🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.
*విరచిత*
*భజగోవిందం (మోహముద్గరః)*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*శ్లోకం (26)*
*కామం క్రోధం లోభం మోహం*
*త్యక్త్వా ఆత్మానం భావయ కో అహం|*
*ఆత్మజ్ఞాన విహీనా మూఢాః*
*తే పచ్యంతే నరకనిగూఢాః||*
*శ్లోకం అర్ధం : ~*
*కామ క్రోధ లోభ మొహములను వదలి, నేను ఎవరిని అనే ఆత్మ విచారము చేయుము. ఆత్మజ్ఞాన విహీనులైన మూఢులు ఈ అరిషడ్వర్గమును వదలక వాటినంటి పెట్టుకొని సంసార నరకములో పడి మ్రగ్గుచుందురు*.
*వివరణ : ~*
*మనిషిని పీడించు శత్రువులు ఆరు మంది, ఆ ఆరుగురు మనలోనే ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు. వీరు ఆరుగురు ఒకరికి ఒకరు మంచి స్నేహితులు. వీరిలో ఏ ఒక్కరు మన హృదయములో చేరిననూ మిగిలిన వారందరూ పిలువకనే వచ్చి తిష్ఠ వేస్తారు. ఏదైనా అందమైనది కాని, కొత్తది కాని వస్తువు కనిపించిన అది నాకు కావాలి, నేనే పొందాలి అనే కోరికే కామము. ఆ కామము వస్తువులపై కాని, వనితలపై కాని, ధన-కనకములపై కాని, పదవులపై కాని, లేక ప్రతిష్ఠ మొదలగు వస్తు, ఆవస్తు సముదాయముపై కాని కలుగవచ్చును. ఒకసారి మనసు కామ వికారము కలిగిన పిమ్మట, అది తనకే ఉండాలన్న లోభము, తనకు లేక ఇతరులకు ఉన్నచో మాత్సర్యము, ఉన్ననూ లేకున్ననూ దానిపై మోహము, ఉన్నచో మదము, ఉన్నదానిని తనకే పరిమితము చేసుకోవాలని, లేనిచో పొందవలనన్న తాపత్రయం, దానికి అడ్డుపడు వారిపై కోపము కలుగును. కావున వీరు ఆరుగురు ఒక్కటిగా మనపై దాడికి వచ్చే శత్రువులు. వీరిని అదుపు చేయుట చాలా కష్టము. వీరిని అణచి, దాసోహము చేసుకొన్నచో సర్వ వికారములు తమంతట తాము వైదొలుగును. లేనిచో అవి విజృంభించి మన మనసును, శరీరమును తమ ఆధీనము చేసుకొని, మనలను బానిసలు చేసుకొని, అజ్ఞానులుగా, నీచ స్వభావులుగా తీర్చిదిద్దుతాయి. కనుక మోక్షకామి అయిన మానవుడు వీనిని అణగదొక్కవలెను. అప్పుడు మనస్సు నిర్మలమై ' నేను పరమాత్మ స్వరూపుడను ' అను భావము మనసులో కలిగి, ఆత్మజ్ఞానము పొందగలడు. ఒకసారి ఆత్మజ్ఞానము కలిగిన, జీవుడు సంసార బంధనములనుండి విముక్తుడై మోక్షప్రాప్తి పొందగలడు.*
*ఓం నమో నారాయణాయ।*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి