*కాఫీ విత్…తెలుగు వ్యాకరణం..3006.*
*తెలుగు వ్యాకరణ దీపం చిన్నదేం కాదు!!*
'తెలుగు వ్యాకరణ దీపం చిన్నదని' తిరుపతి వెంకట కవులన్నారు. కానీ మనకందు బాటులోవున్నవ్యాకరణాల్ని పరిశీలిస్తే తిరుపతి కవులు చెప్పినట్లు తెలుగువ్యాకరణదీపం చిన్నదేం కాదని స్పష్టమవుతుంది.
తెలుగు భాషకు ప్రాచీన చరిత్ర ఎంతవున్నదో అంతే ప్రాచీనత తెలుగువ్యాకరణానికీవుందంటే"అతిశయోక్తి కాదు. భాషతో పాటే వ్యాకరణమూ సమాంతరంగా వర్ధిల్లుతోంది. భాష వెలుగైతే వ్యాకరణం దాని నీడలా అంటిపెట్టుకొని వుంటుంది. అయితే భాషకు వ్యాకరణం చివరి దశలో వచ్చే లక్షణమని కొందరంటారు. కానీ ఇందులో నిజం పాలు తక్కువనే చెప్పాలి.!!
*భాషకు వ్యాకరణం అవసరమా?*
ఈ విషయమై తర్జన భర్జనలు చాలానే జరిగాయి.
అసలు వ్యాకరణం లేకుండా భాషలుంటాయా? వ్యాకరణం లేని భాషలు మన గలుగుతాయా? వ్యాకరణం లేనంత మాత్రాన భాషకొచ్చిన ఇబ్బందేమిటి? అన్న ప్రశ్నలూ తలెత్తాయి. అయితే ప్రపంచంలోని నాగరిక భాషలన్నిటికీ వ్యాకరణం వుంది. అంతమాత్రాన… వ్యాకరణం నేర్చుకున్న తర్వాతనే భాష మాట్లాడాలన్న నియమం కానీ, శాసనం కానీ ఏదీ లేదు. ఒకవేళ అటువంటి శాసనమున్నా ఎవరూ దాన్ని ఖాతరు చేయరు ఆ మాటకొస్తే భాష మాట్లాడేవారిలో వ్యాకరణం అనేదొకటి వుంటుందని తెలిపిన వారి సంఖ్య చాలా తక్కువ. వ్యాకరణం తెలీకుండా భాషమాట్లాడే వారికేమైనా యిబ్బందులెదురవుతున్నాయా? అంటే అదీ లేదు. వ్యాకరణం తెలీకుండా మాట్లాడే వారికి, వ్యాకరణం తెలిసి మాట్లాడే వారికి మధ్యవ్యత్యాసం కూడా కనిపించదు. ఉభయుల లక్ష్యం భావప్రకటన, భావ వినిమయం కాబట్టి వాగ్వ్యవహారంంలో వీరి
మధ్య అంతరమూ లేదు.... అంతరాయమూ లేదు. అటువంటప్పుడు భాషకు వ్యాకరణంఎందుకన్న ప్రశ్న తలెత్తక మానదు.!
ఏ భాషకైనా పుట్టుకతోనే వ్యాకరణం అంతర్గతమై వుంటుంది. కాబట్టి వ్యాకరణం లేకుండా భాషను.. ఊహించలేము గాసటబీసటగా వున్న భాషను వ్యాకరణం ఒక గాడిలో పెడుతుంది. చెట్టుకు పాదులాగా, చేనుకు కంచెలాగా, చెరువుకు గట్టులాగా, బిడ్డకు… తల్లిలాగ భాషకు వ్యాకరణం రక్షాకవచంలా ఉపయోగపడుతుంది.
ఋతువుల్ని బట్టి ప్రకృతిలో మార్పులు జరగటం సహజం. అలాగే ప్రకృతి సిద్ధమైన మనిషి మాట్లాడే భాషలో కూడా మార్పులు జరగడమూ అంతే సహజం.. స్థూలంగా ఈ మార్పులు మనకంటికి కనిపించకపోయినా ఇది అంతర్గతంగా జరిగే అత్యంత సహజమైన పరిణామ ప్రక్రియ. కాలాన్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి భాషలో మార్పులు కలగడం, దాని కనుగుణంగానే వ్యాకరణలో కూడా మార్పులు జరుగుతుంటాయి. ఒకప్పుడు కావ్య భాషకే పరిమితమైన వ్యాకరణం యిప్పుడు వ్యావహారభాషకు కూడా విస్తరించడమే యిందుకు నిదర్శనం. దీన్ని బట్టి వ్యాకరణం అనేది భాషలో అంతర్లీనంగా మిళితమై వున్నదే కానీ, కృతకంగా ఎక్కడినుంచో తెచ్చిపెట్టుకున్నది కాదని అర్ధమవుతుంది.
వ్యాకరణం తెలిసినవారు, లేక తెలియనివారు ఎవరు
మాట్లాడినా కూడా భాషలో అక్షర, పద, వాక్య, సమాస, విభక్తి ప్రత్యయాలు, కర్త, కర్మ, క్రియలు విధిగా.. వుంటాయి. ఇవేవీ లేకుండా మాట్లాడటం కష్టం. ఒకవేళ మాట్లాడటానికి ప్రయత్నించినా అది అర్ధరహితమై, భావ ప్రకటనకు, భావవినిమయానికి ఆటంకం కలుగుతుంది. అంటే మనం మాట్లాడే భాష ఎదుటి
వారికి అర్థమై, భావవినిమయానికి ఉ పకరిస్తే అందులో కచ్చితంగా వ్యాకరణం వుందన్నమాటే. ఏతావాతా భాషలో పదసమాసాలు, సంధులు, కర్త, కర్మ, క్రియ ప్రత్యయాదుల్లో జరిగే మార్పుల్ని గమనించి వాటిని ఒక క్రమ పద్ధతిలో పెడితే అది వ్యాకరణం అవుతుంది అలా క్రమపద్ధతిలో పెట్టేవారు వైయాకరుణులవుతారు.
ప్రాచీన కాలంలో సంస్కృతపద్ధతి, దేశపద్ధతుల్లో వ్యాకరణం రెండు ముఖాలుగా విస్తరించింది. సంస్కృత పద్ధతిని అనుసరించి ఆంధ్రశబ్దచింతామణి దాని సంప్రదాయానికి చెందిన రచనలు ఒక ముఖమైతే.. దేశపద్ధతిని అనుసరించిన ఆంధ్ర భాషాభూషణం తదితర పద్యాత్మకసంగ్రహరచనలు, ఆధునికయుగంలో చారిత్రక దృక్పథంతో వెలసిన బాలకవిశరణ్యము ఆంధ్రభాషానుశాసనం వంటి రచనలు మరో ముఖ్యంగా చెప్పుకోవచ్చు.
నన్నయ కాలం క్రీ.శ. 11వ శతాబ్ది నుండి పరిశీలిస్తే ప్రతిశతాబ్దంలో కూడా వ్యాకరణాలు వెలువడినాయి. ఇక 17,18,19 శతాబ్దాల్లో అయితే వ్యాకరణ
రచన మూడు వువ్వులూ ఆరుకాయలుగా వర్ధిల్లింది. ఇక 20వ శతాబ్దిలో అయితే విద్యార్ధి వ్యాకరణాలు కోకొల్లలుగా వచ్చాయి.
తెలుగుకు సంబంధించిన వ్యాకరణాన్ని ప్రాచీనములు, అర్వాచీనములుగా విభజించి చూస్తే దాదాపు రెండు వందలకు మించి కనిపిస్తాయి. ఇందులో కొన్ని సంస్కృతంలోను, కొన్ని తెలుగు పద్యాత్మకంగాను, మరికొన్ని సూత్రాత్మకాలుగానూ వున్నాయి.
ఆంధ్రశబ్ద చింతామణి (క్రీ॥శ॥11వ శతాబ్దము)మొద
లుకొని ఆనందరంగరాట్ఛందము (క్రీ॥శ॥18వ శతాబ్దము) వరకు గల వ్యాకరణాల్ని ప్రాచీనములుగా.. పట్టాభిరామ పండితీయము(క్రీ॥శ॥19వశతాబ్దము) నుంచి నేటి వరకు వెలిసిన వ్యాకరణాల్ని అర్వాచీన వ్యాకరణాలుగా భావించవచ్చు. తెలుగుభాషకు నాటి నుండి నేటి వరకు సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, లాటిన్, రష్యన్ భాషల్లో రచించబడిన వ్యాకరణాలు,వ్యాఖ్యలు, విద్యార్థి వ్యాకరణాలు, ఏకదేశి వ్యాకరణాలు వందల సంఖ్యలో వున్నా వీటి మధ్య సమతుల్య
తను సాధించడంలో మనం వెనుకబడి వున్నాం.
*తొలి తెలుగు వ్యాకరణకర్త కేతన.!!
ఆంధ్ర శబ్ద చింతామణి (సంస్కృతంలో) తొలి తెలు
గు వ్యాకరణమని, దీన్ని నన్నయ 11వ శతాబ్దంలో రచించాడని చెబుతున్నటికీ ఇది నన్నయ్యదే అనడానికి సరైన సాక్ష్యాధారాలు లేవు. అయితే తెలుగులో తొలి వ్యాకరణకర్త తానే అని మూలఘటిక కేతన (1200-1280) తన ఆంధ్రాభాషా భూషణంలో చాలా స్పష్టంగా చెప్పాడు.
"మున్ను తెనుగునకు లక్షణ మెన్నడు నెవ్వరును
జెప్పరే జెప్పెద విధ్వన్నికరము మది మెచ్చగ నన్నయ భట్టాదికవి జనంబులకరుణన్"
కేతన చెప్పిన దాన్ని బట్టి నన్నయ భట్టాదికవుల గ్రంధాల్లోని లక్ష్యాలు ఆధారంగా ఆంధ్ర భాషా భూషణాన్ని రచించాడని భావించాలి. అయితే నన్నయ రచించినట్లు చెప్పబడుతున్న చింతామణి' ఆధారంగా తాను ఆంధ్రభాషా భూషణాన్ని రచించినట్లు… కేతన చెప్పలేదు. దీన్ని బట్టి చింతామణి వ్యాకరణ సంప్రదాయం అప్పటికి ప్రచారంలోనికి రాలేదనిచెప్పవచ్చు. పైగా కేతన ఆంధ్రభాషాభూషణం స్వచ్ఛమైన తెలుగులో రచింపబడిన తొలివ్యాకరణం.
"ఆదులు స్వరములు నచ్చులు తాదులొగిన్ వ్యంజనములు, హల్లులుననగా మేదిని నెల్లెడల
జెల్లును కాదులనై దైదు కూర్పునగు వర్గంబుల్"
తిక్కనకు సమకాలికుడైన ఆధర్వుణుడు (క్రీ॥శ॥
1250) 'త్రిలింగ శబ్దాను శాసనం' అనే తెలుగు వ్యాకణాన్ని సంస్కృతంలో రచించాడు. ఇక 16వ శతాబ్దానికి చెందిన మంచెళ్ల వాసుదేవ కవి సిద్ధాంతకౌముది
అనే నామాంతరంగల'వైకృత చంద్రికా' అనే తెలుగు వ్యాకరణాన్ని సంస్కృతంలో రచించాడు.!!
*ఆంధ్రధాతుమాల..!!
వేదం పట్టాభిరామ శాస్త్రి (1760/1820) 1816లో ఆంధ్రధాతుమాలను రచించారు. వేదం వారు ఆంధ్రధాతు మాలను రచించారు. వేదం వారి శిష్యుడైన
బ్రౌను దొర 1840-1841 లో ఆంధ్రధాతుమాల ప్రతిని చూచి, దానికి తగిన ఆదరణ లేనందుకు ఎంతో విచారం వ్యక్తం చేశాడు.
The original of this very valuble work is in the college and i am afraid that no copy Except the present was ever taken"(Journal of Literature
and Science 1840-41 page, 10,11)
బ్రౌను దొర బాధపడినట్లుగానే ఆంధ్రధాతుమాల సూరేళ్లు మరుగున పడిపోయింది. 1930లో ఆంధ్రసాహిత్య పరిషత్తు, కాకినాడ వారు వేదం వారి ధాతుమాలను చిన్నయసూరి కృతంగా ప్రకటిచారు. నిజానికి చిన్నయసూరి రచించిన 18గ్రంధాల్లో (ఇవి కూడా కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తు వారు ప్రక
టించినవే)ఆంధ్రధాతుమాల లేదు. ఆ తర్వాత ఆచార్య
నిడుదవోలు వేంకటరావుగారు వేదం వారిపద్యాంధ్ర వ్యాకరణ పీఠికలో (1951) ఆంధ్రధాతుమాల రచయిత వేదం వారేనని తేల్చి చెప్పారు. వేదం వారు 'పట్టాభిరామ పండితీయము' పేరుతో 1816లో
అంటే చిన్నయ సూరి బాలవ్యాకరణ రచనకు 40
సంత్సరాలకు ముందే ఆంధ్ర వ్యాకరణాన్ని పద్య రూపంలో రచించారు. పందొమ్మిదవ శతాబ్దంలో వేదం వారి ఈ పద్యాంధ్ర వ్యాకరణమే మొదటిదని చెప్పవచ్చు. తెలుగు వ్యాకరణ క్రమపరిణామ వికాసం తెలుసుకోడానికి ఇది ఉపకరిస్తుంది. కాగా వేదంవారు వచనంలో కూడా తెలుగు వ్యాకరణాన్ని రచించినట్లు..
చెబుతారు. కానీ, ప్రస్తుతం ఇది అలభ్యం. పందొమ్మిదవ శతాబ్ది ప్రథమార్ధంలో ఈకింది వ్యాకరణ గ్రంధాలు ప్రచారంలోకి వచ్చాయి.
1. పట్టాభిరామ పండితీయము (1816) రచయిత వేదం పట్టాభిరామశాస్త్రి
2. ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము(1830) (వఝల సీతారామశాస్త్రి -పుదూరు)
3.ఆంధ్రవ్యాకరణము (1836) 3. రావిపాటి గురుమూర్తి శాస్త్రి
4. లఘు వ్యాకరణము (1857) వేదం వెంకట
రమణశాస్త్రి
5. తెలుగు వ్యాకరణము ఉదయగిరి శేషయ్య
6. బాల వ్యాకరణము (1858) పరవస్తు చిన్నయసూరి
7. ప్రౌఢ వ్యాకరణము (త్రిలింగ లక్షణ శేషము) బహుజనపల్లి సీతారామాచార్యులు (1827-1891)
తెలుగుసాహిత్యానికి సంబంధించినంత వరకు ఇప్పటికీ చిన్నయసూరి 'బాలవ్యాకరణ'మే ప్రథమ గణనీయ వ్యాకరణ గ్రంథంగా వుంది. దీనికి పొడిగింపుగా వచ్చిన బహుజనపల్లి వారి ప్రౌఢవ్యాకరణం ఆతర్వాత స్థానంగా చెప్పుకోవచ్చు. అలాగే బహుజనపల్లి వారి శబ్దరత్నాకరం పేరుకు నిఘంటువే అయినా ఇందులో చిన్నయసూరి అంగీకరించని ఎన్నో విశేష ప్రయోగాలకు లక్షణ శేషంగా రచించి దీనికి వ్యాకరణస్థాయిని సమకూర్చిన ఘనత బహుజనపల్లి వారిదే,
*బ్రౌన్ వ్యాకరణం..!!
సి.పి బ్రౌన్ 1940లో ఇంగ్లీషులో A Grammer of
the Telugu Language అనే వ్యాకరణ గ్రంధాన్ని రచించాడు. ఇందులో చాలా వరకు వ్యావహారిక పదప్రయోగాలపై దృష్టిపెట్టాడు. బ్రౌన్ మాదిరిగానే ఆతర్వాత పాశ్చాత్యులు ఇంగ్లీషులో రచించిన తెలు
గువ్యాకరణాల్లో వ్యావహారిక భాషకే పెద్దపీట వేయడం చిన్నయసూరిని బాధించింది. అందుకే గ్రాంధికభాషకు పెద్దపీటను వేస్తూ బాలవ్యాకరణాన్ని రచించాడు. ఆతర్వాత కందుకూరి వీరేశలింగం, గురజాడ రామమూర్తి వ్యావహారిక భాషకు వ్యాకరణం అవసరంపై దృష్టిపెట్టారు. కందుకూరి తలపెట్టిన తెలుగు వ్యావహారిక భాషా వ్యాకరణంపూర్తియివుంటే తెలుగు భాషకు మరింత మేలు జరిగివుండేది. చాలా కాలంతర్వాత వడ్లమూడి గోపాలకృష్ణ వ్యావహారిక
భాషా వ్యాకరణాన్ని రచించి ఆలోటు తీర్చేప్రయత్నం
చేశారు. కానీ ఇది సర్వజనామోదం పొందలేక….
పోయింది. ఇక విద్యార్ధి వ్యాకరణాల పేరుతోతెలుగు
వ్యాకరణాలు వెల్లువెత్తాయి.
దువ్వూరి వేంకట రమణ శాస్త్రి పేరు వినగానే బాలవ్యాకరణం చదువుకున్న వారందరికీ 'రమ ణీయం' గ్రంథం గుర్తుకొస్తుంది. దువ్వూరికి అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన రచన ఇది. బాల వ్యాకరణానికి అప్పటికే కొన్ని టీకలు ఉన్నప్పటికీ ఆ తీరులో వ్యాఖ్యాన రూపంగా కాకుండా సమీక్షగా ఈ గ్రంథాన్ని రాశారు. కావ్యనాటకాల్లా వ్యాకరణం ఆకర్షణీయమైన అంశంకాదు. అయితే, ఆ శాస్త్రాన్ని ఆకట్టుకునే శైలిలో బోధించడంలో విశేషప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించారు. 'రమణీయం' గ్రంథం విశ్వవిద్యాలయ స్థాయిలో చిరస్మరణీయంగా నిలిచింది. దువ్వూరి వారి ప్రతిభకు మరో ప్రబల దృష్టాంతం ఉంది. చిన్నయ సూరి 18 ఏళ్లు అహోరాత్రాలు కృషి చేసి సంతరించిన బాలవ్యాకరణాన్ని శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి కవి సంస్కృతీకరించి 'హరికారికావళి' అనే పేరుతో ప్రకటించారు. హరికారికావశేమూల గ్రంథమని, దానికి తెనిగింపే బాల వ్యాకరణమని కొందరుఒకవాదం లేవదీశారు. దువ్వూరి ప్రామా ణిక నిదర్శనాలతో బాలవ్యాకరణమే స్వతంత్రమైన మూలగ్రంథమని, 'హరికారికావళి' అనువాదమని సిద్ధాంతీకరించారు. ఈ మేరకు 40 పేజీల వ్యాసాన్ని 1993లో ఆంధ్రసాహిత్య పరిషత్ పత్రికలో ప్రకటించారు.
చేకూరి రామారావు తెలుగువాక్యం తెలుగువ్యాకరణ రచనలో కొత్త దారికి మార్గనిర్దేశనం చేసింది. ప్రస్తుతం వ్యావహారిక భాషకు సమగ్రమైన వ్యాకరణం లేదన్న కొరత వుంది. సమాచార విప్లవంతో అన్యదేశాలు తామరతంపరగా వచ్చితెలుగుభాషలో చేరిపోతు
న్నాయి. కాల ప్రవాహంతో కొత్తమాటలు పదాలు పుట్టు
కొస్తున్నాయి. తెలుగుకు విస్తారమైన వ్యాకరణగ్రంధా
లున్నా, వీటిన్నిటి సాయంతో తెలుగువెలుగులు మరింతగా పెంచే సమగ్రవ్యాకరణ దీపం అవసరం ఎంతైనా వుంది. అధికారభాషా సంఘం వారు కానీ విశ్వవిద్యాలయాలు కానీ దీనిపై దృష్టిపెట్టాల్సిన అవసరంవుంది.