[11/10, 3:09 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 18 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu
భీష్ముడు రోజూ యుద్ధం చేసేవాడు. అనంతరము శిబిరమునకు వచ్చేవాడు. దుర్యోధనుడు వచ్చి ‘నీవు ఎంతో గొప్పవాడివని యుద్ధంలో దిగాను. ఎంతమందిని చంపావు? ఏమి చేశావు? నువ్వు తలుచుకుంటే ఆర్జునుడిని చంపలేవా? నువ్వు కావాలని పాండవులను వెనక వేసుకు వస్తున్నావు. నువ్వు పాండవ పక్షపాతివి. అని సూటీపోటీ మాటలతో ములుకులతో పొడిచినట్లు మాట్లాడేవాడు. పాపం భీష్ముడు, ఆ వయస్సులో అన్నిమాటలు విని ఒకరోజు దుర్యోధనునితో ‘దుర్యోధనా! ఇవాళ యుద్ధంలో భీష్ముడు అంటే ఏమిటో చూద్దువు కాని!’ అని మండలాకారమయిన ధనుస్సును పట్టుకున్నాడు.
ఆ రోజు భీష్ముడు వేసిన బాణములు కనపడ్డాయి తప్ప భీష్ముడు కనపడలేదు. కొన్నివేల మందిని తెగటార్చాడు. కురుక్షేత్రం అంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు, చేతులు, ఏనుగులతో నిండిపోయింది. ఆయన యుద్ధమునకు పాండవులు గజగజ వణికి పోయారు. అర్జునుడిని భీష్ముని మీద యుద్ధమునకు పంపించారు. అర్జునుడు యుద్ధమునకు వచ్చాడు. భీష్మునికి సర్వ సైన్యాధిపతిగా అభిషేకం చేశారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారధ్యం చేస్తున్నాడు. ఆయన యుద్ధంలో తన చేతితో ధనుస్సు పట్టనని ఏ విధమయిన అస్త్ర శస్త్రములను పట్టాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ విషయమును దూతలు వచ్చి భీష్మునికి చెప్పారు. భీష్ముడు ‘సర్వ సైన్యాధిపతిగా నేనూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇవాళ కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తాను’ అన్నాడు.
కృష్ణుడు పరమాత్మని భీష్ముడికి తెలుసు. కృష్ణునితో అస్త్రం పట్టిస్తాను అన్నాడు. ఈశ్వరుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? భక్తుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఆరోజు భీష్మాచార్యులతో చేసిన యుద్ధంలో అర్జునుడు ఎన్ని ధనుస్సులు తీసుకున్నా విరిగిపోయాయి. ఇంత సవ్యసాచి, ఎందుకూ పనికిరాకుండా పోయాడు. భీష్ముడు కొట్టిన బాణములకు కృష్ణ పరమాత్మ కవచం చిట్లిపోయింది.
కృష్ణుని మోదుగచెట్టును కొట్టినట్లు కొట్టేశాడు. కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. అర్జునుని శరీరంలోంచి నెత్తురు కారిపోతున్నది. కృష్ణుడు తాను చేసిన ప్రతిజ్ఞను మరచిపోయి భీష్ముడిని చంపి అవతల పారవేస్తానని తన చక్రం పట్టుకుని రథం మీద నుండి క్రిందికి దిగిపోయాడు. భీష్ముడు తన కోదండమును పక్కనపెట్టి కృష్ణుడికి నమస్కరించాడు.
పదిరోజుల యుద్ధం పూర్తయిన తరువాత ధర్మరాజుగారు కృష్ణుడిని పిలిచి ‘పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంక మనం యుద్ధం చేయలేము. ఆయన సామాన్యుడు కాదు అరివీర భయంకరుడు. ఆయనను యుద్ధం నుండి ఆపడం ఎలా? అని కృష్ణ పరమాత్మని అడిగాడు. కృష్ణ పరమాత్మ అన్నారు ‘దీనికి ఒక్కటే పరిష్కారం. నీవు నీ సోదరులతో కలిసి భీష్ముని శిబిరమునకు వెళ్ళి నమస్కారం చేసి ఆయననే అడుగు. నేను మీతో వస్తాను పదండి’ అన్నాడు.
అందరూ కలిసి భీష్ముని వద్దకు వెళ్ళారు. ధర్మరాజుగారు వెళ్ళి నమస్కారం చేస్తే భీష్ముడు ‘ధర్మజా ! ఇంత రాత్రివేళ పాదచారివై ఎందుకు వచ్చావు? మిమ్మల్ని సమర్థిస్తూ యుద్ధం చేయమనడం తప్ప ఇంకేదయినా కోరుకో’ అని చెప్పాడు. ధర్మరాజు ‘తాతా ! నేను ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు. నువ్వు అసలు ఎలా మరణిస్తావు తాతా?’ అని అడిగాడు. భీష్ముడు ఒక నవ్వు నవ్వి ‘నా చేతిలో ధనుస్సు ఉన్నంత కాలం నేను మరణించను. మనవడు అర్జునుని ప్రజ్ఞచూసి అతను వేసిన బాణములకు పొంగిపోయాను. నా ధనుస్సును కొన్ని సందర్భములలోనే ప్రక్కన పెడతాను. రథం మీద స్త్రీవచ్చి బాణం వేస్తే, ఎవరిదయినా పతాకం క్రిందికి జారిపోతే, వెన్నిచ్చి పారిపోతున్న వానితో నేను యుద్ధం చేయను. ఆడదిగా పుట్టి మగవానిగా మారిన వాడు యుద్ధానికి వస్తే వానితో నేను యుద్ధం చెయ్యను. ఇందులో స్త్రీని పెట్టుకుని యుద్ధానికి వచ్చే అవలక్షణం మీలో లేదు. మీరు నాకు వెన్నిచ్చి చూపించి పారిపోరు. మీలో ఎవరి పతాకము క్రిందకు జారిపోదు. మీకు ఉన్న అవకాశం ఒక్కటే. మీ పక్షంలో నా మరణం కోసం తపస్సు చేసిన శిఖండి ఉన్నాడు. శిఖండిని అర్జునుని రథమునకు ముందు నిలబెట్టండి. శిఖండి బాణములు వేస్తే నేను ధనుస్సు పక్కన పెట్టేస్తాను. ధనుస్సు పక్కన పెట్టిన పిదప మరల నేను బాణం వెయ్యను. వెనకనుండి అర్జునునితో బాణపరంపరను కురిపించి, నా శరీరమును పడగొట్టండి’ అని చెప్పాడు. పాండవులు ‘అలాగే తాతా’ అని చెప్పి వెళ్ళిపోయారు.
శిబిరములోకి వెళ్ళిన తరువాత అర్జునుడు ఎంతగానో దుఃఖించాడు. ‘మహానుభావుడు! తండ్రి లేక మేము ఏడుస్తుంటే ఆ రోజుల్లో నాన్నా అని మేము ఎవరిని పిలవాలో తెలియక కౌరవులు మమ్మల్ని బాధపెడుతుంటే మాపట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరకు వెళ్ళి మేము నాన్నని పిలిస్తే నేను నాన్నను కాను నేను తాతనని చెప్పి ఒడిలో కూర్చోపెట్టుకుని మాకు గోరుముద్దలు తినిపించాడు. మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. సర్వకాలములయందు మా ఉన్నతిని కోరాడు. మాకు ఆశీర్వచనం చేశాడు. మాకు విలువిద్య నేర్పాడు. అంతటి ధర్మమూర్తియై తన వంశమును చూసుకోవాలని ఇంతకాలం నిలబడి పోయాడు. సవ్యసాచియై గాండీవం పట్టుకుని, శిఖండిని అడ్డుపెట్టుకుని ఆయన మీద బాణ పరంపర కురిపిస్తుంటే, ఆయన ఒంట్లోంచి నెత్తురు కారిపోతుంటే నేను కొట్టగలనా అన్నయ్యా?’ అని అడిగాడు. కృష్ణుడు ‘కొట్టక తప్పదు ధర్మం కోసం కొట్టవలసిందే. నీవు కొట్టు’ అన్నాడు.
యుద్ధమునకు శిఖండిని ఎదురుపెట్టి తీసుకువచ్చారు. భీష్ముడు తన ధనుస్సును పక్కన పెట్టేశాడు. శిఖండి భీష్ముని మీదకు ఒకేసారి నూరుబాణములు వేశాడు. భీష్ముని కవచం పిట్లి పోయింది. అర్జునుడు ఆ రోజు వేసిన బాణ పరంపరకు అంతేలేదు. భీష్ముని శరీరములో బొటనవేలంత సందు కూడా లేకుండా ఆయనను బాణములతో కొట్టాడు. చుట్టూ బాణ పంజరమే! మధ్యలో భీష్ముడు ఉన్నాడు. అన్ని వైపులనుంచి నెత్తురు కారిపోతోంది. వీపు చూపించలేదు. ఒక్క తలవెనక మాత్రం బాణములు తగలలేదు. ఒంటినిండా బాణపరంపరను వేసిన తరువాత సూర్యుడు అస్తమిస్తున్న సమయములో భీష్ముడు రథం మీదనుంచి పడిపోయినపుడు ఆయన శరీరము భూమికి తగలలేదు. బాణములతో పడిపోయి ఉండిపోయాడు. యుద్ధం ఆపి అందరు పరుగు పరుగున భీష్ముని దగ్గరకు వచ్చారు. భీష్ముడు ‘నాపని అయిపోయింది. నేను స్వచ్ఛంద మరణమును కోరాను. ఇంకా బ్రతికే ఉన్నాను. ఉత్తరాయణం వరకు నా శరీరమును విడిచిపెట్టను. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తరువాత రథసప్తమినాడు రథం ఉత్తరదిక్కుకు తిరిగాక, ఏకాదశి ఘడియలలో నా ప్రాణం విడిచి పెడతాను’ అని అర్జునుని పిలిచి, ‘నా తల వెనక్కి వ్రేలాడి పోతున్నది. నా మర్మ స్థానములు అన్నీ కదిలిపోతున్నాయి. బాణములు కొట్టేయడం వల్ల నెత్తురు ఓడిపోతున్నది. నాకు తలగడ అమర్చు’ అన్నాడు. దుర్యోధనాదులు వెంటనే తలగడలు పట్టుకు వచ్చారు. ‘ఈ తలగడలు కాదు. నాకు కావలసింది యుద్ధ భూమియందు పడుకున్న వానికి బాణములతో తలగడను ఏర్పాటు చేయాలి. అటువంటి తలగడను అర్జునుడు ఏర్పాటు చేస్తాడు’ అని భీష్ముడు అంటే అర్జునుడు బాణములతో తలగడను ఏర్పాటు చేశాడు. ఆ తలగడను ఏర్పాటు చేసుకుని ‘నేను ఈ యుద్ధభూమి యందే పడి ఉంటాను. ఎవరూ నా వైపు రాకుండా నా చుట్టూ కందకం తవ్వండి’ అని కందకం తవ్వించుకుని ఆ భూమిమీద పడి ఉండిపోయాడు.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
[11/10, 3:09 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 17 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu
ఒకచోట అంబ ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తపస్సు చేసిందని పేర్కొనడం జరిగింది. స్కందుడు ప్రత్యక్షమై ‘ఏమిటి నీ కోరిక’ అని అడిగాడు. ఆమె ‘భీష్ముడిని నిగ్రహించాలి’ అని చెప్పింది. ఆయన ‘అది నేను చెప్పలేను. భీష్ముడికి వరం ఉన్నది. చేతిలో ధనుస్సు ఉండగా ఆయనను ఎవరూ చంపలేరు. పైగా ఆయన మహాధర్మజ్ఞుడు. నేను నీకొక పుష్పమాలను ఇస్తాను. ఈ పుష్పమాల మెడలో వేసుకొని ఎవరు యుద్ధం చేస్తే వారు భీష్ముడి మీద గెలుస్తారు’ అని ఆమెకు ఒక పుష్పమాలను ఇచ్చాడు. మెడలో ఈ పుష్పమాల వేసుకుని భీష్ముడితో యుద్ధం చేయమని ఆమె ఎందరో రాజులను అడిగింది. వాళ్ళు ‘మహాధర్మాత్ముడయిన భీష్మునితో మేము ఎందుకు యుద్ధం చేయాలి? ఆయనను ఎందుకు సంహరించాలి? ఆ మాలను మేము వేసుకోము. ఆయనతో యుద్ధం చేయము’ అన్నారు. ఆమె మా మాలను ద్రుపద రాజుగారి ఇంటి రాజద్వారము మీద వేసి మళ్ళీ తపస్సు చేసింది. ఈసారి రుద్రుడు ప్రత్యక్షమయ్యి ఏమికావాలి? అని అడిగాడు. అంటే ‘భీష్ముడిని సంహరించాలి’ అన్నది. రుద్రుడు ‘నీకు ఈ జన్మలో ఆ కోరిక తీరదు. వచ్చే జన్మలో నీకోరిక తీరుతుంది. నీ శరీరము విడిచిపెట్టి వేరే జన్మ తీసుకోమ' ని చెప్పాడు. ఆమె యోగాగ్నిలో శరీరమును వదిలివేసి మరల పుట్టింది.
ఆమె స్త్రీగా జన్మించింది. ఆడదయి పుడితే భీష్ముడు యుద్ధం చేయడు. మగవాడిగా మారాలి. మళ్ళీ తపస్సు చేసి మగవానిగా మారింది. శిఖండి అని పేరు పెట్టారు. శిఖండి వెనుక అంత కథ ఉన్నది. శిఖండి ద్రుపదుని కుమారుడిగా జన్మించాడు. జన్మించి పెరిగి పెద్దవాడవుతున్నాడు. పాండవపక్షములో చేరాడు. మహానుభావుడు భీష్ముడు తన జీవితములో ఎన్నో అగ్నిపరీక్షలను ఎదుర్కొన్నాడు. ఇంత కష్టపడి విచిత్ర వీర్యునికి అంబిక, అంబాలికలను ఇచ్చి వివాహం చేశాడు. వివాహమయిన కొంతకాలమునకు విచిత్ర వీర్యునికి క్షయవ్యాధి వచ్చి చచ్చిపోయాడు. అంబిక, అంబాలిక విధవలు అయిపోయారు. దాశరాజు ఏ సింహాసనం కోసమని సత్యవతీ దేవికి పుట్టిన కొడుకులకు రాజ్యం ఇమ్మన్నాడో ఆమె కొడుకులు, మనవలు లేక వంశం ఆగిపోయింది. సత్యవతీదేవి భీష్ముడిని పిలిచి ‘భీష్మా! వంశము ఆగిపోయింది. యుగధర్మము అనుసరించి ఇది తప్పు కాదు. నా కోడళ్ళయిన అంబిక, అంబాలికలయందు వాళ్ళు ఋతుస్నానము చేసిన తరువాత నీవు వారితో సంగమిస్తే మరల వంశము నిలబడుతుంది. వంశము కోసమని అలా చేయడములో దోషం లేదు.
భీష్ముడు –‘అమ్మా! నేను ఆనాడు ప్రతిజ్ఞచేశాను. నేను బ్రహ్మచర్య నిష్ఠయందు ఉన్నవాడిని. వంశము లేకపోతే నేను ఏమీ చేయలేను. నేను మాత్రం అలా ప్రవర్తించను. దీనికి ఒక్కటే పరిష్కారం ఎవరైనా శరీరమునందు అటువంటి కోర్కె లేని ఒక బ్రాహ్మణుని, ఒక బ్రహ్మజ్ఞానిని వేడుకో’ అన్నాడు. సత్యవతీ దేవి వ్యాసుడిని ప్రార్థన చేసింది. వ్యాసుల వారి ద్వారా పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు జన్మించడం జరిగింది. ధృతరాష్ట్రునకు దుర్యోధనాదులు జన్మించారు. పాండురాజుకి పాండవులు జన్మించారు. పాండురాజు మరణించాడు. ఇంతమందిని సాకుతూ తాతగారయి గడ్డాలు నెరిసిపోయి మహాధర్మజ్ఞుడయి భీష్ముడు వీళ్ళందరికీ ద్రోణాచార్యులను గురువుగా పెట్టి విలువిద్య నేర్పించి ఆ వంశమును సాకుతూ నడిపిస్తున్నాడు.
ఆయన కళ్ళముందే పాండురాజు పుత్రులకు, ధృతరాష్ట్రుని పుత్రులకు మధ్య కలహం బయలుదేరింది. ఇంత ధర్మం తెలిసిన భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవపక్షమునకు వెళ్ళలేదు. దుర్యోధనుని పక్షంలో ఉండిపోయారు. అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? నిజంగా భీష్ముడే పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నానని అంటే అసలు కురుక్షేత్ర యుద్ధం లేదు. దుర్యోధనుడు భీష్ముడిని, కర్ణుని ఈ ఇద్దరిని చూసుకుని యుద్ధమునకు దిగాడు. సర్వసైన్యాధిపత్యం ఇచ్చేప్పుడు వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చి భీష్ముడు బ్రతికి ఉన్నంతకాలం తాను యుద్ధభూమికి రానన్నాడు కర్ణుడు.
భీష్ముడు ఎన్నోమార్లు ‘అర్జునుని ఎవరూ గెలవలేరు. పాండవుల పట్ల ధర్మం ఉన్నది వాళ్ళు నెగ్గుతారని చెప్పాడు. భీష్ముడిని దుర్యోధనుడు పట్టుకుని వ్రేలాడవలసిన అవసరం ఇవ్వకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి ఉంటే కురుక్షేత్రం జరిగేది కాదు కదా! భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు? అలాంటి భీష్ముడిని ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటులేకుండా అన్ని బాణములతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? ‘భీష్మం చ ద్రోణం చ జయద్రథం చ’ అని పరమాత్మ వాళ్ళందరినీ తానే సంహరిస్తున్నానని గీతలో చెప్పాడు. భీష్ముడిని అన్ని బాణములతో ఎందుకు కొట్టాడు? ఈ రెండూ భీష్మాచార్యుల వారి జీవితమునకు సంబంధించి చాలా గహనమయిన ప్రశ్నలు.
అలా కొట్టడానికి ఒక కారణము ఉన్నది. ప్రపంచములో దేనికయినా ఆలంబనము ధర్మమే! భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు. అదికూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మరాజుకి, శకునికి మధ్య ద్యూతక్రియ జరుగుతున్నప్పుడు శకుని మధువును సేవించి ఉండడంలో మరచిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు. ధర్మరాజుని నిన్ను నీవు పణంగా పెట్టుకో అన్న తరువాత ధర్మరాజు ఓడిపోయాడు. ఓడిపోయిన తరువాత శకునికి గుర్తువచ్చింది ‘నీ భార్య ద్రౌపది ఉన్నది కదా! ఆవిడని ఒడ్డు’ అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకుని దాస్యంలోకి వెళ్ళిపోయాడు. ధర్మరాజు ‘దౌపదిని ఒడ్డడములో ఏదైనా దోషం ఉంటే అది ఒడ్డమన్న శకునికి వెళుతుంది కానీ దోషం నాకు పట్టదు. నాకు శకుని యజమాని. నేను అయన దాసుడిని. దోషం ఆయనకీ వెడుతుంది’ అనుకుని ధర్మరాజు ద్రౌపదికి ఒడ్డి ఓడిపోయాడు. ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వల అయిన ద్రౌపదీ దేవిని సభలోకి ఈడ్చుకు వచ్చి వలువలు ఊడతీస్తుంటే ఆవిడ ‘ఈ సభలో భీష్మ ద్రోణులు ఉన్నారు. వాళ్లకి ధర్మం తెలుసు. నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా? ధర్మం చెప్పవలసినది’ అని ఒక ప్రశ్న అడిగింది. భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి ధర్మరాజు చేసినది దోషమే – ఓడిపోయిన రాజుకి ద్రౌపదిని ఒడ్డే అధికారం లేదని ఉంటే వెంటనే మహాపతివ్రత అయిన ద్రౌపదీదేవి శపిస్తే, ధృతరాష్ట్రుని సంతానం అంతా నశించిపోతారు. ఆయన వాళ్ళందరినీ కష్టపడి పోషించాడు. తన కళ్ళ ముందు పోతారు. పోనీ చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతికి ఒక మహా పతివ్రతకి వలువలు వలుస్తున్నారు. ఏమి చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా! తెలియక చెప్పాడా! అన్నది తెలియకుండా ఒక మాటని ఊరుకున్నాడు. 'ధర్మరాజు అంతటి వాడే నేను ఓడిపోయాను అని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మమన్నది చెప్పడము కష్టం' అన్నాడు. అలా ధర్మం తెలిసి చెప్పకపోవడము కూడా ధర్మాచరణము నందు వైక్లబ్యమే! ఈ దోషమునకు కొట్టవలసి వచ్చి బాణములతో కొట్టారు. ధర్మాచరణము అంటే ఎంతో గహనంగా ఎంతో కష్టంగా ఉంటుంది.
ఇంతటి మహానుభావుడు కురుక్షేత్రంలో యుద్ధమునకు వచ్చాడు. దుర్యోధనునితో ఒకమాట చెప్పాడు. ‘నీవు పాండవులవైపు ఉన్న వాళ్ళలో ఎవరిని సంహరించమన్నా సంహరిస్తాను. పాండవుల జోలికి మాత్రం వెళ్ళను’ అన్నాడు. యుద్ధభూమికి వచ్చిన తరువాత భీష్ముడు సర్వ సైన్యాధిపతిగా నిలబడిన ధర్మరాజు తన కవచం విప్పేసి, పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి నమస్కరించాడు. ‘తాతా! మేము నీవు పెంచి పెద్ద చేసిన వాళ్ళం. మాకు విజయం కలగాలని ఆశీర్వదించు’ అన్నాడు.
భీష్ముడు ‘నీవు ఇలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాడిని. నీ గౌరవమునకు పొంగిపోయాను. మీ అయిదుగురి జోలికి రాను’ అన్నాడు. అప్పటికి మహానుభావుడు వృద్ధుడయిపోయాడు. తన కళ్ళ ముందు తనవాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. తనే ఒక పక్షమునకు సర్వసైన్యాధిపతియై నిలబడ్డాడు. ధర్మరాజు ‘తాతా! నీకు స్వచ్ఛందమరణం వరం ఉంది. యుద్ధంలో నువ్వు ధనుస్సు పట్టగా ఎవ్వరూ కొట్టలేరు. నిన్ను యుద్ధంలో ఎలా పడకొట్టడము’ అని చేతులు నులిమాడు. భీష్ముడు ‘ఇప్పుడు ఆ విషయం అడుగకు. కొన్నాళ్ళు పోయాక చూద్దాం’ అన్నాడు భీష్ముడు. ‘మా యోగక్షేమములు మాత్రం దృష్టిలో పెట్టుకో తాతా’ అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
[11/10, 3:09 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 19 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu
కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. ధృతరాష్ట్రుని పక్షం అంతా ఓడిపోయింది. పాండవపక్షం గెలిచింది. భీష్ముడు అంపశయ్య మీదనే ఉన్నాడు. మహానుభావుడికి ఒకనాడు దాహార్తి కలిగి ‘దాహం వేస్తోంది’ అన్నాడు. నీళ్ళు పట్టుకు వచ్చారు. అంపశయ్య మీద పడుకున్న వాడు లౌకికమయిన జలములు త్రాగడు. ఏ నీళ్ళు ఇవ్వాలో అర్జునుడికి తెలుసు. ‘అర్జునా! మంచినీళ్ళు ఇయ్యి’ అన్నాడు. అర్జునుడు పర్జన్యాస్త్రమును ప్రయోగించాడు. ప్రయోగిస్తే భూమిలోనుండి అమృతోదకం పైకిలేచి భీష్ముని నోటిలో పడిటే ఆ నీటిని త్రాగాడు. భీష్ముడు అంపశయ్య మీద ఉండగా కృష్ణ భగవానుడు ఏకాదశి ఘడియలు దగ్గరకు వస్తున్నాయని ధర్మరాజుతో ‘భీష్ముడు అక్కడ అంపశయ్య మీద ఉన్నాడు. నీవు బయలుదేరి వెళ్ళి దర్శనము చేసుకుని, ఆయన దగ్గర ధర్మములు తెలుసుకో. అటువంటి మహానుభావుడు వెళ్ళిపోతే మరల ధర్మం చెప్పేవాడు లేడ’ ని చెప్పాడు. భీష్ముడు చెప్పిన ధర్మములు భారతములో చెప్పారు తప్ప భాగవతములో చెప్పలేదు. ధర్మరాజాదులు భీష్ముని దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన దగ్గర అన్నీ విన్నారు. భాగవతములో మాత్రం వ్యాసుడు ఉత్తరగర్భం మీదికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఉత్తర గర్భమును కృష్ణుడు రక్షించాడు అనే మాటను ఉపపాండవులు అశ్వత్థామ చేత సంహరింపబడ్డారు అనేమాటను విని భీష్ముడు కాలమును ముందు స్తుతి చేస్తాడు.
పదినెలలు పూర్తయిన పిమ్మట ఉత్తరగర్భమునుండి పరీక్షిన్మహారాజు ఉదయించాడు. యధార్థమునకు అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినప్పుడే పాండవసంతతి అంతరించిపోయింది. ఆ వంశము ఆక్కడితో ఆగిపోయింది. బ్రహ్మాస్త్రమునకు ఉండే గౌరవం అటువంటిది. ధర్మరాజు అంతటివాడు తనకు వంశములేదని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా, తనను తాను రక్షించుకోవడం చేతకాని వాణ్ణి, గర్భస్థమయిన పిండమును రక్షించాడు. కృష్ణభగవానుని అనుగ్రహము చేత బ్రతికింప బడి బయటకు వచ్చిన పిల్లవాడు కనుక అతనికి ‘విష్ణురాతుడు’ అని పేరు పెట్టారు.
పరీక్షిత్తు పుట్టిన తరువాత ఒక గమ్మత్తు జరిగింది. ఒకసారి ధర్మరాజుగారు సభతీర్చి ఉన్నారు. పరీక్షిత్తును ఎంతో ప్రేమతో ఆయన తన తొడమీద కూర్చోబెట్టుకుని సింహాసనం మీద కూర్చుని ఉండేవారు. ఆ పిల్లవాడు అందరినీ పరీక్షగా చూస్తూ ఉండేవాడు. ప్రతివాడిని ఆ పిల్లవాడు ఎందుకలా చూస్తున్నాడా అని పాండవులు సందేహించారు. అలా ఎందుకు చూస్తాడు అనగా ‘మా అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మాస్త్రమువచ్చి అగ్నిహోత్రమును వెదజల్లుతుంటే ఆ రోజున నేను కాలిపోబోతూ ఉన్న సమయములో ఎవరో ఒక అంగుష్ఠమాత్రమయిన మూర్తి శంఖ చక్ర గద పద్మములతో వచ్చి నన్ను రక్షించాడు. ఆయన విశ్వమంతా ఉన్నాడని మా పెదతాతగారు చెప్తున్నారు. ఆయన ఎక్కడయినా కనపడతాడా’ అని సభలో చూసేవాడు. విష్ణురాతుడు అని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి ఆ పిల్లాడిని ‘పరీక్షిత్’ అని పిలిచారు. పరీక్షిత్ పుట్టగానే ధర్మరాజు జ్యోతిష్కులను పిలిపించాడు. వాళ్ళు పిల్లవాని జాతకము చూసి ‘ఇతడు రామచంద్రమూర్తి వంశమునకు మొదటివాడైన ఇక్ష్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు. శిబిచక్రవర్తి వలె దానములు చేస్తాడు. రామచంద్రమూర్తి గురువులను, బ్రాహ్మణులను ఎలా గౌరవించాడో అలా గౌరవించి సేవిస్తాడు. అర్జునుడు ఎలా బాణములను విడిచి పెడతాడో అలా బాణములను విడిచి పెడతాడు. కార్తవీర్యార్జునుడు వేయిచేతులతో ధనుస్సును పట్టుకుని బాణములను వదిలితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధనైపుణ్యముతో ఉంటాడు. ఈ పిల్లవాడు చిట్టచివర శరీరము విడిచి పెట్టవలసిన సమయము ఆసన్నమయిన నాడు ఆవుపాలు పితికినంత సేపు తప్ప ఎక్కడా నిలబడని బ్రహ్మజ్ఞాని, ఈ పిల్లవాడి ఆర్తిచూసి కృష్ణ భగవానుని పాదములయందు బుద్ధిరమిస్తూ ఉండగా శరీరమును విడిచిపెట్టి, మోక్షమును పొందుతాడు. మహోత్కృష్టమయిన వ్యక్తి మీ వంశములో పుట్టాడు’ అని చెప్పారు.
ధర్మరాజు గారు పొంగిపోయారు. ‘నేను కురుక్షేత్ర యుద్ధం చేశాను కొన్ని కోట్లమందిని తెగటార్చాను. ఎందరో మరణించారు. ఈ పాపము నన్ను కాల్చకూడదు. పాపము పోగొట్టుకోవడము కోసమని అశ్వమేధయాగం చేయాలి. అశ్వమేధయాగమునకు కావలసినటువంటి సంభారములు, బంగారము ఎక్కడి నుండి వస్తాయి?’ అని భీమార్జునులను పిలిచి అడిగాడు. భీమార్జునులు ‘అన్నయ్యా! దాని గురించి నువ్వు బెంగ పెట్టుకోవద్దు. ఇంతకు పూర్వం ఉత్తర భారతదేశంలో మరుత్తనే రాజు అశ్వమేధయాగం చేసి తత్సంబంధమయిన కాంచనపాత్రలు మొదలయిన వాటిని విడిచిపెట్టాడు. వాటిని తెచ్చుకోవడానికి రాజుకు పరిపాలనాధికారము ఉన్నది కనుక ఆ ప్రాంతం మన పరిపాలిత ప్రాంత పరిధిలోకి వస్తుంది. ఆ సంపదను సంభారములను మేము తీసుకువస్తాము. నీవు అశ్వమేధయాగము చేయవలసింది’ అన్నారు.
ధర్మరాజు గారు మూడు అశ్వమేధయాగములు చేశారు. ఆ యాగములకు కృష్ణ పరమాత్మను ఆహ్వానించి సమున్నతముగా సత్కరించారు. కృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడు. కృష్ణపరమాత్మ ద్వారకానగరమునకు వెళ్ళిపోయారు. ఆయనను ఈ హస్తినాపురములో ఉన్నవాళ్ళు స్తోత్రం చేశారు ద్వారకానగరములోని ప్రజలు స్తోత్రం చేశారు. హస్తినాపురములో అందరూ సంతోషముగా కాలం గడుపుతున్నారు.
విదురుని ఆగమనము
ఒకరోజున విదురుడు వచ్చాడు. ధర్మరాజు ఎదురువెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్య పాద్యములు ఇచ్చి తీసుకొని వచ్చాడు. విదురుడు చక్కటి భోజనము చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్న పిమ్మట ధర్మరాజు ఆయన పాద సంవాహనం చేస్తూ కాళ్ళదగ్గర కూర్చుని మహానుభావా ! మీరు చాలాకాలమునకు తిరిగి వచ్చారు ఇది మా అదృష్టం. మీరు మేము చిన్నపిల్లలుగా ఉండగా మా తండ్రిగారు మరణిస్తే, ఒక పక్షి తన పిల్లలను ఎంతో జాగ్రత్తగా రెక్కలక్రింద పెట్టుకుని కాపాడి ఆహారమును నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు. దుర్యోధనుడు లక్కఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్చేదద్దామని అనుకున్నప్పుడు, అనేక ప్రయోగములు చేసి మమ్మల్ని సంహరించాలని అనుకున్నప్పుడు మా రక్షణ కోరుకున్నారు. మీరు ఎన్నో క్షేత్రములను పర్యటించారు. మీరు ఈ తీర్థములకు వెళ్ళారో, ఏమి చూసారో మాకు చెప్పవలసింది’ అని అడిగాడు.
తీర్థయాత్ర చేసివచ్చిన వాడి విషయములో ఎలా ఉండాలో భాగవతము చెప్తుంది. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడిపాదములకు నమస్కరిస్తే ఇవతలి వాడు తీర్థయాత్ర చేయకపోయినా అతనికి ఆయా క్షేత్రములలోని దేవతల అనుగ్రహము కలుగుతుంది. ధర్మరాజు మాటలను విని విదురుడు చాలా సంతోషించి ధర్మరాజుతో మాట్లాడి పంపిస్తాడు. భాగవతమును కొన్ని కోట్లజన్మల తరువాత మాత్రమే వింటారు. భాగవతము విన్నఫలితము వ్యర్థమై పోదు.
ధృతరాష్ట్రుని వానప్రస్థము
ధృతరాష్ట్రుని దగ్గరకు వెళతాడు విదురుడు. ధృతరాష్ట్రునితో ‘నామాట విని ఉత్తర క్షణములో లేచి ఉత్తరదిక్కుకి వెళ్ళిపో ఎవరికోసం చూడకు. ఇన్నాళ్ళు బ్రతికిన దుష్ట జీవితము చాలు. ఇప్పటికయినా నామాట విను. వెళ్ళిపోయి ఈశ్వరునియందు మనస్సు చేర్చి అందులో ప్రాణములను ఆహుతి చెయ్యి. అలా యోగమార్గంలో ఈశ్వరుడిని చేరు. లేకపోతే నీవు చేసిన పాపములకు ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది’ అన్నాడు.
ధృతరాష్ట్రుడు ‘గొప్పమాట చెప్పావు ! నిజమే ఇంకా నేను ఎవరికోసం బ్రతకాలి? భీముడు మొదలయిన వాళ్ళు పెడుతున్న ఈ నెత్తుటికూడు తిని ఇంకా సంతోషముగా బ్రతికేస్తున్నానా? ఛీ నాకు రోత పుట్టింది వెళ్ళిపోతున్నాను’ అని బయలుదేరి వెళ్ళేటప్పుడు గాంధారికి కూడా చెప్పలేదు. భర్త వెళ్ళిపోతున్నాడని గాంధారి పసిగట్టింది. ఆయనతో పాటు వెళ్ళిపోయింది. ప్రతిరోజూ ఉదయం ధర్మరాజుగారు స్నానానుష్ఠానము లన్నీ పూర్తి చేసుకున్న తరువాత వచ్చి పెదతండ్రిగారయిన ధృతరాష్ట్రుడికి, గాంధారి పాదములకు తల తాటించి నమస్కరించేవాడు. ఆరోజుకూడా ధృతరాష్ట్రుడికి నమస్కరించడానికి అంతఃపురమునకు వచ్చాడు. ఆయన కనపడక ‘నావల్ల ఏదో అపకారము జరిగి వుంటుంది. నా పెదతండ్రి అంధుడు, వృద్ధుడు. ఆయన బిడ్డలు అందరూ మరణించారు. వీళ్ళ వలన ఇంకా సుఖపడలేనని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిపోయాడో! నాకు చాలా బెంగగా ఉన్నది. గాంధారీమాత కూడా కనపడడము లేదు. అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను. నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు’ అని ధర్మరాజు అంతటివాడు ఏడ్చాడు.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
[11/10, 3:09 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 20 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu
ఉత్తరదిక్కుకు వెళ్ళిపోయిన ధృతరాష్ట్రుని గురించి ధర్మరాజు ఏడుస్తుంటే విదురుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళాడో నీకేమన్నా తెలుసా? అని విదురుని అడిగాడు. తప్పో ఒప్పో విదురుడు మంచివాడని ధృతరాష్ట్రునికి తెలుసు. అందరూ పడుకున్నాక ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిచి ‘నాకు నిద్ర పట్టడము లేదు. ఏదయినా మంచిమాటలు చెప్పు’ అనేవాడు. విదురుడు ‘నీకు ఎందుకు నిద్ర పట్టడము లేదు? దొంగలకి నిద్ర పట్టదు. నీవు దొంగవి. నీ తమ్ముడి రాజ్యం, నీ తమ్ముడి పిల్లల రాజ్యమును నీవు దొంగిలించాలని ఆలోచన చేస్తున్నావు’ అని తిట్టేవాడు. రాత్రి అన్నీ తిట్టేసిన తరువాత వాటిని విని ధృతరాష్ట్రుడు ‘నువ్వు బాగా తిట్టావు, నిజమే, నేను దొంగనే, ఏం చేస్తాను? నేను ఈ మోహములోనుంచి బయటకు రాలేను’ అనేవాడు. కనీసము ఒక మంచివ్యక్తి దగ్గర సత్సంగం చేసి తన తప్పును ఒప్పుకుని, బుర్రకి పట్టినా పట్టకపోయినా రాత్రి మంచిమాటలు వినేవాడు. ఈ పుణ్యమునకు విశ్వరూప సందర్శనములో కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రునికి కళ్ళను ఇచ్చి దర్శనము చేయించాడు. జీవితములో ఒక సత్పురుషుడి సహవాసము ఎంతో గొప్పది.
ధృతరాష్ట్రుడు, గాంధారి ఉత్తరదిక్కుకు వెళ్ళిపోతే విదురుడు ‘ఎటు వెళ్ళిపోయాడో నాకు కూడా తెలియదని కన్నుల నీరు పెట్టుకున్నాడు. ఆ సమయానికి నారదుడు వచ్చాడు. నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్కళ్యాణము. ఎందుకు ఏడుస్తున్నావు? అని ధర్మరాజుని అడిగితే పాపం మా పెదనాన్న గారికి కళ్ళు లేవు. ఉత్తరదిక్కుకి తపస్సుకని వెళ్ళిపోయారు. ఆయన ఏమి తింటారు? ఎవరు పెడతారు? అన్నాడు. నారదుడు ఈ పిచ్చి ప్రశ్న మానెయ్యి. ఎవరు పెడతారని అంటావేమిటి? రెండుకళ్ళు ఉన్న దానిని నాలుగుకాళ్ళు ఉన్నది తినేస్తోంది. నాలుగుకాళ్ళు ఉన్న దానిని రెండుకాళ్ళు ఉన్నవాడు బాణం వేసి కొట్టి చంపి తినేస్తున్నాడు. సత్పురుషులను పోషించడానికి చెట్లుకాయలు కాసి, పళ్ళుపండి అందవేమోనని క్రిందకు వంగి అందిస్తున్నాయి. కాయ కోసాక కొమ్మ పైకి వెళ్ళిపోతుంది. తనను నమ్ముకున్న వాడిని ఎలా పోషించాలో ఈశ్వరుడికి తెలుసు. మధ్యలో నీకు బెంగ ఎందుకు? అతను వెళ్ళవలసిన స్థితికి వెళ్ళాడు. మీ పెదనాన్న నడిచి ఉత్తరదిక్కున ఋషులు ఉండే ఆశ్రమమును చేరుకున్నాడు’ అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు విదురుడు అన్న మాటలకు చాలా వైరాగ్యమును పొందాడు.
ఇవాల్టి నుండి మీ పెదనాన్న ఇంద్రియములన్నింటిని వశం చేసుకొని అంతర్ముఖుడయి ప్రాణాయామం చేసి మనస్సును ఈశ్వరుడి దగ్గర పెట్టి శరీరమును శోషింపజేసి యోగాగ్నిని ప్రజ్వరిల్ల జేసి మూడు అగ్నిహోత్రములు ఏకకాలమునందు వెలిగితే అటువంటి యోగాగ్నియందు తన శరీరమును బూడిద చేస్తాడు. బ్రహ్మమునందు చేరిపోతాడు. యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి తన భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి తాను కూడా ప్రవేశించి శరీరము వదిలిపెట్టి ఇద్దరూ బ్రహ్మమును చేరిపోతారు. నువ్వు సంతోషించు’ అని చెప్పాడు. అర్జునుడు కృష్ణభగవానుడిని చూసి వస్తానని చెప్పి బయలుదేరాడు వెళ్ళి ఇప్పటికి ఏడునెలలు అయింది. ఇప్పటికీ రాలేదు ఎందుచేత రాలేదు? ద్వారకా నగరంలో ఏం జరిగింది?’ అని ఆశ్చర్యపోతూ విదురుడిని ‘మీరు తీర్థయాత్రలు చేసారు. అనేక క్షేత్రములకు వెళ్ళారు. ద్వారకానగరం ఎలా ఉన్నది? కృష్ణ భగవానుడు క్షేమమేనా?’ అని అడిగాడు.
కృష్ణుడు నిర్యాణం పొందాడని విదురునికి తెలుసు. కృష్ణ భగవానుని నిర్యాణం చెందాడన్న అప్రీతికరమయిన వార్త విదురుడు చెప్పలేదు. వాక్కుకి ఒక నియమం ఉన్నది.
‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం’
సత్యమయినా అప్రియమయిన మాట చెప్పకూడదు. కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంతతాను తెలుస్తుంది. తెలిసే లోపలే చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విదురుడు చెప్పలేదు.
ధర్మరాజు నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఈ దుర్నిమిత్తములు చూస్తే అవతార పురుషుడై, ధర్మమును నాలుగు పాదముల నడిపించి ఈ లోకమునంతటిని తన భుజములమీద పెట్టుకుని రాక్షససంహారం చేయించిన మహానుభావుడయిన కృష్ణుడు శరీరము విడిచి పెట్టి అవతారమును చాలించాడని నాకు అనిపిస్తోంది. అదే జరిగితే మేముకూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చిందని నాకు అనుమానముగా ఉన్నది’ అని బాధపడ్డాడు.
ఇంతలో అర్జునుడు వచ్చాడు. ధర్మరాజు ముందుగా కుశలం అడిగాడు. అర్జునుడు ‘అన్నయ్యా! మన నెచ్చెలి, మన దైవము, బంధువు, మన సమస్తమయిన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టేశాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా! ముల్లుకాలిలో గుచ్చుకుంటే అడవిలో వెడుతున్న వాడు ఆ ముల్లు తీయడానికి వేరొక ముల్లును చేతితో పట్టుకుని చర్మమును ఉత్తరించి, శరీరములో ఉన్న ముల్లు తీసేసిన తరువాత శరీరములో గుచ్చుకున్న ముల్లు, చేతిలో వున్న ముల్లు రెండు ముళ్ళను విసిరేసినట్లు శరీరముతో ఈ లోకములోనికి ప్రసంగముల యందు జీవితమును పాడుచేసుకుంటున్న వ్యక్తులను ఉద్ధరించడానికి తాను శరీరముతో వచ్చి ముల్లును ముల్లుతో తీసినట్లు తాను లోకమునకు గీత చెప్పి నడవడి నేర్పి మనలను ఉద్ధరించి అని అంటూ ఆశ్చర్యము ఏమిటి అంటే కృష్ణ నిర్యాణం కాగానే గోపబాలురు ఒకరినొకరు కొట్టుకొని అందరూ మరణించారు. కృష్ణుని భార్యలను రక్షిద్దామని నేను గోపాలురతో యుద్ధం చేయవలసి వచ్చింది. గోపబాలురకు పశువులను తోలడము తప్ప యుద్ధం తెలియదు. అటువంటి వాళ్ళు కేవలం కడవలో నీళ్ళు పట్టుకుని వెళ్ళే ఒక అబలను ఓడించ్నంత తేలికగా గాండీవము ఉన్న నన్నుఓడించి కృష్ణపత్నులను నావద్ద నుండి అపహరించి పట్టుకుపోయారు. అయితే నాకు ఒకటి అర్థం కాలేదు. నేను ఈ గాండీవము పట్టుకుని ఈ రథమునే కదా ఎక్కాను.
యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః!
తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ!!
ఏనాడు నీ జీవనరథం లోంచి కృష్ణుని తీసివేశావో ఆ నాటి నుంచి నీకు ఓటమి ప్రారంభం. ఎంతకాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావో అంతకాలం నీకు విజయ పరంపరే!
‘అన్నయ్యా! ఇవ్వాళ కృష్ణుడు లేడు. ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణమును గురిపెట్టి కదులుతున్న చేపను కొట్టాను. ఖాండవవనమును దహించడానికి ఆగ్నేయాస్త్రమును ప్రయోగించాను. పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యమును చీల్చి చెండాడాను. అన్ని చేయగలిగిన ఈ చేతులు ఇవాళ గోపబాలురతో యుద్ధము చేయలేకపోయాయి. ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవములు వెళ్ళిపోయాయి’ అన్నాడు.
ఈ మాటలను విని ధర్మరాజు ‘ఇంక మనం ఉండవలసిన అవసరం లేదు. కృష్ణుడు ఎప్పుడయితే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు. యుగానికి అవకాశం చూపాడు. మనం ఉండవలసిన అవసరం లేదు’ అని పరీక్షిత్తుని పిలిచి అతనికి పట్టాభిషేకం చేశాడు.
తాను కట్టుకున్న సార్వభౌమ లాంఛనమయిన పట్టు వస్త్రములను, ఆభరణములను విడిచిపెట్టి, కేశ పాశములకు ఉన్న ముడినివిప్పి ఒక మానసిక హోమం చేశాడు. అది పైకి చేయలేదు. ఇంద్రియములన్నిటినీ తీసుకువెళ్ళి మనస్సులో పెట్టి మనస్సును తీసుకువెళ్ళి ప్రాణవాయువునందు పెట్టాడు. ప్రాణవాయువును తీసుకువెళ్ళి అపానమనబడే మృత్యువాయువునందు పెట్టాడు. అపానమును తీసుకువెళ్ళి మృత్యుస్థానమయిన శరీరమునందు పెట్టాడు. ఈవిధముగా ఇప్పుడు శరీరము పడిపోవడానికి కావలసిన స్థితిని తీసుకువచ్చేశాడు. దీనిని శాస్త్రంలో ఒక రకమయిన సన్యాసమని అంటారు. ఇహ తను మాట్లాడడు. ప్రతిస్పందించడు. అన్నిటినీ విడిచిపెట్టి జడుడిలా పిశాచగ్రస్తుడిలా జుట్టు విరబోసుకొని మౌనంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు తిరిగి వెళ్ళిపోయాడు. ధర్మరాజును చూసిన భీముడు అలాగే అన్నగారిలాగా వెళ్ళిపోయాడు. భీముడి వెనుక అర్జునుడు, ఆ వెనుక నకుల సహదేవులు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వారు మృత్యుస్థానమయిన శరీరములోకి హోమము చేసారు శరీరములు పడిపోయి కృష్ణపరమాత్మతో ఐక్యమును పొందేశారు. ఇది తెలుసుకున్న ద్రౌపదీ దేవి. తన భర్తలు వెళ్ళిపోయిన తరువాత ఇంక తను ఉండకూడదని తానుకూడా ఉత్తరదిక్కుగా ప్రయాణము చేసి ఆవిడా శరీరమును విడిచి పెట్టింది. విదురుడు ధృతరాష్ట్రునితో మాట్లాడిన మాటలను, ధర్మరాజు, మిగిలిన పాండవులు ఉత్తరాభిముఖులయిన ఘట్టమును విన్నవారికి చదివినవారికి జీవితములో నిర్హేతుక కృపగా కృష్ణపరమాత్మ తన పాదారవిందములయందు భక్తిని కృప చేస్తాడు’ అని పోతనగారు అభయం ఇచ్చారు. ఆ ఘట్టము అంత మహోత్కృష్టమయినది.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy