23, జనవరి 2026, శుక్రవారం

అమ్మ మదంబ

 ఓం శ్రీ మాత్రే నమః 

23-1-26


వాసర వాసినిన్ సుమతి ప్రార్థన జేసిన జాలు సన్మతిన్ 

ధ్యాసను నిల్పి జ్ఞాన సముదాయము గూర్చుచు రక్ష సేయుచున్ 

భాసిత రీతులన్ జనుల వర్ధిల జేయుచు నుండు సర్వదా 

దోసములన్ క్షమించ మది తోయజ గర్భుని రాణి వేడనౌ!


అమ్మా నిన్ను నుతించి వేడెదము సమ్యగ్భావనన్ నిత్యమున్ 

మమ్మున్ రక్షణ జేసి జ్ఞానమును సంప్రాప్తింపగా జేయ చే

కొమ్మా సన్నుతులన్ విశేషముగ వాక్శుద్ధిన్ ప్రసాదింపగన్ 

సమ్మానంపు వసంత పంచమిని మా సారస్వత ప్రార్థనల్


శా.అమ్మా వాసర వాణి! లోకమున సమ్యగ్దృష్టి కావ్యాళి, ర

మ్యమ్మైనట్టి రసోచిత ప్రభలతో నానందమున్ గూర్చు భా

వమ్ముల్ మానస మందిరమ్మున సదా వర్ధిల్లి పెంపార  స

ర్వమ్ము న్నీ మహిమాప్తి మూలములుగా రంజిల్లెడున్ భారతీ


ఉ.అమ్మ మదంబ! పేర్మి భువి నాప్తుల  నాదుకొనంగ నెంచు పె

ద్దమ్మ!  దయాంబు రాశివి గదమ్మ! ననుం దయ జూచు వేడ్క రా

వమ్మ! నినున్ మదిన్ నిరత మర్చన జేయుచు వేడు కొందు నీ

విమ్ముగ మార్గదర్శనము నేర్పడ జేయగ వాసరేశ్వరీ!౹౹ 


ఉ.వాణిని అక్షదామ శుక పాణిని, సత్కవితార్థ పుష్ట గీ

ర్వాణిని, దుష్ట దుర్మద నివారిణి, నాత్మ భువుండు ధాతకున్

రాణిని, గొల్చి వేడెదను రమ్య వినూత్న కవిత్వ సిధ్ధికిన్

క్షోణిని తాకి మ్రొక్కెద నకుంఠిత దీక్ష నొసంగగా మదిన్


మిత్రులందరికీ వసంత పంచమీ శుభాకాంక్షలతో


మీ

డా. రఘుపతి శాస్త్రుల 

విశ్రాంత ప్రాచార్యులు

కామెంట్‌లు లేవు: