30, జనవరి 2023, సోమవారం

 సర్ స్టఫోర్డ్ క్రిప్స్ ఏం చెప్పారు?


మా నాన్నగారు ఆలంగుడి ఆపత్సకాయం అయ్యర్ పరమాచార్య స్వామివారికి ‘బానిస’. మహాస్వామివారిపై వారికి అచంచలమైన భక్తిప్రపత్తులు. 1920లో ఉమామహేశ్వరపురం తాలూకా గ్రామాధికారిగా ఉన్నప్పుడు మాహాత్మా గాంధి గారు ప్రారంభించిన సహాయ నిరాకరణ, పన్ను నిరాకరణ ఉద్యమాలకు అధ్యక్షత వహించారు. కుంబకోణం, పాపనాశం తాలూకాలలో ఇవి నిర్వహించినందుకు వారిని గ్రామాధికారి పదవి నుండి తొలగించారు.


1950లలో పరమాచార్య స్వామివారు కొన్నిరోజులపాటు మా ఊర్లో మకాం చేసారు. మొత్తం ఊరిప్రజలంతా ఆనందోత్సాహాలతో, దర్శనానికి వస్తున్న భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది. ఒకరోజు పూజ పూర్తైన తరువాత మధ్యాహ్నం సమయంలో మఠం క్యాంపు ఉన్న స్థలంలో కొద్దిగా అలజడిగా ఉంది. మా ఇంటి ముందర నిలబడి ఉన్న నేను ఏమి జరిగిందో చూద్దామని అటుగా వెళ్లాను.


కుంబకోణం నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులు చెప్పులతో, చొక్కాలు వేసుకుని లోపలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఉన్న కావలివాడు వారిపై అరుస్తూ లోపలికి వెళ్ళకుండా వారిస్తున్నాడు. కాని వారు మాట వినకపోవడంతో అక్కడున్న వారి సహాయంతో నేను వారిని పట్టుకున్నాను. అక్కడున్న కొబ్బరి చెట్లకు కట్టేసి, అటువైపు వచ్చిన పోలీసులకు వారిని అప్పగించాము. ఆ ఇద్దరినీ తిరువిడైమరదూర్ పొలీస్ స్టేషనుకు తీసుకుని వెళ్ళారు.


ఆరోజు రాత్రి పూజ మొత్తం పూర్తైన తరువాత, పరమాచార్య స్వామివారు నాకు కబురు చేశారు. మధ్యాహ్నం జరిగిన విషయం అడిగి, “అది సరే! అప్పుడే అక్కడకు పోలీసులు ఎలా వచ్చారు?” అని అడిగారు.


“నేను కమ్యునిష్టు పార్టి వ్యక్తిని కావడం వల్ల నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండరాదని కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి విన్నపం చేశారు. (అప్పుడు నేను పక్కఊరిలో గ్రామాధికారిగా ఉన్న మా నాన్నగారికి సహాయకుడిగా ఉండేవాణ్ణి). దాని గురించి విచారించడానికి ఒక అధికారి వచ్చారు. ఆయనతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా వచ్చారు. అప్పుడు వారిని ఉపయోగించుకున్నాను” అని చెప్పాగా, “ఓహో! అలాగా?” అని ఆశ్చర్యపోయారు స్వామివారు.


తరువాత స్వామివారు లబ్రేరియన్ ను పిలిచి, “నేను నిన్ను అప్పుడు కొనమని చెప్పిన కమ్యునిజం గురించిన ‘సిక్స్ ఆథర్స్’ పుస్తకాన్ని రేపు ఇతనికి ఇవ్వు” అని చెప్పారు. నావైపు చూసి, “వారంరోజుల లోపల ఆ పుస్తకాన్ని చదివి అందులో ఏముందో నాకు చెప్పు; ఎవరైనా అడిగితే ఆ పుస్తకాన్ని చదువుతున్నానని చెప్పు” అని ఆదేశించారు.


అది నిఘంటువులా చాలా పెద్ద పుస్తకం. నాకు గుర్తు దాని వెల నలభై రూపాయలు. అప్పుడు పౌండు స్టెర్లింగ్ పదిహేను రూపాయలు. అది సర్ స్టఫోర్డ్ క్రిప్స్, అనువిన్ బెవన్, లూయిస్ ఫిషర్ మరియు ముగ్గురు ఇతర పాశ్చాత్య ప్రముఖులు వ్రాసిన పుస్తకం. దాన్ని చూడగానే నాకు వణుకు పుట్టింది. ఓకే వారం గడిచిపోయింది. ఒకరోజు పరమాచార్య స్వామివారు అడగనే అడిగారు, “ఏమిటి? ఆ పుస్తకాన్ని చదివావా? అందులో దేని గురించి చెప్పారు” అని.


“అది చాలా పెద్ద పుస్తకం పెరియవ. కొన్ని విషయలు నాకు అర్థం కాలేదు. స్టఫోర్డ్ క్రిప్స్ వ్రాసిన భాగం మాత్రం చదవగలిగాను” అని చెప్పాను.


“సరే! అతను ఏమి చెప్పారు?”


“అన్ని ఇజాలు మానవాళికి ఎదో ఒకటి ఇస్తాయి. కాని కమ్యునిజం మాత్రం మనుషుల నుండి అన్నిటిని తీసుకుంటాయి”


పరమాచార్య స్వామివారు అప్పుడు చూసిన చూపు, “ఏంటి అర్థమైందా?” అన్నట్లు ప్రశ్నిస్తున్న వారి చూపులు ఇప్పటికి నా కళ్ళముందు కదలాడుతున్నాయి.


ఈ ఘటన తరువాత నా ఆలోచనా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. అటు తరువాత పరమాచార్య స్వామివారికి సంపూర్ణ శరణాగతి చేశాను.


సాయంత్రం పూజ తరువాత స్వామివారు ఎందఱో పండితులు, ఘనాపాఠీలతో వేద చర్చలు చేసేవారు. మధ్యలో అయిదడుగుల ఎత్తు ఉన్న రెండు పెద్ద కంచు దీపాలు వెలుగుతూ ఉండేవి. ఆ వెలుగులో నుంచుని చదవమని నాకు ఒక పుస్తకాన్ని ఇచ్చి, స్వామివారు ఇష్టాగోష్టిలో మునిగిపోయారు. ఆ చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో అక్కడ చాలా గందరగోళంగా ఉంది. నేను పుస్తకం చదువుతూ, 'meditation' కు బదులుగా 'mediation' అని చదివాను. వెంటనే స్వామివారు పెద్దగా నవ్వి, “ఇతను ఒక అకౌంటెంట్. అందుకే 'meditation' ని 'mediation' అని చదివాడు” అని అన్నారు. తరువాత స్వామివారు దాదాపు అరగంట పాటు meditation గురించి వివరిస్తూ మానసికంగా భారత దేశం మొత్తం తీసుకునివెళ్ళారు. అక్కడున్న గందరగోళంలో నేను ఏమి చదువుతున్నానో ఎవరికీ వినబడే అవకాశమే లేదు. కాని ఈ శతావధాని చెవులకు నా తప్పు వినబడింది.


కొద్ది రోజుల్లోనే శ్రీమఠం మకాం ‘శ్రీధర అయ్యార్ వాళ్’ వారి తిరువిసైనల్లూర్ చేరుకుంది. మఠం ఏనుగుకు అక్కడ మదమెక్కింది. గుడిసెలను కూల్చి విసిరేస్తున్న ఆ ఏనుగును నియంత్రించడం ఎవరివల్ల కాలేదు. చాలా ఇళ్ళు కూడా పాడయిపోయాయి. ఆ ఏనుగు ఆగ్రహానికి కార్లు, బస్సులు కూడా తప్పించుకోలేదు. ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. ఆ ఏనుగును అడ్డగించి, రెండు నదుల గుండా మా ఊరికి తీసుకురావడానికి సంబంధించిన విషయమై నన్ను రమ్మని పిలవడానికి మఠం నుండి ఒక వ్యక్తి నాకోసం మా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో నేను ఇంటిలో లేకపోవడంతో నాకు ఆ విషయం తరువాత తెలిసింది. ఆ సాయంత్రం పూత ఏనుగును రెండు నదులను దాటించడం కాస్త కష్టమైన విషయం. అందునా నా ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. మరుసటిరోజు ఉదయం శ్రీమఠానికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా పోలీసులు ఏనుగును కాల్చి చంపారన్న పిడుగు లాంటి వార్త తెలిసింది. ఒక్కసారిగా బాధ, అసహ్యం వేసింది. రాత్రే నేను వెళ్ళాల్సి ఉన్నింది అన్న ఆలోచనలతో స్వామివారి దగ్గరకు వెళ్లాను.


పూజ, ఆహారం వదిలివేసి ఎవరితోనూ మాట్లాడక, ఎవ్వరినీ చూడటానికి ఇష్టపడనట్టుగా శ్రీమఠం వెనకాల ఒక్కరే కూర్చున్నారు. అంతా శోకసంద్రంలా ఉంది. ఎవరూ ఏమీ మాట్లాడలేదు; స్వామివారి వద్దకు వెళ్ళడానికి ఎవరూ సాహసించలేదు. మెల్లిగా ఒక్కొక్కరే స్వామివారు కూర్చున్న చోటుకు వెళ్ళాము. నేను అపచారం చేశానని ఏడుస్తూ స్వామివారి పాదాలపై పడ్డాను. ఏమి చెయ్యాలో తెలియక అందరూ అలా నిలబడి వున్నారు. అలా అరగంట గడిచిపోయింది. తరువాత స్వామివారు నిదానంగా వారికి కలిగిన నష్టం గురించి ఎంతో బాధతో కొడుకును పోగొట్టుకున్న ఒక తల్లి పడే వేదనతో అందరికీ వినబడేటట్టు ఆ ఏనుగు పుట్టినప్పటి సంగతి, దాని ఎదుగుదల, శరీరంపై మచ్చలు, దాని గుణాలు, ఇలా ఎన్నో విషయాలు తెలిపి, దాని జీవితకాలం అంతే అని తెలిపి, ఎంతో బాధ, శోకంతో మరలా స్వామివారు మౌనం వహించి, గోడకు చేరగిలబడ్డారు.


మహాస్వామి వారు చూపించిన ఈ కరుణకు అక్కడున్నవారందరమూ కదిలిపోయము. మాటలు రాని ఒక జీవిపై స్వామి కరుణ చూపారు అని కాదు. ప్రపంచంలోని అన్ని జీవరాసులపై స్వామివారికి ఉన్న ఆర్తి గురించి తలచుకుని. 


ఇది జరిగి దాదాపు యాభై సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు నాకు ఎనభైనాలుగేళ్ళు. తలచుకుంటే ఇప్పటికి హృదయం ద్రవిస్తుంది.


ఆలంగుడి (గురు స్థలం) అన్న పేరు వినగానే, స్వామివారి కళ్ళల్లో వచ్చే వెలుగును మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మహాస్వామి వారు సాక్షాత్తు ఆ గురు స్వరూపమే కదా! ఎంత రద్దీ ఉన్నప్పటికీ, “ఏమిటి, ఆలంగుడి నుంచా?” అని నన్ను అడగగానే, నాకు అది నాకు ఒక దివ్యమైన అనుభూతిలో కరిగిపోయాను. మాణిక్యవాచకులు చెప్పినట్టుగా, “ఉళ్ళంతాళ్ నిండ్రు ఉచ్చి అళవుం నెంజాయ్ ఉరుకత్తన్” కాలి నుండి తలదాకా కరిగి నీరైపోవడం.


--- నడువక్కరై ఎ. నారాయణ స్వామి అయ్యర్, మహా పెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: