ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
23, నవంబర్ 2024, శనివారం
ఇక్కడివి ఇక్కడే
ఇక్కడివి ఇక్కడే
నీవు ఏదైనా పట్టణానికి ఏదైనా పనిమీద వెళ్ళా వనుకో అక్కడ రాత్రి బసచేయవలసి వస్తే ఒక గదిని ఏదైనా వసతిగృహాల్లో (లాడ్జిలో) తీసుకొని ఆ రాత్రి నిద్రించి మరుసటిరోజు ఉదయమే లేచి మరల నీ దారిననీవు వెళ్ళటం సహజంగా అందరం చేసే పనే. మనం వున్న కొద్దీ గంటలో లేక ఒకటి రెండు రోజులో మాత్రం ఆ గదితో సంబంధం కలిగి ఉంటాము. మనకు తెలుసు గదిలో చేరిన మొదటి నిముషంలోనే ఈ గదితో నా అనుబంధం కొన్ని గంటలు మాత్రమే అని. అందుకే మనం ఆ గది మీద ఎటువంటి సంబంధం పెంచుకోము, కేవలం నాకు కొన్ని గంటలు ఆశ్రయాన్ని ఇచ్చేదిగా భావించి అక్కడ ఉంటాము. ఎవరైనా ఆ వసతిగృహం గదిని తన సొంత గదిలా భావించి అక్కడి వస్తువులపై మమకారాన్ని పెంచుకొని సరిగా లేని వాటిని పునరుద్దించాలని అనుకుంటే వాళ్ళను మనం కేవలం మూర్ఖులు గా భావిస్తాము. అందులకు సందేహం లేదు. ఎందుకంటె మనం ఉండేదే కొద్దీ సమయం ఆ కొద్దీ సమయం ఎలానో ఒకలాగా గడిపితే తెల్లారగానే మన ఊరికి వేళ్ళ వచ్చని భావిస్తాము. సాధారణ మానవుల అందరి భావన ఇలానే ఉంటుంది. ఇక విషయానికి వస్తే సాధక మిత్రమా నీవు,నేను నేను అని అనుకునే ఈ దేహం మనది కాదు. కానీ నాది అని అనుకుంటున్నాం. కొన్నిరోజులు ( అంటే 70 - 90 సంవత్సరాలు) ఉండిపోయే దానిని శాశ్వితమైనదిగా భావించి ఈ శరీరంతోటి, శరీరానికి సంబందించిన వ్యక్తులతోటి సంబంధాలు పెట్టుకొని వాటినే నిత్యమైనవిగా భావించి మన అమూల్య సమయాన్ని వృధా చేసుకుంటున్నాము.
ఈ ప్రకృతికి ఒక నియమము వున్నది అది ఏమిటంటే "ఎత్ దృశ్యం తత్ నస్యం" అంటే మన కంటికి కనిపించేది ఏదైనాకానీయండి అన్నీ కూడా కాలగతిలో నశించి పోయేవే. కానీ మనం ఏమి అనుకుంటున్నామంటే నా కళ్ళకు కనిపించే వాటిలో నేను లేను అని అనుకుంటున్నాం. నిజానికి నేను కూడా ఈ ప్రపంచంలో ఒకడిని నేను ఈ ప్రపంచానికి బిన్నంగా లేను అనే భావన ప్రతి సాధకునికి రావాలి.
ప్రపంచం మొత్తం మూడు సూత్రాలకు లోనై నడుస్తున్నది. అది ఆది మధ్య అంత అంటే ఈ పాంచభౌతిక ప్రపంచం మొత్తం ఏదో ఒక నిర్దుష్ట కాలంలో ఉద్భవించి ఉంటుంది. తరువాత పరిణతి చెందుతుంది. తరువాత ఒక సమయంలో నశించి పోతుంది. ఇది మన కంటికి కనిపించే ప్రతి దానికి అంటే అది నిర్జీవి కావచ్చు సజీవి కావచ్చు అన్నిటికి అనువర్తిస్తుంది. ఒక నిర్జీవికి అది యెట్లా వర్తిస్తుందో చూద్దాము. ముందుగా ప్రకృతి అంటే దానిని దైవసృష్టి అని కూడా అంటారు. ఒక పర్వతమో లేక ఒక పెద్ద రాయో వున్నదనుకోండి అది కాలాంతరంలో బీటలు వారి పగిలి పోవటం లేక నశించిపోవటం జరుగుతుంది. పూర్వం మేరుపర్వతము ఉండేదని మనకు పురాణాలలో చెప్పారు. మరి అది ఇప్పుడు ఉన్నదా అంటే సందేహాత్మకమే. ఇక మానవ సృష్టి లేక జీవ సృష్టి. మానవుడు నిత్యం అనేకవస్తువులను తన దైనందిక ఉపయోగాల నిమిత్తం నిర్మిస్తున్నాడు. అవి కూడా కాలాంతరంలో నశించి పోతున్నట్లు మన కళ్ళముందు తెలుస్తున్నది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బాహ్య ప్రపంచ మొత్తం పాంచబౌతికమైనది. ఈ ఐదు భౌతిక పదార్థాల కలయికే ప్రతిదీ. అది సజీవి కావచ్చు లేక నిర్జీవి కావచ్చు. కాలాంతరంలో మరల అవి వాటి వాటి రూపాలను కోల్పోయి మరల ఐదు పదార్థాలుగా విడి పోవలసిందే.
సాధకు ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఒక నిజం బయటపడుతుంది. అది ఏమిటంటే తన శరీరం కూడా ఈ ప్రపంచంలోంచి ఉద్బవించిందని దానికి ఒక అంచదశ మరణం ఉంటుందని అవగతం అవుతుంది. అప్పుడు తాను వేరు తన శరీరం వేరు అనే స్ఫురణఁ తట్టుతుంది. ఆ క్షణం నుంచే అసలైన వెతుకులాట మొదలవుతుంది. తాను నిత్యుడు కావటానికి ఏమి చేయాలనే తపన. అదే సాధకుని ముముక్షత్వం వైపు నడిపిస్తుంది.
ఒక వసతి గృహంలోని గది లాంటిదే తాను వున్న శరీరం అని సాధకుడు తెలుసుకుంటే మోక్షార్ధి అయి మోక్షం వైపు అడుగులు వేస్తాడు. నిత్య సాధనతోటి తన నిజ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
భార్గవ శర్మ
కార్తీకపురాణం 23
కార్తీకపురాణం 23 వ అధ్యాయము
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🍃🌷శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట:
అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి "ఓ మునిపుంగవా! విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు"మని యడుగగా అత్రిమహాముని యిట్లు చెప్పిరి, కు౦భసంభవా! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము, శత్రుశేషము వుండకూడదని తెలిసి, తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను.
తన యొక్క విష్ణుభక్తి ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాతత్పరుడు, నిత్యాన్నదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదవేదా౦గవేత్తయై యుండను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన యఖ౦డ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కుడా జయించినవాడై యుండెను.
ఇన్ని యేల? అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు, సదాచారసత్పురుషులలో వుత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యే విధముగా శ్రీ హరిని పూజించిన కృతార్దుడనగుదునా? యని విచారించుచుండగా, ఒకానొకనాడు అశరీరవాణి "పురంజయా! కావేరీతీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు" అని పలికెను.
అంతట పురంజయుడు ఆ యశిరీరవాణి వాక్యములు విని, రాజ్యభారమును మంత్రులకు అప్పగించి, సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు, శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీనది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది, చేతులు జోడించి, "దామోదరా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా! అనంతా! అచ్యుతా! ముకుందా! పురాణపురుషా! హృషికేశా! ద్రౌపదీమాన సంరక్షకా! దీనజన భక్తపోషా! ప్రహ్లాదవరదా! గరుడధ్వజా! కరివరదా! పాహిమాం! పాహమాం! రక్షమాం రక్షమాం! దాసోహం పరమాత్మ దాసోహం" యని విష్ణు సోత్త్రమును పఠించి, కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గడిపి తదుపరి సపరి వారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలతో, పాడిపంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి.
అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహాగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగరమందలి వీరులు యుద్దనేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్బేదకులై, నిరంతరము విజయశశీలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగర మందలి అంగనామణులు హంసగజగామినులూ, పద్మ పత్రాయత లోచనులూనై విపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మద్యత్వము; సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.
ఆ నగర మందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూప లావణ్య సంపన్నలై, సదా మోహన హాసాలంకృత ముఖిశోభితలై యుండిరి. ఆ పట్టణకులాంగనలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.
పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీకమాస వ్రతమాచరించి సతీసమేతుడై యింటికి సుఖముగా జేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత:పురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయుణుడై రాజ్యపాలన మొనర్చుచు, కొంతకాలము గడిపి వృద్దాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వాదులుకొని, తన కుమారునికి రాజ్యభారమువప్పిగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునుకు పోయెను.
కావున, ఓ యగస్త్యా! కార్తీకవ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినపుడు వినువారికి కూడా వైకుంఠప్రాప్తి కలుగును.
*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహత్మ్య మందలి త్రయోవింశోధ్యాయము - ఇరవైమూడో రోజు పారాయణము సమాప్తము.
ఓం నమః శివాయ…🙏🙏
ఎవ్వనిచే జనించు
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు
అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైనవాడెవ్వడు
వాని ఆత్మభవు నీశ్వరునే శరణంబువేడెదన్
బమ్మెర పోతనమాత్యుని శ్రీ మహా భాగవతంలో అష్టమస్కంధములోని గజేంద్రమోక్షములోనిది ఈ పద్యము.
ఇది గజేంద్రుని వేడుకోలు. ఈ విశ్వం ఎవరి వలన ఉద్భవించిందో ఎవ్వనియందు లీనమై ఉంటుందో ఎవ్వనియందు లయస్తుందో సర్వము తానే అయి ఉన్న వాడెవ్వడో... అట్టి పరమేశ్వరుని శరణ కోరుతున్నాను అని దీని అర్థం
పూర్వం పద్ధతులు
💐"మళ్ళీ పూర్వం పద్ధతులు వచ్చేస్తాయ్"" !!💐
మళ్ళీ దుబ్బు, తాటాకు ఆశ్రమాలు..
కుండలు, జాడీలు, రాచిప్పలు, రాగి, కంచు పాత్రలు... కట్టె పొయ్యలు, తిరగలి, రోలు, దంపుడు బియ్యం,
అలికిరి లాంతరు,...
మార్బుల్ స్టోన్ floor పోయి... పేడతో అలికిన ఫ్లోర్.. ముగ్గుతో ముగ్గులు... ఇంటి ముందు గోవులు... అరిటి ఆకు భోజనం...
రాబోయే రోజుల్లో పల్లెటూర్లుకి మహర్థశ రాబోతోంది!! మీరు చదివినది కరెక్టే!!
రాబోయే 15 సంవత్సరాలలో జరిగేది ఇదే....
ప్రకృతి మార్పు కావచ్చు! కొత్త వైరస్ కావచ్చు...
లేదా ప్యాషన్ కావచ్చు! రాబోయే రోజుల్లో బంజారా హిల్స్ లో కన్నా పల్లెటూర్లు లో స్థలాల గిరాకీ ఉప్పెన లా పెరుగుతుంది!!
మళ్ళీ గురుకుల వ్యవస్థ, ఆయుర్వేద వైద్యము రాబోయే రోజుల్లో....
పల్లెటూరులో ఉన్న మీ ఆస్థులు ఎట్టి పరిస్థితిలో జారవిడవ వద్దు!
తీరిక చేసుకొని మీ గ్రామాలకి వెళ్లి వస్తూ ఉండండి!
చరిత్ర ధర్మం పునరావృతమే!!
ప్రకృతి ధర్మం పునరావృతమే!!
పెరుగుట!! విరుగుట కొరకే!!
కార్తీకపురాణం - 22
ॐ కార్తీకపురాణం - 22 వ అధ్యాయం ॐ
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉
🍃🌷పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట:
మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను. పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి, శ్రీహరిని గానముచేసి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయముకాగానే నదికిపోయి, స్నానమాచరించి తన గృహమున కెగెను.
అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు, మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపించి "రాజా! విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడాదీసుకొని, యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును", అని దీవించి అదృశ్యుడయ్యెను.
“ఈతడెవరో మహానుభావునివలె ఉన్నారు అని, ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక, శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా!
ఆ యుద్దములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి "పురంజయా రక్షింపుము రక్షింపు" మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా! విషం త్రాగినను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా 'శ్రీ హరి' అని ప్రార్ధించి త్రాగగా అమృతమైనది గదా! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా!
హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారధన చేసినచో సర్వవిపత్తులు పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి యే జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుండును. సంసారసాగరం ఉద్దరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము.
వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహాఋషులు - మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు, భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదలనొసంగి కాపాడుచుండును.
శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహాత్మ్య మందలి ద్వావింశోధ్యాయము - ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము.
ఓం నమః శివాయ…🙏🙏
కార్తీకపురాణం 21
ॐ కార్తీకపురాణం 21 వ అధ్యాయము ॐ
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🍃🌷పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట:
ఈ విధముగా యుద్దమునకు సిద్దమై వచ్చిన పురంజయునకు, కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్దము జరిగింది ఆ యుద్దములో రధికుడు రధికుని తోను, అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోను, గజ సైనికుడు గజ సైనికుని తోను, పదాతులు పదాతి సైనికుల తోను, మల్లులు మల్లయుద్ద నిపుణుల తోను, ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి, ఒండొరుల ఢీ కొనుచు హుంకరించుకొనుచు, సింహ నాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వము లను జూపుకోనుచు, భేరీ దుందుభులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములును విజయకాంక్షులై పోరాడిరి ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొండలు, తలలు, చేతులు, హాహాకారము లతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు. పర్వతాల వలె పడియున్న ఏనుగుల, గుఱ్ఱముల కళేబరాల దృశ్యములే.
ఆ మహా యుద్దమును వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్దము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను, అయినను మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను.
దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించు చుండెను.
ఆ సమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి, "రాజా..! మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని, నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చెస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైననూ సన్మార్గుడవయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై వున్నందునే యుద్దమున ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితివి. ఇప్పటికైనా నా మాట లాలకింపుము, జయాపజయాలు దైవాధీనములని ఏరంగియు, నీవు చింతతో కృంగి పోవుటయేల? శత్రురాజులను యుద్దము లో జయించి, నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని, నా హితోపదేశము నాలకింపుము....
ఇది కార్తీక మాసము, రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి గాన, స్నాన జపాది నిత్యకర్మ లాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి, భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లోనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియేగాదు శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక, రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేత గదా నీకీ అపజయము కలిగినది గాన లెమ్ము, శ్రీహరి నీ మదిలో దలచి నేను తెలియ జేసినటుల చేయుమని హితోపదేశము చేసెను..
అపవిత్రః పవిత్రవా సర్వవస్దాన్ గతోపివా |
యః స్మరే త్పుండరీకాక్షం చ బాహ్యాభ్యాంతరశ్శుచిః ||
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ్య ఏకవింశోధ్యాయము - ఇరవయ్యోకటో రోజు పారాయణము సంపూర్ణం.
ఓం నమః శివాయ....🙏🙏