అతడిని రప్పించుకున్నాడు. " రండి , ఈ దినము తమరి ఆవశ్యకత ఎప్పటికన్నా మాకు ఎక్కువగా ఉంది . మావల్ల సాధ్యము కాని విషయములన్నీ తమరే కదా పరిహరించేది. ఆ సంగతి కన్నా ముందు మన పురోహితుల సంబంధమైన కొన్ని మాటలు మాట్లాడవలెను. అడగండి " అని తన పక్క మంత్రిని కూర్చోబెట్టుకొని , " చెప్పండి , పురోహితులవారూ , తరువాత ? " అన్నారు.
" ఎన్ని సార్లు చెప్పేది , మహాస్వామీ , నేను వారి , అనగా భగవానుల తండ్రిగారి బాల్య మిత్రుడను. ’ నేను ఆశ్రమమునకు వస్తాను , ఇక్కడ అన్నీ కొడుకుకు అప్పజెప్పి ’ అని అడిగితే , ’ అంచెలుగా మీ వైరాగ్యము దృఢమై , మీరు మరలా ప్రపంచము వైపుకు తిరుగుటలేదని ధృవము చేసుకొని రండి ’ అన్నారు. వారన్నదీ మంచిదైంది. నా అహంకారము అంతవరకూ అంతటి దెబ్బ తినిఉండలేదు. అయితే దాని ఫలము మాత్రము నిజముగా మంచిదైంది. నాకు నాలుగు దినములనుండీ ఆలోచన. ఎందుకలాగన్నాడు అని విమర్శ చేసుకొని చూచినాను. అతని మాట నిజము. నాకు తెలియకుండానే అసహనము వచ్చి నిండి మనసును పట్టి పీడించేది. దీనినుండీ వదిలించుకొనుట ఎట్లు అని కూర్చొని ఆలోచించినాను. ఇది తానుగా వదలదు . కాబట్టి ఈ ఉదయము కొడుకునూ , భార్యనూ పిలిచి వ్యవహారముల నన్నిటినీ వారికి అప్పజెప్పినాను. నేను కొంతకాలము ఆశ్రమములో ఏకాంతముగా ఉంటానని చెప్పినాను. వారిని ఒప్పించినాను. ఇక నాకు బదులుగా మరియొకరిని రాజపురోహితుడిగా చేసుకొని నన్ను విడుదల చేయమని ప్రార్థించుటకు వచ్చినాను. "
జనకుడు అడిగినాడు: " అన్నీ వదలి భగవానుల ఆశ్రమానికి ఎందుకు వెళ్ళవలెను ? అలాగ ఆశ్రమవాసులు కావలెనంటే తమరే ఒక ఆశ్రమమును కల్పించుకుంటే చాలుకదా ? "
భార్గవుడు నవ్వినాడు : " మహారాజులు చెపుతున్నది చూస్తే , ఈ సంసారము వద్దు , ఇంకొక సంసారము కట్టుకో అన్నట్లుంది. నేను సంసారమునే త్యాగము చేయవలెనని ఉన్నాను మహాస్వామీ , ఆశ్రమమును కట్టుకొంటే , దినమూ పొద్దుటినుండీ సాయంత్రము వరకూ దాని గురించే చింతయై నేను అంతర్ముఖుడను కావాలనుకున్నది జరగదు. కాబట్టి నేను ఆశ్రమమును కట్టను. ఆశ్రమమును కట్టిఉన్న వారి ఆశ్రమమునకు వెళ్ళెదను. అక్కడ స్వాతంత్ర్యముంటుందా ? అంటారా ? సంకల్పమునే వదల వలెను అనువానికి స్వాతంత్ర్యపు ప్రశ్న ఎందుకు ? వారు అక్కడి నుండీ పంపించి వేస్తేనో ? అంటారా ? ఇల్లు వదలి ఉండుట అభ్యాసమైతే , మనసును వదలుట కూడా అవుతుంది . కాబట్టి నిశ్శంకగా వెళ్ళిపోతాను. అనుమతి కావలెను. "
" మాకూ ఇటువంటిదే ఒక సందర్భమొచ్చింది. అయితే మేము తమంత సులభముగా బట్టకు కావిరంగు అద్దుకొని వెళ్ళలేము. మంత్రిగారు వినవలెను , మా సంకటము కూడా భగవానుల వలననే వచ్చింది . ఆ దినము వారు వచ్చినపుడు వారి మాట మాకు బాగా నచ్చింది. మమ్మల్ని శిష్యులుగా పరిగ్రహించి , పూర్ణవిద్యను అనుగ్రహించండి అన్నాము. వారేమనవలెను ? ’ పరీక్ష చేసి గురువులను ఎంచుకోండి , అంతవరకూ మేము మేమే , మీరు మీరే ! మీ దేశములో ఉన్నాము . మీరు రాజులు , మీరు అడిగినదానికి సమర్పణా పూర్వకముగా ఉత్తరమునివ్వ వలెను, ఇస్తాము ’ అన్నారు. అంటే ఏమిటి ? మాటలకు ఇలాగ మోహము చెందితే మీకు గురువు దొరకడు అని నోరు తెరచి చెప్పినట్లే కదా ? అంటే , నువ్వొక పిచ్చివాడివి , నీకెందుకు వేదాంతము ? అన్నట్లే. ఇప్పుడు నేనేమి చేయవలెను ? చెప్పండి , మీరిద్దరూ ప్రవీణులు. మాకోసం ఈ సమస్యను పరిష్కరించండి. "
మంత్రికి రాజు చర్యలన్నీ అర్థమైనవి. ఈ ప్రశ్న రాజు మనోబుద్ధులనే కాదు , అహంకారమునే కాదు , ఆతని తత్త్వమునే పట్టి కెలికివేసింది అన్నది అతడికి అర్థమైనది. అయినా , " తానెందుకు ఇప్పుడు నోరు విప్పవలెను ? పురోహితుడు ఏమి చెప్పునో విని తరువాత విషయమును విమర్శిద్దాము " అనుకొని , లాంఛనముగా రాజు ముఖము చూసి , అనంతరము పురోహితుని ముఖము చూసి , ’ అనుజ్ఞ ఇవ్వండి ’ అన్నాడు.
రాజ పురోహితుడన్నాడు: " మహా స్వామీ , గురు పరీక్ష కూడా ఒక జాతక పరీక్షలాగానే. దీనిని పరిష్కరించుటకు మూడు దారులున్నాయి. మొదటిది , దైవ నిర్భర చిత్తులై దైవము తలచినట్లు కానిమ్ము అని నిశ్చయించుకొని , దైవ వ్యాపారమును నిరీక్షిస్తూ కూర్చొనుట. అయితే అక్కడ అహంకారము నిరోధించుకొని ఉండవలెను. కాబట్టి పౌరుషవంతులకు అది అంతగా నచ్చదు. రెండోది శాస్త్ర మార్గము. కన్యాపరీక్ష , వర పరీక్ష చేసినట్లు ఇక్కడ కూడా శకునాదుల చేత మొదట యోగ్యతాయోగ్యతలను చూచుకొని అనంతరము ఋణాఋణీభావము విమర్శ చేసి నిర్ణయించుట. దీనిపై కూడా స్వాభిమానులకూ , పౌరుషవంతులకూ అంత గౌరవము ఉండదు. ఇక మిగిలినది మానుష మార్గము. ఒకే జాతివైన కొన్ని పదార్థములను చూచి , వాటిలో గుణ తారతమ్యములు మొదలైనవి కనిపెట్టి ఉత్తమమైన దానిని ఎంచుకొనుట. ఇది రాజస్థానము. కాబట్టి మూడవదైన మానుష మార్గమే సరియని తోచుచున్నది. "
" అంటే ? " రాజు అడిగినాడు.
మంత్రి అన్నాడు:" పురోహితుల అభిప్రాయము ఇది : బ్రహ్మవిద్యా సంపన్నులని ప్రఖ్యాతులైన వారందరినీ పిలిపించేది. వారు పరస్పర వాదముల చేత తమ తమ యోగ్యతలను ప్రదర్శించెదరు. వారిలో ఉత్తములని మనసుకు తోచినవారిని ఎంచుకొనుట. అవునా పురోహితుల వారూ ? "
" ఔను కానీ అది అంత సులభము కాని కార్యము. ఇప్పుడు భగవానుల విషయమై చూస్తే , మొదటిది వారు ఆజన్మశుద్ధులు. వారు గురుద్రోహులు అని ఇతరులు వారిని నిందించుట నాకు తెలుసు. అదీ ఒక రహస్యము , వినండి. వైశంపాయనులకు వారిని వదలివేయవలెనని దైవ సందేశము వచ్చి యాజ్ఞవల్క్యులు అక్కడినుండీ వచ్చేసినారు. నిజముగా వారు గురుద్రోహులు కాదు , అంతేకాదు , దైవానుగ్రహ సంపన్నులు. కర్మ కాండ , బ్రహ్మ కాండ రెండింటిలోనూ నిష్ణాతులు అనునది అందరూ ఒప్పుకొనియే తీరవలెను. అయినా రాజ గురువులగుటకు అర్హులా యని పరీక్ష చేసి నిర్ణయించుటయే మంచిది."
" పరీక్ష ఎలా జరగవలెనన్నది చెప్పనేలేదే ? "
పురోహితులు మంత్రుల ముఖమును చూచినారు. ఆ చూపులో , ’ ఆ వివరములను నిర్ణయించుటకు మాకన్నా మీరు సమర్థులు ’ అని స్పష్టముగా చెప్పినట్లుంది. మంత్రులు అది అంగీకరించి అన్నారు : " మహా స్వామీ , బ్రహ్మజ్ఞానులందరూ చేరునట్లు ఒక కూటమిని పిలవవలెను. స్వయంవరములో చేయునట్లు , ఒక భారీ పణమును ఒడ్డవలెను. తమలో బ్రహ్మిష్టులు ఎవరో వారు దానిని తీసుకోండి అనవలెను. అప్పుడు తమకు అపఖ్యాతి లేకుండా వారు వారే నువ్వెక్కువా ? నేనెక్కువా ? అని వాద వివాదములు చేయుదురు. వారిలో అందరికీ సమాధానము చెప్పి నిలుచువారే అందరి కన్నా ఎక్కువ. "
" అది నోటి మాటలతో వాదము చేయు సభ గా మారితే ? "
" అలాగగుటకు లేదు. బ్రహ్మజ్ఞానమనునది వట్టి మాటలు కాదు. అలాగే వట్టి శాస్త్రమూ కాదు . అక్కడ అనుభవము ముఖ్యము. ఉత్త అనుభవము మాత్రము ఉన్నవారు వాదభూమిలో దిగి బతుకుటకు లేదు. కాబట్టి అనుభవపు వెనుక శాస్త్రపు బలమున్నవారు మాత్రము రంగభూమికి దిగుతారు. శాస్త్రానుభవముల తో పాటూ వాచోవైభవము కూడా ఉంటే ఇక చెప్పనవసరము లేదు. "
పురోహితులు మధ్యలో మాట్లాడినారు: " శాస్త్రము చెప్పునదంతా భగవానులకు అన్వయిస్తుంది. వారికి శాస్త్రానుభవములతో పాటూ వాచోవైభవము కూడా ఉంది. అదీకాక, వారు సర్వజ్ఞులు. వారిని మించగలవారు ఎవరూ ఉన్నట్లు కనపడదు. "
రాజన్నాడు , " మేము కూడా భగవానులకన్నా వేరెవరూ లేరు అనేవారమే ! కానీ , ప్రత్యక్షమైననూ ప్రమాణీకరించి చూడవలెను అని మనము ఈ ఆటను రచించవలసినదే. "
" సరే , నా ప్రార్థనను కూడా ఒప్పుకొన వలెనని మరొకసారి వేడుకుంటున్నాను "
" నేను అప్పుడే చెప్పితిని , తమరు మా తండ్రిగారి కాలము నుండీ ఉన్నవారు. రాజభవనము లో ఎప్పుడేమి జరగ వలెనను దానిని తెలిసిన వారు. తమరిని వదలిపెట్టుట ఎలాగ ? "
" దయచేసి వదిలేయండి "
మహారాజు చాలా ఆలోచించినారు. " తమకిష్టమైనట్లే కానీ "
Janardhana Sharma