*శ్రీ పరమానంద యోగి*
🕉️🌞🌏🌙🌟🚩
( శ్రీ పాండురంగ స్వామి భక్తుడు )
పండరీపురం దగ్గరవున్న చంద్రభాగానది ఒడ్డున పరమానంద యోగి అనే పరమభక్తుడు ఉండేవాడు. అతడు అనునిత్యం పాండురంగని ధ్యానంలో తరిస్తూ వుండేవాడు.
ప్రతి ఉదయం ఆయన లేవగానే, యింటి వద్ద కాలకృత్యాలు తీర్చుకుని, చంద్రభాగా నదిలో స్నానమాచరించి, నది ఒడ్డున నిలబడి, భగవద్గీతలోని 700 శ్లోకాలను పఠిస్తూ ఉండేవాడు. ప్రతి శ్లోకం చివరన ఓం పాండురంగాయనమ : అని పాండురంగనికి ఆ ఫలాన్ని అర్పిస్తూ ప్రార్ధించేవాడు. ఈ కార్యక్రమం పరమానంద యోగి, క్రమం తప్పకుండా ప్రతి రోజూ చేసేవాడు.
ఒకరోజు ఆ యోగి వుంటున్న గ్రామంలో భారీవర్షం పడి జనజీవనం స్తంభించిపోయింది. ఆ సమయంలో, శాలువాలు అమ్ముకునే ఒక వర్తకుడు, ఆ గ్రామం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆ వర్తకుని వద్ద వున్న అమూల్యమైన శాలువాలు తడిసిపోయే ప్రమాదం వుండడంతో, తనకు వచ్చే అపారనష్టాన్ని తలుచుకుంటూ, ఆ నష్ట నివారణకు, ప్రతి యింటికీ వెళ్లి , తనకు ఆరాత్రికి ఆశ్రయమివ్వమని కోరసాగాడు.
కానీ, అందరివీ, చిన్న చిన్న యిండ్లు అవడం వలన, యెవరూ ఆయన కోరిక మన్నించ లేదు. సరిగదా, ఆయన ముఖం మీదే తలుపులు వేసుకోసాగారు. ఆ వర్తకుడు, యెంతో దిగులుగా తిరుగుతూ, పరమానంద యోగి వుంటున్న చిన్న గుడిసెకు కూడా వచ్చి, ఆశ్రయం అడిగాడు.
ఆ వ్యాపారి కష్టాన్ని గ్రహించి పరమానంద, వెంటనే లోపలికి రమ్మని ఆహ్వానించి, గుడిసె మొత్తంలో నీళ్లుకారని కొద్ది ప్రదేశాన్ని చూపించి, అక్కడ ఆయన అమూల్య వస్త్రాలు పెట్టుకోమని చెప్పాడు. ఆ చిన్న ప్రదేశంలోనే వర్షంవస్తే,యోగి పడుకునేది, తడవకుండా, అయినా, ఆ సమయంలో, తన అవసరం తనకు గుర్తు రాలేదు,యోగికి.. ఉన్నంతలో ఆ వ్యాపారికి తినడానికి పెట్టి, తానూ, ఆ వ్యాపారి, గుడిసెలో యింకొక ప్రక్క తడిగా వున్న ప్రదేశంలోనే తలదాచుకుని, ఆ రాత్రంతా కాలక్షేపం చేసారు, భగవన్నామ స్మరణలో.
మరునాడు తెల్లవారుతూనే, వర్షం తగ్గుముఖం పట్టింది. ఆవ్యాపారి పరమానంద యింటి నుండి బయలుదేరుతూ, యెంతో కృతజ్ఞతా పూర్వకంగా, ' మీరు నన్నూ, నా కుటుంబాన్ని, కష్టాల బారిన పడకుండా కాపాడారు. మీ ఋణం తీర్చుకోలేనిది. నా కృతజ్ఞతా సూచకంగా, యీ శాలువా తమరికి బహూకరిస్తున్నాను. కాదనకండి. ' అని ఒక అతి ఖరీదైన, సుందరమైన, శాలువా యోగికి యిచ్చి నమస్కరిస్తూ శలవు తీసుకున్నాడు.
ఆశాలువాని కాదనకుండా అంగీకరించాడు పరమానంద యోగి. దానిని నడుముకు కట్టుకుని, యధాప్రకారంగా, నది ఒడ్డుకు బయలుదేరి యోగి, భగవద్గీత శ్లోకాలు వల్లెవేయడం ప్రారంభించాడు. అయితే, నోరు దాని పని చేస్తున్నది గానీ, చేతులు మాత్రం, యెక్కువసేపు జోడించి, పాండురంగని స్తుతించలేకపోతున్నాడు. ఎక్కడ నడుముకు కట్టుకున్న ఆ అందమైన, ఖరీదైన శాలువా తడిసిపోతుందో, మరకలు పడతాయో అని మాటిమాటికీ, దానిని సర్దుకోవడమే సరిపోయింది, యోగీ పరమానందకి.
యోగికి శ్లోకాలమీద ధ్యాస కుదరడంలేదు, శ్లోకం చివర ఓం నమో పాండురంగాయనమ : అన్నాడో లేదో గమనించడంలేదు. ఈ విధంగా ఆరోజు ప్రార్ధన ముగిసింది. ఎంతో అసంతృప్తిగా అనిపించింది యోగికి. తాను చేసిన పొరపాటు అర్ధమైంది. అపరాధనా భావం ముంచెత్తింది యోగీ పరమానందని.
తాను చేసిన ఘోరతప్పిదం తనకు అర్ధమైంది. తననుతాను శిక్షించు కోవాలి
అనుకున్నాడు. వెంటనే, దగ్గరలోని తన వరిపొలంలోకి వెళ్లి, నాగలిని ఆ శాలువాతో కట్టి, దానిని తన నడుముకు బిగించుకుని, పాండురంగని ధ్యానం చేస్తూ, ఆ వరిపొలం దున్నసాగాడు.
ఇంతలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి, తాను నాగలితో ముడివేసుకున్న శాలువాను విప్పి, ' ఎవరు నిన్ను యింత ఘోరశిక్షకు గురిచేసారు. ' అని లాలనగా అడిగాడు. దానికి సమాధానంగా ' బాబూ ! నన్ను ఆపవద్దు. నన్ను యెవరూ శిక్షించలేదు. నన్ను ఆ పాండురంగడు శిక్షించే లోపే, నాకు నేనే ఈ శిక్ష వేసుకున్నాను. ' అని చెప్పిమళ్ళీ శాలువా కట్టుకోబోయాడు.
అందుకు ఆ బాలుడు, ' అయితే, ఆ పాండురంగడే, నిన్ను ఆపితే ఆగుతావా ? ' అని అంటూ, పాండురంగని రూపంలో ప్రత్యక్షమై, ' నీలో ఏ తప్పిదము లేదు. నీకు ఏకొంచెం మమకార వాసనలు వున్నా, అవి యీ నాటితో తీరిపోవడానికే, నీకు యీ శాలువా మీద మమకారం కలిగేటట్లు చేశాను. నీవు ఆ వ్యాపారినుండి, యేమీ ఆశించి అతనికి ఆశ్రయం కలిపించలేదని నాకు తెలుసు పరమానందా ! నీలో వున్న అపరాధభావం యిప్పటితో, తొలగిపోయింది. ' అని భుజం తట్టి పాండురంగడు అంతర్ధానమయ్యాడు.
ఆనందాశ్రువులు వర్షిస్తుండగా, పరమానంద యోగి, పాండురంగని రూపాన్నే తలుచుకుంటూ, అక్కడే కూర్చుండిపోయాడు.
ప్రహ్లాదుడు చెప్పిన నవ విధ భక్తి లక్షణాలలో సారాంశం ఇదేకదా ! శ్రవణం, కీర్తనం, విష్ణోహ్స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం . ఇవే కదా నవ లక్షణాలు.
🕉️🌞🌏🌙🌟🚩