19, ఆగస్టు 2020, బుధవారం

Srimadhandhra Bhagavatham -- 93

by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

నృగమహారాజు చరిత్రము:
కృష్ణ పరమాత్మ అంతఃపుర ఉద్యానవనంలో ఒక లోతయిన నుయ్యి ఉన్నది. ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ కుమారులయిన ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలయిన వారందరూ విహరిస్తున్నారు. వాళ్లకి అలసట కలిగింది. అలసట తీర్చుకోవడం కోసమని కాసిని నీళ్ళు త్రాగాలని అనుకున్నారు. అక్కడ ఉన్న నూతి దగ్గరకు వచ్చి నూతిలోకి చూశారు. అందులో పెద్ద ఊసరవెల్లి పడి ఉన్నది. దానిని చూసి వాళ్ళు తెల్లపోయారు. దానిని పైకి తీద్దామనుకున్నారు. పెద్ద తాళ్ళు తెచ్చి దానికి కట్టి దానిని పైకి లాగడానికి ప్రయత్నించారు. కానీ పైకి తీయలేకపోయారు. వారు పరుగుపరుగున లోపలికి వెళ్ళి కృష్ణపరమాత్మకు చెప్పారు. కృష్ణ పరమాత్మ బయటకు వచ్చి నూతిలోకి వంగి తన ఎడమ చేతితో ఊసరవెల్లిని పట్టుకుని చాలా సులువుగా ఒక గడ్డిపరకను పైకెత్తినట్లు నూతిలోంచి తీసి బయట పడేశాడు. సర్వజ్ఞుడయిన పరమాత్మ సాంబుడు మొదలయిన వారిని అడ్డుపెట్టి లోకమునకు ఒక గొప్ప ధర్మమును ఉపదేశం చెయ్యాలని అనుకుని ఊసరవెల్లిని ‘నీవు ఎందుకు ఎంత పెద్ద ఊసరవెల్లి స్వరూపమును పొందావు? ఎందువలన నీకీ జన్మ వచ్చింది?’ అని అడిగారు. ఊసరవెల్లి ఆయనకు నమస్కారం చేసి ‘మహానుభావా! నేను ఇక్ష్వాకువంశంలో జన్మించిన నృగ మహారాజుని’ అని చెప్పాడు. నృగుడు రామచంద్రమూర్తి జన్మించిన వంశంలో జన్మించిన వాడు.
నృగ మహారాజుగారు రాజ్యమును పరిపాలిస్తున్న రోజులలో పరమ ధర్మాత్ముడు. ఆయన చేయని పుణ్యకార్యం లేదు. ఆయన ఒకచోట భాగవతంలో చెప్పుకున్నారు ‘నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసిన పాపం వస్తుంది. కాబట్టి నేను చెప్పుకోకూడదు. కానీ, కృష్ణా ఈ భూమి మీద రేణువులను లెక్కపెట్టవచ్చునేమో కానీ, నేను చేసిన దానములు లెక్కపెట్టలేరు. నేను చెయ్యని దానములు లేవు. ఒకనాడు నేను ఒక గోవును కశ్యపుడు అనే బ్రాహ్మణునకు దానం ఇచ్చాను. ఆ కశ్యపుడు ఆ గోవును తీసుకువెళ్ళి తన పెరటిలో కట్టుకున్నాడు. మరునాడు ఆ గోవును పచ్చిగడ్డి మేయడం కోసమని వదిలాడు. ఆ గోవు తప్పించుకుని అలవాటు ప్రకారం ఇంతకు పూర్వం తాను ఉండే మహారాజుగారి ఆలమందలోకి వెళ్ళిపోయింది. రాజు తాను దానం ఇచ్చేసిన గోవు తిరిగి మళ్ళీ వచ్చి తన మందలో కలిసిపోయిందనే విషయమును గుర్తించలేక అదే ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం చేశాడు. వేరొక బ్రాహ్మణుడు ఈ ఆవును తోలుకుని వెళ్ళిపోతున్నాడు. కశ్యపుడికి తాను దానం పుచ్చుకున్న ఆవు ఒకేఒక జీవనాధారమై ఉన్నది  ఆ ఆవు కనపడడం లేదు. ఆ ఆవుకోసమని వెతుకుతున్నాడు. దానిని వేరొక బ్రాహ్మణుడు తీసుకువెడుతున్నాడు. కశ్యపుడు దానిని చూసి ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్లి ‘అది నా ఆవు. నృగ మహారాజు గారు దానిని నాకు దానం చేశారు’ అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు ‘నేను ఇప్పుడే పుచ్చుకున్నాను. నేను గోచౌర్యం చేసిన వాడిని కాదు. నేను ఇప్పుడే రాజు దగ్గర ఈ గోవును దానం పుచ్చుకుని తీసుకువెడుతున్నాను’ అన్నాడు. ‘లేదు ఈ గోవు నాది’ అన్నాడు కశ్యపుడు. ‘కాదు ఈ గోవు నాది’ అన్నాడు బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద రభస బయలుదేరింది. ఇద్దరు కలిసి నృగ మహారాజు దగ్గరికి వెళ్ళారు. ‘అయ్యా, ఈ గోవును యింతకు పూర్వం నాకు దానం ఇచ్చావు. అదే ఆవు నీ మందలో కలిసిపోయింది. నీవు మరల ఈ ఆవును వేరొక బ్రాహ్మణునకు దానం ఇచ్చావు.  నా ఆవును నాకు యిప్పించు’ అని రాజును కశ్యపుడు అడిగాడు. రాజుగారు రెండవ బ్రాహ్మణునితో ‘నా వల్ల పొరపాటు జరిగింది. నీకు దానం ఇచ్చిన గోవు ఇంతకు పూర్వం కశ్యపునకు దానం ఇచ్చేసిన గోవు. ఆ గోవును నీవు ఇచ్చేసినట్లయితే ఆ గోవును కశ్యపునకు ఇస్తాను. అన్నాడు.  రెండవ బ్రాహ్మణుడు తనకు ‘ఆ ఆవే కావాలి’ అని తన దగ్గర ఉన్న ఆవును తిరిగి ఇవ్వడానికి అంగీకరించలేదు.  రాజుగారు ‘నీకు లక్ష గోవులను ఇస్తాను. ఈ గోవును విడిచిపెట్టు’ అన్నాడు. ‘నాకు ఎన్ని గోవులు ఇచ్చినా అక్కర్లేదు. నాకు ఈ గోవే కావాలి’ అని రెండవ బ్రాహ్మణుడు ఆ గోవును పట్టుకుని వెళ్ళిపోయాడు.
 రాజు కశ్యపుని చూసి ‘నీకు నా రాజ్యంలోని భాగమును ఇమ్మంటే ఇస్తాను. నీకు ఎన్ని వేల గోవులు కావాలంటే అన్ని వేల గోవులను ఇస్తాను. తీసుకువెళ్ళు’ అన్నాడు.  కశ్యపుడు ‘నేను అడిగిన గోవును ఇవ్వలేక పోయావు. ఇంక నాకు ఇవ్వవలసినది ఏమీ లేదు’ అని వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. నృగ మహారాజుగారి శరీరం కూడా పతనం అయిపోయింది. ఈయనను స్వర్గలోకమునకు తీసుకువెళ్ళబోతున్నారు. అపుడు దూతలు మీరు అనుభవించవలసిన చిన్న పాపఫలితం ఒకటి ఉన్నది. అది అయిపోయిన తరువాత మిమ్ములను స్వర్గ లోకమునకు తీసుకు వెళతాము. ఆ పాపఫలితం పూర్తి అయిపోయే వరకు పెద్ద ఊసరవెల్లియై నూతిలో పడి ఉండండి’ అన్నారు.  నృగ మహారాజు తాను చేసిన పాపమేమిటని వారిని ప్రశ్నించగా వారు ‘నీవు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవును వేరొక బ్రాహ్మణునకు దానం ఇచ్చావు. ఊసరవెల్లివై పడి ఉండు’ అన్నారు.
ఈమాటలు నృగ మహారాజు కృష్ణ పరమాత్మకు చెప్పాడు. పరమాత్మ చేతి స్పర్శ తగిలినంత మాత్రం చేత ఆ ఊసరవెల్లి తాను చేసిన పాపమును పోగొట్టుకొని ఊర్ధ్వలోకముల నుండి వచ్చిన రథమును ఎక్కి నృగమహారాజు కృష్ణ పరమాత్మకు నమస్కరించి  వెళ్ళిపోయారు.  కృష్ణ పరమాత్మ ‘బ్రాహ్మణులకు చెందిన ధనమును తెలిసి కాని, తెలియక గాని ఎవరయినా అపహరిస్తే, అలా అపహరించిన కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటివెంట నీటిబిందువు కిందపడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకములను అనుభవిస్తాడు. నా భక్తుడిగా ఉండాలనుకున్న వాడు బ్రాహ్మణ ద్రవ్యమును కాజేయడానికి వీలులేదు. ఎవరు బ్రాహ్మణ ద్రవ్యము మీద ఆశ పెట్టుకుంటాడో వాడిని ఎప్పటికీ నా భక్తునిగా నేను చేరనివ్వను. బ్రాహ్మణుల పట్ల నాకు ఉన్న భక్తి అటువంటిది’ అన్నారు.
ఇక్కడ మనకి కొన్ని సందేహములు కలుగుతాయి. నృగుడు బ్రాహ్మణునకు లక్ష గోవులను ఇస్తానన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆ గోవును కశ్యపునకు వదిలివేయవచ్చు కదా! ఆ బ్రాహ్మణునకు అంత మౌడ్యమేమిటి? పోనీ బ్రాహ్మణుడు మూఢుడై ఉండవచ్చు. కశ్యపునకు గోవు కాకపోతే రాజ్యం ఇస్తానన్నాడు. కశ్యపుడు తనకి ఆ గోవే కావాలని రాజ్యం, ఇతర గోవులు  అక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఏదయినా పొరపాటు జరిగితే దిద్దుకోవలసిన అవసరం బ్రాహ్మణులకు లేదా? బ్రాహ్మణుడయిన వాడు ఇతరులు చేసిన తప్పు దిద్ది దానివలన అవతలి వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయాలి. అది అతని బాధ్యత. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణులిద్దరూ అలా ప్రవర్తించవచ్చునా? కృష్ణుడు కూడా కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా? ఇవీ ఇక్కడ కలిగే సందేహములు. వీటికి సమాధానములను కొందరు పెద్దలు వివరణ ఇచ్చారు. బ్రాహ్మణుడు అనగా ఎవరు?
ఒక గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత తనకి అంత ఐశ్వర్యం లభించిందని తనకు ఉన్న దానిచేత ఎప్పుడూ తృప్తిపడిపోయి ఎవరు పరిపూర్ణమయిన సంతృప్తితో ఉంటాడో, ఎవడు తనకు ఏదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు. బ్రాహ్మణుడు దొరికిన దానితో తృప్తిని పొంది ఉండాలి తప్ప దొరికిన దానిని అడ్డుపెట్టుకుని చాలా సంపాదించెయ్యాలని అనుకుంటే బ్రాహ్మణ్యం పోతుంది. కశ్యపునికి ఆవుకి బదులుగా ఏదయినా ఇస్తానన్నా ఆయన ఆశ పొందలేదు. దానిని అంగీకరించలేదు. రాజు నావలన మహాపరాధం జరిగింది నన్ను మన్నించండని ఒక మాట అని బ్రాహ్మణుల పాదములు పట్టుకుని ఉండాలి. రాజు అవతలి వారియందు ఉన్న తృప్తిని గమనించలేకపోయాడు. బేరం పెట్టాడు. వాళ్ళిద్దరూ తమకి అక్కరలేదని తమ బ్రాహ్మణ్యమును నిలుపుకున్నారు. బ్రాహ్మణ్యము అనేది అపారమయిన తృప్తితో పొందవలసిన లక్షణము. దానము చేయబడిన ఆవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవడంలో రాజు ఏమరుపాటు పొందాడు.  తప్పును రాజు ఖాతాలో వేశారు. దానికి ప్రాయశ్చిత్తం ఆ పాపఫలితమును అనుభవించడమే.  కృష్ణ పరమాత్మ ఇంకా పరివేదన చెందకుండా పైకెత్తారు తప్ప ఊసరవెల్లి జన్మ రాకుండా చేయలేకపోయారు.
ఈ ఆఖ్యానం వినడానికి చాలా చిన్నకధలా ఉంటుంది. కానీ ఇందులో మనకి గొప్ప ధర్మం తెలుస్తుంది. దానం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు ఈ కధ నేర్పుతుంది.  దానం చేసేటప్పుడు చూపే వినయం వలన ఈశ్వరుడు ప్రీతి చెంది ఆ దానమునకు ఫలితమును ఇస్తాడు. దానం చేసేటప్పుడు శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ లేకపోవడం వలననే రాజును పాపం అనుభవింప చేసింది. నేనిస్తున్నాననే అహంకారం ఉండకూడదు. శ్రీమన్నారాయణుడు తన ఎదుట నిలబడి దానం పుచ్చుకుని అనంతమయిన ఫలితమును ఇచ్చి ఉత్తర జన్మలో నేను అనుభవించ గలిగిన శుభ ఫలితములను ఇవ్వడానికి దానం పుచ్చుకున్నాడు నేను మిక్కిలి ధన్యుడను అని భావిస్తూ దానం పుచ్చుకున్న వాడికి నమస్కరించాలి. ఈ కథ అంత విశేషమయిన స్థితిని అవిష్కరిస్తుంది.

పూర్వం కరూషదేశమును పౌండ్రక వాసుదేవుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పెరిగి పెద్దవాడయిన తరువాత ఆయనకు ఎవరో ‘ మీపేరు ఉన్నవాడు మరొక ఆయన ఉన్నాడు. ఆయన వసుదేవుని కుమారుడు. అసలు వాసుదేవుడు ఆయనేని లోకం నమ్ముతున్నది’ అని చెప్పారు. ఈ విషయం చెప్పగానే ఈయన కూడా తెల్లటి శంఖం ఒకదానిని కొనుక్కున్నాడు. ఒక చక్రమును, గదను, ధనుస్సు చేయించుకున్నాడు. ఎప్పుడూ పట్టు పీతాంబరము కట్టుకోవడం ప్రారంభించాడు. ఆవిధంగా అతను వాసుదేవుని అనుకరిస్తూ తాను పౌండ్రక వాసుదేవుడనని మురిసిపోయేవాడు. ఒక రాయబారిని పిలిచి నీవు వెళ్లి కృష్ణుడికి ఒక సందేశం చెప్పు అని ఒక లేఖ రాసి ఇచ్చి పంపించాడు. ఆ రాయబారి కృష్ణ భగవానుని దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణుడు నిండుసభలో కూర్చుని ఉన్నాడు. ఈ రాయబారి వెళ్లి ‘ పౌండ్రక వాసుదేవుడు మీకీ రాయబారం పంపించాడు’ అని చెప్పాడు. ఆ పత్రికలో 'నేను ఎటువంటి అలంకారములను ధరించి ఉంటానో, అలా నీవు కూడా పెట్టుకుంటావని తెలిసింది. నాకు అర్థం కానిది ఒకటే. నాకూ వాసుదేవుడు అనే పేరు ఉంది. నీకూ వాసుదేవుడు అనే పేరు ఉంది. దీనివలన ఇబ్బంది వస్తోంది. నీ అంతట నీవు మర్యాదగా ఈ చిహ్నములన్నిటిని వదిలి పెట్టెయ్యాలి. వాసుదేవుడన్న పేరును వదిలి పెట్టెయ్యాలి. లేకపోతే యుద్ధమునకు వచ్చి నీ శరీరమును మట్టుపెట్టవలసి ఉంటుంది. ఏది కావాలో అడుగు’ ఇదీ రాయబారం లోని సారాంశం.
కృష్ణుడు 'ఈ చిహ్నములు నాకు సహజములు. నేను వీటిని వదిలిపెట్టడం కుదరదు.  అతడు కోరుకున్న రెండవ కోరికను నేను అంగీకరిస్తున్నాను అని చెప్పు. యుద్ధభూమిలో కలుసుకుందాం’ అని పంపించివేశాడు. పౌండ్రక వాసుదేవునకు కాశీరాజు మద్దతు పలికాడు. ఇద్దరు కలిసి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం మొదలుపెట్టారు. అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడో పౌండ్రక వాసుదేవుడు అలాగే ఉన్నాడు. కృష్ణుడు వానిని రథం మీద చూసి ఆశ్చర్యపోయి పకపకా నవ్వి యుద్ధం ప్రారంభించాడు. కొంతసేపు వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. చివరికి పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు.  చిత్రమైన సంఘటన జరిగింది. ఆ చచ్చిపోయిన వానిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. ఇది వినగానే పరీక్షిత్తు తెల్లబోయాడు. ‘ఆయనలో తేజస్సు ఈయనలో ఎలా కలిసింది' అని శుకమహర్షిని అడిగాడు. శుకుడు అతనికి సందేహం తీరేలా సమాధానం చెప్పాడు. పౌండ్రక వాసుదేవుడు ఏ పని చేసినా అచ్చం కృష్ణుడిలా ఉన్నానా లేనా అని ఎల్లవేళలా కృష్ణుడినే తలచుకుంటూ ఉండడం వలన మనస్సునందు కృష్ణ ధ్యానమును పొంది ఉన్నాడు. కాబట్టి వాడు ఏ  కారణం చేత తలచినా సంతతము తలచిన  వస్తువులోనే కలిసిపోయాడు. పౌండ్రక వాసుదేవుని వృత్తాంతం నుంచి మనం ఒక్కటి తెలుసుకోవాలి. మనం ఎప్పుడూ భగవంతుని పేరుతోటి ఆయన లీలల తోటి ఈశ్వరుని అనుకరించే ప్రయత్నములు చేయకూడదు. అటువంటివి ధూర్త చేష్టితములు అయిపోతాయి. అక్కడ యుద్ధం జరిగినపుడు కాశీరాజు తల కూడా తెగిపడిపోయింది. కానీ కాశీరాజు తేజస్సు కృష్ణ పరమాత్మలో చేరలేదు.
కాశీరాజు కొడుకు కృష్ణుడి మీద అభిచారిక హోమం చేశాడు. కృష్ణుడు దానిని ఒక చక్రంతో తోసి అవతలకి పారేశాడు. ఇది అనవసర విషయముల జోలికి వెళ్ళి మద్దతులు ప్రకటించడం, తిరగడం మొదలయిన ఇబ్బందులు తీసుకువస్తాయని భగవంతుని సాత్త్వికమయిన మూర్తులను ఆరాధన చేసి మనస్సును సత్త్వ గుణంతో ఉంచుకుని, భగవంతుని చేరే ప్రయత్నం చేయాలి తప్ప, లేని పోని భేషజములు అంత మంచివి కావని హెచ్చరిక చేసే అద్భుతమయిన లీల.
******************
*అన్నమయ్య సంకీర్తన*
రేకు: 61-3
సంపుటము: 1-312
రాగము: ధన్నాసి.


నందనందన వేణునాదవినోద ము-
కుంద కుందదంతహాస గోవర్ధనధరా!!


రామ రామగోవింద రవిచంద్రలోచన
కామ కామకలుష వికారవిదూరా
ధామ ధామవిభవత్ర్పతాపరూప దనుజని-
ర్ధూమధామ కరణచతుర భవభంజనా!!


కమల కమలవాస కమలరమణ దేవో-
త్తమ తమో గుణసతతవిదూర
ప్రమదత్ర్పమదానుభవభావకరణ
సుముఖ సుధానంద శుభరంజనా!!


పరమ పరాత్పర పరమేశ్వరా
వరద వరదామల వాసుదేవ
చిరచిర ఘననగ శ్రీవేంకటేశ్వర
నరహరి నామ పన్నగశయనా!!

🕉🌞🌏🌙🌟🚩

భావము :--

     ఓ నందనందనా! వేణుగాన వినోదా! ఓ ముకుందా! మొల్ల మొగ్గ వంటి లేత చిరునవ్వుగల మనోహరా! గోవర్ధన పర్వతము నెత్తిన మహానుభావా! (నీకు వందనములు).


1. ఓ పరశురామా! రఘురామా! గోవిందా! సూర్యచంద్రులు నేత్రములైన ప్రభూ! మాయొక్క కామనలను, కామనలవలన జనించిన దోషములను పరిహరించువాడా! మోక్షమునకు స్థానమై ముక్తి వైభవము యొక్క ప్రతాపము రూపుదాల్చినవాడా రక్కసి మూకను సమూలముగా కంపింపజేయువాడా! నేర్పరితనము ద్యోతక మగునట్లు భవబంధములను సడలించు
మహానుభావా! నీకు వందనములు.


2. కమల(బ్రహ్మ)కు ఆవాసమైన (స్థానమైన) కమలము (నాభియందు) గలదేవా! లక్ష్మీవల్లభా! దేవతలందరిలో శ్రేష్ఠుడా! ఎల్లప్పుడూ తమోగుణమును నిరసించి నిర్మూలించువాడా!
ప్రమదానుభవమును (బ్రహ్మానందమును),
ఆనందస్వరూపిణియైన లక్ష్మిని చేపట్టిన భావస్వరూపా! ప్రసన్నత చేకూర్చు మోక్షానందము కలిగించే శుభరంజనుడా! (నీకు అనేక వందనములు).


3. ఓ సర్వోత్తమా! పరాత్నరా! (సర్వ శ్రేష్ఠా!) ఓ పరమేశ్వరా!వరములనొసంగు దేవదేవా! ఓ వరదామల! (నిర్మల లక్ష్మీనివాసా!) వాసుదేవా! శాశ్వతుడా! నిరంతరం వేంకటాద్రి ఆలయముగా గల వేంకటేశ్వరా! నరహరి నామముతో శేషతల్ప శాయియైన దేవాది దేవా! (నాకు శరణాగతియే ఆధారము తండ్రీ! నన్ను రక్షింపుము.)

🕉🌞🌏🌙🌟🚩
*******************

రాజయోగం అంటే ఏమిటో

*జైశ్రీమన్నారాయణ - జైశ్రీహనుమాన్*

సందేహం;- రాజయోగం అంటే ఏమిటో వివరిస్తారా?

సమాధానం;- పతంజలి చెప్పిన అష్టాంగయోగాన్నే రాజయోగం అంటారు.

ఈ యోగానికి ప్రధానంగా కావలసినవి అభ్యాసం, వైరాగ్యం. అభ్యాసం అంటే ప్రాక్టీస్. మాటిమాటికి ప్రాపంచిక విషయాలవైపు మళ్ళుతున్న మనస్సును వెనక్కు లాగుతూ ఉండాలి. సమాధిస్థితి చేరిన తర్వాత చిత్తం నిశ్చలం అవుతుంది.

వైరాగ్యం అంటే సుఖాలు, సంతోషం, కీర్తిప్రతిష్ఠలు. ఇవన్నీ నా అధీనంలోనివే కాని నేను వాటి అధీనం (కంట్రోల్) లో లేను అనే భావం, కేవలం నా స్వరూపం నాకు చాలు అనే తృప్తి. ఈ అభ్యాస, వైరాగ్యాలతో రాజయోగం ప్రారంభించాలి.

అష్ఠాంగయోగంలో మొదటి రెండు దశలు యమం, నియమం. యమం అంటే అహింస, సత్యం, దొంగతనం చేయకపోవడం, బ్రహ్మచర్యం, దానం పుచ్చుకోకపోవడం మొదలగు మంచి అలవాట్లు.

నియమం అంటే శుచి, శుభ్రత పాటించడం, ఉన్న దాంట్లో తృప్తిపడడం, శాస్త్రపద్ధతిలో శరీరాన్ని కృశింపచేసుకోవడం, ధార్మిక సాహిత్యం అధ్యయనం చెయ్యడం, మంత్ర జపం చెయ్యడం, అన్నీ భగవత్ పరంగా చెయ్యడం.

తర్వాత అంగాలు ఆసన, ప్రాణాయామాలు. ఈ రెండింటికీ ఇప్పుడు అత్యధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. తర్వాత దశ ప్రత్యాహారం. అంటే తాబేలులాగా, ఇంద్రియాలను లోపలికి ముడుచుకోవడం.

ప్రత్యాహారం తర్వాత ధారణ దశ. ఈ దశలో మనస్సును ఒకచోట నిలిపి, నిశ్చలం చేయడం జరగాలి. తర్వాతదే ధ్యానదశ. ఇక్కడ మనస్సును ఆత్మ మీద నిలపాలి. ఎనిమిదవదైన సమాధిదశలో, ప్రకృతి సంబంధం వదిలిపోయి మోక్షం లభిస్తుంది.

ఇదే అష్టాంగ రాజయోగం.

*శుభంభూయాత్
*సందేహం:*

*శ్రీ శివునికి, విఘ్నేశ్వరునికి, పార్వతీ అన్నపూర్ణలకు తులసిదళాలతో పూజ చేయడంలో తప్పు ఏమైనా ఉన్నదా? (పువ్వులు దొరకనప్పుడు)*

*నివృత్తి:*

ఎట్టి పరిస్థితులలోనైనా తులసి దళాలతో శివుని, పార్వతిని, అన్నపూర్ణను పూజించవచ్చు. కేవలం గణపతిని మాత్రం తులసితో పూజించరాదు. (దైవం ఒకరే అయినా వివిధ నామరూపాలతో వ్యక్తమైనప్పుడు, ప్రత్యేక శక్తుల్ని వెలువరిస్తూ, ప్రత్యేకమైన పూజా విధానాలు కలిగి ఉంటాడు.) అయితే వినాయక చతుర్థినాడు మాత్రం ఏకవింశతి (21) పత్రాల పూజలో తులసితో పాటు పూజించవచ్చు.
**************************

కఠోపనిషత్‌ వివరణ

కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 31 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 20 🌻*

ఆచార్యుడు కానటువంటివాడు ఆత్మతత్త్వమును బోధించలేడు అని చెప్తున్నారు.

అంటే అర్ధం ఏమిటీ అంటే స్వయముగా తానే ఆచరించి తాను స్వయముగా ఆత్మనిష్ఠను పొందనటువంటివారు ఎవరైతే వున్నారో, వారు ఆత్మతత్త్వాన్ని బోధించడానికి అనర్హులు. ఒకవేళ అటువంటి వారిని నీవు ఆశ్రయించినచో, వారు నీకు ఆత్మోన్నతిని కలిగించకపోగా, నీలో అవిద్యా శబలితమైనటువంటి అజ్ఞానప్రవృత్తికి బలం చేకూర్చేటటువంటి అవకాశం వుంది.

        కాబట్టి గురువుని ఎంపిక చేసుకునేటప్పుడు వారిని సమగ్రముగా గమనించవలసినటువంటి అవసరం వుంది. వారిని అనుసరించాలట. నిజానికి శిష్యుడు గురువుని నిర్ణయించుకోవాలి అంటే ఒక సంవత్సరకాలం అనుగమించి ఉండాలి. అనుసరించి వుండాలి. అనేక సందర్భాలలో గురువుగారు ఎలా వున్నారు అనేటటువంటి పరీక్ష చేయాలి. నిజానికి మాట్లాడితే శిష్యుడే గురువుని పరీక్షించాలి. ఈయన నాకు తగునా. తగుపాటి గురువును అన్వేషించాలి. ఈ అన్వేషణ అత్యంత శ్రద్ధతో చేయాలి.

అలా చేసేటప్పుడు అతనికి ఆ గురువుగారు నిరంతరాయంగా ఆత్మనిష్ఠ గురించే బోధిస్తున్నారా, లేక జనవాక్య హితమైనటువంటి ప్రేయోమార్గ పద్ధతిగా జగత్ సంబంధమైనటువంటి పద్ధతిగా బోధ చేస్తున్నాడా అనేటటువంటిది గ్రహించాలి, గమనించాలి. ఎవరైతే స్వయముగా ఆత్మనిష్ఠులో వారు మాత్రము అతికుశలురై వుండుటచేత - ఈ అతికుశలత్వం అంటే అర్ధం ఏమిటంటే బుద్ధియొక్క కదలికలని కదలకముందే తెలుసుకొనుట. ఇది కౌశలము అంటే.

కౌశలము అంటే నిపుణత్వం. నైపుణ్యం ఎంత వుండాలయా అంటే “బుద్ధి కర్మానుసారిణీ”. బుద్ధి కర్మననుసరించే పనిచేస్తుంది. కర్మ అంటే ఏమిటీ అంటే మూడు గుణములతో కూడుకున్నది కర్మ. కర్తృత్వ భోక్తృత్వములతో కూడుకున్నది కర్మ.

 ద్వంద్వానుభూతితో కూడుకున్నటువంటిది కర్మ. వాసనలతో కూడుకున్నటువంటిది కర్మ. కాబట్టి గుణత్రయము, వాసనాత్రయమును, దేహత్రయమును, శరీరత్రయమును, అవస్థాత్రయము వంటి త్రిపుటులన్నీ ఇందులో వున్నాయి.

మరి వాటియందు ఏ రకమైనటువంటి కదలిక ఏర్పడినా, ఏరకమైన ప్రలోభం ఏర్పడినా, ఏరకమైన ప్రభావం ఏర్పడినా, ఏరకమైన ప్రతిబంధకం ఏర్పడబోతున్నా, అవి బుద్ధిలోనే వ్యక్తీకరించబడతాయి కాబట్టి, బుద్ధి వాటికి లొంగబోయే లోపలే మేలుకొన్నవాడై బుద్ధిని ఆత్మయందు, సాక్షిత్వమందు, చైతన్యమందు నిలిపివుంచి ఈ ప్రలోభములకు గురి కాకుండా చేయగలగడం కౌశలం. ఇదీ కౌశలం అంటే అర్ధం. కుశలత్వం అంటే అర్ధం ఇది. ఏ నైపుణ్యాన్ని సంపాదించాలయా నువ్వు? ప్రపంచంలో చాలా నైపుణ్యాలు వున్నాయి. అనేక నైపుణ్యాలు.

 ఒక గోడకి మేకు కొట్టాలన్నా నైపుణ్యంతో కొట్టాలి; లేకపోతే వేలు బద్దలవుతుంది. ఒక స్క్రూ బిగించాలన్నా కూడా నైపుణ్యం కావాలి. ఒక సెల్ ఫోన్ రిపేర్ చేయాలన్నా నైపుణ్యం కావాలి. ఒక వంట చేయాలన్నా కూడా, వంకాయ కూర చేయాలన్నా కూడా సరిగ్గా జాగ్రత్తగా చేయకపోతే వేలు తెగుతాయి వంకాయ తెగేబదులు.

 కాబట్టి ప్రతిపనిలోనూ - కర్మ అంటేనే కౌశలం. కర్మ అంటేనే కౌశలం అని అర్ధం. “కర్మసుకౌశలం” అంటే అర్ధం ఏమిటంటే చాలా నైపుణ్యంతో చేయబడేటటువంటి కర్మ అనే అర్ధం చెప్పకూడదు.

సశేషం....
****************

8. అమృతత్వమునకు అర్హత

- వ్యధ చెందని మనసు కలవాడు అమృతత్వ స్థితిని పొందుటకు అర్హుడు - దానికై త్రిగుణములకు అతీతముగ నుండు స్థితిని అభ్యాసవశమున స్థిరపరచుకొన వలెను. 🌹*

యం హి న వ్యథంయన్త్యేతే పురుషం పురుషర్షభ |
సమదుóఖ సుఖం ధీరం సో-మృతత్వాయ కల్పతే || 15

వ్యధ చెందని మనసు కలవాడు అమృతత్వ స్థితిని పొందుటకు అర్హుడని గీత బోధించుచున్నది. త్రిగుణాత్మకమైన సృష్టియందు అవస్థితి చెందినటువిం మానవ ప్రజ్ఞకు వ్యధ సహజము. ప్రతి మానవుడు సహజముగ వజ్రచైతన్యవంతుడై ఉన్నప్పటికీ చైతన్యము త్రిగుణముల యందు బంధింపబడి నప్పుడు వ్యధ కవకాశమేర్పడును.

మరికొంత అవస్థితి చెంది ఇంద్రియముల యందు అనగా ఇంద్రియార్థముల ననుసరించు స్థితియందు బంధింపబడినపుడు అట్టి వ్యధ తీవ్రత చెందును.

సత్యవంతుడైన మానవ ప్రజ్ఞ మేల్కాంచగనే చైతన్యవంతునిగ ఏర్పడును. చైతన్యవంతమైన మానవప్రజ్ఞ త్రిగుణముల లోనికి, ఇంద్రియముల లోనికి ప్రవేశించుట తప్పనిసరి. అట్టి ప్రవేశమున
తన సహజ స్థితిని మరచినచో మాయ ఆవరణమున చిక్కును. అనగా ప్రజ్ఞ త్రిగుణాత్మక మగును.

త్రిగుణాత్మక మగు తన ప్రజ్ఞను త్రిగుణములకు అతీతముగ కూడ అభ్యాసవశమున స్థిరపరచుకొన వచ్చును. త్రిగుణములలోనికి మరియు ఇంద్రియముల లోనికి అవతరణము చెందుచున్న చైతన్యము తన సహజ స్థితిని కోల్పోనవసరము లేదు.

సూర్యుని కిరణము గ్రహగోళాదులను
చేరునపుడు సూర్యుని వదలి, గ్రహములను చేరుటలేదు కదా!
సూర్యకిరణము వ్యాపనము చెందుచున్నట్లుగ మనకు తెలియును.
కిరణము సూర్యుని యొద్దనూ ఉన్నది. మరియు ఏడు గోళముల వద్దకూ ఏక కాలమున చేరుచున్నది. అట్లే మానవచైతన్యము కూడ ఏకకాలమున సప్తకోశములనూ వ్యాపించి యుండ గలదు.

అట్టి వ్యాపనమును అభ్యాసము చేయు పురుషుడు శ్రేష్ఠుడు.
మోక్షమునకు అర్హత కలిగి యున్నవాడు.  మోక్షమునందు సహజముగ నున్నవాడు. పురుషుడు అను పదమును ఉపయోగించుటలో భగవానుని యొక్క రహస్య సూచన  కూడ ఒకటి ఇక్కడ గమనింపదగి యున్నది. ఏడంతస్తుల పురమున ప్రవేశించి, ఏడంతస్తులనూ వ్యాపించి యున్న ప్రజ్ఞవు నీవు సుమా! అని తెలుపుటకే ''పురుషమ్‌'', ''పురుషర్షభ'' అని పలికినాడు.

జీవిమున వ్యధ చెందువారు తమ్ము తాము మరచినవారనియు, సత్యాన్వేషణమున ఓర్పు వహించి తనను తాను గుర్తుకు తెచ్చుకొనుచు వ్యధ చెందక జీవించువారే అమృతత్త్వమునకు తగిన వారనియు గీతోపనిషత్తు బోధించుచున్నది.

భగవద్గీత


(నాకు నేనే శత్రువు ! నాకు నేనే మిత్రుడు!).....
....
మెసెడోనియా రాజైన అలెగ్జాండర్‌ జైత్రయాత్రకు బయలుదేరినప్పుడు తన దేశంలోని గొప్ప తత్త్వవేత్తలలో ఒకడయిన డియోజినస్ దగ్గరకు వెళ్ళాడు!
.
ఆయన ఉపదేశం పొందాలన్న ఆశతో!
.
 ఆ సమయంలో ఒక పెద్ద మర్రిచెట్టు క్రింద తనలో తానే ఆనందంగా హాయిగా నవ్వుకుంటూ  కాలుమీద కాలేసుకుని దర్జాగా సేదతీరుతున్నాడు ఆ మహాత్ముడు.
.
 అలెగ్జాండరు వినయంగా ఆయన దగ్గర నిలుచొని తనకేదయినా ఉపదేశించమని ప్రార్ధించాడు!.
.
అప్పుడు ఆ మహానుభావుడు అడిగాడు,
 "నీవిప్పుడు ఏం చేయదలచుకున్నావు?" అని!
.
ముందు పర్షియా ను జయిస్తాను  చెప్పాడు అలెగ్జాండర్
.
ఆ తరువాత ?
అని ప్రశ్నించాడు డియోజినస్,  ఈజిప్టు అని జవాబిచ్చాడు అలెగ్జాండర్.
.
 తరువాత?
.
 మెసపొటేమియా!
.
 ఇట్లా ఆయన అడగటం
ఈయన చెప్పటం !
.
ప్రపంచంలో ని రాజ్యాలన్నీ అయిపోయేదాకా చెపుతూనే ఉన్నాడు అలెగ్జాండర్‌!
.
ప్రపంచవిజేత అయిన తరువాత ఏం చేస్తావు?
అని అడిగాడు డియోజనస్!
.
మెసడోనియా తిరిగి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పాడు అలెగ్జాండర్.
.
ఈ సమాధానం విన్న వెంటనే డియోజినస్ తను పడుకున్న చోటినుంచి కాస్త పక్కకు జరిగి,

రా! నా ప్రక్కన పడుకో!
.
 విశ్రాంతి తీసుకోవడానికి నీవు అన్ని రాజ్యాలు జయించి అంత రక్తపాతం సృష్టించాలా!
.
అని అడిగాడు!..డియోజినస్.
.
ప్రపంచంలో ఇక జయించడానికి ఏమీలేదు అని అనుకునేంతదాక యుద్ధాలు చేస్తూనే ఉండాలి !
అని అనుకున్నాడు అలెగ్జాండర్‌!
.
అలానే! నేడు కొత్తరకం అలెగ్జాండర్లు బయలుదేరారు!
.
సంపాదన,సంపాదన,సంపాదన
ఒకటే సంపాదన ......
సంపాదించటమే విజయం !
అనే దృక్పధం పెరిగిపోయింది నేడు!
 అందులోని వత్తిడులు దానివల్ల వచ్చే రకరకాల రోగాలు!
.
Life style disorders అని పేరు పెట్టుకున్నాం!
.
ఒక మనిషికి ఎంతకావాలి?
.
ఈ ప్రశ్న దాదాపుగా మనమెవ్వరమూ ఇంతవరకూ వేసుకోలేదు అని అనుకుంటున్నా! ఎవరైనా వేసుకున్నారా?
.
లక్షాధికారి అయిన లవణమన్నమే కాని మెరుగు బంగారమ్ము మింగపోడు!...
.
ప్రపంచం అంతా జయించాడు!
అన్ని దేశాల సుందరీమణులు, అతిలోక సౌందర్యవతులు తనను వరించి వచ్చారు, అయినా రావణునికి కాంక్షతీరలేదు!
ఇంకేదో కావాలి!
 సీతమ్మను చెరబట్టాడు!
చివరకు రాముడి చేతిలో మొత్తం సబాంధవంగా హతుడయ్యాడు !.....
.
అలానే నోటి దురుసుతనం ప్రాణాంతకమవుతుంది!
.
తన మేనమామ కొడుకు,
తన బంధువు అని చూడకుండా పదిమందిలో కృష్ణుడిని అవమానించి ప్రాణం పోగొట్టుకున్నాడు శిశుపాలుడు!
.
తన పినతండ్రి పిల్లలు వాళ్ళు  ,  తనదగ్గర లేనిది ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది అని అనుక్షణం ఈర్ష్యా అసూయలతో మనసు పాడుచేసుకొని చివరకు వాటికే బలి అయిపోయాడు దుర్యోధనుడు!
.
కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు మనలను ఉన్నచోట ఉండనీయవు, !
.
ధగధగా మెరిసే రాగిచెంబులాంటి మనస్సుకు పట్టే మకిలి ఈ ఆరుభావనలు!
.
ఈ భావనలను "యోగసాధన" అనే చింతపండుతో నిత్యం తోమాల్సిందే !
.
ఏ ఒక్కక్షణం కూడా బద్ధకించకూడదు!
.
అందుకే ఆమార్గం "క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గమ్ పధః" అని కఠోపనిషత్తు చెపుతుంది!
.
That path is as sharp as Razor's edge.....
.
మనిషి తనలో చెలరేగే ప్రతి భావాన్ని నిశితంగా గమనించి ఆ భావం ఎక్కడనుండి పుడుతుందో దాని మూలంలోకి వెళ్లి ఎప్పటికప్పుడు పెరికివేయాలి!
.
 లేకపోతే కలుపుమొక్కలు పుడుతూనే ఉంటాయి!
.
మనలను మనమే ఉద్ధరించుకోవాలి!
.
 మనకు మనమే శత్రువు!
మనకు మనమే మిత్రుడు!
.
అని ఎంత అనునయంగా చెపుతున్నారో పరమాత్మ!
..
ఉద్ధరేదాత్మనాత్మానామ్ నాత్మనమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః......
.
భగవద్గీత చదవండి ! చదివించండి!
...

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

ధర్మధ్వజం
హిందు చైతన్య వేదిక

సుభాషితమ్ 🌸

శ్లో|| స్వసంప్రదాయ సంస్కార
విద్యావిజ్ఞాన వైభవమ్|
విధితో రక్ష్యతే యత్ర
తత్ స్వాతంత్ర్యముదీరయేత్||

మహామహోపాధ్యాయ శ్రీ శ్రీభాష్యం.విజయసారధిః

తా|| ఏ దేశంలో సాంప్రదాయాలు, సంస్కారాలు, విద్య, విజ్ఞాన సంపద నియమ పూర్వకంగా రక్షింపబడుతాయో దానినే స్వాతంత్ర్యము అంటారు.

దృఢ సంకల్పం

సాధారణ జీవితం నుంచి 680 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయిన రామ్ కుమార్ తోట.
ఒక సాధారణ పల్లెటూరి యువకుడు దుబాయిలో నవాబులా ఖరీదైన రోల్స్‌రాయిస్‌ కారులో తిరగగలడా? బతుకుదెరువు కోసం నానా అగచాట్లు పడినవాడు.. ఒక కంపెనీకి యజమాని కాగలడా? గల్లీలోని అనామకుడు.. గల్ఫ్‌లో నాయకుడు.. కాగలడా? సొంతూరు కరీంనగర్‌ జిల్లా (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా)లోని వేములవాడ నుంచి... దుబాయి విమానం ఎక్కే వరకు తోట రామ్‌ కుమార్‌కు గమ్యం తెలీదు. వెళ్లేప్పుడు లగేజీలో బీటెక్కులు, ఎమ్మెస్‌లు లేవు. ఒకసారి తప్పి, మళ్లీ గట్టెక్కిన పదో తరగతి సర్టిఫికెట్టు మాత్రమే ఉంది. అలా మొదలైన ప్రయాణం.. ఎన్నో మలుపులు తిరిగింది. రూ.680 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేతను చేసింది..

1980 ప్రాంతం. కరీంనగర్‌ జిల్లా.. కరువు.. నిరుద్యోగం.. అటు పోలీసులు.. ఇటు అన్నలు.. బతకాలంటే బట్టలు సర్దుకుని బయటికి వెళ్లిపోవాల్సిందే! పని దొరికితే ఉప్పో కారమో తిని ఊపిరిపీల్చుకోవచ్చు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో.. ఎడారి దేశం ఊరించింది. రెండు జతల బట్టలు, టెన్తు సర్టిఫికెట్టు పట్టుకుని గల్ఫ్‌ బాట పట్టారు తెలంగాణ గ్రామీణ యువకులు. వారిలో ఒకడు.. వేములవాడ పిలగాడు. ఊరోళ్లకు ‘రాము’. స్కూలోళ్లకు ‘తోట రామ్‌కుమార్‌’. గల్ఫ్‌ దేశానికి ఫ్లయిట్‌ ఎక్కాడు కానీ.. తన బతుకు ఎక్కడ ల్యాండ్‌ అవుతుందో, ఎలా ఉంటుందో తనకే స్పష్టతలేని పరిస్థితి. పాజిటివ్‌గా ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందన్న నమ్మకమే ముందుకు నడిపించింది.

కరీంనగర్‌ జిల్లా వేములవాడలోని ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు రామ్‌కుమార్‌. తల్లిదండ్రులు తోట నారాయణ, నర్సమ్మ. వ్యవసాయ కుటుంబం. ‘చూడు బిడ్డా... బతుకుడు అంటే.. నువ్వొక్కనివే తినుడు కాదు. నువ్వు బాగా బతకాలె, మరో పదిమందినీ బతికించాలె. అదీ బతుకంటే!’ దుబాయి వెళుతున్న కొడుక్కి మంచిచెడ్డలు చెప్పాడు తండ్రి. అలా.. 1989లో దుబాయికి చేరుకున్నాడు రాము. ఓ కంపెనీలో అకౌంట్స్‌ అసిస్టెంట్‌గా చేరాడు. రోజులు గడుస్తున్నాయి కానీ.. ఎదుగూబొదుగూ లేదు. ‘నువ్వు పాసైంది పదో తరగతే భయ్యా. ఇంతకంటే మంచి ఉద్యోగం ఏమొస్తుంది?’ అన్నారు దోస్తులు. అవును, నిజమే! పదికే పరిమితమైతే ప్రయోజనం లేదు. పైచదువులు చదవాలన్న కసిని రగిలించాయా మాటలు. దుబాయిలోనే ఇంటర్‌ పూర్తి చేశాడు. కొన్నాళ్లకు అదీ అర్థమైంది. పైకి రావాలంటే ఈ చదువు సరిపోదని. అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ నైపుణ్యాలు అవసరం. అక్కడే చార్టర్డ్‌ అకౌంటెన్సీ చదివాడు. ఒకవైపు సీఏ పరీక్షలకు సిద్ధం అవుతూనే... సేల్స్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఆ తరువాత అదానీ గ్రూప్‌లో సేల్స్‌ డైరెక్టర్‌గా పెద్ద కొలువే వరించింది.

అదానీ గ్రూప్‌లో ఉద్యోగం రాము జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ పెట్రో కెమికల్‌ విభాగం అధిపతి యోగేష్‌ మెహతా ప్రోత్సాహం మరువలేనిది. కార్పొరేట్‌ పాలనా వ్యవహారాల్లోని లోతుపాతుల్ని తెలుసుకునే అవకాశం కలిగింది. ‘నా కళ్ల ముందు ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతం అయ్యింది. మెహతా అనుభవం నాకెన్నో పాఠాలను నేర్పింది. ఆయనతో పోల్చుకుంటే, పదిశాతం కష్టపడినా పైకి రావొచ్చని అనిపించింది. నాకు నేనే ఒక కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకునేలా చేసింది’ అంటాడు రాము. అదానీ గ్రూప్‌లో పనిచేస్తున్నప్పుడు.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని పలు కంపెనీల సేల్స్‌ డైరెక్టర్లతో పరిచయం కలిగింది. నెట్‌వర్క్‌ను విస్తరించుకున్నాడు. వివిధ కంపెనీల సేల్స్‌ డైరెక్టర్ల గ్రూప్‌లో చేరాడు. అక్కడ అంతర్జాతీయ వాణిజ్య అంశాల గురించి చర్చలు జరిగేవి. కొత్త పరిణామాలపై విశ్లేషించు కునేవారు. దీంతో ప్రణాళికలు కొత్త రూపు తీసుకునేవి. సరిగ్గా అప్పుడే దుబాయిలో నిర్మాణరంగం ఊపందుకుంటున్నది. అప్పటి వరకు ఉద్యోగమే జీవితం అనుకున్న ఆయన.. కొత్త అవతారం ఎత్తాలనుకున్నాడు. బిల్డింగ్‌ మెటీరియల్‌ ట్రేడింగ్‌పై కన్నేశాడు.

కొన్నేళ్లపాటు పైసా పైసా కూడబెట్టిన డబ్బుకు తోడు.. బ్యాంకుల చుట్టూ తిరిగితే కొంత రుణం లభించింది. ఓ స్నేహితుడు చేతులు కలిపాడు. దుబాయిలోనే 2004లో బిల్డింగ్‌ మెటీరియల్‌ ట్రేడింగ్‌కు శ్రీకారం చుట్టాడు రామ్‌కుమార్‌. ఆయన నెలకొల్పిన కంపెనీ ‘టోటల్‌ సొల్యూషన్స్‌’. ఊహించిన దానికంటే గొప్పగా సాగింది వ్యాపారం. లాభాలు కళ్లజూసినప్పుడే భాగస్వామితో పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. 2007లో ఆయన్ని వదులుకోవాల్సి వచ్చింది. సొంతంగా వ్యాపారం చేయడమే తన ముందున్న ఏకైక మార్గం. దేశం కాని దేశం వెళ్లినప్పుడు.. ఏ చిన్న కష్టం వచ్చినా.. ముందు గుర్తొచ్చేది మన ఊరి దేవుడే! వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి అంటే రామ్‌కుమార్‌కు ఎనలేని భక్తి. ఆ దేవుడికే దండం పెట్టుకుని.. అదే పేరుతో దుబాయిలో ‘శ్రీ రాజరాజేశ్వర బిల్డింగ్‌ మెటీరియల్‌ ట్రేడింగ్‌’ (ఎస్‌ఆర్‌ఆర్‌ బీఎంటీ)ని ప్రారంభించాడు. అప్పటికే పరిచయమున్న కస్టమర్లు తోడ్పాటును అందించారు. పెద్ద పెద్ద భవనాలు, షాపింగ్‌మాల్స్‌, నివాస ప్రాంతాలు.. ఇలా ఏ నిర్మాణం జరిగినా తనే మెటీరియల్‌ను సరఫరా చేయడం మొదలుపెట్టాడు.

ఆత్మీయుల్ని  ఆదుకోవడమే కాదు... పండుగలనూ కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలన్నది నా ఆశయం. అందుకే పన్నెండేళ్లుగా దుబాయ్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నా. 

తొలి ఏడాదిలోనే సుమారు రూ.200 కోట్ల లావాదేవీలతో గల్ఫ్‌ దేశాల దృష్టిని ఆకర్షించాడు రామ్‌కుమార్‌. ప్రఖ్యాత బుర్జ్‌ఖలీఫాతో పాటు మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ సిటీ, అల్‌ మక్‌టౌమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, అరేబియన్‌ రాంచెస్‌, స్పోర్ట్స్‌ సిటీ, మోటార్‌సిటీ, దుబాయ్‌ మాల్‌, ఫామ్‌ జుమేరా, బిజినెస్‌ బే... వీటన్నిటికీ భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేసింది ఎస్‌ఆర్‌ఆర్‌. ‘బుర్జ్‌ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం. ఇలాంటి నిర్మాణానికి మెటీరియల్‌ సరఫరా చేసే  అవకాశం రావడం.. నా జీవితంలో మరపురాని అనుభవం’ అని గుర్తు చేసుకుంటాడు రామ్‌కుమార్‌. దుబాయిలో ఏ పెద్ద నిర్మాణం చేపట్టినా తన కంపెనీ మెటీరియల్‌ ఉండాల్సిందే! యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఈ తరహా వ్యాపారం చేస్తున్న కంపెనీల్లో ఆయనది రెండోస్థానం. గల్ఫ్‌ కో-ఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) టాప్‌ బిలియనీర్‌ కంపెనీల జాబితాలో 23వ స్థానం దక్కించుకుంది ఎస్‌ఆర్‌ఆర్‌.

అంతటితో ఆగలేదు. చైనాలోనూ అడుగుపెట్టాడు రామ్‌కుమార్‌. అక్కడ అల్యూమినియం ప్యానెళ్ల పరిశ్రమను నెలకొల్పాడు. 2005లో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు రూ.200 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఇందులో తన వాటా 40 శాతం. ఇటు దుబాయిలో వ్యాపారం విస్తరిస్తోంది, అటు చైనాలో విజయవంతమైంది. మరికొందరి సహాయంతో ఒమన్‌లో కూడా ఒక శాఖను ప్రారంభించాడు. మిడిల్‌ ఈస్ట్‌ కంట్రీస్‌కు బిల్డింగ్‌ మెటీరియల్‌ సరఫరా చేసే టాప్‌ డీలర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. దుబాయి, ఒమన్‌...  రెండు చోట్లా కలిపి ఎస్‌ఆర్‌ఆర్‌ సంస్థ ఏడాదికి రూ.600 కోట్ల లావాదేవీలను నిర్వహిస్తోంది. సుమారు 16 అవుట్‌లెట్లలో 345 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లలో తెలుగువారితో పాటు ఇతర దేశాల వాళ్లు కూడా ఉన్నారు. దాదాపు వెయ్యి రకాల మెటీరియల్‌ను ఈ కంపెనీ సరఫరా చేస్తోంది.

మా ఊరికి ఏం చేసినా తక్కువే. నాకు జీవితాన్ని ఇచ్చిన పల్లె అది. ఇప్పటిదాకా చేసిన సాయం వేరు. ఇకపై చేయాల్సింది వేరు. అందుకే  సేవ ఆర్గనైజ్డ్‌గా ఉండాలని వేములవాడలో టీఆర్‌కే ట్రస్టును ప్రారంభించాను. మా బావ వుప్పుల దేవరాజు, మిత్రులు నాయిని శేఖర్‌, గోలి శ్రీనివాస్‌, బూర సదానందంలను ట్రస్టీలుగా నియమించాను. ట్రస్టు కోసం ఒక భవనాన్ని నిర్మిస్తున్నాను. చుట్టుపక్కల గ్రామాలకు సైతం సేవల్ని విస్తరించే ఆలోచన ఉంది. 

 2008లో దుబాయిలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. రెండేళ్లపాటు వ్యాపారాలను అతలాకుతలం చేసింది. ఆ అడ్డంకుల్ని ధైర్యంగా తట్టుకుని నిలబడింది ఎస్‌ఆర్‌ఆర్‌ సంస్థ. అంతటి సంక్షోభంలోనూ ఒక్క ఉద్యోగినీ తొలగించలేదు, ఎవరికీ ఒక్క రూపాయి జీతమూ తగ్గించలేదు. కొన్నాళ్లు ఓపికతో వ్యాపారాన్ని నడిపించాడు రామ్‌కుమార్‌. ఆ తరువాత అదే ఊపందుకుంది. లాభాల పంట పండింది. అయితే 2016లో గట్టి దెబ్బ తగిలింది. కొందరు కస్టమర్లు విలువైన సరుకు తీసుకుని.. రూ.10 కోట్లకు చెక్కులు ఇచ్చారు. అంతలోనే తమ కంపెనీని గుట్టుచప్పుడు కాకుండా మూసేశారు. ఆ మోసాన్ని జీర్ణించుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. అలాంటి ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలిచాడు రామ్‌కుమార్‌.

నాకు స్నేహితులంటే చాలా ఇష్టం. జీవితంలోని ప్రతి మలుపులో ఫ్రెండ్స్‌ లేకుండా నేను లేను. ఎక్కడున్నా, ప్రత్యేకించి హైదరాబాద్‌, వేములవాడలకు ఎప్పుడు వచ్చినా... చుట్టూ స్నేహితులు ఉండాల్సిందే. నేను ఉన్నత స్థితికి చేరాక వాళ్ల జీవితాలనూ మెరుగ్గా చూడాలను కున్నా. అందుకే వాళ్ల కష్టాలూ తీరుస్తున్నా.

రామ్‌కుమార్‌ దుబాయికి వెళ్లిన కొత్తలో ఇరుకైన గదిలో ఉండేవాడు. ఇప్పుడు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసును ఏర్పాటు చేసుకున్నాడు. సొంతూళ్లో చిన్న ఇంట్లో సర్దుకుని బతికినవాడు.. ఈ రోజు దుబాయిలో విలాసవంతమైన విల్లాను సొంతం చేసుకున్నాడు. వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి ఫెయిలైనవాడు.. పరాయి దేశంలో చార్టర్డ్‌ అకౌంటెన్సీ పాసయ్యాడు.  తొలినాళ్లలో ఒక చిన్న కారు కొంటే.. ఈ జీవితానికి చాలని అనుకున్నవాడు.. ఖరీదైన రోల్స్‌రాయిస్‌లో  షికార్లు చేస్తున్నాడు. పెద్ద కొడుకును ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో చదివిస్తున్నాడు. చిన్న కొడుకు, కూతురు దుబాయిలోని పేరున్న పాఠశాలలో చదువు కుంటున్నారు. గల్ఫ్‌కు వెళ్లి నాలుగు కాసులు సంపాదించి.. తల్లిదండ్రులకు పంపిస్తే అదే పదివేలు అనుకున్నవాడు.. ఇప్పుడు దుబాయిలో తెలంగాణ తరఫున కాన్సులేట్‌ మెంబర్‌గా గౌరవం దక్కించుకున్నాడు. ‘బతకడమంటే నువ్వొక్కడివే బతకడం కాదు.. నీతోపాటు మరో నలుగుర్ని బతికించు.. అన్న నాన్న మాటలు నన్ను ప్రభావితం చేశాయి.

ఒక కంపెనీని నెలకొల్పాలి బిడ్డా - అని నాన్న చెప్పలేదు కానీ.. కొందరికైనా సహాయం చేయాలన్నాడు. ఆ దృక్పథమే ఒక వ్యవస్థ నిర్మాణానికి ప్రేరణగా నిలిచింది. ఈ రోజు నా సంస్థ ఎస్‌ఆర్‌ఆర్‌లో ఇంతమందికి ఉపాధి దొరుకుతోందంటే.. నాన్న కల ఫలించినట్లే కదా!’ అంటున్న రామ్‌కుమార్‌ కళ్లలో ఆనందభాష్పాలు
******************

కందెన

తన పని కావలెనన్న
ఆఫీసరు చేయి తడపకక తప్పదు  ఎరికైనన్
ఏల నన ఆగకుండ నడవవలెనన్న
భారత ప్రెసిడెంటు కారుకు కూడ కందెన కావాలె భార్గవ


భాద్రపద మాసం ప్రారంభం భాద్రపద మాస విశిష్టత

చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసం.

ఈ మాసం లో ఒంటి పూట భోజనం చేస్తే ధన సమృద్ది ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసం లో విశేష ఫలితాన్నిస్తాయి. కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించి , ఉపవాసం జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తే కష్టాలు తొలగి , అష్టైశ్వర్యాలతో తులతూగుతారు.

భాద్రపద శుద్ద చవితి నాడు ఆది దేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు , ఈ రోజున గణపతి పూజ ఉపవాసం వంటివి విశేష ఫలితాన్నిస్తాయి. ఈ పండుగ ఆదివారం రోజు కాని , మంగళవారం రోజు కాని రావడం మరింత విశేషాన్ని సంతరించుకొంటుంది.

భాద్రపద శుద్ద పంచమి నాడు ఋషి పంచమి జరుపుకొంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుశ్రావ సమయం లో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భవిష్యపురాణం లో చెప్పబడింది. ఈ వ్రతం లో ముఖ్యం గా ఆచరించవలసినది , బ్రహ్మహణుడికి అరటి పళ్ళు , నెయ్యి , పంచదార , దక్షిణ ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి. అంతే గాక ఆ భోజనం ధాన్యం , పాలు , పెరుగు , ఉప్పు , పంచాదారలతో తయారుచేయకుండా ఉండాలి. పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం.


భాద్రపద శుద్ద షష్ఠి /సూర్య షష్ఠి , సప్తమి కలసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం , ఈరోజున సూర్యుడిని ఆవుపాలు , పెరుగు , నెయ్యి , గోమయం , గోమూత్రం తో ప్రాశనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని శాస్త్రం లో చెప్పబడింది. షష్ఠి తో కూడిన సప్తమి ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి ని పూజిస్తే ఎటువంటి పాతకాలైన నశిస్తాయి.

భాద్రపద శుద్ద అష్టమి నాడు కేదారవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంప్రదాయ సిద్దం గా ఆచరిస్తుంటారు. భాద్రపద శుద్ద దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం , దేవ , ఋషి , పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు. భాద్రపద శుద్ద ఏకాదశి , దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున పాల సముద్రం లో శేషతల్పం పై శయనించిన శ్రీమహావిష్ణువు , ఈ ఏకాదశి రోజున ప్రక్కకు దొర్లి పరివర్తనం చెందుతాడు , అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలు తొలగి పోతాయి , ముఖ్యం గా సంధ్యాసమయం లో శ్రీ మహా విష్ణువు ని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

భాద్రపద శుద్ద ద్వాదశి వామన జయంతి గా చెప్పబడింది , ఈ రోజున వామనున్ని ఆరాదిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది. ముఖ్యం గా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలని పొందవచ్చు.

భాద్రపద మాసం లో శుద్ద చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. శేషతల్పసాయిగా నాభికమలం తో శ్రీమహాలక్ష్మి సమేతుడైన శ్రీమహావిష్ణువు ని పూజించి , వ్రతమాచరిస్తే దారిద్ర బాధలు తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకొంటారు , భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.

భాద్రపద పూర్ణిమ తో మహాలయపక్షం ఆరంభమవుతుంది, అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృ పక్షం అని కూడా అంటారు. మృతులైన పితరులకు , పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణలివ్వాలి. శ్రాద్దాన్ని యధాశక్తి గా ఈ దినాలలో చేయాలి.

భాద్రపద బహుళ తదియ ని ఉండ్రాళ్ళ తద్దెగా చెప్పబడింది. ఇది స్త్రీలు చేసుకొనే పండుగ , ముఖ్యం గా కన్నె పిల్లలు గౌరీ దేవి ని పూజించి , ఉండ్రాళ్ళను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది. స్త్రీలకు అయిదవతనం వృద్ది చెందుతుంది.

భాద్రపద కృష్ణ ఏకాదశి /అజ ఏకాదశి దీన్ని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతమాచరించి నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.


భాద్రపద కృష్ణఅమావాస్య /మహాలయమావాస్య , ఈ రోజున పితృ తర్పణాలు , దానధర్మాలు చేయడం ఆచారం.
******************

భార్య అంటే

సఖాయః ప్రవివిక్తేషు
భవంత్యేతాః ప్రియంవదాః|
పితరో ధర్మకార్యేషు
భవంత్యార్తస్య మాతరః||

ఏకాంతమందు మధురవచనములు పలుకు మంచి ప్రేమిక భార్య. ధర్మకార్యములందు హితముపలుకు తండ్రివంటిది భార్య. కష్టములందు బిడ్డను ఆదుకునే తల్లి లాంటిది భార్య.

"బృందావనం" లో

నిజంగా జరిగిన కథ

మధురా  "బృందావనం" లో కొన్నేళ్ల క్రితం నిజంగా
జరిగిన సంఘటన, ఇది!
ఇప్పటికీ  ఆ ఆనవాళ్లు' ఇంకా ఉన్నాయి,
పోయి చూడటానికి,!!🙏

ఒక పండితుడు ,తన పూరి గుడిసె లాంటి
ఇంటి ముందు అరుగు పై  కూర్చుండి,,
నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు,!
క్రమం తప్పకుండా భక్తితో.
భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే,
ఆ ప్రాంతం వారు, చాలామంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందే వాళ్ళు!!

అప్పుడప్పుడూ ,ఆయన  తాను చెబుతున్న పురాణం మద్యలో అపి, లోనికి వెళ్ళి వస్తూ ,
మా పిల్లవాడికి స్నానం చేయించా నని
భోజనం పెట్టానని, పడుకో బెట్టాను అనీ
దుస్తులు ధరింప జేశానని చెప్పేవాడు,,
ఇలా రోజూ జరుగుతూ వుండేది,!
కానీ గుడిసె లో పిల్లవాడి అలికిడి, అల్లరి, మాట
ఏది ఎవరికీ  వినపడేది కాదు,,
ఇలా ఏళ్లు గడిచాయి,,

ఒకరోజు ఆయన దేహం చాలించాడు,
గ్రామస్తులు చాలా బాధ పడ్డారు,,,
అయ్యో ! ఎంత మంచి వాడు,,,!
ఎంతో భక్తిశ్రద్ధలతో ఎవరిని ఏమీ అడగకుండా అద్భుతంగా భగవద్ కథలు వినిపించి మనలను
తరింపజేశాడే ,!
మరల ఎవరు ఇంత గొప్పగా చెబుతారు,
అంటూ విచారపడుతూ ,అందరూ  అనుకోని
ఆయన అంత్యక్రియలు జరిపే సన్నాహాలు
చేయడం ప్రారంభించారు ,!!

మా అబ్బాయి అని చెప్పాడు కదా అంటూ ఆ పిల్లాడి కోసం లోనికి వెళ్లి చూస్తే ఎవరూ కనపడలేదు వారికి!!
ఒక రోజు  ఎదురు చూశారు!, పిల్లాడి జాడ లేదు, !చివరకు వాళ్ళే అతడి కళేబరాన్ని యమునానది ఒడ్డుకు తీసుకెళ్ళి మంచి గంధపు కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు!!
ఇక నిప్పు పెట్టడానికి వాళ్ళలో ప్రతీ వాడు,
నేను పెడతాను అంటే..నేను పెడతాను అంటూ
పోటీలు పడ్డారు !
ఎందుకంటే, మహా పుణ్యాత్ముడు ఆయనకు చేసే ఈ పని వల్ల కర్మ చేసేవారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా .!
ఇలా వాళ్ళు పేచీ పడుతూ ఉంటే,
దూరం నుండి ఒక పిలుపు  వినవచ్చింది వారికి,!
ఆగండి !! ఆగండి !!""అంటూ

అందరూ చూస్తుండగా, దూరంగా, ఒక పదహారేళ్ళ బాలుడు పరుగు పరుగున అటే వస్తూ కనిపించాడు
నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను ,!
చనిపోయిన ఈ పెద్దాయన నా తండ్రి. !!
నన్ను ఒక పని మీద పొరుగూరు పంపించాడు,!!
అది చూసుకొని రావడంలో నాకు కొంత ఆలస్యం జరిగింది, !!
నన్ను క్షమించి ,దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి !!
అని విచార వదనంతో అంటుంటే వారికి చాలా ఆనందం కలిగింది,,
చూశారా! రక్త సంబంధము బలం ఎలా ఉంటుందొ ,?? ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా, ఇతరులకూ ఆ అవకాశం ఉంటుందా??" అనుకుని సరే అన్నారు!

ఆ పిల్లవాడు చక్కగా వేద మంత్రాలు పఠిస్తూ,,
అంత్యేష్టి కార్యక్రమం  అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు,!!
చక్కని పాండిత్యం అందమైన,ఉచ్చారణ ,!
పనస లు చదువుతూ ఉంటే, పురోహితులు కూడా  ఆశ్చర్య పోతున్నారు.!
 ఏమా వర్చస్సు?! ఏమా శాస్త్ర పరిజ్ఞానం ,??
ఇంతవరకూ ఎవరూ, కనీ వినీ ఎరుగని శాస్త్ర విది ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షణ నమస్కారం చేస్తూ   దుఖిస్తూు ,చితికి నిప్పు అంటించాడు,!,

నాయనా ! ఇక నీవు వెనుదిరిగి చూడకుండా దూరం వెళ్లు అన్నారు ఊరి పెద్దవాళ్ళు,!
ఆ పిల్లవాడు అలాగే అన్నట్టుగా తల ఊపి, 
నేరుగా వెళ్తుండడం, ఒక దాదాపుగా  20 గజాల దూరం వెళ్ళాక, కనిపించకుండా అంతర్ధానం కావడం వారు  అందరూ కళ్ళారా చూశారు,,
తెలిసి పోయింది, ఆ వచ్చినవాడు ""కృష్ణయ్య ""
ఇన్నాళ్లూ విన్న భాగవత కథల పుణ్యమా అని,
శ్రీకృష్ణుని ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహా భాగ్యం లభించింది కదా అంటూ ..
ఆ బాలుడు నడచిన నేలపై గల ధూళిని ప్రసాదం గా , మహదైశ్వర్యముగా స్వీకరించారు వారంతా,!
ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమ పావనం గా పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు బృందావనవాసులు!,

శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై నెలవై ,
భక్తుల పాలిట కల్పతరువుగా అచట ఉంటున్నాడనుటకు నిదర్శనం ఈ వాస్తవ గాథ,,!!

మా అబ్బాయికి నిద్ర, అహారం, స్నానం ఏర్పాట్లు చేసి వస్తానని చెబుతూ  శ్రీకృష్ణ భగవానుని తన కుమారునిగా భావిస్తూ అదే ధ్యాసతో,అంతిమ శ్వాసను విడిచిన
ఆ మహానుభావునికి కృష్ణుడు, కొడుకు రూపంలో వచ్చి, స్వయంగా కన్న తండ్రి కి కొడుకు చేస్తున్నట్టుగా ,
శాస్త్ర రీతిలో  పద్ధతిగా  చేశాడు.
అలా పరందాముడే స్వయంగా, అంతిమ క్రియలు చేయడం  వాళ్ళు గమనించారు,,
భక్తుడు ,ఈ భవ బంధాలను కోరుకోకుండా ,
నేరుగా భగవంతునితో సంబంధబాంధవ్యాలు పెట్టుకొని , పంచుకుంటూ, పెంచుకుంటూ  ముక్తిని పొందాడు,,!

ఈ రోజుల్లో ,,కడుపున పుట్టిన కొడుకులు కూడా  దూరంగా ఉంటూ ,,తండ్రి ఆర్తితో పిలిచే పిలుపు కు అందక పోవచ్చు!!,
లేదా ఖాతరు చేయకుండా పోవచ్చు,,!!
కానీ పరమాత్ముడు మాత్రం తనను నమ్మిన భక్తుడిని ,
సదా సంరక్షిస్తూ, అతడి యోగక్షేమాలు స్వయంగా చూస్తుంటాడు!!
ఇలా భగవంతునికి భక్తునికి ఉండే సంబంధం మాటలకు, ఊహకు, చేతలకు , అందదు!!
భావాగ్రాహి జనార్దనా !" అంటే భక్తుని అంతరంగం లో కదిలే భావాలను జనార్ధనుడు సదా గ్రహిస్తూ, ఉంటాడు..!!
ఆ ప్రేమానుబంధం అనిర్వచనీయం,!, అద్భుతం కూడా, !!అలాంటి బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము ఆ బృందావనం,;!
ఆఅందాల ఆనందాల అనుబంధాల బృందావన వనసీమలో ఒక రేణువుగా మారితే ఎంత బాగా ఉండేది  !

నిత్యం అచట సంచరించే సాక్షాత్తూ రాధాకృష్ణుల మృదువైన పాదములు సుతి మెత్తగా  సోకుతూ ఉండగా,  కలిగే పరమానందాన్ని,,అఖండ ఐశ్వర్య విభూతి వైభవాన్ని  అందించమని నల్లనయ్య ను  కోరుకుందాం!!   

          ️స్వస్తి..
   :జై శ్రీ రాధే! జై జై శ్రీ రాధే!
  రాధాకృష్ణులకు జై! బృందావన విహారీ కి
జై హరే కృష్ణ హరే కృష్ణా!

 కృష్ణయ్య తండ్రి అందరిని చల్లగా చూడయ్యా ....🙇