🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
ఒక భోజన ప్రియుడు పంపిన
ఈ వృత్తాంతం సరదాగా చదివేయండి ఇప్పుడు :
😄😄😄😄😄😄😄😄😄😄😄
నేను భోజన సంతర్పణ విశ్వవిద్యాలయములో, ‘భోజన శాస్త్రమూ, అందలి మెళకువలూ’ అనెడి విషయమునందు రెండు సంవత్సరముల ఎం ఏ చదువుకొనుచున్న రోజులవి! ఆ
ఎం ఏ పట్టా పొందుటకు గల పాఠ్యాంశములలో,
బాగుగా నములు పద్ధతులూ,
వివిధ ఆధరువులూ,
ఆధరువులకు గల అనేక అనుపానములూ,
భోజన సమాప్తి యందు
విస్తరిని ఒక్క అణువు కూడా మిగులకుండ శుభ్రపరచు విధానములూ,
భోజన తయారీకి వాడు వివిధ దినుసుల ప్రాంతీయ ప్రాముఖ్యతా వంటివాటిని,
గొప్ప పాకాచార్యులు
బోధించెడి వారు!
మా భోజన సంతర్పణ విశ్వవిద్యాలయపు ఉప కులపతి (వైస్ చాన్సెలర్ ) అయినటువంటి పప్పు పార్వతీశావధాన్లు గారు ఎల్లప్పుడూ ఉటంకించెడివారు -
'సద్భోజనము వండుట కన్ననూ,
ఆ సద్భోజనమును ముప్పూటలా ఆరగించు విధానము తెలిసి, దానినుండి బ్రహ్మానందము పొందగలుగుట యే కష్టసాధ్యము!' అని!
🍜
నా ఎం ఏ (భోజనానందము) ఆఖరి సంవత్సరపు వార్షిక పరీక్షల యందు, ప్రశ్నాపత్రమునందు గల ఒక 30 మార్కుల ప్రశ్న ఏమనగా,
'నీ మధ్యాహ్న భోజనమునకు వేడన్నమూ, వేయించి ఉడకబెట్టిన ముద్ద పప్పూ, పుల్ల పీచు గల, టెంక గట్టి మామిడికాయలతో, సామర్లకోట పప్పు నూనె, ఆవపిండీ, వినుకొండ ఎర్ర ఖారమూ వాడి పెట్టిన ఆవకాయా, పాల ఇంగువ తిరగమాత తో, గుమ్మడీ, శొరా, బెండా, రామ ములగా, ములగా ముక్కలతో కాచిన ముక్కల పులుసూ, ఎర్ర మినప అప్పడములూ, అవనిగడ్డ ఆవు నెయ్యీ, ఒంగోలు బర్రెల చిక్కని పాల పెరుగూ ఉన్నవి! నీవు ఈ ఆధరువులను ఏ విధముగా ఆరగించెదవో ఒక ఠావుకు మించక వర్ణించుము!' అని!
నేను వ్రాసిన సమాధానము ఇది:
'ముందుగా, వేడన్నము నందు ఆ ముద్ద పప్పు మొదటి పర్యాయము కలిపి, ఆ ఆవునెయ్యి మూడు చెంచాలు దట్టించి, ఆ పప్పన్నము తో పాటు, విస్తరి యందు పక్కగా వేసుకున్న ఆ ఎర్ర పుల్ల ఆవ ఊట ఆవకాయ నంచుకునుచూ ఆరగించెదను! మధ్యే మధ్యే ఆ ఎర్ర మినపప్పడము ముక్క నములుదును! రెండవ తూరి, తిరిగి ఆ వేడన్నము నందు ముద్ద పప్పు కలిపి, నెయ్యి కుమ్మరించి, విస్తరికి పక్క గా కొంచెము ఆ ఇంగువ ముక్కల పులుసు ఒక గరిటెడు పోసుకొని, ఆ పప్పన్నము తో పాటు ఆ పక్కనున్న వేడి ముక్కల పులుసు అద్దుకొనుచూ ఒక పట్టు పట్టెదను! మూడవ పర్యాయము తిరిగి ఆ వేడన్నము నందు ఆ ముద్ద పప్పు బాగుగా కలిపి, ఆ పప్పన్నము మీద ఆ ఇంగువ ముక్కల పులుసు పోసుకొని, ఆవునెయ్యి తో తడిపి, కడుపారా తాదాత్మ్యము చెందుచూ ఆరగించెదను! ఇక చివరి గా, ఆ వేడన్నమునందు ఆ ఒంగోలు బర్రెల మీగడ పెరుగు వేసుకొని, ఆ పెరుగన్నము నందు, ఆ గుమ్మడి ముక్కల గుజ్జూ, ఆ శొరముక్కల రుచీ, ఆ బెండముక్కల జిగురూ ఆస్వాదించుచూ తినివైచెదను!'
ఈ సమాధానము చదివి నోరు తడిసి పోయిన మా ప్రొఫెసరు శొంఠి శ్రీరామ శర్మ గారు ఆ సమాధానమునకు ముప్పై మార్కులకు ముప్పై మార్కులూ వేసినారు!!
ముదావహమైన విషయము ఏమనగా, ఆ ఏడాది ఆ ఎం ఏ పట్టా యందు నేను విశ్వవిద్యాలయమునందు ప్రధమ స్థానము సంపాదించి, 'ఘటోత్కచ గోల్డు మెడలు ' కూడా అందుకొనగల్గినాను!
ఈ విషయమును మీతో పంచుకొనుటకు సంతోష భుక్తాయాస పడుచున్నాను
🍜🙏
సేకరణ:- వాట్సాప్ పోస్ట్.
😄😄😄😄😄😄😄😄😄