31, మార్చి 2025, సోమవారం

కర్తవ్యాన్ని ఉపదేశించేది

 *కర్తవ్యాన్ని ఉపదేశించేది కాలమే..!!*


కాలాన్ని ఎంత లాలించినా

ప్రతిక్షణం ఎంత బ్రతిమాలినా

ఇష్టమైనప్పుడే పలకరించేది 

కర్తవ్యాన్ని ఉపదేశించిందే కాలమే.....


కాలంకన్నా వేగంగా వెళ్లలేం

ప్రయాణంలో కదిలిపోయే నిశ్శబ్దం

ఘోర తపస్సును సైతం ఎదిరించి

మనసులో అలజడి చేసే సముద్రం...


సువాసనల హృదయాన్ని కదిలించి 

జీవితాన్ని కమ్మేసే సుగంధం మాల

కాంతిలా వెలుగులు విరజిమ్ముతూ 

ప్రతి ముఖంలో ఆనందరేఖల చిరునవ్వే...


చూపులకు అందని నింగి వలయం

సప్తవర్ణాల సొగసుల నిలయం 

ఓర చూపుతోనే తొలిచే సూది మొనలు 

జీవితాన్ని మార్చే మాయదారి కాలమే..


అర్థంకాని కావ్యంగా ప్రతిక్షణం కదిలిపోతూ

ఆనందంలో ఏడ్చే స్వప్న సంధ్యల రేయి 

మధురమైన నిశ్శబ్దంలో కలిసిపోతూ

మూత మూసిన కళ్ళకు విప్పలేని మంత్రం..


గుండె గూటిలో నిత్యం మ్రోగే ఘడియలు

అనిర్వచనీయ గానంతో పలకరిస్తూ

ఎప్పటికీ తీరని జీవిత నిండు ప్రయాణాన్ని 

ముగించడానికి మ్రోగే ప్రళయగంటలు కాలమే..


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(92వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

        *బలరామ కృష్ణులు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*‘‘రాక్షసుడేం చేస్తాడు? ఏమీ చెయ్యడు, చెయ్యలేడు. పదండి, ఎవరికి కావాల్సిన తాడిపండ్లు వారు తినండి. మేమున్నాం మీ వెనుక.’’ అన్నారు.*


*అందరూ కలసి తాళవనానికి చేరుకున్నారు. ఆకాశాన్ని అంటుతున్న తాళవృక్షాలను చూశాడు బలరాముడు.*


*ఆకాశంలో వేలాడుతున్నట్టుగా వృక్షాలకు వేలాడుతున్న తాటిపళ్ళను చూశాడు. చెట్ల మొదళ్ళను చూశాడు. బలంగా ఉన్నాయి. ఉంటేనేం? తన బలం ముందు అవెంత? అనుకున్నాడు బలరాముడు. రెండు చేతులా చెట్లను పట్టుకుని, తొండాన్ని చుట్టి చెట్లను ఏనుగు ఊపినట్టుగా బలంగా ఊపాడు బలరాముడు. ఆ ఊపునకు తాటిపళ్ళు జలజలా రాలిపడ్డాయి. ‘తినండి.’’ అన్నాడు బలరాముడు.గోపాలురు తనివితీరా తినసాగారు. బహురుచిగా ఉన్నాయంటే బహురుచిగా ఉన్నాయంటూ జుర్రుకున్నారు.*


*బలరాముని ఊపునకు కొన్ని చెట్లు విరిగి పడిపోయాయి. మరికొన్ని అయితే ఒరిగి నిల్చున్నాయి. వనం అంతా అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా తయారయింది.*


*ధేనుకాసురుడికి ఈ సంగతి తెలిసింది. అంతే! ఉగ్రుడైపోయాడు. పళ్ళునూరాడు. గాడిదలా ఓండ్రపెడుతూ, కొండలా దొర్లుకుంటూ బలరామకృష్ణుల్ని సమీపించాడు.*


*కృష్ణుడు అతన్ని ఎదుర్కొనబోయాడు. తమ్ముణ్ణి వారించాడు బలరాముడు. వీడు నా వంతు అన్నట్టుగా చూశాడు.*


*కొండలా వచ్చి మీద పడుతున్న ధేనుకాసురుణ్ణి ఒంటిచేత్తో అడ్డుకున్నాడు బలరాముడు. వాడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఎగిరి, రెండుకాళ్ళూ ఎత్తి ధేనుకాసురుని వీపు మీద తన్నాడు బలరాముడు. దెబ్బకు నడుము విరిగినట్టుగా కిందపడ్డాడు అసురుడు. బాధతో గట్టిగా అరిచాడు. లేచేందుకు ప్రయత్నించసాగాడు. లేవనీయలేదు బలరాముడు. అసురుని ముందు కాళ్ళు రెండూ పట్టుకుని అల్లంత దూరానికి విసిరేశాడు. ఎగిరొచ్చి కిందపడ్డాడు అసురుడు. ఎముకులు విరిగిపోయాయేమో! లేవలేకపోయాడు. బలరాముని బలానికి ఆశ్చర్యపోయారు గోపాలురు. మెచ్చుకున్నారతన్ని. బలరాముని చేతికండల్ని నిమురుతూ నిల్చున్నారు.*


*అన్నబలం తమ్ముడికి తెలుసు. అదిప్పుడు ప్రదర్శితమవుతోంది. నలుగురికీ అన్నబలం తెలియాలి అనుకున్నాడు కృష్ణుడు. అందుకే తను కల్పించుకోకుండా దూరంగా నిల్చున్నాడు. నవ్వుతూ నిల్చున్నాడు.*


*ఇంతలో బలాన్ని కూడదీసుకున్నాడు అసురుడు. పరుగు పరుగున వచ్చాడు. బలరాముని మీద దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం విఫలమయింది. పరుగున వచ్చిన అసురుని నాలుగుకాళ్ళూ పట్టుకుని, పైకెత్తాడు బలరాముడు. కొండను తిప్పుతున్నట్టుగా గిరగిరా తిప్పాడు వాణ్ణి. తర్వాత గాడిద రూపంలో ఉన్న ఆ అసురుణ్ణి నేల మీదకి గట్టిగా విసరికొట్టాడు. మెడ విరిగిపోయింది. కళ్ళు పేలిపోయాయి. పొట్ట చీలిపోయింది. ధేనుకాసురుడు చనిపోయాడు.*


*రాక్షసుడు చనిపోయాడని తెలియడంతో కృష్ణుడు సహా గోపాలురంతా హర్షద్వానాలు చేశారు. మెచ్చుకోలుగా బలరాముణ్ణి చుట్టుముట్టారు.*


*ధేనుకాసురుణ్ణి గిరగిరాతిప్పి నేలకేసి గట్టిగా విసిరికొట్టినప్పుడు అప్పుడు కలిగిన అదురుకి తాళవృక్షాలు నేలలోంచి లేచిపడిపోయాయి. చెట్లు ఒకదాని మీద ఒకటి విరిగి పడడంతో వనం అంతా కుప్పకూలిపోయింది.*


*కుప్పకూలిపోతున్న వనాన్నీ, చనిపోయిన ధేనుకాసురుణ్ణీ చూసి అతని బంధుమిత్రులంతా గాడిదముఖాలతో బలరామకృష్ణుల మీద దాడి చేశారు. తమ్ముడు కృష్ణుని సహకారం ఇప్పుడు కావాల్సివచ్చింది రాముడికి. కృష్ణునితో చేయికలిపాడు. రాక్షసుల్ని కృష్ణుడు సహా ఎదుర్కొన్నాడు. అన్నదమ్ములిద్దరూ ధేనుకాసుర బంధుమిత్రుల్ని చంపి పోగులుపెట్టారు. తాళవనంలో ఎక్కడ చూసినా విరిగిపడిన తాటిచెట్లూ, చచ్చిపడి ఉన్న గాడిద ముఖాల రాక్షసులే! ఆ దృశ్యాల్ని చూసి ఆకాశంలోని దేవతలు హర్షించారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఈ శ్లోకంలో శంకరులు తన మనస్సును ఈశ్వరుని పాదపద్మములను ఆశ్రయింపుమని దానికి ఉపదేశం చేశారు.*


*శ్లోకము: 60*


*రోధస్తోయహృతశ్శ్రమేణ పథికః ఛాయాంతరో ర్వృష్టితః*

     

*భీత స్స్వస్థగృహం గృహస్థ మతిథిః దీనః ప్రభుం ధార్మికమ్,*

     

*దీపం సంత మసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా*

     

*చేత స్సర్వభయాపహం వ్రజ సుఖం శంభోః పదాంభోరుహమ్ !!*


*పదవిభాగం :~*


*తోయహృతః = నీటివేగమున కొట్టుకుని పోవువాడికి*

*రోధః = తీరము (వలె)*

*శ్రమేణ = అలసటతో ఉన్న*

*పథికః = బాటసారికి*

*ఛాయాం తరోః = చెట్టు యొక్క నీడలా*

*వృష్టితః = వర్షము వలన*

*భీతః = భయపడినవాడికి*

*స్వస్థగృహం = సుఖమైన ఇల్లువలె*

*అతిథిః = భోజన సమయమునకు పొరుగూరు నుండి వచ్చిన వాడికి*

*గృహస్థమ్ = సంసారివలె*

*దీనః = దరిద్రుడికి*

*ప్రభుం ధార్మికమ్ = ధర్మాత్ముడైన రాజువలె*

*సంతమసాకులః చ = చీకటిలో కొట్టుకొనుచున్నవాడికి*

*దీపం = దీపమువలె*

*శీతావృతః = చలిపట్టుకున్నవాడికి*

*శిఖినం చ = అగ్ని హోత్రము వలె*

*త్వమ్ = నీవు*

*తథా = ఆ ప్రకారముగా*

*సర్వభయాపహం = ఎల్ల భూతములను బాపునదియు*

*సుఖం = సుఖకరమైనదియగు*

*శంభోః పదాంభోరుహమ్ = శివుని యొక్క పాదకమలములను.*

*వ్రజ = ఆశ్రయింపుము*


తాత్పర్యము :


*ಓమనసా ! నీవు, నీటిలోకొట్టుకొని పోవు వాడికి తీరమును వలె, శ్రమచెందిన బాటసారికి చెట్టు నీడను వలె, వాన వలన భయపడే వాడికి సుఖకరమైన ఇంటినివలె,* *అతిథికి గృహస్థుని వలె, ఆర్తుడైన దరిద్రుడికి ధనిక ప్రభువును వలె, చీకటిచే ఆవరింప బడ్డవాడికి దీపమునువలె, చలిచే బాధపడువాడికి అగ్నిని వలె, సర్వ భయములనూ పోగొట్టునట్టియూ సౌఖ్యకరమైనట్టియూ, శివుని పాద పద్మములను చేరుకో.*


*వివరణ :~*


*ఒక్కొక్క రకమైన కష్టం, లేక ఇబ్బంది వస్తే , దాని ఉపశమనం కోసం ఒక్కొక్కరిని ఆశ్రయిస్తాము, ఆ సమస్య పరిష్కరించడానికి ఆవ్యక్తి లేక ఆవస్తువే ఉపకరిస్తుంది. కానీ సామాన్యంగా మన మానవులకు కలిగే అన్ని భయాలనూ పోగొట్టి, రక్షణ కల్పించే శక్తి, ఒక్క పరమేశ్వరునికే ఉంటుంది.* *జగన్నాటక సూత్రధారుడైన పరమేశ్వరుని పాదాలను ఆశ్రయిస్తే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. మన బాధలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. అందువల్ల ఇతర వృథా ప్రయాసలు విడచి, ఈశ్వర పాదారవిందాలను ఆశ్రయించమని శంకరులు సలహా ఇస్తున్నారు. ఆపద వస్తే శంకర పదమే శరణ్యం అని గుర్తించాలి. అందువల్లే శంకరులు ఆ శంభుని పాదపద్మాలను ఆశ్రయించమని తన మనస్సుకు హితోపదేశం చేశారు*

 

*"సర్వ బాధాప్రశమనం, సర్వ సౌఖ్యకరం నృణామ్ ". అంటే ఈశ్వరుని పాదములు సమస్త బాధలనూ తొలగించి, మానవులకు సర్వసౌఖ్యాలనూ కల్గిస్తాయని చెప్పబడింది.*

 

*"న భయం క్వచిదాప్నోతి " అని చెప్ప బడింది.” " సర్వ దుఃఖాతిగో భవేత్ " అనగా అన్ని దుఃఖాలనూ అతిక్రమింపగలడు. అని కూడా ఈశ్వర పాదములకు గల ప్రభావాన్ని గూర్చి తెలుపబడింది.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(91వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

       *చిన్ని కృష్ణుడి లీలలు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*బ్రహ్మమాయను విష్ణుమాయ ఎదుర్కొంది. అన్నిటినీ, అందరినీ కృష్ణమయం చేసేశాడు కృష్ణుడు. ఆలమందల్నీ, మిత్రబృందాన్నీ వెంటబెట్టుకుని ఇంటిదారిపట్టాడు. మార్గమధ్యంలోనే ఎదురొచ్చి ఎవరి ఆవుల్ని వారు, ఎవరి బిడ్డల్ని వారు తీసుకుని వెళ్ళిపోయారు పెద్దలు. చేరదీసిన పిల్లలంతా కృష్ణుడే! పరుగుదీస్తున్న ఆవులన్నీ కృష్ణుడే! ఆ సంగతి ఎవరికీ తెలియదు. మా పిల్లలంటూ, మా ఆవులంటూ ముచ్చటపడ్డారంతా. అలా ఏడాది గడచిపోయింది.*


*ఈ ఏడాదీ బ్రహ్మమానంలో తృటికాలం మాత్రమే! గోవులనూ, గోపాలురనూ దాచిపెట్టేశాను కదా! ఎవరూ లేని బృందావనం ఎలా ఉన్నదో చూద్దామనుకున్నాడు బ్రహ్మ. వచ్చి చూశాడు. చూసి ఆశ్చర్యపోయాడు. బృందావనంలో గోవులు ఉన్నాయి. గోపాలురు ఉన్నారు. అంతా అందరూ సంతోషంగా ఉన్నారు. అల్లరి కృష్ణుడి ఆటలు సాగుతూనే ఉన్నాయి. ఏదీ జరగనట్టుగానే ప్రవర్తిస్తున్నాడతను. ఆలమందలనూ, గోపాలురనూ తేరిపారజూశాడు బ్రహ్మ. చూస్తే ఆవుల్లోనూ, అందరిలోనూ శంఖ చక్రాలతో శ్రీమహావిష్ణువు కనిపించాడు. అంతా అందరూ మహావిష్ణువు అవతారాలనిపించారు. ఆశ్చర్యానికి లోనయినాడు బ్రహ్మ. ఏదీ అంతుచిక్కలేదతనికి.*


*కాస్సేపటికి మాయ తొలగింది. బ్రహ్మకు జ్ఞానోదయం కలిగింది. తన మాయతో విష్ణువును అల్లరిపెట్టాలనుకున్నాడు కాని, తానే అల్లరిపాలయినాడని గ్రహించాడు బ్రహ్మ. విష్ణుమాయను ఎదుర్కోవడం సులభం కాదనుకున్నాడు. కృష్ణుణ్ణి సమీపించాడు. చేసిన తప్పును మన్నించమని వేడుకున్నాడు. వేదగానంతో ఆ దేవదేవుణ్ణి స్తుతించాడు. మాయం చేసిన ఆలమందలనూ, గోపాలురనూ ప్రత్యక్షం చేసి, అనుగ్రహించమని చేతులు జోడించి నమస్కరించాడు. అనుగ్రహించాడు కృష్ణుడు.*


*తన తత్త్వాన్ని బోధించాడతనికి. కృష్ణతత్త్వాన్ని తెలుసుకున్న బ్రహ్మ, ఆత్మానందాన్ని అనుభవించి, అక్కణ్ణుంచి నిష్క్రమించాడు.*


*ఎప్పుడయితే బ్రహ్మ దాచిపెట్టిన గోవులూ, గోపాలురూ ప్రత్యక్షమయ్యారో అప్పుడు తన మాయను ఉపసంహరించాడు కృష్ణుడు. దాంతో అతను సృష్టించిన గోవులూ, గోపాలురూ అదృశ్యమయినారు. బ్రహ్మ దాచిపెట్టిన గోపాలురు, కృష్ణుణ్ణి పరుగున సమీపించారు.* 


*బ్రహ్మమానం ప్రకారం క్షణకాలం వారు కృష్ణునికి దూరమయినారు. ఆ క్షణకాలం కూడా వారు కృష్ణవియోగాన్ని తట్టుకోలేకపోయారు. కృష్ణుణ్ణి సమీపించి, ఒకరు తర్వాత ఒకరుగా అతన్ని కౌగించుకున్నారు.‘‘ఎక్కడకి వెళ్ళావు కృష్ణా! నిన్ను చూడక క్షణకాలం కూడా ఉండలేం.’’ అన్నారు.*


*‘‘ఎక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను. మీతోనే ఉన్నాను, మీలోనే ఉన్నాను.’’ అన్నాడు కృష్ణుడు. వేణుగానం ఆలపించాడు. ఆ గానానికి గోవులూ, గోపాలురూ తన్మయత్వంగా తలలాడించారు.*


*ధేనుకాసురుడు:~*


*అక్కచెల్లెళ్ళలా రోహిణి, యశోద ప్రవర్తించేవారు. వారిలాగానే బలరామకృష్ణులు కూడా మెలగేవారు. క్షణం కూడా ఒకరిని విడచి ఒకరు ఉండేవారు కాదు. కృష్ణుడికన్నా రాముడు పెద్దవాడు. అతను ఆదిశేషుని అవతారం. మహాబలాఢ్యుడు కావడంతో రాముణ్ణి బలుడనీ, బలరాముడనీ వ్యవహరించేవారు. కృష్ణుడులాగానే బలరాముడు కూడా చిన్నతనంలో అనేక గొప్ప పనులు చేశాడు. గోకులానికి దగ్గరగా ఓ తాళవనం ఉన్నది. ఆ వనం నిండా తాటిచెట్లే! ఒకదాని నుంచి ఒకటి వచ్చినట్టుగా, ఒకదానిమీద ఒకటి పడి ఉన్నట్టుగా చెట్లు చిక్కగా ఉంటాయక్కడ. ఆ చెట్లకి గుత్తులు గుత్తులుగా తాటిపళ్ళు వేలాడుతూ ఉంటాయి. వాటిని కొట్టుకుని తినాలని గోపాలురకు ఎప్పటినుంచో కోరిగ్గా ఉంది.*


*అయితే ఆ వనంలో అడుగుపెట్టాలంటేనే భయం. అక్కడ ఓ రాక్షసుడు ఉన్నాడు. వాడి పేరు ధేనుకాసురుడు. గాడిద ఆకారంలో ఉంటాడతను.*


*బంధుమిత్రాదులతో నివసిస్తున్నాడక్కడ. ఇతరులు ఎవరూ వనంలోకి రాకూడదు. వస్తే సంహరిస్తాడు. కంసుడి మిత్రుడినని వాడికి పొగరెక్కువ. ఒకనాడు బలరామకృష్ణుల దగ్గరకి వారి స్నేహితుడు శ్రీరాముడు వచ్చాడు. మిత్రులని వెంటబెట్టుకుని గుంపుగా వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్టుగా ఉండకుండా ఆమాటా ఈమాటా చెప్పి, అసలు సంగతి బలరామకృష్ణుల ముందు బయటపెట్టాడు.*


*ఏంటయ్యా అది అంటే...వాళ్ళందరికీ తాళ్ళవనంలోని తాటిపండ్లు తినాలని ఎప్పటి నుంచో కోరిగ్గా ఉన్నదట! ఆ కోరిక తీర్చుకుందామంటే ఆ వనానికి వెళ్ళేందుకే భయమట. ఎందుకంటే...అక్కడ ఓ రాక్షసుడు ఉన్నాడనీ, వాడికంట పడితే చంపేస్తాడనీ చెప్పాడు. అందుకు పగలబడినవ్వారు బలరామకృష్ణులు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*అజ్ఞానమనే తెరను తొలగించి, తన కన్నుల ఎదుట సాక్షాత్కరింపుమని, శంకరులు ఈశ్వరుని ఈ శ్లోకంలో వేడుకుంటున్నారు.*


శ్లోకము : 58


*ఏకో వారిజ బాంధవః  క్షితి నభో వ్యాప్తం  తమో మండలం*

            

*భిత్వా లోచన గోచరో పిభవతి త్వం కోటి సూర్య ప్రభః*

            

*వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీ దృగ్భవేన్మత్తమః*

            

*తత్సర్వం  వ్యపనీయ మే పశుపతే! సాక్షాత్ప్రసన్నో భవ !!*


*పదవిభాగం:~*


*ఏకః = ఒక్కడయ్యును*


*వారిజబాంధవః = పద్మ బాంధవుడు అయిన సూర్యుడు*


*క్షితినభోవ్యాప్తం తమోమండలం భిత్త్వా = భూమ్యంతరిక్షములు నిండిన అంధకార రాశిని భేదించి*


*లోచన గోచరః అపి = కన్నులకగుపడుచున్నవాడును*


*భవతి = అగుచున్నాడు*


*త్వం = నీవు*


*కోటిసూర్యప్రభః = కోట్లకొలది సూర్యుల యొక్క కాంతి కలవాడవు*


*వేద్యః = తెలిసికొనదగిన వాడవు*


*కిం న భవసి = ఏలకావు?*


*అహో = ఎంత వింత*


*ఘనతరం = మిగుల దట్టమైనది యయ్యును*


*కీదృక్ = ఏపాటిది*


*భవేత్ =అగును?*


*మత్తమః = నా అజ్ఞానాంధకారం*


*తత్ సర్వం = కనుక ఆ అజ్ఞానమంతను*


*వ్యపనీయ = తొలగించి*


*పశుపతే = ఓ పరమేశ్వరా!*


*సాక్షాత్ ప్రసన్నః భవ = ప్రత్యక్షమై అనుగ్రహించు వాడవు అగుము.*


 *తాత్పర్యము :~*


*హే పశుపతీ ! శివా ! సూర్యుడు ఒక్కడే యైననూ భూమి ఆకాశములను ఆవరించిన గాఢాంధకారాన్ని భేదించి, జనుల కంటికి గూడా కనబడుతున్నాడు.*

*నీవు కోటి సూర్యుల కాంతి గలవాడవు. మాకు ఎందువల్ల నీవు కనబడడం లేదు. ఇది చాలా ఆశ్చర్యముగా ఉంది. మరి నాలోని అఙ్ఞానమనే చీకటి , ఎంత గాఢంగా ఉందోకదా !  ఆ అఙ్ఞానాంధకారము నంతటినీ తొలగించి, నీవు నాకు సాక్షాత్కరించి ప్రసన్నుడవు కమ్ము.*


*వివరణ :~*


*శంకరులు ఈశ్వరుని తన ఎదుట సాక్షాత్కరింపుమని కోరుతూ ఇలా వేడుకున్నారు.     " ಓ ఈశ్వరా ! నీవు పశుపతివి.  మేమంతా పశువులం. మావంటి పశువులు అఙ్ఞానమనే చీకటిలో పడి, కళ్ళు కనిపించని స్థితిలో ఉండగా, ఆ చీకటిని పారద్రోలి పాలించవలసిన ప్రభుడవు నీవు. ఆకాశంలో ఉండే సూర్యుడు, పద్మాలకు బంధువు. ఆయన తనకు కోట్లయోజనాల దూరంలో యున్న పద్మాలను తన కాంతి కిరణాలతో వికసింప జేస్తాడు.*

*అతడొక్కడే భూమండలంలోని పద్మాలనన్నింటినీ వికసింప జేస్తున్నాడు. ఈశ్వరా!  నీవు కోటి సూర్యుల కాంతి గలవాడవు. నీ తేజస్సు ముందు కోటి సూర్యులైనా వెలవెల పోతారు. సూర్యుడొక్కడే తన తేజస్సుతో నింగికీ నేలకూ మధ్య ఉన్న చీకట్లను తుత్తునియలుగా చేస్తున్నాడు. నీవు నాకు కనబడడం లేదు.  ఆశ్చర్యంగా ఉంది. నా హృదయంలోని చీకటి , బహుశః బాగా గాఢంగా ఉండి ఉంటుంది. నా లోని అఙ్ఞానాంధకారాన్ని తొలగించడం నీ వల్ల కాదనుకుంటున్నావేమో.  నీ దయ లేకపోవడం  మాత్రం నా దురదృష్టం. నీవు నా యందు దయయుంచి, నాకు సాక్షాత్కరించు. నా అఙ్ఞానాన్ని పటాపంచలు చెయ్యి ప్రభూ !*


*ఒక్క సూర్యుడే చేయగల పని కోటి సూర్యుల కాంతి గల నీవు చేయలేకపోవు. కావున దయతో నాకు సాక్షాత్కరించు.*


*గమనిక : సామాన్యమైన చీకటిని సూర్యుడు తొలగిస్తాడు. మన హృదయాలలోని పెద్ద చీకటిని ఙ్ఞానభాస్కరుడైన భగవంతుడే పోగొట్టగలడు. భగవద్గీతలో విభూతి యోగములో పరమాత్మ ఇదే విషయాన్ని ఇలా చెప్పాడు.*


        *"తేషా మేవాను కంపార్థమ్, అహ మఙ్ఞానజం తమః*

           *నాశయా మ్యాత్మ భావస్థః, ఙ్ఞానదీపేన భాస్వతా !"*


*ಓ అర్జునా! వారి అంతః కరణముల యందు ఉన్న నేను వారిని అనుగ్రహించడానికి తేజోమయమైన తత్త్వఙ్ఞాన రూపమైన జ్యోతిని వెలిగించి, వారి అఙ్ఞానమనే అంధకారాన్ని పోగొడతాను.*


*మనలోని అఙ్ఞానాంధకారాన్ని తొలగించు కోవడం మనవల్ల కాదు. అందుకు పరమేశ్వరుని అనుగ్రహం కావాలి. అది మనపై ప్రసరిస్తే మనలో ఙ్ఞానోదయం అవుతుంది.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

ఓ విశ్వావసు నామ వత్సరామా..

 ఓ విశ్వావసు నామ వత్సరామా..

మాకు మేలు చేయవమ్మా...

కే. శ్యామలా దేవి.

హైదరాబాద్


ప్రకృతి అందాలను ఆరబోస్తున్న తరుణాన

కోకిలల కుహుకుహు గానాల నందిస్తున్న వేళ

మల్లెలు మంచి పరిమళాన్ని వెదజల్లే వేళ

వేప పూతల సువాసనలు గాలిలో

వీస్తూ

మామిళ్లకు కాయలు అందం చేకూరుస్తున్న వేళ

యుగస్య ఆది: యుగాది ఏతెంచె 

శ్రీ విశ్వావసు పేర

ఓ వత్సరమా మాలో మత్సరముల తొలగించి

సద్వర్తనులై విశ్వంలో విహరించేలా

మార్చుము

ఏ రంగంలోనైనా ఇతోధిక అభివృద్ధి కార్యక్రమాల

పరంపర కొనసాగించి దేశాన్ని ప్రపంచ దేశాలకు

మార్గదర్శిగా వెలుగొందేలా చరించేలా తీర్చిదిద్దే

శక్తిని మా యువతకు అందించి నిస్వార్థంగా

దేశాభివృద్ధికి పాటుపడునట్లు  మార్చి

నీ బిడ్డల అభివృద్ధి కోసం నిరంతరం కృషి సల్పు

మోసం దగా కుట్రలకు తావులేక ఆనంద నిలయం గా

ప్రేమ ఆప్యాయత ఆనందానికి స్తానం కల్పించి

ప్రతి హృది విశ్వ మానవ కళ్యాణం కోరు రీతిలో

ఆధ్యాత్మికంగా కొంతలో కొంత పరులకు సాయం

చేయుటకు మార్గం సుగమం చేసి

మనుషులుగా

మారునటుల ఆశావహులుగా యుండునటుల

యేర్చి కూర్చి మార్చి మంచియను పునాదిపై నిల్పుమమ్మా...

ఈ మేలొనరించి సత్సంబంధాలు నెలకొల్పు...

విశ్వా వసు నీకు స్వాగతం

 .

.


.

.విశ్వా వసు నీకు స్వాగతం 

-------------------------

 కొత్త వసంతమా నీకు స్వాగతం 

 కాలచక్రంలో ఎన్నో మార్లు వచ్చావు ప్రతిసారి వస్తావు 


.        అందుకే

 మామిడాకుల తోరణాలతో 

 రంగురంగుల ముత్యాలముగ్గులతో 

 వాడ వాడ ఊరు ఊరంతా 

 అందంగా సింగారించుకున్నది 

 నీకు స్వాగతం పలకడానికి


 ఓ శ్రీ విశ్వాస నామ సంవత్సరమా నీకు సుస్వాగతం 


 కొత్త యుగాది వస్తూ వస్తూ మా  జీవకోటికి మానవాళికి వీటిని తీసుకురా 

 విపత్తులు లేని ప్రకృతిని 

 పుడమి తల్లి తడి ఆరని  జలరాశిని 

 పసిడి పంటలు పాలదారులు 

 మృగ జాతులు జలచరాల సమృద్ధిని 

 జగతికి అన్నం పెట్టే కర్షకుడి ముఖంలో ఆనందాన్ని తీసుకురా 


 ఓ విశ్వావసు  వీటి నుంచి మమ్మల్ని దూరంగా ఉంచు 


 కొత్త కొత్త వైరస్లను మా దరిదాపుల్లోకి

 చేరనివ్వకు 

 దేశ ప్రజల మధ్య అక్రోషాలు అంతర్యుద్ధాలు  రానివ్వకు 

 ప్రపంచంలోని దేశాల మధ్య 

 కలహాల కంచెలు కాదు 

 ప్రేమానురాగాల వార్డులను కట్టే బుద్ధిని ప్రసాదించు 

 గనుల్లో కర్మాగారాలలో  పనిచేసే 

శ్రమ వీరులను ప్రమాదపు అంచుల నుంచి దూరం చెయ్యి 

 వెర్రి వేగంతో ప్రమాదాలు కొనితెచ్చుకునే చెడు వ్యసనాలకు బానిసలయ్యే 

ప్రేమ పేరుతో మోసం చేసే

 తీయ తీయని మాటలతో 

 వంచన చేసే దగాకోరులను 

 దళారులను బడా చోర్ బాబాలను 

 క్షమించకు 

 పసి హృదయాల్లో విషయాన్ని నింపి స్వార్థాన్ని పెంచే సీరియల్ లను సినిమాలను

 బెట్టింగుల పేరుతో యువతను బేజార్ ఎత్తించే సైట్లను 

 సైబర్ నెరగాలను దేశద్రోహులను 

 దోపిడీ దొంగలను నయవంచకులను 

 మట్టుపెట్టి మట్టి కరిపించు 


 విజ్ఞానంతో ప్రజలు ప్రపంచంలో పోటీపడే జ్ఞానాన్ని ప్రసాదించు 

 మన యువతను అన్ని రంగాల్లో 

 ముందుంచు 

 శ్రీ విశ్వా వసు వేలు పట్టి సన్మార్గంలో నడిపించు


 ఓ కాలచక్రమా నువ్వు మంత్రదండానివి  

 నువ్వు ఆడించినట్టు మేము ఆడుతాం

 ఆడాలి కూడా

 ప్రపంచ మానవాళి నీ చేతిలో కీలుబొమ్మలు  

 శ్రీ విశ్వా వసు  మంచిగా ఆడించు 

 జగతికి హితాన్ని ప్రసాదించు.


.                   ప్రజ్ఞామయి 

.                  ------------

.                    హరికృష్ణ

.                    తెలుగు పండిత్

.                    జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నవర్వాల్ మహబూబ్నగర్ జిల్లా.

పద్యం

 శు  భో  ద  యం !!🙏


*బెజవాడ ఆలయంలో రాజద్వారం పై ఉండే*

*ఈ పద్యం గురించి మీకు తెలుసా* !?


*అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ* *దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్*!!


విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు *కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాలనే ఇచ్చేస్తాయి*.


 ఎందుకు అంటే *మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు*. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం. 


కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.


’అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. 


అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, *మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడాని కని ఇటువంటి ప్రయోగం చేశారు*


’అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. ’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.


అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.


’సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.


’తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?


బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి


చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి


మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.


ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.


’రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’


అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.


’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.


అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.


ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’


మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు.


మీరు అస్తమాననూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.


ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు.


కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ అనడానికి కష్టం ఏమిటి?


ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును అనుగ్రహించినారు.


ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ


సర్వేజనా సుఖినోభవంతు ..

సేకరణ🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *న బుద్ధి భేదం జనయే దజ్ఞానాం కర్మ సంగినాం*

         *జోషయే త్సర్వ కర్మాణి విద్వాన్ యుక్త స్సమాచరన్*


తా:-- ఆయాపనులలో నిమజ్ఞులై వుండే అజ్ఞాన ప్రజలలో బుద్ధి భేదమును అనగా ఆ పనుల పట్ల అనాదరమును, అశ్రద్ధను, దురాశను, కలిగించుట విద్వాంసుడైన వానికి తగదు.

*విద్వాంసు డైనవాడు బుద్ధిమంతుడై వుంటూ తాను కూడా ఆయా పనులను చేస్తూ, అజ్ఞానజనులకు కూడా వారి పనులయందు అభిమానమునే కలిగించాలి. లేనిచో లోకమున వ్యవస్థ చెడి సర్వనాశనం జరుగుతుంది*.


 🙏

సోమవారం🕉️* *🌹31, మార్చి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     *🕉️సోమవారం🕉️*

*🌹31, మార్చి, 2025🌹*

    *దృగ్గణిత పంచాంగం*             


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - శుక్లపక్షం*


*తిథి       : విదియ* ఉ 09.11 వరకు ఉపరి *తదియ* పూర్తిగా

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం   : అశ్విని* మ 01.45 వరకు ఉపరి *భరణి*


*యోగం  : వైధృతి* మ 01.46 వరకు ఉపరి *విష్కుంబ*

*కరణం   : కౌలువ* ఉ 09.11 *తైతుల* రా 07.24 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 06.00 - 07.00 & 09.15  - 10.00*

అమృత కాలం  : *ఉ 07.24 - 08.48*

అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.36*


*వర్జ్యం        : ఉ 10.13 - 11.38 & రా 10.17 - 11.43*

*దుర్ముహూర్తం  : మ 12.36 - 01.25 & 03.04 - 03.53*

*రాహు కాలం   :  ఉ 07.35 - 09.07*

గుళికకాళం       : *మ 01.44 - 03.16*

యమగండం     : *ఉ 10.39 - 12.12*

సూర్యరాశి : *మీనం* 

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 06.03*

సూర్యాస్తమయం :*సా 06.20*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.03 - 08.30*

సంగవ కాలం         :      *08.30 - 10.58*

మధ్యాహ్న కాలం    :      *10.58 - 01.25*

అపరాహ్న కాలం    : *మ 01.25 - 03.53*


*ఆబ్ధికం తిధి   : చైత్ర శుద్ధ తదియ*

సాయంకాలం        :  *సా 03.53 - 06.20*

ప్రదోష కాలం         :  *సా 06.20 - 08.41*

రాత్రి కాలం             :  *రా 08.41 - 11.48*

నిశీధి కాలం          :*రా 11.48 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.29 - 05.16*

--------------------------------------------------

        🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)*

*అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం*


*ముకుంద విశిఖం నమదవంధ్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం*

*స చండికమముం ఝటితి సంహృతపురం పర చిదంబర నటం హృది భజ ॥* 

 

    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

******************************

         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: శ్రీ భగవానువాచ


సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి 

ప్రకృతం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి (33)


ఇంద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ 

తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపన్థినౌ (34)


పండితుడు కూడా తన సహజ స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తాడు. ప్రాణులన్నీ తమ తమ ప్రకృతినే అనుసరిస్తాయి. అలాంటప్పుడు నిగ్రహం ఏం చేస్తుంది. ఇంద్రియాలన్నిటికీ తమతమ విషయాలపట్ల అనురాగం, ద్వేషం వున్నాయి. ఎవరూ వాటికి వశులు కాకూడదు. అవి మానవులకు బద్ధశత్రువులు.

జీవితం

 '' ఈ జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి ? '' 


ఒక ఉదయం కొంతమంది శిష్యులతో కలిసి భగవాన్ రమణమహర్షి అరుణాచలం కొండ మీదకి వెళుతుంటే ఒక అమెరికన్ పౌరుడు మహర్షిని '' భగవాన్ , పుట్టుక , కాస్త చదువు , యవ్వనం , ఉద్యోగం లేదా వ్యాపారం , పెళ్లి , పిల్లలు , వ్యాధులు , వృద్ధాప్యం , మరణం ... ఇంతేనా ఈ జీవితం ? దీనికంటూ వేరే ఉద్దేశ్యం ఏదైనా వుందా ? '' అని అడిగితే , మహర్షి ఏమీ మాట్లాడలేదు. [ రమణమహర్షి అంత తక్కువ మాట్లాడిన మనిషి కానీ , లక్షలమందిని ప్రభావితం చేసిన మహర్షి కానీ , ఈ మధ్య కాలం నాటి ప్రపంచ చరిత్రలో మరొకరు లేరు] 


మహర్షి ఏమి చెబుతారా అని వాళ్ళంతా ఎదురుచూస్తున్నారు. కానీ మహర్షి ఏమీ మాట్లాడకుండా అక్కడ పడివున్న ఒక చెట్టు కొమ్మను తీసుకొని దానికి వున్న ముళ్ళలాంటి వాటిని , బుడిపెలను తీసేస్తూ , ఒక బండ రాయి మీద దాన్ని జువిరినట్టు చేస్తూ , చక్కగా తయారుచేసారు. అందరూ ఆయన్ని గమనిస్తున్నారు. కాస్తా ముందుకెళ్ళాక ఆవులు , గొర్రెలు కాచే ఒక పిల్లవాడు , మహర్షి చేతిలో వున్న ఆ కట్టెను చూసి , ముచ్చట పడి '' స్వామీ , ఆ కట్టెను నాకు ఇస్తారా ? '' అని అడిగాడు. మహర్షి ఇచ్చేసారు. తరువాత అమెరికన్ శిష్యుడివైపు చూసారట. అపుడు అతను '' నా ప్రశ్నకు సమాధానం దొరికింది , భగవాన్ ! '' అన్నాడట. 


ఏమిటా సమాధానం ? అని తెలుసుకోవాలంటే ఒక ఆంగ్ల రచయిత వ్రాసిన క్రింది వాక్యాన్ని చదవండి : 


'' The meaning of Life is to find your gift. The purpose of Life is to give it to others.''

పంచాంగం 31.03.2025

 ఈ రోజు పంచాంగం 31.03.2025

Monday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన  విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాస శుక్ల పక్ష ద్వితీయ తదుపరి తృతీయ తిథి ఇందు వాసర అశ్విని నక్షత్రం వైదృతి యోగః: కౌలవ తదుపరి తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00  వరకు.

 




శుభోదయ:, నమస్కార: