11, అక్టోబర్ 2022, మంగళవారం

అశ్వగంధ చూర్ణం

 అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు - 


    కొంతకాలం క్రితం అశ్వగంధ గురించి కొన్ని వివరాలు మీకు అందించాను. ఈ మధ్యకాలంలో   అశ్వగంధ గురించి మరింత విలువైన సమాచారం తెలుసుకున్నాను . వీటిలో చాలా వరకు నేను నా పేషెంట్స్ కి ఇచ్చినప్పుడు కొన్ని ఇతర సమస్యలు తీరడం నా దృష్టికి వచ్చింది.  ఇప్పుడు నా స్వానుభావాలు మరియు కొన్ని అత్యంత పురాతన గ్రంథ పరిశోధనలో నాకు లభ్యమైనవి కూడా మీకు వివరిస్తాను . 


 స్వచ్ఛమైన అశ్వగంధ తయారీ విధానం - 


      మెట్టభూములు మరియు అడవులలో లభ్యమగు మంచి ముదురు పెన్నేరు గడ్డలను తెచ్చి మట్టి , ఇసుక , దుమ్ము వంటి వ్యర్థపదార్థాలు లేకుండా శుభ్రపరచుకొని నీడ యందు ఎండించవలెను . పూర్తిగా ఎండిన తరువాత  కత్తితో ముక్కలుగా కొట్టి ఒక గిన్నెలో వేసి అవి మునుగునంత వరకు దేశి ఆవుపాలు పోసి సన్నటిసెగపైన పాలు ఇగురునంత వరకు ఉడికించవలెను . అలా ఉడికించిన తరువాత గడ్డలను బాగుగా ఎండించవలెను . ఆ దుంపల యందు తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండించవలెను . లేనిచో ఆ దుంపలకు బూజు పట్టును . ఇలా పూర్తిగా ఎండిన దుంపలను మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా మొత్తం 11 సార్లు చేసి ఆ తరువాత బాగుగా ఎండించి చూర్ణం చేసి వస్త్రగాలితం చేసుకుని వచ్చిన మెత్తటి చూర్ణాన్ని తడి తగలకుండా జాగ్రత్తగా నిలువచేసుకోవలెను . 


 మోతాదు - 


     2 నుంచి 3 గ్రాముల మోతాదులో ఉదయము మరియు సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఆయా సమస్యను బట్టి వైద్యులు సూచించిన అనుపానంతో వాడవలెను . 


       అశ్వగంధ 7 సార్లు శుద్ది చేయవలెను అని చెప్పుదురు . 11 సార్లు శుద్ది చేసిన ప్రశస్తముగా ఉండును . మరియు బలంగా పనిచేయును . 


  ఔషధోపయోగాలు  - 


 *  శరీరానికి అమితమైన బలాన్ని ఇచ్చును . శుష్కించు శరీరం కలవారు దీనిని వాడుట వలన శరీరానికి కండపట్టి బలంగా తయారగుదురు . 


 *  నిద్రలేమితో బాధపడువారికి ఈ అశ్వగంధ అత్యంతద్భుతముగా పనిచేయును . అశ్వగంధ ప్రధానముగా నరాల మీద పనిచేసి నరాలకు బలాన్ని చేకూర్చును . దీనిని వాడుట వలన ప్రశాంతమైన నిద్ర లభించును . 


 *  క్షయరోగముతో ఇబ్బంది పడువారికి ఇది అత్యంత బలవర్ధకమైనది . ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చుటయే కాక శరీర రోగనిరోధక శక్తి పెంచుటలో అత్యంత వేగముగా పనిచేయును . 


 *  విరిగిన ఎముకలు త్వరగా కట్టుకొనుటకు ఈ అశ్వగంధ బాగుగా పనిచేయును . 


 *  స్త్రీలు మరియు పురుషలలో కలుగు వంద్యదోషాలను నివారించును . 


 *  రక్తము నందలి దోషములను పోగొట్టును . 


 *  కీళ్లనొప్పులు నుంచి ఉపశమనం కలిగించును . 


 *  నాడీవ్యవస్థ కు చెందిన వ్యాధుల పైన బాగుగా పనిచేయును . 


 *  పక్షవాతం మొదలగు వాతవ్యాధుల యందు దీని పనితీరు అద్బుతముగా ఉంటుంది . 


 *  మెదడులోని న్యూరాన్ల పైన దీని ప్రభావం ఉంటుంది. దీనిని వాడుట మూలన మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి మెరుగుపడును . 


 * అగ్నిమాంద్యము , మలబద్దకం నివారించును .


 *  బాలింతలకు వచ్చు సూతికారోగము నివారించును . 


 *  శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపి శరీరాన్ని శుద్ది చేయును . 


 *  కఫ సంబంధ దోషములైన శ్వాస ( ఆయాసం ) , శోష మొదలైన వాటిని నివారించును . 


 *  గ్రంధి సంబంధ రోగాలు ఉదాహరణకి థైరాయిడ్ వంటి వాటిపై అమోఘముగా పనిచేయును . 


 *  గుండెసంబంధ సమస్యల కలవారు అశ్వగంధ వాడవలెను . 


 *  కొంతమంది పిల్లలు శారీరకంగా ఎండుకుపోయి ఉంటారు. అటువంటివారికి తేనె అనుపానంగా ఈ అశ్వగంధ చూర్ణమును ఇచ్చిన మంచి కండపట్టి పుష్టిగా తయారగుదురు . 


 *  వృద్ధాప్యము నందు వచ్చు సమస్యలను ఎదుర్కోవడానికి అశ్వగంధ నిత్యము సేవించవలెను . 


 *  స్త్రీల శారీరక బలహీనతని పోగొట్టును . ప్రదర రోగములను నివారించును . 


 *  మూర్చరోగులకు ఇది వరం వంటిది . 


 *  స్త్రీలలో కలుగు బహిష్టు సంబంధ సమస్యలను నివారించును . 


 *  స్త్రీ మరియు పురుషులలో హార్మోన్స్ మీద ఇది చాలా అద్బుతముగా పనిచేయును . 


      పైన చెప్పిన అనేక ఉపయోగాలు మాత్రమే కాకుండగా అనేకమంది HIV వ్యాధిగ్రస్తులకు ఇది నేను ఇవ్వడం జరిగింది. దీనిని ఉపయోగించిన తరువాత వారిలో CD4 కౌంట్ నందు మార్పు కనిపించింది. అంతకు ముందు ఉన్నటువంటి నీరసం , నిస్సత్తువ తగ్గిపోయాయి.  ఇలా మరెన్నో వ్యాధులపైన దీనిని ప్రయోగించాను . అద్బుతమైన ఫలితాలు వచ్చాయి . 


         కరోనా చికిత్సలో కూడా ఇది చాలా అద్బుతముగా పనిచేసింది . నేను ఎంతో మంది రోగులకు ఇచ్చాను . కరోనా నుంచి కోలుకొనిన తరువాత వచ్చే దుష్ప్రభావాలనుంచి కాపాడుకోవడానికి ఇది వాడుట అత్యుత్తమం . 


      మీకు ఇక్కడ మరొక్క ముఖ్యవిషయం చెప్పవలెను . నేను మామూలుగా ఆయుర్వేద షాపుల్లో దొరికే శుద్ధిచేయని మామూలు అశ్వగంధ చూర్ణము ఉపయోగించినప్పటికంటే నేను పాలల్లో ఉడకబెట్టి తయారుచేసిన అశ్వగంధ చూర్ణం వాడుట వలన ఫలితాలు అతి తక్కువ సమయములో వేగముగా ఫలితాలు వచ్చాయి . ఈ అశ్వగంధ చూర్ణం వాడువారు పాలు , పెరుగు , వెన్న , పప్పు తరచుగా వాడవలెను . తాంబూలం , మద్యము , కర్బుజా పండు , పనసపండు , చల్లనినీరు , చద్ది అన్నం నిషిద్దం . 


  

కామెంట్‌లు లేవు: