31, మార్చి 2025, సోమవారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*అజ్ఞానమనే తెరను తొలగించి, తన కన్నుల ఎదుట సాక్షాత్కరింపుమని, శంకరులు ఈశ్వరుని ఈ శ్లోకంలో వేడుకుంటున్నారు.*


శ్లోకము : 58


*ఏకో వారిజ బాంధవః  క్షితి నభో వ్యాప్తం  తమో మండలం*

            

*భిత్వా లోచన గోచరో పిభవతి త్వం కోటి సూర్య ప్రభః*

            

*వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీ దృగ్భవేన్మత్తమః*

            

*తత్సర్వం  వ్యపనీయ మే పశుపతే! సాక్షాత్ప్రసన్నో భవ !!*


*పదవిభాగం:~*


*ఏకః = ఒక్కడయ్యును*


*వారిజబాంధవః = పద్మ బాంధవుడు అయిన సూర్యుడు*


*క్షితినభోవ్యాప్తం తమోమండలం భిత్త్వా = భూమ్యంతరిక్షములు నిండిన అంధకార రాశిని భేదించి*


*లోచన గోచరః అపి = కన్నులకగుపడుచున్నవాడును*


*భవతి = అగుచున్నాడు*


*త్వం = నీవు*


*కోటిసూర్యప్రభః = కోట్లకొలది సూర్యుల యొక్క కాంతి కలవాడవు*


*వేద్యః = తెలిసికొనదగిన వాడవు*


*కిం న భవసి = ఏలకావు?*


*అహో = ఎంత వింత*


*ఘనతరం = మిగుల దట్టమైనది యయ్యును*


*కీదృక్ = ఏపాటిది*


*భవేత్ =అగును?*


*మత్తమః = నా అజ్ఞానాంధకారం*


*తత్ సర్వం = కనుక ఆ అజ్ఞానమంతను*


*వ్యపనీయ = తొలగించి*


*పశుపతే = ఓ పరమేశ్వరా!*


*సాక్షాత్ ప్రసన్నః భవ = ప్రత్యక్షమై అనుగ్రహించు వాడవు అగుము.*


 *తాత్పర్యము :~*


*హే పశుపతీ ! శివా ! సూర్యుడు ఒక్కడే యైననూ భూమి ఆకాశములను ఆవరించిన గాఢాంధకారాన్ని భేదించి, జనుల కంటికి గూడా కనబడుతున్నాడు.*

*నీవు కోటి సూర్యుల కాంతి గలవాడవు. మాకు ఎందువల్ల నీవు కనబడడం లేదు. ఇది చాలా ఆశ్చర్యముగా ఉంది. మరి నాలోని అఙ్ఞానమనే చీకటి , ఎంత గాఢంగా ఉందోకదా !  ఆ అఙ్ఞానాంధకారము నంతటినీ తొలగించి, నీవు నాకు సాక్షాత్కరించి ప్రసన్నుడవు కమ్ము.*


*వివరణ :~*


*శంకరులు ఈశ్వరుని తన ఎదుట సాక్షాత్కరింపుమని కోరుతూ ఇలా వేడుకున్నారు.     " ಓ ఈశ్వరా ! నీవు పశుపతివి.  మేమంతా పశువులం. మావంటి పశువులు అఙ్ఞానమనే చీకటిలో పడి, కళ్ళు కనిపించని స్థితిలో ఉండగా, ఆ చీకటిని పారద్రోలి పాలించవలసిన ప్రభుడవు నీవు. ఆకాశంలో ఉండే సూర్యుడు, పద్మాలకు బంధువు. ఆయన తనకు కోట్లయోజనాల దూరంలో యున్న పద్మాలను తన కాంతి కిరణాలతో వికసింప జేస్తాడు.*

*అతడొక్కడే భూమండలంలోని పద్మాలనన్నింటినీ వికసింప జేస్తున్నాడు. ఈశ్వరా!  నీవు కోటి సూర్యుల కాంతి గలవాడవు. నీ తేజస్సు ముందు కోటి సూర్యులైనా వెలవెల పోతారు. సూర్యుడొక్కడే తన తేజస్సుతో నింగికీ నేలకూ మధ్య ఉన్న చీకట్లను తుత్తునియలుగా చేస్తున్నాడు. నీవు నాకు కనబడడం లేదు.  ఆశ్చర్యంగా ఉంది. నా హృదయంలోని చీకటి , బహుశః బాగా గాఢంగా ఉండి ఉంటుంది. నా లోని అఙ్ఞానాంధకారాన్ని తొలగించడం నీ వల్ల కాదనుకుంటున్నావేమో.  నీ దయ లేకపోవడం  మాత్రం నా దురదృష్టం. నీవు నా యందు దయయుంచి, నాకు సాక్షాత్కరించు. నా అఙ్ఞానాన్ని పటాపంచలు చెయ్యి ప్రభూ !*


*ఒక్క సూర్యుడే చేయగల పని కోటి సూర్యుల కాంతి గల నీవు చేయలేకపోవు. కావున దయతో నాకు సాక్షాత్కరించు.*


*గమనిక : సామాన్యమైన చీకటిని సూర్యుడు తొలగిస్తాడు. మన హృదయాలలోని పెద్ద చీకటిని ఙ్ఞానభాస్కరుడైన భగవంతుడే పోగొట్టగలడు. భగవద్గీతలో విభూతి యోగములో పరమాత్మ ఇదే విషయాన్ని ఇలా చెప్పాడు.*


        *"తేషా మేవాను కంపార్థమ్, అహ మఙ్ఞానజం తమః*

           *నాశయా మ్యాత్మ భావస్థః, ఙ్ఞానదీపేన భాస్వతా !"*


*ಓ అర్జునా! వారి అంతః కరణముల యందు ఉన్న నేను వారిని అనుగ్రహించడానికి తేజోమయమైన తత్త్వఙ్ఞాన రూపమైన జ్యోతిని వెలిగించి, వారి అఙ్ఞానమనే అంధకారాన్ని పోగొడతాను.*


*మనలోని అఙ్ఞానాంధకారాన్ని తొలగించు కోవడం మనవల్ల కాదు. అందుకు పరమేశ్వరుని అనుగ్రహం కావాలి. అది మనపై ప్రసరిస్తే మనలో ఙ్ఞానోదయం అవుతుంది.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: