🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.
*విరచిత*
*భజగోవిందం (మోహముద్గరః)*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*శ్లోకం (24)*
*త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః*
*వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః*
*సర్వస్మి న్నపి పశ్యాత్మానం*
*సర్వత్రోత్సృజ భేద జ్ఞానమ్*
*శ్లోకం అర్ధం : ~*
*నాలోను, నీలోను, మనందరిలోను, ఈ చరాచర జీవకోటిలో ఉన్నవాడు ఆ విష్ణువే. అజ్ఞానముతో అన్నియు మరిచి అందరినీ దూషింతువు ఏల? సమ భావమును, సహనము పెంచుము, స్వార్ధము త్రెంచుము, సమతను పెంచుము, మానవ సేవే మాధవ సేవగా దైవత్వముతో దయతో మెలుగుము.*
*వివరణ :~*
*ప్రపంచమున ప్రతి జీవియందు శ్రీమన్నారాయణుడున్నాడు. అందుకే మానవ సేవే మాధవ సేవ అందురు. ప్రతి ఒక్కరిలో పరమాత్మగలడు. అందుచేత సహనముతో, కోప తాపములు వీడి అందరినీ సమభావముతో, ప్రేమతో చూచుకొనవలెను. మనలను మనము ఎంత ప్రీతితో, ప్రేమతో, జాగ్రత్తతో చూచుకొందుమో, పరులను కూడా అదే భావముతో చూడ వలెను. పరమాత్ముడు సర్వవ్యాప్తి, అందరు జీవులు అతని రూపులే. ఈ సత్యము తెలిసిన వ్యక్తి నిష్కారణముగా ఇతరులును దూషింపడు, నిందింపడు. సమరస జ్ఞానము లేని మంద బుద్ధులే ఇతరులపై కోపతాపములు చూపుదురు. మనము ఎన్ని మంత్రములు పఠించగలము, ఎన్ని గంటలు పూజలు చేయగలము, ఎంతసేపు భగవంతుని గురించి ఉపన్యాసములు ఇవ్వగలము, యిత్యాదులు, ఈ సమరస భావమునకు కొలమానములు కావు. ఇతరులతో ఎంత ప్రేమ, దయ, సహనము చూపగలము, మనలో ఎంత మానవత్వమున్నది అను విషయములే మన సమగ్ర జ్ఞానమునకు నిదర్శనములు.*
*ఓం నమో నారాయణాయ।*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి