4, మే 2023, గురువారం

అహమేలేని ఆదిశంకరులు

 అహమేలేని ఆదిశంకరులు


'ప్రదీపజ్వాలాభి ర్దివసకర నీరాజనవిధి 

స్సుధా సూతే శ్చంద్రోపల జల లవై రర్ఘ్యరచనా, 

స్వకీయై రంభోభి స్సలిలనిధి సౌహిత్యకరణం 

త్వదీయాభి ర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియమ్. 


నూరు శ్లోకాలు కల సౌందర్యలహరిలో చివరిది ఈ శ్లోకం. సౌందర్యాన్ని ఒకరు చూపనక్కరలేదు. అది స్వతహాగా కనపడేవస్తువు. కన్నులకు ఆనందమిచ్చేవి కొన్ని, చెవులకు ఆనందం యిచ్చేవి కొన్ని. శబ్దమాధ్యుర్యం శ్రవ్య సౌందర్యం కలది. 


భగవత్ పాదులు వ్రాసిన సౌందర్యలహరివంటి సుందరమైన కావ్యం అరుదు. 

ప్రపంచంలో అందంగావున్నవని మనం అనుకునేవస్తువులన్నీ అంబికాకటాక్ష లేశమాత్రాన పుట్టినవే. సౌందర్య దేవతయేఅంబిక. ఆమెఅనుగ్రహం చేతనే ఆచార్యులవారి వాక్కు సౌందర్యలహరియై (లహరి అనగా ఏరు) ప్రవహించినది. సుందరములైన పురాతనపు శిల్పములు భగ్నమయితే, పోయిన భాగములను పూరిస్తామని ఏవైనా తెచ్చి అతికిస్తే బాగావుండదు. అల్లాగే బ్రహ్మదత్తమైన వాక్ సౌందర్యం కలవారికృతులలో ఒకమాటకు బదులు మరొకమాట వాడిచూద్దామని చూస్తే అతకదు ఆలోపం లోపంగానేనిలిచిపోతుంది. భగవత్ పాదుల సౌందర్యలహరి అట్టిదే. ఇట్టి కావ్యరత్నమును సృజించిన ఆచార్యులవారికి నేనువ్రాసితిని అన్న అహము లేశమాత్రమూ కనబడదు. సంక్రాంతినాడు సూర్యుని వెలుగులు ప్రసరించే చోటు గోమయంతో శుద్ధిచేసి ముగ్గులుతీర్చి దాని నడుమ సూర్యబింబమును వ్రాసి చెరకు, చెక్కెర, పొంగలి, కొబ్బరికాయ యీ మొదలైన వానిని నివేదనంచేసి సూర్యునకు నమస్కరించి నీరాజనం యిస్తాం. కప్పురపు వెలుతురెక్కడ? సూర్యప్రకాశమెక్కడ? పదినాళ్లు వరుసగా ప్రొద్దు పొడవకపోతే కర్పూరంకూడ వెలుగదు. అంబికా కరుణా కటాక్షాన చెప్పబడిన సౌందర్యలహరి ఆమెకే అర్పించడం సూర్యునకు ఇచ్చే నీరాజనం వంటిది. సూర్యకిరణాలు విశ్వమంతా వ్యాపించి వున్నవి. కాని వానిని ఒక భూత అద్దంలో కేంద్రీకరించి కింద బూరుగదూది నుంచితే దూది మండిపోతుంది. కేంద్రీకరణంవల్ల సూర్యరశ్మికి అంత దాహకశక్తి ఏర్పడుతుంది. అట్లే స్వామి సర్వవ్యాపకుడు. అయినప్పటికీ భక్తులను అనుగ్రహించటంకోసం ఆలయాలలో ప్రతిష్ఠింపబడి ఆర్తత్రాణ పరాయణమూర్తియై ఉండును. 


ఆ పరమాత్మ అనుగ్రహం లేనిదే ఏకార్యమున్నూ జరగదు. మనం అనుక్షణంచేసే ఊర్పు నిట్టూర్పులు సైతం ఆయన కృపచేతనే. మంచికాని, చెడ్డగాని, ఏదైనా ఆ మహాశక్తి మనలో వుంటేనేకాని చేయలేము. ఆశక్తి లేనప్పుడు ఏమీలేదు. చరాచరాల అన్నింటికీ అధిష్ఠాత్రియైన, అన్నిటినీ నడిపే ఆమెకే పరాశక్తి అనిపేరు. 


అన్నిటికీ కారణం ఆమె ఆమె ఆధారశక్తి, అనంత శక్తి, సర్వవ్యాపిక అయినాఅచింత్యశక్తి అయిన ఆమె మహా తపస్సంపన్నులైన ఋషులచేతనూ మహనీయులచేతనూ ఆలయాలలో ప్రతిష్టచేయబడి ఆయా క్షేత్రాలలో తీర్థాలలో విశేషానుగ్రహ సమర్థయై, కేంద్రీకృతమైన రవి రశ్మివలె ప్రకాశిస్తూ వున్నది. 


సూర్యోపమానంవదలి చంద్రోపమానం చేసిచూద్దాం. చంద్రుడు ఉదయింపగానే ఆ చలిమరిలో, వెన్నెలలో చంద్రకాంతశిల అమృతం స్రవిస్తుందట. ఈ సూర్యకాంత చంద్రకాంత శిలల నిజానిజాలు వైజ్ఞానికులకు వదలవలె. ఈనమ్మిక అనుశ్రుతంగా వస్తున్నది. మిణుగురు పురుగులనూ, రాత్రి మిలమిల మెరిసే జ్యోతిర్లతలు అనే లతావిశేషాలనూ పరికించి చూస్తే మనకీ శిలల విషయం ఆశ్చర్యంకాదు. 


చంద్రకాంతశిల చంద్రుని అమృతకిరణముల స్పర్శచే కరిగిపోతుంది అని అనుకుందాం. ఇది వాస్తవమే కావచ్చు. ఒకవేళ చంద్రుడే లేకపోతే? 


సౌందర్య దేవతవు నీవు. వాక్కనే అమృతానికి వారిధియైన వాగ్దేవివినీవు. ఆ సారస్వత సముద్రంలోని జలకణమే నా వాక్కులో వున్నది. నీవు లేకపోతే - నీ అనుగ్రహం లేకపోతే వాక్ సంపత్తి నాకేదీ? అమృతం కురిసేవాడు చంద్రుడు. అతడు అమృతకిరణుడు. తాపహారి. నాకృతి దివాకరునికి ఎత్తిన దివ్వెవలె చంద్రునకు ఇచ్చిన చంద్రకాంత శిలాసలిలార్ఘ్యంవలే ఉన్నది. సముద్రుని దగ్గరకు వెళ్ళి దానిలోని (ఉప్పు) నీరే తీసికొని 'అపోహిష్ఠా' అనీ స్నానము ఆర్ఘ్యము పాద్యము ఆచమనము చేసినట్లవుతుంది అని భగవత్ పాదులు ఈ శ్లోకంలో వ్రాశారు. 


మనం అనుదినమూ ఎన్నోపనులు చేస్తున్నాం. ఈపనులన్నీ ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నాను అనే అహం భావం కలగడానికి ఏమాత్రమూ ఆస్పదంలేదు? నిరభిమానం కలగాలి. కొందరు నిజంగానే నిరభిమానులై వుంటారు. నేను నిరభిమానిని అన్న అభిప్రాయం తనకు ఉంటే అదిన్నీ ఒక అభిమానమే. అందుచేత అతిజాగ్రత్త అత్యవసరం. 


కొంచెం ఆలోచించి చూద్దాం. మనం దేనిని చూచి అహంభావం పొందాలి? మనకు ఏ పని కావలసివున్నా శక్తి అవసరం. ఆశక్తియే అంబిక. ఆమె నిండు సముద్రంవలె వున్నది. మన శక్తులన్నీ ఆ సముద్రంలోని కణలేశమే. ఆమె కృపవలననే యిన్ని మాటలు మాటాడుతున్నాం యిన్ని పనులు చేస్తున్నాం. ఈనిజం గ్రహిస్తే అహంకారానికి తావేదీ? 


ఆచార్యులవారిది ఒక అపూర్వమైన అవతారం. సత్యదర్శనానికి తహతహ లాడేవారు ఆచార్యులవారిని అనుగమించేది. తత్త్వజ్ఞానం తెలిసికొనగోరేవారు ఆచార్యులవారి గ్రంథాలను చూచేది. వారికి గల గౌరవం అసమానం. వారి గ్రంథాలకు గల ప్రశస్తి అత్యధికం. వారికీర్తి భారతదేశమే కాక విదేశాలకు కూడా ఎప్పుడో పాకిపోయింది. 


సయాం, కంబోడియా దేశాలలో పురావస్తుపరిశోధకులకు కొన్ని ప్రాచీన సంస్కృతి శిలాశాసనాలు దొరికినవి. ఆ శాసనాలలో ఒకటి ఆచార్యులవారి ప్రశంసవున్నది. 


యే నాధీతాని శాస్త్రాణి భగవచ్ఛంకరాహ్వయాత్| 

నిశ్శేష సూరిమూర్ధాళి మాలా లీఢాంఘ్రి పంకజాత్|| 


అన్ని శాస్త్రాలూ ఆలోచనచేసి నిర్థారణచేసిన భగవచ్ఛంకరులు నాకు ఆచార్యులు, నేను వారిసన్నిధిలో అధ్యయనం చేశాను అని కంబోడియాలోని ఒక ఆలయప్రతిష్ఠాపకులు వ్రాసికొన్న శిలాశాసనములో ఉన్నది. ఆచార్యుల వారిని గూర్చి ఎచ్చట ప్రస్తావన వచ్చినా భగవచ్ఛంకరులనే వ్రాయుదురు. 

అట్టి మహనీయులు భగవచ్ఛంకరాచార్యులువారు 'నేను సౌందర్యలహరి చెప్పాను; అది నీ అనుగ్రహమే కాదా? నీవు దయతో ఇచ్చిన వాక్కుతో నిన్ను స్తుతిచేయడం సూర్యునికి దివ్వె యెత్తినివాళించడం. చందమామకు చలువరానీరితో అర్ఘ్యమెత్తడం, మున్నీటికి మున్నీటినీటనే చలువ చేకూర్చడం' అని వ్రాసుకుంటే మనవంటి తెలివికలవారు 'ఉప్పు లేక ముప్పందుం తిన్నాం' అని దురభిమానం పొందవచ్చా? 


మనలో సాహిత్యపరులున్నారు, వాగ్ వైదుష్యం కలవారున్నారు. వీరిని ఇతరులూ, పొరుగువారూ కొనియాడవచ్చు. కాని 'నాకు ఇట్టి యోగ్యత యున్నదా?' అని కొనియాడబడేవాడు ఆత్మపరీక్ష చేసికోవాలి. అంతా అమ్మ పెట్టిన భిక్ష. ఎవ రెవరిట్లాకొనియాడబడుతూవుంటారో వారి వారికి అందరికీ అమ్మబిచ్చమే ఎవరికడనుండి ఆ శక్తి వస్తూందో ఆ శక్తిని వారికే సమర్పణ చేసికోవాలి. అపుడాయమ్మ కనుగ్రహం కలుగుతుంది. 'అహం' లేకుండా మన మంచి చెడుగులన్నీ ఆమెకు అప్పనంచేసి ఆమె అడుగులకు అప్పసమూ తల పోసికొంటుంటే మనకేకాక లోకానికి కూడా క్షేమం కలుగుతుంది.                        


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “జగద్గురు బోధలు” నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: