19, ఆగస్టు 2020, బుధవారం

రాజయోగం అంటే ఏమిటో

*జైశ్రీమన్నారాయణ - జైశ్రీహనుమాన్*

సందేహం;- రాజయోగం అంటే ఏమిటో వివరిస్తారా?

సమాధానం;- పతంజలి చెప్పిన అష్టాంగయోగాన్నే రాజయోగం అంటారు.

ఈ యోగానికి ప్రధానంగా కావలసినవి అభ్యాసం, వైరాగ్యం. అభ్యాసం అంటే ప్రాక్టీస్. మాటిమాటికి ప్రాపంచిక విషయాలవైపు మళ్ళుతున్న మనస్సును వెనక్కు లాగుతూ ఉండాలి. సమాధిస్థితి చేరిన తర్వాత చిత్తం నిశ్చలం అవుతుంది.

వైరాగ్యం అంటే సుఖాలు, సంతోషం, కీర్తిప్రతిష్ఠలు. ఇవన్నీ నా అధీనంలోనివే కాని నేను వాటి అధీనం (కంట్రోల్) లో లేను అనే భావం, కేవలం నా స్వరూపం నాకు చాలు అనే తృప్తి. ఈ అభ్యాస, వైరాగ్యాలతో రాజయోగం ప్రారంభించాలి.

అష్ఠాంగయోగంలో మొదటి రెండు దశలు యమం, నియమం. యమం అంటే అహింస, సత్యం, దొంగతనం చేయకపోవడం, బ్రహ్మచర్యం, దానం పుచ్చుకోకపోవడం మొదలగు మంచి అలవాట్లు.

నియమం అంటే శుచి, శుభ్రత పాటించడం, ఉన్న దాంట్లో తృప్తిపడడం, శాస్త్రపద్ధతిలో శరీరాన్ని కృశింపచేసుకోవడం, ధార్మిక సాహిత్యం అధ్యయనం చెయ్యడం, మంత్ర జపం చెయ్యడం, అన్నీ భగవత్ పరంగా చెయ్యడం.

తర్వాత అంగాలు ఆసన, ప్రాణాయామాలు. ఈ రెండింటికీ ఇప్పుడు అత్యధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. తర్వాత దశ ప్రత్యాహారం. అంటే తాబేలులాగా, ఇంద్రియాలను లోపలికి ముడుచుకోవడం.

ప్రత్యాహారం తర్వాత ధారణ దశ. ఈ దశలో మనస్సును ఒకచోట నిలిపి, నిశ్చలం చేయడం జరగాలి. తర్వాతదే ధ్యానదశ. ఇక్కడ మనస్సును ఆత్మ మీద నిలపాలి. ఎనిమిదవదైన సమాధిదశలో, ప్రకృతి సంబంధం వదిలిపోయి మోక్షం లభిస్తుంది.

ఇదే అష్టాంగ రాజయోగం.

*శుభంభూయాత్

కామెంట్‌లు లేవు: