22, జనవరి 2025, బుధవారం

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*మొదటిరోజు..*


2004వ సంవత్సరం సంక్రాంతి పండుగకు రెండురోజుల ముందు మా నాన్న శ్రీధరరావు గారు హఠాత్తుగా పక్షవాతం వచ్చి జబ్బున పడ్డారు..హుటాహుటిన హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించడానికి హాస్పిటల్లో అడ్మిట్ చేసాము..హైదరాబాద్ లో మా అన్నయ్య నాగప్రదీప్ అడ్వకేట్ గా వున్నాడు.అన్నయ్య వదిన గార్లు నాన్నగారి బాగోగులు చూసుకుంటామనీ..ఏ విధమైన ఆలోచనా పెట్టుకోవద్దనీ నాకు అనునయంగా చెప్పినందున నేను తిరిగి వచ్చేసాను..


సంక్రాంతి పండుగ మూడురోజులూ అయిపోయిన మరుసటి రోజు నేను, నాభార్య  శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం లో అడుగుపెట్టాము..అంతకు ముందు కొన్ని వందలసార్లు శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించినా..ఆరోజు ఒక బాధ్యత తో వెళ్లడం కొంచెం కొత్తగా ఉంది..ముందుగా ఇద్దరమూ నేరుగా శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, ఆ సమాధి ముందు మోకరిల్లి.."స్వామీ!..నీ సేవ చేసుకునే భాగ్యాన్ని మరలా కలిగించావు..ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కష్టపడతాము..నీవు కరుణించి అండదండగా ఉండాలి..అదే మాకోరిక.." అని  మనస్ఫూర్తిగా కోరుకున్నాము..


శ్రీ స్వామివారి మందిర ప్రాంగణమంతా తిరిగాను..శ్రీ స్వామివారు జీవించి ఉండగా ఉన్న ఆశ్రమ రూపానికి..ఇప్పుడు ఆలయంగా ఉన్న రూపానికి పోలికే లేదు..శ్రీ స్వామివారు కట్టించుకున్న ఆశ్రమం లో అంతకు ముందున్న వంటగది ఇప్పుడు లేదు..అప్పుడున్న పందిరి స్థానం లో ఒక పెద్ద మంటపం నిర్మితమైంది..శ్రీ స్వామివారి సమాధి గది మీద గాలిగోపురం అలరారుతున్నది..శ్రీ స్వామివారు చెప్పిన మాటలు..ఆయన రూపం..హావభావాలు..అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి..శివాలయము, పార్వతీదేవి ఆలయము, నవగ్రహ మంటపం..మొదలైన ఉపాలయాలు ఏర్పాటై ఉన్నాయి..శ్రీ స్వామివారు స్వయంగా కట్టించుకున్న ఆశ్రమ ప్రాంగణం లోనే నైరుతీ మూల శ్రీ సాయిబాబా మందిరమూ వచ్చింది..(ఆ మందిరం లో ప్రతిష్టించిన శ్రీ సాయినాథుని ప్రతిమను రాజస్థాన్ నుంచి తీసుకువచ్చాను..అదో అనిర్వచనీయ అనుభూతి..ముందు ముందు ప్రస్తావిస్తాను.)


పూజారులతోటి..ఇతర సిబ్బంది తోటి..ఆలయ నిర్వహణ గురించి కొద్దిసేపు చర్చించాను..ఎవరి వంతు సహకారం వారు అందిస్తామని చెప్పారు..కానీ ..ఈ మందిర నిర్వహణ అనుకున్నంత తేలిక కాదనీ..ముందు ముందు అనేక సమస్యలను నేను ఎదుర్కోవాల్సి ఉంటుందనీ..ప్రతి సమస్య పరిష్కారం వెనుకా..ఆ అవధూత దత్తాత్రేయుడు సహస్రబాహువులతో మమ్మల్ని చుట్టుముట్టి రక్షిస్తాడనీ..మా దంపతులకు ఆరోజు తెలియలేదు..


శ్రీ స్వామివారి మందిరానికి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలూ లేవు.... భక్తుల ఒక క్రమ పద్ధతిలో నడవడానికి ఎటువంటి వరుసలూ లేవు..అడ్డదిడ్డంగా నెట్టుకొస్తున్నారు.. ముందుగా ఇక్కడ నుంచే మనం ప్రక్షాళన మొదలుపెట్టాలి అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చాను..ఆమాటే మా సిబ్బంది తో చెప్పాను..ఎందుకనో వాళ్ళు ఇబ్బందిగా మొహం పెట్టి..సంకోచిస్తూనే సరే అన్నారు..మందిరం వద్ద నుంచి తిరిగి వెళ్లేముందు మళ్లీ ఒక్కసారి శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..అక్కడే కొద్దిసేపు కూర్చుని..నమస్కరించుకొని వచ్చేసాము..


శ్రీ స్వామివారి మందిరం వద్దనుంచి నేరుగా మొగలిచెర్ల లోని ఇంటికి వచ్చి..అమ్మ వద్ద జరిగిన విషయాలన్నీ చెప్పాను..అంతా విని.."ఏమైనా మార్పులు చేద్దామని అనుకుంటున్నావా?..ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేయి.." అన్నది..అలాగే అన్నాను కానీ..అమ్మ ఎందుకు ఇంత సున్నితంగా హెచ్చరించిందీ అని ఆలోచిస్తూ ఉండిపోయాను..శ్రీ స్వామివారి మీదే భారం వేసి ఊరుకున్నాను..ఆరోజు అలా గడిచిపోయింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్ ..శ్రీ దత్తాత్రేయ స్వామీ మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..98089 73699 & 94402 66380).

దేహం" (Human body)ఆరోగ్యంగా

 *దేహ భాష*


ఎప్పుడూ నల్లకోటు  లో కనిపించే జడ్జిగారు, ఈరోజు  ఆశ్చర్యంగా తెల్ల కోటుతో దర్శనమిచ్చారు.


“సార్ ఈరోజు మీరు డాక్టర్ లాగా ఉన్నారు”


“ ఈ కేసుకు ఇలానే ఉంటే నయమనిపించింది” అని నవ్వుతూ ముందుకు సాగారు  జడ్జిగారు.


“వాది ప్రతివాదులను ప్రవేశపెట్టండి” కుర్చీ లో  కూర్చుంటూ చెప్పారు జడ్జిగారు.



“అయ్యా నా పేరు రామయ్య. ఇటీవల నా శరీర  అవయవాలు నేను  చెప్పినట్లు వినటం లేదు.సరిగా పనిచేయడం లేదు. ఏమైనా అందామంటే  మొండి కేస్తున్నాయి. వీటి వలన నేను తీవ్ర అనారోగ్యానికి లోనవటమే కాక భరించలేని బాధ అనుభవిస్తున్నాను. అందుకని నేను నా అవయవాల మీద కేసు పెట్టాను” అమాయకంగా చెప్పాడు రామయ్య.



“ దీనికి శరీర అవయవాలు ఏమంటున్నాయి వాటిని ప్రవేశపెట్టండి” జడ్జిగారు ఆదేశించారు.



“ అయ్యా నా పేరు గుండె. శరీర కష్టమంతా నాది. అయినప్పటికిని నేను ఎంత కష్టపడుతున్న రక్తనాళాల్లో  కొవ్వు పేరుక పోయి  అన్ని  అవయవాల మాట అటు ఉంచి, నాకే సరిపడా రక్తాన్ని అందించుకోలేని  దుస్థితిలో ఉన్నాను.”



 “మరి ఈ విషయం మీ యజమానికి చెప్పావా?” 



“చెప్పాను సార్, ఒక్కసారి అలసటగా అనిపించాను. మరోసారి తల తిరుగుతున్నట్లు ఇంకోసారి ఎడమ చేతి వైపు లాగుతున్నట్లు, మరోసారి కొద్దిపాటి చాతినొప్పి, వాంతులు తల నొప్పి ఇలా అన్ని రకాలుగా చెప్పి చూశాను సార్ కాని తను  పట్టించుకోలేదు”



“నిజమే నా  రామయ్య?”



 “నిజమే కానీ అది గుండె నొప్పి  అనుకోలేదయ్యా”



“ఓకే, గుండె నువ్వు వెళ్లొచ్చు. తర్వాత ఎవరు?”



“అయ్యా నా పేరు కాలేయం.. శరీరంలో బండ చాకిరీ చేస్తాను. దాదాపు  శరీరంలోని 120  పనులు నేనే చేస్తూ ఉంటాను, నన్ను రసాయన కర్మాగారం అని కూడా పిలుస్తారు. అటువంటిది నాకు  హెపటైటిస్ వైర స్ సోకితే ఈ రామయ్య కనీసం పట్టించుకోలేదు. నేను ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది సంవత్సరాల పోరాడి ఇక చేసేది లేక పనిచేయడం అనుకున్నాను.



 “నిజమైనా  రామయ్య?”జడ్జ్ గారు అడిగారు



“ అయ్యో నాకు తెలియదు అయ్యా. ఆ  విషయం కాలేయం నాకు చెప్పనే లేదు”



“చెప్పాను సార్! ఒకసారి కాదు, వందలసార్లు, కడుపులో ఉబ్బరం కలిగించాను, గ్యాస్ ఉత్పత్తి చేశాను, కోవ్వు పదార్థాలు అరగకుండా చేశాను,కళ్ళు చర్మం మూత్రము అన్నిటినీ పసుపు రంగులోకి మార్చాను. అయినా తన పట్టించుకోలేదు. చివరకు నీరసము  తెప్పించాను. బరువు తగ్గించాను. వెంట్రుకలని తెల్లగా మార్చాను. అయినా తన పట్టించుకోలేదు.”



“ జడ్జి గారికి విషయం అర్థమైంది. సరే కాలేయం నువ్వు వెళ్ళవచ్చు తర్వాత?” 



“అయ్యా నా పేరు ఊపిరితిత్తులు. నేను ప్రాణాధార  అవయవాన్ని అయినప్పటికీ COPD(క్రానిక్ అప్స్టెక్టివ్ పలమరి డిసీస్) ద్వారా ఏడాదికి 3.2 మిలియన్ మరణాలు జరుగుతున్నాయి. దీనితో పాటుగా లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా  ఆరోగ్యాన్ని పూర్తిగా హరిస్తున్నాయి. అయినప్పటికిని రామయ్య నన్ను  పట్టించుకోలేదు”



“నీ అనారోగ్యం నుంచి రామయ్య కు తెలియ  చెప్పావా ?”



“శ్వాస తక్కువగా ఉండటం, దగ్గు, చాతిలో నొప్పి, అలసట, నాలుక పెదాలు  నీలి రంగులోకి మారటం  ద్వారా చాలాసార్లు చెప్పాను. కానీ తను పట్టించుకోలేదు”



“సరే ఇంకా ఎవరైనా ఉన్నారా?”



“ నా పేరు మెదడు సార్, అన్ని అవయవాలను పట్టించుకోనే నన్నే రామయ్య పట్టించుకోలేదు. తల తిరుగుతుంది అని చెప్పిన, తలనొప్పి అని చెప్పిన, సరిగా నిద్ర లేకపోయినా, దేన్ని లెక్కచేయకుండా నన్ను నా మానాన వదిలేసాడు”వాపోయింది మెదడు.



జడ్జి గారికి విషయం అర్థమైనట్టు సరే అన్నారు.



చివరికి జడ్జిగారు రామయ్య వైపు తిరిగి

“సరే ఇంతకీ ఏమంటావు రామయ్య ?” అన్నారు 



 “ఇవేమీ నాకు తెలియదయ్యా”



 “తెలుసుకోవాలి రామయ్య , మాతృభాష, దేశ భాష, లాగానే దేహానికి ఒక భాష ఉంటుందని మనుషులందరూ తెలుసుకోవాలి.


 దేహంలోని అవయవాలు ప్రతిసారి మీకు ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాయని, వాటి గోడును మనం ఆలకించాలని తెలుసుకోవాలి. 


40 వయసు వచ్చేవరకు దేహం నువ్వు చెప్పినట్లు వింటుందని, తరువాత దేహం చెప్పినట్లు నువ్వు వినాల్సి ఉంటుందని విషయం మనం గుర్తు ఎరగాలి.”


 

“గాయాలు మానకపోతే జింకులోపమని...


కండరాల బలహీనతకు పొటాషియం లోపం అని...


అలసట కండరాలు పట్టేస్తుంటే మెగ్నీషియం లోపమని...


హృదయ స్పందనలోఅసాధారణ కదలిక ఉంటేఅది మాంగనీస్ లోపమని...


గోర్లు మెత్తబడటం ఎముకలు గుల్ల బారటం మోకాళ్ళ నొప్పులు ఉంటే అది క్యాల్షియం లోపమని...


అలసట, చర్మం తెల్లబడటం, తలనొప్పి ఉంటే అదే రక్తహీనత .. ఐరన్ లోపం అని...


ఇది అంతా దేహ భాషలోని అక్షరమాలని  అందరికీ తెలిసి ఉండాలి. 


అన్ని భాషల కంటే దేహభాష మిన్న అన్న నిజం పది మందికి తెలియాలి..”



నా ఈ తీర్పు యొక్క ప్రధాన ఉద్దేశం, అవయవాలను పట్టించుకోని రామయ్య ను  శిక్షించడం కాదు. ఆ పని అవయవాలు చేస్తానే ఉన్నాయి. మిగలవారైనా  దేహ భాషను నేర్చుకొని అవయవాల అలసటను ఆలకించాలని, దానికోసం ఈ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయమని ఆదేశిస్తూ ముగిస్తున్నాను.”

తీర్పు చెప్పిన జడ్జిగారు తిరిగి నల్లకోట్లకి మారి  కోర్టు నుంచి బయటకు నడిచారు.



"కణం"ఆరోగ్యంగా ఉంటే "కణజాలాలు" ఆరోగ్యంగా ఉంటాయి.

"కణజాలాలు" ఆరోగ్యంగా ఉంటే "అవయవాలు" ఆరోగ్యంగా ఉంటాయి. అవయవాలు ఆరోగ్యంగా ఉంటే ఈ "దేహం" (Human body)ఆరోగ్యంగా ఉంటుంది.


సర్వే జనా సుఖినోభవంతు

కాటుక కంటినీరు

 పోతన సరస్వతీ దేవిని హాటక గర్భు రాణి అని సంబోధించాడు. అంటే ఏమిటి?

కాటుక కంటినీరు


కాటుక కంటినీరు అన్న పోతన చాటువుని మనం చాలామంది వినే ఉంటాం. దీని గురించి ఒక రహస్యమైన కథ ప్రచారం లో ఉంది.


మాలిక్ కాఫిర్ ఓరుగల్లు సామ్రాజ్యాన్ని జయించిన తరువాత రాజు సింగభూుపాలుడు అడవులలోకి వెళ్ళి అఙ్ఞాతంగా ఉండి సైన్యాన్ని తయారు చేసుకుంటున్నాడు. ఆడవులో ఎన్ని కష్టాలు పడ్డాడో అన్యాపదేశంగా మనకు పొతన భాగవతం లొ చెప్పాడు. అతనికి రహస్యంగా పద్యాలరూపంలొ ఓరుగల్లు కోటలొ విషయాలు చేరవేసేవాడు. బలి చక్రవర్తి కోట వర్ణన మొత్తం మాలిక్ కాఫిర్ కోట భద్రతా విషయాలే ఉన్నాయి.


ప్రస్తుత మన పద్యానికి వస్తే, సింగ భూపాలుని కోడలు గర్భవతి అడవులలోని తీసుకొని వెళ్ళక పోతన ఇంట్లో మారు వేషం లొ ఒక పనిమనిషి లాగా లొ ఉంచేస్తారు. ఆవిడ పేరు సత్యవాణి. ఆవిడగురించి రాజ భటులు వెదుకుతూ ఉంటారు. పోతన ఇంటికి విచారించడానివచ్చి అతనికి చాలా ధన్నాన్ని ఆశచూపిస్తారు. పోతన లొంగలేదు. నాకు తెలియదు అని చెప్పి పంపించేసాడు. రాజ భటులు వెళ్ళిన తరువాత కంటికి మింటి కి ఏక ధారగా నిశ్శబ్ధంగా రోధిస్తున్న ఆవిడతో పోతన ఆశువుగా చెప్పిన పద్యం ఇది.


కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో

కైటక దైత్య మర్ధనుని గాదిలి కోడల, యో మదంబ యో

హాటుక గర్భు రాణి,నిను యాకటికిన్ గొని పోయి యల్ల క

ర్ణాట కిరాత కీచకులకమ్మ త్రి శుద్ధిగ నమ్ము భారతీ


వివరణ

ఎందుకు అంతలా ఏడుస్తావు, సింగభూపాలుని కొడలా, రాజు అంటే విష్ణు ముుర్తిగా భావించి, అదేకాకుండా ఎంతోమంది మహామ్మదీయ రాజులని మట్టు బెట్టి, మాలిక్ కాఫిర్ నికుడా ఒక సారి ఓడించాడు సింగ భూపాలుదు. మాలిక్ కాఫిర్ మారు వేషం తిరిగి లో వచ్చి కోట రహస్యాలు తెలుసుకొని, కొంతమందికి ధనం ఆశచూపి రహస్యంగా కోట తలుపులు తెరిపించుకొని అర్ధ రాత్రి దాడి చెసి జయించాడు.

మాందరికీ నీవే అమ్మవు. బంగారం లాంటి సంతానాన్ని, మాకు కాబోయే రాజుని గర్భంలొ ఉంచుకున్నావు.

ఆకలి కోసం తుచ్చమైన ధనం కోసం నిన్ను ఈ కర్ణాటకనుంచి వచ్చిన కిరాతకులు, కీచకులు అయిన మహమ్మదీయులుకు అమ్మను,

త్రిశుధ్ధిగ, మనసా వాచా, కర్మణా నన్ను నమ్ము భారతీ……


ఈ ఆసత్య దోషం పోవడానికే, వారిజాక్షులందు , వైవాహికములందు ఆన్న పద్యం రాసేడు. ఈ పద్యం కూడా మనకందరకి తెలిసిందే.


గంజేద్ర మోక్షం పద్యాలలొ రహస్యంగా ఎలా దాడి చెయ్యలొ సింగ భూపాలునికి చెప్పేడు, తను వేరుగా వంటరిగా , పరివారం వేరుగా, ఆయుధాలు వేరుగా తీసుకు వచ్చి మాలిక్ కాఫిర్ను తిరిగి జయించేడు.


పద్యాలను ఈ సందర్భగా పరికిస్తే మతి పొతుంది. ఎలా ఉండాలొ ఎవరికి చెప్పకుండా, ఆయుధాలు చేపట్టకుండా, వాహనం ఎక్కకుండా, జుత్తు సరిగా దువ్వకుండా, సరియైన బట్టకాకుండా ఆడువారి బట్టలు ధరించి రావాలని (శ్రీకుచోపరి చేలాంచమైన వీడడు).


వీరందరు ఎక్కడ కలవాలి, ఎలా కలవాలి అన్న విషయం కూడా పద్యాల లో ఉంది.(నగరిలో ఆమూల సౌధమ్ము దాపుల). అదంతా డీకొడ్ చేసి వివరించాలంటే ఈవ్యాసం చాలదు, ఒక పుస్తకమే వ్రాయాలి. పోతన కవితా శక్తి అద్భుతం. ఒక పక్క భక్తి, శ్రీ విద్యోపాసన, మరోపక్క స్వామి భక్తి, రాజుకు రహస్యంగా కార్యనిర్ణయం చేసే మహా మంత్రి.


భాగవతం లొ ఉన్న శ్రీవిద్యోపాసన బలం విజయానికి ఉపకరించింది. స్వామి భక్తుడైన పొతన తిరిగి హైందవ సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి తనవంతు కృషి చేసాడు.

మహాభారతం

 🙏మహాభారతం - శాంతి పర్వం 🙏

                   ఆరవ భాగం 

అందరు దయచేసి శాంతి పర్వం చదవాలి. చిత్త శాంతి లభించాలంటే శాంతి పర్వం మించినది లేదు కథా విషయంలోకి వెడదాము.

వ్యాసుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. " ధర్మజా ! పూర్వం సేనజిత్తు మహారాజుకు పుత్రశోకం కలిగింది. అయినా శోకించలేదు. అతడు నీమాదిరి శోకించక తనకు తానే ఆశోకమును పోగొట్టుకున్నాడు. అతడు పలికిన పలికులు విను " ఈ లోకంలో కొందరు ఇతరులను బాధపెడతారు. మరి కొందరు ఇతరుల చేత బాధను అనుభవిస్తారు. ఇవన్నీ పూర్వజన్మ కర్మలఫలితం కాలమహిమ అనుకోవాలి కాని ఎవరో మనలను బాధిస్తున్నారని చింతించి వాటివలన సుఖం, దుఃఖం పొంద కూడదు. ధనం, భార్య, బంధువులు పోయారని చింతించుట అవివేకం. మనం దుఃఖించినందున బాధలు తొలిగి పోతాయా ! మనకు కలిగే శోకముకు భయముకు ఎన్నో కారణాలు ఉంటాయి. అన్నీ తెలిసిన వాడు శోకముకు భయముకు తలవంచడు. మూర్ఖుడైన వాడు వాటిని తలచుకుని దుఃఖిస్తుంటాడు. సుఖదుఃఖాలు శాశ్వతములు కావు కనుక వాటిని చూసి పొంగుట, కుంగుట తగదు. ఏమీ తెలియని వాడు, అన్నీ తెలిసిన వాడు సుఖ దుఃఖములకు చింతించడు. తెలిసీతెలియని వాడు మాత్రమే సుఖములకు పొంగి దుఃఖములకు కుంగి పోతాడు " అని చెప్పాడు సేన జిత్తు మహారాజు. ఆ మాటలు నీకూ వర్తించి నీ దుఃఖాన్ని పోగొడతాయి ధర్మరాజా ! వర్ణాశ్రమ ధర్మములు ఆచరించి దండనీతిని అమలు చేస్తూరాజ్యమును పాలించుట క్షత్రియ ధర్మం. చనిపోయిన తరువాత కూడా ఎవరిని గురించి ప్రజలు తలచుకుంటారో వాడే సత్పురుషుడు. కనుక క్షత్రియ ధర్మమైన రాజ్యపాలన క్షత్రియుడవైన నీవు చేపట్టు " అని పలికాడు.


వ్యాసుడి మాటలు విన్న తరువాత కూడా ధర్మరాజు వికల మనస్కుడై " మహర్షీ ! ఎన్ని చెప్పినా ద్రౌపదేయులనూ, అభిమన్యుడిని, కర్ణుడిని, విరాటుడిని, ధృష్టకేతుని మరువలేకున్నాను. నాకు మనశ్శాంతి లేకున్నది. మునీంద్రా ! నేను ఎంతటి పాపాత్ముడనంటే చిన్నతనంలో మమ్ము చేరదీసి, ఆదరించి, తొడమీద కూర్చుండ చేసి అన్నం తినిపించిన తాత భీష్ముడిని చంపాను, అర్జునుడు వేసిన బాణములు శరీరం అంతా గుచ్చుకుంటూ ఉంటే భీష్ముడు శిఖండి వైపు చూసిన చూపు నేను మరువ లేకున్నాను. పరశురాముని శిష్యుని అంతటి మహాత్ముడిని ఈ తుచ్ఛరాజ్యము కొరకు ఇలాంటి దుర్మరణం పాలు చెయ్యడం నాకు కడుదుఃఖాన్ని కలిగిస్తుంది. విద్య చెప్పిన గురువు నేను అసత్యం పలకనని నమ్మి నన్ను అడిగినపుడు అసత్యం పలికి అతడి మరణానికి కారకుడిని అయ్యాను. గురువు నమ్మకాన్ని వమ్ము చేసి నేను గురుద్రోహిని అయ్యాను. నేను ఎంతటి పాపాత్ముడను గురువును చంపిన వాడికి ఏమి శిక్ష విధించాలో నాకు మీరే చెప్పాలి మహాత్మా ! నా అన్నయ్య కర్ణుడు స్వంత అన్నను చంపి రాజ్యమును నేను ఎలా ఏలగలను. అది నాకు ఎటుల ఆనందాన్ని ఇవ్వగలదు. భగభగ మండే అగ్నివంటి పద్మవ్యూహంలోకి బాలుడైన అభిమన్యుడిని పంపిన నేను ఎంతటి క్రూరాత్ముడను. సుభద్రార్జునులు కనుక నా కౄరత్వాన్ని సహించారు. ఇంకొకరెవరైనా నన్ను నరికిపారవేయరా ! పసివాడిని అగ్నిగుండలో వేసినవాడికి రాజ్యం పాలించే అర్హత ఎక్కడిది? కడుపున పుట్టిన అయిదుగురు పుత్రులను పోగొట్టుకున్న ద్రౌపది దుఃఖాన్ని నేను ఎట్లు పోగొట్టగలను ? దీనికంతట్కీ కారణమైన నన్ను ప్రాయోపవేశం చేసి మరణం కొరకు ఎదురు చూడనివ్వండి " అన్నాడు.


ధర్మజుడు మాటలు విని వ్యాసుడు " ధర్మజా ! క్షత్రియుడవైన నీకు ఈ బేలతనం తగదయ్యా ! ఎన్ని చెప్పినా నీ శోకం తీరలేదు. ఈ సారి నీవు నీ బాధలు మరచి మనసుపెట్టి నా మాటలు విను. ఈ లోకమంతా ద్వంద్వములతో నిండి ఉన్నది వృద్ధి చెందడం నశించడంకొరకే, పుట్టడం మరణించడానికే, పెరగడం తరగడం కొరకే పుట్టడం చావడం కొరకే సుఖం వెటనే దుఃఖం ఉంటుంది. మితృలంతా మంచి చేస్తారని, శత్రువులు మాత్రమే కీడు చేస్తారని, మంచి వారికే ధనం ప్రాప్తిస్తుందని, ధనంతోనే సౌఖ్యం వస్తుందని అను కోవడం పొరబాటు. అలా అనుకోవడం బ్రహ్మరాతను ధిక్కరించడమే ఔతుంది. విధాత నిన్ను ఎందుకు పుట్టించాడో నీవు ఆ కర్మను నిర్వర్తించాలి. నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానని అనడం కుదరనిపని.


వ్యాసుడు పూర్వం తనమాటలను పొడిగిస్తూ " పూర్వం విదేహమహారాజుకు బంధువియోగం కలిగింది. అయనకు అప్పటికి పరిపూర్ణజ్ఞానం కలుగలేదు. అందువలన ఆయన అత్యంతశోఖం అనుభవించి ఇల్లువిడిచి పోవాలని అనుకున్నాడు. ఆ సమయంలో అతడివద్దకు అశ్మకుడు అనే బ్రాహ్మణుడు వచ్చాడు. జనకుడు అతడికి అతిధిసత్కారాలు చేసి " విప్రోత్తమా ! మానవునకు సంపద కలిగినప్పుడు బంధువులు ఉన్నప్పుడు కలిగే ఆనందం, అహంకారం, మదము సంపద పోయినప్పుడు కలిగే దుఃఖముకు కారణమేమిటి ? " అని ఆడిగాడు అందుకు ఆ బ్రాహ్మణుడు " ఈ విధంగా చెప్పాడు " జనకమహారాజా ! సంసారం అన్న తరువాత సుఖందుఃఖం సహజం. అవి మానవుడి మనస్సును చెదరగొడతాయి. ఈ లోకంలో ఎక్కువ సుఖంకాని ఎక్కువ దుఃఖంకానీ ఎవరికీ ఉండదు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఈ భూమిసమస్తం ఏలే చక్రవర్తికి కూడా వార్ధక్యం, మరణం సహజమే వాటిని ఎవరికీ ఆపకలిగే శక్తి లేదు. జీవితంలో ఏదిజరిగినా బుద్ధి చెదరనీయక అది తన ప్రాప్తమని అనుకోవడం విజ్ఞులలక్షణం. కాలం వలన ప్రతిమనిషికీ ఆహారం, భోగములు, మంచి పడక, మంచి ఆసనములు అన్నీ కాలగమనం వలన కలుగుతుంటాయి తిరిగి పోతుంటాయి. కనుక ఉన్నప్పుడు పొంగడం లేనప్పుడు కుంగడం విజ్ఞులలక్షణం కాదు. కనుక వాటియందు విపరీతకాంక్ష పెంచుకోవడం తగదు. వైద్యులు చక్కగా అభ్యసించి రోగికి మందులు ఎన్నిచ్చినా అన్నీ రోగములు తగ్గవు కదా ! వైద్యులకూ రోగములు రావడం సహజమే ! కనుక అంతా విధిరాతప్రకారం జరుగుతుంది. మానవప్రయత్నం చేయడం మన విద్యుక్ధర్మం. ధనవంతుల ఇంట పుట్టడం, యోగుల ఇంట పుట్టడం, అందచందాలు కలిగి ఉండడం, బలవంతులు అవడం, అదృష్టవంతులు అవడం, భోగాలు అనుభవించడం అన్ని పూర్వ జన్మ పుణ్యఫలం. పూటగడవని దరిద్రుడికి తామరతంపరగా పిల్లలు పుడతారు. కాని అత్యంత ధనవంతునికి ఎన్ని వ్రతాలు చేసినా సంతానభాగ్యం కలుగదు. పేదవాడు ఏదితిన్నా అరాయించుకుంటాడు. ధనవంతుడికి పట్టెడన్నంకూడా అరగదు. పరస్త్రీవ్యామోహం, జూదం, సురాపానం, జంతువులను వేటాడడం పెద్దలు నిర్ణయించారు. కాని లోకులనేకులు ఆ మార్గమున పోయి భ్రష్టులవడం దైవసంకల్పములే కాని మరేది కాదు. ఇష్టం అయిష్టములకు కారణం కనుక్కోవడం కష్టం. భార్యాబిడ్డలు నదిలో కొట్టుకు పోతున్న కట్టెలమాదిరి కలిసి విడిపోతూ ఉంటాయి. మానవులు తాను ఎన్నో జన్మలు ఎత్తి ఎందరో తల్లులను, తండ్రులను, పుత్రులను, పుత్రికలను, బందువులను, మిత్రులను పొందుతాడు. ఇన్నివేల మందిలో మానవుడు ఎవరికొరకు ఏడవగలడు ! ఈ జీవితం శాశ్వతం కాదని తెలుసుకొనుట వివేకులలక్షణం. నిరంతర కాలప్రవాహం ఒక సముద్రంలాంటిది. అందు మొసళ్ళు సంచరిస్తుంటాయి కనుక చావు పుట్టులకు అనివార్యం. అని తెలుసుకొని శోకం వదలాలి. జనక మహారాజా ! ఈ శరీరమే మనం అప్పు తెచ్చుకున్నాము. ఇంక దారాసుతులు, బంధుమిత్రులు శాశ్వతమా ! ఎంత ఏడ్చినా చచ్చినవాడు తిరిగి రాడు కదా ! వారికొరకు శోకించిన తీరనిబాధ అనుభవించడం తప్ప మిగిలేది ఏమిటి ? కనుక జనకమహారాజా ! బంధుమిత్రుల శోకమును వదిలి నీ విద్యుక్ధర్మమైన రాజ్యపాలన చేసి కీర్తి ప్రతిష్టలు పొందు " అన్నాడు. అశ్మకుడి మాటలతో జనకునికి జ్ఞానోదయం కలిగింది. ఆయన ఇల్లువదిలి పోవాలన్న భావనను వదిలి రాజ్యపాలన చేపట్టాడు. కనుక ధర్మరాజా ! నీవు కూడా క్షత్రియధర్మంగా రాజ్యపాలన చెయ్యి " అన్నాడు.

చెప్పిన మాటలకు ధర్మరాజు బదులు చెప్పకపోవడం చూసిన అర్జునుడు పక్కనే ఉన్న శ్రీకృష్ణుడితో " కృష్ణా ! అనేకంగా బంధువులను, కుమారులు, అన్నదమ్ములు ఒకేసారి యుద్ధంలోమరణించడంవలన ధర్మజుడి మనసు వికలమైఉంది. నీ అమృతవచనములతో అతడికి ఊరటకలిగించు " అని అర్ధించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు వద్దకు పోయి అతడి చేతులు పట్టుకుని అనునయిస్తూ " బావా ధర్మజా ! నీ కెందుకయ్యా ఈ మనోవేదన. నీ బంధుమిత్రులు అవక్రపరాక్రమంతో పారాడి మరణించి వీరస్వర్గం అలంకరించారు. రాజరికం ఒకకల. రాజులు మాత్రం కాదు ఏ ఒక్కరూ పూర్ణాయుర్ధాయంతో ఉండరు. పూర్వం సంవర్తనుడు అనే మహాముని ఉండే వాడు. అతడికి దేవగురువు బృహస్పతి అంటే అసూయ ఎక్కువ. అతడు హిమాలయ పర్వతప్రాంతంలో ఉన్న మరుత్తు చేత ఎన్నో యజ్ఞ యాగాదులు చేయించాడు. కాని ఆ మరుత్తు కూడా కాలగర్భంలో కలిసిపోయాడు. సుహోత్రుడు అనే మహారాజు అశ్వమేధము మున్నగు అనేక యజ్ఞములు చేసాడు. కాని అతడు కూడా కాలగర్భంలో కలిసి పోయాడు. అలాగే అనేక దానధర్మాలు చేసిన అంగుడు ఎందరికో వివాహాది సత్కార్యములు చేసి కూడా కాలధర్మం చేయక తప్పలేదు. ఏడు ద్వీపములలో తన రథమును నడిపించిన శిబిచక్రవర్తి కూడా మరణించి ఉత్తమ గతులుపొందక తప్పలేదు. అదే విధంగా దశరథపుత్రుడైన శ్రీరాముడు, భగీరధుడు , దిలీపుడు, మాంధాత, యయాతి, అంబరీషుడు, శశిబిందుడు, గయుడు, రంతి దేవుడు, భరతుడు, పృధుచక్రవర్తి వీరందరూ ఈ భూమిని ఏలిన చక్రవర్తులు. ఎన్నో యజ్ఞ యాదులు చేసిన వీరంతా శాశ్వతంగా జీవించ లేదు. అదే విధంగా 21 మార్లు దండ యాత్రర చేసి రాజులనుసంహరించి ఆ భూమిని అంతటినీ కశ్యపప్రజాపతికి దానంగా ఇచ్చిన జమదగ్ని పుత్రుడైన పరశురాముడు ఈ భూమి మీద శాశ్వతత్వం పొందలేదు. ఇవన్నీ నీవు అభిమన్యుడి మరణ సమయంలో శోకతప్తుడవై ఉన్నప్పుఇడు నారదుడి వలన విన్నావు. కాని అవివేకమును మానలేక ఉన్నావు " అన్నాడు.

               సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

భజగోవిందం (మోహముద్గరః)*

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.     

              *విరచిత*

*భజగోవిందం (మోహముద్గరః)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శ్లోకం (26)*


*కామం క్రోధం లోభం మోహం*

*త్యక్త్వా ఆత్మానం భావయ కో అహం|*


*ఆత్మజ్ఞాన విహీనా మూఢాః*

*తే పచ్యంతే నరకనిగూఢాః||*


*శ్లోకం అర్ధం : ~*


*కామ క్రోధ లోభ మొహములను వదలి, నేను ఎవరిని అనే ఆత్మ విచారము చేయుము. ఆత్మజ్ఞాన విహీనులైన మూఢులు ఈ అరిషడ్వర్గమును వదలక వాటినంటి పెట్టుకొని సంసార నరకములో పడి మ్రగ్గుచుందురు*.


*వివరణ : ~*


*మనిషిని పీడించు శత్రువులు ఆరు మంది, ఆ ఆరుగురు మనలోనే ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు. వీరు ఆరుగురు ఒకరికి ఒకరు మంచి స్నేహితులు. వీరిలో ఏ ఒక్కరు మన హృదయములో చేరిననూ మిగిలిన వారందరూ పిలువకనే వచ్చి తిష్ఠ వేస్తారు. ఏదైనా అందమైనది కాని, కొత్తది కాని వస్తువు కనిపించిన అది నాకు కావాలి, నేనే పొందాలి అనే కోరికే కామము. ఆ కామము వస్తువులపై కాని, వనితలపై కాని, ధన-కనకములపై కాని, పదవులపై కాని, లేక ప్రతిష్ఠ మొదలగు వస్తు, ఆవస్తు సముదాయముపై కాని కలుగవచ్చును. ఒకసారి మనసు కామ వికారము కలిగిన పిమ్మట, అది తనకే ఉండాలన్న లోభము, తనకు లేక ఇతరులకు ఉన్నచో మాత్సర్యము, ఉన్ననూ లేకున్ననూ దానిపై మోహము, ఉన్నచో మదము, ఉన్నదానిని తనకే పరిమితము చేసుకోవాలని, లేనిచో పొందవలనన్న తాపత్రయం, దానికి అడ్డుపడు వారిపై కోపము కలుగును. కావున వీరు ఆరుగురు ఒక్కటిగా మనపై దాడికి వచ్చే శత్రువులు. వీరిని అదుపు చేయుట చాలా కష్టము. వీరిని అణచి, దాసోహము చేసుకొన్నచో సర్వ వికారములు తమంతట తాము వైదొలుగును. లేనిచో అవి విజృంభించి మన మనసును, శరీరమును తమ ఆధీనము చేసుకొని, మనలను బానిసలు చేసుకొని, అజ్ఞానులుగా, నీచ స్వభావులుగా తీర్చిదిద్దుతాయి. కనుక మోక్షకామి అయిన మానవుడు వీనిని అణగదొక్కవలెను. అప్పుడు మనస్సు నిర్మలమై ' నేను పరమాత్మ స్వరూపుడను ' అను భావము మనసులో కలిగి, ఆత్మజ్ఞానము పొందగలడు. ఒకసారి ఆత్మజ్ఞానము కలిగిన, జీవుడు సంసార బంధనములనుండి విముక్తుడై మోక్షప్రాప్తి పొందగలడు.*


*ఓం నమో నారాయణాయ।*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(27వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*సప్త సముద్రాల సృష్టికర్త ప్రియవతుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*వర్షాలు కురిశాయి. పంటలు పండాయి. గ్రామాలు, పట్టణాలూ కళకళ్ళాడాయి. ఏ కొరతా లేకపోయింది ప్రజలకి. ధర్మపాలన చేశాడు పృథువు. సరస్వతినది గల బ్రహ్మవర్తం అనే సిద్ధక్షేత్రంలో నూరు అశ్వమేధయాగాలు చేసేందుకు సిద్ధపడ్డాడు పృథువు. తొంభైతొమ్మిది జయప్రదంగా ముగించాడు. సమస్త దేవతలనూ తృప్తిపరిచాడు.*


*నూరవయాగం చేస్తుండగా దేవేంద్రునికి భయం పట్టుకుంది. నూరవయాగం పూర్తయితే పృథువు తనని మించిపోతాడనీ, స్వర్గాధిపత్యం పొందుతాడనీ తెలుసుకుని, ఆ యాగాన్ని విఘ్నం చేసేందుకు ప్రయత్నించాడు. యాగాశ్వాన్ని అపహరించాడు. కనిపెట్టారది అత్రి మొదలయిన మహామునులు. పృథు చక్రవర్తి చేత అభిచార హోమం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ హోమం చేస్తే యాగాశ్వంతో పాటుగా ఇంద్రుడు బయటపడక తప్పదు. అప్పుడతనికి శిక్ష తప్పదు.*


*దాన్ని వారించేందుకు బ్రహ్మ కల్పించుకున్నాడు. హోమాన్ని మాన్పించాడు. పృథు చక్రవర్తికి హితబోధ చేశాడిలా. ‘‘మహారాజా! నువ్విప్పటికి తొంభై తొమ్మిది అశ్వమేధయాగాలు చేశావు, చాలు. నూరవయాగం చేయనవసరం లేదు, అది చేయకుండానే ఇంద్రుడంతటి వాడవయ్యావు.’’*


*విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. పృథువుకి తత్త్వబోధ చేశాడు. మహామునులు సనకాదులు ప్రత్యక్షమయ్యారు. మోక్షప్రాప్తికి కావాల్సిన తత్త్వాన్ని ఉపదేశించారు.*


*వెళ్ళిపోయారక్కణ్ణుంచి. మునులు, బ్రహ్మ,విష్ణువు ఉపదేశించిన మార్గాలలో ప్రయాణిస్తూ పృథువు చాలా సంవత్సరాలు ప్రజలకు ఎలాంటి కొరతా లేకుండా ధర్మపాలన చేశాడు. తర్వాత రాజ్యాన్ని త్యజించి అడవులకు వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసి భగవంతునిలో ఐక్యం అయ్యాడు. అతని భార్య అర్చి, అగ్నిప్రవేశం చేసి భర్తని చేరుకుంది.*


*ప్రియవ్రతుడు :~*


*పృథు చక్రవర్తి తర్వాత అతనిలా పేరు ప్రఖ్యాతులు పొందిన వాడు ప్రియవ్రతుడు. ఇతను స్వయంభువ మనువు కుమారుడు. ఉత్తానపాదుని సోదరుడు. నారదమహాముని ఉపదేశంతో ఆత్మజ్ఞానాన్ని పొంది, అడవులను ఆశ్రయించాడు ప్రియవ్రతుడు. తపస్సు చేసుకుని తనువు చాలిద్దామనుకున్నాడు. అందుకు బ్రహ్మ ఒప్పుకోలేదు. గృహస్థాశ్రమం స్వీకరించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాబద్ధుడై ప్రియవ్రతుడు వెనక్కి తిరిగి వచ్చాడు. చాలా సంవత్సరాలు భూమిని పాలించాడు. భగవంతుని అంశతో జన్మించిన ప్రియవ్రతుడు, విశ్వకర్ముని కుమార్తె బర్హిష్మతిని పెళ్ళాడాడు. వారిద్దరికీ ఆగ్నీఽద్రుడు, కవి, మేధాతిథి మొదలయిన పదిమంది కుమారులు జన్మించారు. ఊర్జస్వతి అని కుమార్తె కూడా కలిగింది. కుమారులలో ముగ్గురు చిన్నతనంలోనే సన్యసించి, జ్ఞానులయినారు.*


*శుక్రుణ్ణి పెళ్ళాడింది ఊర్జస్వతి. వారి కుమార్తె దేవయాని. మరొక భార్య వల్ల ప్రియవ్రతుడికి ఉత్తముడు, తామసుడు, రైవతుడు జన్మించారు. ఈ ముగ్గురూ మన్వంతరాధిపతులయినారు.*


*భగవంతుని ఉపాసించి, ప్రియవ్రతుడు గొప్ప శక్తిసామర్థ్యాలు సాధించాడు. అద్భుతమయిన సిద్ధులు కూడా పొందాడు. సూర్యుడు మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉన్న కారణంగా భూమండలం సగభాగం వెలుతురు తోనూ, మిగిలిన సగభాగం చీకటితోనూ ఉంటూ వచ్చాయి. పగలూ రాత్రీ ఆ విధంగా ఏర్పడ్డాయి. సూర్యప్రకాశం లేని భూభాగంలో కూడా వెలుతురు వచ్చేటట్టు చేయాలని సంకల్పించుకున్నాడు ప్రియవ్రతుడు.*


*సూర్యరథంలో సమానమయిన రథాన్ని సంపాదించాడు. ఆ రథాన్ని అధిరోహించి, సూర్యునిలా వెలిగిపోతూ, సూర్యుడు మేరు పర్వతానికి ఉత్తరాన ఉన్నప్పుడు తాను దక్షిణాన ఉంటూ, సూర్యుడు దక్షిణాన ఉన్నప్పుడు తాను ఉత్తరాన ఉంటూ అంతటా వెలుతురు నింపాడు. సూర్యుని అనుసరించి ఏడుసార్లు తిరిగాడలా. అప్పుడు అతని రథచక్రాల తాకిడితో ఏడు సముద్రాలు ఏర్పడ్డాయి. ఈ ఏడు సముద్రాల కారణంగానే భూమి జంబూ, ప్లక్ష, శాల్మలీ, కుశ, క్రౌంచ, శాక, పుష్కరము అని ఏడు ద్వీపాలయింది. ఈ ఏడు ద్వీపాలకూ తన ఏడుగురు కుమారులనూ రాజుల్ని చేశాడు ప్రియవ్రతుడు.*


*భరతవర్షం జంబూద్వీపంలో ఉంది. నదులు, పర్వతాలు, అరణ్యాలు మొదలయిన వాటివల్ల సాంకర్యం కలుగకుండా ప్రతి ద్వీపంలోనూ భూమిని విభాగించి, ఎల్లలు ఏర్పరిచాడు ప్రియవ్రతడు. పదకొండు కోట్ల సంవత్సరాలు పాలించాడు. తర్వాత బ్రహ్మ ఆజ్ఞతో గంధమాదనపర్వతంపై తపస్సు చేసి, తనువు చాలించాడు. భగవంతునిలో ఐక్యం చెందాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

మహా కుంభ మేళా కు వెళ్లేవారి కోసం*

 *మహా కుంభ మేళా కు వెళ్లేవారి కోసం*

1.తెలుగు వాళ్లు అందరు మహాకుంభ మేళా సందర్శనకి వెళ్లి వారు ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్లండి ,బస్సు ద్వారా వెళ్తే 16 Km దూరం లో పోలీస్ లు ఆపేస్తారు, అక్కడ నుండి నడుచుకుంటూ మేళా కి వెళ్ళాలి.

2.కుంభం మేళా లకు వెళ్లినవారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళా ని సెక్టార్ లు గా, కాటున్ పాండ్స్ గా, ఘాట్స్ గా విభజించారు వాటిపై అవగాహన పెంచుకుని వెళ్ళండి, లేక పోతే అస్సలు ఏమి అర్ధం కాదు, ఎటు వెళ్లి ఎటు వస్తారో మీకు అర్ధం కాదు.

3.మొత్తం 24 సెక్టర్స్ ఉంటాయి 

4.16-17కాటున్ పాండ్స్ ఉంటాయి. (నదికి మధ్యలో బ్రిడ్జి ల నిర్మించారు వాటినే కంటూన్ పాండ్స్ అంటారు )

4.ప్రయాగ రాజ్ ని మూడు గా విభజించారు A.జ్యూస్సి ,B.

 హరిలాగంజ్ C.సంగం 

5.నది కి కుడి వైపు జ్యూస్సి ఉంటుంది దీనిలో సెక్టర్ (12 నుండి 21 వరకు ఉంటాయి.

6.హరిలాగంజ్ ఇది నదిదాటి ఎడమ వైపు నా ఉంటుంది దీనిలో సెక్టార్ (5,11,10,9,8,7,6,18,19)ఉంటాయి.

7.ముఖ్యం మైంది, సంగం దీనిలో ఇది మెయిల్ రోడ్ కి దగరలో ఉంటుంది దీనిలో సెక్టార్ 3,4,ఉంటాయి.

8.మిగతావి 22,23, చాలా దూరం లో ఉంటాయి.🚩🚩🚩 వసతి సదుపాయాలు 🚩🚩9.సెక్టర్ 6 లో TTD వాళ్లు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు తప్పకుండా చూడండి. కానీ అక్కడ stay చేయనివ్వరు, స్వామి వారికీ బంగారు ఆభరణాలు ఉండడం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకొనివ్వరు.

10.మీరు అక్కడ హిందీ వాళ్లవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు వున్నాయి చక్కగా అక్కడ పడుకోవచ్చు. (.ముఖ్యం గా సెక్టార్ 18లో స్టే చేయవాచ్చు నదికి 100 మీటర్లు లో ఉంటాయి.)

11.సెక్టర్ 19,18,20 ఈ సెక్టర్స్ లో నాగసాధువు లు, అఘోరాలు, వుంటారు వాళ్ళు దగ్గరికి వెళ్తే ఏంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండ మంటారు చక్కగా ఉండొచ్చు.

12.సెక్టార్ 1లో ప్రవైట్ సదుపాయాలు ఉంటాయి రోజు కి 200 రూపాయలు 

13.అన్ని సెక్టార్ లో పెయిడ్ వసతులు కలవు రోజుకి 1000 -2000 తీసుకుంటారు( 4 మెంబర్స్ వరకు ఉండొచ్చు )..🚩🚩భోజనం సదుపాయాలు 🚩🚩

14.మీకు అన్ని సెక్టార్ లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి (ఉత్తర భారతదేశం వంటకలు అన్ని అక్కడ ఫ్రీ గా తిన్నవచ్చు…


🚩🚩హెల్ప్ లైన్ 🚩🚩

16.మీకు రైల్వే స్టేషన్ నుండి అడుగడుగునా పోలీస్ లు మీమల్ని గైడ్ చేస్తారు.

17.మేళా లో అయితే పోలీస్ లు అడుగడుగునా మన కు ఎటువైపు వేళలో చాలా బాగా చెప్తారు.


🚩🚩🚩స్నానం ఎలా🚩🚩. 18ఎవరైతే పుణ్యం స్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో స్నాన ఘాట్ లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి వరుసగా.

19.2-3days వుండే వాళ్లు మాత్రమే ఎదో ఒక సెక్టార్ నదికి దగ్గరో వుంటుంది అక్కడే ఉండడం మంచిది, లేకపోతే నదికి, సెక్టార్ కి దూరమైత్ తప్పిపోయే అవకాశం కలదు 

.


🚩🚩నాగసాధువులు, అఘోరాలు, అఖడా లను చూడాలి, వాళ్ళు ఆశీర్వదాలు తీసుకో వలనంటే సెక్టార్ 19,18,20 లో వుంటారు.


🚩🚩చివరిగా నా మాట ప్రతి ఒకరు తప్పక చెయ్య వలిసిన పవిత్ర అమృత స్నానం 

🚩🚩ఫ్యామిలీ తో వెళ్తే మాత్రం అక్కడ అన్ని తెలుసుకుని వెళండి, లేకపోతే చాలా ఇబ్బంది పాడుతారు.

🚩🚩ఒంటరి గా కంటే నలుగురు గా వెళ్తే చాలా మంచిది.

🚩🚩🚩ఎన్నికోట్లమంది వచ్చినా సరిపోయేంత విశాల ప్రాంతం ప్రయాగం రాజ్.

🙏🙏🙏🙏🙏

మీ

తొమ్మిది దారులు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

        *తొమ్మిది దారులు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*దైవ సన్ని ధిని చేరుకోవడానికి తొమ్మిది దారులు ఉన్నాయని నారద భక్తి సూత్రాల ద్వా రా తెలుస్తోంది.*


*అవి- శ్రవణం , కీర్తనం , స్మరణం , పాదసేవ, అర్చన, వందనం , దాస్యం , సఖ్యం , ఆత్మ నివేదన.*


*ఈ మార్గాల ద్వా రా భగవంతుణ్ని చేరుకోవచ్చని భాగవతం సైతం సూచించింది. భక్తుడు తన అవకాశాన్ని బట్టి వీటిలో ఏ మార్గాన్నై నా ఎంచుకోవచ్చు .*       


*శ్రవణం అంటే వినడం . దైవం గురించిన విషయాలు, లీలలు, కథలు మొదలైన వాటిని తన్మయత్వం తో వినడం కూడా భగవంతుణ్ని అర్చిం చినట్లే అవుతుంది. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే భగవంతుడి విషయాలను నారదుడి ద్వారా  విన్నాడు. శుకమహర్షి ఏడు రోజుల్లో చెప్పిన భాగవత పురాణాన్ని విని పరీక్షిత్తు ముక్తుడయ్యాడు. ధర్మ రాజు, జనమేజయుడు మొదలైనవారంతా దైవం గురించి విని తరించినవారే.*


*భగవంతుడి గొప్పదనాన్ని నోరారా చెప్పడమే కీర్తనం. నిత్యం భగవంతుడి సుగుణాలను తలచుకుంటూ, వాటి గురించి మాట్లాడటం , సంకీర్తన చేయడం లాంటి చర్యల వల్ల మనసు భగవంతుడి మీద సులభంగా లగ్నం అవుతుంది. ఈ మార్గంలో ముక్తి పొందినవాడు శుక మహర్షి. మీరాబాయి, త్యాగరాజు, అన్నమయ్య , కంచర్ల గోపన్న వంటి వారంతా భగవంతుణ్ని కీర్తించి తరించినవారే.*


*స్మరణం అంటే తలచుకోవడం . ఎక్క డ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దైవాన్ని తలచుకుంటూనే ఉండాలి. అదే స్మరణ భక్తి అనిపించుకుంటుంది. నారాయణ నామస్మరణతో నారదుడు, రామనామ స్మరణతో హనుమంతుడు భగవంతుడికి దగ్గరయ్యారు.*


*దైవం అనుసరించిన మార్గం లోనే నడవడం ‘పాదసేవ’ అవుతుంది. అంతే గానీ ఎల్లప్పుడూ భగవంతుడి పాదాల మీదే తదేకమైన శ్రద్ధ కలిగి ఉండటం పాదసేవ కాదు. భరతుడు రాముడి పాదుకలనే రామ స్వరూపం గా భావించడానికి కారణం ఆయన అనుసరించిన మార్గాన్నే తానూ అనుసరించడం . గుహుడు చేసిన పాదసేవకు పులకరించి అతడికి మోక్షాన్ని ప్రసాదించాడు రాముడు.*

   

*ధూపదీపాలు వెలిగించడం , భౌతిక పదార్థాలైన కుంకుమ, అక్షతలు, పూలతో దేవుడికి పూజ చెయ్యడం అర్చన భక్తి. భౌతిక దేహంతో ప్రారంభించిన అర్చన, క్రమంగా మానసికం గా దైవాన్ని దర్శించి, ఆ స్వామికి మనసనే కోవెలలో అర్చనలు చేసే స్థితికి చేరుకోవాలి. రామకృష్ణ పరమహంస కాళికాదేవిని అలాగే అర్చన చేసి తరించారు.*


*వందనం అంటే నమస్కరించడం . తనలోని అహాన్ని విడిచిపెట్టి అవతలి వ్య క్తి గొప్పదనాన్ని అంగీకరించడమే వందనంలోని అంతరార్థం . అన్ని ప్రాణుల పట్ల దయతో ఉన్నా కూడా భగవంతుడికి వందనం చేసినట్లే.*   


*దైవ సేవకుడు ఎలా ఉండాలో హనుమ ఆచరించి చూపించినంతగా మరొకరు చూపించలేరు.*


*భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి, ఆయనను ఆరాధిస్తూ ఉండటమే దాస్యం అవుతుంది. వనవాసంలో పద్నాలుగు సంవత్స రాల పాటు లక్ష్మణుడు అన్న కు దాసుడిగా ఉం డి సేవలు చేశాడు. ఇది దాస్య భక్తి.*


*మంచి స్నే హితుడితో మెలిగినట్లే భగవంతుడితో స్నే హభావం ప్రదర్శించడమే సఖ్య భక్తికి నిదర్శనం . కృ ష్ణుడితో పాండవులు, కుచేలుడు సఖ్యతతో ఉండి, నిరంతరం రక్షణ పొంది తమ జీవితాల్ని తరింపజేసుకున్నారు.*


*తనను తాను పూర్తిగా భగవంతుడికి సమర్పించుకోవడమే ఆత్మ నివేదనం . తనదంటూ ఏదీ ఉంచుకోకుండా అంతా పరమాత్మకు సమర్పించాలి. బలిచక్రవర్తి, గోదాదేవి, మీరాబాయి ఈ మార్గం లోనే ఉన్నతి పొందారు.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

భజగోవిందం (మోహముద్గరః)*

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.     

              *విరచిత*

*భజగోవిందం (మోహముద్గరః)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శ్లోకం (25)*


*శత్రౌ మిత్రే పుత్రే బంధౌ*

*మా కురు యత్నం విగ్రహసంధౌ|*


*భవ సమచిత్తః సర్వత్ర త్వం*

*వాంఛస్యచిరాద్యది విష్ణుత్వమ్*


*శ్లోకం అర్ధం : ~*


*శత్రువునైనా, మిత్రుడనైనా, పుత్రుడనైనా, బంధువునైనా కలహము చేయక, కూర్మిని చూపి శత్రు భావమును సంహరించుము. ఇతరుల పైన కోపము చేసిన నిన్ను నీవె కోపించిన తీరు నీలో, అందరిలొ శ్రీహరి నుండ ఇతరుల నేల దూషణ చేతువు?*


*వివరణ:~*


*భగవంతుడు సర్వ వ్యాప్తి, జడ, చైతన్య, వస్తు, జంతు పదార్ధములందు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. చిన్న చీమ నుంచి, పెద్ద ఏనుగు వరకు సమస్త జీవులయందు స్వామి ఆత్మరూపములో వెలయుచున్నాడు. జంతువులు, పక్షులు, క్రిములు, మానవులు, వన్యమృగములు, చెట్లు, చేమలు మున్నగు భూ, జల, వాయు నిలయ సమస్త జీవులు శ్రీహరి ప్రతిరూపములే. భగవంతుడు సూక్ష్మముగా జీవులలోను, ఊర్జముగా పంచభూతములలోను నిక్షిప్తుడై ఉన్నాడు. అందుచే అన్ని జీవులను సమభావముతో చూడవలెను. ఎవ్వరిపై కోపతాపములు చూపరాదు, ఎవ్వరితో కలహించరాదు. అందరినీ ప్రేమతో, దయతో చూడవలెను. ద్వేష, విరోధ భావములను రూపు మాపి శాంతి, సహృదయము అలవరచు కోవలెను. శత్రువులైనను, పుత్రులైనను, బంధువులైనను అందరినీ ఒకే తీరు ఆదరించ వలెను. భేద భావము చూపుట కేవలము అజ్ఞానమే.*


*ఓం నమో నారాయణాయ।*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(26వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*పుడమిని బెదిరించిన పృథు చక్రవర్తి*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ప్రజాక్షేమాన్ని ఆశించే రాజు కోసం, ధర్మం నెలకొల్పే రాజు కోసం మునులు వేనుని బాహువులు మథించగా అప్పుడు ఒక స్త్రీ, ఒక పురుషుడూ ఉద్భవించారు. ఇద్దరూ భగవదంశతో జన్మించిన వారే! ఆ పురుషుడే పృథువు. శ్రీమన్నారాయుణుని అంశతో జన్మించిన పృథువు, సాక్షాత్తూ లక్ష్మీదేవి అంశతో జన్మించిన స్త్రీని, ‘అర్చి’ని వివాహమాడాడు. ఆనాడు ఆ వివాహం మునులకూ, దేవతలకూ, సర్వులకూ కనుల పండువయింది. సంతోషించారంతా.*


*పుడమికి రాజయినాడు పృథువు. మునీశ్వరులు అతన్ని అభిషేకించారు. అష్టదిక్పాలకులూ అతనికి అద్భుతమయిన కానుకలు అందజేశారు. కానుకల రూపేణా పృథువుకి దివ్యమయిన ఆయుధాలు లభించాయి.*


*భూలోకంలో అఖండమయిన కీర్తిని ఆర్జించిన వారిలో ప్రథముడు పృథువు. ధరాన్ని ప్రతిష్ఠించాడతను. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు.పృథువు రాజ్యాన్ని చేపట్టే నాటికి లోకంలో ప్రజలంతా చెప్పలేనన్ని ఈతి బాధలు అనువిభవిస్తూ ఉన్నారు. అన్నం లేక అలమటిస్తూ ఉన్నారు.‘‘మహారాజా! మాకింత అన్నం పెట్టి, మమ్మల్ని కాపాడు.’’ పృథు చక్రవర్తిని వేడుకున్నారు ప్రజలు. పిడికెడు మెతుకులు దొరకని ఈ కరువేమిటి? ఎందుకొచ్చి పడిందని ఆలోచించాడు పృథువు. సమస్త ఓషధులనూ భూమి హరించి వేయడంతోనే ఈ అవస్థ వచ్చి పడిందని అర్థం చేసుకున్నాడతను. పట్టరాని కోపం కలిగింది. భూమిని సంహరించడానికి ధనుర్బాణాలు అందుకున్నాడు. బాణాన్ని సంధించాడో లేదో భూదేవి గో రూపం ధరించి, భయంతో పరుగందుకుంది. ఆమె వెంటపడ్డాడు పృథువు. భూదేవి సమస్తలోకాలూ తిరిగింది. రక్షించమని ఎందరినో వేడుకుంది. ఎవరూ రక్షించలేకపోయారామెను.

వెంటపడి తరుముకు వస్తూన్న పృథువుని అడ్డగించలేకపోయారు. చేసేది లేక ప్రాణభిక్ష పెట్టమని పృథువుని ప్రార్థించింది భూదేవి.‘*


*‘ఓషధులన్నీ గర్భంలో దాచుకుని, ధాన్యాదులు ఇవ్వకుండా కరువు తెచ్చిపెట్టావు. ఇప్పటికయినా మించిపోయింది లేదు, నా ప్రజలందరికీ జీవనాధారం చూపించు. కాదన్నావా, నిన్ను సంహరించి తీరుతాను. హరిహరాదులు కూడా నిన్ను కాపాడలేరు.’’ గర్జించాడు పృథువు.*


*చావు నుంచి తప్పించుకునేందుకు భూదేవి రకరకాలుగా పృథువుని స్తుతించింది. పట్టించుకోలేదతను. పట్టిన పట్టు వీడలేదు. అప్పుడిలా అంది భూదేవి.‘*


*‘మహారాజా! నీ ముందు రాజులు నన్ను అలక్ష్యం చేశారు. జీవనాధారమయిన ఓషధులన్నీ దుర్మార్గుల పరం చేశారు. దానిని నేను తట్టుకోలేకపోయాను. దుర్మార్గుల చేతికి చిక్కకుండా ఓషధులన్నిటినీ నేనే స్వీకరించాను. వాటిని నా గర్భంలో దాచి పెట్టాను. అయితే ఇది జరిగి చాలా రోజులయిన కారణంగా, ఇప్పుడు ఆ ఓషధులు నాలో క్షీణించాయి.’*


*’‘‘అబద్ధం’’ గర్జించాడు పృథువు.*


*‘‘లేదు మహారాజా, నిజమే చెబుతున్నాను. కోపించకు. ఇప్పుడు నీకు ఆ ఓషధులు కావాలంటే నేను ఓ ఉపాయం చెబుతాను, విను.’’*


*‘చెప్పు’’*


*‘‘నేనిప్పుడు గోరూపంలో ఉన్నాను కదా, నాకు ఓ దూడనూ, పాలపాత్రనూ, పాలు పితికేవాణ్ణీ సృష్టించు. పాల రూపంలో సమస్త ఓషధులనూ నీకు అందజేస్తాను. అలాగే పర్వతాదులతో హెచ్చు తగ్గులుగా ఉన్న నన్ను చక్కగా చదును చెయ్యి. అలా చేస్తే వర్షం నీరు వృథాపోదు, సమతలంగా ఉన్న నాలోనే నీరంతా ఉంటుంది. ఏమంటావు?’’ అడిగింది భూదేవి.*


*ఆవేశపడకుండా ఆలోచించాడు పృథువు. భూదేవి చెప్పినట్టుగా చేసేందుకు సిద్ధమయ్యాడు. స్వయంభువ మనువును దూడగా మార్చాడు. తన చేతుల్నే పాలపాత్రగా మర్చాడు. తానే పాలను పితికేవాడై, భూదేవి పొదుగు నుండి పాలను పితకాడు. పాత్ర నిండుగా పాలు పితికాడు. సమస్త ఓషధులతో నిండిన ఆ పాలను, భూమి అంతటా జల్లాడు. అంతలో దేవతలూ, మునులూ వచ్చారక్కడకి.*


*భూదేవి నుండీ తామూ తమకు కావాల్సినవి పితుక్కుంటామన్నారు. అభ్యంతరం చెప్పలేదు పృథువు. అంగీకరించాడందుకు. వశిష్ఠాది మునులంతా బృహస్పతిని దూడగా చేసి, ఇంద్రియాలను పాత్రను చేసి చంధోమయమైన పాలను పితికారు.*


*దేవతలు ఇంద్రుని దూడను చేసి, బంగారు కలశంలో అమృతాన్ని పితుక్కున్నారు. దానవులు ప్రహ్లాదుని దూడను చేసి, ఇనుప పాత్రలో గౌడి, పైష్ఠి, మాధ్వి అని మూడు రకాల మద్యాన్ని పితుక్కున్నారు. గంధర్వులు విశ్వావసును దూడను చేసి, పద్మాన్ని పాత్ర చేసి, అందులో వాంగ్మాధుర్యాన్ని పాలగా పితికారు. పితృదేవతలు సూర్యుణ్ణి దూడను చేసి, మట్టిపాత్రలో అన్నాన్ని పితుక్కున్నారు. కపిలుని గోవుగా చేసి, ఆకాశాన్ని పాత్రను చేసి, సిద్ధులు అణిమాదిసిద్ధులు పితుక్కున్నారు. విద్యాధరులు ఆకాశగమనం మొదలయిన విద్యలను పితుక్కున్నారు. మయుని దూడను చేసి మాయావులు ఇంద్రజాలాది విద్యలను పితుక్కున్నారు. యక్ష రాక్షస భూత పిశాచాదులు రుద్రుని దూడను చేసి, కపాలాన్ని పాత్రను చేసి, మద్యంలాంటి మత్తు కలిగించే రక్తాన్ని పితుక్కున్నారు. సర్పాలు తక్షకుణ్ణి దూడను చేసి, రంధ్రాలనే పాత్రలో విషతుల్యమయిన పాలను పితుక్కున్నారు. పశువులు శివుని వాహనం నందిని దూడను చేసి, అరణ్యం పాత్రలో తృణాదులను పితుక్కున్నారు. హిమవంతుని దూడను చేసి, సానువులను పాత్ర చేసి, పర్వతాలు గౌరవాది ధాతువుల్ని పితుక్కున్నాయి. ఇలా పదిమందీ పదిరకాలుగా భూదేవిని పిండి వారికి కావాల్సినవి అందుకున్నారు.*


*నిష్క్రమించారక్కణ్ణుంచి. అప్పటి నుంచీ భూదేవిని కన్నకూతురులా ప్రేమగా చూడసాగాడు పృథువు. ఎగుడు దిగుళ్ళన్నీ సమం చేశాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో.భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

భజగోవిందం

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.     

              *విరచిత*

*భజగోవిందం (మోహముద్గరః)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శ్లోకం (24)*


*త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః*

*వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః*


*సర్వస్మి న్నపి పశ్యాత్మానం*

*సర్వత్రోత్సృజ భేద జ్ఞానమ్*


*శ్లోకం అర్ధం : ~*


*నాలోను, నీలోను, మనందరిలోను, ఈ చరాచర జీవకోటిలో ఉన్నవాడు ఆ విష్ణువే. అజ్ఞానముతో అన్నియు మరిచి అందరినీ దూషింతువు ఏల? సమ భావమును, సహనము పెంచుము, స్వార్ధము త్రెంచుము, సమతను పెంచుము, మానవ సేవే మాధవ సేవగా దైవత్వముతో దయతో మెలుగుము.*


*వివరణ :~*


*ప్రపంచమున ప్రతి జీవియందు శ్రీమన్నారాయణుడున్నాడు. అందుకే మానవ సేవే మాధవ సేవ అందురు. ప్రతి ఒక్కరిలో పరమాత్మగలడు. అందుచేత సహనముతో, కోప తాపములు వీడి అందరినీ సమభావముతో, ప్రేమతో చూచుకొనవలెను. మనలను మనము ఎంత ప్రీతితో, ప్రేమతో, జాగ్రత్తతో చూచుకొందుమో, పరులను కూడా అదే భావముతో చూడ వలెను. పరమాత్ముడు సర్వవ్యాప్తి, అందరు జీవులు అతని రూపులే. ఈ సత్యము తెలిసిన వ్యక్తి నిష్కారణముగా ఇతరులును దూషింపడు, నిందింపడు. సమరస జ్ఞానము లేని మంద బుద్ధులే ఇతరులపై కోపతాపములు చూపుదురు. మనము ఎన్ని మంత్రములు పఠించగలము, ఎన్ని గంటలు పూజలు చేయగలము, ఎంతసేపు భగవంతుని గురించి ఉపన్యాసములు ఇవ్వగలము, యిత్యాదులు, ఈ సమరస భావమునకు కొలమానములు కావు. ఇతరులతో ఎంత ప్రేమ, దయ, సహనము చూపగలము, మనలో ఎంత మానవత్వమున్నది అను విషయములే మన సమగ్ర జ్ఞానమునకు నిదర్శనములు.*


*ఓం నమో నారాయణాయ।*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(24వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ధ్రువ నక్షత్రం*, *పృథు చక్రవర్తి కథనం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ధ్రువుడికి యుక్తవయసు రాగానే అతనికి రాజ్యాన్ని అప్పగించి, తపోవనాలకు తరలిపోయాడు తండ్రి.  ద్రువుడు భ్రమిని వివాహమాడాడు. ఆమె శిశుమారుడు కుమార్తె. వాయుపుత్రి ఇలను కూడా వివాహమాడాడతను*.


*ఉత్తముడు, హిమవత్పర్వత ప్రాంతానికి వేటకి వెళ్ళి, అక్కడ యక్షులతో పోరాడి మరణించాడు.*


*ఎంతకీ తిరిగి రాని కుమారుణ్ణి వెదుకుతూ సురుచి బయల్దేరింది. కుమారుణ్ణి వెదుకుతూ వెదుకుతూ మరణించిందామె.*


*సవతితల్లీ, తమ్ముడూ మరణించడంతో అందుకు కారణమయిన యక్షుల మీద కోపగించాడు ద్రువుడు. వారి మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఒకొక్కరినీ సంహరించసాగాడు. తరిగిపోతున్న యక్ష సంతతి మీద జాలి చెందాడు స్వాయంభువమనువు. తాతగా అతను ద్రువుణ్ణి వారించాడు. హింస తగదని, యుద్ధం మానమన్నాడు.*


*మానాడు ద్రువుడు. కుబేరుడితో స్నేహం చేసుకున్నాడు. తిరిగి వెళ్ళిపోయాడు.*


*అరవై ఆరువేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. రాజభోగాలన్నీ అనుభవించాడు. మరిక భౌతికంగా అనుభవించేదీ ఆశించేదీ లేక రాజ్యాన్ని త్యజించాడు ద్రువుడు. బదరీవనానికి వెళ్ళిపోయాడు. అక్కడ మందాకినిలో స్నానం చేసి, హరిని ధ్యానిస్తూ సమాధివిష్టుడయినాడు. కొన్నాళ్ళు గడిచింది. భౌతికదేహాన్ని త్యజించే సమయం ఆసన్నమయింది.*


*విష్ణుదూతలు దివ్య విమానాన్ని వెంటబెట్టుకుని రావడంతో భౌతికదేహాన్ని త్యజించి, జ్యోతిర్మయమయిన దివ్య రూపాన్ని ధరించాడు ద్రువుడు. విమానాన్ని అధిరోహించాడు. సమస్త దేవతలూ, మునులూ కీర్తించగా ముల్లోకాలనూ, గ్రహమండలాన్నీ, సప్తర్షుల స్థానాన్నీ అతిక్రమించి, ఉత్తర దిక్కున అన్నిటికంటే ఎత్తున ఉండే సత్యమూ నిత్యమయిన ద్రువపదం చేరుకున్నాడు.*


*స్వయం ప్రకాశిగా వెలుగొందుతూ అక్కడే స్థిరనివాసాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ క్షణం దేవదుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. గంధర్వగానం వినిపించింది.*


*ఆసరికే అతని తల్లి సునీతి స్వర్గాన్ని అలంకరించింది.*


*ఉత్తర దిక్కున సప్తర్షి మండలానికి ఎగువున మహోన్నత స్థానంలో ద్రువనక్షత్రం అందరికీ కనిపిస్తూ నేటికీ కను విందు చేస్తున్న సంగతి తెలిసిందే! శుభప్రదమయిన ఈ నక్షత్రాన్ని నూతన వధూవరులకు చూపడం సంప్రదాయంగా వస్తోంది. అయితే గొప్ప కీడు మూడునున్నవాడికీ, అంత్యకాలం సమీపించేవాడికీ ద్రువనక్షత్రం కనిపించదంటారు ఆర్యులు.*


*పృథు చక్రవర్తి చరిత్ర*


*ద్రువుని అనంతరం ఆ వంశంలో చెప్పుకోదగినవాడు పృథు చక్రవర్తి. ఆయన చరిత్ర తెలుసుకుందాం.*


*ధ్రువుని వంశంలో జన్మించిన ‘అంగుడు’ అనే పేరుగల రాజుకు చాలా కాలం వరకు సంతతి కలగలేదు. యజ్ఞ పురుషుడైన వెన్ను (విష్ణువు)ని ఆరాధించగా ఆ రాజచంద్రునికి ‘వేనుడు’ అనే కుమారుడు కలిగాడు. కాని వాడు అన్ని విధాల అత్యంత హీనుడయ్యాడు*


*ఆ వేనుడు రాజ్యం చేస్తున్న కాలంలో ప్రజలు అనేక విధాల బాధలు అనుభవించారు. మునులనూ, బ్రాహ్మణులనూ నానా విధాల వేధించాడు వేనుడు. యజ్ఞ యాగాదులు లేకుండా చేశాడు. దానధర్మాల జోలికి పోలేదు. దాంతో భూమి మీద అన్యాయం, అధర్మం ప్రబలిపోయాయి. రాజ్యం అతలాకుతలమయింది. అది తట్టుకోలేని మునులంతా వేనుణ్ణి సమీపించారు. ధర్మాని ఉద్ధరించమని ప్రార్థించారు. వారి ప్రార్థనను పట్టించుకోలేదు వేనుడు. పెడ చెవిన పెట్టాడు. మునులకు కోపం వచ్చింది. శపించారతన్ని. శాపకారణంగా వేనుడు మృతి చెందాడు. అతనికి పుత్రసంతానం లేని కారణంగా రాజ్యానికి రాజు లేకుండా పోయాడు. రాజు లేని రాజ్యంలో ధర్మాలన్నీ మరింతగా తలకిందులయ్యాయి. వాటిని అరికట్టేందుకు రాజుని సృజించాలనుకున్నారు మునులు.*


*వేనుడి మృతదేహాన్ని తీసుకుని, అతని తొడని మథించారు. అప్పుడు అందులోంచి బాహుకుడు పుట్టుకొచ్చాడు. చాలా వికృతంగా కనిపించాడతను. రాజయ్యే లక్షణాలు లేవతనిలో. నిషాదులకు మూల పురుషుడుగా మిగిలిపోయాడు.*


*ఈసారి వేనుని బాహువులు మథించారు మునులు. అప్పుడు ఒక స్త్రీ, ఒక పురుషుడూ ఉద్భవించారు. ఇద్దరూ భగవదంశతో జన్మించిన వారే! ఆ పురుషుడే పృథువు.* 


*శ్రీమన్నారాయుణుని అంశతో జన్మించిన పృథువు, సాక్షాత్తూ లక్ష్మీదేవి అంశతో జన్మించిన స్త్రీని, ‘అర్చి’ని వివాహమాడాడు.*


*ఆనాడు ఆ వివాహం మునులకూ, దేవతలకూ, సర్వులకూ కనుల పండువయింది. సంతోషించారంతా.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️ల