30, మార్చి 2021, మంగళవారం

అహోబిలం

 జై శ్రీ లక్ష్మీ నరసింహ.. శుభ శుభోదయం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


హిరణ్య కసిపుడిని సంహరించడానికి నరసింహుడు ఉద్భవించిన ప్రదేశమే అహోబిలం. దీనిని అహోబలంఅని కూడా అంటారు


నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందనిచెబుతారు


ఈ క్షేత్రాన్నిభక్తులు ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అనే పేరుతో పిలుస్తారు.


గుహాంతర్భాగంలో

ఎగువ అహోబిలంలో నారసింహుడు గుహలో స్వయంభువుగా వెలిశాడు. ఇక్కడే స్వామి వారికి ప్రధానంగా పూజాధిక

కార్యాలు నిర్వహించబడుతాయి.


అహోబిలంలో నరసింహుడు తొమ్మిది విభిన్న రూపాల్లో మనకు దర్శనమిస్తాడు. అందువల్లే ఈ క్షేత్రాన్ని నవ నరసింహ క్షేత్రం అని కూడా అంటారు


ఆ తొమ్మది రూపాలు వరుసగా జ్వాలా నరసింహ, బిల నరసింహ, మాలోల నరసింహ,


క్రోద నరసింహ, కారంజ నరసింహ, బార్గవ నరసింహ, యోగ నరసింహ, ఛత్రవట నరసింహ, పావన నరసింహ


ఈ తొమ్మిది రూపాల్లో జ్వాల నరసింహ రూపం అతి ముఖ్యమైనది.

సేకరణ...

సౌభాగ్యం

 సౌభాగ్యం అన్న పదం వేద పరమైన పరిశీలన. సౌలు శక్తి అనగా ఔ జీవ పరంగా పూర్ణ లక్షణము నకు మూల ప్రకృతి. యిది బాలమంత్రంలో గల సౌ అనే అక్షరమునకు ఓం సౌః. దీని మూర్తి మంతమే దుర్గా స్వరూపం. కాత్యాయనాయ... గాయత్రి అయినది. బీజాక్షర పూర్వక గాయత్రిని సాధనలో కనబడుచున్నది. దురిత ఆత్మ నివారిణి దుర్గగా మనకు తెలియుచున్నది. విజయ దుర్గా స్వరూపమే మెూక్షమని. సౌ అనగా సమస్త కళలతో ప్రకృతి సోభిల్లే లక్షణము. యత్ పూర్ణ రూపేణ శక్తిః తత్ భాసయతి ప్రకాశవాశాత్ వస్తు తత్వః సౌభాగ్యం నామ వివరణ. ప్రకృతి రూప స్త్రీ అమ్మ యని అదే సౌభాగ్య తత్వమని తెలియుచున్నది. సౌ అనగా నూరు యని వక వివరణ. శతంఅనగా పూర్ణమని  పూర్ణ కళలు యని యిది శక్తి గణనకు వక సూత్రము కూడా.

ప్రేమ మార్గాన్ని వ్యాప్తి చేసే సూత్రం

 .....


శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ రుద్రుడిని, ఇంద్రుడిని, సనక సనందనాదులను, దేవర్షులను, ప్రజాపతులను, సిద్ధ, గంధర్వ, కిన్నర, కింపురుష, విద్యాధరులను, చతుర్వర్ణాల మనుషులను, జంతువులను, చెట్లను ఇతర స్థావరాలను. సృష్టించాడు. విత్తనాలనుంచి చెట్లు పుడతాయి. వీటిని ఉద్బీజాలు అంటారు. చెమటనుంచి పుట్టిన సూక్ష్మ క్రిములు స్వేదజాలు. ఇవి గాక- అండజాలు, పిండజాలు లక్షల రకాలు. సృష్టిలో కనిపిస్తాయి.


భారతదేశంలో పుట్టిన ప్రతి ఆధ్యాత్మిక మార్గమూ ‘అహింసే పరమ ధర్మం’ అని చెబుతుంది. భగవంతుడి ప్రేమ మార్గాన్ని వ్యాప్తి చేసే సూత్రం ఇది. శంకరాచార్యుల అద్వైతం, బుద్ధుడి కరుణా దృష్టి.. ఈ మార్గంలోనే పయనిస్తున్నాయి. ప్రకృతి ప్రియులకు సృష్టిలోని ప్రతి చెట్టు, పుట్ట, పిట్టా సౌందర్య నిలయాలే.. ఏ ప్రాణీ తనను తాను అసహ్యించుకోదు.. ఒక్క మనిషితప్ప.. నల్లగా ఉన్నామనో, పొట్టిగా ఉన్నామనో వేదన చెందేవారు ఎందరో ఉన్నారు. భగవానుడే నల్లటివాడిగా, పొట్టివాడిగా అవతారాలెత్తాడు. ఆయన చేసిన పనుల వలన లోకాలు సుఖించాయి. అందువల్ల నల్లనయ్యను భక్తితో పూజిస్తాం. ఆయన బోధించిన భగవద్గీత మనకు మోక్షమార్గం. చరిత్రలో ఎందరో అందవిహీనంగా ఉండే మహాత్ములు కనిపిస్తారు. కానీ వారి ఔన్నత్యం భౌతికసౌందర్యాన్ని మించి పోయి ఉంటుంది. వారి రూపురేఖలు మన హృదయంపై చెరగని ముద్ర వేస్తాయి. ఇక వారి అందాన్ని గురించి పట్టించుకోం. ఎవరైనా ఆ మహాత్ముల చక్కదనాన్ని గురించి తక్కువచేసి వ్యాఖ్యానిస్తే సహించం.


సామాన్యంగా కథారచయితలు, కవులు కల్పనను ఇష్టపడతారు. అందువల్లనే వారి రచనల్లో సత్యం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయినా వారిని అసత్యవాదులు అనలేం. మనకు అర్థంకాని జీవిత సత్యాలనెన్నింటినో రచయితలు సులభంగానూ రసరమ్యంగానూ తెలియజేస్తారు. పురాణ ఇతిహాసాల్లోనూ ఇదే రీతి. కల్పనల సహాయంతో క్లిష్ట సమస్యలకు సులభ పరిష్కారాలను సూచించారు మన రుషులు. వారిది పవిత్ర దృష్టి. వాళ్ల సృష్టి కూడా పవిత్రమైనదే. వారి కల్పనలు లోకానికి శుభం చేకూరుస్తాయి. లోకశ్రేయస్సు కోసం చేసే కర్మలు, చెప్పే మాటలు, రాసే రాతలు... అన్నీ సత్యంగానే భావించాలి. మానసిక వైద్యులు రోగికి ఉపశమనం కలిగించడానికి చెప్పే మాటలను సత్యాలుగా భావిస్తేనే మేలు కలుగుతుంది. విద్యార్థులతో ఉపాధ్యాయులు చెప్పే విషయాలను గ్రహించాలంటే వాళ్లకు శ్రద్ధాభక్తులు అవసరం. గురువును దైవం అనే దృష్టితో చూస్తేనే అది సాధ్యం...


|| ఓం నమః శివాయ ||


Spiritual Seekers 🙏

https://t.me/Spiritual_Seekers

మొగలిచెర్ల

 *వర్షం లో మ్రొక్కుబడి..*


"అసలే వర్షం పడుతోంది..ఈ మంటపం లో పడుకునే వీలు లేకుండా ఉంది..నా మాట విను..ఈ రాత్రికి మనం కందుకూరు వెళ్ళిపోయి అక్కడ ఒక రూము తీసుకొని పడుకుందాము..రేప్పొద్దున లేచి..తయారయ్యి ఇక్కడకు వచ్చి స్వామివారి సమాధి దర్శించుకొని వెళదాము..అంతేగానీ..ఇక్కడే వుందాము..ఇక్కడే పడుకుందాము అని మొండిగా వాదించవద్దు..నా మాట విను.." అని ఆ భర్త తన భార్యతో చెపుతున్నాడు..ఆమె మాత్రం "ఎక్కడికీ వెళ్లొద్దు..ఇక్కడే వుందాము..ఈ ఒక్కరాత్రికి సర్దుకుందాము..నేను స్వామివారి మందిరం లో నిద్ర చేస్తానని మొక్కుకున్నాను..మొక్కుబడి చెల్లించుకోవాలి.." అని చెపుతున్నది.."సరే నీ ఇష్టం..ఈ మంటపం లోనే ఒక మూల ఏర్పాటు చేసుకుందాము.." అని అత్యంత అసహనంగా చెప్పాడు..


ఆరోజు వర్షం కారణంగా మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర ప్రాంగణం అంతా తడి గా ఉన్నది..ఆ సమయం లో ఆ భార్యా భర్త స్వామివారి మందిరానికి వచ్చారు..ఉదయం హైదరాబాద్ లో బయలుదేరి సాయంత్రానికి స్వామివారి మందిరానికి చేరారు..వాళ్ళు స్వామివారి మందిరానికి రావడం కూడా అదే మొదటిసారి..మందిరం లోకి రాగానే..ముందుగా స్వామివారి సమాధిని దర్శించుకొన్నారు..ఆ తరువాత..ఆ దంపతుల మధ్య ఈ సంభాషణ జరిగింది.."ఏమండీ ఇక్కడ మేము ఉండటానికి ఏదైనా ఒక రూము ఉన్నదా?.." అని ఆ భర్త నన్ను అడిగాడు.."ఉన్నది..మీరు కంగారు పడొద్దు..రాత్రికి ఆ రూము మీకు కేటాయిస్తాము..ఆవిడ తన మొక్కుబడి కోసం మంటపం లోనే పడుకోమని చెప్పండి..మీరు రూములో ఉండొచ్చు.." అన్నాను.."ఆ ఏర్పాటు చేయండి..మీకు కృతజ్ఞతలు.." అన్నాడు.."మీరెవరు?..ఈ స్వామివారికి మొక్కుబడి అన్నారు కదా?..ఎందుగురించి మొక్కుకున్నారు..? మీకు అభ్యంతరం లేకపోతే వివరిస్తారా?.." అని అడిగాను..


"మాది కృష్ణాజిల్లా అండీ..ప్రస్తుతం హైదరాబాద్ లో వుంటున్నాము..మాకొక ఫార్మా కంపెనీ ఉన్నదండీ..బాగానే ఉన్నాము..మాకు ఇద్దరు పిల్లలు..చదువుకుంటున్నారు..పోయిన సంవత్సరం ఈవిడకు కడుపులో నొప్పి వచ్చింది..డాక్టర్ కు చూపించాము..పరీక్షలు చేసి..లోపల ఇన్ఫెక్షన్ వచ్చింది..ఆపరేషన్ చేయాలని చెప్పారు..రెండు మూడు హాస్పిటల్స్ లో చూపించినా..దాదాపుగా అందరూ ఇదే మాట చెప్పారు..ఈవిడకు ఆపరేషన్ అంటే భయం పట్టుకుంది..నేను ఎంత నచ్చచెప్పినా వినలేదు..ఆ సమయం లో ఈవిడ స్నేహితురాలు ఈ క్షేత్రం గురించి చెప్పి..ఒకసారి ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా మొక్కుకో..నీకు ధైర్యం వస్తుంది..వ్యాధి కూడా తగ్గిపోవొచ్చు.." అని చెప్పింది..స్వామివారి చరిత్ర పుస్తకాన్ని కూడా ఇచ్చింది..ఆవిడ ఏ ముహూర్తం లో స్వామివారి గురించి ఈవిడతో చెప్పిందో తెలీదు కానీ..ఆరోజే ఆ పుస్తకాన్ని పారాయణం చేయడం మొదలుపెట్టిందండీ..మూడు రోజుల్లో పూర్తి చేసింది..ఆ తరువాత మీకు ఫోన్ చేసి మా అడ్రెస్ ఇచ్చాము..మీరు స్వామివారి విభూతి గంధం పోస్టు లో పంపించారు..ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి..స్వామివారి కి నమస్కారం చేసుకొని..ఆ విభూతి గంధం నుదుటిన పెట్టుకోవడం చేసింది..పదిరోజులు చేసిందండీ..చిత్రంగా తన కడుపులో నొప్పి తగ్గినట్టు అనిపించింది..మళ్లీ డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకున్నాము..డాక్టరు గారు ఇన్ఫెక్షన్ అంతగా లేదు..మందులు వాడి చూద్దాము..అన్నారు..నెల రోజుల తరువాత ఈవిడకు పూర్తి స్వస్థత చేకూరింది..తన ఆరోగ్యం బాగు పడితే..ఈ క్షేత్రానికి వచ్చి నిద్ర చేస్తానని మొక్కుకుంది..అందుకోసం వచ్చామండీ.." అన్నాడు..భర్త తన గురించి చెపుతున్నంత సేపూ ఆవిడ స్వామివారి పటానికి నమస్కారం చేసుకుంటూ ఉన్నది..


ఆరోజు రాత్రి ఆ భార్యాభర్తలు మందిరం లోనే నిద్ర చేశారు..తెల్లవారి స్నానాదికాలు ముగించుకొని..స్వామివారి సమాధి ని దర్శించుకొని..ఇవతలికి వచ్చి.."ప్రసాద్ గారూ..రాత్రి వర్షం వచ్చిన కారణంగా మంటపం లోకి వర్షపు నీరు వచ్చి..అంతా నీళ్ల మయం అయింది..మా మొక్కుబడికి ఏమీ ఇబ్బంది కలుగలేదు..కానీ..ఈ మంటపానికి పడమర వైపు రేకులతో షెడ్ వేయగలిగితే..మావంటి ఇతర భక్తులకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది..మా వంతుగా ఆ పని చేస్తాము.." అన్నారు.."మంచి ఆలోచన..అలానే చేద్దాము.." అన్నాను..


ఆ దంపతుల ఆరోగ్య సమస్యనూ..వాళ్ళద్వారా భక్తుల ఇబ్బందినీ..రెండింటినీ స్వామివారు సమాధిలో కూర్చునే తీర్చారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ప్రతి పేరెంట్‌ గుర్తించాలి.

 “స్లేట్‌ ది స్కూల్స్‌”కి ఛైర్మన్‌గా ఉన్న విద్యావేత్త వాసిరెడ్డి అమర్‌నాథ్‌ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తలిదండ్రుల్లో చర్చనీయాంశంగా మారాయి.మీడియా ఇలాంటి వాటిని విడిచి అక్కర్లేని విషయాలను రుద్దుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సంఘటనలను ప్రమాద ఘంటికలుగా ప్రతి పేరెంట్‌ గుర్తించాలి. కాలనీ, అపార్ట్‌మెంట్, టీచర్స్ అసోషియేషన్లలో కూడా తమ పిల్లలు ఇలా అవకుండా తామేం చేయగలమో మాట్లాడుకోవాలి. ఇంతకీ అమర్‌నాథ్‌ గారు ఆందోళన వ్యక్తం చేసిన సీరియస్‌ పరిణామాలు ఇవే.


వాసిరెడ్డి అమర్‌నాథ్‌ గారి పోస్టు యథాతథంగా:


ఒక్కసారి ఆలోచించండి !

రెండు నెలల క్రితం ఢిల్లీ లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 2వ తరగతి పిల్లాడిని అదే స్కూల్ కు చెందిన 11 తరగతి అబ్బాయి స్కూల్ టాయిలెట్‌లో చంపేశాడు. కారణం? స్కూల్లో ఎవరైనా చస్తే పరీక్షలు పోస్ట్‌ పోన్ అవుతాయి అని.


ఏమండీ 16 ఏళ్ళ పిల్లాడికి 7 ఏళ్ళ పిల్లాడిని చంపాలని ఆలోచన రావడమేంటి ?

అందులో ఏదో ఆవేశంతో తోస్తే కింద పడి చనిపోయిన బాపతు కాదు కదా?

మీరు భయ పడకండి. ఎగ్జామ్స్ పోస్ట్‌ పోన్‌ అవుతాయి.


నేనే ఏదోకటి చేస్తాను అని ఆ బాల రాక్షసుడు రెండు రోజల ముందు నుంచి క్లాస్ మేట్స్ కు చెప్పాడు .

స్కూల్ కు కత్తి తెచ్చి ప్లాన్ చేసి చంపేశాడు. టెర్రరిస్ట్‌లు కూడా ఇంత చిన్న కారణానికి అందునా పసి పిల్లని చంపడానికి వెనకాడుతారు.


కానీ ఒక స్కూల్ పిల్లాడు ఇలా చేసాడు అంటే కారణం ఏంటి అని ఎవరు పెద్దగా ఆలోచించలేదు. ఒకే ఒక్క రోజు అది బ్రేకింగ్ వార్త అయ్యింది.


అమ్మా! ఢిల్లీలో పిల్లలు ఇలా వుంటారా అని అని కాసేపు క్రైమ్ సీరియల్ చూసినట్టు అందరూ ఒక్క నిట్టూర్పు విడిచి అక్కడితో వదిలేసారు.


సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు లక్నోలోని బ్రైట్ ల్యాండ్ స్కూల్‌లో జరిగింది. ఇక్కడ ఒకటో క్లాస్ అబ్బాయి ని అదే స్కూల్ కు చెందిన ఆరవ క్లాస్ అమ్మాయి పొడిచింది.

అవునండీ..ఆరవ క్లాస్, పొడిచింది కూడా అమ్మాయే. మీరు సరిగ్గానే చదివారు. ఇదేదో ఎక్కడో జరిగిన ఒకటి అరా సంఘటనలు కావు.


ఇందాకే ఒక టీవీ డిస్కషన్ బ్రేక్ లో ఒక వ్యక్తి చెప్పారు.

రంగారెడ్డి జిల్లా లో ఒక ప్రభుత్వ స్కూల్ కు చెందిన ఆరవ తరగతి అబ్బాయి తన స్కూల్ మేట్స్ ను మోసం చేసి రూ.35 వేలు పోగేశాడట. అమ్మ నాన్నకు తెలియకుండా మిమ్మల్ని టూర్ కు తీస్కొని వెళతాను అని చెప్పాడట.


చివరకు బ్లాక్ మెయిలింగ్ కు దిగాడట!  పిల్లలలో ఇంత క్రిమినల్ మనస్తత్వం ఎందుకు పెరుగుతోంది.


గత కొన్ని నెలలుగా నెత్తి నోరు బాదుకుని చెబుతూనే ఉన్నా…అయ్యా పిల్లల చేతిలోకి స్మార్ట్ ఫోన్ ఇచ్చేసారు.

వారు అందులో అతి భయానక దృశ్యాలు ఉన్నా వీడియో గేమ్స్ ఆడుతున్నారు. గత కాలం పిల్లలు కబాడీ, ఖోఖో లాంటి గేమ్స్ ఆడితే ఇప్పటి పిల్లలు చంపడం ఒక ఆటగా తయారు అయ్యింది.


అమ్మలకేమో టీవీలో సీరియళ్ళు పిచ్చి.


నాన్నలకు చెత్త రాజకీయాల పిచ్చి.


టీవీలకు సంచలన వార్తలు కావాలి.


పిల్లలు మాత్రం ఎవరికీ అక్కర్లేదా?


బాలల లోకాన్ని ఎప్పుడో కల్మషం చేసేసారు.


ఇప్పుడు ఇప్పుడు వారిని మనం టెర్రరిస్ట్‌లుగా తయారు చేస్తున్నాం.


ఇంటి ఇంటిలో ఒక టెర్రరిస్ట్ తయారు అవుతున్నాడు.


మీడియా పట్టించుకోదు.


ప్రభుత్వాలు ఏమీ చెయ్యవు.


మీ పిల్లల్ని మీరే రక్షించుకోవాలి.


నీలి చిత్రాలు, హింసాత్మక వీడియో గేమ్స్, మద్యపానం, ధూమపానం, ఇవన్నీ ఆధునిక రోగాలు.


వీటిని ఒకరి నుంచి మరొకరికి వ్యాపింప చేసే దోమ స్మార్ట్ ఫోన్.


స్మార్ట్ ఫోన్‌ను మీ పిల్లలకు దూరంగా ఉంచండి.


ఇంట్లో కంప్యూటర్ ఏర్పాటు చేయించండి.


దానిపై చైల్డ్ లాక్ లాంటి ఫీచర్స్ ఇన్‌స్టాల్‌ చెయ్యండి.


పిల్లని ఒక కంట కనిపెట్టండి.


పిల్లలతో సమయం గడపండి.


వారితో మాట్లాడండి.


వారు చెప్పేది వినండి.


కేవలం ధనాపేక్షే ద్యేయంగా కాక పిల్లలకు మోరల్ వాల్యూస్ నేర్పే స్కూల్స్‌లో వారిని చేర్పించండి.


మన పిల్లని రక్షించుకొందాం. లేక పొతే మనం సర్వనాశనం అయిపోతాం.

నా బాధను నలుగురితో పంచుకోండి.


ఈ విషయాన్నీ తల్లి తండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి

మీ పిల్లల భవిషత్ కు బంగారు బాటలు వేయండి


ఎక్కడకు వెళ్తున్నారు ఆంటీ..?


మా బాబును చూడటానికి Hostel వెళ్తున్న.


బాబు ఏం చదువుతున్నాడు.?

1 వ తరగతి


మీ వారు ఏం చేస్తుంటారు.?

Contractor (Govt) job చేస్తున్నారు.


మరి మీరేం job చేస్తున్నారు..?

Job ఏం లేదు. ఇంటి దగ్గరే ఉంటాను.


మరీ పిల్లాడిని hostel ల్లో…?

అంటే ఈ మధ్య కొంచెం అల్లరి ఎక్కువైందిలే.


ఓహో…

ఆరేళ్ళ పిల్లాడు కాకుండా ముప్పై ఏళ్ల నీ మొగుడు చేస్తాడా అల్లరి (మనసులో) మీకు తెలియని విషయం ఏంటంటే..


పిల్లాడు hostelల్లో ఉన్నంత కాలం


వాడికి

అమ్మంటే ఓ ఆయా..

నాన్నంటే డబ్బులిచ్చే Atm.. అంతే


అలా పెంచిన మీరు

రేపొద్దున్న వాడికి ముపై

మీకో అరవై ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది.

అప్పుడు

మా కొడుకు మమ్మల్ని

old age home లో పడేశాడు అని ఏడవడానికి సిగ్గుపడాలి.


పిల్లాడికి 5 ఏట వచ్చేదాక నెత్తిన పెట్టుకొని పెంచండి

15వ ఏట వచ్చేదాక క్రమశిక్షణతో పెంచండి

25వ ఏట వచ్చేదాక మంచి స్నేహితుడిలా పెంచండి


మీ పెంపకం నుండే వాడికి సంస్కారం అలవాటు అవుతుంది అని గుర్తించండి.

అమ్మమ్మలు ,నాయినమ్మలతో కొన్నాళ్ళు గడిపే అవకాశం వారికివ్వండి.బంధువులు బాంధవ్యాల గొప్పతనం తెలిసోకోనివ్వండి. ముఖ్యంగా ఆడవాళ్లు అత్తమామలను ఇంటికి రానియ్యటంలేదు. రేపు మీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటే…? చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. మీరు మారండి పిల్లలకు మారే అవకాశం ఇవ్వండి.

అసలేం జరుగుతుంది మన దేశంలో..?


 విద్యాసంస్ధలేమో లాబాల కోసం

ఉపాధ్యాయులేమో జీతాల కోసం

తల్లిదండ్రులేమో ఎంత ఖర్చైనా పర్లేదు

తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలి

పిల్లలకేమో బట్టి కొట్టైన కాపి పెట్టైనా

ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని.


బయట ఎండ నాన్నా అని చెప్పి వాడి చేతిలో Mobile పెడతారు ఇక వాడి ఆటలన్ని అందులోనే..

అది కాస్తా తలుపులు వేసుకొని

బూతు బొమ్మలు చూసేదాకా వెళ్తాయి.


మీ అందరి స్వార్ధంతో అజ్ఞానంతో పిల్లల ఇష్టాలను, ఎదుగుదలను బాల్యంలోనే సమాధిచేస్తున్నారు.


గుర్తుంచుకోండి..


”మీరు పెంచేది మీ పిల్లల్ని కాదు...సమాజాన్ని తీర్చిదిద్దే రేపటి తరాన్ని...అది మర్చి పోవద్దు…

వారే రాబోయే రోజుల్లో ఈ జాతి నిర్మాణ రథ సారథులు...ఇప్పుడు వారుంటున్న వసతి గృహాలు రేపు మీ వృద్ధాశ్రమాలు..

మొగలిచెర్ల

 *సిద్దాంతి గారి సలహా..*


"నమస్కారమండీ..నా పేరు మంగళగౌరీ..మేము రాబోయే శని ఆదివారాల్లో మొగిలిచెర్ల వచ్చి..అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకోవాలని అనుకుంటున్నాము..శనివారం ఉదయానికి అక్కడికి వస్తామండీ..మంగళవారం ఉదయం తిరిగి వెళ్లిపోతాము..ఆ క్షేత్రం లో మొత్తం మూడు రోజులు నిద్ర చేయాలని అనుకున్నాము..మాతోపాటు ఇద్దరు పెద్దవాళ్ళు వస్తున్నారు..వాళ్ళకొఱకు ఏదైనా బస ఏర్పాటు చేయగలరా?..నేనూ మావారూ మా పిల్లలిద్దరూ అందరమూ స్వామివారి సన్నిధిలో పడుకుంటాము.." అని ఆవిడ నన్ను అడిగారు..మా సిబ్బందిని విచారిస్తే..ఒక గది ఖాళీ ఉందని చెప్పారు..ఆ మాటే ఆవిడతో చెప్పి..గదిని వారి కొఱకు అట్టి పెట్టాము..


ఆ ప్రక్క శనివారం ఉదయం తొమ్మిది గంటల వేళ..ఒక కారు లో మంగళగౌరి గారి తన సంసారం తో సహా మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..తనను తాను పరిచయం చేసుకొని..తమ కొఱకు కేటాయించిన గది వద్దకు వెళ్లిపోయారు..మరో గంట తరువాత..మంగళగౌరి గారు తన భర్త, పిల్లలు తో కలిసి మందిరం లోపల నేను కూర్చున్న చోటుకి వచ్చి.."ప్రసాద్ గారూ..స్వామివారి పల్లకీసేవ సాయంత్రం అని చెప్పారు..ఈలోపల మేము మాలకొండకు వెళ్లి..శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని వస్తాము..మధ్యాహ్నం మీతో మాట్లాడాలి..మీకు వీలవుతుందా?.." అని అడిగారు.."మీరు ముందు మాలకొండకు వెళ్ళిరండి..ఇక్కడికి వచ్చిన భక్తుల తో మాట్లాడటానికి కూడా తీరిక లేనంతగా నేను లేను..నేను ఇక్కడ ఉన్నదే మీలాంటి వారి సందేహాలు తీర్చడానికి.." అన్నాను..మంగళగౌరి గారు మాలకొండకు వెళ్లి, మధ్యాహ్నం మూడు, నాలుగు గంటలకు తిరిగి వచ్చారు..


ఆరోజు సాయంత్రం జరిగే పల్లకీసేవ కు తమ పేర్లు నమోదు చేయించుకొని..తన భర్త, పిల్లలతో కలిసి నావద్దకు వచ్చారు.."ప్రసాద్ గారూ..ఒక సమస్యతో ఇక్కడికి వచ్చామండీ..మా వారు పెద్ద కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నారండీ..ఉద్యోగరీత్యా తరచూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి..నెలలో కనీసం ఇరవై రోజులు అలా తిరుగుతూనే వుంటారు..ఇంటిని, పిల్లలనూ నేనే చూసుకోవాలి..పిల్లలిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు..ఇప్పుడు సమస్య ఏమిటంటే..మా అబ్బాయి తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు..నెలలో పది పదిహేను రోజులు నీరసంగా ఉంటున్నాడు..డాక్టర్ల కు చూపించాము..ఏవేవో పరీక్షలు చేశారు..లోపల జబ్బేమీ లేదు..బలానికి మందులు వాడండి..అని చెప్పారు..వీడేమో మనిషి తగ్గిపోతున్నాడు..నాకు బెంగ పట్టుకున్నది..మా వారితో చర్చించాను..మా సిద్దాంతి గారిని సలహా ఆడిగాము..ఆయన వీడి జాతక చక్రం చూసి..గ్రహదోషం ఉన్నది..నివారణ కొఱకు ఇక్కడికి వెళ్ళమని చెప్పారు..ఆయనే మమ్మల్ని ఈ క్షేత్రం లో  మూడు రాత్రులు నిద్రలు చేయమని చెప్పారు..వారు మాతో చెప్పేదాకా ఇక్కడ ఇలాంటి అవధూత మందిరం వున్నదని మాకు తెలీదు..ఆ తరువాత మీతో ఫోన్ లో మాట్లాడాము.." అన్నారు.."సరేనమ్మా..మీ సిద్దాంతి గారు చెప్పిన విధంగా నే ఇక్కడ వుండండి.." అన్నాను..


ఆరోజు పల్లకీసేవ లో ఆ కుటుంబం పాల్గొన్నారు..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం స్వామివారి సమాధి దర్శించుకున్నారు..శనివారం రాత్రి, ఆదివారం రాత్రి కూడా ఆ దంపతులు తమ పిల్లలతో సహా స్వామివారి మంటపం లోనే నిద్ర చేశారు..సోమవారం ఉదయం స్వామివారికి ప్రభాత సేవ అనంతరం అర్చకస్వాములు భక్తులకు తీర్ధం ఇవ్వసాగారు..ఈ కుటుంబం కూడా స్వామివారి తీర్ధాన్ని స్వీకరించారు..ఆ తరువాత పది పదిహేను నిమిషాల కు ఆ పిల్లవాడు స్వామివారి మంటపం లోనే ఒక ప్రక్కగా పడుకున్నాడు..కొద్దిసేపటి తరువాత..ఉన్నట్టుండిఆ అబ్బాయి మెలికలు తిరిగిపోతూ..ఆ మంటపం అంతా పొర్లాసాగాడు..ఇదంతా చూస్తున్న మంగళ గౌరి గారు బాగా భయపడి పోయారు..ఆ అబ్బాయి తండ్రి మాత్రం ..పిల్లవాడిని పట్టుకొని వున్నారు..దాదాపుగా రెండు గంటల సేపు అలా జరిగిన తరువాత..ఆ పిల్లవాడు సొమ్మసిల్లి పడుకొని నిద్ర పోయాడు..


"అమ్మా ఇక మీరు భయపడకండి..అబ్బాయి తెప్పరిల్లుతాడు..కోలుకుంటాడు.."అని మా అర్చకస్వామి ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి..స్వామివారి తీర్ధాన్ని అబ్బాయి నోట్లో పోశారు..మరో అరగంట తరువాత..ఆ అబ్బాయి కళ్ళు తెరచి చూసాడు..ఆరోజు మధ్యాహ్నం నాటికి ఆ పిల్లవాడి ముఖం లో నైరాశ్యం పోయింది..ఉషారుగా వున్నాడు..మంగళగౌరి గారి భర్తగారు తమ సిద్దాంతి గారితో ఫోన్ లో ఇక్కడ జరిగిన విషయాన్ని పూర్తిగా చెప్పారు..మరో రెండు రోజుల పాటు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడి సన్నిధిలోనే వుండమని ఆయన సలహా ఇచ్చారు..బుధవారం వరకూ మంగళగౌరి గారి కుటుంబం స్వామివారి మందిరం వద్దే వున్నారు..రోజూ రెండుపూటలా స్వామివారి సమాధి దర్శించుకున్నారు..గురువారం ఉదయం స్వామివారి సమాధి దర్శించుకొని తిరిగి వాళ్ళ ఊరు వెళ్లారు..


మరో నెలరోజుల తరువాత మంగళగౌరి గారు నాకు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..మా వాడు పూర్తిగా కోలుకున్నాదండీ..కాలేజీకి వెళుతున్నాడు..చక్కగా చదువుకుంటూ వున్నాడు..త్వరలో మళ్లీ వచ్చి స్వామివారి సమాధి దర్శించుకొని వెళతాము..మా సిద్దాంతి గారు కూడా మాతో వస్తామంటున్నారు..వారినీ తీసుకొని వస్తాము.." అన్నారు..


గత నెలలో మంగళగౌరి గారి కుమారుడు ఒక్కడే మొగిలిచెర్ల కు శ్రీ స్వామివారి దర్శనం కోసం వచ్చాడు.."నాకు జీవితాన్ని ఈ స్వామివారే ప్రసాదించారు అంకుల్..ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటూ..నా కాళ్ళమీద నేను నిలబడటానికి ఈ స్వామివారే కారణం..వీలున్నప్పుడల్లా ఇక్కడకు వచ్చి ఒకరోజు నిద్ర చేసి వెళుతుంటాను..మా సిద్దాంతి గారి సలహా..స్వామివారి తీర్ధం..ఈరెండూ నేను మర్చిపోలేను.." అని భక్తి గా చెప్పాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ముక్కు తిమ్మనగారి

 ముక్కు తిమ్మనగారి ముద్దు పలుకులు !



.

రాయలనాట విజయ నగరంలో పెద్దన తరువాత స్థానం తిమ్మనదే! ఆయన అరణపుకవి. చిన్నాదేవివెంట విజయనగరానికి వచ్చాడట. తెనాలి వారు భువన విజయంలో వారిని పరిచయం చేసికొన్న సందర్భంలో చెప్పిన పద్యం తిమ్మన గారి ప్రసిధ్ధికి నిదర్శనం!

.

కం: మాకొలది జానపదులకు

నీకవితా ఠీవి యబ్బునే? కూపనట ద్భే

కములకు నాకధునీ

శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా!

.

తిమ్మనగారి కవిత్వం చల్లని కవిత్వమట!యెంతచల్లనిది? ఆకాశగంగాప్రవాహమందలి నీటితుంపురలను బోలిన చల్లదనమది. సురగంగ చల్లదనం కిందికురికి తిమ్మనగారి కవితలో ప్రవేసించినదట! ఆహా! పొగడ్తకు ఆకాశమే హద్దుగదా!

తిమ్మనగారు పారిజాతాపహరణ మనే ప్రబంధం వ్రాశారు. రాయలవారికి- చిన్నాదేవికి నడుమ నేర్పడిన వియోగమును తప్పించుటకే ఈప్ర్బంధమును తిమ్మన రచించెనని ప్రవాదము. యేదియేమైనను యిది రసవత్తరమైన ప్రబంధమే!

.

శ్రీకృష్ణుని యంతవాని శిరమును సత్యచే తన్నించి , ప్రణంలో యిది తప్పుకాదు పొమ్మన్నాడు.తిమ్మన.

పారిజాతపుష్పాన్ని రుక్మిణి కిచ్చినది విని యలిగిన సత్యాదేవి మానసిక, శారీరక ,పరిస్థితులను వర్ణించుచు తిమ్మన గారు ఒకపద్యం చెప్పారు. కవితా కళకు కాణాచియైన ఆపద్యం మన మిప్పుడు తెలిసికొందాం!

.

చ: తుడువదు కన్నులన్వెడలు తోయకణంబులు, కొప్పుఁజక్కగా

ముడువదు, నెచ్చెలింగదిసి ముచ్చటకుంజన, దన్నమేనియున్

గుడువదు , నీరముంగొనదు, కూరిమిఁ గీరముఁ జేరి పద్యమున్

నుడువదు, వల్లకీగుణవినోదము సేయదు, డాయదన్యులన్;

.

సవతిమీద మత్సరం కోపానికి కారణమైనది. మనస్సు ఉద్వేలమైపోయింది. దుఃఖం పొంగిపొరలుతోంది. కన్నులవెంటనీరు కారిపోతోంది. అయినా కన్నీరు తుడవటంలేదట. జుట్టుముడి ఊడింది. కేశపాశము విశీర్ణమైనది. దానిని కూడా సవరించటం లేదట. ప్రియ సఖులఁజేరి మాటా మంతీ యాడటంలేదట. భోజనంమాటసరేసరి, మెతుకుగూడా ముట్టుటలేదట. చివరకు నీరుగూడా త్రాగటంలేదట. పంజరంలో చిలుకలను గూడా పలకరించటం లేదట. వీణియ తీగెలను మీటుట లేదట. యితరులెవ్వరు వచ్చినా వారిని సమీపించటం లేదట.


ఇదీ పాపం సత్య మానసిక స్థితి.

మనస్సు బాగోక పోతే రోజూ చేసేపనులుగూడా చెయ్యం . నైరాస్యంగా ఉంటాంకదా! అదిగో ఆనైరాస్యం ఆమెచేతలలో కనిపించేలా చేశాడుకవిగారు. నైరాస్యం యెందుకంటారా? కాదామరి. అసలే కృష్ణుని కాపురం "సవతుల కుంపటి". యెప్పుడెవరివల్ల యేబాధకల్గుతుందో? చెప్పరానిది. యెవరాతనిని తమ చెంగుకు ముడివేసుకుంటారో యెరుగలేము. అనుకోని యాపద వచ్చిపడింది. నారదుడు తెచ్చిన పారిజాతపుష్పం రుక్మిణి తలకెక్కింది. యెంతప్రమాదం! కృష్ణుడింక తన చేజారిపోతాడేమో నని బాధ.అలాగే జరిగితే యిక మిగిలే దేమిటి? నలుగురి నవ్వులు తలవంపులు. అయిపోయింది సత్యావైభవం: అందుకే యీనైరాస్యం. ఆస్థితిని తిమ్మన యీపద్యంలో అద్భుతంగా చిత్రించాడు.

తుడువదు, ముడువదు, కుడువదు, నుడువదు, అను నాల్గు క్రియాపదాలను, ఛేకానుప్రాసంగా ప్రయోగించి , తనయసమానమైన పాత్ర చిత్రణా పటిమను వ్యక్త పరచాడు. కావ్యకళాపరిశీలనా దృష్టితో పరిశీలిస్తే యీపద్యం యెంత అద్భుత మైనదో బోధపడుతుంది. ఇది మనః పరిశీలనకు చక్కనిపరీక్ష!


స్వస్తి!