11, అక్టోబర్ 2022, మంగళవారం

రామాయణానుభవం_ 176*

 [11/10, 3:05 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 176* 


రాముని కోపావేశం చూసి 

సముద్రమధ్యంనుంచి మేరువుమీద సూర్యుడులాగా సముద్రుడు ఆవిర్భవించాడు. ఎర్రని పుష్పమాలలు అలంకరించుకొని, పద్మపత్రవిశాలాక్షుడై పూలమాలను శిరస్సుపై ధరించి, బంగారు ఆభరణాలతో, రత్నమాలికలతో సముద్రుడు ప్రత్యక్షం అయ్యాడు. శ్రీరామునికి సవినయంగా నమస్కరిస్తూ


"రఘురామా ! పంచభూతాలూ వాటివాటి స్వభావాలకు అనుగుణంగా సంచరిస్తుంటాయి. ఇవి తమ స్వభావాలను విడిచిపెట్టడానికి వీలులేదు. నేను సముద్రుడను. అగాధమైనవాడను. దాటశక్యం కానివాడను. ఇది నా స్వభావం. అయినా భయలో భమోహాదులకు అతీతంగా పలుకుతున్నాను. నీవూ నీ సైన్యమూ దాటి వెళ్లడానికి వీలుగా, నన్ను ఆశ్రయించుకుని జీవకోటికి హాని కలగని రీతిగా మీకు సహకరిస్తాను."


సాగరుడి ఈ మాటలకు రాముడు అంగీకరించాడు. "అయితే ఈ సంధించిన బ్రహ్మాస్త్రాన్ని ఎవరిమీదకు వదలమంటావో చెప్పు" అని అడిగాడు. 

"ప్రభూ! నాకు ఉత్తరతీరంలో ద్రుమకుల్య అని ఒక ప్రసిద్ధస్థలం ఉంది. అక్కడ దస్యులు నా నీరు త్రాగేస్తున్నారు. వాళ్ళవల్ల నాకు వీడగా ఉంది. వాళ్ళ స్పర్శను నేను భరించలేకపోతున్నాను. కాబట్టి నీ బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళమీదకు వదల" మని సముద్రుడు ప్రార్ధించాడు. రాముడు అలాగే బాణం వదిలాడు.


"ఇక్ష్వాకుకులవర్ధనా ! మీ సైన్యంలో నలుడు ఉన్నాడు. అతడు విశ్వకర్మకొడుకు. తండ్రివల్ల వరాలు పొందినవాడు. అతడు నామీద సేతువును నిర్మించగలడు. ఆ సేతువును నేను ధరిస్తాను" ఈ మాటలు చెప్పి సముద్రుడు నిష్క్రమించాడు.


*ఔరసస్తస్య పుత్రో అహం సదృశో విశ్వకర్మణా* 

*స్మారితో అస్మ్యహమేతేన తత్త్వమాతత్త్వమాహ మహోదధిః* 

*న చ అపి అహమ్ అనుక్తో వై ప్రబ్రూయాం ఆత్మనో గుణాన్*

 మహాబలుడైన నలుడు రామునికి మ్రొక్కి "మాతండ్రి ఆశీస్సులవల్ల నేను సేతువును నిర్మించగలను. సాగరుడు చెప్పినమాట నిజమే.

నీకు భయపడిన సముద్రుడు సేతువును ధరిస్తానన్నాడు కనుక నా నిర్మాణం మునిగిపోదు. ! అనుజ్ఞయిస్తే మొదలుపెడతాను" అన్నాడు. 


రాముడు సంతోషంగా అనుజ్ఞ ఇచ్చాడు. సేతునిర్మాణం ప్రారంభమయ్యింది.

*

[సముద్రుడిని ప్రపన్నం చేసుకోవడానికి శ్రీరాముడు చేసిన శరణాగతి ఎందుకు విఫలం అయింది.?


 రామాయణంలో దేవతలు, ఋషులు, లక్ష్మణుడు, భరతుడు, హనుమ శ్రీరాముడికి శరణాగతి చేసి రక్షణ పొందారు. అయితే శ్రీరాముడు సముద్రుడికి చేసిన శరణాగతి మాత్రం ఫలించలేదు. కారణం ఏమిటి? 

శరణాగతి చేయడానికి తగిన లక్షణాలు రాముడికి లేవు. శరణాగతిని ఇచ్చే అర్హత సముద్రుడికి లేదు. 


ఎలా సముద్రాన్ని దాటి లంకకు చేరడమా అని ఆలోచిస్తున్న రాముడికి, సముద్రుడిని శరణాగతి చెయ్యమని విభీషణుడు సలహా ఇస్తాడు. తన శరణాగతి పొందిన విభీషణుడి ముచ్చట తీర్చడం కోసం శ్రీరాముడు సముద్రం ఒడ్డున పడుకొని మూడురోజులు దర్భలమీద ప్రాయోపవేశం చేశాడు. సముద్రుడు కనబడలేదు. లంకకు దారి ఇవ్వలేదు. రాముడికి కోపం వచ్చి సముద్రాన్ని ఇంకింపచేయడానికి బాణం పట్టుకుంటాడు. 

అపుడు సముద్రుడు పైకి వచ్చి రాముడికి నమస్కరిస్తాడు. 'పిలిస్తే రావడానికి మూడురోజులు పట్టిందే?' అని రాముడంటే సము ద్రుడిలా విన్నవిస్తాడు. 'శ్రీరామా! నీ స్వరూపాన్ని (రక్షకత్వం, కరుణ) కించపరచడం నాకిష్టంలేదు. అలాగే నా స్వరూపాన్ని (దాసత్వం) చెడగొట్టుకోవడం నాకిష్టంలేదు. *శరణాగతి ఇచ్చేవాడే (శరణ్యుడే) శరణాగతి కోరడం భావ్యంకాదు* అని. 

అందుకే రాముడి శరణాగతి ఫలించలేదు.


సముద్ర శరణాగతి వేదాంత పరంగా చాల ప్రధానమైనది.


శరణాగతి నియమాలలో "విషయ నియమము" చాల ముఖ్యమైనది. ఎవ్వరిని ఆశ్రయిస్తే మనకు కోరిన రక్షణ లభిస్తుందో చూచుకొని, వారికే శరణాగతి చేయాలనేది విషయ నియమము.


రాముడు సముద్రుని శరణువేడితే ఫలించలేదు. సముద్రుడే రాముని శరణువేడితే తక్షణమే ఫలించింది.


అసమర్ధునికి చేసిన శరణాగతి ఫలించదని రాముని ప్రాయోపవేశం తెలిపింది. రాముడు స్వయంగా పరమాత్మ. పరమాత్మ విషయంలో ఇతరులు చేసిన శరణాగతి ఫలిస్తుందని సముద్రుని, కాకాసురుని, విభీషణుడు ,సుగ్రీవాదుల శరణాగతి నిరూపించింది.]

[11/10, 3:06 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 177* 


సముద్రుడు సేతు నిర్మాణం గురించి తెలిపిన తరువాత నలుడు శ్రీరాముని వద్దకు వెళ్లి "ప్రభూ! నేను సాగరుడు తెల్పినట్లు విశ్వకర్మ పుత్రుడను, మాతల్లికి" నీపుత్రుడునా అంతటి వాడవుతాడు" అని మా తండ్రి వరమిచ్చాడు. 


మా తండ్రి వర ప్రసాదంగా ఆయన నిర్మాణ కౌశల్యమంతా నాకు వారసత్వంగా లభించింది. అయితే సముద్రుని కంటే ముందే నేను నాగురించి మీముందు చెప్పుకొంటే "ప్రగల్బాలు పలుకుతున్నాడు." అని మీరు అనుకొంటారని నేను మీ ముందుకు రాలేదు. సముద్రుడు వరమిచ్చినట్లు వానరవీరులు నాకు "శిలలను, వృక్షాలను" అందిస్తే వాటితో సేతువును నిర్మిస్తానని" మనవి చేసుకొన్నాడు.


నలుని మాటలను విని రామకార్యం కొరకు సమస్త వానరులు పెద్ద పెద్ద శిలలను,

గిరుల శిఖరాలను, మహా వృక్షాలను పెకిలించి తెచ్చారు. వాటిని నలుడు సముద్రంలో వేస్తూ ఇటు అటు అంచులను పగ్గాల సహాయంతో సరిచూస్తూ, తీగల సహాయంతో తరులను, గిరులను బంధిస్తూ సేతువును నిర్మించ సాగాడు.


*కృతానితాని ప్రథమేనాహ్నా యోజనాని చతుర్దశ* 

*ప్రహృష్టైర్గజ సంకాశైస్త్వరమాణైః ప్లవంగమైః*

మొదటి రోజు కావడం వలన కొంతపని ఆలస్యంగా మొదలై పదునాలుగు యోజనాల దూరము సేతువు కట్టబడింది. రెండవ రోజు ఇరువై యోజనాలు, మూడవ రోజు ఇరువై __ఒకటి, నాల్గవ రోజు ఇరువై రెండు, అయిదవ రోజు ఇరువై మూడు యోజనాల దూరముతో పదియోజల వెడల్పుతో సేతు నిర్మాణం పూర్తి అయింది. (14+20+21+22+23=100)


*త దచింత్య మసహ్యం చ అద్భుతం* *రోమహర్షణం, దదృశు స్సర్వభూతాని* 

*సాగరే సేతుబంధనమ్*


ఊహింప తరము కానిది ,ఆశ్చర్యాన్ని, గగ్గుర్పాటుని కలిగించే సముద్రమునందలి సేతునిర్మాణమును సర్వ ప్రాణులు చూస్తుండగానే నిర్మాణం జరిగింది.


ఆకాశమార్గంలో సూర్యచంద్రులు సంచరించే మార్గము మధ్యలోని "స్వాతి పధము" (పాలపుంత) వలె ఉత్తరము నుండి దక్షిణంగా అద్భుతంగా లవణ మహాసముద్రముపై సేతు నిర్మాణం జరిగింది.

*

 [కట్టిన వాడు నలుడైనా రామకార్యం కొరకు నిర్మించబడింది. సముద్రుని వరము మేరకు అది రామసేతువుగా తరతరాలుగా యుగయుగాలుగా రామచరిత్రను భారతీయులకే కాక విశ్వమానవులందరికి అందిస్తూ వస్తున్నది.]

** 


సేతు నిర్మాణము తరువాత రాముడు వానర సేనా సమేతంగా లంకలోకి ప్రవేశించాడు. లంకా నగర సౌందర్యమునకు ఆశ్చర్యపడ్డాడు. సీతను తలచుకొని దుఃఖించాడు. 

*దృష్ట్వా దాశరథిర్లంకాం చిత్రధ్వజపతాకినీమ్*

*జగామ మనసా సీతామ్ దూయమానేన చేతసా*


యుద్ధ సమయంలో విచారము తగినదికాదని మనస్సును మరల్చుకొని వానరసేన నంతటిని రాముడు గరుడ వ్యూహముగా తీర్చాడు. 


నీలుని పరివారంతో కూడ అంగదుడు హృదయ భాగంలో ఉండాలి. ఋషభుడు, గంధమాదనుడు తమ తమ సేనలతో కుడి ఎడమలలో నిలుచోవాలి.


వేగదర్శి, సుషేణుడు, జాంబవంతుడు ఈ ముగ్గురు తమతమ సేనలతో గర్భభాగాన్ని రక్షించాలి. రామలక్ష్మణులిద్దరు శిరోభాగంలో రక్షకులుగా ఉండాలి. పశ్చిమ దిశను వరుణుడు కాపాడినట్లు వ్యూహము యొక్క చివర (తోక )భాగంలో సూర్యుపుత్రుడైన సుగ్రీవుడు తన సేనతో ఉండాలి.


ఇక లంకలోకి వెళదాం.

"సముద్రాన్ని దాటి, లంకలో సేనా వ్యూహమును ఏర్పరచాక శుకుడు చూచాడు. తిరిగి వెళ్లాక మన బలాల గురించి రావణునికి భయము కలిగేలా చెప్పుతాడు. కనుక ఆ చారుని విడిచి పెట్టండి" అని రాముడు వానరులకాజ్ఞాపించాడు. 

*తతో రామో మహాతేజాః సుగ్రీవ మిదమబ్రవీత్*

*సువిభక్తాని సైన్యాని శుక ఈష విముచ్యతామ్*


వానరులు విడిచిపెట్టారు. చారుడైన శుకుడు రావణుని దగ్గరకు వెళ్లాడు. దెబ్బలు తిని వచ్చిన జూచి రావణుడు, "ఓరి శత్రువులకు చిక్కావా ? ఏమైంది ?" అని అడిగాడు.


అప్పుడు శుకుడు "ప్రభూ మీరు చెప్పినట్లే నేను వానర సేన మధ్యలోకి వెళ్లి సుగ్రీవ మహారాజును రామపక్షము వదిలి వెళ్లుమని" మీ సలహాగా చెప్పాను.


"నేను మాట పూర్తి జేసేలోపే వానరులందరు నాపైబడి నన్ను నేలకు బాది, నన్ను బంధించారు. ఈ మధ్యలో శ్రీరాముడు సముద్రుని సలహా ప్రకారం సేతువును నిర్మించి, వానరసేనతో సముద్రము దాటి లంకలోకి వచ్చాడు. వారసేననంతా వ్యూహంగా విభజించాడు.


దయామయుడైన శ్రీరాముని ఆజ్ఞమేరకు వానరులు నన్ను వదిలారు. మహా రాజా ! ఇప్పుడు మీకు రెండు మార్గాలు ఉన్నాయి. ఏదో ఒకటి తప్పదు. భయంకరమైన వానర సేనా వాహిని ముట్టడిని తప్పించుకోవాలంటే శ్రీరామ చంద్రునికి సీతాదేవిని సమర్పించాలి.

*పురా ప్రాకారమాయాంతి క్షిప్రమేకతరం కురు*

*సీతామ్ వాస్మై ప్రయచ్ఛాశు యుద్ధమ్ వాపి ప్రదీయతామ్*

లేదా శ్రీరామ భద్రుని భయంకర బాణాగ్నిని ఎదుర్కోవడానికి సిద్ధము కావాలి.” 

శుకుని మాటలు విని రావణుడు కోపంతో "ఏమిరా భయంతో నేను సీతాదేవిని రామునికి అప్పగించాలా?

దేవదానవులందరు కలసినన్నెదిరించినా నేను భయపడను. రామునికి నా పరాక్రమము తెలియక నాపై యుద్ధానికి వచ్చాడు. ఆయన తమ్మునితో సహా, సమస్త వానర సేనతో సహా నా బాణాగ్నికి భస్మము కాకతప్పదు. ఇక నీవు వెళ్ల వచ్చు" నని ఆయనను బయటకు పంపివేశాడు....

[11/10, 3:06 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 178* 


గతం లో విభీషణాదులు 

శుక చారుడు,ఇప్పుడు శుకసారణ మంత్రులు అందరూ సీతను అప్పగించు అదే మాట చెప్పారు.... అయినా రావణుడు అంత మొండివాడు ఎవ్వడూ ఉండడు.


"నా శత్రువులందరిని చూడాలని అనుకొంటున్నాను. నా వెంట వచ్చి వాళ్లను నాకు చూపండి" అని శుక సారణులతో కలిసి రావణుడు అనేక తాటి చెట్ల అంత ఎత్తున్న తన మేడపైకి వెళ్లి తనకు ఎదురుగానున్న సువేలా పర్వతముపై విడిది చేసిన వానర సేనావాహినిని చూడసాగాడు.


సారణుడు మొదట అంగదుని చూపి "ఈయన తన సైన్యంతో వానర సేనను హృదయ భాగంలో ఉండి రక్షిస్తాడని, ఆయన తన తండ్రి అయిన వాలి అంతటి

పరాక్రమము కలవాడని" తెలిపాడు.


సేనకు ముందుండి నడుపుతున్న వాడు లక్షల వానర సేనాధిపతి అయిన మహా పరాక్రమ శాలి నీలుడు, అంగదుని వెనుక ఉన్నవాడు నలుడు. ఆయనే సేతునిర్మాత. చందన పర్వతము పైన

ఉండే వేయి కోట్ల సైన్యానికి స్వామి. ఆయన మహాక్రోధంతో నీపైకి ఉరికి వస్తున్నాడు..


అలాగే శ్వేతుడు, కుముదుడు రంభుడు, శరభుడు పనసుడు, వినతుడు, క్రోధనుడు

మొదలైన వారు మహా పరాక్రమోపేతులు, కోట్లకొలది సైన్యాలకు అధిపతులు,


వీరేకాక మరి కొంతమంది యూధపతులున్నారు. వారందరు శ్రీ రాముని కొరకు ప్రాణములను తెగించి వచ్చారు.


వానరయూధపతి ధూమ్రుడనే ఆయన భల్లూకయూధపతి ఆయన తమ్ముడు జాంబవంతుడు అతిలోక భయంకరుడు. వామనుని కాలములో ఆయన చుట్టు అనేక పర్యాయాలు మూడు లోకాలు తిరిగాడు. దైవాసుర యుద్ధంలో అనేక సమయాల్లో దేవతలకు సహాయపడినవాడు. ఆయన యముని కూడ యుద్ధంలో ఓడింపగల్గిన వీరుడు.


యుద్ధమునందు మహావేగము కలవాడు, తన పరాక్రమంతో ఇంద్రుని సైతము

సంతోషపరచువాడు అదిగో దంభడు.


అడ్డు వచ్చిన దేనినయినా అతిక్రమించగలిగినవాడు, తన పరాక్రమంతో ఇంద్రుని జయించిన వాడు, దానధర్మములలో మిక్కిలి ఆసక్తిగలవాడు, బల దర్పము గలవాడదిగో సన్నాదుడు.


ఇదిగో ఈయన కథనుడు ఒక గంధర్వ స్త్రీకి అగ్నిదేవుని వలన జన్మించినవాడు. దేవాసుర యుద్ధంలో దేవతలకు సహాయపడినవాడు. కుబేరుడుండే కైలాస పర్వతమందు ఉంటాడు.


అదిగో ఆ కనబడేవాడు ప్రమాధి అనే వానర యూధపతి. యుద్ధంలో కఠిన పరాక్రములైన కోటి వానరులకు ఈయన అధిపతి. ఈయన గవాక్షుడు బలవంతులైన కొండముచ్చులకు అధిపతి. ఇదిగో ఆయన కేసరి అనే మహావీరుడు. ఏనుగు ఆకృతితో దేవతలను బాధించుచున్న శంబసాధనుడనే రాక్షసుని సంహరించి దేవతలకు ప్రియమైన వాడు


తెలుపు, ఎరుపు, నలుపు రంగులలో ఉండి మదించిన సింహమువలె నాలుగు కోరలను కలిగియుండి, పామువంటి రోషముగల్గి, ఏనుగంత ఎత్తు గలిగి, ఎఱ్ఱని కళ్లుగల వానర శ్రేష్ఠుల మధ్య మహావీరుడై ప్రకాశించే ఇతడు శతవలి. ఈయన ప్రతిరోజు సూర్యోపాసన చేస్తాడు. రామసుగ్రీవులకు అత్యంత ప్రియుడు నీతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు.


గవాక్షుడు, నీలుడు, గవయుడు, నలుడు ఒక్కొక్కరు పదికోట్ల వానర వీరులకు నాయకులు.....

** 


సారణుడు ముగించిన తరువాత శుకుడు వానర వీరుల వివరాలను మరింత తెలుపసాగాడు. కిష్కింధానగరంలో వేయి శంఖములు, నూరు బృందములు ఇరువై ఒక్కకోట్ల వానరవీరులున్నారు. వీరందరు కామ రూపులు.


వీరిలోమైంద ద్వివిదులు మహాకాంతి సంపన్నులు. బ్రహ్మవర ప్రసాదం చేత అమృతం త్రాగిన వారు. ఎప్పుడు చిన్న వయస్సు వారుగానే ఉంటారు. నీపైకి ఉత్సాహంతో ఉరికివస్తున్నారు. ఇదిగోమైంద ద్వివిదుల ప్రక్క పర్వతాకారాలతో ముందుకొచ్చే అపరిమిత బలసంపన్నులు సుముఖుడు, అసుముఖుడు. వీరిద్దరు యముని కుమారులు తండ్రి అంతవారు.


అందరికంటే ముఖ్యమైన వానిని చూస్తున్నావా ? అంజనాదేవికి వాయుదేవుని ప్రసాదంగా జన్మించిన మహానుభావుడు. పుట్టగానే ఉదయిస్తున్న అరుణబింబాన్ని చూచి ఎఱ్ఱని పండనుకొని ఆకలితో సూర్యుని మ్రింగాలని పైకి ఎగిరినవాడు, తనయుడు, శ్రీరామచంద్రుని మహా భక్తుడు. నూరుయోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి లంకలోనికి ప్రవేశించి సీతాదేవిని చూచి తిరిగి వెళ్లుతూ అసంఖ్యాకులైన రాక్షసవీరులను, లంకానగరాన్ని మొత్తము దహించినవాడు, నీకు సింహస్వపమైనవాడు ఇదిగో హనుమంతుడు.

*సత్యం ఆగమ యోగేన మమ ఈస విదితో హరిః*

*న అస్య శక్యం బలం రూపం ప్రభావో వా అనుభవాసితుమ్*


అదిగో ధీమంతుడైన హనుమంతుని చేత సేవింపబడుతున్నవాడు. నల్ల కలువల వంటి మేను ఛాయ గలవాడు, ఎఱ్ఱకమలాల వంటి విశాల నేత్రాలు కలవాడు, ధర్మావతారుడు, సహనంలో భూమితో సమానుడు, ఆగ్రహంతో అమరులను కూడ కంపింపజేయగల మహానుభావుడు శ్రీరామచంద్రుడు,

*యస్య భార్యా జన్స్థానాత్సీతా చాప హృతా త్వయా*

*స ఏష రామస్త్వాం యోద్ధుం రాజన్ సమభివర్తతే*


ఆయన ప్రక్కనే ఉంటూ బంగారు రంగు మేనిఛాయ గలవాడు, అన్నిటిలో రామసమానుడు. ఆకలితో బుసలుగొట్టుతున్న పాముల వంటి అమ్ములుగలవాడు శ్రీరామ సోదరుడైన లక్ష్మణుడు,


ఇక మీ తమ్ముడు విభీషణునిని చూస్తునే ఉన్నావు కదా ! ఆయన ఇప్పుడు. రామాశ్రయంతో మహోత్సాహంతో ఉన్నాడు. సముద్ర తీరంలోనే శ్రీరామ చంద్రుని చేత లంకాధిపతిగా పట్టాభిషేకం చేయబడినవాడు. నీతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాడు.


ఇక మిగిలినవాడు వానర మహా సామ్రాజ్యాధిపతి అయిన సుగ్రీవుడు. నిన్ను తోకతో చుట్టి నీళ్లు త్రాగించిన వాలితో సమాన బలుడు.


శ్రీరామ చంద్రస్వామి సహాయంతో అన్నను వధింపజేసి నిష్కంటకంగా వానర రాజ్యాన్ని ఏలుతున్న వాడు. వాలి కుమారుడైన అంగదుని యువరాజుగా చేసి ఆయనను తన వశంలో ఉంచుకొన్నవాడు. స్వయంగా సూర్యనందనుడు.....

[11/10, 3:07 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 179* 


శుకసారణుల వివరణ విన్న రావణాసురుడు కోపంతో ఊగిపోయాడు. గొంతు గద్గదమయ్యింది. శత్రుసైన్యాన్ని కీర్తించడమే పనిగా పెట్టుకున్న మూర్ఖులు మీరు. ఇటువంటివారు మంత్రులుగా ఉండీ నేను అదృష్టవశాత్తూ జీవించి ఉన్నాను. మీ నాలుకలు కోసి తలలు తరిగెయ్యాలి. కానీ మీరు చేసిన సేవలు మరిచిపోలేక వదిలేస్తున్నాను. పొండి. తక్షణం తొలగిపొండి అని బిగ్గరగా అరిచాడు....


రావణుడు తన దగ్గర ఉన్న మహోదరుని చూచి తక్షణమే సమర్థులైన చారులను రప్పించుమని ఆజ్ఞాపించాడు. శార్దూలాదిచారులు క్షణంలో రావణుని ముందువాలారు. శత్రువులకు భయపడనివారు

తనకు విధేయులు చార విద్యా కుశలురైన శార్దూలాదులను చూచి:


"మీరు తక్షణమే రామలక్ష్మణులున్న చోటికి మారు వేషాలతో వెళ్లండి. వాళ్ల స్వభావాలను, అలవాట్లను, బలహీనతలను గమనించి తిరిగిరండి.


ఎంత గొప్పవాడికైనా ఏవో కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటిని మనము కనుక్కొంటే ఎంత గొప్ప శత్రువునైనా వశపరుచుకోవచ్చు.


రామలక్ష్మణులు ఎప్పుడు పడుకుంటారు? ఎప్పుడు మేలుకొంటారు? పడుకొన్నప్పుడు, లేచినప్పుడు ఒంటరిగా ఉంటారా? లేక వాళ్లకు తోడు ఎవ్వరైనా ఉంటారా ? ఈ విషయాలన్ని కనుక్కొనిరండని పంపాడు. వారు "మహారాజుకు జయము జయము" అని పలుకుతూ వెళ్లారు.


వారు మారువేషాలతో వానరవీరుల దగ్గరికి వెళ్లారు. రామలక్ష్మణుల వానరసేనా సముద్రాన్ని చూడగానే వారి గుండెలు అవిసి పోయాయి. భయంతో అక్కడి నుండి పారిపోవాలి అనుకొంటు ఉండగానే విభీషణుడు వారిని గమనించి నాయకుడైన శార్దూలుని బంధించి, మిగిలిన వారిని వదిలి పెట్టాడు.

వానరులందరు శార్దులుని పైబడి ఆయనను చితుక బాదారు. బాధలను తట్టుకోలేక బిగ్గరగా ఏడుస్తుండగా దయామయుడైన దాశరధి ఆశార్దూలుని విడిపించి పంపాడు. 


శార్దూలుడు రావణుని సమీపించి "మహారాజా ! వానర బలము సంఖ్యాతీతము వారిని లెక్కించుట తరముగాదు. వారు వేరు వేరుగా ఉంటారు. అందరు కలిసే ఉంటారు. ఆ విధంగా ఒంటరిగా ఉండని వారి ప్రత్యేక స్వభావాలను, బలహీనతలను గమనించడమెలా?


నన్ను చూడగానే విభీషణుడు గుర్తించాడు. మిగిలిన పనిని వానరులు చేశారు. పిడికిళ్లతో గ్రుద్దారు. పండ్లతో కొరికారు. క్రింద పడవేశారు. ఊపిరాడకుండా త్రొక్కారు.


"వీడు దొంగ ! వేగులవాడు" అని అరిచారు. అప్పుడు వానరులందరు గుమిగూడి నా ఎముకలను నుగ్గునుగ్గు చేశారు.


నేను నాబాధ తాళలేక శ్రీ రామచంద్రుని పాదాలపై పడ్డాను. 


"లంకాపురిని ఎట్లా

సాధించాలా?" అని తీవ్రంగా ఆలోచిస్తున్న రామభద్రుడు నన్ను ఒక గడ్డి పోచవలె

చూచి "వదలి పెట్టుడని" వానరులను ఆజ్ఞాపించాడు.


అదిగో అలా చావుదప్పి కన్నులొట్ట పోయి నీదగ్గరికి వచ్చాను.. ఇక నిర్ణయించు కోవలసింది నీవే. సీతాదేవిని అప్పగించడమా? రణాన్ని

ఆహ్వానించడమా?"

*పురా ప్రాకారం ఆయాతి క్షిప్రమ్ ఏకతరం కురు*

*సీతాం వా అస్మై ప్రయచ్ఛాశు సుయుద్ధం వా ప్రదీయతామ్*

రావణుడు వారి మాటలను విని "శార్దూలా! నేను సీతను తిరిగి ఇవ్వడము అనే మాటకల్ల.


ఆ వీరులు ఎవ్వరి పుత్రులు ? ఎవ్వరి మనుమలు ? ఎవ్వరికి సంబంధించిన వారో తెలుపు వారి సంబంధుల ద్వారా వారిని వశపరుచుకోవచ్చేమో?" అర్దూలుడు వానరవీరుల తల్లి దండ్రులను గురించి తెలుపసాగాడు.


హనుమంతుడు అంజనాకేసరుల కుమారుడు. కేసరి దేవగురువైన బృహస్పతి

కుమారుడు.అంగదుడు ఇంద్ర తనయుడైన వాలికి కుమారుడు. మైందద్వివిదులు అశ్వినీదేవతల (దేవవైద్యుల) కుమారులు. శ్వేత, జ్యోతిష్మతులు సూర్యుని పుత్రులు. హేమకూటుడు వరుణుని కొడుకు. నలుడు దేవశిల్పి అయిన విశ్వకర్మ తనయుడు,దుర్దరుడు వసువు కుమారుడు.


రామలక్ష్మణులు పది దిశలలో ఎదురులేని దశరధ సార్వభౌముని తనయులు,


శ్రీరామచంద్రుడు ఖర, దూషణత్రిశిరస్కులనే అత్యంత వీర్యవంతులైన రాక్షసులను

పదునాల్గువేల మంది సైనికులతో రెప్పపాటు కాలంలో సంహరించిన మహావీరుడు.


నీతో సమాన బలులని ఖ్యాతిగాంచిన విరాధుని, కబంధుని హతమార్చిన మహా బలశాలి శ్రీరాముడు.


దేవతాంశలతో జన్మించి, కామరూపధారులై, మహాబల సంపన్నులైన వేలకోట్ల వానరుల సేనా వాహినితో రామలక్ష్మణులు లంకా పట్టణంలోని "సువేల" పర్వతముపై దిగి ఉన్నారని తెలిసిన రావణుడు మనస్సులో భయపడ్డాడు. అయితే తన మనస్సులోనే భయాన్నిదాచుకొని, ఇక యుద్ధాలోచన చేయడానికి మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయుమని చెప్పి ఆయన తన ఇంటికి వెళ్లాడు.......

** 


విద్యుజ్జిహ్వుడు అనే మహామాయావిని పిలిపించి రావణుడు అతనితో కలిసి అశోకవనంలో సీతాదేవిని సమీపించాడు. దారిలో వాడికి ఆజ్ఞలు జారీచేసాడు. నీ మాయలు ఉపయోగించి రాముని శిరస్సును సృష్టించు. దానితోపాటు ధనుర్బాణాలు సృష్టించు. నేను సీతతో సంభాషిస్తుండగా వాటిని తీసుకు రా. చిత్తమని విద్యుజ్జిహ్వుడు నిష్క్రమించాడు. రావణుడు సీతను సమీపించి–


భద్రే! నేను బతిమాలుతుంటే, పెద్ద గొప్పగా నా భర్త మహావీరుడు, ఖరుణ్ని చంపాడు దూషణుణ్ని చంపాడు అంటూ గొప్పలకు పోయావు. చూడు ఏమయ్యిందో. నీ భర్త నిహతుడయ్యాడు. నీ అహంకారం తొలగించాను. ఇప్పటికయినా నా భార్యవు కా. 


ఈ మూఢబుద్ధి విడిచిపెట్టు. నా అంతఃపురానికి రాణివి కా. వానరసైన్యంతో నా మీదకు దండెత్తి సముద్రందాటి ఈ గట్టుకు వచ్చాడు నీ భర్త. దేవేంద్రుడి చేతిలో వృత్రాసురుడులాగా నాచేతిలో నిహతుడయ్యాడు. అతడి సైన్యమూ అతడూ అలసిపోయి నిద్రిస్తూండగా అర్ధరాత్రిసమయంలో ప్రహస్తుని నాయకత్వంలో మా రాక్షససైన్యం వారిపైపడి ఘోరంగా అందరినీ మట్టుపెట్టింది. 


నిద్రిస్తున్న రాముని తలను ప్రహస్తుడు స్వయంగా ఖండించాడు. అలాగే విభీషణుడిని సంహరించాడు. లక్ష్మణుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హతశేషులైన వానరులతో పారిపోయాడు. సుగ్రీవుడు తలతెగి, హనుమంతుడు దవడలు ఊడి పడి ఉన్నారు. జాంబవంతుడు మోకాళ్ళు విరిగి చనిపోయాడు. మిగిలినవారూ ఇలాగే అంతా చనిపోయారు. విజృంభించిన మా రాక్షససైన్యం నిరాటంకంగా వీరవిహారం చేసింది. దుమ్ముకొట్టుకుపోయి నెత్తురు ఓడుతున్న నీ భర్త శిరస్సును చూస్తావా?


 విద్యుజ్జిహ్వా ! రాముడి శిరస్సునూ ధనుస్సునూ ఇటు తీసుకురా.....


విద్యుజ్జిహ్వుడు అవి తెచ్చి రావణుడి ఆజ్ఞమేరకు సీతముందుంచి మాయమయ్యాడు.

*స విద్యుజిహ్వేన సహైవ తచ్ఛిరో* |

*ధమశ్చ భూమౌ వినికిర్య రావణః* |

*విదేహరాజస్య సుతాం యశస్వినీమ్* |

*తతో అబ్రవీత్తం భవ మే వశానుగా*

సీతా ! చూశావుగా. ఇదిగో నీ భర్త శిరస్సు. రాత్రి ప్రహస్తుడు సంహరించి తెచ్చాడు. ఇవిగో నీ మగని ధనుర్బాణాలు. ఇక నైనా నాకు వశం కా......

[11/10, 3:08 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 180* 


సీతాదేవి శ్రీ రాముని ముఖాన్ని పరిశీలించింది. అవే కళ్లు, అవేకురులు, అదే ముఖము.


హనుమ సీతాదేవితో, తాను వెళ్లిన వెంటనే సుగ్రీవ, వానరసేనా సమేతంగా శ్రీ రామ లక్ష్మణులను తప్పక తీసిక వస్తానని చెప్పాడు. కనుక "రామలక్ష్మణులు, వానరసేన సముద్ర తీరానికి చేరుకొని ఉంటారు. అలసి పోయిన రామలక్ష్మణులు నిద్రపోతు ఉంటారు. అదే అదనుగా భావించి ప్రహస్తుడు రాముని శిరస్సును ఖండించి ఉంటాడు". ఈ విధంగా సాగుతున్నాయి. ఆమె ఆలోచనా పరంపరలు. అన్నిటికంటే ముఖ్యంగా తాను హనుమతో పంపిన చూడామణి శ్రీరాముని కేశములను అలంకరించి ఉంది. ఇంతకంటే ప్రబలసాక్ష్యము ఇంకేమి కావాలి?

*కేశాన్ కేశాంత దేశం చ తం చ చూడామణీం శుభం*

*ఏతైః సర్వైరభిజ్ఞానైరభిజ్ఞాయ సుదుఃఖితా*

ఆమెభర్త ముఖాన్ని చూస్తూ "నాధా! సకల సద్గుణశాలివైన నీవు అర్ధాయుష్కుడవు అగుట నా పాపరాశి ఫలమే. ఒక్క మాయా లేడి కొరకు నిన్ను పోగొట్టుకొన్నాను. ఇన్ని రోజులు నీకు దూరమై భరింపరాని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను.


నాపై దయవలన నీవు దూతగా పంపిన హనుమ రాక వలన నాకు కొంత దుఃఖము తగ్గింది. కాని నా గురించి తెలిసి నన్ను రక్షించడానికి వచ్చిన నిన్ను మృత్యు దేవత మ్రింగి వేసింది.


ఇంతకంటే మించిన పాపము ఇంకేమి ఉంటుంది ? నా పాపము నిన్ను కలళించడమేకాదు. నిన్నుగన్న లోకమాత కౌసల్యాదేవి కడుపులో చిచ్చుపెట్టింది. ఇక ఆ తల్లి ఒకే పుత్రుడవు, దైవ ప్రసాదమైన నిన్ను పోగొట్టుకొని ఎక్కువ కాలము జీవింపజాలదు.


నేనెంతటి పాపాత్మురాలిని? ఎంతటి నష్టజాతకురాలిని ?


అయినా రామభద్రా! వివాహానికి పూర్వము జ్యోతిష్కులు నా జాతకాన్ని చూచి "నాభర్త దీర్ఘాయువుతో వేల సంవత్సరాలు రాజ్యమేలుతాడని నేను నాభర్తతో కలిసి మహారాణినవుతానని, నేను పుత్రసంతానవతినవుతానని చెప్పారే" ? వారంత తెలియని వారా? వారి మాటలు నీటిమూలేనా?


ప్రాణవల్లభా! నేను నీ పాలిటి కాళరాత్రిని ప్రభూ! నీవు ఏకపత్నీవ్రతుడవే! నన్ను వదలి భూదేవిని కౌగిలించుకొనుట నీకు తగునా ? ప్రాణముల కంటె ప్రియుడైన మీ తండ్రిని కలువడానికి పితృలోకానికి వెళ్లావా ?

నీ వంశానికి ధృవతారవై ఆకాశంలో వెలుగుతున్నావా?


జీవితేశ్వరా ! నా వివాహ కాలములో ధర్మార్ధకామములను జీవితాంతము కలిసే అనుభవిస్తానని మాటిచ్చావే ? మధ్యలోనే నన్ను ఈ విధంగా వదిలి వెళ్లడం న్యాయమేనా?

*సంశ్రుతం గృహ్ణాతా పాణీం చరిష్షామీతి తత్వయా*

*స్మరతన్ మమ కాకుత్స్థ నయ మామపి దుఃఖితామ్*

మహాపరాక్రమశాలీ! ఇది నిజమా?నాపై ప్రేమతో మూడు గడియలలోపు పదునాలు వేల సేనతో కూడిన భయంకర పరాక్రములైన ఖరదూషణాదులను ఒంటరిగా సంహరించగలిగిన మహావీరుడవు. నీవు అల్బుడైన ప్రహస్తుని చేతిలో ప్రాణాలను కోల్పోవడమా ? ఇది సంభవమా?


నా వలన తమ వంశము విస్తరించునని అనుకొని మా మామగారు నన్ను తమ ఇంటి కోడలుగా చేసికొన్నారు. కాని ఆ అమాయకులు "తన కొడుకుకే నేను మృత్యువునవుతానని, పూలదండ రూపంలో కనబడిన మహాసర్పాన్ని" అని కలలో కూడ అనుకోలేదు". అని రాముని శిరస్సును చూస్తూ సీతాదేవి అమితంగా దుఃఖించింది.


వెంటనే రావణునివైపు చూచి "రాక్షస రాజా ! నేను రాముని శరీరంలో సగభాగాన్ని. శరీరములో సగము మాత్రమే కాలడం లోక విరుద్ధము కదా ! అందువలన నా నాధుని శిరస్సుతో పాటు నాశరీరానికి కూడ నిప్పు అంటించుమని" దుఃఖాతిరేకముతో మూర్ఛ

పోయింది.

*శిరసా మే శిరశ్శ్చాస్య కాయమ్ కాయేన యోజయ*

*రావణా అనుగామి స్వామి గతిం భర్తుర్మహాత్మనః*

అంతలో ద్వారపాలకుడు రావణుని సమీపించి "మహారాజా! మిమ్మల్ని చూడడానికి ప్రహస్తుడు మొదలైన మంత్రులందరు సభాభవనంలో ఎదురు చూస్తున్నారు. మీకు జయము జయము అని తెలిపాడు.


ఇక అశోకవనంలో చేయవలసిన పని ఏమిలేకపోవడం వలన రావణుడు మంత్రులతో యుద్ధాలోచన చేయడానికి సభాభవనానికి వెళ్లి పోయాడు. ఆయన అక్కడి నుండి వెళ్లిపోగానే ఆశ్చర్యంగా శ్రీ రాముని తెగిన శిరము, ధనుర్భాణాలు మాయమయ్యాయి.

*

[ "తన భర్త శిరస్సును చూచి, సీతాదేవి నిరాశతో తనను వరిస్తుందేమో ?" అని రావణుడు ఆశపడ్డాడు. కాని ఆయనకు అక్కడ కూడ నిరాశే ఎదురు అయింది. "తాను తన భర్త శరీరంతో పాటు కాలిపోవడానికి సిద్ధమైందేకాని ఆ మహాపతివ్రత రావణుని అంగీకరించ లేదు.]

** 


సీతాదేవికి విద్యుజ్జహ్వుడు రాముని మాయా శిరస్సును తెచ్చి చూపడం, రావణుడు సీతాదేవిని నిరాశపరచి తనను వరించుమని యాచించడం, రావణుని మాటలకు లొంగక సీతాదేవి భర్త గురించి అమితంగా బాధపడుతుండడము- వీటన్నిటిని తన యోగవిద్య వలన అదృశ్యంగా ఉండి సరమ చూచింది.


ఇప్పుడు రావణుడు రాజ సభకు వెళ్లి పోయాక సరమ సీతాదేవిని సమీపించి ఆమెను


"అమ్మా! నీ భర్త నిద్రిస్తుండగా అతని శిరస్సును ప్రహస్తుడు ఖండించడం అసాధ్యము. శ్రీరాముని ఒంటరిగా విడిచి వానరులందరు నిర్లక్ష్యంగా ఉండజాలరు. నాభర్త అయిన విభీషణుడు ఇక్కడ అన్నిటిని వదలి రాముని ఆశ్రయించారు. ఆయనను అన్నివేళలా నీడవలె అనుసరించే ఉంటారు.


మీరు అడవులలో తిరుగుతుండగా మీరు పడుకొన్నా. మెలకువతో ఉన్న అన్ని సమయాలలో కూడ మీ వెంట ఉండి మీకు సకలసేవలు చేస్తూ మిమ్మల్ని కళ్లరెప్పలవలె కాపాడిన సౌమిత్రి, అన్నను విడిచి క్షణమైనా ఉండగల్గుతాడా ? ఆయనకు అన్నను రక్షించడం కంటే కావలసినదేముంటుంది ? నిద్రాహారాలు కూడ లక్ష్మణుని రాముని నుండి దూరము చేయలేవు కదా!


"విశాల వక్షః స్థలము, దీర్ఘ బాహువులు, ధర్మమూర్తిత్వము, శత్రువులలో కూడ ప్రఖ్యాతి గలిగిన పరాక్రమము, నీతిశాస్త్ర విజ్ఞానము, చక్కని అవయవ సన్నివేశము ఇవన్ని సాముద్రిక శాస్త్రము తెలిపే మహారాజ లక్షణాలు, ఇటువంటి శుభలక్షణ సంపన్నునికి శత్రువు వలన మరణము సంభవింపజాలదు.


నిన్ను దుఃఖము పాలు చేసి, ఎట్లాగైనా నిన్ను తన వశంచేసికోవడానికి దురాత్ముడైన రావణుడు దుర్మార్గంగా పన్నిన పన్నాగమిది.

అందువలన దేవీ ! నీవు రావణుని మాటలు నమ్మవద్దు! దు:ఖవివశవు కావద్దు.


అంతేకాదు రావణుడు నీదగ్గరి నుండి వెళ్లిపోయినప్పటి నుండి లంకలో యుద్ధసన్నాహాలు జరుగుతున్నాయి. యుద్ధభేరీ ధ్వనులు వినవస్తున్నాయి. సైనికుల ధ్వనులను నీవు వినడం లేదా ? రామలక్ష్మణులే మరణిస్తే ఇక రావణునికి యుద్ధంతో ఏమి అవసరమమ్మా! వేలకోట్ల వానర సేనలతో శ్రీ రామలక్ష్మణులు సముద్రం దాటి లంకలోనికి

ప్రవేశించి సువేల పర్వతముపై నిలిచిఉన్నారు.


ఈ మాటలు కేవలము విని నేను చెప్పడం లేదు. నేను చూచివచ్చి చెప్పుతున్నాను. నన్ను నమ్ము


ఈ యుద్ధంలో రామభద్రుడు రావణుని సపరివారంగా సంహరించి నిన్ను తప్పక స్వీకరిస్తాడు. నీవు నీ భర్త సన్నిధిలో సకల శుభాలను, సంతోషాలను అనుభవిస్తావు. ఊరడిల్లు తల్లీ!" అని సరమ సీతాదేవి దుఃఖాన్ని తొలగించి ఆమెకు అమితంగా

సంతోషాన్ని కల్గించింది.

సీతాదేవికి మరొక సంతోషకరమైన మాట తెలిపింది.


"అమ్మా మాయా శిరస్సును చూపడం ద్వారానిన్ను లొంగ దీసికోవడానికి రావణుడు చేసిన ప్రయత్నాలన్నిటిని ఆయనకు కూడ కనుపడకుండా ఏవిధంగా చూడగలిగానో, అదే విధంగా ఎవ్వరికి కనుపడకుండా నేను సువేల పర్వతము పైకి వెళ్లి శ్రీరాముని సందర్శించి రాగలుగుతాను.

నేను వెళ్లేప్పుడు నాకు విమానాలతో అవసరంలేదు. ఎగిరే రథాలతో పనిలేదు.


నేను వేగంగా ఆకాశంలో అదృశ్యంగా వెళ్లుతుంటే నా వేగాన్ని వాయుదేవుడైనా

గరుత్మంతుడైనా అందుకోజాలరు".


సరమ మాటలు సీతాదేవిని మరింత సంతోషపరిచాయి. అయితే సీతాదేవికి శ్రీ రాముని ప్రయత్నాల గురించి తెలిసి కోవడం కంటే రావణుని ప్రయత్నాల గురించి తెలిసి కోవడమే ముఖ్యమనిపించింది.


శ్రీ రాముడెలాగూ తనను రక్షించే ప్రయత్నాలు తప్పక చేస్తాడు. వాటి గురించి ముందుగా తెలిసికొన్నా, తెలిసికోకున్నా తేడాలేదు.


కాని రావణుని ప్రయత్నాలు తెలియాలి. "యుద్ధ భయంకరతను చూచి, తన మనస్సును మార్చుకొని నన్ను రామునికి అప్పగించాలను కొంటున్నాడా ? లేక యుద్ధానికే కట్టుబడి ఉన్నాడా? లేక యుద్ధాని కంటే ముందే నన్ను చంపి, శ్రీ రాముని శోకములో ముంచి, యుద్ధ రంగం నుండే ఆయనను అయోధ్యకు త్రిప్పి పంపాలనుకొంటున్నాడా?" ఈ విషయాలు వెంటవెంటనే నాకు తెలియాలి. అందువలన నీవు రావణుని వద్దకు అదృశ్యంగా వెళ్లి అన్ని తెలిసికొనిరా" అని సరమను సీతాదేవి కోరింది......

*యది నామ కథా తస్య నిశ్చితం వా అపి యద్ భవేత్*

*నివేదయేథాః సర్వం తత్ పరో మే స్యాదనుగ్రహః*

కామెంట్‌లు లేవు: