వైశాఖ పురాణం - 2 వ అధ్యాయము🚩*_
🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️
*వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు - వాని ఫలితములు*
☘☘☘☘☘☘☘☘☘
నారదమహర్షి అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. అంబరీష మహారాజా ! వినుము. విష్ణుప్రీతికరమగుటచే మాధవమాసమని వైశాఖమునందురు.
వైశాఖ మాసముతో సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదసమానమైన శాస్త్రము లేదు.
గంగాజలమునకు సాటియగు తీర్థ జలము లేదు.
జలదానముతో సమానమైన దానము లేదు.
భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు.
వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుటవలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు.
నిరాహారముగ చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుటవలన వచ్చు సుఖమునకు సాటియైన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజనతృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమమైన వ్యాపారము , ధర్మసమమైన మిత్రుడు , సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి , శ్రీమహావిష్ణుసముడైన రక్షకుడు , వైశాఖసమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.
శేషశాయియగు శ్రీమహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగ గడపిన వాడు ధర్మహీనుడగుటయే కాదు , పశుపక్ష్యాది జన్మలనందుచున్నాడు. వైశాఖమ్మాసవ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట , యజ్ఞయాగాదులను చేయుట మున్నగువానినెన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖమాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖవ్రతమును పాటించువానికి మాధవార్పితములగావించి భక్షించి ఫలాదులకును శ్రీమహావిష్ణు సాయుజ్యము కలుగును. అధికధనవ్యయముచే చేయు వ్రతములెన్నియో యున్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములును యెన్నియో యున్నవి. ఆ వ్రతములన్నియు తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతియే కాదు, పునర్జన్మను కలిగించును. అనగా ముక్తి నీయవు. కనుక నియమ పూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము పునర్జన్మను పోగొట్టును అనగా ముక్తినిచ్చును.
అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము , సర్వతీర్థములయందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున జల దానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరియొకనిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగును. హితములును చేకూరును. దానములన్నిటిని ఒకవైపునను జలదానమును మరొకవైపునను వుంచి తూచినచో జలదానమే గొప్పది యగును.
బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రము నేర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరును పుణ్యలోకములనందుదురు. జలదానము చేసినవారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము నేర్పరచుటచే బాటసారుల సర్వ దేవతలు పితృదేవతలు అందరును సంతృప్తులు ప్రీతినంది వరముల నిత్తురు. ఇది నిస్సంశయముగ సత్యము సుమా. దప్పికగలవాడు నీటిని కోరును. ఎండ బాధపడినవాడు నీడను కోరును. చెమటపట్టినవాడు విసురుకొనుటకు విసనకఱ్ఱను కోరును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు , జలమును(నీరుకల చెంబును), గొడుగును , విసనకఱ్ఱను దానమీయవలెను. నీటితో నిండిన కుంభమును దానమీయవలయును. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై(చాతకమను పక్షి భూస్పర్శకల నీటిని త్రాగిన చనిపోవును. కావున మబ్బునుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండ ఆకాశముననే త్రాగి యుండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు) జన్మించును.
దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి యాదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకువచ్చిన వానికి విసనకఱ్ఱతో విసిరి యాదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభము నందును అట్లు జలము నీయనివారు బహువిధములైన వాతరోగములనంది పీడితులగుదురు ఎండకువచ్చినవానికి విసురుటకు విసనకఱ్ఱ లేనిచో పైబట్టతో(ఉత్తరీయము) విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణుసాయుజ్యము నందును. పరిసుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకఱ్ఱ నిచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నందును అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకఱ్ఱనీయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.
గొడుగును దానము చేసినచో ఆధిభౌతిక , ఆధీఅత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగుదానమీయనివాడు, నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు నిహలోకమున బాధలను పొందడు , సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడువానికి , చెప్పులులేవని అడిగినవానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు , బాటసారులకు ఉపయోగించునట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగువానిని నిర్మించినవాని పుణ్యపరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్నకాలమున అతిధిగ వచ్చినవానిని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీషమహారాజా ! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానములేదు. అలసివచ్చిన బాటసారిని వినయమధురముగ కుశలమడిగి యాదరించినవాని పుణ్యము అనంతము. ఆకలిగలవానికి, భార్యసంతానము , గృహము , వస్త్రము , అలంకారము మున్నగునవి యిష్టములు కావు. ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము యిష్టము ఆవశ్యకము. కాని ఆకలి తీరినచో నివియన్నియు నిష్టములు ఆవశ్యకములు నగును. అనగా అన్నము భార్య మున్నగువారికంటె ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానములకంటె నుత్తమమైనదని భావము. కావున అన్ని అన్నదానముతో సమానమిన దానము యింతకు ముందులేదు , ముందుకాలమున గూడ నుండబోదు. వైశాఖమాసమున అలసిన బాటసారికి జలదానము , చత్రదానము , వ్యజనదానము , పాదుకాదానము , అన్నదానము మున్నగునవానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరుకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగువానిని యధాశక్తిగ చేయవలయును. రాజా ! అన్నమును పెట్టినవాడు తల్లినిదండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మరపించును. కావున త్రిలోకవాసులందరును , అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మ నిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కాని అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రులకంటె నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు , సర్వదేవతాస్వరూపుడు , సర్వధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున , అన్ని తీర్థములు(వానిలో స్నానము చేసిన పుణ్యము) సర్వదేవతలు(వారిని పూజించిన ఫలము) సర్వధర్మములు(అన్ని ధర్మముల నాచరించిన ఫలము) కలుగునని భావము.
*వైశాఖపురాణం రెండవ అధ్యాయం సంపూర్ణం*
: *🚩వైశాఖ పురాణం - 3 వ అధ్యాయము🚩*_
🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹
*వివిధ దానములు - వాని మహత్మ్యములు*
☘☘☘☘☘☘☘
నారదమహర్షి మాటలను వినిన అంబరీష మాహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ ! వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా ? మరి యింకనూ ఉన్నవా ? అవి యేవి ? వాని ఫలితములను గూడ దయయుంచి వివరింపుమని కోరెను.
అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును (మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండ జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండ సుఖముగ జీవింతురు. ఇహలోకసుఖముల ననుభవింతురు. పాపములు లేకుండనుందురు. అంతియేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖమాసపు యెండలకు బాధపడినవారికి బ్రాహ్మణశ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చి యిహలోకముననెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆశయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములననుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖమాసమున కశిపును (పరుపు లేక వస్త్రము) మంచముపై మంచి ఆచ్చాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక , మానసిక బాధలు లేకుండ సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆయురారోగ్యములను కీర్తిప్రతిష్ఠలను పొందుదురు. నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తినందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతోబాటు దిండును గూడ దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును , పరుపును , దిండును యిచ్చుటచే ఆ దాత అందరకు అన్నివిధముల ఉపకారము చేయువాడై ప్రతిజన్మయందును , సుఖవంతుడు , భోగవంతుడు , ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు యేడు జన్మల వరకు మహావైభవముగ గడిపి తుదకు ముక్తినందును. తనతోబాటు నేడు తరములవారికిని ముక్తిని కలిగించును. గడ్డి తుంగ మున్నగువానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీమహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్ణ , ఉన్ని , గొఱ్ఱె బొచ్చు నీటియందు పడినను తడవకనుండునో అట్లే పర్యంక శయ్యా దానము చేసినవారు. సంసారసముద్రములోనున్నను ఆ వికారములంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేనివారు కట(చాప) దానమును చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై కట శయ్యాదానము చేసినవారికిని వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ , దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములనిచ్చును. రాజా ! వైశాఖమాసమున కంబళి దానము చేసినవానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును.
ఎండచే పీడింపబడినవానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తినందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులను వశపరచుకొన్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు , మనుమలు మున్నగువారితో సర్వసౌఖ్యములనంది ముక్తినందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున కర్పూర , తాంబూల దానమిచ్చినచో చక్రవర్తియై మోక్షమునందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమునశించి సుఖించును. దుఃఖములు , పాపములు లేకుండ జీవించి ముక్తి నందును. కస్తూరి మున్నగు సుగంధద్రవ్యముల నిచ్చినచో నెట్టి బాధలు లేకుండ జీవించి మోక్షమునందును. పద్మమాలను గాని అడవిమల్లెల మాలనుగాని దానమిచ్చినచో చక్రవర్తియై సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును. వైశాఖమున మొగలి , మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని యనుగ్రహమున సుఖ భోగములనంది ముక్తి నందును. పోక చెక్కలను , సుగంధద్రవ్యమును , కొబ్బరి కాయలను దానమిచ్చినచో నేడు జన్మలవరకు బ్రాహ్మణుడై జన్మించి వేదపండితుడు , ధనవంతుడై యుండి యేడు తరములవారితో గలసి ముక్తినందును.
సద్బ్రాహ్మణుని యింటిలో విశ్రాంతి మండపమును కట్టించి యిచ్చినచో వాని పుణ్యము యింతయని చెప్పుటకు మాటలకందనిది సుమా. నీడనిచ్చు మండపము , నీడలోనున్న యిసుక తిన్నెలు , చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు , జనులకు ఉపకారము చేసినవారు లోకాధిపతులగుదురు.
మార్గమున తోట , చెరువు , నూయి , మండపము, వీనిని నిర్మింపజేసినవానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలని భయము లేదు. నూయి , చెరువు , తోట , విశ్రాంతి మండపము , చలివేంద్రము , పరులకుపయోగించు మంచి పనులు చేయుట , పుత్రుడు యివియేడును సప్తసంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలోనే యొకటి చేయకున్నను మానవునకు పుణ్యలోకప్రాప్తి లేదు.
సచ్చాస్త్రశ్రవణము, తీర్థయాత్ర , సజ్జన సాంగత్యము , జలదానము , అన్నదానము , అశ్వర్థరోపణము (రావి చెట్టును నాటుట) పుత్రుడు అను నేడును సప్తసంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. వందలకొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేనివానికి పుణ్యలోకప్రాప్తి లేకుండుటచే నతడు పైన చెప్పిన యేడు సంతానములలో యధాశక్తిగ వేనినైనను ఏ ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములనందవచ్చును. పుణ్యపాప వివేకములేని పశువులు , పక్షులు , మృగములు , వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోకప్రాప్తినందవు. కాని పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులి సద్ధర్మముల నాచరింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగును.
ఉత్తమములైన పోకచెక్కలు , కర్పూరము మున్నగు సుగంధద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నియు పోవును. తాంబూల దాత కీర్తిని ధైర్యమును , సంపదను పొందును. నిశ్చయము , రోగియైనవాడు తాంబూల దానము నిచ్చినచో రోగవిముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తినందును. వైసాఖమాసమున తాపహారకమైన తక్రమును(మజ్జిగ) దానమిచ్చినవాదు విద్యావంతుడు , ధనవంతుడు నగును. కావున వేసవి కాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమా. వేసవికాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగ నిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మపండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగయైన దప్పిక కలవానికి హితకరముగ నుండును. వైశాఖమాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యమెంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్ఠమైన బియ్యమును దాన మిచ్చినవారు పూర్ణాయుర్దాయమును , అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమునుపొందును. తేజోరూపమైన గోఘ్ర్తమును(ఆవునేయి) సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణుపదమును చేరుదురు.
విష్ణుప్రీతికరమైన వైశాఖమాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చినవారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున వసింతురు. పగటి యెండకు అలసినవానికి సాయంకాలమున చెరకు గడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యమనంతము. వైశాఖమాసమున సాయంకాలమున యెండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖమాసమున పానకముతో బాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములు హరించును. పుణ్యలోకప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరుమార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్లు మున్నగువానిని కలిపి చైత్రమాసము నందలి అమావాస్యయందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను.
*వైశాఖపురాణం మూడవ అధ్యాయం సంపూర్ణం*
🌷 *సేకరణ*🌷
🌹🕉️🌹🌹🕉️🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
వృద్ధాప్యం:-
*_చమకం యజుర్వేదంలోని శ్రీరుద్రంలో ఒక భాగం. చమకంలో ఒకచోట - ఈ విచిత్రమైన కోరిక ఉంది._*
*''వృద్ధం చమే, వృద్ధిశ్చమే'*'
*_ఇదేమిటి ? నాకు వృద్ధినియ్యి అన్నంతవరకూ బాగానే వుంది. నాకు వృద్ధాప్యాన్ని యివ్వమని అడుగుతాడేమిటి ? అని ఆశ్చర్యం. కోరికలనుంచీ, ఈ జీవితంలో సుఖాల నుంచీ బయటపడలేని జీవుడు -అలా బయటపడేసే మానసిక స్థితిని, ఆ దశని ప్రసాదించు స్వామీ -అంటూ ఆ కోరికల వెల్లువలోనే ఒక విచిత్రమైన కోరికని జతచేశాడు._*
*_అన్ని కోరికలనుంచీ విముక్తం చేసే -లేదా విరక్తిని కలిగించే వృద్ధాప్యాన్ని ప్రసాదించు -అని వేడుకోవడం బహుశా ఏ మతంలోనూ ఏ భక్తుడూ ఏ దేవుడినీ యింత పరిణతితో, యింత గంభీరమైన కోరిక కోరలేదేమో !_*
*_''ఈ మనస్సు కోతి స్వామీ ! దానికి ఉన్న చాపల్యాలన్నీ తీర్చు. తప్పదు. చేసేదీ లేదు. కాని ఏదో ఒకనాడు ఈ చాపల్యాలన్నింటినీ వదులుకొనే దశనీ, స్థాయినీ, వయస్సునీ -వృద్ధాప్యాన్ని ప్రసాదించు'' అంటున్నాడు జీవుడు._*
*_వృద్ధాప్యం ఒక మజిలీ.._*
*_ప్రతీ వ్యక్తీ కోరుకున్నా కోరుకోక పోయినా తప్పనిసరిగా చేరుకునే మజిలీ. వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి, అలసిపోయిన అనుభవాలనీ, ఆరిపోయిన అనుభూతులనూ నెమరువేసుకునే చలివేంద్రం. వృద్ధాప్యం ఒక అవకాశం. వెనక్కి తిరిగి చూసుకుని చేసిన తప్పిదాలకు నవ్వుకుని, దాటిన అడ్డంకులను పరామర్శించి, ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు. ముసిలితనం కొడుకు కంటె ఒక అడుగు వెనక నడిపిస్తుంది. మనవరాలి భుజాన్ని ఆసరా చేసుకుంటుంది._*
*_జీవితమంతా కొరుకుడుపడని నిజాలతో ఆనందంగా రాజీపడేటట్టు చేస్తుంది. పిల్లలు ''నీకేం తెలీదు నాన్నా !'' అంటే కోపం రాదు. ఒక జీవితకాలాన్ని తెలీనితనానికి తాకట్టు పెట్టిన కొడుకుని చూసి నవ్వుకుంటుంది. తనకి తెలీదని పక్కకి తప్పించే తరాన్ని చూసి గర్వపడుతుంది. అవలీలగా అర్థం చేసుకుంటుంది. ''వాడికి తోచినట్టే చెయ్యనివ్వండి'' అనే భార్య హితవుకి గంభీరంగా తలవొంచుతుంది. ఏ విమర్శా అవమానం అనిపించదు. ఏ నిందకీ కోపం రాదు. వృద్ధాప్యాన్ని అందరూ గౌరవిస్తారు. నీ జీవితకాలంలో సాధనల్ని పక్కనపెట్టి కేవలం వయస్సు కారణంగానే పెద్దరికాన్ని అంగీకరిస్తారు. అదొక అంతస్థు._*
*_అతని హితవుని నలుగురూ వింటారు. నీ ఆలోచనని గౌరవిస్తారు. దాన్ని పాటించరని అర్థమవుతున్నా కోపం రాదు. వయస్సు అర్థం చేసుకునే సంయమనాన్ని నేర్పుతుంది._*
*_''మా రోజుల్లో...'' అని చెప్పుకోవడంలో చిన్న 'సాకు'ని వృద్ధాప్యం మప్పుతుంది. ''ఈ కాలం కుర్రాళ్లు...'' అన్న వెక్కిరింతకి అర్హతని సంపాదించి పెడుతుంది. తన గురించి తన పెద్దలూ అలనాడు -అలాగే అనుకొని ఉంటారని అప్పుడు జ్ఞాపకం వస్తుంది._*
*_వేసిన ప్రతీ అడుగూ తెలిసి వేసే నమ్మకాన్నిస్తుంది. చేసే ప్రతీ పనీ యిబ్బంది లేని, శ్రమ అనిపించని మార్గం వేపే ప్రయాణం చేయిస్తుంది. తన 'రేపు' క్రమక్రమంగా కురుచనయిపోతోందని అర్థమవుతూంటుంది. దక్కిన చిన్న తప్పుల్ని వృద్ధాప్యం భద్రంగా అలంకరించుకుంటుంది. ''మనకి చేతకాదు'' అని చెప్పడం పెద్ద అర్హతగా కనిపిస్తుంది. అసాధ్యానికి 'అనవసరం' అంటూ గడుసుదనం చిన్న ముసుగు వేస్తుంది. దానికి ఊతం వృద్ధాప్యం._*
*_జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు అర్థమవుతూంటాయి. ఇప్పుడా సమాధానాలకూ వేళ మించిపోయిందని అర్థమవుతుంది. ఈ సమాజంలో అవినీతి అనే కుళ్లు ఎప్పుడు తొలగుతుంది ? ప్రతీక్షణం దోపిడీకి గురవుతున్న ఈ పర్యావరణం ఒక్కసారి ఎదురు తిరిగితే ఏమవుతుంది ? ఏమయినా తనకేం బాధలేదు. ఆ సమయంలో తను ఉండడు. ఈ జీవిత నుంచి శలవు తీసుకోవడమే తనకి ఉపశమనం._*
*_దేవుడు ఎక్కడ ఉంటాడు ? ఎలా వుంటాడు ? మృత్యువు తరువాత ఏమవుతుంది ? సమాధానాలు అర్థమయే క్షణాలు దగ్గరవుతున్నాయి. చుట్టూవున్న జీవితాన్ని క్రమంగా ఖాళీ చేసుకుంటుంది వృద్ధాప్యం. చిన్నకేక తుళ్లిపడేటట్టు చేస్తుంది. చిన్న నిశ్శబ్దం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పటిలాగే తెల్లారి, వృద్ధులతో కలిసి నడిచి, రెండుముద్దల అన్నం తిని, అరగంట సేదతీరి, వేడి టీ తాగి, సాయంకాలం పార్కు బెంచీ దగ్గర ''ఈ దేశం తగలడిపోతోంద'ని తిట్టుకుని, శాంతపడి -కీళ్ల నొప్పులకు మాత్రలు మింగి, రాని నిద్రనీ, నిన్నటి జ్ఞాపకాలనీ నెమరు వేసుకోవడం -వృద్ధాప్యం వ్యసనం._*
*_ఇప్పుడు విచారం దగ్గరకు రాదు. వెళ్లిపోయిన హితులూ, సన్నిహితులూ దిగులుగా జ్ఞాపకం వస్తారు. ముగింపు భయపెట్టదు. ఎందుకంటే భయపడినా రాకతప్పదు కనుక. అన్నిటినుంచీ, అందరినుంచీ తనని కుదించుకుని -మెల్లగా అంతర్ముఖుడు కావడం వృద్ధాప్యం._*
*_ఇప్పుడు అన్ని దురదృష్టాలకూ కారణాలు అర్దమౌతాయి. చేసిన తప్పిదాలు, మాటతప్పిన కప్పదాట్లూ, మనసు నొప్పించిన చిన్న చిన్న జ్ఞాపకాల ముళ్లూ -అవన్నీ ఓ జీవితకాలం ఆలస్యంగా కళ్లముందు కదుల్తాయి. ఈ అనుభవాల్ని హెచ్చరికలు చెయ్యబోతే పిల్లలు వినరు. వినినట్టు నటిస్తారు. నటిస్తున్నారని తనకీ తెలుసు. విన్న తృప్తిని తానూ నటిస్తాడు. వారికీ వృద్ధాప్యం ఒకనాడు పాఠాలు చెప్తుందని తెలుసు. కాని వృద్ధాప్యం ఒక వరమని ఇప్పుడు చెప్పి ఒప్పించలేడు. వారు ఒప్పుకునే వేళకి తను ఉండడు.
జీవితం ఎంత విచిత్రం ! నవ్వుకుంటాడు. ఆ నవ్వు ఖరీదు ఒక జీవితం.'చమకం' ఏ రుషి, ఏ మహానుభావుడు ఎప్పుడు సృష్టించారో -ఎంత ముందుచూపు, ఎంత వినయసంపద, జీవుని నిస్సహాయత, నిర్వేదం -అందులో నిక్షిప్తమయివుందో -ఆనాటి కోరిక సంపూర్ణమయిన స్వరూపంతో కళ్లముందు దర్శనమిచ్చేనాటికి -తాను జీవితమంతా కోరుకున్న 'వృద్ధాప్యం' తనని ఆవరించుకుని ఉంటుంది. ఈ దేశపు వేద సంపద, సాంస్కృతిక వైభవం, జాతి దర్శనం అపూర్వం, అనన్యసామాన్యం._*
*_చమకంలో 'వృద్ధం చమే' అనే ఒక్క కోరికా ఈ జాతినీ, మతాన్నీ, ఆలోచనా స్రోతస్సునీ అత్యద్భుతంగా ఆవిష్కరించే అభిజ్ఞ. వరం. భగవంతుడిని కోరడంలోనే భగవంతుడు ప్రసాదించిన తన ఆలోచనా పరిణతిని అలంకరించే భగవద్దత్తమైన ఆశీర్వాదం. అదీ వృద్ధాప్యం !!_*
*_రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ..._*