ప్రతిరోజూ పరీక్షయే
విద్యార్థి దశలో వున్నప్పుడు ప్రతి విద్యార్థికి ప్రధాన పరీక్షలు సంవత్సరానికి ఒక సారి మాత్రమే వస్తాయి. తెలివయిన విద్యార్థులు పరీక్షలకు ముందు రెండు మూడు నెలల నుండి ఏకాగ్రతతో, కష్టపడి చదివి పరీక్షలలో ఉతీర్ణత సాధించవచ్చు. కొంతమంది చివరి నిమిషం వరకు చదవకుండా వుండి రేపు పరీక్ష అన్నప్పుడు యేవో చిన్న గైడుపుస్తకాలు కొనుక్కొని చదివి పరీక్ష వ్రాస్తారు. ఇదొక పద్దతి. విద్యార్థి చురుకైనావాడు, తెలివయిన వాడు సుక్మాగ్రహి అయితే ఆలా చేసికుడా పరీక్షలు ఉతీర్ణత సాధించవచ్చు. కానీ దీక్షగా చదివిన విద్యార్థి సాదించినన్ని గణములు పొందకపోవచ్చు. ఆలా కాకుండా రోజు పరీక్ష అయితే అప్పుడు విద్యార్థులు చక్కగా ఏ రోజు పాఠం ఆ రోజే చదివి అవగాహన పొందవచ్చు. కానీ ఎప్పటికి ఆలా ఉండదు.
మోక్షార్ధి అయిన సాధకుని జీవితం చాలా కఠినమైనది నిజానికి సాధనకు అనేక విధాలా అవరోధాలు కలుగుతాయి. అయినా వాటినన్నిటిని తానూ ఓర్పుతో, పట్టుదలతో, నిరంతర కృషితో అధిగమించి అను క్షణం భగవంతుని ధ్యాసలో గడిపి తన సాధనను సాగిస్తాడు. సాధకునికి వచ్చే ఆవరమోదాలు ఏమిటో చూద్దాము.
1) ఆద్యాత్మికం: అంటే సాధకుని శరీరం సాధనకు సహకరించక పోవటం అందులో మొదటిది
తామాస ప్రవ్రుత్తి : తామాస ప్రవ్రుత్తి సాధారణంగా ప్రతి సాధకునికి ప్రారంభంలో ఎదురయ్యే ప్రధాన అవరోధం. నీవు ఉదయం బ్రహ్మి ముహూర్తంలో లేచి సాధన చేద్దామనుకుంటావు. గడియారంలో అలారం పెట్టుకొని నిద్రించావు అలారం మోగింది కానీ నీవు తెల్లవారుజామున 4గంటల సమయంలో మంచి నిద్రలో వున్నావు కాబట్టి నిద్రాభంగం అయినట్లుగా భావించి అలారం నొక్కి మరల పడుకుంటావు. తెల్లవారిన తరువాత ఏ 6 లేక్ 7 గంటలకు మెలకువ వచ్చింది కానీ ప్రయోజనం ఏముంది ఊరు మొత్తం మేలుకుంది నీకు సాధన చేయటం కుదరలేదు. అంటే ఒక రోజు నీ సాధనకు భంగం కలిగినట్లే కదా
రాత్రి భోజనం : సాధకుడు రాత్రి భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గీతలో కృష్ణ భగవానుడు చెప్నట్లుగా రాత్రి భోజనం విషయంలో సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మితాహారం, సాత్విక ఆహరం తీసుకోవాలి. సాత్విక ఆహరం అంటే ఏమిటి శాఖాహారమా అని చాలా మంది అడుగుతారు. నిజానికి సాత్విక ఆహరం అంటే శాఖాహారం అనికాదు అది ఏమిటంటే తక్కువగా ఉప్పు, కారం వుండి ఎటువంటి మసాలాలు లేకుండా వున్నటువంటిది ఇంకొక మాట చెప్పాలంటే త్వరగా జీర్ణం అయ్యేదిగా ఉండాలి. కృష్ణ భగవానుడు ఒక్క మాటలో పూర్తి వివరణ ఇచ్చారు. అదేమిటంటే ఆహరం తీసుకున్న వెంటనే దాహం కాకూడదు. ఉదాహరణకు నీవు నూనెతో కూడిన పదార్ధం అంటే పూరీలు తిన్నావనుకో నీ దృష్టిలో పూరీలు పూర్తిగా శాకాహాహారమే కానీ అవి తిన్న వెంటనే దాహం అవుతుంది అంటే అవి శాకాహారంమే కానీ సాత్విక్ ఆహరం కాదు. నూనెతో చేసిన ఆహారం జీర్ణం కావటానికి చాలా సమయం పడుతుంది. అలాగే మాసాలతో చేసిన పదార్ధాలు కూడా త్వరగా జీర్ణం కావు. సాధకుడు కొంత సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు ఏ పదార్ధం తినాలో, ఏ పదార్ధం తినకూడదో తన మనసుకు తనకే తెలుస్తుంది. అదే విధంగా ఎంతపరిమాణంలో ఆహరం తీసుకోవాలో కూడా అవగాహనకు వస్తుంది. పదార్ధం చాలా రుచికరంగా ఉన్నాకూడా మితి మీరు ఎట్టి పరిస్థితిలో సాధకుడు భుజించడు.
తొందరగా పడుకోవటం: సాధకుడు రాత్రిపూట సాధ్యమైనంత వరకు తొందరగా నిద్రకు ఉపక్రమించాలి. రాత్రి చాలా సేపు మేలుకొని ఉండటం వలన తొందరగా లేవలేడు .ప్రతి మనిషి తన వయస్సు ప్రకారం కొన్ని గంటల నిద్ర అవసరం అని శాస్త్రం చెపుతుంది. కాబట్టి తొందరగా నిద్రిస్తే సాధకుడు తొందరగా నిద్రనుంచి లేవగలుగుతాడు.
ఆరోగ్య పరిరక్షణ: సాధకుడు శరీరం మీద మమకారం వహించకూడదు కానీ శ్రర్ధ వహించాలి ఈ రెండిటికి చిన్న తేడా వున్నది శరీరపు మమకారం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే శరీరం మీద మోజు అంటే ప్రతివారు వారి శరీరం సమాజంలో అందంగా కనపడాలి అని అనుకోవటం మమకారం అప్పుడు వెంట్రుకలకు రంగు వేయటం, ఖరీదైన సుగంధ ద్రవ్యాలు, లేపనాలు రాసు కోవటం విలువైన ఆభరణాలు ధరించటం లాంటి పనులు చేయటం అనేది శరీర మమకారం. అదే శరీర శ్రర్ధ అంటే ప్రాతఃకాలంలో నిద్రలేచి దంతధావన చేసి పరిశుభ్రంగా చన్నీటి స్నానం చేయటం, ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించటం. సాత్విక ఆహారం సమయానుకూలంగా భుజించటం, మిత భాషణం, ధార్మిక జీవనం చేయటం. ఇత్యాదివన్నీ శరీరపు శ్రర్ధగా పేర్కొన వచ్చు.
తామరాకు మీద నీటి బొట్టు: తామరాకు మీద నీటి బొట్టు:లాగ కుటుంబ సంబంధాలు కలిగి ఉండటం. ఇది ఆధ్యాత్మిక జగతిలో తరచుగా వినపడే ఉపమానం. తామరాకు మీద నీటి బొట్టు ఉన్నాకూడా అది తామరాకుకు అంటుకొని ఉండదు కేవలం దాని అస్తిత్వం దానిది తామరాకు అస్తిత్వం దానిది. సాధకుడు సంసారాన్ని నిర్వహిస్తున్నా కూడా కుటుంబ బండలను కేవలం యాదృచ్చికంగా తీసుకొని బాధ్యతలను నెరవేయాలి కానీ బంధాలను మనస్సుకు తీసుకొని బాధపడటం ఆనందపడటం చేయకూడదు. నీవు నీ మిత్రుడు కలసి వీధిలో వెళుతున్నావు అక్కడ ఒక బాలుడు స్కూటరు నడపటం చాటగాక క్రిందపడి దెబ్బలు తాకించుకున్నాడు. చూసినవారు అందరు వాడి తల్లిదండ్రులని అనాలి ఇంత చిన్న పిల్లవానికి స్కూటరు ఇస్తారా వాళ్లకు బుద్ధిలేకపోతే సరి అని ఆనుతున్నారు. నీవు కూడా వాళ్లలాగే అని నీ మిత్రుని పోనీయరా నీ బండిని ఇటువంటివి రోజు అనేకం జరుగుతుంటాయి వీటిని చూస్తూ మనం కాలయాపన ఎందుకు చేయాలి అని నీ మిత్రుని మోటారు సైకిల్ నడపటానికి ప్రేరేపిస్తావు. అంతలో ఆ గుంపులోంచి నీకు తెలిసిన ఒకడు వచ్చి పరంధామయ్యగారు ఆ స్కూటరు మీదినించి పడింది మీ పిల్లవాడే అని చెపితే అప్పుడు నీ లోంచి తండ్రి ప్రేమ ఒక్కసారిగా ఉప్పొంగి వచ్చి అమాంతం మోటారుసైకిల్ దిగి వెంటనే నీ కొడుకు వద్దకు వెళతావు. అదే బంధం అంటే అదే ఆ పడినాబాలుడు పరాయి వాడు అంటే బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించావు. ఇలా ప్రతి వక్కటి మనసుకు పెనవేసుకొని ఉంటుంది. కోటిలో ఒక్కరు తప్ప మిగిలిన వారంతా ఇలానే వుంటారు. ఆ ఒక్కరు ప్రస్తుతం మనకు మన సభ్యసమాజంలో ఉండకుండా హిమాలయాలలోనో, లేక ఇతర పర్వతాలమీదో తపస్సు చేసుకున్తున్నారు.
గృహస్ట జీవనం చేస్తున్న మనం పర్వతాలలో తపస్సు చేసుకునే యోగులంతగా మన మనస్సును నియంత్రించలేము. కానీ ప్రయత్నించటం మన ధర్మం. ఆపైన భగవదానుగ్రహం. కాబట్టి తామరాకు మీద నీటి బిందువులాగా ఉండటం అనేది చెప్పినంత సులువు కాదు అనంతమైన కృషితో మాత్రమే సాధ్యం. అయినా సాధకుడు ప్రయత్నం చేయాలి.
వస్తు వ్యామోహం: సాధకుడు వస్తువ్యామోహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, నాకు ఫలానా వాహనం కావలి, స్నానానికి చక్కటి వేడినీళ్లు ఉండాలి, ఆహారంలో ఫలానా కూర మాత్రమే ఉండాలి. అలాగే నాకు ఖరీదైన దుస్తులు, వస్తువులు గృహాలు వుండాలనె వ్యామోహం పెంచుకోకూడదు. సాధన బలపడితే సాధకునికి ప్రకృతి పూర్తిగా సహకరిస్తుంది. ఉదాహరణకు నీకు చలి అంటే చాలా బాధాకరం. నీవు చలిని తట్టుకోవాలేవు. కానీ నీలో సాధన బలపడుతుంటే నీకు తెలియకుండానే యెంత చలి వున్నా కూడా నీవు నిర్బయంతరంగా నిర్విరామంగా సాధన చేయగలుగుతావు.
భయం: భయం అనేది కూడా సాధకునికి కలిగే ఒక అవరోధంగా మాన్యులు చెపుతారు. నేను వంటరిగా ఉండి సాధన చేయలేను. నాకు భయం అని కొంతమంది సాధకులు ఆశ్రమాలకు, బాబాలదగ్గరకు వెళ్లి సామూహిక సాధనలో కూర్చుంటారు. నిజానికి కొన్ని రోజులు అంటే సాధనలో పట్టు లభించేవరకు అలా చేస్తే పరవాలేదు కానీ అటువంటి జీవనానికి అస్సలు అలవాటు పడకూడదు. సాధకుని సాధన కేవలం ఒంటరిగానే చేయాలి. ఇతరులతో సంబంధం పెట్టుకోకూడదు. ఇంకొక విషయం సాధనలో కొంత ముందుకు వెళ్లిన తరువాత సాధకునికి కొన్ని అతిన్ద్రియ శక్తులు వస్తాయి. వాటిని తాను గమనించి కూడా గమనించకుండా ఉండి సాధనను కొనసాగించాలి. సంపూర్ణంగా సాధనలో సమాధి స్థితి వచ్చినప్పుడు సాధకుడు అనన్య ఆనందాన్ని పొందగలడు. శరీరానికి సంబంధించి ఈ నియమాలు తీసుకుంటే సాధకుడు మొదటి అవాంతరాన్ని అధిరోహించినట్లే. కానీ మరల చెపుతున్నా ఆచరించటం చాలా కష్టం.
ఇక రెండవది ఆధిభౌతికం: సాధకునికి బయటి ప్రపంచంనుండి ఎదురయ్యే సమస్యలు. సాధకుడు అతి కష్టంగా తెల్లవారుఝామునే లేచి సాధన మొదలు పెడితే ప్రక్కనే వున్న దేవాలయంలో పూజారిగారు ధనుర్మాస పూజ అని అదే సమయంలో చక్కగా అర్చన చేస్తున్నారు. మీకు మైకు శబ్దంతో సాదన కుదరటం లేదు. నీవు వెళ్లి దేవాలయంలోని పూజారిగారిని మైకుపెట్ట వద్దని చెప్పలేవు. ఆలా అంటే నీకు భక్తి లేదా నీవు హిందువు కాదా అని నిన్ను ప్రశ్నిస్తారు. అక్కడ దేవాలయంలో వున్న ఇతరప్రజలు కూడా నీ మీద అదోలా చూసి ఈ రోజుల్లో పూజలు చేయరు, చేస్తుంటే అడ్డగిస్తున్నారు నాస్తికత్వం బాగా పెరుగుతున్నది అని నీ మీద పరిహాసాలు చేయట తథ్యం. తెల్ల మొహం వేసుకొని వెనుతిరిగి రావటం మినహా ఏమి చేయలేవు. ఈ రోజుల్లో ఇతర మతస్తుల మైకులు కూడా ఎక్కువ అయ్యాయి. వారిని నీవు అస్సలు అడగలేవు. ఇది ఒకరకం ఐతే ఇక ఏ మైకులేదు నీవు ప్రశాంతంగా సాధన చేసుకుంటూవున్నావు ఇంతలో ఏమైందో ఏమో తెలియదు ఒక వీధి కుక్క మొరుగుతుంది అంతే కుక్కలన్ని ఒక్కసారిగా ఒకదానిమీద ఒకటి పది పెద్దగా అరుస్తుంటాయి. వాటిని నీవు ఆపలేవు. ఇక నీ సాధన ఆ రోజు సాగాదు . ఇక పొతే ఈ రోజుల్లో పెద్ద పెద్ద శబ్దాలతో వివాహాలలో ఫంక్షన్ హాలులో రికార్డులు రాత్రి అని లేక పగలు అని లేక వేస్తున్నారు. ఆ శబ్దాలు యెంతగా వుంటున్నాయంటే గుండె మీద కొట్టినట్లుగా ఉంటున్నాయి. నీవు వారితో పోరాడ లేవు. అధవా పొలిసు స్టేషనుకు వెళ్లి ఫిరియాదు చేసినా పోలీసువారు కూడా నిన్నే నిందించి పంపుతారు. ఈ రకంగా అనేక విధాలుగా అధిభౌతిక అవాంతరాలు వస్తూవుంటాయి. వాటిని సాధకుడు అత్యంత తెలివి తేటలతో దాటాలి. సాధకుడు సదా సాత్విక్ ప్రవృత్తిని కలిగి ఉండాలి, ఎట్టిపరిస్థితుల్లోనూ, రాజస, థామస్ ప్రవృత్తిని దరి చేరనీయకూడదు. ఇది చాలా కాలం అభ్యసిస్తేనే లభిస్తుంది. ఈ ప్రపంచంలో చాలామంది రాజసప్రవృత్తిలో, థామస ప్రవృత్తిలో వుంటారు. వారి మధ్యన వుంటూ సాత్వికంగా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. కానీ సాధకుడు భగవంతుని మీద భారం వేసి ప్రయత్నించాలి.
అది దైవికం: అనగా ప్రకృతి అవాంతరాలు, వర్షాలు కురవటం, భూకంపాలు రావటం, పెనుగాలులు వీయటం ఇత్యాదివన్నీ ఈ కోవకు వస్తాయి. నీవు సాధనకు కూర్చున్నావు చక్కగా ఫాను వేసుకొని ఫాను క్రింద నీ సాధన మొదలు పెట్టావు. నీ చుట్టుప్రక్కల ఎటువంటి అవరోధాలు లేవు. కానీ నీకు ఎంతో దూరంలో పెనుగాలులు వీచాయి నీకు ఆ విషయంకూడా తెలియదు. కానీ దాని పర్యవసానంగా అక్కడ విద్యుతు స్తంబాలు పడిపోయాయి. దానితో నీకు విద్యుత్ సరఫరా నిలిచి నీ ఫాను తిరగటం లేదు. అది నీకు సాధన భంగాన్ని కలుగ చేసింది. ఇటువంటి అనేక ప్రత్యక్ష, పరోక్ష అవరోధాలు అనేకం సాధకునికి ఎదురుపడుతాయి. ఏ సమయంలో ఏరకంగా అవరోధం కలుగుతుందో సాధకుడు ఉహించలేడు. సాధకుడు ఒక దృఢ సంకల్పం చేయాలి ఎటువంటి అవరోధాలు ఏర్పడ్డాకూడా తన సాధనను మధ్యలో ముగించనని తలంచి. సాధనంకు ఉపక్రమించాలి. అప్పుడే సాధకుడు అవరోధాలను దాటి తన సాధన చేయలేడు.
సంసార జీవనం సాధనకు ఉపయుక్తమా: చాలామంది గృహస్తులకు కలిగే సాధారణ సందేహం. నిజానికి సంసారం సాధనకు ప్రతిబంధకం కాదని మాన్యులు చెపుతారు. కానీ సంసారం మాత్రం తప్పకుండా సాధనకు ఒక ప్రతిబంధకమే అవుతుంది. దీనిని ఒక ఉపమానంతో తెలుప ప్రయత్నిస్తాను. నీవు ఒక సైకిలు పోటీలో పాలుగొన్నావనుకో మిగితా వారంతా ఒంటరిగా సైకిలు తొక్కుతూ ఉంటే నీవు ముందు గొట్టం మీద నీ భార్యను, చిన్న పిల్లవాడిని వెనుక క్యారియర్ మీద నీ ఇద్దరు కొడుకులను కూర్చోపెట్టుకొని సైకిలు తొక్కుతూ పోటీలో పాల్గొన్నావనుకో అప్పుడు నీవు విజయాన్ని యెంత సులువుగా పొందగలవో ఆలోచించు అలానే సంసారిక జీవనం చేస్తూ సాధన చేయటం కూడా.
సన్యాసులంతా సులభంగా మోక్షం పొందగలరా: ఈ ప్రశ్నకు కూడా అవును అని చెప్పలేము. ఈ రోజుల్లో మనం అనేకమంది సన్యాసులను చూస్తున్నాము వారు దైవచింతనకన్నా రాజకీయాలు, ధనాపేక్ష, సామాజిక విషయాలమీద శ్రర్ధ చూపుతూ ఖరీదైన కాషాయవస్త్రాలు ధరిస్తూ పాదపూజలు చేయించుకుంటూ పేరు ప్రతిష్టలకోసం ప్రాకులాడుతూ అనేక సుఖాలు అనుభవిస్తున్నారు. వారు ఒకరకంగా సంసార జీవనం చేసే సాధకులకన్నా ఇంకా అధోపాతాళంలో వున్నట్లుగా అనుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందాక సైకిలు మీద సంసారి భార్య పిల్లలను ఎక్కించుకొని తొక్కుతుంటే ఇటువంటి సన్యాసులు ముందొక ఇసుక బస్తా వెనుక ఒక మట్టి బస్తా పెట్టుకొని సైకిలు తొక్కే వాడిగా అభివర్ణించవచ్చు. అంటే గృహస్తు తన బంధాలను మోస్తువుంటే ఇటువంటి సన్యాసులు తనకు ఏమాత్రం సంబంధము లేని తనకు పట్టని వాటిని అతికించుకొని లేని బంధాలను కలిగించుకొని సాధనలో చాల వెనుక పడివుంటారు. పైపెచ్చు వారు మనలాంటివారికి అనేక విధాలుగా ఉద్బోధలు చేయటం విడ్డురం. సాధకులు అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సాధకునికి కలిగిన ఒక అనుభవం తెలుపుతున్నాడు. ఒకసారి ఒక మిత్రుడు నేను ఫలానా గురువుగారి వద్ద యోగ విద్య నేర్చుకున్నాను నాకు చాలా మంచిగా వున్నది అని తెలిపితే అదేమిటని దానిగూర్చిన వివరాలను సేకరిస్తే తెలిసింది ఏమిటంటే అందులో చేరటానికి తగు ద్రవ్యం ఫీజుగా చెల్లించాలట. తరువాత కొన్ని రోజులు ఆ గురువుగారొ లేక అయన శిష్యగణమో శిక్షణ ఇస్తారట అంతవరకూ బాగానే వున్నది శిక్షణ పూర్తి అయినతరువాత తానూ నేర్చుకున్న యోగం ఇతరులకు నేర్పనని ప్రమాణం చేయాలట. చూసారా ఇటువంటివి ఇప్పుడు సమాజంలో అనేక సంస్థలు పుట్టగొడుగులులాగ పుడుతూ సామాన్యులకు రోజు ప్రక్కదోవ పట్టిస్తున్నాయి. ఇటువంటివి కేవలం నీ నుంచి ద్రవ్యాన్ని పొందేవి మాత్రమే అని గమనించాలి. మనకు శ్రీ కృష్ణ పరమాత్మను మించిన గురుదేవులు లేరు. ఆది శంకరులను మించిన మార్గదర్శకులు లేరు. ఈ విషయం గమనించి వారు బోధించిన మార్గాన్ని అనుసరిస్తే సాధకుడు మోక్షం పొందటం తధ్యం.
యదార్ధంగా సన్యాసి అంటే కౌపీనం తప్పించి ఏమి లేకుండా ఉండి ఉండటానికి ఎటువంటి ఆశ్రమాలు లేకుండా చెట్ల క్రింద, గుహలలో వుంటూ అడవిలో ఆకులు అలమలు భుజిస్తూ, వాగులు వొర్రెలలో నీటిని తాగుతూ, భౌతిక ప్రపంచానికి దూరంగా వుంటూ జీవనం గడిపే సాధకులు. వారు సత్వరంగా వారి గమ్యాన్ని చేరుకోగలరు.
నిజానికి సాధకుని జీవనం కఠినమైనది, అనేక వడిదుడుకులు కలిగి ప్రతిక్షణం ఒక పరీక్షగా ఉంటుంది. బాహ్యంగా అనైక రకాలుగా విమర్శలు, వత్తిళ్లు వస్తాయి. వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు సాగితేనే సాధనలో పురోగతి సాధించగలం. సాధకుడు అకుంఠిత దీక్ష, భగవంతునిమీద అనన్య ప్రేమ దాస్య ప్రవ్రుత్తి, కలిగి త్రికరణ శుద్ధిగా దైవచింతనలో నిరంతరం గడిపితేనే జీవన్ముక్తిని పొందలేరు. భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే సాధకుడు ఎటువంటి పరిస్థితిలోను భగవంతుని మీదినుంచి మనస్సును మళ్ళించకూడదు. ప్రతి విషయాన్నీ తేలికగా తీసుకొని నిరంతర దైవ చింతనలోనే జీవనం గడపాలి. అప్పుడే మోక్ష సాధన కలుగుతుంది.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిఁ
మీ
భార్గవ శర్మ