4, మే 2023, గురువారం

ఆధ్యాత్మికం

 ఆధ్యాత్మికం ప్రత్యేకం..  శ్రీ కనకాచలపతి లక్ష్మీ నృసింహ ఆలయం ---- కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరుకి 380 కిలోమీటర్ల దూరంలో కొప్పల్ సమీపంలో ఉన్న కనకగిరి పై వెలసిన ప్రసిద్ధ శిల్పకళా ఆలయం ఇది.  భగవంతుడు సర్వాంతర్యామి అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ నరసింహావతారం.  హిరణ్యకశిపుని సంహారం అనంతరం నృసింహుడు సంచరించిన పలు ప్రదేశాల్లో సాకారమైన ఆలయాలలో  శ్రీ కనకాచలపతి లక్ష్మీ నృసింహ ఆలయం ఒకటి.  కనక మహాముని తపస్సునకు విష్ణుమూర్తి నృసింహ అవతారంతో అనుగ్రహించి సాకారమై కొండపై వెలసిన ఆలయం కావడం వలన కనకగిరి అని, శ్రీ కనకాచలపతి లక్ష్మీ నృసింహ ఆలయం అని స్థలపురాణం చెబుతోంది.  16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో యీ ఆలయం పునర్నిర్మాణం జరిగి ఎంతో కళా వైభవాన్ని  సంతరించుకుంది.  తరువాత వచ్చిన పాలకులందరూ ఈ స్వామిని పూజించి తరించారు.    మూడు రాజగోపురాలతో, పంచముఖ ద్వారాలతో శోభాయమానంగా వెలుగొందుతున్న ఆలయం ఇది.  మొత్తం ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో శిల్పాకళా కాంతులతో అలరారుతోంది.  ఈ స్వామిని దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు, ఋణ బాధల నుంచి విముక్తులవుతారని భక్తులు విశ్వసిస్తారు.  నృసింహ స్వామి ఆలయం కావడంతో మహాలక్ష్మి అమ్మవారు క్షేత్రపాలకులుగా ఉన్నారు.  నృసింహుడు, చతుర్ముఖ బ్రహ్మ, మహాశివుడు కొలువై ఉన్న ఆలయం కావడంతో త్రిమూర్తి ఆలయం అని కూడా అంటారు.  అటవీ క్షేత్రంలో వెలసిన ఈ వైష్ణవ ధామం ఆధ్యాత్మిక పెన్నిధిగా చెప్పవచ్చు.  ఆలయంలో వర్ణ రంజిత చిత్రాలు కనువిందు చేస్తాయి.  ప్రతి కట్టడంలో శిల్పకళా వైభవం చూపరులను ఆకర్షిస్తుంది.  ఏటా ఫాల్గుణ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలను చూడటానికి లక్షలాది భక్తులు తరలివస్తారు.  అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.  వైశాఖ మాసంలో నృసింహ స్వామి జయంతి సందర్భంగా కూడా (రేపు.. మేం 04 - 2023) ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటారు.  కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ కనకగిరి శ్రీ కనకాచలపతి లక్ష్మీ నృసింహ ఆలయం విరాజిల్లుతోంది.  ఆ దివ్య తేజోమూర్తి సందర్శనం ఫలప్రదం క్షేమదాయకం.  ----- స్వామి (నాని)..

సినిమా హాలుల కబుర్లు

 నాటి సినిమా  హాలుల కబుర్లు 


అప్పట్లో టికెట్లు ధర నేల 25, బెంచి 40, కుర్చీ 75 పైస‌లు.  థియేట‌ర్ల ప్ర‌త్యేక‌త ఏమంటే టికెట్లు ఇస్తూనే వుంటారు. 


నేల ఫుల్‌గా నిండి ఒక‌రి భుజాల మీద ఇంకొక‌రు కూచున్నా బుకింగ్ ఆగ‌దు. లోప‌ల భీక‌ర యుద్ధాలు జ‌రుగుతున్నా గేట్ కీప‌ర్ చ‌లించ‌డు. బెంచ్ క్లాస్‌లో అయితే ఎగ‌స్ట్రా బెంచీలు, బాల్క‌నీలో ఇనుప కుర్చీలు వేస్తారు. నేల‌కి ఆ సౌక‌ర్యం లేదు. ఒక‌రి మీద ఇంకొక‌రు , ఎవ‌రి మీద ఎవ‌రు కూచున్నారో వాళ్ల‌కు కూడా తెలియ‌దు. కొంద‌రైతే స్క్రీన్ ముంద‌రున్న అరుగు మీద కూచుని కొండ‌ల్లా క‌నిపించే హీరో ముఖాన్ని చూసి జ‌డుసుకునే వాళ్లు. ఆడ‌వాళ్ల నేల‌క్లాస్‌లైతే కుళాయి నీళ్ల‌లా ధారాపాతంగా బూతులు, కొంద‌రైతే జుత్తు ప‌ట్టుకుని ఉండ‌ల్లా దొర్లేవాళ్లు. ఫ‌స్ట్ షోకి వ‌చ్చిన ఆడవాళ్లు సెకెండ్ షో వ‌ర‌కూ తిట్టుకునే వాళ్లు.


ఈ ఉత్పాతంలో సినిమా స్టార్ట్ అయ్యేది. ఊపిరాడ‌ని ఈ స్థితిలో కూడా బీడీలు, సిగ‌రెట్లు ముట్టించి "బుస్‌"మ‌ని పొగ వ‌దిలేవాళ్లు. తాగిన వాళ్ల‌కి, తాగ‌ని వాళ్ల‌కి స‌మానంగా ద‌గ్గొచ్చేది. సినిమా మాంచి ర‌సప‌ట్టులో అంటే ఎన్టీఆర్ క‌త్తిని ముద్దు పెట్టుకుని ఒంటిచేత్తో తిప్పుతున్న‌ప్పుడు రెండు ఈల‌లు, ఆయ‌న డూప్ రెండు చేతుల‌తో తిప్పుతున్న‌ప్పుడు ప‌ది ఈలలు వినిపిస్తూ వుండ‌గా అంద‌రినీ తొక్కుతూ కొంద‌రు ప్ర‌వేశించేవాళ్లు.


"ఎవ‌రిక‌యా నిమ్మ‌సోడా" అని ఒకడు, "వేయించిన శ‌న‌క్కాయ‌లూ" అని ఇంకొక‌డు, "చ‌క్కిలం, చ‌క్కిలం" ఇలా రాగ‌యుక్తంగా పాడుతూ అడిగిన వాళ్ల‌కి కుయ్యిమ‌ని సౌండ్‌తో సోడా, తుప్పు ప‌ట్టిన పావుతో శ‌న‌క్కాయ‌లు కొలిచి ఇచ్చేవారు. ఇంత ఇరుకులో కూడా ప‌ద్మ‌నాభం, రాజ‌బాబు వ‌స్తే జ‌నం ప‌కప‌క న‌వ్వేవాళ్లు. అంజ‌లిదేవిని చూసి ఏడ్చేవాళ్లు.


ఇక బెంచిల్లోకి వెళ్దాం. థియేట‌ర్ పుట్టిన‌పుడు కొన్ని వేల న‌ల్లులు బెంచిల్లోకి వ‌ల‌స వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల రాక కోసం ఎదురు చూస్తూ, వ‌చ్చిన వెంట‌నే కుటుంబ స‌మేతంగా దాడి చేస్తాయి. మొద‌టిసారి కుట్టిన‌పుడు ఉలిక్కిప‌డ‌తాం. రెండోసారి ప‌డ‌తాం. త‌ర్వాత అల‌వాటు ప‌డ‌తాం. ఆ దుర‌ద‌కు త‌ట్టుకోలేక కొంద‌రు లేచి నిల‌బ‌డి గీరుకుంటారు. వెనుక ఉన్న వాళ్లు కూచోమ‌ని అరుస్తూ వుంటారు.


కొంద‌రు సీనియ‌ర్ ప్రేక్ష‌కులు ఉంటారు. వాళ్ల‌కి న‌ల్లుల‌తో అనుభ‌వంతో పాటు శాశ్వ‌త శ‌త్రుత్వం వుంటుంది. అందుక‌ని అగ్గిపుల్ల గీచి బెంచి సందుల్లో తిప్పుతారు. దీంతో ప్ర‌యోజ‌నం ఏమంటే కొన్ని న‌ల్లులు వీర‌మ‌ర‌ణం పొందుతాయి. అయితే క‌సి, ప‌గ‌, ప్ర‌తీకారంతో మిగిలిన‌వ‌న్నీ కుట్ట‌డం ప్రారంభిస్తాయి. ఈ కుట్ల‌కి ప్రేక్ష‌కులు బెంచీల మీద ఎగిరెగిరి ప‌డుతూ వుంటారు. ఈ క్లాస్‌లో కూడా పొగ ఉచితం. బీడీల కంపు త‌క్కువ‌, సిగ‌రెట్ల కంపు ఎక్కువ‌.


బాల్క‌నీలో కుర్చీలు ఉంటాయి. వాటి చ‌ర్మం చిరిగిపోయి లోప‌లున్న కొబ్బ‌రి పీచు, దూది పొట్ట‌పేగుల్లా క‌నిపిస్తూ వుంటాయి. కుర్చీల్లో పెద్ద‌గా న‌ల్లులుండ‌వు. కానీ మేకులుంటాయి. అవి మ‌న బ‌ట్ట‌ల మీద ఇష్టం పెంచుకుంటూ అజాగ్ర‌త్త‌గా లేస్తే ప‌ర్‌మ‌ని సౌండ్. బాల్క‌నీలో ప్రొజ‌క్ట‌ర్ రూమ్ కూడా వుంటుంది. సోడాలు, శ‌న‌క్కాయ‌ల ట్రాఫిక్ పెరిగిన‌ప్పుడు వాళ్ల త‌ల‌కాయ‌లు స్క్రీన్ మీద క‌నిపిస్తూ వుంటాయి.


అన్ని క్లాస్‌ల్లోనూ ఫ్యాన్లు వుంటాయి. అయితే ఫ్యాన్ కింద సీటు సంపాయించ‌డం చాలా క‌ష్టం. సంపాయించినా అది స‌వ్యంగా తిరిగే ఫ్యాన్ అయి వుండ‌డం మ‌రీ క‌ష్టం. ఎందుకంటే చాలా ఫ్యాన్లు పూనకం వ‌చ్చిన‌ట్టు గీక్ గీక్ అని అరుస్తూ వుంటాయి. అవి ఊడి మీద ప‌డ‌క‌పోవ‌డం మ‌న అదృష్టం.


ఇక్క‌డితో మ‌న క‌ష్టాలు ఆగ‌వు. క‌రెంట్ వాళ్ల ద‌య ఉండాలి. ప‌వ‌ర్‌క‌ట్‌. జ‌న‌మంతా పిచ్చెక్కిన‌ట్టు ఈల‌లేస్తారు. జ‌న‌రేట‌ర్లు లేని కాలం కాబ‌ట్టి క‌రెంట్ కోసం ఎదురు చూడాల్సిందే. రాక‌పోతే పాస్‌లు ఇచ్చి పంపుతారు. మ‌రుస‌టి రోజు వ‌చ్చి చూడాలి.


రిలీజైన ఏడాదికి ఆంధ్రదేశ‌మంతా ఆడిన త‌ర్వాత మాకు వ‌చ్చేది. పాత ప్రింట్లు కావ‌డంతో సినిమా అంతా గీత‌లు గీత‌లు వ‌చ్చి క‌ట్ అయ్యేది. ఇన్ని విప‌త్క‌ర ప‌రిస్థితుల మ‌ధ్య కూడా సినిమాని ఎంజాయ్ చేసేవాళ్లం.ఇపుడు ఇన్ని సౌక‌ర్యాల మ‌ధ్య సినిమా చూస్తున్నా ఆ ఉత్సాహం, ఆనందం రావ‌డం లేదు. అమాయ‌క‌త్వంలోని ర‌హ‌స్యం అదేనేమో!


  - సేకరణ

నృసింహావిర్భావం

 *వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున "నృసింహావిర్భావం"*

నరసింహ ఉపాసన శ్రీవేంకటేశ్వర పదసేవకు సోపానం

నరసింహ అవతారం తక్కిన అవతారాల కన్నా చాలా విశిష్టమైనది. తాను ఆర్తత్రాణపరాయణుడు, భక్త జన పరిపాలకుడు అని నిరూపించే అత్యంత అరుదైన అవతారం. తన భక్తుడు ఏవైపైతే వేలు చూపడం ఆపాడో అక్కడనుండి అవతరించి తన భక్తుని నమ్మకాన్ని నిరూపించిన భక్త పరాధీనుడు. క్షణాలలో క్రోధాన్ని ఆవహింప చేసుకుని తమోగుణప్రధాన రూపమై తానే రుద్రుడై వచ్చాడు శ్రీహరి నరసింహస్వామీయై. అర్ధ మానవ, అర్ధ సింహ రూపంలో అత్యంత అరుదైన రూపము. ప్రదోషకాలంలో శివునికి ఎలా పూజలు జరుగుతాయో అలాగే కేవలం నరసింహ స్వామికి కూడా జరుగుతాయి. శివుడే విష్ణువు అని నిరూపించే మరొక లీల ఇది. అటువంటి నృసింహ ఉపాసన చేసి భవసాగరాలు దాటిన మహనీయులు ఎందరో..

ఆది శంకరులు పలుమార్లు నృసింహ స్మరణ మాత్రం చేత కాపాడబడ్డారు. ఆయన పరకాయ ప్రవేశం చేసి తిరిగి తన శరీరంలో వెళ్ళబోవు సమయంలో ఆ రాజభటులు ఆ శరీరానికి నిప్పు పెట్టి ఆహుతి చేయ్యబోగా కరావలంబ స్తోత్రం చేసి కాపాడబడ్డారు. ఒకసారి ఒక వ్యాధుడు ఆయన శిరస్సును కోరి ఆయన ధ్యానమగ్నులైనప్పుడు తల నరకబోగా ఆయన శిష్యుడు చేసిన నృసింహ స్తోత్రానికి ప్రత్యక్షమై వారిని రక్షించారు. కాశ్మీరంలో ఆయన మీద విషప్రయోగం చెయ్యగా దాన్ని విరిచి మరొక సారి కాపాడారు. ఇలా కోరిన వెంటనే రక్షించిన స్వామీ నరసింహుడు. మనకు తెలిసిన ఎందరో భక్తాగ్రేసరులు అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, కైవార తాతయ్య ఇలా ఎందరో ముందుగా నృసింహ ఉపాసకులై తద్వారా వేంకటేశుని సన్నిధి చేరి కైవల్యం పొందారు. అన్నమయ్య ఆయన రాసిన 32 వేల సంకీర్తనలలో శ్రీ వేంకటేశుని తరువాత అంత ఆర్ద్రంగా రాసిన కీర్తనలు నృసింహుని పైనే. అసలు ఇంత అభేధ్యం వారికి ఎలా నిరూపించారో మనం శ్రీనివాసుని కళ్యాణ ఘట్టాన్ని నెమరు వేసుకుంటే అర్ధమవుతుంది.

శ్రీనివాసుడు దేవతలను అందరినీ ఆయన కళ్యాణానికి పిలిచి వారందరికీ తగిన ఏర్పాట్లు చెయ్యడానికి కుబేరుని దగ్గర 14లక్షల రామముద్ర గల సువర్ణనాణములు చతుర్ముఖుడు, రుద్రుడు, అశ్వత్థవృక్ష సాక్షిగా ఋణం తీసుకుంటాడు. ఒకొక్క తీర్ధ, సరోవరాలలో వంటలు వందబడ్డాయి. బ్రహ్మదేవుడు ముందుగా దేవునికి నివేదన చెయ్యకుండా మిగిలిన వారికి ఎలా వడ్డించేది అని అడుగుతాడు శ్రీనివాసుని. కనుక ముందు నీవు ఆరగింపమని ప్రార్ధిస్తాడు. నా ఇంటి శుభకార్యానికి వచ్చిన వీరంతా అతిధులు కావున వారికి భోజనం పెట్టకుండా నేను భుజించడం ధర్మ విరుద్ధం అంటాడు. కానీ నివేదన చెయ్యని భోజనం దేవతల్, ముని, ఋషి బ్రాహ్మణులు తినరే ఎలా అని బ్రహ్మ వ్యాకుల పడగా శ్రీనివాసుడు, నేను మరొక రూపంలో నరసింహునిగా అహోబిలంలో ఉన్నాను. కనుక ముందు అక్కడ నివేదన చెయ్యమని చెబుతాడు శ్రీనివాసుడు. ఆ తరువాతే అందరికీ ఆ నైవేద్యం వడ్డించబడింది. అందుకే తిరుమలలో కూడా యోగముద్రలో ఉన్న యోగ నృసింహుడు ఆ గుడి ప్రాంగణంలో స్వామికి అభేదంగా ఉంటారు. యోగులు ఆ యోగ నృసిమ్హుని ముందు కూర్చుని ధ్యానిస్తే ఆనందనిలయంలో ఉన్న ప్రత్యక్ష శ్రీనివాసుని దర్శనం అవుతుందని పెద్దలు చెబుతారు.

అందుకే శ్రీ వేంకటేశ్వరపాదసేవలో నృసిమ్హునికి అంత ప్రాముఖ్యం. స్వామీ నైవేద్యం పుచ్చుకునేటప్పుడు భక్తులు ఈ శ్లోకం చెప్పుకోవడం కద్దు. 

“రమాబ్రహ్మాద యోదేవాః సనకాద్యాఃశుకాదయ: !

శ్రీనృసింహప్రసాదోయం సర్వే గృహ్ణ౦తు వైష్ణవా: !! “

మాతా నృసింహశ్చ పితానృసింహ:

సఖానృసింహశ్చ భ్రాతా నృసింహ

విద్యానృసింహో ద్రవిణం నృసింహ:

స్వామి నృసింహ సకలం నృసింహ


ప్రతిరోజూ ఈ నరసింహ మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు ప్రతిరోజూ జపించినా, లక్ష్మీ నరసింహ స్వామిని పూజించినా దోషం నివారింపబడి దీర్గాయుష్మంతులు అవుతారని శాస్త్రవాక్కు

*శ్రీ నృసింహుని మహా మృత్యుంజయ మంత్రం*

ఉగ్రం వీరం మహావిష్ణుం 

జ్వలంతం సర్వతోముఖమ్‌

నృసింహం భీషణం భద్రం 

మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం

వైశాఖ పురాణం - 9

🚩వైశాఖ పురాణం - 9 వ అధ్యాయము🚩*_


🕉🌞🕉️🌞🕉️🌞🕉️🌞🕉️


*సతీదేహ త్యాగము*

🌹🌞🌹🌞🌹🌞🌹🌞🌹

అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శ్రుతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శ్రుతకీర్తి మహారాజిట్లు పలికెను. శ్రుతదేవ మహామునీ ! ఇక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవుటవలన ముమ్మారు చాతకముగను , జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా ! పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపక పోవుట వలన గ్రద్దగను , పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగ నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు. కావున వానికి పుణ్యలాభము కలుగక పోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా. అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి శునకాది జన్మలెందులకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను. అని అడిగిన శ్రుతకీర్తిని మెచ్చి శ్రుతదేవుడిట్లు పలికెను. రాజా ! వినుము , ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడీ లోకములన్నిటిని సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబందము , పరలోక సంబందము అని రెండు విధములుగ నేర్పరచెను. ఇహలోక సంబందములుగ జలసేవ , అన్నసేవ , ఔషధసేవయని ఇహలోకస్థితికి మూడు హేతువులు నేర్పరచెను. ఇవి మూడును ఇహలోకస్థితికి సర్వలోకములకును ముఖ్యహేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ , విష్ణుసేవ , ధర్మమార్గసేవయను మూడును ముఖ్యహేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరచిన విధానములని వేదములయందు చెప్పబడినది.


ఇంటియందుండి సంపాదించుకున్న ఆహారపదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగ ఇహలోకమున మనము పరలోకస్థితికై సంపాదించుకొన్న సాధు , విష్ణు , ధర్మమార్గసేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైనకార్యము మన మనస్సునకు ఇష్టమైనను దాని వలన నేదో యొక అనర్ధము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైనదానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతీ ! యీ  కథ పాపములను పోగొట్టును , వినువారికి ఆశ్చర్యమును , ఆనందమును కలిగించును.


పూర్వము దక్షప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునకిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్షప్రజాపతిని జూచి *"నేను దేవతలందరికిని గురువును. వేదములు వివరించు త్రికాలాబాధితమైన వాడను , చంద్రుడు , ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు. అనగా సేవకప్రాయులు , ప్రజాపతులలో నొకడైన దక్షప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయై గౌరవార్హుడైనను , పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో నొకనిని జూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని జూచి లేవరాదు. భర్తభార్యను జూచి లేవరాదు. గురువు శిష్యుని జూచి లేవరాదు అని పండితుల మాటకదా ! దక్షప్రజాపతి పిల్లనిచ్చిన మామ యగుటచే పూజ్యుడే. కాని ఇచటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదగుటచే సర్వోన్నతుడు , సర్వోత్తముడు , దేవదేవుడునగు తాను(శివుడు) లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని జూచి గురువు లేచినట్లుగ , భార్యను జూచి భర్త లేచినట్లుగ , సేవకుని జూచి యజమాని లేచినట్లుగ ధర్మవిరుద్దముగ నుండును. కావున తాను లేచినిలుచుండి గౌరవించుట దక్షప్రజాపతికి శ్రేయస్కరము గాదు. లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవకాదుల గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు , ధనము , కీర్తి సంతతి మున్నగు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయగు దక్షప్రజాపతి వచ్చినను , మామగారుగా పూజ్యుడైనను , దక్షుని శ్రేయస్సును కోరిలేవలేదు.


కాని పరమేశ్వరునంతటి వాని యాలోచనాశక్తిని , ఔన్నత్యమును గమనింపజాలని దక్షప్రజాపతి ధర్మసూక్షమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని యతడు శివుని యెదుటనే ఇట్లనెను. ఓహో ! ఎంతగర్వము ఓహోహో యేమి యీ గర్వము ! దరిద్రుడు. తనను తాను తెలిసికొనజాలని అవివేకి యీ శివుడు. ఇతనికి తనకంటె మామమాన్యుడను వివేకములేని అవివేకి యీ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా ! ఈశ్వరుడను పదమున నైశ్వర్యమును కలిగియున్నాడు. ఇతని యైశ్వర్యమెంత గొప్పదో కదా ! వయస్సెంతయో తెలియదు. శుష్కించిన ఒక్క యెద్దు వీని యైశ్వర్యము. పాపము కపాలమును , యెముకలను ధరించి వేదబాహ్యులగు పాషండులచేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టివాడిచ్చు మంగళమేమియుండును ?   లోకములు , శాస్త్రములు లోకములు చర్మధారణము నంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుచు నితడు అపవిత్రమగు గజచర్మమును ధరించును. నివాసము శ్మశానము అలంకారమాసర్పము. ఇది ఇతని యైశ్వర్యము. ఇట్టి ఈతడీశ్వరుడు పేరు శివుడు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును జూచి పారిపోవును. *'శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞడను పేరు కలదు. కాని మామను చూచి నమస్కరింప వలయునను జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు , ప్రేతములు , పిశాచములు వీని పరివారము. ఆ పరివారము నెప్పుడును విడువడు. వీని కులమేమియో తెలియదు మరియు నితడు పరమేశ్వరుడు. సజ్జనులితనిని దైవముగ నంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగావిని నేనతనికి నా కుమార్తెయగు సతీదేవినిచ్చి మోసపోతిని. ధర్మవ్యతి రిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీనియింటనే యుండి యీ సుఖముల ననుభవించుచుండుగాక. ఇట్టి యితడు, వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగినవారు కారు. నీచ కులము వానియొద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనట్లుగ వీరు నాకు విడువ దగినవారు"* అని బహువిధములుగ పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని , అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన యింటికి మరలి పోయెను.


యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో గలసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే యుండెను. బ్రహ్మ , విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరును దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు/, చారుణులు , గంధర్వులు , యక్షులు , రాక్షసులు , కిన్నరులు వారు వీరననేల అందరును వచ్చిరి.


పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును జూడవచ్చిన బంధువులను చూడవలెనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావము ననుసరించి యజ్ఞమునకు వెళ్లదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరీ నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా ! ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థధర్మము ననుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించియుండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. అచట శుభము జరుగదు. నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగనైన తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యెను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభరూపమున వచ్చి యామె నెక్కించుకొని యజ్ఞశాలకు తీసికొని వెళ్లెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెననుసరించి వెళ్లినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్లి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్లెను.


యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరును పలకరింపలేదు. దానిని సతిదేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి యచట నున్న సభ్యులు ఆమెను జూచియు పలుకరింపక మౌనముగ నుండి దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను నుద్దేశించి ఆహుతుల నిచ్చెను.


తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను. తండ్రీ ! ఉత్తముల నవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త - లోకభర్త. అందరికిని ప్రభువు. అతడు నాశరహితుడు ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగ నీయకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ది నీకే కలిగినదా ?  ఇట్టి దుర్బరబుద్దినిచటివారు కలిగించారా ? ఇచటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పక పోవుటయేమి ? విధివిధానము వీరికి విముఖమైయున్నదా ? అని సతీదేవి పలికెను.


సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగుమహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి. మరికొందరు పాదములను , తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగ సభలోనివారు దక్షుని సమర్థించుచు , సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధి వ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను , శివుని బహువిధముల నిందించెను.


రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగ యజ్ఞశాలలోని వారందరును చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును జూచిన వారందరును హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమధులు పరుగునపోయి పరమేశ్వరునకా విషయమును దెలిపిరి.


*వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం*


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🙏🌞🙏🌞🙏🌞🙏


🚩వైశాఖ పురాణం - 10 వ అధ్యాయము🚩*_


🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️


*దక్షయజ్ఞనాశము కామదహనము*


🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️


రుద్రుడా వార్తను విని కాలాంతకునివలె భయంకరాకారుడై వేయి బాహువులుకల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి యడిగెను. పరమేశ్వరుడును నా భార్య వినజాలనిరీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని యానతిచ్చెను. భూతసంఘములను వీరభద్రుని వెంటపొండని పంపెను.


ఇట్లు పరమేశ్వరుని యాజ్ఞనందిన వీరభద్రుడు , వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి యచటనున్న దేవతలు , రాక్షసులు , మానవులు మున్నగు మహావీరులను అందరనుకొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు నెవరు యే అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశము గావించెను. దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేక పోయెను. పరమేశ్వరుడా విషయమును గ్రహించి తానే స్వయముగ దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగ వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమ వారితో గలసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలినవారు బ్రహ్మవద్దకు వెళ్ళి శరణు వేడిరి.


బ్రహ్మయు వారితో గలసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధరీతులలో నూరడించెను స్తుతించెను. శివుని సమాధానపరచి శివునితో గలసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారినందరిని శివుని ప్రార్థించి యతనిచేతనే బ్రతికింపజేసెను , శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక ముఖము నమర్చి బ్రతికించెను , మరియు మేక గడ్డమును తెచ్చి భృగుమహర్షికి అమర్చెను. సూర్యునికి దంతముల నీయలేదు. కాని వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రమిచ్చెను. అవయవములను పోగొట్టుకొన్నవారికి ఆ అవయవముల నిచ్చెను. కొందరికీయలేదు.


యజ్ఞశాల యీ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మనందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరల చేసి పూర్తి చేసిరి.


యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్యా వియోగమున దుఃఖితుడై గంగాతీరమున పున్నాగ వృక్షము క్రింద తపమాచరించు కొనుచుండెను.


దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనాహిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను.


ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమునాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరివలన మరణము లేకుండునట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు పుత్రుడెట్లు కలుగును ?  కావున నేను అవధ్యుడను నన్ను చంపువారెవరును లేరని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకములను , సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను , తన గృహములునూడ్చుటకును, దేవతాస్త్రీలను దాసీలుగను నియమించెను. దేవతలను బహువిధములుగ బాధించుచుండెను.


దేవతలు వాని వలని బాధలను భరింపజాలక బ్రహ్మవద్దకు బోయి తమను రక్షింపుమని బహువిధములుగ ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని యిట్లు పలికెను. దేవతలారా ! నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి యెవరు నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షునియజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీయను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసికొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టి విధానము నాలోచింపుడని వారికి దగిన ఉపాయమును సూచించెను. వారిని యూరడించి పంపెను.


దేవతలందరును యఇంద్రుని ఇంట సమావేశమైరి బృహస్పతితో నాలోచించిన ఇంద్రుడును, నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును , మనధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి.


ఇంద్రుడు - నారదుని జూచి నారదమహర్షీ ! నీవు హిమవంతుని కడకు పోయి దక్షయజ్ఞమున శరీరత్యాగమొనర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడగు శివుడును నీ హిమాలయశృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యయై ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు. శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి భర్తయగు శివునికి భార్య చేయమని భోదింపుమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగ హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించునట్లుగ హిమవంతుని ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను.


నారదుని పంపిన తరువాత నింద్రుడు మన్మధుని జూచి తారకాసుర పీడితులగు దేవతల హితము కొరకు భార్యా వియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంతర్తుశోభలను ప్రవర్తింపజేయుము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికిని సమాగమమేర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసురవధ జరుగును. దేవతలకు పరపీడనముపోవును. ఈ ప్రకారము చేయుమని వానిని పంపెను.


మన్మధుడును ఇంద్రుని యాజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితోను , భార్యయగు రతీదేవితోను , మలయానిలాది పరివారముతోను శివుడున్న తపోభూమికి పోయెను.


అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్పసమృద్దము , మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగువానిని సమర్పింప వచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడును శివపార్వతుల సమాగమమునకిదియే తగిన సమయమని తలచెను. శివుని వెనుక భాగమున చెట్టుచాటున నిలుచుండి యొక బాణమును ప్రయోగించెను. మరలనింకొక బాణమును ప్రయోగింప సిద్దముగనుండెను. శివుడు తన మనస్సు చలించుటను గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చంచలమగుటయేమి నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరిని విచారించి నలువైపుల పరిశీలించెను.

బాణప్రయోగమొనర్పబోవు మన్మధుని జూచెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరచెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో దహించెను.


తమ కార్యమేమగునోయని చూచుచున్నదేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. వసంతుడు , మన్మధుని భార్య రతి - శివుడు తమను కూడ శిక్షించునేమో ? ఆ శిక్షయెట్లుండునోయని భయపడి కనులను మూసికొని దూరముగ పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తముగాదని పరమశివుడంత్ర్దాన మయ్యెను.


మన్మధుడు చేసినపని దేవతలకు , శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో నింక నెంతటి ఆపద మన్మధునకు కలుగునో యెవరు చెప్పగలరు ?


కావున శ్రుతకీర్తి మహారాజు ! ఇక్ష్వాకు వంశమువాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడేయగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని , అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసినదానికి శునకాది హీనజన్మలనెత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్యకర్తవ్యము. అనాధలయెడ దయజాలి మితిమీరరాదు. ఈ విషయము గమనింపవలయునని శ్రుతదేవుడు వివరించెను. పరమశివునికనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మయందును బాధలుపడెను.


పరమపుణ్యప్రదమైన ఈ కధను , రాత్రిగాని , పగలుగాని యెవరు విన్నను , జన్మ , మృత్యువు , ముసలితనము మున్నగు భయములనుండి విడువబడుదురు. అనగా వారికి జన్మాదులవలన భయము నుండదు. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను.


*వైశాఖ పురాణం  పదవ అధ్యాయం  సంపూర్ణం*


             🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

            *న్యాయపతి*

         *నరసింహా రావు*


🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

🚩వైశాఖ పురాణం - 11 వ అధ్యాయము🚩*_ 


🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️


*రతి దుఃఖము - దేవతల ఊరడింపు*


🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించునిట్లనెను. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది ? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖముననుభవించెనో వివరింపుమని కోరెను. శ్రుతదేవుడిట్లనెను.


కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని , పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము.


శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిగప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను.


ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను. అమ్మా నేను నీ పుత్రునివంటివాడను. పుత్రుడనగు నేనుండగ నీవు సహగమనమొనర్ప వలదు. అని వసంతుడు బహువిధములుగ జెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింప లేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీతీరమున యేర్పరచెను ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కల్యాణీ పతిభక్తిమతీ ! అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను , శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాదురుని యింటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడునీతో గలసి శంబరాసురుని యింటనుండగలడు. ఆ విధముగ నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బ్రహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు ఆచటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతిదేవిని బహువిధములుగ నూరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యధాపూర్వముగ కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి పెక్కు ధర్మములను నుపదేశించి ఇట్లనిరి.


కల్యాణీ ! పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లిరి.


రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున వైశాఖవ్రతము నాచరించుచు అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యధాపూర్వముగ సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగనుండెను. అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖదానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవు వలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును ? కావున ఇహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము నాచరింపవలయును సుమా !


*వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం*

            🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

[02/05, 9:18 pm] K Sudhakar Adv Br: _*🚩వైశాఖ పురాణం - 12 వ అధ్యాయము🚩*_


🕉🪷🕉️🪷🕉️🪷🕉️🪷🕉️


*కుమార జననము*


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


మన్మధుని దహించి శివుడంతర్ధానము చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి యేమి చేయవలెనో తెలియనిస్థితిలో నుండెను. భయపడిన తన కుమార్తెను జూచిన హిమవంతుడును భయపడి యామెను ఇంటికి జేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును , ఔదార్యాదిగుణములను జూచి నాకితడే భర్త కావలయునని తలచెను. తన తలపు తీరుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను. తల్లితండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకీ తపము వలదని వారించినను ఆమె మానలేదు.


పార్వతి గంగాతీరమును జేరి మహాలింగస్వరూపము నేర్పరచి నిరాహారియై జటాధారిణియై కొన్నివేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలిసికొని శివుని పరిహసించెను. నిందించెను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరము నిచ్చి యంతర్ధానమందెను.


శివుడు సప్తర్షులను తలచెను. శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచు వచ్చి శివుని యెదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని  యడుగుడని చెప్పెను. సప్తర్షులు శివుని యాజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు నాకాశమార్గమున హిమవంతుని కడకేగిరి. హిమవంతుడును వారి కెదురువెళ్ళి నమస్కరించి గృహములోనికి దీసికొని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనులగావించి మీరు నాయింటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని. మీవంటి తపోధనులు నాయింటికి వచ్చుట నా తపఃఫలము. పుణ్య ప్రయోజనము కల మహాత్ములగు మీకు నా వలన కాదగిన కార్యము నాజ్ఞాపించుడని ప్రార్థించెను. అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై యున్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగ జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరును ముల్లోకములయందును లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునకిచ్చి వివాహము చేయవలయును. వేలకొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపమిప్పటికి నీకిట్లు ఫలించినది అని పలికిరి.


హిమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రునకిచ్చితిని. మీరు పరమేశ్వరుని వద్దకు బోయి హిమవంతునిచే కుమార్తెయగు పార్వతి నీకు ఈయబడినదని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగ పరమానందముతో బలికెను. సప్తర్షులును హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్లిరి. శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి.


లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు , విష్ణు మున్నగు దేవతలు షణ్మాతలు , మునులు అందరును శివపార్వతుల కల్యాణ మహోత్సవమును జూడవచ్చిరి. శివుడును సర్వదేవతాగణములు , మునులు , షణ్మాతలు పరివేష్టించియుండగా వృషభ వాహనారూఢుడై వేదఘోషతో భేరీ మృదంగప్రభృతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరెను.


హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునకిచ్చి వివాహము గావించెను. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యెను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో గలసి లోక ధర్మాను సారముగ సుఖించుచుండెను. పగలు సర్వ సంపత్సంపన్నమగు హిమవంతుని ఇంటను , రాత్రులయందు సరస్తీరముల యందు , పుష్ప ఫల సమృద్ధములగు వనములయందు మనోహరములగు పర్వత సీమలయందును శివపార్వతులు స్వేచ్చావిహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగ కొన్ని వేల సంవత్సరములు గడచినవి.


ఇంద్రుని శాసనముననుసరించి ఆ కాలమున సంయోగమున నేర్పడిన గర్భము మరల సంయోగమున స్రవించెడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికేర్పడిన గర్భము శివపార్వతుల పునస్సమాగమముచే పోయెడిది. ఈ విధముగ గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలువకపోవుటచే పార్వతీ గర్భమున బుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశమున కెదురు చూచుచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారమధికమయ్యెను.


వారందరు నొకచోట కలిసికొని పరమేశ్వరుడు నిత్యము రతాసక్తుడై యున్నాడు. ఇందువలన గర్భములు నిలుచుట లేదు. కావున శివునకు పార్వతితో మరల కలయిక లేకుండునట్లు చేయవలయును. ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవా ! నీవు దేవతలకు ముఖము వంటివాడవు. దేవతలకు బంధువువు. నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించుచోటకు పొమ్ము. రతాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరల కలయిక లేకుండునట్లు వ్యవహరింపుము. వారికి పునస్సంగమము లేనిచో పార్వతి గర్భము నిలుచును. రతాంతమున నిన్ను జూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరల పునస్సంగమముండదు. శివపార్వతుల రతాంతమున నీవు శివునకెదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపుము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగనైనచో గర్భవతియగు పార్వతి పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థన నంగీకరించి శివపార్వతులున్నచోటకు బోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగనే అగ్ని శివ పార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యెను. వస్త్ర విహీనయై యున్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు బోయెను.


శివుడును పార్వతి తన దగ్గరనుండి దూరముగ వెళ్లుటచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి మా సంగమమున కాటంకము చేసితివి. వీర్యపతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇచ్చట లేకుండుటకు నీవే కారణము. నా యీ వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందుంచెను.


అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు యెట్లో దేవతల యొద్దక బోయి జరిగిన దానిని వారికి చెప్పెను. దేవతలును అగ్నిమాటలను విని శివ వీర్యము లభించినదని సంతోషమును , ఆ వీర్యమునుండి సంతానమెట్లు కలుగునని విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యము పిండిరూపమున పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుటయెట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరెను. దేవతలు విచారించి అగ్నితో గలసి గంగానది యొద్దకు పోయిరి. ఆమెను బహు విధములుగ స్తుతించిరి. నీవు మా అందరికిని తల్లివి. అన్ని జగములకు అధిపతివి. దేవతల ప్రార్థన నంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొను మంత్రమునుపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచెను. గంగానదియు కొన్ని మాసముల తరువాత నా రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భరమగు ఆ శివవీర్యమును తన తీరముననున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బులోపడిన శివ వీర్యము ఆరు విధములయ్యెను.


బ్రహ్మ పంపగా వచ్చిన షట్ కృత్తికా దేవతలు ఆరు విధములుగ నున్న ఆ రుద్ర తేజస్సు నొకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు కల పురుషాకారమై యుండెను. ఆరు ముఖములు కల ఆ రూపమచటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగు చుండెను.


ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభము నెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీస్తనములనుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతియు తన స్తనముల నుండి నిష్కారణముగ క్షీరస్రావము జరిగినందుల కాశ్చర్యపడి విశ్వాత్మకా ! నా స్తనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగ స్రవించుటకు కారణమేమని యడిగెను. అప్పుడు శివుడు పార్వతీ వినుము , పూర్వము మనము సంగమములో నుండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవతనిని జూచి చాటునకు పోతివి. నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజమునగ్నియందుంచితిని. అగ్నియు దానిని భరింపలేక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను. గంగానదియు నా తేజమును భరింపజాలక రెల్లు పొదలో విడిచెను. ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్ కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు ఆరు ముఖములు కల పురుష రూపమయ్యెను. ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడగుచేతనే నీ స్తనములు క్షీరమును స్రవించుటచే నితడే నీ పుత్రుడు. నా తేజస్సు వలన జన్మించిన వాడు. ఇతడు శ్రీ మహావిష్ణు సమ పరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను.


పార్వతియు శివుని మాటలను విని యా బాలుని తనయుడి యందుంచుకొని తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్ర వాత్సల్యమును చూసిన పార్వతి వానియందు పుత్రస్నేహమునంది యుండెను. ఈ విధముగా నా బాలుని దీసికొని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు నామె మిక్కిలి ఆనందమునందుచుండెను.


రాజా ! పరమాద్భుతమగు కుమార జననమును నీకు వివరించితిని. దీనిని చదివినను , వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు. సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను మరుసటి జన్మయందు వైశాఖవ్రతమును చేసి పూర్వము కంటె గొప్పవాడయ్యెను. కావున *వైశాఖమాస వ్రతము* అన్ని పాపములను పోగొట్టును , మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్తలేకపోవుటను , పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును. వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది. మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను యే వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతడు సర్వోత్తముడు , భార్యా ద్వితీయుడు అయ్యెనో ఆ వైశాఖవ్రతము నాచరింపని వారికి వైశాఖ స్నానము చేయని వారికి , దానము చేయనివారికి వారెన్ని ధర్మముల నాచరించిన వారైనను కష్టపరంపరలనందుదురు. ఏ ధర్మముల నాచరింపని వారైనను వైశాఖ వ్రతము నాచరించినచో వారికి అన్ని ధర్మముల నాచరించినంత పుణ్యలాభము కలుగును.


*వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తం*

           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏

_*🚩వైశాఖ పురాణం - 13 వ అధ్యాయము🚩*_


🕉🌷🕉️🌹🕉️🌷🕉️🌹🕉️


*అశూన్య శయనవ్రతము*


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷


నారదమహర్షి అంబరీషమహారాజుతో నిట్లనెను.  శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు *"మునివర్యా ! మన్మధుని భార్య రతిదేవి అశూన్యశయన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకా వ్రతవిధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిరి. దయయుంచి నాకా వ్రత విధానమును వివరింపుడు. ఆ వ్రతమున చేయవలసిన దానము , పూజనము , ఫలము మున్నగువానిని గూడ చెప్పగోరుదునని యడిగెను.*


అప్పుడు శ్రుతదేవుడు మహారాజా వినుము. అశూన్యశయనమను వ్రతము సర్వపాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతము నాచరించినచో నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతముగ ప్రసన్నుడై సర్వపాపములను పోగొట్టి సర్వశుభములనిచ్చును. ఈ వ్రతము నాచరించి గృహస్థధర్మముల పాటించిన వారు సఫలమైన గృహస్థజీవనమును గడిపి సర్వసంపదలనందుదురు. అట్లు చేయని వారికి శుభములెట్లు కలుగును ?


శ్రావణమాసమున శుద్ద విదియయందీ వ్రతము నాచరింపవలెను. ఈ వ్రతము నాచరించువారు నాలుగు మాసములును హవిష్యాన్నమునే పాయసమునే భుజింపవలయును. పారణదినమున లక్ష్మీసమేతుడగు శ్రీమహావిష్ణువు నర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనమీయవలెను. బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు తులసి మాలికలు మున్నగు సుగంధ వస్తువులతో పూజింపవలెను. శయ్యాదానములు , వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగ శ్రావణమాసము మొదలు నాలుగు మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగ పూజింపవలెను.


తరువాత మార్గశీరము , పుష్యము , మాఘము , పాల్గుణము అను మాసములందును లక్ష్మీ సమెతుడగు శ్రీమన్నారాయణుని పూజింపవలెను. తరువాత చైత్రము , వైశాఖము , జ్యేష్ఠము , ఆషాడము అను మాసములందు శ్రీహరిని , రుక్మిణీ సహితముగ యెఱ్ఱని పుష్పములతో పూజింపవలయును. భూదేవసహితుడు సనందనాదిముని సంస్తుతుడు పరిసుద్దుడగు శ్రీమహావిష్ణువు నర్చింపవలెను. ఈ విధముగ చేసి ఆషాఢ శుద్ధ విదియ యందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమము చేయవలయును.


మార్గశిరము మున్నగు నాలుగు మాసముల పారణయందు విష్ణుగాయత్రిచే హోమము చేయవలెను. చైత్రాది చతుర్మాసములయందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలెను. పంచామృతములను , పాయసమును , నేతితో వండిన బూరెలను నివేదింపవలెను. శ్రావణాదిమాస చతుష్టయమున పూజ , హోమము భక్ష్య నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను , శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగనే దానమీయవలెను. శ్రీకృష్ణప్రతిమను మార్గశీర్షాదిమాస చతుష్టయ పూజా మధ్యమున దానమీయవలెను. చైత్రాదిమాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమీయవలెను. అప్పుడు కేశవాది ద్వాదశ నామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యధాశక్తిగ వస్త్రాలంకారములను దక్షిణతో నీయవలయును. నేతిలో వండిన బూరెలు ఒకొక్కనికి 12 చొప్పున దానమీయవలెను. తరువాత మంచమును , పరుపును వుంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమనుంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడునగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను.


*లక్ష్మ్యా అశూన్యశయనం యధా తవజనార్ధన*


*శయ్యామమా ప్యశూన్యా స్యాద్దావేనానేవ కేశవ*


అని దానమంత్రమును చెప్పి దానముచేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలెను. పై శ్లోకభావము స్వామీ ! జనార్దనా నీ శయ్య లక్ష్మీసహితమై యున్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై యీ శయ్యాదానముచేనుండుగాక.


ఈ వ్రతమును , భార్యలేని పురుషుడును , విధవాస్త్రీయును , దంపతులును యెవరైనను చేసికొనవచ్చును. శ్రుతదేవమహారాజా ! నేను నీకీ వ్రతమును పూర్తిగ వివరించితిని. ఈ వ్రతము నాచరించిన శ్రీమహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన యనుగ్రహమునంది జనులందరును ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై యుందురు. కావున యధాశక్తిగ భక్తి శ్రద్దలతో నీ వ్రతము నాచరించి భగవదనుగ్రహమును పొందవలెను. భగవదనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా ! నీవడిగిన అశూన్య శయనవ్రతమును వివరించితిని. నీకు మరేమి చెప్పవలయును ? అని శ్రుతదేవముని శ్రుతకీర్తి మహారాజుతో ననెను.


శ్రుతకీర్తి మహారాజు మహామునీ ! వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములై వైశాఖమాస వ్రతాంగ విధానములనెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగెను.


_*వైశాఖపురాణం  పదమూడవ అధ్యాయం సంపూర్ణం*_

           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷


🙏🌹🌷🙏🌹🌷🙏🌹🙏

ఆర్య చాణక్య*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹


*🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 50*


"అంటే....." రాక్షసుడు వికృతంగా నొసలు ముడిచి "ఒక్క మశకావతిలోనే కాదు. సంగాల, సౌభూతి, భాగేల ఇలా అన్నిచోట్లా ఒకే రకమైన పథకం అమలు అయింది. కొంచెం అటూ ఇటుగా ఒకేi రకమైన మహత్తులు ప్రదర్శించిన యోగులు... అన్ని చోట్లా తిరుగుబాట్లు, యవనుల వూచకోత... ఒక రాజ్యంలో తిరుగుబాటు జరిగితే మరో రాజ్యం నుంచి సైన్య సహాయం వెళ్ళేది. అలాంటి అవకాశం లేకుండా, ఏకకాలంలో, అనూహ్యరీతిలో యవనుల మీద దాడి జరిగింది. ప్రతిచోటా ఒక యోగో లేదా సిద్ధుడో కనిపిస్తున్నా అందరూ ఒకే రకంగా ప్రవర్తించారు అంటే.... అందరూ కూడబలుక్కున్నట్టు తమ పాత్రల్ని సమర్థవంతంగా పోషించారంటే... వాళ్ళ వెనక... ఆ వ్యూహం వెనక... ఎవడో... ఎవడో ... ఒక మహామేధావి ఉన్నాడు. ఈ కుట్ర ... పథకం... ఆచరణ అంతా అతని మంత్రాంగమే..." అన్నాడు ధీరగంభీర స్వరంతో సాలోచనగా. 


సుకల్పనందుడు బెదిరిపోతే "ఒక్కడేనా....? మహామేధావా ? ఎవరైవుంటారు అమాత్యా....?" అని అడిగాడు బెరుకుగా. 


రాక్షసుడు తల అడ్డంగా తిప్పి "ఏమో.... ఇంకా కచ్చితంగా నా ఊహకి అందడం లేదు. కానీ... అలెగ్జాండర్ జైత్రయాత్రను విశ్లేషిస్తే ఒక్క నెత్తురు బొట్టుకూడా నేల చిందని రాజ్యం తక్షశిల.... తక్షశిలా విశ్వవిద్యాలయం మహామేధావులకు నిలయం.... ఆ విశ్వవిద్యాలయం మీద అలెగ్జాండర్ కన్ను పడింది కూడా ... కానీ ఏమైంది ? రాత్రికి రాత్రే ఆ 'మహాగ్రంథాలయం'లోని వేలాది అమూల్యమైన తాళపత్ర గ్రంధాలన్నీ రెక్కలొచ్చి ఎగిరినట్లు మాయమైపోయాయట. ఆ మాయకి కారకుడైన మహానుభావుడొకడి పేరు కర్ణాకర్ణిగా నాకు వినిపించింది. కానీ, అతడు ఆ విశ్వవిద్యాలయంలో అదే రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో మాడి మసైపోయాడని మరొక వార్త వచ్చింది. కాదూ, అతడు సజీవుడేననీ, కాశీనగరంలో అజ్ఞాత జీవితం సాగిస్తున్నాడని ఇంకొక వార్త... ఇన్ని తికమకల మధ్య వాస్తవాన్ని నేను నిర్ధారించుకోలేకపోతున్నాను" అన్నాడు సాలోచనగా. 


"ఇంత తెలిసిన మీకు ఆ మేధావి పేరు తెలియలేదా, అమాత్యా....? అడిగాడు సుబంధులవారు. రాక్షసుడు తల పంకించి ఏదో చెప్పబోయాడు. అంతలో చారుడొకడు లోపలికి వచ్చి.... 


"ప్రభువులకు ప్రణామాలు ! అమాత్యులవారికీ, రాజగురువుల వారికి వందనాలు" అంటూ నమస్కారాలు చేశాడు. 


రాక్షసుడు సాభిప్రాయంగా తలూపి "ఏం చేస్తున్నాడు, ఆ బౌద్ధ క్షిపణుడు....?" అని ప్రశ్నించాడు, సుబంధుల వారి ప్రశ్నకు సమాధానాన్ని వాయిదా వేసి. 


"అబ్బో ! ఏమి జనం ! ఏమి జనం ! ఏం మహత్తు ! ఆరేళ్లుగా పక్షవాతంతో కాళ్లుపడిపోయి మంచంలో పడున్నవాడిని మంచంతో సహా మోసుకొచ్చారు. గురువు మంత్రజలం చల్లాడు అంతే. ఆరేళ్లుగా పడున్న అరవైయేళ్ల ముసలాడు చటుక్కున లేచి చెంగున లేడిలా పరిగెత్తాడు" చెప్పాడు చారుడు ఉత్సాహంగా. 


సుకల్పనందుడు ఆశ్చర్యంతో నోరు తెరుస్తూ... "ఆ .... !" అన్నాడు. 


"ఆ ! ఓ కుర్రాడు... పాపం పుట్టుకతో మూగ. తల్లిదండ్రులు వాడిని తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పడేశారు. ఆయన గాలిలో గిరగిరా చేయి తిప్పి విభూతి సృష్టించి ఆ కుర్రాడి నోట్లో వేశాడు. విభూది కోసం ' ఆ ' అని నోరు తెర్చిన ఆ కుర్రాడు 'అమ్మా.... నాన్నా....' అంటూ ఎగిరి గంతులేశాడు" ఉద్విగ్నితతో చెప్పాడు చారుడు. 


"అయితే ఆయన గొప్ప గొప్ప మహిమలు గల మహానుభావుడంటావ్ ?" హేళనగా ప్రశ్నించాడు సుబంధులవారు. 


చారుడు ఆయనవైపు చురచుర చూసి "ఆహా ! ఆయనకి భూత భవిష్యవర్తమానాలు కూడా తెలుసు. దివ్యదృష్టి ఉంది. తాను నివసిస్తున్న ఆ ఆశ్రమం ఒకప్పుడు గురుకులాశ్రమం అని చెప్పాడు" అంటుంటే ధర్మానందుడు కల్పించుకొని "అందులో విశేషమేముంది ? మన ప్రజల్లో ఎవరిని అడిగినా ఆ ఆశ్రమం ఎవరిదో చెప్తారు" అనేశాడు తేలిగ్గా. 


చారుడు ఓరగా సుబంధుల వారి వైపు చూస్తూ "అది కాదు అసలు విశేషం. ఆ రాజగురువు తండ్రికి ఎంతకాలానికీ సంతానం లేకపోతే, ఒక శూద్రస్త్రీతో సంగమించి ఆమె ద్వారా కొడుకుని కన్నాడట.... అదీ అసలు విశేషం...." అని చెప్పాడు. 


ఆ విధంగా తన జన్మ రహస్యం బట్టబయలైందని తెలియగానే రాజుగురువు సుబంధులవారి మొహం అవమానంతో నల్లబడిపోయింది. 


రాక్షసామాత్యుడు తలపంకిస్తూ "మహానందుల వారి కాలంలో రహస్యంగా జరిగిన విశేషాన్ని బయటపెట్టారంటే, ఆ బౌద్ద క్షిపణకుడు మహిమాన్వితుడే..." అంటూ ప్రశంసించాడు. 


చారుడు తలవూపి "అంతేకాదు అమాత్యా ! అతడు బ్రాహ్మణ ద్వేషి..." అని చెప్పాడు. రాక్షసుడు ఉలిక్కిపడ్డాడు. 


"అయితే మరీ మంచిది. ఆ బౌద్ధ సన్యాసిని దర్శించుకుందాం. పదండి." అంటూ తక్షణం బయలుదేరాడు. నందులతో పాటు రాక్షసామాత్యుడు, వారితో పాటు విధిలేక సుబంధులవారు బయలుదేరారు. 

(ఇంకా ఉంది)...🙏

సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺

నృసింహ జయంతి

 *ॐ      నృసింహ జయంతి శుభాకాంక్షలు.* 


*హిరణ్యకశిపుడు అడిగిన వరం :*  


       ఇంట్లోగానీ - బయటగానీ, 

        పగలుగానీ - రాత్రిగానీ, 

       మానవునిచేతగానీ - ఏ జంతువుచేతనైనా గానీ, 

       ప్రాణం ఉన్నటువంటివాటితోగానీ - ప్రాణం లేనటువంటివాటితోగానీ,     

      తనకి మరణం లేకుండా ఉండాలని. 


*హిరణ్యకశిపుని మరణం*  


    శ్రీమన్నారాయణుడు హిరణ్యకశిపుని,


       ఇంటిలోపలా బయటా కాక, గుమ్మం మధ్యలో, 

       పగలూ రాత్రీ కాక సాయం సంధ్యవేళ, 

        అటు మానవుడూ, ఇటు జంతువూకాని నరసింహుడుగా, 

       ప్రాణం ఉన్నవీకాని, లేనివీకాని గోళ్ళతో సంహరించాడు. 

       

*నారసింహావతారం - అంతరార్థం*   


* *హిరణ్యకశిపుడు*   


హిరణ్యము - ప్రకృతి

    ప్రకృతినే చూచి, దానితోనే  ఆనందం పొందువాడు.


* *ప్రహ్లాదుడు*  


ప్ర     - ఉత్తమమైన 

హ్లాద - (జ్ఞాన) ఆనందం.


* *నరసింహ*    

*సింహ(దైవీ) ఆలోచన - నర(మానవీయ) క్రియ*  


నర మొండెం - మానవ క్రియ 


సింహం శిరస్సు - దైవ ఆలోచన   

( "మృగములలో మృగేంద్రుడైన సింహాన్ని నేను"

    మృగాణాం మృగేంద్రోఽహం - భగవద్గీత ) 


* *స్తంభం - నిశ్చలతత్త్వం*  


జ్ఞానానందాన్ని కాపాడటంకోసం, 

హింసాత్మకమైన ప్రకృతిపట్ల ఉన్న ప్రలోభాన్ని నాశనం చేయటం "నరసింహావతారం"


    ఈ నరసింహావతారం జరిగి ఇప్పటివరకు 8,64,59,203 సంవత్సరాలయింది. 


                    =x=x=x=


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

వృద్ధాప్యం

 వార్ధక్యం వయసా నాస్తి

మనసా నైవ తద్భవేత్‌।

సన్తతోద్యమశీలస్య

నాస్తి వార్ధక్య పీడనమ్‌॥.      

      *వృద్ధాప్యం అనేది వయసులోనూ లేదు. మనసులోనూ ఉండకూడదు*

ఎల్లప్పుడూ ఉత్సాహం, క్రియాశీలత కల మానవుడికి వృద్ధాప్యపీడ ఉండదు.


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

*సేకరణ*

అహమేలేని ఆదిశంకరులు

 అహమేలేని ఆదిశంకరులు


'ప్రదీపజ్వాలాభి ర్దివసకర నీరాజనవిధి 

స్సుధా సూతే శ్చంద్రోపల జల లవై రర్ఘ్యరచనా, 

స్వకీయై రంభోభి స్సలిలనిధి సౌహిత్యకరణం 

త్వదీయాభి ర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియమ్. 


నూరు శ్లోకాలు కల సౌందర్యలహరిలో చివరిది ఈ శ్లోకం. సౌందర్యాన్ని ఒకరు చూపనక్కరలేదు. అది స్వతహాగా కనపడేవస్తువు. కన్నులకు ఆనందమిచ్చేవి కొన్ని, చెవులకు ఆనందం యిచ్చేవి కొన్ని. శబ్దమాధ్యుర్యం శ్రవ్య సౌందర్యం కలది. 


భగవత్ పాదులు వ్రాసిన సౌందర్యలహరివంటి సుందరమైన కావ్యం అరుదు. 

ప్రపంచంలో అందంగావున్నవని మనం అనుకునేవస్తువులన్నీ అంబికాకటాక్ష లేశమాత్రాన పుట్టినవే. సౌందర్య దేవతయేఅంబిక. ఆమెఅనుగ్రహం చేతనే ఆచార్యులవారి వాక్కు సౌందర్యలహరియై (లహరి అనగా ఏరు) ప్రవహించినది. సుందరములైన పురాతనపు శిల్పములు భగ్నమయితే, పోయిన భాగములను పూరిస్తామని ఏవైనా తెచ్చి అతికిస్తే బాగావుండదు. అల్లాగే బ్రహ్మదత్తమైన వాక్ సౌందర్యం కలవారికృతులలో ఒకమాటకు బదులు మరొకమాట వాడిచూద్దామని చూస్తే అతకదు ఆలోపం లోపంగానేనిలిచిపోతుంది. భగవత్ పాదుల సౌందర్యలహరి అట్టిదే. ఇట్టి కావ్యరత్నమును సృజించిన ఆచార్యులవారికి నేనువ్రాసితిని అన్న అహము లేశమాత్రమూ కనబడదు. సంక్రాంతినాడు సూర్యుని వెలుగులు ప్రసరించే చోటు గోమయంతో శుద్ధిచేసి ముగ్గులుతీర్చి దాని నడుమ సూర్యబింబమును వ్రాసి చెరకు, చెక్కెర, పొంగలి, కొబ్బరికాయ యీ మొదలైన వానిని నివేదనంచేసి సూర్యునకు నమస్కరించి నీరాజనం యిస్తాం. కప్పురపు వెలుతురెక్కడ? సూర్యప్రకాశమెక్కడ? పదినాళ్లు వరుసగా ప్రొద్దు పొడవకపోతే కర్పూరంకూడ వెలుగదు. అంబికా కరుణా కటాక్షాన చెప్పబడిన సౌందర్యలహరి ఆమెకే అర్పించడం సూర్యునకు ఇచ్చే నీరాజనం వంటిది. సూర్యకిరణాలు విశ్వమంతా వ్యాపించి వున్నవి. కాని వానిని ఒక భూత అద్దంలో కేంద్రీకరించి కింద బూరుగదూది నుంచితే దూది మండిపోతుంది. కేంద్రీకరణంవల్ల సూర్యరశ్మికి అంత దాహకశక్తి ఏర్పడుతుంది. అట్లే స్వామి సర్వవ్యాపకుడు. అయినప్పటికీ భక్తులను అనుగ్రహించటంకోసం ఆలయాలలో ప్రతిష్ఠింపబడి ఆర్తత్రాణ పరాయణమూర్తియై ఉండును. 


ఆ పరమాత్మ అనుగ్రహం లేనిదే ఏకార్యమున్నూ జరగదు. మనం అనుక్షణంచేసే ఊర్పు నిట్టూర్పులు సైతం ఆయన కృపచేతనే. మంచికాని, చెడ్డగాని, ఏదైనా ఆ మహాశక్తి మనలో వుంటేనేకాని చేయలేము. ఆశక్తి లేనప్పుడు ఏమీలేదు. చరాచరాల అన్నింటికీ అధిష్ఠాత్రియైన, అన్నిటినీ నడిపే ఆమెకే పరాశక్తి అనిపేరు. 


అన్నిటికీ కారణం ఆమె ఆమె ఆధారశక్తి, అనంత శక్తి, సర్వవ్యాపిక అయినాఅచింత్యశక్తి అయిన ఆమె మహా తపస్సంపన్నులైన ఋషులచేతనూ మహనీయులచేతనూ ఆలయాలలో ప్రతిష్టచేయబడి ఆయా క్షేత్రాలలో తీర్థాలలో విశేషానుగ్రహ సమర్థయై, కేంద్రీకృతమైన రవి రశ్మివలె ప్రకాశిస్తూ వున్నది. 


సూర్యోపమానంవదలి చంద్రోపమానం చేసిచూద్దాం. చంద్రుడు ఉదయింపగానే ఆ చలిమరిలో, వెన్నెలలో చంద్రకాంతశిల అమృతం స్రవిస్తుందట. ఈ సూర్యకాంత చంద్రకాంత శిలల నిజానిజాలు వైజ్ఞానికులకు వదలవలె. ఈనమ్మిక అనుశ్రుతంగా వస్తున్నది. మిణుగురు పురుగులనూ, రాత్రి మిలమిల మెరిసే జ్యోతిర్లతలు అనే లతావిశేషాలనూ పరికించి చూస్తే మనకీ శిలల విషయం ఆశ్చర్యంకాదు. 


చంద్రకాంతశిల చంద్రుని అమృతకిరణముల స్పర్శచే కరిగిపోతుంది అని అనుకుందాం. ఇది వాస్తవమే కావచ్చు. ఒకవేళ చంద్రుడే లేకపోతే? 


సౌందర్య దేవతవు నీవు. వాక్కనే అమృతానికి వారిధియైన వాగ్దేవివినీవు. ఆ సారస్వత సముద్రంలోని జలకణమే నా వాక్కులో వున్నది. నీవు లేకపోతే - నీ అనుగ్రహం లేకపోతే వాక్ సంపత్తి నాకేదీ? అమృతం కురిసేవాడు చంద్రుడు. అతడు అమృతకిరణుడు. తాపహారి. నాకృతి దివాకరునికి ఎత్తిన దివ్వెవలె చంద్రునకు ఇచ్చిన చంద్రకాంత శిలాసలిలార్ఘ్యంవలే ఉన్నది. సముద్రుని దగ్గరకు వెళ్ళి దానిలోని (ఉప్పు) నీరే తీసికొని 'అపోహిష్ఠా' అనీ స్నానము ఆర్ఘ్యము పాద్యము ఆచమనము చేసినట్లవుతుంది అని భగవత్ పాదులు ఈ శ్లోకంలో వ్రాశారు. 


మనం అనుదినమూ ఎన్నోపనులు చేస్తున్నాం. ఈపనులన్నీ ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నాను అనే అహం భావం కలగడానికి ఏమాత్రమూ ఆస్పదంలేదు? నిరభిమానం కలగాలి. కొందరు నిజంగానే నిరభిమానులై వుంటారు. నేను నిరభిమానిని అన్న అభిప్రాయం తనకు ఉంటే అదిన్నీ ఒక అభిమానమే. అందుచేత అతిజాగ్రత్త అత్యవసరం. 


కొంచెం ఆలోచించి చూద్దాం. మనం దేనిని చూచి అహంభావం పొందాలి? మనకు ఏ పని కావలసివున్నా శక్తి అవసరం. ఆశక్తియే అంబిక. ఆమె నిండు సముద్రంవలె వున్నది. మన శక్తులన్నీ ఆ సముద్రంలోని కణలేశమే. ఆమె కృపవలననే యిన్ని మాటలు మాటాడుతున్నాం యిన్ని పనులు చేస్తున్నాం. ఈనిజం గ్రహిస్తే అహంకారానికి తావేదీ? 


ఆచార్యులవారిది ఒక అపూర్వమైన అవతారం. సత్యదర్శనానికి తహతహ లాడేవారు ఆచార్యులవారిని అనుగమించేది. తత్త్వజ్ఞానం తెలిసికొనగోరేవారు ఆచార్యులవారి గ్రంథాలను చూచేది. వారికి గల గౌరవం అసమానం. వారి గ్రంథాలకు గల ప్రశస్తి అత్యధికం. వారికీర్తి భారతదేశమే కాక విదేశాలకు కూడా ఎప్పుడో పాకిపోయింది. 


సయాం, కంబోడియా దేశాలలో పురావస్తుపరిశోధకులకు కొన్ని ప్రాచీన సంస్కృతి శిలాశాసనాలు దొరికినవి. ఆ శాసనాలలో ఒకటి ఆచార్యులవారి ప్రశంసవున్నది. 


యే నాధీతాని శాస్త్రాణి భగవచ్ఛంకరాహ్వయాత్| 

నిశ్శేష సూరిమూర్ధాళి మాలా లీఢాంఘ్రి పంకజాత్|| 


అన్ని శాస్త్రాలూ ఆలోచనచేసి నిర్థారణచేసిన భగవచ్ఛంకరులు నాకు ఆచార్యులు, నేను వారిసన్నిధిలో అధ్యయనం చేశాను అని కంబోడియాలోని ఒక ఆలయప్రతిష్ఠాపకులు వ్రాసికొన్న శిలాశాసనములో ఉన్నది. ఆచార్యుల వారిని గూర్చి ఎచ్చట ప్రస్తావన వచ్చినా భగవచ్ఛంకరులనే వ్రాయుదురు. 

అట్టి మహనీయులు భగవచ్ఛంకరాచార్యులువారు 'నేను సౌందర్యలహరి చెప్పాను; అది నీ అనుగ్రహమే కాదా? నీవు దయతో ఇచ్చిన వాక్కుతో నిన్ను స్తుతిచేయడం సూర్యునికి దివ్వె యెత్తినివాళించడం. చందమామకు చలువరానీరితో అర్ఘ్యమెత్తడం, మున్నీటికి మున్నీటినీటనే చలువ చేకూర్చడం' అని వ్రాసుకుంటే మనవంటి తెలివికలవారు 'ఉప్పు లేక ముప్పందుం తిన్నాం' అని దురభిమానం పొందవచ్చా? 


మనలో సాహిత్యపరులున్నారు, వాగ్ వైదుష్యం కలవారున్నారు. వీరిని ఇతరులూ, పొరుగువారూ కొనియాడవచ్చు. కాని 'నాకు ఇట్టి యోగ్యత యున్నదా?' అని కొనియాడబడేవాడు ఆత్మపరీక్ష చేసికోవాలి. అంతా అమ్మ పెట్టిన భిక్ష. ఎవ రెవరిట్లాకొనియాడబడుతూవుంటారో వారి వారికి అందరికీ అమ్మబిచ్చమే ఎవరికడనుండి ఆ శక్తి వస్తూందో ఆ శక్తిని వారికే సమర్పణ చేసికోవాలి. అపుడాయమ్మ కనుగ్రహం కలుగుతుంది. 'అహం' లేకుండా మన మంచి చెడుగులన్నీ ఆమెకు అప్పనంచేసి ఆమె అడుగులకు అప్పసమూ తల పోసికొంటుంటే మనకేకాక లోకానికి కూడా క్షేమం కలుగుతుంది.                        


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “జగద్గురు బోధలు” నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

చార్ ధామ్ యాత్ర

 *🙏చార్ ధామ్ యాత్ర🙏*


*బదరీనాధ్, కేదార్నాధ్, యమునోత్రి, గంగోత్రి, అక్కడ వున్న ప్రముఖ ఆలయాలను చార్ధామ్ గా ప్రసిధ్ధిపొందాయి. చార్ధామ్ యాత్రలో మొదటిది బదరీనాధ్ దర్శనం ముఖ్యమైనది. బద్రీనాధుడు తపస్సు చేసే రూపంలో అనుగ్రహించే, 'బదరికాశ్రమం అనే బదరీనాధ్. ఇది 99వ దివ్య దేశం. అష్టాక్షర మంత్రాన్ని ప్రపంచానికి ఉపదేశించిన మహావిష్ణువు వెలసిన ప్రదేశం. ఈ దేవాలయం అలక్ నందా కుడి ప్రక్క నదీతీరాన నర నారాయణ శిఖరాలకి మధ్యన వున్నది. ఈ ఆలయానికి వెనుక భాగాన ఎత్తైన నీలకంఠ శిఖరం దర్శనీయం. చమోలీ నుండి ఇక్కడికి వెళ్ళడానికి నాలుగున్నర గంటల సమయం పడుతున్నది. మార్గంసక్రమంగా వుండదు. ఆ సన్నటి మార్గాన ఒక బస్సు మాత్రమే ప్రయాణించగలదు. డ్రైవర్ లు తమ వాహనాలను అతి జాగ్రత్తగా నడపవలసి వున్నది. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా, అతళ పాతాళమే. ఒక ప్రక్కన అతి లోతైన లోయలు, మరొక ప్రక్కన ఎత్తైన కొండ శిఖరాలు. ఆ మార్గంలో ప్రయాణం భయంగానే వుంటుంది. భగవంతుని మీద భారంవేసి భయంకరమైన మార్గం గుండా ప్రయాణిస్తారు. హిమంతో కప్పబడిన ఎత్తైనశిఖరాలు , దట్టమైన అడవులు వెండి అంచుల్లాగ ఎత్తైన శిఖరాల నుండి, జలజల పారే జలపాతాలు, చిన్న చిన్న సెలయేళ్ళు, కొన్ని ప్రదేశాలలో ప్రశాంతంగా ప్రవహించేనదులు, మరి కొన్ని ప్రదేశాలలో ఉధృతంగా ప్రవహించే నదుల మధ్య నుండి ఒంపులుగా సాగే సన్నటి బాట, కొండ చరియలు, పచ్చని రమణీయమైన కన్నులను, మనసులను రంజింపచేస్తాయి. నాలుగు వైపులా హిమాలయశిఖరాలైన నీలకంఠ పర్వతం, ఊర్వశి పర్వతం, నర  నారాయణ పర్వతాలతో ప్రకృతి అత్యంత సుందరంగా దర్శనమిస్తుంది. శ్రీమహావిష్ణువు నరనారాయణులుగా అవతరించి ఈలోక క్షేమంకోసం దీర్ఘతపమాచరించిన సమయంలో, ఆయన తపోభంగానికై దేవేంద్రుడు అప్సరసలను పంపాడు. తక్షణమే మహావిష్ణువు ఆ అప్సర్సల అహంకారం అణచడానికి, దేవేంద్రునికి పాఠం చెప్పడానికి, తన తొడ నుండి మహాసౌందర్యరాశియైన ఊర్వశిని ఆవిర్భవింప చేశాడు. ఊర్వశి అందాన్ని చూసి ఇంద్రుడి అప్సర్సలు సిగ్గుపడి తమ అహంకారాన్ని వదిలారు. దేవేంద్రుడు తప్పు తెలుసు కున్నాడు. ఇందువలన బదరీ నారాయణ ఆలయం 'ఊర్వశిపీఠం" అని పిలువబడుతున్నది. ఆలయానికి దక్షిణాన ఊర్వశికి కూడా ఒక ఆలయము వున్నది. పిదప నరనారాయణులు ఊర్వశిని దేవేంద్రుని నగరానికి పంపి వేశారు. ఊర్వశి దేవేంద్రుని సభలో నర్తకిగా వున్నది. నారదుడు ఈ స్ధలంలోనే, జ్ఞానాన్ని,యోగాన్ని, సంగీతకళలలో అద్భుతమైన ప్రజ్ఞ సంపాదించినందున, దీనికి నారదక్షేత్రం అనే పేరు కూడా వచ్చింది. జనమేజయుడు స్త్రీ వ్యామోహంతో,  సర్వ నాశనమవుతున్నప్పుడు వ్యాస భగవానుడు హితవు పలికి జ్ఞానబోధ చేసిన స్ధలమూ ఇదే. సంస్కృతంలో " బదరీ" అంటే రేగి పళ్ళు అని అర్ధం. ఈస్ధలం రేగి ఫలవనంగా వుంటుంది. ఇక్కడ మహా విష్ణువు తపమాచరిస్తున్నప్పుడు, ఆయనను సూర్యరశ్మి తీక్షణత నుండి కాపాడడానికి,మహాలక్ష్మీ అరవిందవల్లీతాయార్ అనే పేరుతో, తానే రేగువృక్షంగా అవతరించింది. ఇక్కడి శ్రీమహావిష్ణువు సాలగ్రామ విగ్రహం. తొమ్మిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు నారద గుండం నుండి, తీసుకుని వచ్చి ప్రతిష్టచేశారు. ఆదిశంకరాచార్యులవారు తప్తగుండానికి గరుడశిలకి మధ్యన ప్రతిష్టించారు. కుష్టు వ్యాధితో బాధ పడుతున్న గర్వాల్ మహారాజు, వరదరాజాచార్యులనే తన గురువు ఆదేశాను సారం ఇప్పుడు వున్న మూలస్ధానంలో విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. దాని ఫలితంగా ఆ మహారాజు వ్యాధి నుండి విముక్తుడైనాడు. వైకుంఠానికి ప్రవేశ ద్వారము బదరీనాధ్. ఆరు మాసాలు హిమపాతంతో కప్పబడి వుంటుంది. ఆసమయంలో దేవతలు వచ్చి పూజలు చేస్తారని ఐహీకం. ఈ స్ధలానికి 'బదరీ విశాల్' అనే పేరు వున్నది. బదరీనాధుని దర్శించని వారికి  ముక్తి లభించదని ఋగ్వేదంలోని కొన్ని వాక్కులు ఇక్కడ వ్రాసి వున్నవని భక్తుల విశ్వాసం. బదరీనాధుడు, బదరీశ్వరునిగా పిలువబడుతున్నాడు. ఈస్వామి వైష్ణవులకు వైకుంఠవాసునిగాను, శైవులకు పంచముఖ శివునిగాను, శక్తిని ఉపాసించే శాక్తేయులకు కాళిగాను, బౌద్ధులకు శాక్యమునిగాను, జైనులకు తీర్ధంకరునిగాను దర్శనమిస్తున్నట్లు నమ్మకం. ఆలయం తూర్పు ముఖంగా వుంటుంది. గర్భగుడిలో రెండడుగుల ఎత్తున బదరీనాధుడు, ధ్యాన ముద్రలో దర్శనమిస్తున్నాడు. గర్భగుడి సమీపమున 'ధర్మశిలా' అనే హుండి,హోమగుండం వున్నవి. కుడి ప్రక్కన నిలబడిన మూర్తులుగా నర నారాయణులు, ఎడమ ప్రక్కన కుబేరుడు, వినాయకుడు దర్శనమిస్తున్నారు. మహావిష్ణువు ముందర నారదుడు, మహావిష్ణువు విగ్రహానికి పైన సూర్యచంద్రులు వున్నారు. నల్లని సాలగ్రామ విగ్రహంగా వున్న బదరీనాధునికి పాలాభిషేకం, తేనె అభిషేకముజరుగుతాయి. సాయంకాలం శింగార దర్శన సమయానసహస్రనామములు.గీతగోవిందములతోస్తుతిస్తారు.ఆదిశంకరాచార్యులవారు నియమించిన నంబూద్రీ వంశం వారే ఈనాటికి యీఆలయ అర్చకులు. ఆలయంలో, మహాలక్ష్మీకి ఘంటాకర్ణునికి ప్రత్యేక సన్నిధులు వున్నవి. నారద,ఉధ్ధవనరనారాయణు సన్నిధులు వున్నవి. ఆలయం లోపల ఆదిశంకరాచార్యుల వారి చిత్రం, ఆయన తపస్సు చేసిన గుహ, కల్పవృక్షం వున్నాయి. ఆలయ ముఖ ద్వారము వద్ద మహావిష్ణువు యొక్క దశావతారాలు చిత్రీకరించబడిన పది స్ధంభాలు వున్నాయి. గరుత్మంతుని విగ్రహం అందంగా అమర్చబడి వుంటుంది. సమీపాన వినాయకుని విగ్రహం, హనుమంతుని విగ్రహం ప్రతిష్టింపబడి వుంటాయి. గర్భగుడి విమానము బంగారంతో నిర్మించబడినది. సభా మండపము నుండి భక్తులు బద్రీనాధుని దర్శించుకోవాలి. కట్నం చెల్లించిన దర్శనార్ధులకు మాత్రం గర్భగుడి ముందు మండపం నుండి దర్శించుకోవడానికి అనుమతి ఏర్పాట్లున్నాయి. ధర్మదర్శనం చేసుకునేవారు. వెలుపల మండపంలో వరుసలలో నిలబడి దర్శించుకోవాలి. విష్ణు సహస్రనామ పూజలో పాల్గొంటే, ఇరవై నిమిషాలు భగవంతుని మనసారా దర్శించే అవకాశం లభిస్తుంది. వరాహశిల, నారదశిల, న‌సింహశిల, గరుడశిల అనే పంచ శిలలు ఇక్కడే వున్నాయి. ఈ శిలలు తప్తగుండం పైన వున్నాయి. వాటి చుట్టూ ప్రహ్లాదధార, కూర్మధార, ఊర్వశిధార, భృగుధార, ఇంద్రధార అనే ఐదు జలధారలు ఎత్తు నుండి పడుతూంటాయి. పితృ తర్పణాలు వదలడానికి అలక్ నందా నదీ తీరాన బ్రహ్మ కపాలమనే స్ధలం వున్నది. పరమశివుడు బ్రహ్మ ఐదవ తలను ఖండించినప్పుడు ఆతల పరమశివుని చేతిని అంటుకుపోయింది, ఆతల ఇక్కడకు రాగానే క్రింద పడిపోయినది. అందువలన ఈ ప్రాంతానికి బ్రహ్మ కపాలమనే పేరు వచ్చింది. ఈ ప్రదేశంలో పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్తారు. తప్తగుండంలో పొగలు గ్రక్కే వేడి నీరు వుంటుంది. భగీరధుని కోసం పరమశివుని కపాలము నుండి ఉధ్భవించిన గంగ అవడం వలన ఉష్ణ గుండమైనదని చెప్తారు. ఈ గుండంలోని జలం ఓషధీ గుణాలు వున్నందున ఈ గుండంలో స్నానం చేస్తే వ్యాధులు గుణమౌతాయని భక్తుల ధృఢ విశ్వాసము. నవంబర్ ఆలయం మూసిన పిదప ఆరుమాసముల పాటు ఉత్సవ విగ్రహాలను క్రిందనున్న జోషీ మఠానికి తీసుకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆలయం మూయడానికి ముందు స్వామిసన్నిధిలో వెలిగించిన దీపం ఆరు మాసముల తర్వాత మరల ఆలయం తలుపులు తెరిచే దాకా వెలుగుతూ వుండడం అద్భుతమైన, ఆశ్చర్యకరమైన విషయం🙏.*

సుఖం విలువ

 శ్లోకం:☝️

*సుఖం హి దుఃఖాన్యనుభూయ శోభతే*

 *ఘనాంధకారేష్వివ దీపదర్శనం ।*

*సుఖాత్తు యో యాతి నరో దరిద్రతాం*

 *ధృతః శరీరేణ మృతః స జీవతి ।।*


భావం: చిమ్మచీకటి నుండి బయటకు వచ్చిన తర్వాత దీప దర్శనం ఎలా ఆహ్లాదకరంగా ఉంటుందో, అలాగే దుఃఖాన్ని అనుభవించిన తర్వాత సుఖం విలువ తెలుస్తుంది. సుఖంగా జీవించిన తర్వాత పేదవాడిగా మారిన వ్యక్తి, జీవచ్ఛవంలా బతుకుతాడు.

అరటిపండు

అరటిపండు

 అరటిపండుగురించి తెలియని వారు అరటిపండు రుచి తెలియని వారు వుండరు అంటే అతిశయోక్తి కాదు.  నిజానికి శిశుదశ నుండి వృద్ధాప్యం వరకు అనేక పరియాయలు అరటిపండ్లు తిన్నవారే అందరు. బుద్ది వికసించని శిశువులకు ఇస్తే అరటి పండును తినటం తెలియకపోవచ్చు కానీ ఏ మాత్రం వయస్సు వున్న బాలునికి అరటిపండు ఇచ్చినా వెంటనే తోలు తీసి గుజ్జు తినటం పరిపాటి. ఏదైనా విషయాన్నీ సందేహరహితంగా వివరిస్తే అరటి పండు వలచి పెట్టినట్లు చెప్పానుకదా అని అనటం పరిపాటి.  అంటే అరటి పండు వలచినతరువాత పండు తినటం చాలా సులువు అని కదా అర్ధం. 

ఇక విషయానికి వస్తే సాధకుడు నిత్యా నిత్య వివేకం చేయటం అరటిపండు వలచినంత మాత్రంగా జ్ఞ్యానులు పేర్కొంటున్నారు. వివరణలోకి వస్తే అరటిపండు చూడటానికి చాలా ఇంపుగా పండు చూస్తేనే తినబుద్ది అయేటట్లు ఉంటుంది.  నిజానికి దాని తోలు కంటికి ఇంపుగా ఉన్నాకూడా అది మనం తినం దానిని వలచి వేస్తేనే మనం తినే పండు లభిస్తుంది. 

విషయవాసనలు చూడటానికి అరటిపండు తోలులాగా నేత్రానందంగా వున్నా అది కేవలం తీసి పారవేసేది అని యెట్లా తెలుసుకుంటామో అదే విధంగా మనం ఈ జగత్తులోని విషయవాసనాలను తీసి వెర్సి నిత్యం సత్యం అయినా పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలి.  అదే బ్రహ్మ జ్ఞ్యాననఁ ప్రతి మానవుడు జీవితంలో సాధించవలసిన ఏకైక జీవన లక్ష్యం. సాధకుడు సదా దానికోసమే, దానివెంట పరుగులిడి తన జన్మను సార్ధకత చేసుకోవాలి. 

 

ఓం తత్సత్


ఓం శాంతి శాంతి శాంతిః


ఇట్లు భార్గవ శర్మ