19, ఆగస్టు 2020, బుధవారం

8. అమృతత్వమునకు అర్హత

- వ్యధ చెందని మనసు కలవాడు అమృతత్వ స్థితిని పొందుటకు అర్హుడు - దానికై త్రిగుణములకు అతీతముగ నుండు స్థితిని అభ్యాసవశమున స్థిరపరచుకొన వలెను. 🌹*

యం హి న వ్యథంయన్త్యేతే పురుషం పురుషర్షభ |
సమదుóఖ సుఖం ధీరం సో-మృతత్వాయ కల్పతే || 15

వ్యధ చెందని మనసు కలవాడు అమృతత్వ స్థితిని పొందుటకు అర్హుడని గీత బోధించుచున్నది. త్రిగుణాత్మకమైన సృష్టియందు అవస్థితి చెందినటువిం మానవ ప్రజ్ఞకు వ్యధ సహజము. ప్రతి మానవుడు సహజముగ వజ్రచైతన్యవంతుడై ఉన్నప్పటికీ చైతన్యము త్రిగుణముల యందు బంధింపబడి నప్పుడు వ్యధ కవకాశమేర్పడును.

మరికొంత అవస్థితి చెంది ఇంద్రియముల యందు అనగా ఇంద్రియార్థముల ననుసరించు స్థితియందు బంధింపబడినపుడు అట్టి వ్యధ తీవ్రత చెందును.

సత్యవంతుడైన మానవ ప్రజ్ఞ మేల్కాంచగనే చైతన్యవంతునిగ ఏర్పడును. చైతన్యవంతమైన మానవప్రజ్ఞ త్రిగుణముల లోనికి, ఇంద్రియముల లోనికి ప్రవేశించుట తప్పనిసరి. అట్టి ప్రవేశమున
తన సహజ స్థితిని మరచినచో మాయ ఆవరణమున చిక్కును. అనగా ప్రజ్ఞ త్రిగుణాత్మక మగును.

త్రిగుణాత్మక మగు తన ప్రజ్ఞను త్రిగుణములకు అతీతముగ కూడ అభ్యాసవశమున స్థిరపరచుకొన వచ్చును. త్రిగుణములలోనికి మరియు ఇంద్రియముల లోనికి అవతరణము చెందుచున్న చైతన్యము తన సహజ స్థితిని కోల్పోనవసరము లేదు.

సూర్యుని కిరణము గ్రహగోళాదులను
చేరునపుడు సూర్యుని వదలి, గ్రహములను చేరుటలేదు కదా!
సూర్యకిరణము వ్యాపనము చెందుచున్నట్లుగ మనకు తెలియును.
కిరణము సూర్యుని యొద్దనూ ఉన్నది. మరియు ఏడు గోళముల వద్దకూ ఏక కాలమున చేరుచున్నది. అట్లే మానవచైతన్యము కూడ ఏకకాలమున సప్తకోశములనూ వ్యాపించి యుండ గలదు.

అట్టి వ్యాపనమును అభ్యాసము చేయు పురుషుడు శ్రేష్ఠుడు.
మోక్షమునకు అర్హత కలిగి యున్నవాడు.  మోక్షమునందు సహజముగ నున్నవాడు. పురుషుడు అను పదమును ఉపయోగించుటలో భగవానుని యొక్క రహస్య సూచన  కూడ ఒకటి ఇక్కడ గమనింపదగి యున్నది. ఏడంతస్తుల పురమున ప్రవేశించి, ఏడంతస్తులనూ వ్యాపించి యున్న ప్రజ్ఞవు నీవు సుమా! అని తెలుపుటకే ''పురుషమ్‌'', ''పురుషర్షభ'' అని పలికినాడు.

జీవిమున వ్యధ చెందువారు తమ్ము తాము మరచినవారనియు, సత్యాన్వేషణమున ఓర్పు వహించి తనను తాను గుర్తుకు తెచ్చుకొనుచు వ్యధ చెందక జీవించువారే అమృతత్త్వమునకు తగిన వారనియు గీతోపనిషత్తు బోధించుచున్నది.

కామెంట్‌లు లేవు: